[అంతోన్ చెహోవ్ రాసిన రష్యన్ కథకి ఆంగ్లానువాదం ‘The Darling’ ఆధారంగా తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ ఎలనాగ.]
కళాశాలలో అధ్యాపకునిగా పని చేసి పదవీ విరమణ పొందాడు ప్లెమ్యాన్నియాకోవ్. అతని కూతురైన ఓలెంకా ఇంటి వెనకాల వరండాలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. వేడిమి బాగా ఉంది. దోమల వంటి కీటకాలు అదేపనిగా ముసురుతూ ఇబ్బందిని కలిగిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే సాయంత్రం అవబోతున్నదనే ఊహ సంతోషాన్ని కలిగిస్తోంది. తూర్పులో కమ్ముకుంటున్న నల్లని మేఘాలు నడుమ నడుమ తేమ నిండిన గాలితరగలను తీసుకొస్తున్నాయి.
టివోలి అనే పేరుగల డ్రామా కంపెనీ నిర్వాహకుడైన కుకిన్ ఇంటివెనుక వరండా పక్కన ఉన్న తోట మధ్యలో నిలబడి, ఆకాశం వైపు చూస్తున్నాడు. అతడు అదే యింట్లో ఉంటున్నాడు.
“మళ్లీ వాన రాబోతోంది. నన్ను పగ బట్టిందా అన్నట్టు రోజూ ఈ వాన ఒకటి దాపురించింది. ఇక నేను ఉరి పెట్టుకోవాలి. ప్రతిరోజూ భయంకరమైన నష్టాలు నన్ను నాశనం చేస్తున్నాయి,” అన్నాడతడు.
చేతులు ఊపుతూ ఒలెంకాతో ఇంకా ఇలా అన్నాడు: “చూశావా ఓల్గా సెమ్యెనోవ్నా. ఇదీ మన బతుకు తీరు. మనను ఏడిపించడానికి ఈ వాన చాలు. మనం ఒళ్లు హూనం అయ్యేలా పని చేస్తాం. ఇంకా బాగా ఎలా చేయవచ్చుననే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తాం. రాత్రుళ్లలో మనకు నిద్ర రాదు. ఇంత చేశాక జరిగేదేమిటి? అసలు మన ప్రేక్షకులు అజ్ఞానులు, మడ్డిమనుషులు. నేను వాళ్లకోసం మేటి కళాకారులతో అత్యుత్తమమైన సంగీత రూపకాన్నో నాటకాన్నో ప్రదర్శిస్తాను. కానీ వాళ్లకు కావాల్సింది అదేనని అనుకుంచున్నావా? అటువంటిదాన్ని వాళ్లు అర్థం చేసుకోరు. వాళ్లకు హాస్యనటుడు కావాలి, అసభ్య సన్నివేశాలు కావాలి. ఇక ఈ వాతావరణం చూడు. దాదాపు ప్రతి సాయంత్రం వర్షం కురుస్తుంది. మే నెల పదో తేదీన మొదలైన వాన జూన్ వరకు వరుసగా కురుస్తూనే ఉంది. ఇది ఘోరం. ప్రేక్షకులు రాకపోయినా నేను టివోలికి అద్దె కట్టాలి, కళాకారులకు జీతభత్యాలు చెల్లించాలి.”
మరునాడు సాయంత్రం మళ్లీ మేఘాలు కమ్ముకున్నాయి. హిస్టీరియా రోగిలాగా కుకిన్, “జడివాన కురిసి వరదలు వచ్చి నేను మునిగిపోనీ. ఈ జన్మలో, వచ్చే జన్మలో నా దరిద్రం ఇలానే కొనసాగనీ. నటులు నన్ను కోర్టుకీడ్వనీ. నన్ను జైలుకు లేదా సైబీరియాకు పంపనీ. ఉరికంబమెక్కించనీ. హ హ హ.”
మరుసటి రోజు మళ్లీ అదే తీరు!
కుకిన్ మాటలను ఓలెంకా మౌనంగా, శ్రద్ధగా విన్నది. మధ్య మధ్య ఆమెకు కన్నీళ్లు వస్తున్నాయి. అతని దుదృష్టం ఆమెను కలచివేసింది. దాంతో అతనిమీది ప్రేమ మరింత ఎక్కువైంది. కుకిన్ చిన్న శరీరంతో, బక్కపలుచగా ఉంటాడు. ముఖంలో పసిమి చాయ ఉంటుంది. రింగులు తిరిగిన తలవెంట్రుకలు నుదురుమీద పడేలా ముందుకు దువ్వుకుంటాడు. సన్నని కంఠస్వరంతో మాట్లాడుతుంటే అతని నోరు కొంచెం పక్కకు తిరుగుతుంది. ఎప్పుడూ అతని ముఖం మీద నిరాశను సూచించే కవళిక ఉంటుంది. అయినా అతడు ఆమెలో నిజమైన, గాఢమైన ప్రేమను రేకెత్తిస్తాడు. ఆమెకు అన్నివేళలా ఎవరో ఒకరిమీద అపేక్ష ఉంటుంది. ప్రేమభావం లేకుండా ఆమె ఉండలేదు. బాల్యంలో తాను ప్రేమించిన తన తండ్రి ఇప్పుడు చీకటిగదిలో కూర్చుని శ్వాస ఇబ్బందితో బాధ పడుతున్నాడు. అప్పట్లో బ్రయాన్స్కా నుండి రెండేళ్లకొకసారి వచ్చే తన చిన్నమ్మ మీద ఆమెకు ఎంతో ప్రేమ ఉండింది. అంతకన్న ముందు తాను బడిలో చదివే రోజుల్లో ఫ్రెంచి టీచరు పట్ల ప్రేమగా ఉండేది. ఆమె కరుణ గల మెత్తని మనసును, దయ నిండిన కళ్లను కలిగి మంచి ఆరోగ్యంతో ఉంటుంది. నిండుకున్న గులాబీ బుగ్గలతో, మెడమీద చిన్న పుట్టుమచ్చతో ఆమెలో ఆకర్షణ నెలకొని ఉంటుంది. ఏదైనామంచి విషయాన్ని వింటున్నప్పుడు ఆమె ముఖం మీదికి పాకే అమాయకపు నవ్వు చాలా బాగుంటుంది. దాన్ని చూసి మగవాళ్లు చిరునవ్వు నవ్వుతారు. ఆడవాళ్లేమో సంభాషణ మధ్యలో ఆమె చేయిని పట్టుకుని “డార్లింగ్” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేరు.
