[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘ప్రాయశ్చిత్తం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది విశాఖపట్నం నగరంలో ద్వారకా నగర్ ప్రాంతం. సాయంత్రం ఆరు గంటలు అవుతోంది. వేసవి కాలపు వెలుగు బాగానే వుంది. ఆకాశం నిర్మలంగా వుంది.
శేఖర్ ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఆఫీసర్‍గా పనిచేస్తున్నాడు. ఆ రోజు బ్యాంకులో, శేఖర్ పని త్వరగా అయిపోయింది. ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లినా మళ్ళీ తానే వంట చేసుకోవాలనే విషయం గుర్తుకు వచ్చేసరికి, నీరసం వచ్చింది. ఆ రోజు పొద్దున్నే భార్య శ్రావ్య పుట్టింటికి రాజమండ్రి వెళ్ళింది. పొద్దున్న వంట చేసుకుని బ్యాంకుకి వచ్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది శేఖర్‌కి.
శేఖర్‌కి పెద్దగా స్నేహితులు లేరు. బ్యాంకు, ఇల్లు, భార్య.. ఇదే లోకం. పెళ్లయి రెండేళ్లయింది. స్నేహ సాధారణంగా శేఖర్‍ని విడిచి వెళ్ళదు. తల్లి వైపు బంధువుల ఇంట్లో శుభకార్యం అని, తప్పనిసరి అయి, రాజమండ్రి వెళ్ళింది. తను ఊళ్ళో లేకపోతే, హోటల్‌లో భోజనం చేయద్దని, ఆ రెండు రోజులూ ఇంట్లోనే వంట చేసుకోమని, బయట తిళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదని మరీ మరీ చెప్పింది. భార్య మాట కాదనలేక, పొద్దున్న వండుకుని క్యారేజీ తెచ్చుకుని తిన్నాడు కానీ, రాత్రికి హోటల్‌లో తినేసి, ఇంటికి వెళదామని నిశ్చయించుకున్నాడు శేఖర్.
మర్నాడు కూడా అలా పొద్దున్న వండుకుంటే, సాయంత్రానికి స్నేహ వచ్చేస్తుంది, వంట బాధ తప్పుతుంది. అదీ అతని ఆలోచన. ఏడు గంటలు దాటే దాకా హోటల్‍లో డిన్నర్ రెడీగా ఉండదు.
ఆలోచిస్తూ రాత్రి ఏడుగంటల దాకా వీధి చివర పార్కులో కాసేపు కూర్చుందామని వెళ్లాడు. పార్కులో పెద్దగా జనం లేరు. ఒక మూల బెంచీ మీద కూర్చుంటుంటే, కింద పడి వున్న పర్సు కనబడింది.
చుట్టూ చూసేడు. ఎవరూ లేరు. ఆ పర్సు తీసాడు. అందులో డబ్బు వుంది. లెక్కపెడితే, మూడు వేల రూపాయలు వున్నాయి.
‘పాపం ఎవరో పారేసుకున్నారు. మళ్ళీ వెతుక్కుంటూ వస్తారేమో చూద్దామ’ని దూరంగా వున్న బెంచీ మీద కూర్చుని చుట్టూ గమనిస్తూ కూర్చున్నాడు. యథాలాపంగా మళ్ళీ పర్సులో మరో అర తెరిచిన శేఖర్ నిర్ఘాంతపోయాడు. అక్కడ కనపడిన ఫోటో తన చిన్ననాటి గురువు విశ్వనాధం మాస్టారు గారిది.
మనసు గతం లోకి వెళ్ళింది.. తను చేసిన తప్పూ గుర్తుకు వచ్చింది.
***
అది బొబ్బిలి కె.ఎస్.ఆర్. హై స్కూల్‌లో అతను చదువుతున్నప్పటి విషయం. శేఖర్ తండ్రి ఉద్యోగ రీత్యా అతను 9,10 క్లాసులు చదివే సమయంలో బొబ్బిలిలో వున్నారు. ఆ మాస్టారి ఇంట్లోనే, వాళ్ళు అద్దెకి ఉండేవారు. 10వ తరగతి తర్వాత గుంటూరు వెళ్లిపోయారు. ఇంటర్మీడియట్, బీఎస్సీ చదువులు శేఖర్ గుంటూరులో చదువుకున్నాడు.
