Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-86

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బస్ ప్రయాణంలో గంట గడిచేసరికి సమీర్‍కి నిద్ర పట్టేస్తుంది. ఎక్కడో లోయలోంచి బస్ వెళ్తుండగా, మెలకువ వస్తుంది. అతని భుజం మీద వాలి నిద్రిస్తున్న సారికకి కూడా మెలకువ వచ్చి సర్దుకుని కూర్చుంటుంది. వెనకాల సీటులో ఉన్న రైటర్, అతని అసిస్టెంట్‌కు కూడా మెలకువ వచ్చి మాటలు మొదలుపెడతారు. తన కుడి భుజం మీద వాలిపోయినందుకు అసిస్టెంటుని మందలిస్తాడు రైటర్. మీరు నన్ను మీ కుడి భుజం అన్నారు ఓ సభలో అని గుర్తు చేస్తాడు అసిస్టెంట్. కుడిభుజం విషయంలో క్లారిఫై చేయాల్సినవి రెండున్నాయంటూ, వాటిని అసిస్టెంట్‌కి వివరిస్తాడు రైటర్. నిద్రపోవాలని ఎవరూ పోరని, నిద్ర వచ్చేస్తుందని అంటాడు అసిస్టెంట్. అందుకు రైటర్ ఏదో అంటే, తన ఉద్దేశం అది కాదని చెప్తాడు అసిస్టెంట్. అతను తన భుజం మీద వాలి నిద్రపోయినప్పుడు అతని జుట్టు తన భుజాలకి గట్టిగా గుచ్చుకుందని రైటర్ అసిస్టెంట్‌కి చెప్తాడు. అవి ‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’ అనీ, స్థితప్రజ్ఞతకి గుర్తు అని అంటాడు అసిస్టెంట్. ప్రయాణం కొనసాగుతుంది. కాసేపటి తర్వాత ఒక చోట – స్నాక్స్ టీ కోసం బస్ ఆపుతారు. సారిక, సమీర్ కూడా దిగుతారు. సారిక సమీర్‍ని నెమ్మదిగా పిలిచి, ‘ప్రేమ నేరమా?’ అని అడుగుతుంది. – ఇక చదవండి.]

గోవాలో రకరకాల పేపర్లలో రకరకాల వార్తలొచ్చాయి. ఒక పేపర్లో సారిక చెట్ల చాటున దాక్కుని చూస్తున్నట్లు, నేను కొమ్మని పట్టుకుని ఊగుతున్నట్లు కార్టూన్ వేసారు.

‘కానరాని కోకిల ఎట్టకేలకు బయటకొచ్చింది’, అని వ్రాసారు. మీడియా మా పెళ్లి ఇప్పటికే చేసేసినట్లనిపించింది.

డాఫోడిల్స్ మా థియేటర్. దానికి దగ్గరగా పెద్ద హోటల్లో మేము దిగాలి. బస్సు ఆగాక మాకు పెళ్ళివారికి పలికినట్లే స్వాగతం పెరిగారు. ఇద్దరం లిఫ్ట్ దగ్గర నిలబడ్డాం.

“నేను లగేజ్ తెస్తాను..” అన్నాడు మా అసిస్టెంట్. చేతిలో కార్డు పెట్టాడు.. “మీరు రూమ్‌కి వెళ్లండి!!” చెప్పాడు.

లిఫ్ట్ డోర్ మూసుకుంటుండగా ఆపాను. బయటకు వచ్చాను. రిసెప్షన్ దగ్గిరకి వెళ్లాను.

“నాకు వేరే రూమ్ ఇవ్వండి. ఇంత పబ్లిక్‌గా మేము ఇప్పుడు ఒకే రూమ్‌లో ఉండకూడదు” అన్నాను, కార్డు అక్కడ పెడుతూ.

వెనుక సారిక వచ్చి నిలబడ్డట్లు తెలుస్తోంది.