తను పుట్టిపెరిగిన ఇల్లును తండ్రి వీలునామాలో ఆమె పేరున రాశాడు. అది ఊరి చివర టివోలికి దగ్గర్లోనే ఉంది. సాయంత్రాలలో, రాత్రులలో బ్యాండుమేళం వాయించే పాటలను, బాణాసంచా ధ్వనులను వింటుంది ఆమె. కుకిన్ తన ప్రధాన శత్రువులైన నిర్లిప్త ప్రేక్షకులను ఎదుర్కొంటూ తన దురదృష్టంతో పోరాడుతున్నాడని అనిపిస్తుంది ఆమెకు. ఆమె హృదయంలో ఒక మధురమైన తీపు చోటుచేసుకొని, నిద్ర పోవాలనే కోరిక లేకుండా చేస్తుంది. అతడు ఉదయం వేళ నాటకశాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతడిని స్వాగతించి స్నేహపూర్వకమైన నవ్వును ప్రదర్శిస్తుంది ఆమె.
అతడు ఆమె ముందు పెళ్లిప్రతిపాదనను పెట్టగానే ఆమె అంగీకరించడంతో వాళ్ల వివాహం జరిగింది. ఆమె మెడనూ, గుండ్రటి భుజాలనూ చూసినప్పుడు అతడు తన చేతులను ఊపుతూ “డార్లింగ్” అంటాడు.
కుకిన్ సంతోషంగా ఉన్నాడు. కానీ పెళ్లినాడు రాత్రింబవళ్లు వాన పడటంతో అతని ముఖం మీద నిరాశ తాండవించింది.
వాళ్లు ఒకరితో ఒకరు చాలా బాగా మెదిలారు. ఆమె టివోలి ఆఫీసులో కూర్చుని లెక్కలు, జీతభత్యాలు మొదలైన వ్యవహారాలను చూస్తుంది. ఆమె గులాబీ చెక్కిళ్లు, వెలుగును చిందించే మధురమైన అమాయకపు నవ్వు ఆఫీసు కిటికీలోంచి కనిపిస్తాయి. కొన్నిరోజులుగా టివోలి లోని రెస్టారెంట్లో స్టేజి వెనుకభాగంలో కూడా అవి కనిపిస్తున్నాయి. ఆ నాటకశాల తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఆస్తి అనీ, నాటకాలను చూడటం ద్వారా మాత్రమే ప్రజలు నిజమైన ఆనందాన్ని పొంది మానవత్వం, సంస్కారం గలవాళ్లుగా మారుతారనీ అంటుంది ఆమె.
“కానీ ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకుంటారా? వాళ్లకు హాస్యనటులు కావాలి. నిన్న మేము యోహాన్ ఫౌస్ట్ జీవితం గురించిన ఒక నాటకాన్ని ప్రదర్శిస్తే సీట్లు దాదాపు అన్నీ ఖాళీగా ఉండిపోయాయి. అసభ్యత నిండిన నాటకాన్ని ప్రదర్శిస్తే మాత్రం సీట్లన్నీ నిండిపోతాయని ఘంటాపథంగా చెప్పగలను. రేపు మేము ‘నరకంలో ఆర్ఫియస్’ అనే నాటకాన్ని వేయబోతున్నాము. తప్పక రండి,” అన్నది ఓలెంకా.
తమ థియేటర్ గురించి, నటుల గురించి కుకిన్ ఏం చెప్తాడో దాన్నే వల్లిస్తుంది ఆమె. అతనిలాగే ఆమె కూడా ప్రేక్షకుల అజ్ఞానాన్నీ కళపట్ల వారికి గల అనాసక్తతనూ నిరసిస్తుంది. ఆమె రిహార్సల్స్ లో పాలు పంచుకుంటుంది. నటుల నటనలోని దోషాలను సవరిస్తుంది. సంగీత కళాకారులు ఎలా వాయిస్తున్నారోనని వాళ్లమీద ఓ కన్నేసి ఉంచుతుంది. స్థానీయ పత్రికలలో ప్రతికూలమైన సమీక్షలు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. తర్వాత ఎడిటర్ దగ్గరకు పోయి, అటువంటి సమీక్షలు పునరావృతం కాకుండా పరిస్థితిని చక్కబెడుతుంది.
నటీనటులు ఆమె పట్ల సహృదయతను, ప్రేమను చూపుతూ ఆమెను “ప్రియతమురాలు”గా వర్ణిస్తారు. ఆమె వాళ్లమీద సహానుభూతిని చూపడమే కాకుండా అప్పడప్పుడు చిన్న మొత్తాలలో డబ్బును అప్పుగా ఇస్తుంది. వాళ్లు అప్పు తీర్చకుండా మోసం చేసినప్పుడు ఏకాంతంలో కన్నీళ్లు కారుస్తుంది తప్ప వాళ్లమీద తన భర్తకు ఫిర్యాదు చేయదు.
చలికాలంలో కూడా వాళ్లు నాటకాలను బాగానే వేశారు. ఆపకుండా ప్రదర్శనలివ్వడమే కాకుండా మధ్యమధ్య తమ హాలును లిటిల్ రష్యన్ అనే కంపెనీకి, కొన్నిసార్లు మ్యాజిక్ షోలకు లేదా స్థానీయ నాటక పరిషత్తులకు అద్దెకు ఇస్తారు. ఓలెంకా లావెక్కి సంతృప్తితో వెలిగిపోయింది. కుకినేమో కొంచెం బక్కచిక్కి పాలిపోయాడు. పెద్ద నష్టాలు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. అయితే చలికాలమంతా కలిపి చూస్తే పెద్దగా నష్టాలు లేవు. అతడు రాత్రివేళ దగ్గుతో బాధ పడేవాడు. ఆమె అతనికి హెర్బల్ టీ, కషాయద్రవాలను ఇచ్చి, యూ డి కొలోన్ రుద్ది, అతడిని వెచ్చని గుడ్డలలో చుట్టిపెట్టేది.
అతని తలవెంట్రుకలను దువ్వుతూ, “నువ్వు నా బంగారు కొండవు. నాకు ప్రియమైనవాడివి,” అంటుంది.
