Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -18

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

ప్రాచార్యునిగా అమెరికాకు

రెండవసారి నేను అమెరికాకు 1967వ సంవత్సరంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళాను. దీని గురించి కూడా నేను డైరీలో నోట్ చేసుకోలేదు. ఎందుకో తెలియదు. మునుముందు ఇలాంటి వివరాలు కావలసి వస్తుందనే ఆలోచన కూడా లేదు. అందువల్ల జ్ఞాపకమున్నంత వ్రాస్తున్నాను.

1961వ సంవత్సరంలో అంటే డాక్టరేట్ తీసుకుని అమెరికా నుండి తిరిగివచ్చిన ఒక సంవత్సరానికి ప్రిన్సిపాల్ అయ్యాను. ఆరు సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన తరువాత మళ్ళీ అమెరికాకు వెళ్ళి అక్కడి విద్యావిధానాన్ని సావకాశంగా, లోతుగా తెలుసుకుందామనీ, ఇంకా 1970లో మా కాలేజీ నిర్వహించబోయే రజతోత్సవాలకు అక్కడున్న మా కాలేజీ పూర్వ విద్యార్థులను కలిసి కొంచెం ధనాన్ని సేకరిద్దామని ఆలోచించాను. నేను అమెరికాకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళాలన్న సంసిద్ధతను దానికి సంబంధించి ఢిల్లీలో ఉన్న అమెరికన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌కు తెలిపాను. మరే ప్రయత్నం లేకుండా కార్బొండేల్ అనే ఊరిలో ఉన్న సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో సందర్శక ప్రాచార్యునిగా అవకాశం దొరికింది. దాని వ్యవధి 9 నెలలు. ప్రయాణ ఖర్చులకు యథాప్రకారం ఇంతకు ముందు లభించినట్లే ఫుల్‌బ్రైట్ ట్రావెల్ గ్రాంట్ లభించింది. నా విద్యానేపథ్యం, అమెరికా విశ్వవిద్యాలయంలో తీసుకున్న డాక్టరేట్, ప్రిన్సిపాల్‌గా గడించిన అనుభవం ఇవన్నీ పరిగణించి నాకు విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యే అవకాశం, ట్రావెల్ గ్రాంట్ అంతా సులభంగా లభించింది.

1967వ సంవత్సరంలో కెనడాలో ఉన్న మాంట్రియల్‌లో ప్రపంచ విఖ్యాతమైన Expo’67 అనే శాస్త్రసాంకేతిక ప్రదర్శన నడుస్తూవుంది. మాంట్రియల్ గుండా వెళ్ళి ఆ ప్రదర్శనను చూసుకుని అమెరికాకు పోవాలని నిర్ణయించుకున్నాను. మాంట్రియల్‌లో మా పూర్వ విద్యార్థి చంద్రశేఖర్ పనిచేస్తున్నారు. Expo’67 చూడటానికి మాంట్రియల్ వస్తానని ఉత్తరం వ్రాశాను. నేను బెంగళూరు వదిలే రెండు రోజుల ముందు విమాన పైలెట్ల సమ్మె మొదలయ్యింది. విమానం వేళలు మారిపోయాయి. ఆస్ట్రేలియా నుండి మద్రాసుకు వచ్చి మాంట్రియల్‌కు వెళ్ళే అంతర్జాతీయ విమానంలో నేను ప్రయాణించాలని తెలిపారు.

ఆత్మీయ వీడుకోలు

ఈ రచన నేనే చేస్తున్నందువల్ల కొన్ని సందర్భాలలో ఆత్మప్రశంస ఎక్కువగా ఉందన్న భావన పాఠకులలో కలిగినా ఆశ్చర్యం లేదు. అయితే నిష్పక్షపాతంగా వ్రాయకపోతే తప్పు అవుతుంది. నేను కాలేజీలోని అన్ని విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలలో, ఆటపాటలలో చురుకుగా పాల్గొనేవాడిని. అందువల్ల విద్యార్థుల సాంగత్యం ఎక్కువగా ఉంది. సుమారు 1400 మంది విద్యార్థులలో 80 శాతం మంది పేర్లను నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. కాలేజీలో మామూలు వీడ్కోలు సభలు జరిగాయి. విమానాశ్రయం కాలేజీ నుండి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి వాహన సౌకర్యం చాలా తక్కువ. నేను అక్కడికి వెళ్ళే సమయానికి 1000 మంది కన్నా ఎక్కువగా ఉన్న విద్యార్థి సమూహాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మా కాలేజీలో న్యూస్ లెటర్ ఏడాదికి మూడు సార్లు ప్రకటిస్తారు. నేను అమెరికా వెళ్ళిన తరువాత ఆ వార్తను ఆ కాలేజీ న్యూస్ లెటర్‌లో 1000 మంది విద్యార్థులున్నారని తెలిపారు. అంతమంది శ్రమకోర్చి అక్కడికి ఎలా వచ్చారో తెలియదు. విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణీకులు ఆ దృశ్యం చూసి కుతూహలం, ఆశ్చర్యం కలిగివుండవచ్చు. నన్ను గుర్తు పట్టిన ఒక ప్రయాణీకుడు “మిమ్మల్ని సాగనంపడానికి కాలేజీ కాలేజీయే వచ్చినట్టుంది. మీరు అదృష్టవంతులు” అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు, పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. వారికందరికీ కృతజ్ఞతలు చెప్పి విమానంలో ఉస్సూరుమని కూర్చున్నాను. ఆ రోజు ఉదయం నుండీ విరామం లేకుండా పని. చాలా అలసట అయ్యింది. పక్కలో ఒక విదేశీ ప్రయాణీకుడు కూర్చున్నారు. వారూ బెంగళూరులోనే విమానం ఎక్కారు. “మీరెవరు? రాజకీయ నాయకులా? మంత్రిగారా?” అని అడిగారు. నా గాంధీ టోపీ వారికి అలాంటి ఊహ కలగడానికి అవకాశమిచ్చింది. “నేను అధ్యాపకుడిని. ఒక కాలేజీ ప్రిన్సిపాల్” అన్నాను. “ఇదొక నమ్మశక్యం కాని వీడ్కోలు” అని చెప్పి వారు నన్ను అభినందించారు.

ఆ విమానం ఎక్కడెక్కడో చుట్టుకుని, యూరోప్, లండన్ ద్వారా మాంట్రియల్‌ను మరుసటి రోజు సాయంత్రం చేరింది. విమాన ప్రయాణంలో వారు ఇచ్చిన ఏ ఫలహారాన్ని కానీ, భోజనాన్ని కానీ ఇంత వరకూ నేను ఎప్పుడూ తినలేదు. తినడానికి ఏదో అనుమానం. మద్రాసు నుండి మాంట్రియల్ దాకా ఏమీ తినకుండా ఉన్నాను. చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాను. తాళం వేసివుంది. మొదటి టైమ్ టేబుల్ ప్రకారం చంద్రశేఖర్ నన్ను విమానాశ్రయంలో కలవాలి. మారిన షెడ్యూలును వారికి చెప్పడానికి సమయం దొరకలేదు. పైగా విమానం నిర్ణీత సమయానికంటే ముందే వచ్చింది. అందువల్ల వారు విమానాశ్రయానికి రాకపోవడం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. తిండి లేక చాలా అలసిపోయాను. తాళం వేసిన వారి రూము ముందే కూర్చొన్నాను. ఒక గంట తరువాత చంద్రశేఖర్ వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. “ఏం సార్, రాత్రి రావలసినవారు ముందే వచ్చారు కదా? తాళం వేసిన గది ముందే మీరు వేచివుండాల్సి వచ్చింది కదా” అని అన్నారు. “అయ్యో వదిలేయప్పా. అది నీ తప్పు కాదు. మొదలు త్రాగడానికి నీళ్ళు ఇవ్వు. ఆ తరువాత సులభంగా అయ్యే ఉప్మా చేసిపెట్టు. భోజనం, తిండి తిని 30 గంటలయ్యింది” అన్నాను. “అదేమిటి, విమానంలో తిండి, భోజనం ఇవ్వలేదేం సార్” అని అడిగాడు. “అదంతా నేను తిననప్పా” అన్నాను. నీళ్ళు తాగి కోలుకొని విమాన వేళల్లో జరిగిన మార్పులు అన్నీ చెప్పాను. అంతలో నాకు ప్రియమైన ఉప్పిట్టు (ఉప్మా) చేశారు.

మాంట్రియల్‌లో శ్రీ రాధాకృష్ణ మందిరం

మాంట్రియల్‌లో ఒక రాధాకృష్ణ మందిరముంది. ఈ మందిరాన్ని స్థాపించినది భక్తి వేదాంత స్వామి మహారాజ్ గారు. చంద్రశేఖర్, అతని ఇంకొక స్నేహితుడు, నేను ఆ మందిరాన్ని సందర్శించాము. మేము వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలు. పూజ నడుస్తూ వుంది. అక్కడి అమెరికన్ భక్తులు భావోద్రేకంతో “హరే కృష్ణ, హరే కృష్ణ – కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ – రామ రామ హరే హరే..” అనే మంత్రాన్ని నాట్యం చేస్తూ హెచ్చు స్వరంతో జపిస్తూ ఉన్నారు. కూర్చున్న అమెరికన్లు వారితో గొంతు కలిపారు. దానితో పాటు తాళం, తబలా పక్కవాద్యాలు.

