Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉన్నత విలువల దర్పణం ‘ప్రతిబింబాలు’ కథా సంపుటి

[శ్రీమతి కస్తూరి అలివేణి గారి ‘ప్రతిబింబాలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి మణి వడ్లమాని.]

సాహితీ రంగంలో రచయిత్రిగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మారుతున్న సామాజిక పోకడలను నిశితంగా అధ్యయనం చేస్తూ కస్తూరి అలివేణి గారు అందిస్తున్న రెండవ కథల సంపుటి ‘ప్రతిబింబాలు’. గతంలో ఆమె వెలువరించిన మొదటి కథా సంపుటి ‘అద్దం’ పాఠకుల, పెద్దల ప్రశంసలు అందుకున్నట్లే, ఈ ‘ప్రతిబింబాలు’ సంకలనం కూడా సమాజంలోని భిన్న కోణాలను అక్షరబద్ధం చేస్తూ, అంతకు మించిన సాహిత్య విలువలతో పాఠకుల ముందుకు వచ్చింది.

నేటి వర్తమాన సామాజిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ, నిత్య జీవితంలో మన కళ్ళముందు జరిగే యథార్థ సంఘటనలనే కథా వస్తువులుగా తీసుకుని ఈ పుస్తకాన్ని మలిచారు రచయిత్రి. నాగరికత పెరిగే కొద్దీ మానవ సంబంధాలు పలచబడుతున్న నేటి తరుణంలో, సమస్యల వలయంలో చిక్కుకుని మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీరును, ప్రస్తుత వ్యవస్థలో ప్రతి మనిషీ కుటుంబ పరిధిలో ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను ఈ కథలు అద్భుతంగా ఆవిష్కరించాయి.

ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు పెరగడం, సహజీవన సంస్కృతి వైపు మొగ్గు చూపడం, చదువు-ఉద్యోగాల పేరిట దేశ విదేశాలకు వెళ్ళిపోతున్న యువత వల్ల పల్లెలు ఒంటరిగా మిగిలిపోవడం వంటి ఎన్నో సమకాలీన సమస్యల మీద ఈ కథలు అద్దం పడుతూ నిజమైన ప్రతిబింబాలుగా నిలుస్తాయి.

ఈ సంపుటిలోని మొత్తం పదిహేను కథలలోనూ ప్రధాన సూత్రం నేటి సమాజ చిత్రణే కావడం విశేషం. ఇప్పటి జీవన గమనం, మనుషుల ఆలోచనాసరళి, కొందరి స్వార్థపరత్వం, మరికొందరి నిరాడంబరత్వం, తదనుగుణంగా సంభవించే పరిణామాలను రచయిత్రి చాలా తేలికైన శైలిలో, సరళమైన భాషతో హృదయానికి హత్తుకునేలా రాశారు. రచయిత్రి కస్తూరి అలివేణి గారు విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ కథలకు జీవం పోసిన తీరు అభినందనీయం.

ఈ సంకలనంలోని ముఖ్యమైన కథలను పరిశీలిస్తే – ‘మాతృదేవోభవ’ కథ మారుతున్న జీవన సరళిలో మనుషుల ద్వంద్వ నీతిని, పైకి మాట్లాడే మాటలకూ ఆచరణకూ ఉన్న వ్యత్యాసాన్ని ఎండగడితే, ‘కొత్త జీవితం’ కథ భార్యాభర్తల మధ్య లోపించిన అన్యోన్యత వల్ల, అహంభావం వల్ల సంసారాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో వివరిస్తూ, జీవితాన్ని సుఖంగా మలచుకున్నా లేదా కష్టాల పాలు చేసుకున్నా చాలా వరకు అది మన చేతుల్లోనే ఉంటుందనే వాస్తవాన్ని నిరూపిస్తుంది. అలాగే, ఆధునిక పోకడలపై రాసిన ‘నేటి నిజం’ అనే విషాదకరమైన కథ జీవితంలో ఆలోచనలు ఋజుమార్గంలో లేనప్పుడు బతుకు ఎలా ఛిన్నాభిన్నమవుతుందో చూపిస్తుంది. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఆలోచనలు రేకెత్తించే ‘గాంధీ మళ్ళీ వస్తే’, ఈనాటి నాగరికతకు అద్దం పట్టే ‘కొత్తబాట’ కథలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇక ‘రాజీవ్ కాలనీ’ కథలో ఆడంబరం లేని ఒక నిగూఢ సేవకురాలి అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు, ‘అడుగునీరు’ కథలో గుడిసెలో నివసించే పేదరాలు సత్తెమ్మ కొడుకు చనిపోవడంతో ఆమె పడే గర్భశోకాన్ని మనసుకు హత్తుకునేలా వివరించిన విధానం చదువరుల కళ్లను తడిపొంటిస్తాయి. వీటితో పాటు చిలకజోస్యం, వేదం, మూడు గదుల ఇల్లు.. వంటి కథలన్నీ నిత్యజీవితంలోని సంఘటనలకు ప్రత్యక్ష దర్శనంగా తోస్తాయి. కథలన్నీ తేలికపాటి శైలిలో ప్రవాహంలా ముందుకు సాగుతూ, చివరి కథ అయిన ‘చివరికి మిగిలేది’లో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక పంథాను అందుకుంటాయి. జీవితంలో ఎంత అత్యున్నత స్థాయిలోకి ఎదిగినా చివరికి మిగిలేది పరమార్థం మాత్రమే అనే చేదు వాస్తవాన్ని ఎంతో ఉన్నతమైన విలువలతో ఈ కథా కదంబంలో చూపించారు రచయిత్రి.

ఒక సమీక్షకురాలిగా ఈ పుస్తకాన్ని చదివినప్పుడు – ఇందులోని కథలన్నీ మన జీవితాలకి అతి దగ్గరగా ఉన్నాయనే భావన కలిగింది. మనం నిత్యం సమాజంలో చూస్తూ వదిలేసే విషయాలను ఇందులో చదివినప్పుడు అవి మళ్ళీ మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితం శాశ్వతం కాదు కదా, ఉన్నంతలో వీలైనంత ఎక్కువ ప్రేమిద్దాం, తక్కువ కోపిద్దాం అనే పరమ సత్యాన్ని ఈ కథలు నిగూఢంగా బోధిస్తాయి. తెలుగు కథా సాహిత్యంలో సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఇలాంటి పుస్తకాలు రావడం ఎంతైనా అవసరం. కస్తూరి అలివేణి గారి ‘ప్రతిబింబాలు’ కథానికా సంకలనం పాఠకుల మనసులను తప్పకుండా గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ రచయిత్రి కలం నుంచి మరెన్నో మంచి కథలు వెలువడి, త్వరలోనే మరో అద్భుతమైన సంపుటి రావాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అభినందనలతో!

***

ప్రతిబింబాలు (కథల సంపుటి)
రచన: కస్తూరి అలివేణి
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 113
వెల: ₹ 180/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, హైదరాబాద్
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 040-24652387, 9000413413
శ్రీ వంశీ రామరాజు
ఫోన్: 9849023582

 

~
శ్రీమతి కస్తూరి అలివేణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-kasturi-aliveni/

Exit mobile version