ఈస్టర్ పండుగకు ముందరి నలబై రోజుల ఉపవాస ప్రార్థనల కాలంలో కొత్త నటీనటులను చేర్చుకునేందుకు అతడు మాస్కోకు పోయాడు. ఆ సమయాల్లో అతడు లేకుండా ఆమెకు నిద్ర పట్టలేదు. దాంతో ఆమె రాత్రంతా కిటికీ దగ్గర కూర్చుని నక్షత్రాలను వీక్షించింది. ఆమె తనను తాను పుంజును వీడి మనశ్శాంతిని కోల్పోయే కోడిపెట్టతో పోల్చుకుంది. కుకిన్ మాస్కోలో చిక్కుకుపోయాడు. తను ఈస్టర్ పండుగ నాటికి వస్తానని ఉత్తరం రాస్తూ అందులో టివోలికి సంబంధించిన కొన్ని సూచనలు చేశాడు. కానీ ఈస్టర్ ముందరి ఆదివారం నాడు విషాదాన్ని సూచిస్తున్నట్టుగా ఆగకుండా గేటుమీద దడదడ శబ్దం వినిపించింది. మగతలో ఉన్న వంటమనిషి చెప్పులు లేని కాళ్లతో నీటిగుంటల్లోంచి నడుస్తూ గేటు దగ్గరికి పోయింది.
బయటనుంచి ఒకతను “గేటు తెరవండి. మీకొక టెలిగ్రాము వచ్చింది,” అన్నాడు.
గతంలో కూడా ఓలెంకాకు తన భర్త నుండి టెలిగ్రాములు వచ్చాయి. కానీ ఎందుకో ఈసారి ఆమెకు భయం కలిగింది. వణికే చేతులతో టెలిగ్రామును పట్టుకొని చదివింది. అందులో ఇలా ఉంది: “ఇవాన్ పెట్రోవిచ్ ఇవాళ అకస్మాత్తుగా చనిపోయాడు. అధికారుల నుండి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. మంగళవారం నాడు శవయాత్ర.”
టెలిగ్రాములో అలా శవయాత్ర అనీ, అర్థం కానివిధంగా పై అధికారులు అనీ పదాలు వాడారు. ఆ టెలిగ్రాము మీద తమ కంపెనీకి చెందిన నాటకరంగస్థల నిర్వాహకుని సంతకం ఉంది.
“నా ప్రియతముడా. నా బంగారు కొండా. అసలు నాకు నీతో ఎందుకు పరిచయం కలిగింది? నిన్నెందుకు ప్రేమించాను నేను? గుండె పగిలి దీనురాలుగా మిగిలిన నీ ఓలెంకా ఇప్పుడు ఒంటరిదైంది.” అంటూ ఏడ్చింది ఆమె.
మాస్కోలో కుకిన్ శవయాత్ర మంగళవారం నాడు జరిగింది. బుధవారం నాడు ఓలెంకా తిరిగి ఇల్లు చేరింది. ఇంటిలోపలికి పోగానే ఆమె మంచంమీద పడిపోయి ఎంత బిగ్గరగా ఏడ్చిందంటే, ఆ ఏడుపు పక్కింటికే కాకుండా వీధిలో కూడా వినిపించింది.
“పాపం ఓలెంకా డార్లింగ్ ఈ విషాదాన్ని ఆమె ఎలా తట్టుకుంటుంది,” అనుకున్నారు ఇరుగుపొరుగువాళ్లు.
మూడు నెలల తర్వాత ఓలెంకా సామూహిక ప్రార్థన నుండి దిగులుతో, అత్యంత దుఃఖంతో ఇంటికి తిరిగి వస్తోంది. తన పొరుగింటివాడైన వాసిలీ ఆండ్రీచ్ పుస్తొవలోవ్ కూడా చర్చి నుండి తిరిగి వస్తూ ఓలెంకా పక్కన నడిచాడు. అతడు బాబాకాయేవ్ అనే కలప దుకాణంలో మేనేజరుగా పని చేస్తున్నాడు. గడ్డితో తయారైన టోపీనీ, ఒక తెల్లని అరచొక్కాయనూ, మణికట్టు మీద బంగారు గొలుసునూ ధరించి ఉన్నాడు. వ్యాపారస్థునిలా కాకుండా గ్రామాల్లోఉండే పెద్దమనిషి లాగా కనిపిస్తున్నాడు.
“ఓల్గా సెమ్యొనోవ్నా! ప్రతిదీ ముందే నిర్ణయింపబడిన విధంగానే జరుగుతుంది. మనకు ప్రియమైనవాళ్లెవరైనా చనిపోతే అది దేవుని ఇచ్ఛ కాబట్టి మనం ధైర్యంతో, అణకువతో దాన్ని భరించాలి,” అన్నాడతడు.
ఓలెంకాను గేటుదగ్గరిదాకా అనుసరించి, వీడ్కోలు పలికి, వెళ్లిపోయాడతడు. తర్వాత ఆ రోజంతా ఆమె అతని గంభీరమైన, హుందా అయిన గొంతుకను విన్నది. కళ్లు మూసుకున్న ప్రతిసారి ఆమెకు అతని నల్లని గడ్డం కనిపించింది. అతణ్ని ఆమె చాలా ఇష్టపడింది. అతని దృష్టిలో కూడా ఆమె మంచి అభిప్రాయాన్ని, స్థానాన్ని పొందినట్టుంది. కొన్ని రోజుల తర్వాత, తనకు పరిచయమున్న ఒక పెద్దావిడ కాఫీ తాగేందుకు వచ్చింది. బల్ల దగ్గర కూర్చోగానే ఆమె పుస్తోవలోవ్ గురించి మాట్లాడటం మొదలు పెట్టింది. అతడు చాలా మంచివాడు అనీ, ఎవరైనా అతనిమీద పూర్తిగా ఆధారపడవచ్చుననీ, ఏ స్త్రీ అయినా అతణ్ని సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది అనీ అన్నది. మూడు రోజుల తర్వాత పుస్తోవలోవ్ స్వయంగా వచ్చాడు. కేవలం పది నిమిషాలసేపే ఉండి కొద్దిగా మాత్రమే మాట్లాడి వెళ్లిపోయాడు. కానీ అతడు వెళ్లిపోయాక ఓలెంకాకు అతనిమీద ప్రేమ పుట్టింది. ఎంతగా అంటే, రాత్రంతా మెలకువగా ఉండి, తెల్లవారగానే ఆ పెద్దావిడ కోసం కబురు చేసేటంతగా. సంబంధం త్వరగా నిర్ణయమైపోయి పెళ్లి జరిగింది.
వివాహం తర్వాత పుస్తోవలోవ్, ఓలెంకా ఒకరితో ఒకరు చాలా సఖ్యతతో మెలిగారు.
అతడు మధ్యాహ్న భోజన సమయం దాకా దుకాణంలో ఉండి, తర్వాత వ్యాపారపు పని మీద బయటికి పోయేవాడు. ఓలెంకా సాయంత్రం దాకా అతని స్థానంలో కూర్చొని ఉండి లెక్కలు చూస్తూ, ఆర్డర్లు తీసుకుంటూ పని చేసేది.