బొబ్బిలిలో వున్న ఆ స్కూలు, జిల్లాలోనే మంచి పేరు గడించింది. క్లాసులో బెస్ట్ స్టూడెంట్ అతనే. శేఖర్ పక్కనే, అదే బెంచీలో విశ్వనాధం మాస్టారి కొడుకు గిరినాధ్ కూర్చునేవాడు. విశ్వనాధం గారు లెక్కల మాస్టారు. గిరినాధ్‌కి లెక్కలు అంటే భయం. క్లాసులో శేఖర్‌కి మంచి మార్కులు రావడం, తన కొడుకు గిరినాధ్ లెక్కల్లో పాసు మార్కులు కంటే తక్కువ రావడం ఆయనకి చాలా చిరాకుగా ఉండేది. స్కూల్‌లో ఎప్పుడూ శేఖర్‌కి ఫస్ట్ రాంక్ వచ్చేది. దాంతో ఆయనలో శేఖర్ మీద అసూయ పెరిగిపోయేది. చదువులో ఏమీ అనలేక, వేరే విషయాలలో క్లాసులో శేఖర్‌ని ఏదో వంక పెట్టి తిట్టడం, కొట్టడం చేస్తూ వుండేవారు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు ఆ తీవ్రత ఎక్కువ ఉండేది. శేఖర్ వాళ్లు ఉండేది, మాస్టారు వుండే ఇంటి పక్క పోర్షన్. దాంతో ఇంటి దగ్గర శేఖర్‌ని పోల్చి, కొడుకుని మందలించడం శేఖర్ చాలా సార్లు విన్నాడు. కానీ, గిరినాధ్ పెద్దగా పట్టించుకునే వాడు కాదు. అతనికి ఎప్పుడూ ఆటల ధ్యాస. కొడుకు నిర్లక్ష్యం విశ్వనాధం గారికి మరీ చిరాకు తెప్పించి, ఆ చిరాకు శేఖర్ మీద అసూయగా మారేది.
ఆ పరిణతి లేని వయసులో వుండే ఉద్వేగంతో, శేఖర్ విశ్వనాధం గారిని ఏదో చెయ్యాలని మనసులో రగిలి పోతూ వుండేవాడు. ఏమి చెయ్యాలో తెలిసేది కాదు. తెలిసీ తెలియని ఆనాటి అతని మానసిక పరిస్థితిలో ఆయన దగ్గర డబ్బు దొంగిలించి ఆయనని ఇబ్బంది పెట్టాలని పిచ్చి ఆలోచన చేసేడు.
ఒకరోజు, ఆ అవకాశం, అదీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే ముందు దొరికింది.
వీళ్ళు వెళ్లిపోతున్నారని, వీడ్కోలు చెప్పడానికి బయటకి వచ్చారు విశ్వనాధం గారు, ఆయన భార్య సుగుణ గారు.
అప్పుడు ఇంటి వెనుక వైపుకి వెళ్లి, విశ్వనాధం గారి ఇంటిలోకి ప్రవేశించేడు శేఖర్. ఆయన బెడ్ రూమ్‌లో కొక్కేనికి తగిలించి వున్న చొక్కా జేబులోంచి 3000 రూపాయలు దొంగిలించి, ఏమీ ఎరగనట్లు వెనుక గుమ్మం లోంచి బయటకి వచ్చి, అమ్మ, నాన్నలతో ఆటో ఎక్కేసాడు. అప్పుడు వాళ్ళు ట్రైన్‌లో గుంటూరు వెళ్లిపోయారు.
ఆ సంఘటన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళలేదు. కొంతకాలానికి తాను చేసిన పని యెంత తప్పో, తలుచుకుంటే పశ్చాత్తాపం కలిగేది శేఖర్‌కి. కానీ తాను చేసిన తప్పు ఎలా దిద్దుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అతనికి తోచేది కాదు.
అలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే, ఆనాటి తన అపరిపక్వ ఆలోచనాధోరణికి సిగ్గనిపిస్తుంది అతనికి.
***
‘ఇన్నేళ్లకి, ఆ మాస్టారు గానీ, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరో తనకి కాసేపట్లో కనపడవచ్చు. కనపడితే, తన తప్పు దిద్దుకునే అవకాశం కూడా ఏదయినా దొరకవచ్చు..’ ఇలా ఆలోచిస్తున్న శేఖర్‌కి తన వయసులో వుండే వ్యక్తి ఒకరు ఇంతకు ముందు, తాను కూర్చున్న బెంచి దగ్గరకి వచ్చి వెతుక్కుంటూ ఉండడం కనపడింది.
ఆలస్యం చేయకుండా.. ఆ పర్సు తీసి, జేబులోంచి 10000 రూపాయలు అందులో వుంచేడు. ఇప్పుడు, అతని వైపు కదిలాడు. దగ్గరకి వెళ్ళేక, ఆ వ్యక్తిని గుర్తు పట్టేడు. అతను గిరినాధ్.
శేఖర్ “గిరినాధ్! నన్ను గుర్తు పట్టేవా?” అని ప్రశ్నించాడు.
ఆ మాటకి వెనక్కి తిరిగి చూసిన గిరినాధ్, శేఖర్‌ని పరిశీలనగా చూసి గుర్తు పట్టేడు.
“ఆ, గుర్తు పట్టేను.. నువ్వేంటి ఇక్కడ?” అన్నాడు.
“నేను ఇక్కడ దగ్గరలో బ్యాంకులో పనిచేస్తున్నాను. బ్యాంక్ పని అయిపోయాక, పార్కులో కూర్చుందామని వచ్చేను. అవును.. నువ్వ్వు ఇక్కడ ఏమిటి వెతుకుతున్నావ్?” అన్నాడు శేఖర్.
