[డా. మధు చిత్తర్వు రచించిన ‘ప్రగతి 3100’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
చాలా పెద్ద అంతరిక్ష నౌక. ఒక పెద్ద రెండు అంతస్తుల భవనంలా ఉంది. మొదటి అంతస్తులో మధ్య హాలులో వృత్తాకారంతో మెరిసే లోహపు నేల మీద పదిమంది వ్యోమగాములు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా నిలబడి వున్నారు. మరి కొద్ది నిమిషాలలో వారి నౌక సుదూర విశ్వంలో కొత్త గెలాక్సీలని, వాటిలో జీవుల్ని,ఇతర విశేషాలు ఏమైనా వున్నాయో పరిశీలించడానికి బయలుదేరబోతోంది. ..కాంతి వేగంతో!
3100 సాధారణ శకంలో భూమి నుంచి ఇతర నక్షత్ర మండలాలు అంటే గెలాక్సీల వైపు వెళ్లే ప్రయాణాలు విరివిగానే జరుగుతున్నాయి అన్ని దేశాల నుంచి. కాంతి వేగంతో వెళ్లినా మధ్యలో కాంతి వేగం దాటి హైపర్ స్పేస్లో ప్రయాణం చేసినా, వార్మ్హోల్స్ దాటి మరొక డైమెన్షన్స్ లోకి వెళ్ళినా ఇవి సుదూర ప్రయాణాలే. కనీసం ఏభై నుంచి వంద భూమి సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే వారందరూ కలిసి మంద్ర స్వరంతో ప్రార్థన చేస్తున్నారు.
సహనా వవతు
సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీత మస్తు
మావిద్విషావహై
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
అతి పురాతన ఉపనిషత్ వాక్యం అతి ఆధునిక సాంకేతికతతో వెళ్లే అంతరిక్ష పరిశోధనా యాత్ర ఉత్తేజం ఇచ్చే ప్రేరణ!
కెప్టెన్ నచికేత్ అప్పుడందరినీ ఆదేశించాడు. “మీ మీ మాడ్యుల్స్ లోకి వెళ్లి బెల్టులు కట్టుకొని సిద్ధం కండి. కౌంట్ డౌన్ అయిపోగానే ప్రగతి అంతరిక్ష యాత్ర మొదలవుతుంది.”
కాసేపటికి భూమి నుంచి సుదూర గమ్యానికి వేయి సూర్యుల వెలుగుతో మెరిసే తారాజువ్వలా ప్రగతి ఎగిరి మాయమైంది.
***
కొద్ది రోజుల క్రితం..
అడ్మిరల్ వాజశ్రవ్ త్రిశంకు 3100 ప్రోగ్రాం ఆవిష్కరిస్తూ కెప్టెన్ నచికేత్కి చెప్పాడు.
“నచికేత్! నిన్ను సుదూర గమ్యానికి పంపుతున్నాను. ఒక రకంగా ఇది నిన్ను మృత్యువుకి అప్పగించినట్లే! కానీ ఇది తప్పనిసరి. ఇది నీకు శిక్ష, పరీక్ష కూడా!”
కెప్టెన్ నచికేత్ అడ్మిరల్ వాజశ్రవ్ కుమారుడే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అడ్మిరల్ వయసులో వృద్ధుడు. నచికేత్ చిన్న వయసు వాడు. అయినా అతనికి తండ్రి చేసే పనులు నచ్చవు. ఇద్దరికి అంతరిక్ష పరిశోధనా యాత్రల గురించి తరుచూ వాగ్వాదాలు జరిగేవి. అది సిద్ధాంత పరంగా ఎప్పటినుంచో జరుగుతున్న ఘర్షణ.
“మీరు ఈ నక్షత్ర మండలాలకి అంతరిక్ష పరిశోధనా నౌకలు పంపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. భూగ్రహ ప్రభుత్వం మెప్పు కోసం, మీ కీర్తి కోసం మీ ధనం కోసం ఈ పనులు చేస్తున్నారు. ఇది తప్పు.” అని నచికేత్ తండ్రితో దైర్యం గానే వాదించేవాడు.
అడ్మిరల్ వాజశ్రవ్ నిరంకుశుడు. అంతరిక్ష పరిశోధనా సంస్థకి ముఖ్య అధికారి. ఆయనకి స్వంత కుమారుడు అయినా నచికేత్ మీద కోపం వచ్చేసేది. ఈసారి కూడా వచ్చింది.