“ప్రతి సంవత్సరం కలప రేటు ఇరవై శాతం పెరుగుతుంది. ఇంతకాలం మేము స్థానీయ కలపను అమ్మాము. కానీ ఇప్పుడు నా భర్త మోగిలెవ్ జిల్లాకు పోయి కలపను కొంటున్నాడు. మరి రవాణా చార్జీలు కూడా ఉంటాయి కదా,” అంటుంది ఆమె భయంగా, తన చెక్కిళ్లను చేతులతో కప్పుకుంటూ.
తను ఎన్నో సంవత్సరాలుగా కలప వ్యాపారంలో ఉన్నట్టు, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, అవసరమైన వస్తువు కలపనే అయినట్టు భావిస్తుంది ఆమె. చెక్క, మొద్దు, దుంగ, వాసం మొదలైన మాటలను విన్నప్పుడల్లా ఆమెకు పారవశ్యం లాంటిది కలుగుతుంది.
రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఆమె పెద్దమొత్తంలో కలపముక్కలను, పొడవైన కర్రదుంగలను దూరప్రాంతాలకు తరలిస్తున్నట్టు కల గంటుంది. ఆరంగుళాల వెడల్పు, నలబై అడుగుల పొడవు ఉన్న దుంగలు నిటారుగా నిలబడి తమ దుకాణం వైపు నడుస్తున్న దృశ్యాన్ని కలలో చూస్తుంది. ఆ దుంగలు, వాసాలు, పలకలు కింద పడిపోయి మళ్లీ లేచి ఒకదానిమీద ఒకటి చేరుతాయి ఆ కలలో. అప్పుడు ఆమె నిద్రలోనే గట్టిగా అరుస్తుంది. పుస్తోవలోవ్ ప్రేమగా, “ఓలెంకా. ఏమైది డార్లింగ్? శిలువ ఆకారంలో చేతులు కదుపుకో,” అంటాడు.
తన భర్త అభిప్రాయాలే ఆమె అభిప్రాయాలు. గది బాగా వేడిగా ఉందని కానీ వ్యాపారం మందకొడిగా సాగుతున్నదని కానీ అతడు అంటే, ఆమెకు కూడా అలానే అనిపిస్తుంది. ఆమె భర్త వినోదాలకు విలువనివ్వడు. సెలవు రోజులలో ఇంటిపట్టుననే ఉంటాడు. ఆమె కూడా అదే చేస్తుంది.
“నువ్వెప్పుడూ ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటావు. అప్పుడప్పుడు సినిమాకో సర్కసుకో పోవాలి డార్లింగ్,” అంటారు ఆమె స్నేహితులు. “పిచ్చి సినిమాలకు వెళ్లేంత టైము మా దగ్గర లేదు. వాటివలన ఏం ప్రయోజనం?” అని గంభీరంగా జవాబిస్తుంది ఓలెంకా.
శనివారాలలో సాయంత్రం వాళ్లిద్దరు చర్చికి పోతారు. సెలవు దినాలలోనేమో ఉదయపు సామూహిక ప్రార్థనలకు. చర్చినుండి ఇంటికి వచ్చేటప్పుడు ప్రశాంతమైన ముఖాలతో ఒకరిపక్కన ఒకరు నడుస్తారు. వాళ్లదగ్గర ఎప్పుడూ ఒక పరిమళం గుబాళిస్తుంది. ఓలెంకా తొడుక్కునే సిల్కు డ్రెస్సు చేసే గరగర శబ్దం హాయిగా ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్లు బ్రెడ్డు, రకరకాల జామ్ తింటారు. టీ తాగుతారు. తర్వాత అప్పం లాంటి పిండి వంటకం తింటారు. ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ల ఇంట్లోంచి బీట్ రూట్ సూపు, బాతుకూరల వాసన వస్తుంది. ఉపవాస దినాలలో చేపకూర వాసన వస్తుంది. ఆఫీసులో సమోవర్ అనే పెద్ద టీ పాత్రలో చాయ్ ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది. కొనుగోలుదారులకు టీ, బిస్కెట్లు ఇచ్చి సత్కరిస్తారు. వారానికొకసారి వాళ్లు స్నానశాలకు పోయి సిగ్గుతో, ఉద్వేగంతో ఎర్రబడిన ముఖాలతో ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఇంటికి వస్తారు.
“దేవుని దయ వల్ల మాకు ఏ చింతలూ లేవు. అందరూ మా లాగానే సమృద్ధితో ఉండాలని కోరుకుంటాను నేను,” అని అంటుంది ఓలెంకా.
కలపను కొనేందుకు పుస్తోవలోవ్ మోగిలెవ్ జిల్లాకు పోయినప్పుడు ఆమె తన భర్తను బాగా మిస్ అవుతూ మెలకువతో ఉంటూ, రాత్రుళ్లలో ఏడుస్తుంది. మిలిటరీలో పని చేసే స్మిర్నిన్ అనే ఒక యువ పశువైద్యుడు కొన్నిసార్లు సాయంత్రపు వేళల్లో ఇంటికి వచ్చేవాడు. ఓలెంకా వాళ్లు తమ ఇంటిలో ఒక భాగాన్ని అతనికి అద్దెకు ఇచ్చారు. అతడు ఆమెతో మాట్లాడటం, పేకాట ఆడటం వలన ఆమెకు కొంచెం కాలక్షేపం అయ్యేది. అతని వ్యక్తిగత జీవితపు వివరాలు ఆమెకు ఆసక్తికరంగా ఉండేవి. అతనికి పెళ్లైంది. ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ స్మిర్నిన్ భార్య నుండి విడిపోయాడు. ఎందుకంటే ఆమె అతనికి నైతికంగా ద్రోహం చేసింది. కాబట్టి తమ కొడుకు జీవన వ్యయం కోసం నెలకు నలబై రూబుల్స్ పంపిస్తాడు. ఇదంతా విని ఓలెంకా చాలా చింతించింది.
అతడు మెట్లు దిగుతూ వెళ్లిపోయేటప్పుడు కొవ్వొత్తి వెలుగును చూపుతూ, “దేవుని ఆశీర్వాదం మీమీద ఉండనీ. వచ్చి నాకు కాలక్షేపం కలిగించినందుకు ధన్యవాదాలు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను,” అనేది.
