సమాజంలో
సంచరిస్తున్నప్పుడు
మాటల ఈటెలు గుచ్చుకోవడం
చేతల గాయాలవడం మామూలే..!
ఉన్నత మనస్తత్వాలు..
ఉదాత్త వ్యక్తిత్వాలు..ఎదురయ్యే సందర్భాలు
బహు తక్కువే!..
అలాంటి క్షణాల్లో
ఓ మంచి స్నేహం
వెన్నెల చల్లదనాన్ని చూపిస్తుంది..
సాత్విక వచనాలు
కలత చెందిన హృదయానికి
నవనీత లేపనంలా గాయాన్ని మాన్పుతుంది..
‘అక్కర’ వచ్చినప్పుడు
అక్కున చేర్చుకున్న చేతులే..ఆపన్న హస్తాలు !
ఊరటనిచ్చే మాటలే..తేనెల చిలకరింపులు !!
అలాంటప్పుడే తెలుస్తుంది..
ముళ్ళను రూపొందించిన ఆ దేవుడు
పూలనెందుకు సృష్టించాడోనని !!!
లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.