అందుకే ఈసారి ప్రగతి 3100 అంతరిక్షయానంలో అతనిని కెప్టెన్గా నియమించి పంపడానికి నిశ్చయించాడు.
3100 సంవత్సరం. అంతరిక్షంలో ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరం కూడా ప్రయాణం చేసే సామర్థ్యం మానవజాతి సంపాదించింది.
కానీ మానవుల మనసులో ఒక పెద్ద ప్రశ్న సమాధానం లేకుండా ఉండిపోయింది. ఇప్పటికీ.
మరణం తర్వాత ఏం జరుగుతుంది?
భౌతిక వాదులు వున్నారు. చావు తర్వాత అన్నీ అంతం అవుతాయి అని నమ్మేవారు.
ఆత్మ వాదులు వున్నారు. ఆత్మ శాశ్వతం అని నమ్మే వారు. ఈ ఆత్మ వాదులు అని పిలువబడే వారిని గేలి చేయడమో ఒకప్పుడు శిక్షించి హింసించడమూ చేయడం సమాజంలో వుంది.
అంతరిక్ష నౌక ప్రగతి ఎట్టకేలకు కెప్టెన్ నచికేత్ ఆధ్వర్యంలో త్రిశంకు అనే గెలాక్సీ వైపు ప్రయాణం అయింది. అక్కడ అసాధారణ జీవుల సంకేతాలు కనుగొన్నారు. వారి లక్ష్యం వాటిని అన్వేషించడమే. అక్కడ జీవం వుందా, ఎలాంటి పరిస్థితులు వున్నాయో కనిపెట్టి తిరిగి రావాలి.
***
సుదూర ప్రయాణానికి అంతరిక్ష నావికులు ప్రత్యేకమైన క్రయోపాడ్లలో నిద్రిస్తారు. అతి శీతలమైన ఈ గాజు పెట్టెలలో శరీరాల మెటబాలిజం చాలా నెమ్మదిగా అయి ఆక్సిజన్, ఆహారం, చాలా తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దీర్ఘ కాలిక కాంతి ప్రయాణాల్లో వనరులు పుష్కలంగా ఉంటాయి. వారి శరీరానికి సెలైన్ ఆక్సిజన్ ఇతర పోషక పదార్థాలు ట్యూబ్ల ద్వారా ఇచ్చి క్రయోఫ్రీజింగ్లో వుంచి చేరవలసిన చోటికి వచ్చిన తర్వాత మళ్లీ జాగరూకులని చేస్తారు. ఇదంతా రోబోల పర్యవేక్షణలో జరుగుతుంది. అంతరిక్ష నౌక సౌరశక్తి, నక్షత్ర కిరణాల శక్తి వినియోగం చేసుకుని దూర ప్రయాణాలకి ప్రయాణం చేస్తుంది.
నచికేత్ ఆ శీతల నిద్రలో కలగంటున్నాడు.
“నాన్నా, ఈ యాత్రని నిజంగా మానవాళి కోసం అంకితం చేశారా, లేక మీ కీర్తి కోసమా?”
వాజశ్రవ్ చాలా కోపంగా అంటున్నాడు.
“నిన్ను శూన్యానికి అప్పగిస్తున్నాను. మృత్యువు దగ్గరకే పంపించేస్తున్నాను. నీవు నాకు ఎదురుతిరిగిన అహంకారానికి నీవు విజయం సాధిస్తే మెచ్చుకుంటారు. లేదా మృత్యువే నిన్ను అక్కున చేర్చుకుంటుంది. ఈసారి, నీవు గెలిచి తిరిగి రావాలి!”
ప్రగతి 3100, వంద కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేసింది. అంతరిక్షంలో కాలం సాపేక్షికం. ఎంత కాలం ఎక్కడ గడిచిందో తెలియదు. చివరికి మంచుపెట్టెల నుంచి అంతరిక్ష నావికులు స్పృహ లోకి వచ్చారు. రోబట్స్ వారికి తెలివి లోకి వచ్చేందుకు సాయం చేస్తున్నాయి. నౌకలోని దీపాలన్నీ వెలిగాయి.