ఆమె తన భర్త మాటలను అనుసరిస్తూ ఎప్పుడూ ఆత్మగౌరవం ఒలికేలా గంభీరంగా, సమంజసంగా మాట్లాడుతుంది. ఒకసారి ఆ పశువైద్యుడు కింది తలుపును తెరిచి వెళ్లిపోతుంటే ఇలా అన్నది: “స్మిర్నిన్ గారూ, మీరు మీ భార్యతో సయోధ్య కుదుర్చుకోవాలి. మీ కొడుకు కోసమైనా ఆమెను క్షమించాలి. ఆ పిల్లవాడు మనసులో ఎలా బాధ పడుతాడో మీకు తెలిసే ఉండాలి.”
పుస్తోవలోవ్ తిరిగి వచ్చాక ఆ పశువైద్యుని దుఃఖమయమైన వ్యక్తిగత జీవితం గురించి అతనికి తగ్గుస్వరంలో చెప్పింది. ఇద్దరూ చింతించి, ఆ పిల్లవాడు తండ్రిని ఎంతో మిస్ అవుతుంటాడని బాధ పడ్డారు. చిత్రంగా వారి ఊహలు కలిసిపోయి, వాళ్లు దేవుళ్ల పటాల దగ్గరికి పోయి, తమకు పిల్లలను ఇవ్వవలసిందిగా వేడుకున్నారు.
ఆ విధంగా ఆ భార్యాభర్తలు ఆరు సంవత్సరాల పాటు ప్రశాంతంగా, పూర్తి ఒద్దికగా ఉన్నారు.
కానీ ఒక చలికాలపు రోజున పుస్తోవలోవ్ ఆఫీసులో టీ తాగి కోటూ టోపీ పెట్టుకోకుండా దుకాణపు వెనుకకు పోయాడు, కలపను పంపే వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు. దాంతో జలుబు, దగ్గు, జ్వరం తగిలి జబ్బు పాలయ్యాడు. ఎంతో మంచి వైద్యులకు చూపించుకున్నాడు కానీ వ్యాధి ముదిరిపోయి, నాలుగు నెలల తర్వాత మరణించాడు. ఓలెంకా మరోసారి విధవరాలు అయింది.
శవదహన కార్యక్రమం ముగిసిన తర్వాత, “ప్రియతమా, నన్ను వదిలి పోయావు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నువ్వు లేకుండా ఈ దౌర్భాగ్యంతో నేనెలా బతకగలను?” అంటూ భర్తను తల్చుకుంటూ బాగా ఏడ్చింది.
వైధవ్యాన్ని సూచించే నల్లని దుస్తులను తొడుక్కుని తిరిగింది ఆమె. టోపీ, చేతితొడుగులను ధరించడం కూడా శాశ్వతంగా మానుకుంది. చర్చికి, భర్త సమాధి దగ్గరికి తప్ప ఎక్కడికీ పోలేదు. ఒక సన్యాసిని జీవితాన్ని గడిపింది. ఆరు నెలల తర్వాత నల్లని దుస్తులను ధరించడం మాని, ఇంటి కిటికీ తలుపులు తెరిచింది. వెచ్చాలు తెచ్చుకోవడం కోసం వంటమనిషితో అరుదుగా బజారుకు పోయింది. ఆమె ఎలా బతుకుతున్నదో ఆ ఇంట్లో ఏం జరగుతున్నదో ఊహించడమే తప్ప, ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. లాన్ లో పశువైద్యునితో కలిసి ఆమె టీ తాగడం, అతడు ఆమె కోసం వార్తాపత్రికలను బిగ్గరగా చదవడం ఇరుగుపొరుగువాళ్లు గమనించారు. తనకు తెలిసిన ఒకావిడ పోస్టాఫీసు దగ్గర కనిపించినప్పుడు ఆమెతో ఇలా అన్నది ఓలెంకా:
“మన ఊళ్లోని పశుపక్ష్యాదులను పరీక్షించేందుకు వ్యవస్థ లేదు. అందుకే ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. పాల ద్వారా, ఆవుల ద్వారా, గుర్రాల ద్వారా రోగాలు వస్తున్నాయి. మనుషుల ఆరోగ్యం గురించి పట్టించుకున్నట్టే పెంపుడు జంతువుల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి.”
అవి పశువైద్యుని మాటలు. ప్రతి విషయంలో ఆమె అతనితో ఏకీభవించింది. ఏదో ఒక రకమైన బంధం లేకుండా ఆమె ఒక సంవత్సరం కూడా గడపలేకపోయిందనీ, ఇంట్లోనే కొత్త ఆనందాన్ని కనుక్కున్నదనీ చుట్టుపక్కలవాళ్లకు తెలిసిపోయింది. వేరేవాళ్లైతే విమర్శించేవారే కాని, ఓలెంకా గురించి చెడుగా ఆలోచింలేకపోయారు వాళ్లు. ఆమె ఏం చేసినా అది చాలా సహజంగా ఉండేది. ఆమెగానీ పశువైద్యుడు గానీ తమ మధ్య ఉన్న సంబంధాన్ని బాహాటంగా ఇతరులకు చెప్పుకోలేదు. అయినా వాస్తవం బయట పడింది. ఎందుకంటే ఓలెంకా రహస్యాలను దాచలేదు. ఒకసారి అతని సహోద్యోగులు వచ్చినప్పుడు ఓలెంకా వాళ్లకు భోజనం పెట్టింది. అప్పుడు పశువుల ప్లేగు గురించి, గాలికుంటు వ్యాధి గురించి, మునిసిపల్ కబేళాల గురించి మాట్లాడింది. అతడు చాలా ఇబ్బందికి గురయ్యాడు. వాళ్లు పోయిన తర్వాత అతడు ఆమె చేయిని గట్టిగా పట్టుకొని కోపంతో, “తెలియని విషయాల గురించి మాట్లాడవద్దని చెప్పాను నీకు. మేము మా వృత్తి గురించి మాట్లాడుకునేటప్పుడు దయచేసి నువ్వు మధ్యలో దూరకు. అది చాలా చిరాకును కలిగిస్తుంది,” అన్నాడు.
ఆమె అతడిని ఆశ్చర్యంతో, నిరాశతో చూసింది. అప్పుడు గాబరాతో “మరి దేనిగురించి మాట్లాడాలి?” అని అడిగింది. అశ్రువులు నిండిన కళ్లతో అతడిని వాటేసుకుని, కోపానికి రావద్దని అతణ్ని వేడుకుంది. తర్వాత వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు.