ఆ మందిరంలో నివసిస్తున్నవారు 7 మంది అమెరికన్లు – 6 గురు పురుషులు, ఒక మహిళ. పురుషులందరూ చిన్నగా జుట్టును వదిలేశారు. నుదుటికి గంధపు తిలకం దిద్దారు. ఇంత మంది జుట్టును వదిలినవారిని నేను బెంగళూరులోనూ చూడలేదు. ధర్మం పట్ల వారందరికీ ఉన్న శ్రద్ధను చూచి నాకు ఆశ్చర్యమయ్యింది.

రాధాకృష్ణ మందిరం భక్తిమార్గానికి చెందినది. 15-16వ శతాబ్దంలో ఉన్న చైతన్యులు భక్తిమార్గపు ముఖ్యులు. International Society for Krishna Consciousness అనే సంస్థను ఆచార్య భక్తి వేదాంత స్వామిగారు న్యూయార్క్ పట్టణంలో మొదట స్థాపించారు. తరువాత కొన్ని నెలలకు మాంట్రియల్ పట్టణంలో స్థాపించబడింది.

మాంట్రియల్‌లో నామకరణం

ఆగష్టు 20వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు నా రూములో మా ఊరికి ఉత్తరం వ్రాస్తూ కూర్చున్నాను. శ్రీ చంద్రశేఖర్ వచ్చి “సార్, ఇప్పుడే నా స్నేహితుడి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతని కొడుకు నామకరణమంట. నన్ను 11 గంటలకు రమ్మని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని ఒప్పుకుని మిమ్మల్ని పిలుచుకు వస్తానని చెప్పాను. వెళ్దామా సార్” అన్నాడు.

“సరేనప్పా. దానికేమి. వెళదాము” అన్నాను.

సత్యనారాయణ వ్రతం

సుమారు 11 గంటల సమయానికి శ్రీ చంద్రశేఖర్ మరియు నేను మూడవ అంతస్తులో ఉన్న వారి ఇంటికి చేరుకున్నాము. లోపలికి వెళ్ళిన తక్షణమే బూట్లను విప్పి కుర్చీలు, బల్లలు తొలగించి తివాచీ పరిచిన గదిలోకి వెళ్ళి నేలపై కూర్చున్నాము. అక్కడ ఒక మూలలో చిన్న పీట మీద రెండు దేవుళ్ళ పటాలు ఉన్నాయి. మొదటి పటంలో ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టలేదు. ఇంకొక పటంలో ఉన్నది శివుడు, పార్వతి ఇంకా లింగం. మా జతకు ఇంకా 3-4 మందిని ఆహ్వానించారు. సుమారు 11.30 గంటలకు పూజ మొదలయ్యింది. పిల్లవాని తండ్రే పూజారి. సత్యనారాయణ వ్రతాన్ని ఒక హిందీ పుస్తకం నుండి చదవడం ప్రారంభించారు. మేమంతా భక్తుల్లా చేతులు కట్టుకుని ఆ స్తోత్రాన్ని, దాని మహిమను వింటూ కూర్చున్నాము. ఆ వ్రతకథలో నారద మహాముని, సూతమహర్షి మొదలైన వారి ప్రస్తావన ఉంది. సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందని ఇంకా మిగిలిన సిద్ధులు లభిస్తాయిని ఆ కథలో వ్రాసివుంది. సత్యనారాయణ వ్రతాన్ని ఎక్కువగా చేయకుండానే మనదేశ జనసంఖ్య 50 కోట్లకు మించి ఉన్నది. ఇంకా ఇలాంటి నోములు, వ్రతాలు ఎక్కువగా జరిపి అవి సత్యమైతే, మన దేశం గతి ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. అక్కడున్న భక్తులలో నలుగురు హిందూ ముత్తైదువులు. అందరూ మనదేశపు దుస్తులనే ధరించారు అయితే Heavy lipstick. మిగిలినవారిలో ఐదారుగురు ప్యాంట్ ధరించిన హిందూ పురుషులు, ఇంకా ఎక్కువ అల్లరి చేస్తున్న ముగ్గురు నలుగురు పిల్లలు. పిల్లల్ని వదిలిపెట్టి మిగిలినవారందరూ యథాశక్తి శ్రద్ధతో పూజలో నిమగ్నమై ఉన్నారు. పిల్లవాని తండ్రి పూజ ముగించిన తరువాత మంగళహారతి చేయబూనారు. కర్పూరాన్ని వెలిగించి ఒక చిన్న పాత్రలో పెట్టి మంగళహారతిని అపసవ్యదిశ (Anti-clockwise) లో త్రిప్పడం మొదలుపెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది. ‘ఇదేమి. మంగళహారతి దిశనే మార్చారు కదా!’ అనుకుని దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. వెంటనే నాకు ట్రాఫిక్ రూల్స్ జ్ఞాపకం వచ్చింది. మన దేశంలో వాహనాలు రోడ్డుకు ఎడమవైపు (Keep to the left) పోవాలి. అయితే కెనడా దేశంలో రోడ్డుకు కుడివైపు (Keep to the right) వెళతాయి. అలాగే మంగళహారతి దిక్కు ఇక్కడ మార్చివుండవచ్చునని సమాధానపరచుకున్నాను.

పూజ ముగిసిన తరువాత మాకందరికీ సంతర్పణం. పూరి, కూర, బోండా ఇంకా కొన్ని తీపి పదార్థాలు. అంతా స్వయం సేవ (Self service). నా ప్లేట్లో రెండు పూరీలను వేసుకుని కూర వేసుకోవడానికి వెళ్ళాను. దానిలో ఏమో ముక్కలు కనిపించినట్లు అయ్యింది. పక్కనున్న వారిని కూర composition గురించి అడిగాను. “ఎందుకు? మీరు శాకాహారులా?” అన్నారు. “ఔను” అని బదులిచ్చాను. “నామకరణం రోజు ఎవరైనా మాంసాహారం చేస్తారా? అన్నీ కూరగాయలే. మీరేమీ అనుమానం పెట్టుకోకండి” అని ధైర్యం చెప్పారు. నామకరణం రోజు మంగళహారతిని అపసవ్యంగా త్రిప్పినట్లే, మాంసాహార నామకరణం ఎందుకు కాకూడదు అని మనసులోనే అనుకున్నాను. చాలినంత తిన్న తరువాత పిల్లవాడు జ్ఞాపకం వచ్చాడు. వాని దగ్గరికి వెళ్ళి ఆడించడానికి ప్రయత్నించాను. వాడు ఊరికే పడుకుని ఉన్నాడు. నవ్వనే లేదు. పిల్లలను ఆడించే అభ్యాసం నాకు లేదు. వాడు నన్ను చూసి ఏమనుకున్నాడో ఆ భగవంతునికే తెలియాలి!

పిల్లవాని తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపి Expo’67 చూడడానికి శ్రీ చంద్రశేఖర్, నేను వెళ్ళాము. ఆ రోజు జెకస్లోవేకియా పెవిలియన్ చూడాలని నిశ్చయించాము. క్యూ చాలా పొడవు ఉంది. లోపలి వెళ్ళడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. క్యూలో అంతా సత్యనారాయణ పూజ, పూరి, కూరల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ఆలోచనలలో నాలో రెండు లోపాలు కనిపించాయి. మొదటిది ఆ పిల్లవాని పేరే అడగలేదు. ఎవరైనా నామకరణం రోజు ఇంటికి పిలిస్తే పిల్లవాని చేతిలో ఏమైనా కానుక ఇవ్వాలని ఎప్పుడో ఎవరో చెప్పినట్టు జ్ఞాపకం వచ్చింది. నేను కానుకలేమీ ఇవ్వలేదు. నేను మొదటిసారి నామకరణంలో పాల్గొన్నది. ఇక ముందు ఎవరైనా నామకరణానికి పిలిస్తే ఈ పొరపాట్లు చేయకూడదని నిశ్చయించుకున్నాను.

