Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రియమైన నీకోసం..

కాశం అంతా నిండిన పసిడి వెన్నెల..
కదులుతున్న మబ్బుల చెలికత్తెల్ని
ప్రియంగా పలకరిస్తూ
సంబరంగా కదులుతున్న జాబిలమ్మ!
సన్నగా వీస్తున్న పిల్లగాలులు..
గులాబీ రెమ్మల్ని సుతారంగా తాకుతూ
ఊసులేవో వినిపిస్తూ
సందళ్ళ సవ్వళ్ళని మాత్రం నాకు
మాత్రమే వినిపించేలా చేస్తూ
కవ్విస్తూ
సుపరిమళాలని పరిచయం చేస్తున్న సంతోష సమయాలు!
కోవెల కొలనులో వయ్యారంగా ఊగుతూ కలువలు..
మెరుపు హంగులతో పులకరిస్తూ
ప్రకృతికి ఎనలేని ఆనందాలని
అందిస్తున్న సుమనోహరాల సోయగాల
ఇష్టమైన శుభ సన్నివేశాలు!
కదులుతున్న కాలం పరిచయం
చేస్తున్న సుస్వప్నాలు..!
నిన్ను నేను ఎప్పటికప్పుడు
సరికొత్తగా సరి పోల్చుకుంటూ..
అక్షరాల పూల కవితామాలికల
హారాల గుచ్చాలని అల్లుతూ.. మురిసిపోతుంటాను!
నా ఎదనేలే యువరాణి పారాణి పాదాల
సిందూర వర్ణాల మెరుపు హంగులలో
నన్ను నేను ఆవిష్కరించుకుంటూ ..
సంబరానికి మారురూపమై నిలుస్తుంటాను!
ప్రియమైన నీ రూపం నా నయనాల నిండా నిండిపోగా..
నీ నునులేత అధరాల చిరునవ్వుల
సరిగమల రాగాలని ఆలకిస్తూ..
నా కలం ప్రాణమిచ్చే
నవ్య కవిత్వాన్ని లోకానికి తెలియజేస్తూ..
అక్షర సిరుల సామ్రాజ్యమైన కవిత్వ సీమలో
రారాజై వెలుగొందుతుంటాను!

 

Exit mobile version