కానీ ఈ సంతోషం ఎక్కువకాలం కొనసాగలేదు. అధికారులు అతని బృందాన్ని చాలా దూరప్రాంతానికి బదిలీ చేశారు. అది బహుశా సైబీరియా కావచ్చు. ఓలెంకా మళ్లీ తోడులేని స్త్రీ అయింది.
ఈసారి ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయాడు. అతని కుర్చీ కాలు ఒకటి విరిగిపోయి, దుమ్ము కొట్టుకుని అటక మీదికి చేరింది. ఆమె బక్కచిక్కి, ముఖం కళావిహీనమైంది. వీధిలో మనుషులు ఆమెను కలిసినప్పుడు ముందు లాగా నవ్వలేదు. జీవితం లోని మంచికాలం ఆమెను వీడిపోయి కొత్తరకం జీవితం మొదలైంది. సాయంత్రపు వేళల్లో ఓలెంకా వరండాలో కూర్చుని టివోలి నుండి వచ్చే బ్యాండు ధ్వనిని విన్నది, బాణాసంచా వెలుగులను వీక్షించింది. కానీ ఆ చప్పుడు ఆమెను కదిలించడం లేదు. పెరడులోకి నిర్లిప్తంగా చూడటం, దేనిగురించీ ఆలోచించకపోవడం, దేన్నీ కోరుకోకపోవడం ఆమె వంతైంది. రాత్రి కాగానే పడక మీదికి చేరి ఖాళీ పెరడును కల గంటోంది. బలవంతంగా తిండి తింటోంది.
అత్యంత అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే, ఆమెకు ఏ రకమైన అభిప్రాయాలు లేవు. వస్తువులను, విషయాలను చూసి అవేమిటో తెలుసుకుంటోంది గానీ, వాటిని గురించిన అభిప్రాయాలను ఏర్పరచుకోవడం లేదు. వాటి గురించి ఏం మాట్లాడాలో ఆమెకు తెలియడం లేదు. అభిప్రాయాలను కలిగి ఉండకపోవడం ఎంత భయంకరం! ఉదాహరణకు మనం ఒక సీసాను, లేదా వానను, లేక బండి నడుపుతున్న ఒక రైతును చూస్తాం. కానీ ఆ సీసా, వాన, లేదా రైతు ఉండటం వెనుక ఉద్దేశమేమిటో వెయ్యి రూపాయలిచ్చినా చెప్పలేకపోవటం. కుకిన్, పుస్తోవలోవ్, స్మిర్నిన్ ఉన్నప్పుడు ఓలెంకా ప్రతి విషయాన్ని వివరించగలిగేది. ప్రతిదానికి వివరణ ఇవ్వగలిగేది. కానీ ఇప్పడు ఆమె మెదడులో, హృదయంలో తన పెరడులో ఉన్నంత శూన్యం చోటు చేసుకుంది. ఈ వాస్తవం నోట్లో మాచిపత్రి వేసుకున్నంత చేదుగా, కటువుగా ఉంది.
విడతలు విడతలుగా నగరం అన్నివైపులా వ్యాపించింది. చిన్న రోడ్డు వీధిగా మారింది. టివోలి, కలప దుకాణం ఉండిన చోట్లలో కొత్త ఇండ్లు, మలుపులు వెలిశాయి. కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది! ఓలెంకా ఇల్లు మురికిగా తయారైంది. పైకప్పు చెడిపోయింది. వరండా ఒకవైపు కుంగిపోయింది. పెరడు మొత్తం దురదగొండి మొదలైన పిచ్చిమొక్కలతో నిండిపోయిది. ఓలెంకానేమో వయసు మీరినదానిగా, బోసిగా తయారైంది. వేసవిలో ఆమె వరండాలో కూర్చుంటుంది. ఆమె మనసు ముందులాగానే నిర్లిప్తంగా, చేదుగా మారి నిరాశతో నిండిపోయింది. చలికాలంలో కిటికీ దగ్గర కూర్చుని మంచును చూస్తుంది. వసంత కాలపు వాసన వచ్చినప్పుడు లేదా చర్చిగంటలను విన్నప్పుడు పాత జ్ఞాపకాలు ఆమెను అకస్మాత్తుగా ముంచెత్తుతాయి. అప్పుడు హృదయంలో సన్నని తీపు మొదలై కళ్లు అశ్రువులతో నిండిపోతాయి. కానీ అది ఒక్క నిమిషం సేపు మాత్రమే. తర్వాత మళ్లీ శూన్యం, జీవితం వ్యర్థం అనే భావన. తన నల్లపిల్లి బ్రిస్కా ఆమెను రాసుకుంటూ కూర్చుంటుంది. కానీ ఓలెంకాలో ఏ భావోద్వేగమూ కలగదు. ఆమె కోరుకునేది అది కాదు. తన మొత్తం శరీరాన్ని, ఆత్మను, బుద్ధిని నిలువెల్లా ఆవహించే ప్రేమ కావాలి ఆమెకు. అటువంటి ప్రేమ తన జీవితానికి ఊహలనూ ఉద్దేశాన్నీ ఇచ్చి రక్తాన్ని వెచ్చబరుస్తుంది. ఆమె ఆ నల్లపిల్లిని తోసేసి చిరాకుతో, “పో. నువ్వు వద్దు నాకు,” అంటుంది.
ఆ విధంగా రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా ఆమెలో ఆనందం గానీ అభిప్రాయాలు గానీ చోటు చేసుకోలేదు. వంటమనిషి మావ్రా ఏ వ్యాఖ్య చేసినా దాన్ని ఒప్పుకుంటుంది.
వేడిమి ఎక్కువగా ఉన్న జూలై నెలలోని ఒకనాడు పశువులు మేతకు వెళ్తున్నప్పుడు, వరండా అంతా దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పుడు, ఎవరో అకస్మాత్తుగా గేటుమీద శబ్దం చేశారు. గేటు తీయడం కోసం ఓలెంకా బయటకు పోయి ఎదురుగా కనపడిన వ్యక్తిని చూసి నిశ్చేష్టురాలైంది. ఆ వ్యక్తి స్మిర్నిన్. మామూలు దుస్తులలో, నెరిసిన తలతో కనిపించాడు. ఆమెకు ఎకాయెకిన అంతా జ్ఞాపకానికి వచ్చింది. ఆమె ఏడవకుండా ఉండలేకపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని ఛాతీమీద పడిపోయింది. అతనితో కలిసి ఇంట్లోపలికి ఎలా పోయిందో, టీ ఎలా చేసిందో ఆ ఉద్వేగ తీవ్రతలో గమనించలేకపోయింది ఆమె.