అతను విచిత్రంగా చూసాడు.

“సార్..”, చాలా మెల్లగా అన్నాడు, “..మీ యూనిట్ వాళ్లు ఇలాగే బుక్ చేయించారు. వద్దంటే మార్చేస్తాను.”

“ప్లీజ్, మార్చండి.”

“కూర్చోండి.”

ఇద్దరం లౌంజ్‌లో సోఫాలో కూర్చున్నాం. హోటల్ బయట జనం గుమిగూడుతున్నట్లు తెలుస్తోంది. రజనీశ్ లోపలికి వచ్చాడు. మమ్మల్ని చూసి ఆగాడు.

“లోపలికి వెళ్లిపోండి. ఇక్కడ ఎక్కవ సేపు కూర్చోకండి. జనం..”

“రూమ్ మారుస్తున్నారు”, సారిక చెప్పింది.

“ఎందుకు?  బాలేదా? ఇది నంబర్ వన్ హోటల్. లీలా కంటే బాగుంటుంది. నేను చూస్తాను..”, అంటూ రిసెప్షన్ వైపు వెళ్ళాడు.

అక్కడ అసలు సంగతి చెప్పినట్లున్నారు.

అక్కడి నుండే నా వైపు తిరిగాడు. గబగబా నడుచుకుంటూ వచ్చాడు.

“వాట్ ఈజ్ దిస్?..”, అన్నాడు. “..ఇంత భయపడితే ఎలా? కమాన్.. నేనున్నాను మీతో..”

నేనేమీ మాట్లాడలేదు. సారిక నన్ను అదే పనిగా చూస్తోంది.

నేను వెనక్కి వాలాను. ఓ అమ్మాయి వచ్చి వెల్‌కమ్ డ్రింక్ ఇచ్చింది.

“థ్యాంక్స్” అంటూ తీసుకున్నాను. అప్పుడే గమనించాను. ఒక గ్లాసే అది. ఆలోచించే లోపల అందులో రెండు స్ట్రాలు వేసి నవ్వింది.

చేసేది లేక ఇద్దరం కలిసి గ్లాసు ఖాళీ చేస్తున్నాం. ఫోటోలు తీసేస్తున్నారు. ఎందుకో సారిక ముందడుగు వేసింది.

“సమీర్ అన్నది కరెక్ట్, దయచేసి రెండు రూమ్‌లు ఏర్పాటు చేయండి.” అంది.

“ఊఁ..!” అన్నాడు రజనీశ్. “..యు ఆర్ రైట్ – రిపోర్టర్లు పిచ్చి పిచ్చిగా వ్రాస్తారు. ‘సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం?’ అంటారు.”

రిసెప్షన్ వైపు వెళ్లిపోయాడు.

సారిక నన్ను ఓ విధంగా ఆడుకుంటోందా? అనుకున్నాను.

“థాంక్స్”, అన్నాను,

మా యూనిట్ వాళ్ళు జనాలను దూరం చేస్తున్నారు.

“నిజమే..”, సారిక రహస్యంగా అంటున్నట్లు అంటోంది.. “మనకు పెళ్ళి కాలేదు కదా?”

“కరెక్ట్.”

తన గడ్డం క్రింద చేయి పెట్టి కళ్లెగరేసింది.

ఏంటి? అన్నట్లు చూసాను.

“అవుతుందా?”, అడిగింది.

***

డాఫోడిల్స్ థియేటర్‍లో ముందర రజనీశ్‌కు ఎంతో భారీగా సన్మానం చేసారు. దండలతో ఊగిపోయాడు. దండలన్నీ ప్రక్కకు తీసి మైక్ అందుకున్నాడు.

“అందరికీ వందనములు..!”, అన్నాడు, “..కోయిల కానరాదు అని జీవితాంతం అనుకుంటూనే వచ్చాను!”

