Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రణయ దృశ్యకావ్యం

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ర్ధరాత్రి దాటాకెప్పుడో
డాబాపై పచార్లు చేస్తూ
రాని నిద్ర కోసం అన్వేషిస్తుంటావు!

వెండి వెన్నెల
పిండారబోసినట్లుగా చుట్టూ పరచుకున్న సమయాల్లో
వినీల గగన సీమవైపు కాంక్షగా
నా రాక కోసం నిరీక్షిస్తుంటావని తెలుసు!

వెన్నెల రాజు వన్నెలు చిందిస్తూ కదులుతుంటే..
నిండైన చందమామలో నా రూపాన్ని చూడాలనుకుంటూ
తపిస్తుంటావని అర్థమవుతుంటూనే ఉంటుంది!

ఆశలెన్నో నయనాల్లో మెరుస్తుంటే
ప్రకృతిలో నా రూప జాడలేమైనా అగుపిస్తాయేమోనని
నీలో నువ్వే హృదయాన్ని ప్రశ్నించుకుంటూ
దిక్కులన్నీ పరికిస్తుంటావని
నా మనస్సుకు సందేశాలెన్నో చేరుతుంటాయి నేస్తమా!?

ఇంతకీ నేనెక్కడ ఉన్నాననేగా నీ సంశయం!
స్వప్నలోక విహారివై ..
మగత నిద్రలో నువ్వుండగా..
పారవశ్య ప్రపంచాన.. నీ తోడవుతుంటాను!
కలో నిజమో తెలియని సందిగ్ధంలో నువ్వుండగా
..కలల వరమై వస్తాను!
కల కాదంటూ నిజం చేస్తూ..
కనులముందు ప్రత్యక్షమవుతాను !
రాధలా నువ్వు..
కృష్ణుడిలా నేను..
మనమున్న చోటే బృందావనమే చెలి!

Exit mobile version