“నా ప్రియమైన స్మిర్నిన్! ఏ మంచి విధి నిన్నిక్కడికి తీసుకుని వచ్చింది?” అని ఆనందంతో వణుకుతూ గొణిగింది.
“ఓలెంకా, నేనిక్కడ శాశ్వతంగా స్థిరపడిపోవాలని అనుకుంటున్నాను. నా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను. ఇక్కడే సెటిలైపోయి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను. పైగా నా కొడుకును బడిలో వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వాడు పెద్ద పిల్లవాడు. నేను నా భార్యతో సయోధ్య కుదుర్చున్నాను.”
“ఆమె ఎక్కడుంది?” అని అడిగింది ఓలెంకా.
“పిల్లవాడితో హోటల్లో ఉంది. నేను అద్దె ఇళ్లకోసం వెతుకుతున్నాను.”
“నా ప్రియతముడా, అద్దె ఇల్లా? నా యింట్లో ఎందుకుండరు? ఇది మీకు ఎందుకు సరిపోదు? నేను అద్దె ఏమీ తీసుకోను,” అంటూ ఉద్వేగ తీవ్రతలో ఓలెంకా మళ్లీ ఏడ్వటం మొదలు పెట్టింది. “మీరు నా ఇంటి పోర్షనులోనే ఉండండి. అబ్బ, ఇప్పుడు నేనెంత సంతోషంగా ఉన్నానో.”
మరునాడు పైకప్పుకు పెయింటు, గోడలకు సున్నం వేశారు. ఓలెంకా నడుము మీద చేతులు పెట్టుకొని తిరుగుతూ పనివాళ్లను పురమాయించింది. ఆమె ముఖం మునుపటి నవ్వుతో వెలిగిపోయింది. దీర్ఘనిద్ర తర్వాత మేల్కొన్నట్టు ఆమెలో చురుకుదనం ప్రవేశించింది. స్మిర్నిన్ భార్య వచ్చింది. ఆమె బక్కపలుచగా మామూలు చాయతో ఉంది. తలవెంట్రుకలు పొట్టిగా ఉండి, ఆమె ముఖంలో కొంచెం చిరాకు కనిపిస్తోంది. ఆమె వెంట పదేళ్ల కొడుకు సాశా ఉన్నాడు. నీలిరంగు కళ్లతో, గుంటలు పడే బూరుబుగ్గలతో ముద్దొస్తున్నాడు వాడు. నల్లపిల్లిని వెంబడిస్తూ పెరడులోకి పోయాడు. వెంటనే సంతోషం నిండిన వాడి కేరింత వినపడింది.
“ఇది మీ పిల్లిపిల్లేనా ఆంటీ? దీనికి పిల్లలు పుట్టినప్పుడు మాకొక పిల్లను ఇవ్వండి. ఎలుకలంటే మా అమ్మకు చచ్చేంతగా భయం,” అన్నాడు సాశా.
ఓలెంకా వాడితో మాట్లాడి టీ ఇచ్చింది. ఆమె హృదయం వెచ్చబడి, ఆ బాబు తన సొంత కొడుకు అన్నట్టు ఎదలో తియ్యని తీపు నెలకొంది. సాయంత్రం వేళ బల్ల దగ్గర సాశా పాఠాలు చదువుకుంటుంటే వాడిని కరుణ, ఆర్ద్రత నిండిన చూపులతో చూస్తూ, తనలో తాను ఇలా గొణుక్కుంది:
“బంగారు కొండ. ఎంతో తెలివైన బుడతడు.”
“అన్నివైపులా నీటిచేత ఆవరింపబడిన భూభాగాన్ని ద్వీపం అంటారు,” అని బిగ్గరగా చదువుతున్నాడు వాడు.
“అన్ని వైపులా నీటిచేత..” అని ఆమె పునశ్చరణ చేసింది. చాలా సంవత్సరాల మౌనం, అభిప్రాయ రాహిత్యం తర్వాత మళ్లీ ఆమె అభిప్రాయంతో కూడుకున్న ఒక వాక్యాన్ని పలికింది.
ఇప్పుడామెకు సొంత అభిప్రాయాలున్నాయి. రాత్రి భోజనాలప్పుడు ఆమె సాశా తల్లిదండ్రులతో, హైస్కూలు పాఠాలు ఎంతో కఠినంగా ఉన్నా అది మంచిదేననీ, ఎందుకంటే దాని తర్వాత డాక్టరు లేదా ఇంజినీరు కోర్సులలోకి పోవచ్చుననీ అన్నది.
సాశా హైస్కూలుకు పోవడం మొదలు పెట్టాడు. వాడి తల్లి తన సోదరి ఉంటున్న హార్కోవ్ అనే ఊరికి పోయి తిరిగి రాలేదు. స్మిర్నిన్ ప్రతిరోజు పశువులను పరీక్షించడానికి పోయేవాడు. ఒక్కోసారి పని మీద వేరే ఊళ్లకు పోయి మూడు రోజుల దాకా వచ్చేవాడు కాదు. సాశా పూర్తిగా వదిలిపెట్టబడ్డాడనీ, తిండి లేక చిక్కిపోతున్నాడనీ అనుకుని ఓలెంకా వాడిని తన ఇంట్లోకి తెచ్చి వాడికి ఒక చిన్న గదిని ఇచ్చింది.
సాశా ఆరునెలల పాటు ఓలెంకాతో ఆ ఇంట్లో ఉన్నాడు. ఆమె ప్రతిరోజు ఉదయం వేళ సాశా గదిలోకి వచ్చి చూస్తుంది. వాడు చేయిని చెక్కిలి కింద పెట్టుకుని నిశ్శబ్దంగా గాఢనిద్రలో ఉంటాడు. వాడిని లేపేందుకు ఆమె మనసు నొచ్చుకుంటుంది.
“సాశా. లే బాబూ. బడికి వేళవుతోంది,” అంటూ లేపుతుంది అయిష్టంగా.
వాడు లేస్తాడు. డ్రెస్ తొడుక్కుని ప్రార్థన చేసింతర్వాత, వెన్న పూసిన సగం బ్రెడ్ రోల్, రెండు పెద్ద బిస్కెట్లు తిని, మూడు గ్లాసుల టీ తాగుతాడు. ఆ టైములో వాడు మగతగా, చికాకుగా ఉంటాడు.
“చిన్న కథ నీకింకా పూర్తిగా కంఠస్థం కాలేదు సాశా. నీతో ఎంత కష్టంగా ఉన్నదో కదా. నువ్వు బాగా చదువుకోవాలి. నీ టీచర్లకు విధేయుడుగా ఉండాలి,” అంటుంది ఆమె, వాడు ఏదో చాలా దూరపు ప్రయాణం మీద వెళ్తున్నట్టు.
