[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[పాత కారు షెడ్‍ని జో అలానే ఉంచి, దాని చుట్టూతా ఓ అందమైన పూలతోట పెంచుతాడు. కారులో సమీర్‍ని అక్కడికి తీసుకెళ్తాంటాడు. కానీ అక్కడ బాగా జనం ఉండడంతో, కార్యక్రమం మొదలయ్యే టైమ్‍కి వద్దామంటూ చాలా దూరం తీసుకువెళ్తాడు. ఓ ఇంటి ముందు కారు ఆపి, దిగి, తాళం తీసి, సమీర్‍ని లోపలికి ఆహ్వానిస్తాడు జో. ఆ ఇంట్లో చాలా పెయింటింగ్స్ ఉంటాయి. నీ కోసమే కొన్నాను అని సమీర్‌తో అంటాడు జో. ఏదీ, ఈ పెయింటింగా అని సమీర్ అడిగితే, కాదు ఈ ఇల్లు అని చెప్తాడు జో. అక్కడి చిత్రపటాలను చూపిస్తూ, సారికని ఎందుకు పెళ్ళి చేసుకోవడం లేదని అడుగుతాడు. తన వివాహం జాతీయ సమస్య ఎందుకయిందని చిరాకు పడతాడు సమీర్. అతను కేవలం హీరో కాదని, తమ ప్రాంతానికి వెలుగు తెచ్చిన మహామనిషని జో అంటాడు సమీర్‍ని ఉద్దేశించి. తర్వాత అక్కడున్న పెయింటింగ్‍లని జాగ్రత్తగా పరిశీలించమని అడుగుతాడు. చాలా వాటిల్లో సమీరే ఉంటాడు. ఒక బొమ్మలో చర్చ్‌లో మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులూ ముడుచుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న యువతిని చూపి, ఆమె స్టెల్లా అనీ, ఈ పెయింటింగ్స్ అన్నీ ఆమె గీసినవేనని చెప్తాడు జో. మళ్ళీ పెళ్ళి విషయం తెస్తాడు జో. తానింకా నిర్ణయించుకోలేదని అంటాడు సమీర్. సాయంత్రం కార్యక్రమం మొదలవుతుంది. సినిమా పాటలతో స్టేజ్ దద్దరిల్లిపోతుంది. రంగు కాగితాలు గాలిలో ఎగురుతుంటాయి. అందరి మధ్యలోంచి సమీర్‍ని స్టేజ్ మీదకు తీసుకువెళ్తాడు జో. సమీర్ ప్రసంగిస్తుండగా, ప్రేక్షకులలో కలకలం రేగుతుంది. కొందరు వెళ్ళిపోవడం మొదలుపెడతారు. కొందరు ఒకరికొకరు మొబైళ్లు చూపించుకుంటారు. జో, సమీర్‍ని ఓ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసేస్తాడు. ఏమైందని అడిగితే, ఎగ్జైత్ అవ్వద్దని చెప్పి సారిక చనిపోయిందని చెప్తాడు జో. – ఇక చదవండి.]
జో వద్దంటున్నా బయటకు పరుగు తీసాను. అతను నన్ను గట్టిగా పట్టుకున్నాడు.
“నా మాట విను.. తొందరపడకు”, అరుస్తున్నాడు.
మా షెడ్డుకు పైన ఉన్న రోడ్డు మీద ఇంకా జనం చెల్లాచెదురుగా కనిపిస్తున్నారు. పోలీసులు ఈలలు వేస్తున్నారు.
ఎందుకొచ్చిందో ఆవేదన, ఒక్కసారిగా అరిచాను.
“సారికా..”
అయినా జో నన్ను గట్టిగా పట్టుకునే ఉన్నాడు.
“వదులు”, మెల్లిగా అన్నాను.
“కూల్” అన్నాడు. ఇంకా వదలలేదు.
“ప్లీజ్.. నేను పారిపోను.”
“అలాంటి పని చేయకు. ఆలోచించి ఏ పనైనా చేద్దాం.”
“చేసేందుకేముంది?
“మెల్లగా ఆలోచించు. నువ్వు అక్కడ లేనప్పుడు జరిగింది.”
“అయితే?”
“ఏదైనా ప్లాన్ ఉందేమో!”