హాలులో నిశ్శబ్దం కమ్ముకుంది. కొంపదీసి తెలియని నిజాలు చెబుతాడా? రజనీశ్‌కి పురానా ఖిలాడీ అన్న పేరుంది.

“మనోరంజనం, సాహిత్యం, సంగీతం, భావుకత, కథలో పట్టు, చక్కని ఇతివృత్తం, సంవాదాలు, సందేశం అన్నీ కలబోసి చక్కని నా మార్కు చిత్రం చేయాలని చాలా సార్లు అనుకున్నాను. అనుకుంటూనే ఎన్నో సినిమాలు తీసేసాను. ఇది మటుకు రాలేదు. కుర్రాడు తాను అనుకున్న పెళ్లికూతురిని ఊహిస్తూ ఎన్నో పెళ్లిళ్ళకు వెళతాడు. అసలు ఆ సుందరి దొరకగానే పెళ్లి చేసేసుకుంటాడు. కానీ నాది మరో అదృష్టం ఉంది. మీరు చెప్పమంటేనే చెబుతాను..”

అందరూ గోల చేసారు.

“చెప్పాలి, చెప్పాలి” అని అరిచారు.

“ప్లీజ్.. ఆగండి. చెప్పేస్తాను..!”

జనం శాంతించారు.

“యస్. చెబుతాను. పెళ్ళిచూపులకు వెళ్లినప్పుడు ఆ అమ్మాయిలందరూ కూడా అందమైన వాళ్ళే ఉంటారు. కానీ అందరినీ పెళ్ళి చేసుకోలేము. నాకు అలాక్కాదు, అందరితోనూ పెళ్ళయిపోయింది.”

జనం ఒక్కసారిగా గోలెట్టారు. ఈలలు వినిపించాయి. ఆ సమయంలోనే ఒక ఎగ్జిట్ గేట్ దగ్గర జోవాక్విమ్ తెల్లని కోట్‍లో కనిపించాడు. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఇద్దరం అనుకుని ఉండం.

ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడికి వచ్చేసాం!

రజనీశ్ చెబుతున్నాడు, “..పెళ్ళి అంటే పెళ్ళి అని కాదు. అన్నీ సూపర్ డూపర్ హిట్లే! కానీ కానరానిది నిజంగా కానరానిదే!”

సారిక వైపు తిరిగాడు.

జనం పిచ్చిపిచ్చిగా గోల చేసారు.

ఏమిటి దీనికి అర్థం?

అమ్మ దొంగా? ఎంత గడసరివే? నన్ను మోసం చేసి గెలిచావు అన్న మాట చక్కగా అందరి సమక్షంలో అంటున్నాడా?

ఆ సంగతి జనం అందరికీ తెలుసా? మరి ఎందుకు గోల చేస్తున్నారు?

గోల చెయ్యాలి అన్నట్లు ఆగి మైకు అలాగే పట్టుకుని సారికను చూస్తూ దగ్గరకు వచ్చాడు.

“ఈ అమ్మయి కోయిల అంటే ఎలా? కుదరదు. కోయిల నల్లగా అంటుంది. ఈమె రంగు దబ్బపండు రంగు. కానీ మాకు కోయిలే! కనిపించని అందం..”

మరల స్టేజ్ అంచు దాకా వెళ్లాడు.

“ఇండస్ట్రీలో నాకంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు..” అన్నాడు, “..అనుకున్న బొమ్మ అనుకున్నట్లే మెరిసింది. అన్ని వైపులా మెరిసింది, అలరించింది. అందరినీ అలరించింది. కానరాని కోయిల నాకు కళాత్మకంగా ఎంతో తృప్తినిచ్చింది.”

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి మైకు తీసుకున్నాడు.

“అందరికీ ఒక ప్రశ్న” అన్నాడు.

అందరూ గోల గోల చేసారు.

“అడగాలా వద్దా?”

“అడగాలి.. అడగాలి..” హాలు మారుమ్రోగింది.