కొలంబస్‌కు ప్రయాణం

మాంట్రియల్ సమీపంలో ఉన్న ఒకటి రెండు ప్రదేశాలను చూసి, ఇద్దరు ముగ్గురు పూర్వ విద్యార్థులను కలిసి, నయాగరా జలపాతాన్ని కెనడా అంచు (Canadian Border) నుండి చూశాను. ఆవైపు నుండి జలపాతం చాలా సుందరంగా కనిపిస్తుంది. కొలంబస్‌ లోని ఒహాయో విశ్వవిద్యాలయంలో చదివి డాక్టరేట్ పుచ్చుకున్న రోజే కొలంబస్‌ను వదిలి భారతదేశానికి తిరుగుముఖం పట్టాను. అప్పుడు మా ప్రొఫెసర్ ఎం. ఎల్. మోల్ గారికి వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు కావాలని కనిపించలేదు. (దీని గురించి ఇంతకు ముందే వివరించాను) అందువల్ల వారిని చూడాలి. అలాగే విశ్వవిద్యాలయాన్ని చూడాలి అనే కోరికతో కొలంబస్‌కు వెళ్ళాను. నాకు ఎలాంటి పాత కలయికలను మరచిపోవడం సాధ్యం కాదు. అది మన దేశం కాకపోయినా మూడు సంవత్సరాలు కొలంబస్‌లో ఉన్నాను, విశ్వవిద్యాలయంలో ఉన్నాను. కొలంబస్‌లో ఒక పూర్వ విద్యార్థి ఇంటిలో దిగి నేరుగా విశ్వవిద్యాలయానికి వెళ్ళి మా ప్రొఫెసర్‌ గారిని కలిశాను. వారు సంతోషంతో స్వాగతించారు. నా యోగక్షేమాలను విచారించారు. నా కడుపు పుండు గురించి అడిగారు. దానికి నేను Peaceful co-existence అంటే శాంతియుత సహజీవనం చేస్తున్నానని చెప్పినప్పుడు వారు నవ్వారు. అప్పుడు Peaceful co-existence అనే శబ్దప్రయోగం రాజకీయ రంగంలో విస్తృతంగా ఉపయోగించేవారు. రెండు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ప్రతిపాదించే దేశాలు పరస్పర ఘర్షణ లేకుండా శాంతియుతంగా ఉన్నప్పుడు ఆ శబ్దప్రయోగాన్ని వాడేవారు. అది ప్రధాని జవహర్ లాల్, రక్షణమంత్రి కృష్ణమేనన్ కాలం. అన్ని దేశాలతో శాంతియుత సహజీవనం నడపాలని వారి విదేశాంగ నీతి. రాజకీయంలో విస్తరించిన ఈ శబ్ద ప్రయోగాన్ని కడుపులోని అల్సర్‌కు సంబంధించినట్లుగా చెప్పినందుకు మా ప్రొఫెసర్‌కు సంతోషమయ్యింది. “పోయినసారి నేను కొలంబస్‌ను వదిలిన రోజు మీరు నాకు దొరకలేదు. అందువల్ల నా మనసుకు చాలా బాధ కలిగింది” అని తెలిపినప్పుడు వారు కూడా నన్ను కలవలేక పోయినందుకు ఏదో ఒక సాకును చెప్పారు. నేను పనిచేసిన ప్రయోగశాల, మిగిలిన కొన్ని క్లాసురూములు, విశ్వవిద్యాలయంలో నాకు పరిచితమైన లైబ్రరీ మొదలైన స్థలాలను చూశాను. నాకు పాఠాలు చెప్పిన ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లనూ కలిశాను. అప్పటి విద్యార్థులు ఎవరూ లేరు. అయితే డాక్టరేట్ కోసం నేనున్న చివరి సంవత్సరం వచ్చిన ఒక భారతీయ విద్యార్థి ఏడు సంవత్సరాలైనా అక్కడే ఉన్నాడు. ఇంకా డాక్టరేట్ రాలేదు. “ఎందుకు ఇంత ఆలస్యం చేశారు” అని అడిగినప్పుడు “భారతదేశానికి త్వరగా వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడే బాగుంది” అన్నాడు. ఎంతో మంది భారతీయ విద్యార్థుల అభిరుచులకు చాలా అనుకూలమైన దేశం కావడం వల్ల తమ చదువును ముగించడానికి నాలుగైదు సంవత్సరాలు తీసుకోవడం మామూలే.

ఇంతకు ముందు కొలంబస్‌లో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఒక అమెరికన్ దంపతుల ఇంట్లో ఉన్నాను. వారిని చూడటానికి వెళ్ళాను. అదొక ఊహించని సందర్శన. వారు చాలా ఆత్మీయంగా ఆహ్వానించారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. “నాకు తెలుసు నాకు తెలుసు మీరు పక్కా శాకాహారులు” అని చెబుతూ ఆ ఇంటి ఇల్లాలు శాకాహార తిండిని తెచ్చి ఇచ్చారు. నాకు ఇంకా జ్ఞాపకముంది దాని జతలో వారి తెచ్చి ఇచ్చిన ‘విటమిన్-సి’ టాబ్లెట్. దీనివల్ల అమెరికన్లు సమతుల్య ఆహారానికి ఎంత విలువనిస్తారో తెలుస్తున్నది.

కొలంబస్ నగరంలో రెండు మూడు రోజులుండి కార్బొండేల్ నగరానికి వెళ్ళాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించడానికి భౌతికశాస్త్రపు ఒక అధ్యాపకులు వచ్చారు. నేను అక్కడికి వెళ్ళడానికి ముందు నాకు వసతి సౌకర్యం కావాలని అక్కడి అధికారులకు ఉత్తరం వ్రాశాను. వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలని తెలిపాను. దాని ప్రకారం విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిలో టి.వి., టెలిఫోన్లు ఉన్నాయి.

తరగతిలో ప్రశ్నోత్తరాలు

నాకు పాఠం చెప్పడానికేమీ కష్టం కాలేదు. ఐతే క్లాసుకు వెళ్ళడానికన్నా ముందు బాగా చదువుకుని వెళ్ళాలి. అక్కడి విద్యార్థులకు పాఠం అర్థం కాకపోయినా, లేదా సబ్జెక్టులో ఏదైనా అనుమానం వచ్చినా ప్రశ్న అడిగే స్వభావం ఎక్కువ. అందువల్ల అధ్యాపకులు క్లాసులకు వెళ్ళేముందు బాగా చదువుకునే వెళ్ళాలి. పాఠం మధ్యలో విద్యార్థి చేయి పైకి లేపడం అపాయానికి చిహ్నం. ప్రశ్న అడగడానికి ముందు సూచన. వారి ప్రశ్నలకు మేము సమంజసమైన సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి. విద్యార్థికి దీనివల్ల తృప్తి కలగక పోతే ఇద్దరి మధ్యా ప్రశ్నోత్తరాలతో కూడిన సంవాదం నడుస్తుంది. ఒక్కోసారి మీరు చెప్పినదానిని నేను ఒప్పుకోను అని విద్యార్థి ఉపాధ్యాయులకు ధైర్యంగా చెబుతాడు. ఇలాంటి ఒక సంవాదం ఆత్మవిశ్వాసంతో నడవాలంటే విద్యార్థి కూడా బాగా చదువుకుని క్లాసుకు రావాలి. అధ్యాపకులకు విద్యార్థుల ప్రశ్నలు పరిప్రశ్నల వల్ల కోపం రాదు. సంతోషంతో, స్థిరంగా విద్యార్థిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. నా అభిప్రాయంలో క్లాసులో నడిచే, నడవాల్సిన చర్చయే ఉత్తమ విద్యావిధానానికి కేంద్రబిందువు. చర్చ లేకుండా కేవలం అధ్యాపకుల ఒక వైపునుండే పాఠం కొనసాగితే విద్య ఉద్దేశం నెరవేరదు.

అక్కడితో పోల్చితే మనవద్ద పాఠం చెప్పడం ఒక విధంగా సులభం. ఇక్కడ సాధారణంగా అధ్యాపకులకు, విద్యార్థులకు ఒక వ్రాయబడని ఒప్పందం (Unwritten understanding) ఉంది. విద్యార్థి తరగతిలో ప్రశ్న అడగడనే ధైర్యం ఉపాధ్యాయునికి ఉంది. అలాగే ఉపాధ్యాయుడు ప్రశ్న అడగడనే ధైర్యం విద్యార్థికీ. ఈ ఉభయ ధైర్యాలనుండి విద్యార్థి, అధ్యాపకులకు మనశ్శాంతి దొరికినా దీనివల్ల విద్యకు అఘాతం ఏర్పడుతుంది. సామాన్యంగా అధ్యాపకులు విద్యార్థులను ప్రశ్న అడగటాన్ని ప్రోత్సహించరు. ఇంటిలో తల్లిదండ్రులూ అంతే. ఇరుకునపెట్టే ప్రశ్నలను అడిగినప్పుడు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది. సహనాన్ని కోల్పోయే సందర్భాలు ఉంటాయి. సమాధానం తెలియదు. చదువుకుని వచ్చి రేపు చెబుతాను అని చెప్పే ఉపాధ్యాయులు మనదేశంలో చాలా తక్కువ. అమెరికాలో అధ్యాపకులు సమాధానం తెలియదు వచ్చే క్లాసులో చెబుతాను అని చాలా సులభంగా చెబుతారు.

ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఒక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. మన కాలేజీలలో అనేక విషయాలకు సంబంధించి విజ్ఞాన సంఘం, సాహిత్య సంఘం వంటివి ఉన్నట్లే అక్కడి విశ్వవిద్యాలయాలలో సంఘాలు ఉంటాయి. అయితే మా విశ్వవిద్యాలయంలో ఒక వినూత్న, అర్థవంతమైన ఒక సంఘం లేదా సమితి ఉంది. దాని పేరు Committee to invite controversial speakers అంటే ‘వివాస్పద వక్తలను ఆహ్వానించే సమితి’. ఆ సమితి ఉద్దేశం దాని పేరులోనే ఉంది. ఒకసారి ఆ సమితి ఒక నాజీ నాయకుడిని ప్రసంగించడానికి పిలిచారు. నాజీలు యూదులను, నీగ్రోలను ద్వేషిస్తారు. కాబట్టి సహజంగానే ఆ వివాదాస్పద ప్రసంగాన్ని వినడానికి నీగ్రోలు, యూదులు, శ్వేతజాతీయులు బహుసంఖ్యలో హాజరై హాలు నిండిపోయింది. అనుకున్నట్లే ప్రసంగం చాలా వివాదాస్పదంగా ఉంది. సాధారణంగా అక్కడి శ్రోతలు ఇలాంటి వివాదాత్మకమైన ప్రసంగాలనుండి సహనం కోల్పోరు. ఉపన్యాసం ముగియగానే ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే ఆ రోజు వక్త నీగ్రోలను, యూదులను చాలా భీకరంగా, నీచంగా తూలనాడాడు. దానితో కొంతమంది సహనాన్ని కోల్పోయారు. తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ గందరగోళంలో ఉపన్యాసం ముందుకు సాగలేదు. కార్యక్రమం హఠాత్తుగా ముగిసిపోయింది. ఇలా ముగియడం విశేషమేమీ కాదు. అయితే రెండు రోజుల తర్వాత విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ ప్రకటించే ఒక పత్రికలో ఈ ఉపన్యాసానికి సంబంధించి కొన్ని లేఖలు ప్రచురితమయ్యాయి. వాటి సారాంశం ఇలా వుంది – “మేము ఉపన్యాసం వినడానికి వచ్చాము. అయితే అది మధ్యలోనే హఠాత్తుగా నిలిచిపోయింది. మాకు కొన్ని సందేహాలున్నాయి. వారి నుండి తగిన సమాధానం తెలుసుకోవాలి. అందువల్ల సంబంధిత అధికారులు వారిని మళ్ళీ పిలవాలి.” ఇది చదివి నాకైతే చాలా సంతోషమయ్యింది. అక్కడి ప్రజలు ప్రశ్నోత్తరాలను ఎంత సీరియస్‌గా పరిగణిస్తారనేది దీనివల్ల బోధపడుతుంది.

అదే ఉప్మా

నా దినచర్య ఉదయం వీలైనంత త్వరగా లేవడంతో మొదలవుతుంది. చలికాలం కాకపోతే ఉదయపు వాకింగ్ సాయంత్రపు వాకింగ్ కన్నా ఎక్కువ. నన్ను 8-10 యేళ్ళ క్రితం మూడేళ్ళు కాపాడిన ఉప్మాయే ఇప్పుడు నా ముఖ్యమైన ఆహారం. ఈసారి నాకు కావలసినంత సమయం దొరికినా పులుసు, చారు, కూర లేక వేరే వంటకాలు చేసుకోవడం ఇష్టం లేకపోయింది. ప్రయత్నమూ చేయలేదు. మొదటి నుండీ నాకు రుచిపట్ల ఉదాసీనత. భోజనం ఒక రకంగా ఔషధం అని నా అభిప్రాయం. ఆరోగ్యానికి నేను ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవాడిని. ఇంతకు ముందు నేను అమెరికాలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు అక్కడి విద్యావిధానం స్థూలంగా తెలుసు. నేను పాఠం చెప్పాల్సిన తరగతులు ఇక్కడి బి.ఎస్.సి. స్థాయివి. వారానికి 10 గంటలు మాత్రం ఉపన్యాస తరగతులు (Lecture classes). ప్రయోగ తరగతికి (Practical Class) వెళ్ళేముందు ఆ విషయం గురించి ఒక గంటకన్నా ఎక్కువ ముందస్తు తయారీ కావలసివుంది. తరగతిలో విద్యార్థుల సంఖ్య సుమారు 20-30. వారానికి 10 గంటలు పాఠంతో పాటు ఒకటిరెండు సెమినార్లు నడిచేవి. ఇంతయినా నాకు చాలా విరామ సమయం దొరికేది. దానిని భౌతికశాస్త్రం, విజ్ఞానం, విద్యాపద్ధతి ఇంకా మిగిలిన పుస్తకాలను చదవడానికి వినియోగించేవాడిని. మొదటినుండీ నాకు ఎవరూ అమెరికన్ స్నేహితులు లేరు. ఉండటానికి అవకాశమూ లేదు. అలవాట్లలో ఇరువురికీ అజగజాంతరం.

విద్యార్థి స్నేహితురాలు

ఒక సారి ఒక విద్యార్థి “నా స్నేహితురాలిని క్లాసుకు పిలుచుకు రావచ్చా” అని అడిగాడు. “సరే” అన్నాను. పాఠం అయిన తరువాత బయటకు వెళ్ళేటప్పుడు “నా పాఠం ఎలావుంది” అని ఆవిడను యాదృచ్ఛికంగా అడిగాను. “నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు” అని నిస్సంకోచంగా చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. మనసు నొప్పించింది. చేయి చూపించి అవలక్షణాన్ని చెప్పించుకున్నట్టయ్యింది కదప్పా అనుకున్నాను. మా కాలేజీలో నన్ను అంత చెడ్డ ఉపాధ్యాయుడు అని ఎవరూ అనలేదు. ఇక్కడ కూడా అదే అభిప్రాయం ఉంది. అందువల్ల ఈమె ఎందుకలా చెప్పారు అని ఆలోచించి, కొంచెం ధైర్యం చేసి “మీరు ఏ సబ్జెక్ట్‌లో విద్యార్థిని” అని అడిగాను. దానికి ఆమె దైహిక శిక్షణ (Physical) అని చెప్పినప్పుడు నేను నెమ్మదిగా నిట్టూర్చాను. పిజిక్స్‌కూ ఫిజికల్ కల్చర్‌కూ అసలు సంబంధం లేదు. అందువల్ల సహజంగానే ఆమెకు నేను చెప్పిన ఒక పదమూ అర్థం కాలేదు.

వాపసు వెళ్తాను

అదే సంవత్సరం మా కాలేజీ మరియు విద్యార్థి నిలయంలో ఉన్న ప్రతిభావంతుడైన విద్యార్థి కె. సుబ్బరావు (ఇప్పుడు డా. కె. సుబ్బరావు) సెంట్రల్ కాలేజీలో ఎం.ఎస్.సి. ముగించి నేను చదివిన విశ్వవిద్యాలయంలో చదవడానికి కొలంబస్‌కు వచ్చారు. వారి ఈ ఉన్నత చదువుకు నేనూ కొంత మార్గదర్శనం చేశాను. కొలంబస్‌కు వచ్చి వై.ఎం.సి.ఎ.లో దిగినారు. వచ్చిన రోజు రాత్రే నాకు ఫోన్ చేసి “సార్, నాకు చాలా బేజారుగా ఉంది. ఈ దేశం నాకు సరిపోవడం లేదు. నేను వాపసు వెళ్ళిపోతాను” అంటూ కలవరపడుతూ చెప్పారు. “గాభరా పడకండి, ముందు అంతా సరిపోతుంది” అని సమాధానపరిచి కార్బొండేల్ నుండి ఆపరేటర్ ద్వారా నేను కొలంబస్‌లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలున్న హెన్రీమేటర్స్ గారి ఫోన్ నెంబరు, అడ్రస్‌ను తీసుకున్నాను. “నా విద్యార్థి కొలంబస్‌కు చదువుకోవడానికి వచ్చాడు. మీవద్ద నేనున్న గది ఖాళీగా ఉంటే అతనికి ఇవ్వండి” అని ఫోన్ చేసి అడిగాను. “ఖాళీగా ఉంది. అతడిని పంపండి” అన్నారు. మళ్ళీ సుబ్బరావుకు ఫోన్ చేసి “మీరు ఉండటానికి ఒక అద్దె గదిని చూసిపెట్టాను. ఇంతకు ముందు అక్కడే నేను రెండు సంవత్సరాలు ఉన్నాను. అక్కడికి వెళ్ళప్పా” అని ఇంటి అడ్రసు, ఫోన్ నెంబరు ఇచ్చాను. అప్పుడు సుబ్బరావు ఆ ఇంటికి వెళ్ళిందీ అయ్యింది, చదివిందీ అయ్యింది. అమెరికాకి వచ్చిన రోజే వెళ్ళిపోతానని కలవరంగా చెప్పిన విద్యార్థి డా. సుబ్బరావు అయిన తరువాత ఇప్పటి వరకూ అమెరికాలో హాయిగా పనిచేస్తూ ఉన్నారు.