“మనం త్రిశంకు అనే గెలాక్సీ లోకి చేరుకున్నాం.” ప్రకటించింది, ప్రథాన రోబోట్ యంత్రప్రజ్న.
“ఇది మృత్యు లోక మార్గం” మరొక రోబోట్ యాంత్రిక స్వరంతో హెచ్చరిక చేసింది. “మనం త్వరలో ఒక అంథకార బిలంలో అంటే బ్లాక్ హోల్ లో కి చేరుకోబోతున్నాం. Alert! Alert!” అంతరిక్ష నౌక అంతటా వార్నింగ్ సైరన్లు గుడ్లగూబల అరుపులలా ధ్వనించసాగాయి.
నచికేత్కి తన అంతరాత్మలో యమలోకపు ద్వారంలో వున్నట్లు గోచరించింది. ఆ చీకటిలోనే ఒక పెద్ద ఎనుబోతుపై ఎక్కి ఎర్రటి కళ్ళతో భుజం పై గదాయుధం ధరించిన పెద్ద ఆకారం అంతరిక్షాన్ని అంతా వ్యాపించి కనిపించింది. నౌకలో నలుగురు సిబ్బంది అచేతనావస్థలో, నలుగురు మరణావస్థలో, ఇద్దరు కొనవూపిరితోనూ వున్నారు. నచికేత్ మాత్రమే ప్రాణంతో వున్నాడు. వేచివున్నాడు. అంతరిక్ష కాలమానంలో మూడు రాత్రులు పగళ్ళు గడిచాయి. యంత్రాలన్నీ అచేతనం అయ్యాయి. పెంజీకటి ఆవహించింది. ఏమయినా సరే ఆ మృత్యువు లాంటి ఆకారంతో మాట్లాడాలని, సమాచారం సంభాషణ చేయాలని ఆ మూడు రోజులు నిద్రాహారాలు లేని జీవసమాధిలో నచికేత్ పట్టుదలగా ఎదురు చూశాడు.
“నా పేరు యమ.” అన్నది ఆ పెద్ద ఆకారం మూడు రోజుల తర్వాత.
అది అంతరిక్షంలోని పెద్ద నల్లని రంగులోని కాస్మిక్ ఇంటెలిజెన్స్లా వుంది. దానికి భాష లేదు. తరంగాలే దాని సంభాషణ.
***
గ్రహమూ కాదు. నక్షత్రమూ కాదు. మహా జీవం, లేక అంతరిక్ష మహా జీవీ కాదు! అంతరిక్షంలోని కొలవలేని కాలాన్ని అల్లుకున్న ఒక కాస్మిక్ చైతన్యం! ప్రతి చనిపోయే నక్షత్రం దగ్గర, ప్రతి కృష్ణబిలం అంచున వుండే చైతన్య శక్తి. నచికేత్ మూడు రోజుల అచేతనావస్థ నుంచి మేలుకున్నాడు. ఎదురుగా చీకటిలో మెరిసే శక్తి స్వరూపం.
“మూడు రోజులు నా దగ్గర భయం లేకుండా వేచివున్నావు. నీ సహచరులందరూ మరణం అంచున వున్నా నీవు భయపడలేదు. దీనికి నేను మెచ్చి మూడు వరాలిస్తున్నాను. నీకేమి కావాలో అడుగు!”
నచికేత్ అడిగాడు. “ఓ అంతరిక్ష శక్తీ! నీవే యమ, లేక మృత్యువు, లేక అన్నీ అంతం చేసి కలుపుకునే కాస్మిక్ చైతన్యం అనుకుంటున్నాను. నిన్ను చూసి నా జన్మ ధన్యం అయింది. నా మొదటి వరంగా కోరుకుంటున్నాను. నా అంతరిక్ష నౌక ప్రగతిని మళ్లీ పనిచేసేటట్లు చేయి. నా సభ్యులందరినీ తిరిగి బతికించు!”
యమ శక్తి ఒప్పుకున్నట్లు మెరిసింది. అంతరిక్ష నౌకలో దీపాలన్నీ వెలిగాయి. వ్యోమగాములందరూ తిరిగి సజీవులై కళ్ళు తెరిచారు.
“నా రెండవ వరం అడుగుతున్నాను. యమా! విశ్వానికి మూలశక్తి ఏమిటి?”
