Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురా దుర్గ పురాలు

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘పురా దుర్గ పురాలు’ అనే దీర్ఘకవితని అందిస్తున్నాము.]

పురా దుర్గ పురాలను
దర్శించిన వేళ
చేతస్సు నిండా
వివిధ భావాల చేరిక!
అనేక అనుభవాల కూడిక!
పాడుబడిన ఖిల్లాల నిండా
పలు రకాల దృశ్య మాలిక!

అంతరించిన రాచ ప్రాభవానికి,
అహో! అనిపించిన వైభవానికి,
అలనాటి స్థితి గతులకూ
ప్రాణం పోస్తూ
ఆశ్చర్యాన్ని జనింపజేసేలా,
అభినుతులను
ఆర్తినీ ధ్వనింపజేసేలా
పురాతన కోటల పర్యటన సాగుతూ
ఎన్నో వింతలను చూపుతుంది!
ఎన్నో చింతలను రేపుతుంది!

శత్రు ఫిరంగుల గుండ్ల దెబ్బలకు,
సంవత్సరాల సమయ ప్రహారాలాకూ
అక్కడక్కడా బ్రద్ధలైన
పటిష్ఠ ప్రాకారము,
పగిలి ముక్కలైన
బలిష్ఠ బురుజులు,
ప్రాతగిల్లి నష్టమైన
తోరపు ద్వారాలు,
కాలం చెల్లి రూపుమాసిన
రాజ దర్బారు భవనాలు,
కాపులేక కాడులైన
సుందర సుమవనాలూ
పదునైన వేదన శూలాలతో
గుండెను గ్రుచ్చుతుంటాయి!
ఒక పురా చరిత్రను
పునరుజ్జీవింపజేసేలా
కాల సాగరాన్ని త్రచ్చుతుంటాయి!

కప్పులకు వ్రేలాడే
మణి దీప మాలల దీధితులతో,
గోడలకు తాపించిన
రత్నాల రమ్య కాంతులతో,
రంగురంగుల పట్టు పరదాలతో,
సొగసైన తైలవర్ణ చిత్రాలతో,
నిర్మలమైన నిలువెత్తు దర్పణాలతో,
పసందైన పరిమళ ధూపాలతో,
అందమైన మెత్తని తివాచీలతో,
హంస తూలికా తల్పాలతో
ఠీవితో రాజిల్లిన రాజమందిరాలు ,
రాణి వాసాలూ
నిర్మానుష్య ధూళి ధూసరిత
శోకతప్త నిలయాలై
మదిని దుర్భర వేదనతో నించుతుంటాయి!

తళ తళలాడే వస్త్రాల మెరుపులతో,
స్వర్ణాభరణాల తళుకులతో,
విశిష్ట నృత్య రూపకాలతో,
అభినయించే నర్తకీ మణులతో,
వీనుల విందైన
సంగీత స్వర విన్యాసాలతో
మనోహర దృశ్య శ్రవణాలయాలుగా
సందడించిన నాటి నృత్య శాలలు
శూన్య స్థలాలైన దుస్థితులు
దుస్సహ బాధతో
ఎదను పూరించుతుంటాయి!

భారీ గజ శాలలు,
విశాల అశ్వ శాలలు.
పెద్ద పెద్ద అన్న గృహాలు,
మేటి సిపాయి వాసాలు,
శుద్ధ జలాల పాతాళ కూపాలు,
రక్షణను కల్పించే
రహస్య సొరంగాలు,
ధన కనక రాసుల ఛటలతో
కళకళలాడిన ఖజానాలూ
సాలె గూళ్ళతో
బూజు వలలతో
మురికి మరకలతో
కీచురాళ్ళ కూతలతో
వ్యర్థాల మలినాలతో
మట్టి దిబ్బలతో
దారిద్ర్యంతో దండిగా నిండి
ఒక మహా వైభవానికి దాపరించిన
దయనీయ పరిణామాన్ని
అనివార్య కాల గమన కథనాన్నీ
పరితప్త హృదయంతో
ప్రకటిస్తుంటాయి!

కోటల నిర్మాణం కోసం
అర్పితమైన కార్మికుల
కఠోర పరిశ్రమల
స్వేద ధారలెన్నో..
నిపుణ శిల్పాచార్యుల
నిరూపమాన సేవలెన్నో..
దాస దాసీల
శ్రద్దా పూర్వక పరిచర్యలెన్నో..
ఎవరికెరుక?
కర్మచారులెల్లప్పుడూ
అంతటా అనామకులే కదా!
ఉపయోగించుకుని
ఉపేక్షింపబడే
అనుజీవులే కదా సదా!