ఒక్క క్షణం కదలటం ఆగిపోయింది. కాలం ఎంత గడగ్గాయి? జో చేతులు సడలించి నన్ను వదిలేసాడు. ఆ మాట నన్ను కదలనీయకుండా చేసింది. కాలానికి గాలాలతో పనిలేదు. గాలిపటంలా ఎగురుతున్న మనసుకు రెండు మాటలు చాలు – మనిషి బిగదీసుకు పోగలడు.
“నా మాట విను.. నడు, ఆ గదిలోకి రా. నీకు పరిస్థితి అర్థం అవటానికి సమయం పడుతుంది. నన్ను నమ్ము. నేను నీ జో ని!”
నిజమే. నిదానంగా అతనితో ఆ గదిలోకి నడిచాను.
ఎక్కడి నుండో ఓ బాటిల్ తెచ్చి మంచినీళ్ళిచ్చాడు. గబగబా నాలుగు గుటకలు మ్రింగాను.
‘చూస్తూ ఉండండి.. ఇద్దరిలో ఎవరో ఒకరే ఉంటారు’ అన్న మాటలు గుర్తొచ్చాయి.
“జో..”
“యస్? ఈజీ.. కూల్.”
“నేను దాక్కున్నట్లు అందరూ అనుకోరా?”
నన్ను జాగ్రత్తగా చూసాడు జో.
“నువ్వు హోటల్‍లో ఏదైనా మెసేజ్ పెట్టావా?”
“అవును. మా పల్లెటూరికి వెళుతున్నానని చెప్పాను.”
“ఓకే. అది అక్కడ ఇంకెవరికైనా తెలుసా?”
“ఎవరికైనా అంటే?”
“మీ ట్రూప్‍లో వాళ్ళకి.”
“మా మేనేజర్‍కే చెప్పాను.”
“గుడ్.”, అంటూ లేచి నిలబడి బయటకు వెళ్ళి అటూ ఇటూ చూసి సిగరెట్ వెలిగించి, తలుపు దగ్గర నిలబడి అతనూ కూల్ అవుతున్నాడు. గబుక్కున ఇటు తిరిగాడు.
“నీ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉందా?”
“అవును.”
“వద్దు. ఆన్ చేసి ఉంచు. అనుమానం రాకూడదు.”
“కరెక్ట్.”
వెంటనే ఏరోప్లేన్ మోడ్ నుంచి మామూలు వాడుక లోకి తెచ్చాను. అంతే, వరుస పెట్టి మిస్ అయిన కాల్స్ అన్నీ కనబడుతుతున్నాయి.
“చాలా మంది కాల్ చేసారు జో.”
జో లోపలికి వచ్చాడు.
“ఎవరెవరివి ఉన్నాయి?”
నేను చూసి చెప్పే లోపలే అతను ఆపాడు.
“రజనీశ్ కాల్స్ ఉన్నాయా?”
“ఊఁ.. ఉన్నాయి. దాదాపు ఆరు కాల్స్ ఉన్నాయి.”
జో నాలోకి దూరి ఆలోచిస్తున్నాడని తెలుసుకుని ఊరట చెందాను. ఇతను దగ్గర లేనప్పుడు ఇది జరిగుంటే నేను ఎలా వ్యవహరించేవాడినో ఊహించలేను..
ఎవరో ఓ ప్లాస్కులో టీ నింపుకుని వచ్చినట్లున్నాడు. జాగ్రత్తగా రెండు కప్పులు నింపాడు. రోడ్డు మీద గోల మెలల్గా సన్నగిల్లుతోంది. ఆ మనిషి వెళ్ళిపోయాడు.
కొద్దిసేపు ఇద్దరం ఏమీ మాట్లాడలేదు.
టీ త్రాగుతూ జో అన్నాడు, “..రజనీశ్ కాల్ చెయ్యటంలో అర్థం ఉంది. ఓ పని చెయ్యి. నువ్వు కాల్ చెయ్యి. అది అవసరం.”
“చెయ్యమంటావా?”
అవునన్నట్లు తల ఆడించాడు.
“చూడు, అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో మనకు ఏమీ తెలియదు. ఏదో విధంగా టీవీలో ఇదే గొడవ ఉంటుంది. నువ్వు ఆ సమయానికి అక్కడ లేవన్నది పబ్లిక్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి.”