“దీనిని తెలుసుకోవాలి అంటే నీ పేరే దానికి పెడతాను. అది నచికేత అగ్ని. విశ్వంలోని సమస్త పదార్థం, నక్షత్ర మండలాలు చైతన్యం వెనుక వున్న ఏకీకృత శక్తి. అదే నచికేత అగ్ని. అన్ని హోమాలలోనూ పురాతనకాలం నుంచి నీ పూర్వీకులు, నీ తండ్రి లాంటి ఋత్విక్కులు కూడా సాధించాలని అనుకున్నది అదే. విద్యుదయస్కాంతశక్తి, భూమ్యాకర్షణ శక్తి, అణు శక్తి కలిపిన ఏకీకృత శక్తి.”
నచికేత్ మూడో వరం అడిగాడు. “ఓ యమా! ఇది నా మూడో ప్రశ్నకి జవాబు ఇవ్వు. ఇది తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను. ఒక జీవి చనిపోయినప్పుడు, అది ఒక భూగ్రహజీవో, లేక అన్యగ్రహ జీవో, లేక ఈ విశ్వంలో ఏ జీవి అయినాసరే దాని మరణం తర్వాత ఏమవుతుంది? ఏమి జరుగుతుంది? మూడువేల సంవత్సరాలుగా మానవులు ఈ ప్రశ్నకి సమాధానం వెదుకుతూ వున్నారు.”
దీనికి యమ శక్తి రూపం తటపటాయిస్తూ ఉన్నట్లు దీపాలు వెలిగీ ఆరీ మళ్లీ వెలిగీ ఇలా కొంత కాలం అనిశ్ఛిత పరిస్థితిలో గడిచింది.
“నీకు కావాలంటే వేయి సామ్రాజ్యాలు, అంతులేని సంపద అనుగ్రహిస్తాను. ఈ ప్రశ్న మాత్రం అడగవద్దు. ఈ జీవుల జీవితాలు అశాశ్వతమైనవి. కానీ వారు ఆశ పడేది ఆత్రపడేది, సంపద, సుఖాలు, సామ్రాజ్యాల కోసమే!”
నచికేత్ ధృఢంగా చెప్పాడు. “సామ్రాజ్యాలు ఎందుకు? అవి అంతం అయిపోతాయని తెలిసినప్పుడు? సంపద, సుఖం ఎందుకు, అవి అశాశ్వతమైనవి అని తెలిసినప్పుడు? నాకు సత్యం మాత్రమే కావాలి!”
యమ కొంచెం ఆగి అన్నది. అది ఇప్పుడు పురాతన సంస్కృత భాషలో మాట్లాడటం మొదలు పెట్టింది.
శ్రేయశ్చ ప్రేయశ్చ, మనష్యమేతస్తౌ
వివినక్తి థీర:
శ్రేయోహి థీరో అభి ప్రేయసోవృణీతే.
“శ్రేయస్సు అంటే మంచిది, సత్యమైనది,హితమైనదీ, అయిన మార్గం. ప్రేయస్సు అంటే ప్రియమైనది సుఖాన్ని ఇచ్చేది క్షణికమైన మార్గం. నీకు ఏది కావాలి?”
“నాకు శ్రేయస్సు మార్గమే కావాలి. సత్యమే కావాలి.”
యమ నచికేత్ చైతన్యాన్ని విశ్వం అంతా తిప్పి అతనికి ఉపదేశించడం మొదలు పెట్టింది.
***
ఆత్మ గురించి యమ కాస్మిక్ చైతన్యం నచికేత్కి బోధిస్తోంది.
ప్రతి చైతన్యంలో, అది మానవుడైనా, అన్యగ్రహ జీవో అయినా, పదార్థంతో చేయబడనిది ఒకటి వుంటుంది. నీ యంత్రాలు దానిని కొలవలేవు. అది అంతరిక్షంలో ప్రయాణం చేయదు.
అది పుట్టలేదు.
అది చనిపోదు.
భూమి శాస్త్రవేత్తలు ఆ చైతన్యాన్ని ‘న్యూరాన్ల’ ప్రభావం అంటారు.
కానీ వారు దీపాన్ని వర్ణిస్తున్నారు.
వెలుతురును కాదు.
యమ, నచికేత్కి ఇంకా అద్భుతమైన రథ కల్పన, రథాన్ని అంతరిక్ష నౌకతో పోల్చి వివరించింది.