“నేను ఒక గంట క్రితం ఇక్కడే కూర్చున్నాను. నాన్నకి స్కానింగ్ కోసం ఈ వీధి చివర ల్యాబ్ దగ్గరకి, ఉదయం తీసుకుని వచ్చేము. సాయంత్రం 4.30 కి రిపోర్ట్ ఇస్తానన్నారని, వచ్చేను. కానీ రెడీ అవలేదని, 5.30 తర్వాత రమ్మన్నారు. ఇంటికి వెళ్లకుండా, ఇక్కడ పార్కులో కూర్చుని వెళ్ళేను. తీరా ల్యాబ్ కి వెళ్ళేక చూసుకున్నాను. నా పర్సు పడిపోయింది. అది ఇక్కడ పడిపోయిందేమో అని వెతుక్కుంటూ మళ్ళీ వచ్చేను” అన్నాడు.
“ఇదేనా ఆ పర్సు?” అని పర్సు చూపించాడు శేఖర్.
పర్సు చూస్తూనే, గిరినాధ్ మొహం వెలిగిపోయింది.
“ఆ ఇదే..” అంటూ గబగబా తీసుకుని, పర్సు తెరిచి చూసేడు. అతని మొహంలో ఆశ్చర్యం.
“ఇదేమిటి..ఇందులో 3000 రూపాయలు మాత్రమే ఉండాలి. కానీ ఇందులో చాలా ఎక్కువ వుంది?” అంటూ డబ్బు లెక్క పెడుతున్నాడు.
ఇంతలో గిరినాధ్ ఫోన్ మోగింది. ఫోన్ అటెండ్ అయ్యేడు. అవతలి స్వరం వింటూనే గిరినాధ్ షాక్‌కి గురయినట్లున్నాడు.
“ఏమయింది? చెప్పమ్మా!” అంటున్నాడు ఆందోళనగా.
ఆమె మాటలు వింటూనే.. బావురుమన్నాడు.
“ఏమిటమ్మా.. నువ్వు చెపుతున్నది. నాన్న నేను వచ్చేముందు బాగానే ఉన్నారుగా” అన్నాడు.
“ఏమైంది?” ఆందోళనగా అడిగేడు శేఖర్.
“నాన్న స్పృహ కోల్పోయేరుట.. తట్టినా లేవడం లేదుట, అమ్మ ఏడుస్తోంది” అన్నాడు ఏడుస్తూ.
“పద, మనం వెంటనే వెళ్లి ఆయన్ని హాస్పిటల్‌లో జేరుద్దాము” అన్నాడు శేఖర్.
ఇద్దరూ శేఖర్ బండి మీద గిరినాధ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేరు.
అక్కడి పరిస్థితి చూస్తే, హృదయ విదారకంగా వుంది. వీళ్ళు వెళ్లేసరికి పక్కింటి వాళ్ళు దగ్గర్లోని డాక్టర్‌ని తీసుకుని రావడం జరిగింది. అప్పుడే, ఆ డాక్టర్ విశ్వనాధం గారి మరణం నిర్ధారించారు. హార్ట్ అట్టాక్ తీవ్రంగా రావడంతో చనిపోయారుట.
గిరినాధ్‌ని చూస్తూనే, అతని తల్లి కుప్పకూలిపోయింది. ఆ విషాద సమయంలో తండ్రి పక్కన కొడుకు లేకుండా పోయాడు. ఆ బాధ ఆమెని మరింత పిండేస్తోంది.
శేఖర్‌కి అక్కడి పరిస్థితి చూస్తే పిచ్చెత్తినట్లు వుంది. మాస్టారు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. తన పశ్చాత్తాపం తెలియజేసుకునే అవకాశం లేదు.
ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. చీకటి పడిపోవడంతో, ఫ్రీజర్ బాక్స్‌లో మాస్టారి పార్థివ దేహం ఉండేలా ఏర్పాట్లు చేయించాడు శేఖర్. మరునాడు బ్యాంకుకి సెలవు పెట్టేసాడు. విశ్వనాధం మాస్టారి అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చేయించాడు. కర్మకాండలు గురించి పంతులు గారికి ప్యాకేజీ మాట్లాడేటప్పుడు పర్సు తీసిన గిరినాధ్‌కి పర్సులో డబ్బు విషయం గుర్తుకు వచ్చి, మళ్ళీ శేఖర్‌ని ప్రశ్నించాడు.
“ఆ డబ్బు నేను నీ అన్నగా ఇచ్చాననుకో. గురువుగారి ఋణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు” అనేశాడు శేఖర్.
పూర్తి విషాదంలో మునిగిపోయిన గిరినాధ్ ఏమీ అనలేక, కృతజ్ఞతగా చూసేడు. ఇప్పుడు ఆ ఇంటికి శేఖర్ పెద్ద కొడుకులా వ్యవహరించాడు.
గురువు గారి ఋణం ఇలా తీర్చుకునే అవకాశం దక్కింది అని మనసులో అనుకున్నాడు. అదే తన ప్రాయశ్చిత్తంగా భావించాడు శేఖర్.
సమాప్తం
శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ A.P.E.P.D.C.L లో పర్సన్నల్ ఆఫీసర్‍గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వారిని 9440602019 అనే నెంబరులో సంప్రదించవచ్చు.