“మంచిదే కదా?”
నవ్వాడు జో.
“నిన్ను మీ ట్రూప్ వాళ్ళు, ముఖ్యంగా రజనీశ్ లాంటి వాళ్ళు ఎలాగో అలాగ సంప్రదించాలనుకున్నప్పుడు, అది వీలు పడటం లేదని రికార్డుల లోకి వస్తే అది మంచిది కాదు.”
“నిజం! మాట్లాడతాను.”
రజనీశ్ నెంబరు కొట్టాను. లోపల ఏవో సుడులు తిరుగుతున్నాయి. రింగులు వెళుతున్నాయి. అతను ఎత్తటం లేదు.
ఫోన్ కట్ చేసాను.
టీ వల్ల ఉపయోగం ఉన్నట్లుంది.
“అతనే చేస్తాడు..”, జో అన్నాడు. “..జాగ్రత్తగా మాట్లాడు. భావుకుడవు కాకు.”
కుర్చీలో వెనక్కి వాలాను. దీర్ఘంగా గాలి పీల్చాను.
~
‘ఉన్నవాడికీ, లేనివాడికీ తేడా ఏం లేదు..’ ఒకసారి సారిక ఏదో మైకంలో అంది. ‘ఉన్నవాడికీ, లేనివాడికీ తేడా ఏమీ లేదు. లేనివాడు చిరిగిపోయిన వాటిని దగ్గర చేర్చుకుని అతుకుల బొంత చేసి కప్పుకుంటాడు. ఉన్నవాడు ఎందరివో బ్రతుకులను అతికించుకుని ఒక కారు, ఓ బంగళా, ఓ ఎస్టేట్ అంటూ పేకముక్కల్లా అన్నింటినీ చేర్చుకుని నిరంతరం కనిపించని దేనికోసమో బెంగపెట్టుకుని, ముక్కలు ముక్కలైపోయిన మనసును తన వంతు బొంతలా కప్పుకుని గతాన్ని మగత లాంటి నిద్రలో దాచిపెట్టి, తనతో తాను దోబూచూలాడుతుంటాడు..’
తన నుదురు మీద చెయ్యి పెట్టి, ‘పడుకో సారికా.. నిద్ర పడితే అదే తగ్గిపోతుంది’, అన్నాను.
‘ఏది? ఎందుకు తగ్గిపోతుంది?’
‘నీలో ఏముందో నాకు తెలియదు. కానీ అది తగ్గితే మంచిదనిపిస్తోంది.’
విచిత్రంగా, బిగ్గరగా నవ్వింది.
‘కమాన్! నువ్వు అసాధ్యుడవు. నాలో ఏముందో తెలియదా?’
‘నిజం. తెలియదు.’
‘నాకూ తెలియదు..’, కళ్ళు మూసుకుంది. ‘..నీలోనూ ఏముందో నాకు తెలియదు. కానీ ఆ చెయ్యి అలాగే ఉంచు. ఎందుకో ఏదో జరగకుండా ఆగిపోగలదనిపిస్తోంది, ఈ లోకంలో ఇంకా బ్రతికుండటానికి చాలా ఉన్నదన్న ఆశ అప్పుడే నిద్ర లేచిన చంటి పిల్లాడి గొంతులా బేలగా అరుస్తూ, చిగురిస్తూ ఉంటుంది. ఆ చెయ్యి అలాగే ఉంచు. తీయకు.’
అలాగే నిద్రపోయింది.
~
ఏదో జరగకుండా ఆగిపోగలదని.. ఒక్కసారిగా నాలో కరెంట్ పాస్ అయింది. ఎందుకిలా మాట్లాడేది? ఏదైనా అనుమానం ఆమెకుందా?
ఫోన్ మ్రోగింది.
జో వైపు చూసాను. తియ్యమన్నట్లు కళ్ళతోనే సైగ చేసాడు.
“హలో” అన్నాను.
“అరె? ఎక్కడ?”
“మంగేశీ దాటి ఆరు కిలోమీటర్ల వద్ద మా పాత ఇలాకాలో. చాలా బాధ కలిగించిన వార్త ఇక్కడ దుమారం రేపుతోంది. అసలు ఏం జరిగింది?”