అనుమానం

నాకు బెంగళూరులో నా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులతో ఎక్కువ సంబంధాలు ఉన్నందువల్ల వారంతా అప్పుడప్పుడూ ఉత్తరాలు వ్రాసేవారు. ప్రతిరోజూ ఐదారు ఉత్తరాలు వచ్చేవి. దీనిని కొందరు నమ్మక పోవచ్చు. ఆఫీసులో పనిచేసే ఒక అధికారిణి వచ్చిన ఉత్తరాలను వింగడించి ప్రతి ఒక అధ్యాపకుని గూటిలో పెట్టేవారు. ఒకరోజు నేను ఉత్తరాలను తీసుకుంటున్నప్పుడు ఆమె “డా. నరసి, నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అడగనా?” అన్నారు. “ఫరవాలేదు అడగండి” అన్నాను. “మీరు గృహస్థులు కారు అని విన్నాను. అయినా మీకు ప్రతి రోజు అన్ని ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తాయి?” అంటూ కుతూహలంతో అడిగారు. “మా విద్యార్థుల నుండి, స్నేహితుల నుండి” అన్నప్పుడు ఆవిడ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. నాకు ప్రతి రోజు రాత్రి ఉత్తరాలకు బదులు వ్రాయడమే ముఖ్యమైన పని.

పానకం

నాకు మొదటినుండీ మా కాలేజీ విద్యార్థులపై విశేషమైన అభిమానం ఉండేది. విద్యార్థులకు నేను ఇప్పించిన తిండి ఇక ఎవరూ ఇప్పించలేదు అని ధారాళంగా చెప్పవచ్చు. మిగిలిన వారు ఇప్పించనూ లేదు. రోజూ సాయంత్రం ఆటలు ముగిసిన తరువాత పక్క అంగడిలో తిండి, ఏడాది చివరలో క్లాసులో నేను తీసుకున్న తరగతులలోని వారికంతా తిండి తినిపించేవాణ్ణి. చాలా సార్లు నేను తీసుకున్న సబ్జెక్టులలో నేనే టెస్ట్ పెట్టేవాడిని. అప్పుడు ఎన్నోసార్లు తిండి ఇప్పించాను. ఐతే తిండి ఇప్పిస్తానని ముందే చెప్పేవాడిని కాదు. ఒకరోజు మార్చి నెలలో అనుకుంటాను. వేసవి మొదలయ్యింది. మధ్యాహ్నం ఒక టెస్ట్ పెట్టాను. “నీళ్ళు కావాలి సార్” అని ఒక విద్యార్థి అడిగాడు. అటెండర్‌ను అది ఇమ్మన్నాను. ఒక లోటాలో దాన్ని తెచ్చి విద్యార్థి ముందు బెంచి పైన పెట్టాడు. అతడు వెంటనే దాని వైపు చూడలేదు. రెండు నిముషాల తరువాత నీళ్ళు త్రాగడానికి లోటా తీసుకున్నాడు. అతడు తబ్బిబ్బుతో “ఏయ్ పానకం రా పానకం” అన్నాడు. అందరూ ప్రశాంతంగా వ్రాస్తున్నప్పుడు అతడు తన ఉత్సాహాన్ని ఆపుకోవడానికి సాధ్యం కాక అరిచాడు. అందరూ తలెత్తారు. “నాకూ నీళ్ళు కావాలి, నాకూ నీళ్ళు కావాలి” అనే విడివిడి అయిన అభ్యర్థన సామూహిక స్వరూపాన్ని దాల్చింది.

“ఆశ్చర్యం, అందరికీ ఒకేసారి దప్పిక అయ్యింది” అని నవ్వుతూ “ఈ పానకం మీ కోసమే చేయించింది. దప్పిక కానీ, కాకపోనీ అందరికీ పంచబడుతుంది” అన్నాను. నాకు ఎప్పుడూ విద్యార్థులకు, పిల్లలకు తిండి తినిపించాలనే ఆశ. విద్యార్థి నిలయం విద్యార్థులకంతా ఏడాదికి రెండుమూడు సార్లు తిండి ఇప్పించేవాడిని.

నేను ముందే చెప్పినట్టు సుమారు 1000 మంది విద్యార్థులు దూరంగా ఉన్న విమానాశ్రయానికి వచ్చి నన్ను అమెరికాకు సాగనంపారు. అమెరికాలోనూ నా విద్యార్థుల యోగక్షేమాల గురించే నా ఆలోచన. ఇదంతా మనసులో పెట్టుకుని కాలేజీలోని అందరు విద్యార్థులకూ ముఖ్యంగా వారంతా బాగా చదువుకోవాలని ఒక ఉత్తరం వ్రాశాను. ఉత్తరం ఒకటే; అయితే ఎంతమంది విద్యార్థులున్నారో అన్ని ప్రతులను అక్కడే తీయించి ఒక్కొక్క విద్యార్థికీ ఇవ్వమని ప్రిన్సిపాల్‌కు పంపాను. కొందరు విద్యార్థులు ఇప్పుడూ ఆ ప్రతిని తమ వద్ద జాగ్రత్తగా పెట్టుకున్నారు!

ప్రామాణికత

ఒక రోజు టి.వి.లో ఒక విద్యా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాను. ఒక ప్రొఫెసర్‌తో ఇంటర్వ్యూ. ప్రశ్నోత్తరాలు అన్నీ అక్కడే. “మీ అభిప్రాయంలో దేనివల్ల అమెరికా ప్రాముఖ్యతను సాధించింది?” (In your opinion what is the greatness of America?) అని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. దానికి ఆ ప్రొఫెసర్ వెంటనే “పర్యవేక్షణ లేకుండా పనిచేయడమే అమెరికా అత్యంత మహత్వమైన గుణం”(The greatness of America consists in working without supervision) అని బదులిచ్చారు. ఇది నా మనసులో ముద్రవేసింది. దీనిని నేను అనేక సార్లు నా ప్రసంగాలలో ఉపయోగించాను. మన దేశంలో ఒక వ్యాఖ్యాత ఒక ప్రొఫెసర్‌ను ఇలాంటి ప్రశ్న అడిగితే వారి అంతులేని సమాధానం ఉపనిషత్ కాలం నుండి మొదలై మనది ధర్మభూమి, ఆధ్యాత్మికతకు పేరొందిన భూమి అని బడాయి చెప్పుకోవడంతో ప్రారంభిస్తారు. ఆ అమెరికన్ ప్రొఫెసర్ ఒకే ఒక వాక్యపు సమాధానం ఎక్కువ ముఖ్యమైనది. మన దేశంలో పనిచేసేవారికన్నా పర్యవేక్షకులే ఎక్కువ ఉంటారు.

చర్చి

చర్చీలలో ప్రార్థన ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలన్న కోరిక, కుతూహలం కలిగింది. కార్బొండేల్ నగరంలో ఒక పెద్ద వీధిలో వివిధ శాఖలకు చెందిన ఐదారు చర్చ్‌లు ఉన్నాయి. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చర్చికి వెళ్ళేవాణ్ణి. దీన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించిన ఒక అమెరికన్ “మీరు చాలా బుద్ధిమంతులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చర్చ్‌కు వెళుతున్నారు. మేము చర్చ్ మార్చము. మీకు అన్ని చర్చ్‌లు ఒకటే అని అనిపిస్తుంది” అన్నారు. నాకు ఏ చర్చ్ మీద నమ్మకం లేదు. ఒకరకంగా అన్ని చర్చ్‌లు ఒకటే అని మనసులో అనుకొని వారి చెప్పినదానికి నవ్వి ఊరుకున్నాను.

మన దేవస్థానాల కార్యక్రమాలకు, చర్చీలలోని కార్యక్రమాలకు చాలా తేడా ఉంది. మన ప్రవచనాలలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం మొదలైన ఎవరికీ తెలియని, అక్కడ చెప్పేవారికి కూడా తెలియని విషయాలపై పుంఖానుపుంఖంగా మనవారు మాట్లాడుతారు. చర్చిలో 10-15 నిముషాలు ప్రార్థన చేసి, బైబిల్ లోని ఒక అధ్యాయాన్ని చదివి, వ్యాఖ్యానించిన తరువాత చర్చి ఫాదర్ సమాజానికి అవసరమైన ఏదో ఒక అంశం మీద సుమారు అర్ధగంట మాట్లాడుతారు. ఒకసారి రోడ్డు ప్రమాదాలపై మాట్లాడారు. మన పండితులు ఆకాశంలో విహరిస్తారే వినా భూమిపైకి, రోడ్లపైకి దిగే సంభవం తక్కువ. అక్కడ చర్చ్ ఒక సామాజిక కూటమి (Social gathering)కి కేంద్రం. వారానికొకసారి అదొక స్నేహ సమ్మేళనం. చర్చ్ జీవిత భాగస్వాములను వెదుకడానికి ఒక సరైన స్థలం.