ప్రగతి నీ రథం. నువ్వు రథికుడివి. నీ బుద్ధి సారథి. నీ మనసు కళ్ళెం. నీ ఇంద్రియాలు గుర్రాలు. కానీ ప్రగతి నాశనం అయితే నీవు అంతం అవుతావా?
ఆత్మానం రథినం విద్ధి..
శరీరం రథమేవ తు
బుద్ధింతు సారథిం విద్ధి..
మనఃప్రగ్రహమేవచ
ఇంద్రియాణి హయానాహు ర్విషయం స్తే గోచరాన్
ఆత్మను రథికుడిగా తెలుసుకో. శరీరమే రథం. బుథ్థి సారథి. మనసు కళ్ళెం. విషయాలు వాటి మార్గాలు.
నేను యమ అనే మృత్యువును. కానీ మృత్యువు అంటే నాశనం అయిపోవడం కాదు. పరివర్తన. మార్పు.
ఇది ఒక ద్వారం.
మీరు మృత్యువు అనేది ఒక రూపం విడిచి మరొక రూపం ధరించడమే.
నమూనా మాత్రం కొనసాగుతుంది. అంతం కాదు. ఈ ఆత్మ పుట్టదు. చనిపోదు. అజమైనది. నిత్యమైనది. శాశ్వతమైనది. పురాతనమైనది. శరీరం నశించినా ఇది నశించదు. మరో అణువుల రూపంలో శాశ్వతంగా విశ్వంలో వుంటూనే వుంటుంది.
***
ప్రగతి నౌకలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి.
నచికేత్ స్పృహ లోకి వచ్చాడు. అతని సిబ్బంది కూడా అంతా సజీవంగా వున్నారు. క్రమంగా తెలివి లోకి వచ్చారు.
ప్రగతి భూమికి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయింది.
నచికేతుడు మారిపోయాడు. అతడు జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. జ్ఞానాన్ని తిరిగి పొందాడు. కానీ మాటల్లో ఎవరికీ వర్ణించలేడు.
కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరు.
ప్రగతి భూమి మీద దిగింది. కాలప్రయాణపు మార్పుల వల్ల ఇప్పుడు వాజశ్రవుడు అతి వృద్ధుడై బలహీనంగా వున్నాడు. అతని శరీరం శిథిలావస్థకు చేరుకుంది. భయంతో వున్నాడు. పశ్చాత్తాపంతో వున్నాడు.
“తండ్రీ! మీరు నన్ను మృత్యువు దగ్గరకు పంపారు. మృత్యువు నన్ను తిరిగి పంపించింది. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి పంపించింది. ఎప్పుడూ మీకు అర్థం కాని బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం గురించి వినాలని వుందా?”
వాజశ్రవుడు కన్నీళ్ళతో తల వంచాడు.
నచికేత్ తండ్రికి బోధించాడు.
“ఈ ఆత్మ ప్రవచనాలతో దొరకదు! బుద్ధితో కాదు. చదువుతో రాదు. ఎవరు దానిని కోరుకుంటారో వారికే దొరుకుతుంది. వారికి మాత్రమే ఆత్మ తనను తాను వెల్లడించుకుంటుంది.
అణో రణీయాన్ మహతో మహీయాన్
ఆత్మస్య జంతో నిర్హితో గుహాయాం
తనుక్రతుఃపశ్చంతి వీత శోకో
థాతు ప్రసాదాత్మాహి మానమాత్మననః
అణువుల కంటే చిన్నది. గొప్పవాటి కంటే గొప్పదీ అయిన ఆత్మ ప్రతి ప్రాణి లోనూ వుంటుంది.
కోరికలు లేని మానవుడు ఆత్మను ఇంద్రియాలు నిగ్రహించడం ద్వారా దర్శించి బాధలూ, దుఃఖం, విచారం నుంచి విముక్తుడవుతాడు.”
(వేదాంతం, సైన్స్ ఫిక్షన్ కలిపి రాయాలి అనే నా ప్రయోగంలో ఇది మూడవ కథ. కఠోపనిషత్ ఆథారంగా కల్పన. ఇది వరకు ‘భయానికి అవతలివైపు’, ‘ఆశ్రమ ప్రతిధ్వనులు’ కథలు సంచికలోనే ప్రచురణ అయ్యాయి.)
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.