“మాకూ అర్థం కావటం లేదు. మేమంతా కాసినోలో ఉన్నాం.”
“ఓ.”
“సారిక తండ్రి వచ్చాడు. కలవాలని ఎంత సేపు బెల్ కొట్టినా తెరవలేదుట.”
“ఓకే.”
“ఫోన్ రింగ్ వినిపిస్తోంది కానీ ఎత్తటం లేదుట.”
“పడుకుందేమో.”
“కావచ్చు. హోటల్ వాళ్ళు రెండు గంటలు ఆగి మరల ఫోన్ చేసి చూసారు. ఆయన గుర్తింపు కార్డు, అన్నీ తీసుకుని కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకుని డూప్లికేట్ కార్డుతో డోర్ తీసి లోపలికి వెళ్ళారు. అలా పడుకున్నట్లు పడి ఉందిట. ట్రెయినింగ్ అయి ఉన్న ఓ ఆడ స్టాప్ కొన్ని ప్రయత్నాలు చేసి హోటల్ డాక్టర్‌ను పిలిచిందట. అతనొచ్చి ఆమె చనిపోయినట్లు నిర్ధారించాడుట!”
“ఎలా?”
జో నన్ను అదోలా చూసాడు.
“ఆయన పరీక్షలు ఆయన చేసాడు.”
“చనిపోయిన కారణం చెప్పాడా?”
“అది పోస్ట్ మార్టమ్‍లోనే తెలియాలి. కానీ..”
“కానీ?”
“దాని మీద గొడవగా ఉంది. ఆయన వద్దంటాడు. హోటల్ యాజమాన్యం రూల్ ప్రకారం పబ్లిక్ ప్లేస్ కాబట్టి పోలీస్ విచారణ తప్పదు. కాబట్టి పోస్ట్ మార్టమ్ అనివార్యం.”
“అయితే, ఇప్పుడు బాడీ..”
“ఇంకా షిఫ్ట్ చెయ్యలేదు. సమీర్..”
“సార్..”
“ఇక్కడ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు వేధించుకు తింటున్నారు. ఒక్కసారి వాళ్ళకి కనిపించాల్సి ఉంటుంది.. జాగ్రత్తగా ఆలోచించు.”
“మీరే సలహా చెప్పండి.”
“ఇక్కడికి వీలైనంత త్వరగా వచ్చెయ్.”
“ఆలోచిస్తాను. సార్..”
“చెప్పు సమీర్, ఊరికే భయపడకు.”
“మీరే ప్రెస్‌కి నేనెక్కడున్నానో చెప్పి, త్వరలోనే రాగలనని చెప్పగలరా?”
“ఓకే చెప్తాను. కానీ సారిక తండ్రి నీ గురించి పదే పదే అడుగుతున్నాడు.”
“ఓకే. ప్రస్తుతానికి ఈ పని చెయ్యండి.”
“ఓకే. కూల్. ఐయామ్ సారీ సమీర్. ఇంత పండగ ఇలా అవటం కోసమా అని ఇక్కడ ఎవరికీ గొంతులోంచి ఒక ఫింగర్ చిప్ కూడా దిగటం లేదు, మందు మాట ప్రక్కన పెట్టు. ఉంటాను.”
ఎలా జరిగింది? ఇంకా సినిమా ఉంది అని చెప్పేందుకు ఎడిటింగ్‍లో చక్కని సౌండ్ ఆర్క్, కారెక్టర్ ఆర్క్ వాడతారని రజనీశ్ అనేవాడు. ఫాస్ట్ కట్స్ ఎక్కువగా వాడనిచ్చేవాడు కాదు..
‘కొన్ని షాట్స్ తొందరగా ఓకే కాకూడదు..’ సారిక అనేది. ‘..నీ కళ్ళల్లోకి చూస్తుంటే నా ముఖం మీద భావాలు అద్భుతంగా ఉంటాయని రజనీశ్ అంటూ ఉంటారు. ఏదైనా సముద్రం ఆ కళ్ళల్లో దాచావా?’
ఎందుకు ఈ దృశ్యం కట్ అయిపోయిందో తెలియదు. ఏ సముద్రం ఉందో తెలియదు. ఒకవేళ ఉన్నట్లయితే, నన్ను కనిపించకుండా మింగేసి ఊర్కుంది..
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.