యాత్ర

డిసెంబర్ నెలలో అమెరికా పశ్చిమ దిక్కులో ఉన్న, నేను ఇంతకు ముందు చూసిన స్థలాలను ఇంకొకసారి సందర్శించాను. వెనుకటి మాదిరి రైలు లోనే ప్రయాణం. అనేక మంది పూర్వ విద్యార్థులను కలిసాను. మా కాలేజీ రజతోత్సవాలకు కొంత డబ్బు సేకరించగలిగాను. వెనుదిరిగినప్పుడు డెన్వర్ గుండా బౌల్డర్‌కు వెళ్ళాను. నా విద్యార్థి అయిన ప్రొ. కె. టి. మహంతప్ప గారు అక్కడ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వారు ప్రతిభావంతులైన విద్యార్థి మరియు నిజాయితీకి, దక్షతకు పేరుగాంచిన ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ స్వర్గీయ కె. తిప్పేరుద్రయ్య గారి కుమారుడు. వీరి పేరును ఎందుకు ప్రస్తావించానంటే అలాంటి అధికారులు ఇప్పుడు అపురూపం. మహంతప్పగారితో, వారి భార్యతో ఒక రోజు రాత్రి చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడిన తరువాత పడుకున్నాము. వారికొక చిన్న పాప ఉంది. రాత్రి నాకు అంతగా నిద్ర పట్టలేదు. ఆ పాపకు హుషారుగా లేదు. పాప ఏడ్చినప్పుడంతా పక్క రూములో ఉన్న తల్లి ఆ పాపను జోకొడుతూ ఉన్నారు. అప్పుడు మా తల్లి గారే జ్ఞాపకం వచ్చారు. బీదరికం నుండి వచ్చిన మా తల్లి నన్ను పెంచడానికి ఎంత కష్టపడి వుండాలి? తల్లి ఋణం తీర్చుకోవడం అసాధ్యం.

అమెరికాలోని రామకృష్ణాశ్రమాలు

రామకృష్ణాశ్రమం అంతర్జాతీయ ధార్మిక సంస్థ. దీనిని స్థాపించినవారు స్వామీ వివేకానంద గారు. స్వామీ వివేకానంద గారు 1896వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో చికాగో పట్టణంలో నడిచిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో హిందూధర్మ ప్రతినిధిగా పాల్గొన్నారు. వారికి అక్కడ లభించిన స్వాగతం, కీర్తి సత్కారాలు అమెరికా దేశంలో వేదాంత ప్రచారానికి పునాదులయ్యాయి.

చికాగో ఆశ్రమం

నేను అమెరికాలో విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు చాలా రామకృష్ణాశ్రమాలను సందర్శించాను. భారతదేశపు రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో 1931వ సంవత్సరంలో ‘వివేకానంద వేదాంత సొసైటీ’ అనే సంస్థను చికాగోలో ఒక చిన్న అద్దె ఇంటిలో స్థాపించారు. 1965లో కొనుక్కొన్న ఒక పెద్ద భవనంలో ఈ సంస్థ పని చేస్తున్నది. నేను వెళ్ళినప్పుడు అక్కడ స్వామి భాష్యానంద గారు ఆశ్రమపు అధ్యక్షులు. అక్కడ నలుగురు బ్రహ్మచారులున్నారు. వారందరూ అమెరికన్లే. వారు అంతకుముందు క్యాథలిక్ మతానికి చెందినవారు. నేను వెళ్ళినరోజు వివేకానందుని బ్రహ్మోత్సవాన్ని మామూలు ప్రార్థన, ఉపన్యాసాలతో ఆచరించారు. చాలా మంది అమెరికన్లు ఆశ్రమ కార్యక్రమాలలో పాల్గొనేవారు.

ఈ కేంద్రంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయంపై అక్కడి ఒక స్వామీజీ నుండి ఉపన్యాసం ఉంటుంది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం శ్రీమద్భగవద్గీత, నారద భక్తి సూత్రాలపై ప్రవచనాలు; బుధవారం సాయంత్రం ధ్యానం గురించిన ప్రసంగాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలతో పాటు స్కూలు, కాలేజీ, చర్చ్‌ లలో వేదాంతము, భారతీయ సంస్కృతులపై ఉపన్యాసాలు ఇవ్వడానికి స్వామీజీలకు పైపైన ఆహ్వానాలు వస్తూనే ఉంటాయి.

సెయింట్ లూయిస్ ఆశ్రమం

ఇక్కడ వేదాంత ప్రచారం సుమారు 1938వ సంవత్సరంలో మొదలయ్యింది. అప్పుడు స్వామి సత్యప్రకాశానంద భారతదేశపు రామకృష్ణ మిషన్ ప్రతినిధులుగా ఉన్నారు.

సెయింట్ లూయిస్ పట్టణంలో నా పూర్వ విద్యార్థి డా. ఎం. ఆర్. చిదంబర అక్కడి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. సెయింట్ లూయిస్ నేనున్న కార్బొండేల్ పట్టణానికి సుమారు 90 మైళ్ళ దూరంలో ఉంది. 1968 మార్చినెల 10వ తేదీ సెయింట్ లూయిస్ వివేకానంద వేదాంత కేంద్రంలో రామకృష్ణ పరమహంస జన్మోత్సవం ఉంది రమ్మని డా. చిదంబర గారు నాలుగైదు రోజుల క్రితం ఫోన్ చేశారు. అంగీకరించి వెళ్ళాను. ఆ రోజు కార్యక్రమం స్వామి సత్యప్రకాశానంద గారి ప్రార్థనతో మొదలయ్యింది. తరువాత రామకృష్ణ పరమహంస గురించి వారే ప్రసంగించారు.

సత్యప్రకాశానంద స్వామీజీ యథాప్రకారం ఒక అద్దె ఇంటిలో వేదాంత కేంద్రాన్ని ప్రారంభించారు. అది బాగా పనిచేస్తూ వచ్చింది. ఆ పట్టణంలో సుమారు 200 మందికి వేదాంతంపై నమ్మకముంది. సెయింట్ లూయిస్ పట్టణానికి పశ్చిమంవైపు సుమారు 120 మైళ్ళ దూరంలో ఉన్న కాన్సాస్ పట్టణంలో రోజురోజుకూ వేదాంతాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతున్న కారణంగా అక్కడా ఒక కేంద్రాన్ని స్థాపించే సూచనలు కనిపించాయి.

అదే సమయంలో సెయింట్ లూయిస్ పట్టణంలో అకస్మాత్తుగా ఇంకొక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటయింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారులు శ్రీ యు. ఎస్. కృష్ణరావు, శ్రీమతి చంద్రభాగాదేవి దంపతుల నృత్య కార్యక్రమం ఉంది. అదొక సంతోషాన్నిచ్చే ఊహించని కార్యక్రమం. ఆ దంపతులతో నాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం ఉంది. భరతనాట్యం చాలా బాగా ఉంది. ఒక్కొక్క నృత్యాన్ని చేసేముందు యు. ఎస్. కృష్ణరావు లేదా చంద్రభాగాదేవి దాని వివరణను సూక్ష్మంగా తెలిపారు. అమెరికన్లకు ఆ నృత్యం సంతోషపెట్టి ఉండాలి. పైగా ఆ దంపతుల వేషధారణ వారిని ఆకర్షించింది. సభలో ఎక్కువగా భారతీయులున్నారు.

కాలిఫోర్నియాలో వేదాంతం

స్వామి వివేకానందగారు 1896లో వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థను న్యూయార్క్ పట్టణంలో స్థాపించారు. 1900లో వేదాంత సొసైటీ ఆఫ్ కాలిఫోర్నియా అనే సంస్థను శాన్‌ఫ్రాన్సిస్కో పట్టణంలో మొదలుపెట్టారు. కాలానుక్రమంగా శాన్‌ఫ్రాన్సిస్కోకు 15 మైళ్ళ దూరంలో ఉన్న బర్క్‌లీలో, 100 మైళ్ళ దూరంలో ఉన్న శాక్రమెంటో నగరంలో మాతృసంస్థకు అంగాలుగా వేదాంత కేంద్రాలు వెలిశాయి. ఆశ్రమవాసుల, వేదాంతములో ఆసక్తి ఉన్నవారి ఉపయోగార్థం ఒక శాంతిధామాన్ని నిర్మించడానికి ఒలిమా ప్రదేశంలో సుమారు 2000 ఎకరాల స్థలాన్ని కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో వేదాంత కేంద్రంలో ఐదు రోజులు ఉన్నాను. నేను విద్యార్థిగా అమెరికాకు వచ్చినప్పుడు ఆ ప్రదేశాలను సందర్శించానని ఇంతకు ముందే ప్రస్తావించాను. శాన్‌ఫ్రాన్సిస్కో లో ఉన్నప్పుడు అక్కడి స్వామి శ్రద్ధానందజీ గారితో బర్క్‌లీ కేంద్రం, శాక్రమెంటో కేంద్రం, ఒలిమా శాంతిధామాలను సందర్శించే అవకాశం దక్కింది. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంలో సుమారు 200 మంది సభ్యులున్నారు.