“అబ్బా, నన్ను వదిలెయ్,” అంటాడు సాశా.
తర్వాత తలమీద పెద్ద టోపీతో, భుజానికి బ్యాగుతో బడికి పోయేందుకు రోడ్డుమీద పడతాడు. ఓలెంకా నిశ్శబ్దంగా వెంట నడుస్తుంది.
“సాశా” అని పిలిచి, ఒక ఖర్జూరం పండును లేదా చక్కెరపాకపు బిస్కెట్ ను చేయిలో పెడుతుంది. సాశా తన బడిని చేరుకున్నప్పుడు ఒక ఎత్తైన, లావైన స్త్రీ తనను అనుసరిస్తున్నందుకు సిగ్గు పడి, “ఇక నువ్వు వెళ్లిపో ఆంటీ. ఇక్కడినుండి నేను ఒంటరిగా వెళ్లగలను,” అంటాడు. ఆమె నిశ్చలంగా నిలబడి, సాశా బడిగేటు లోంచి లోపలికి పోయి అదృశ్యమయ్యేదాకా అక్కడే ఉంటుంది.
వాడిని ఆమె ఎంతగా ప్రేమిస్తుంది! తనకు గతంలో ఉండిన బంధాలలో ఏదీ దీనంత బలంగా లేదు. తన ఆత్మ ఇంతగా ఎప్పుడూ దేనికీ లోబడలేదు. ఇంత ఆనందకరంగా మాతృత్వపు భావనలు తనలో రేకెత్తలేదు. బుగ్గల మీద గుంటలుండి తలమీద పెద్ద టోపీతో ఉన్న ఆ చిన్నబాబు కోసం తన మొత్తం జీవితాన్ని త్యాగం చేయగలదామె. సంతోషంగా, కరుణతో, కన్నీళ్లతో దాన్ని సమర్పించగలదు. ఎందుకో? ఎవరు చెప్పగలరు?
సాశాను వదిలి తృప్తితో, ప్రేమ నిండిన మనసుతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ముఖం ప్రశాంతతతో వెలిగిపోతుంది. ఇలా ఆరు నెలలు గడిచిన తర్వాత పరిచయస్తులు ఆమెను ఇలా అంగీకారంగా స్వాగతించారు:
“గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఎలా ఉన్నావు డార్లింగ్?”
“హైస్కూల్లో పాఠాలు ఇప్పుడు కఠినంగా ఉంటున్నాయి. చాలా ఎక్కువగా. నిన్న సాశాకు కంఠస్థం చేసేందుకు ఒక చిన్న కథనూ, ఒక లాటిన్ అనువాదాన్నీ, పరిష్కరించేందుకు ఒక సమస్యనూ ఇచ్చారు. అంత చిన్నపిల్లలకు అది చాలా ఎక్కువే,” అంటుంది ఓలెంకా.
టీచర్ల గురించీ, పాఠాలూ వాచకపుస్తకాల గురించీ సాశా తనకు చెప్పినదాన్నే ఓలెంకా పునశ్చరణ చేస్తుంది.
మధ్యాహ్నం మూడుగంటలకు వాళ్లిద్దరు కలిసి భోజనం చేస్తారు. సాయంత్రాల్లో కలిసి పాఠాలు చదువుతారు. సాశాను పడుకోబెట్టి ఆమె చాలా సేపటివరకు మెలకువగా ఉండి, శిలువ ఆకారంలో వాడిమీద చేయిని కదుపుతూ దైవప్రార్థనను చదువుతుంది, గొణుక్కుంటున్నట్టుగా. తర్వాత నిద్రలోకి జారుకుంటూ, సాశా చుదువు పూర్తి చేసుకొని డాక్టరో ఇంజినీరో అయినట్టూ పెద్ద సొంత యిల్లుకు, బగ్గీకి, గుర్రాలకు యజమాని అయినట్టూ పెళ్లి చేసుకుని పిల్లలను కన్నట్టు ఊహల్లో తేలిపోతుంది. మూసుకున్న కళ్లనుండి చెంపల మీదుగా కన్నీళ్లు కారుతుంటే నల్లపిల్లి ఆమెను దువ్వుతూ గరగర శబ్దం చేస్తుంది.
అకస్మాత్తుగా గేటు మీద పెద్ద చప్పుడు వినిపించింది. ఆమె ఉలిక్కిపడి ఊపిరాడక గుండె కొట్టుకుంటుంటే అర నిమిషం తర్వాత మళ్లీ అదే పెద్ద శబ్దం వినపడింది.
‘సాశా తల్లి హార్కోవ్ నుండి పంపిన టెలిగ్రామ్ కావచ్చు,’ అనుకొని ఓలెంకా ఆపాదమస్తకం వణికింది. ‘దేవుడా కరుణించు,’ అనుకుంది భయంతో.
ఆమెలో నిర్వేదం ప్రవేశించింది. తల, చేతులు, పాదాలు చల్లబడిపోయాయి. ప్రపంచం మొత్తంలో అత్యంత విషాదం ఆవహించిన స్త్రీ తనే అని భావించింది. కానీ మరో నిమిషం తర్వాత ఏవో కొన్ని మాటలు వినపడ్డాతయి. స్మిర్నిన్ క్లబ్బునుండి వచ్చి గేటు మీద చప్పుడు చేసినట్టు తెలుసుకుంది ఓలెంకా.
“రక్షించావు దేవుడా. నీకు కృతజ్ఞతలు.”
మెల్లమెల్లగా హృదయభారం తగ్గి, ఆమెకు ఉపశమనం కలుగుతుంది. ఆలోచనలు పక్కగదిలో గాఢనిద్రలో ఉన్న సాశా మీదికి పోతాయి. కొన్నిసార్లు వాడు నిద్రలో, “సరేలే. నోర్మూసుకుని పో ఇక్కణ్నుంచి,” అని అరుస్తాడు.
*
రష్యన్ మూలం: అంతోన్ చెహోవ్
ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ
వృత్తిరీత్యా వైద్యులైన శ్రీ ఎలనాగ (డాక్టర్ నాగరాజు సురేంద్ర) ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త. కవిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సుప్రసిద్ధులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత. తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రచనలు చేసే ఎలనాగ గారు సుమారు 40 గ్రంథాలు వెలువరించారు.
‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, ‘మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు.
వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు వంటి సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా ఆయన తెలుగు పాఠకులకు అందించారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి.
వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