“అడుగుతాను..”, అంటూ మా ఇద్దరి వైపు చూసాడు.

“కానరాని కోయిన అనే సినిమా హీరోదా? హీరోయిన్‍దా?”

గోల గోలగా ఉంది. కానీ ఎవరేమంటున్నారో అర్థం కాలేదు.

“యస్?”

ఓ అమ్మాయి, అంతా కూర్చున్నాక అంది, “పూర్తిగా హీరోయిన్‌ది.”

అందరూ గొల్లున నవ్వారు.

ఇతను అంటున్నాడు, “ఆ కుడి ప్రక్కన నిలబడ్డ కుర్రాడు చెయ్యి పైకెత్తాడు.. అవును, నువ్వే. కమాన్.. చెప్పు.”

“సార్, తనలో గొప్ప ప్రతిభ ఉన్నదని గుర్తించి, తాను అన్నీ వదులుకుని చివరకు ఆమెనే వెలుగులోకి తెచ్చిన ఒక కథానాయకుడు – హీరో అంటే అలాంటి వాడు సార్. నలుగురినీ ఒకేసారి తన్నేవాడ కాదు. ఈ సినిమా హీరోదే సార్!”

నలు వైపులా ఈలలు వినిపించాయి.

ఇతను చేతులు చాపించి గోల ఆపాడు.

“ఎవరు బాగా నటించారు? సమీరా? సారికనా?”

ఒకమ్మాయి మైకు తీసుకుంది.

“సార్, సారికకి నటించవలసిన అవసరమే లేదు. ఏ రోల్‍లోనైనా అల్లుకు పోతుంది. అసలు నటించిందా? అనుకుంటాం.”

“వావ్.. గొప్ప మాట. ఏ సీన్ మీకు నచ్చింది?”

“వాన చినుకుల చప్పుడుకి తాళం వేస్తు నాట్యం కొత్త పద్ధతిలో చేసిన దృశ్యం, ఆ పాట.. మాకు పిచ్చెక్కిపోయింది”

వెంటనే ఆ పాట బాక్‌గ్రౌండ్‌లో ప్లే అవటం ప్రారంభించింది.

“సారికా.. సారికా..!” అరుపులు కేకలుగా మారాయి.

సారిక లేచింది. చీరె కొంగును నడుముకు బిగించింది. ఒక సరైన సమయాన్ని ఎంచుకుని స్టెప్పులు వేసింది. జూనియర్ ఆర్టిస్ట్స్ చుట్టుముట్టారు. స్టేజ్ దద్దరిల్లింది..

చివరి స్థాయిలో ఎవరో నా దగ్గర కొచ్చి నన్ను కుర్చీలోంచి లేపారు. గతి లేక లేచాను..

హాల్లో ఎవరూ కూర్చుని లేరు. గొడవ తారాస్థాయికి చేరుతోంది. నేను సెంటర్ లోకి వెళ్లి రెండు చేతులూ జేబుల్లో పెట్టుకున్నాను.

ఇంతలో ఎక్కడి నుండో జో అందరి ముందరికీ వచ్చాడు. రెండు చేతులతో ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు.

“ఇది మన డాఫోడిల్ – నువ్వు నా హీరో!”

స్టేజ్ మీద లైట్లు తీసేసారు. అంతా నిశ్శబ్దం. సన్నగా లేసర్ బీమ్స్ వదులుతున్నారు.

సినిమాలోని నా పాట మొదలయింది.

“ఆట ఆడాలి, ఒక పాట పాడాలి
నువ్వెవరయ్యా, నేనెవరయ్యా –
పూచిన చోటే టక్కున తెంపి
పూచే లేదని తొక్కిన పువ్వెవరయ్యా –
ఆట ఆడాలి..
పామరుడైనా, పండితుడైనా
ఆమడ దూరం చేరేలోగా –
ఆట ఆడాలి, ఒక పాట పాడాలి!”

(ఇంకా ఉంది)

Exit mobile version