దక్షిణ కాలిఫోర్నియాలో కుడా వేదాంత ప్రచారం సుమారు అదే సమయంలో మొదలయ్యాయని చెప్పవచ్చు. అయితే అది వేళ్ళూనడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. స్వామీ వివేకానంద గారు 1900వ సంవత్సరంలో లాస్ఏంజలీస్‌కు 20 మైళ్ళ దూరంలో ఉన్న పాసడేన్ అనే ఒక చిన్న ఊరిలో ఒకటిన్నర నెలలు నివసించారు. 1930లోనే ‘వేదాంత సొసైటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా’ అనే సంస్థను హాలీవుడ్‌లో ప్రారంభించారు. తరువాత కొన్ని సంవత్సరాలకు లాస్ ఏంజలీస్‌కు 60 మైళ్ళ దూరంలో ట్రెబుకూ ఆశ్రమం స్థాపించబడింది.

దీనికి సుమారు 150 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడే విఖ్యాత రచయిత, చింతనాశీలి ఐన ఆల్డస్ హాక్స్లి గారు తమ The Perennial Philosophy అనే గ్రంథాన్ని రచించారు.

అమెరికాలోని అన్ని వేదాంత కేంద్రాలు భారతదేశంలోని రామకృష్ణ మఠం ఆధీనంలో ఉన్నాయి.

కొత్త సంవత్సరపు అనుభవం

1967వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ నేను నివాసముంటున్న కార్బొండేల్ ఊరిని వదిలి చికాగో, బోల్డర్, సాల్టర్, సాల్ట్ లేక్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలీస్ మొదలైన ప్రదేశాలను చూసుకొని మళ్ళీ మా ఊరికి సుమారు 20 రోజుల తరువాత వెనుదిరిగాను. లాస్ఏంజలీస్ పట్టణాన్ని డిసెంబర్ 29వ తేదీ రాత్రి 9 గంటలకు రైలులో వదిలాను. నేనున్న డబ్బాలో రైల్వే కండక్టర్‌ను కలుపుకుని కేవలం ఇద్దరున్నారు. రెండు రోజులు భోజనం లేక ప్రయాసతో కూడిన ప్రయాణం వల్ల అలసి పోయి చప్పగా కూర్చున్నాను.

సుమారు రాత్రి 12.30 గంటలకు కొంత దూరంలో కూర్చున్న ఒక ప్రయాణీకుడు నా వద్దకు వచ్చి “నూతన సంవత్సర హార్ధిక శుభాకాంక్షలు” అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

“చాలా ధన్యవాదాలు. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని చెప్పాను.

శుభకామన

అతడు జేబులో నుండి ఒక సీసాను తీసి నా చేతిలో పెట్టడానికి వచ్చారు. విచారించిన తరువాత ఆ సీసాలో ఉన్నది ‘రమ్’ అనే మాదకద్రవ్యమని తెలిసింది. నేను ఎటువంటి మద్యాన్నీ త్రాగనని చెప్పాను. దానికతడు “ఎక్కడైనా ఉందా? కొత్త సంవత్సరం ఇప్పుడే మొదలయ్యింది. దీనిని బాగా జరుపుకోవాలంటే ఇలాంటి పానీయాన్ని తాగితీరాలి” అంటూ బలవంతం చేయసాగారు.

“లేదు. నేను నా జీవితంలో త్రాగలేదు. కొత్త సంవత్సరం అని నాకూ సంతోషంగానే ఉంది. దీర్ఘప్రయాణాల వల్ల అలసిపోయానంతే. మీ సంతోషంలో నేనూ భాగం పంచుకుంటున్నాను. అయితే క్షమించాలి. త్రాగే అలవాటు నాకు లేదు” అని శాంతంగా బదులు చెప్పాను.

అంతలో మా సంభాషణ విని రైల్వే కండక్టర్ కూడా మా వద్దకు వచ్చారు. ఆ ప్రయాణీకుడు నన్ను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు.

“మీరు త్రాగకపోతే అమెరికా దేశాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. అందువల్ల కొంచెమైనా తాగాల్సిందే” అంటూ మళ్ళీ పాతపాటే పాడారు.

“నా వ్యక్తిగత అభిప్రాయాలకు మీరు మర్యాదనివ్వడం సమంజసం కాదా? నేను త్రాగకపోతే అమెరికా దేశానికి అవమానం అన్న మీ వాదం నాకు అర్థం కాలేదు” అంటూ కొంచెం అసహనంగా చెప్పాను. ఇదంతా వింటున్న రైల్వే కండక్టర్ శ్రీ ల్యారీ “మీరు భారతీయులా?” అని అడిగారు. అవునన్నాను.

ఏమాశ్చర్యం!

వారు ఆ యువకుడి వైపు చూసి “వీరిని అలా త్రాగడానికి బలవంతం చేయకండి. భారతీయులలో కొందరు త్రాగరు. నేను 1952వ సంవత్సరంలో అమెరికా నౌకాదళంతో పాటు సింహళ ద్వీపంలో ఉన్నపుడు ఈ విషయాలు తెలుసుకున్నాను. బొంబాయిలో కూడా మూడు రోజులున్నాను” అన్నారు. ఇది విన్న తరువాత ఆ యువకుడు సీసాను తన జేబులో పెట్టుకుని మన దేశానికి, ధర్మానికీ, నాకూ సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగారు. ఆ యువకుని పేరు డోనాల్డ్. అమెరికా వాయుదళంలో సార్జెంట్‌గా పనిచేస్తున్నారు.

“మీరు పుట్టినప్పటి నుండి ఏ మాదక ద్రవ్యాన్నీ తాగనే లేదా? ఏమి ఆశ్చర్యం! నేను ఇంతవరకు ఇలాంటివారిని చూడనే లేదు” అన్నారు.

రైల్వే కండక్టర్ ల్యారీ గారు “మీరు బౌద్ధ మతస్తులా? లేక హిందువులా?” అని అడిగారు. “హిందూ” అన్నాను. “గోమాంసం తినరు కదా?” అనేది ల్యారీగారి తరువాతి ప్రశ్న. “నేను ఏ మాంసమూ తినను” అన్నాను. శ్రీ డోనాల్డ్ గారు ఆశ్చర్యంతో “హా! మాంసమే తినరా? కోడి తినరా? కోడి తింటారా?” అని అడిగారు.

“మాంసాన్నే తిననప్పుడు కోడిని ఎట్లా తినడానికి ఔతుంది. కోడీ మాంసమే కదా?” అంటూ నవ్వుతూ చెప్పాను.

“పోనీ చేపలు తింటారా?”

“లేదు. అవన్నీ మాంసం గుంపుకు చేరినవి.”

వారి మరో ప్రశ్నకు “నాకు పెళ్ళి కాలేదు” అని సమాధానం చెప్పాను.

ఎందుకు బ్రతికున్నారు?

“ఏ విధమైన మాంసాన్నీ తినరు. యే మాదక ద్రవ్యాన్నీ సేవించరు. పెళ్ళి చేసుకోలేదు. ఆశ్చర్యం! ఆశ్చర్యం!! ఎలా బ్రతికున్నారు? ఎందుకు బ్రతుకున్నారు?..”

“చూడండి. బాగానే బ్రతికున్నాను. నా ఈ వయసుకు ఆరోగ్యం బాగానే ఉంది అని భావిస్తున్నాను. మీ రెండవ ప్రశ్న ‘నేను ఎందుకు బ్రతికున్నాను?’ అని. ఈ విషయాన్ని నేను చాలా సంవత్సరాలనుండి ఆలోచిస్తున్నాను. ఇంకా సమాధానం దొరకలేదు” అని చెప్పాను.

“ఏమీ అనుకోకండి. ఎందుకు బ్రతికున్నారు అని అడగటంలో నా ఉద్దేశం, మనిషి తాగకుండా, మాంసం తినకుండా, పెళ్ళి చేసుకోకుండా ఉన్న తరువాత బ్రతికి ఏమి ప్రయోజనం అనే అర్థంలో అడిగాను” అని సర్దిచెప్పే ధోరణిలో చెప్పారు.

రైల్వే కండక్టర్ ల్యారీగారు “మీకు పునర్జన్మలో నమ్మకం ఉందా?” అని అడిగారు. “ఉంది” అన్నాను. వెంటనే డోనాల్డ్ “ఓహో! ఇప్పుడు తెలిసింది మీరు ఎందుకు మాంసం తినరు అని. కోడినో, గొర్రెనో తింటే చనిపోయిన మీ తాత లేదా అవ్వను తిన్నట్టు అవుతుందికదా?” అన్నారు.

“తాత కాదు, అవ్వా కాదు. నాకు హింసలో నమ్మకం లేదు.”

“ఇదంతా హిందూ ధర్మమేనా?”

“పునర్జన్మ హిందూ ధర్మానికి చెందినది. అయితే మాంసం తినడం, మద్యం త్రాగడం హిందూ ధర్మానికి చెందినది కాదు అని భావిస్తాను. చాలా మంది హిందువులు మాంసాన్ని తింటారు. కొందరు మద్యాన్నీ త్రాగుతారు. ఇదంతా వారి వారి పద్ధతి, అలవాటు, ఇష్టాలకు సంబంధించింది.”

చిత్రవిచిత్రమైన జనాలు

“మీకు హింసలో నమ్మకం లేదు అన్నారు కదా. మీరు సైన్యంలో చేరితే ఏమిచేస్తారు?” అనేది శ్రీ ల్యారీగారి ఇంకో ప్రశ్న.

దీని అర్థం ఇప్పుడు అమెరికా దేశంలో వియత్నాం యుద్ధం సంబంధించి అందరు యువకులు రెండేళ్ళు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాలి అనే నిబంధన ఉంది. అలాగే ఇండియాలో కూడా ఇలాంటి నిర్బంధ మిలటరీ శిక్షణ ఉందని భావించారు.

“ఆ ప్రశ్న నా విషయంలో ఉద్భవించదు. నాకు ఆ వయసు మీరింది. అలాంటి పరిస్థితి కూడా మా దేశంలో ఇప్పుడు లేదు. నాకు హింసలో నమ్మకం లేదు. నాకు చంపడం చేతకాదు” అనే విధంగా చెప్పాను.

“ఈ క్రొత్త సంవత్సరం నాకు చాలా క్రొత్తగా మొదలయ్యింది. నేను ఎప్పుడూ ఇలాంటి మనుషులను చూడనే లేదు. నేను మిమ్మల్ని త్రాగడానికి బలవంతం చేసినందుకు దయచేసి ఏమీ అనుకోకండి. నాకు ఈ విషయాలన్నీ తెలియవు. ప్రపంచంలో చిత్రవిచిత్రమైన ప్రజలుంటారు. మరోసారి మీకు హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని రెండు చేతులతో నా చేతిని చాలా ఆత్మీయంగా ఊపి నేను దిగాల్సిన స్టేషన్‌కు ముందు స్టేషన్‌లో శ్రీ డోనాల్డ్ దిగిపోయారు.

ఈ అనుభవం నాకూ చాలా కొత్తది. దాన్నే ఆలోచిస్తూ 1968 జనవరి 1వ తేదీ తెల్లవారు ఝాము రెండు గంటలకు ‘మా వూరు’ చేరాను. లాస్ఏంజలీస్ వదిలినప్పుడు ఉష్ణోగ్రత 65o. కార్బొండేల్ చేరినప్పుడు ఉష్ణోగ్రత 3o!

రవిశంకర్ సితార్

బోరు కొట్టినప్పుడు సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న డా. చిదంబర దంపతులతో మాట్లాడేవాణ్ణి. ఒక రోజు రాత్రి డా. చిదంబర ఫోన్ చేసి “సార్ ఇక్కడ (సెయింట్ లూయిస్‌లో) పండిట్ రవిశంకర్ సితార్ వాదన వచ్చే ఆదివారం ఉంది. ముందుగానే టికెట్లు తీసుకుంటాను. మీరు తప్పకుండా రండి. మీ బేజారు తక్కువ కావచ్చు” అన్నారు. ఒప్పుకుని సెయింట్ లూయిస్‌కు వెళ్ళాను. డా. చిదంబర, వారి శ్రీమతి మాలతి మరియు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాము.

సుమారు 3000 కన్నా ఎక్కువ మంది ప్రేక్షకులతో ఆ సభా ప్రాంగణం పొంగి పొర్లిపోతూ ఉంది. సుమారు మూడు గంటల కార్యక్రమం. భారతీయులూ ఎక్కువ మంది వచ్చారు. కార్యక్రమం అయిన తరువాత సుమారు రెండు నిముషాలు అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి (Standing ovation) తమ ప్రశంసను చూపారు. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళముందు కనిపిస్తూ వుంది. మన వద్ద సామాన్యంగా ప్రశంసించడానికి అంత ఉత్సాహం చూపించరు. వినిపించీ వినిపించనట్లు చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టడంలోనూ పీనాసితనం. మన చప్పట్లు అంత అగ్గువ కాదు!

ఈ సందర్భంలో సుమారు 40 ఏళ్ళక్రితం మా నేషనల్ హైస్కూలులో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది. మేము ప్రముఖ కవి డి. ఆర్. బెంద్రే గారిని ఉపన్యాసం మరియు కావ్యపఠనం చేయమని ఆహ్వానించాము. అప్పుడు బెంద్రే గారు మధ్యవయస్కులు. నిండు మనసుతో, అత్యుత్సాహంతో మాట్లాడారు. అందరి మనసులు చూరగొనే విధంగా తమ కవితలను వినిపించారు. సొగసైన కార్యక్రమం. హైస్కూలుకు చెందిన ఒక ఉపాధ్యాయులు వందన సమర్పణ సమయంలో తమ ఎడమచెంపపై చేతిని పెట్టుకుని కూర్చున్నారు. చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు ఉపయోగించాలి. దానికోసం చెంపమీద ఉన్న చేయి ఎడమ చేయి తీయాలి. సోమరితనం. ఆ చేతిని అలాగే పెట్టుకుని వేళ్ళను వీలైనంత తక్కువగా ఊపుతూ తమ చెంపను తామే కొట్టుకుని చప్పట్ల శాస్త్రాన్ని ముగించారు. ఆ శబ్దం వినిపించిదో లేదో తెలియదు. ఇలా ఉంటుంది మన వారి స్వభావం. మెప్పును ప్రదర్శించడానికి డబ్బులు అవసరం లేదు. ప్రతిభను గుర్తించే ఉదారస్వభావం మాత్రం కావాలి.

మాస్కో గుండా

అధ్యాపక వృత్తి ముగిసింది. వాపసు వచ్చేటప్పుడు మాస్కో ద్వారా రావాలని నిశ్చయించాను. న్యూయార్క్ నుండి లండన్‌కు వచ్చి అక్కడి నుండి నేరుగా మాస్కోకు వచ్చాను. అక్కడికి వచ్చేముందు మా కాలేజీలో చదువుకుని, మాస్కో యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న డా. ఎ. ఆర్. సుబ్బారావుకు ఉత్తరం వ్రాశాను. 2000 గదులన్న మాస్కోలోని ఒక పెద్ద హోటల్లో నాకు వసతి ఏర్పాటు చేశారు. తిండి బ్రెడ్డు. పొడువైన క్యూలో నిలబడి దానిని తీసుకోవాలి. భోజనానికి సుబ్బారావు చేసిన అన్నం, చారు, కూర. సుబ్బారావు రెండేళ్ళ నుండి అక్కడే ఉన్నా శాకాహారాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా మొదలైన చలి దేశాలలో ఉంటే జీవన విధానం మార్చుకోవాలి. మద్యం త్రాగాలి అని ఆ దేశాలకు వెళ్ళిన చాలామంది వాదన. ఇదంతా ఒక కుంటిసాకు. కాఫీ, టీ త్రాగకుండా కూడా హాయిగా ఉండవచ్చు.

రష్యన్లు భారీ శరీరాలతో బందిపోట్లలా కనిపిస్తున్నారు. అయితే వారంతా గంభీరమైనవారు. మాస్కోలోని కొన్ని ప్రదేశాలను ఒక గైడ్ సహాయంతో చూశాను. ప్రఖ్యాతమైన మాస్కో రెడ్ స్క్వేర్ దర్శించాను. అక్కడే ఉన్న లెనిన్ మృత కళేబరాన్ని చూడటానికి ఒక మైలు పొడవు ఉన్న క్యూ. అయితే విదేశీయులకు ఈ క్యూ నుండి ఒక రాయితీ ఉంది. వారు క్యూలో నిలబడనవసరం లేదు. నేరుగా వారు వెళ్ళి చూడవచ్చు.

మాస్కోలో రెండు రోజులు ఉండి విమానంలో ఢిల్లీకి వచ్చాను. మాస్కో విమానాశ్రయంలో విమానంలో కూర్చున్నప్పుడు మా కాలేజీ అడ్మిషన్‌కు సంబంధించి నడిచిన ఒక సంఘటనను ఇంతకు ముందే తెలియజేశాను. ఢిల్లీ నుండి బెంగళూరుకు వచ్చాను. నేను సూటుబూటు వేసుకుని వస్తానని కాదు మామూలు షర్టు, దట్టిపంచ, టోపీ వేసుకుని వస్తానని మా విద్యార్థులలో వాదం నడిచిందట. దానికోసం బెట్ కూడా కట్టారట. నేను నా మామూలు వేషంతో దిగాను. మరుసటి రోజు నుండే నా కాలేజీ పనిని ప్రారంభించాను.

(సశేషం)

Exit mobile version