రాజ్య రక్షణార్థం సాగిన
ధర్మ యుద్దాలలో
వీరగతులందిన భటులెందరో..,
అధిపుల
ఆధిపత్య ధోరణుల కదనాలలో,
అహంకారపూరిత రణాలలో,
స్వార్థ ప్రయోజనాల సమరాగ్నులలో
సమిధలైన వీర సైనికులెందరో..
లెక్కపెట్టే ఆచారం లేదు!
లెక్కకందే ఆధారం లేదు!
ప్రపంచ వ్యాప్త యుద్ధ రంగాలలో
ప్రాణాలను కోల్పోయిన
అగణిత శూరులందరూ
అమర పురానికి అర్హులైతే స్వర్గంలో దివిజులకన్నా
సైనికుల సంఖ్యే అధికం కావచ్చు!

రాజులున్న చోట రణం ఉంటున్నది!
యుద్ధంలో ప్రతి కృతి
ధర్మ బద్ధమనిపించుకుంటున్నది!
కుట్రలు, కుతంత్రాలు,
మర్మ మంత్రాంగాలు
కపట వ్యూహ కల్పనలు,
నిరంకుశ నిర్దయ ఫర్మానాలు,
అధర్మ జరిమానాలు
దయలేని దండనలు ,
కఠిన కారాగార శిక్షలూ లేని
ప్రభువుల పాలన ఉండేదా..?
సింహాసన సాధనకై,
భోగ భాగ్యాల ఆస్వాదనకై,
ఔన్నత్య ప్రదర్శనకై
రక్త సంబంధీకులను కూడా
దారుణంగా హతమార్చిన
జుగుప్సాకర భీకర
అమానుష జులుంలు
కొన్ని వ్యక్తం!
అనేకం అవ్యక్తం!

అధికార మదాంధులై
నిషాలలో ఖుషీగా
తేలుతూ, తూలుతూ
అన్యాయంగా ప్రవర్తించే
ప్రభువులను పరికించినందుకే
“రాజుల్ మత్తులు! వారి సేవ
నరకప్రాయంబు “ అని
ధూర్జటి కవిగారు
దుఃఖిస్తూ వచించి వుంటారు!
“..కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటె..”
అంటూ
పోతనగారు వాపోయివుంటారు!

స్వసుఖ లాలసలో మగ్నులై,
విందులు, వినోదాల సందడిలో
వ్యగ్రులై,
సుగంధ ద్రవ్య స్నానాల గుమాయింపులతో,
అత్తరు లేపనాల గమగమలతో
రత్న ఖచిత కిరీటాల మిసమిసలతో,
కనక మణిమయ హారాల రోచిస్సులతో ,
అనాలోచిత ఆవేశపూరిత
శాసనాలతో,
సహనం చూపని
సంధికి మెచ్చని
శాంతికి ఒప్పని
దూరాలోచన లేని
ఉద్రేక పూరిత నిర్ణయాలతో
సంగరాలను సాగించి
ప్రాణ మాన ధన నష్టాలను
కల్గిస్తూ
ప్రజను పీడించిన పాదుషాలే
పెక్కురు!
ప్రజా రంజకంగా
సుపరిపాలననందిస్తూ
సుప్రసిద్ధులైన చక్రవర్తులు
నూటికొక్కరు!

కోటల గోడల మధ్య
కదన వీరుల కంఠాలను
కర్కశంగా ఖండిస్తూ
ఎన్నెన్ని పదునైన కరవాలాలు
ఘర్షించాయో..?
పోరాట యోధుల దేహాలను
తూట్లు పొడుస్తూ
ఎన్నెన్ని తీక్షణ బాణ ఘాతాలు
ఎన్నెన్ని వాడి బల్లెముల విఘాతాలూ
వర్షించాయో..?
నేల రాలిన
కోట రాతి పలుకులకు
పలుకులు ప్రాప్తిస్తే
వివరంగా ప్రతి విషయాన్ని విన్పించేవి!

శిథిల దుర్గ స్థలాలను పగటి వేళ
స్మశాన శాంతి ఆవరిస్తుంది!
రాత్రి సమయాలలో
కీచు రాళ్ళ మ్రోత
గబ్బిళాల రెక్కల రొద
ఆక్రమిస్తుంది!
రాజ కీర్తనల ధ్వానాలు,
జహాపనాల కఠిన ఆజ్ఞలస్వానాలు,
సుల్తానుల రథ చక్రాల
కరకు రావాలు,
సంగీత సాహిత్య శ్రావ్య గాన రవళులు,
నర్తకీమణుల మధుర కింకిణీ
క్వాణాలు,
కర కంకణాల స్వాదు క్వణాలూ,
సమర దుందుభి కఠోర నాదాలు,
నగారాల కటు ఘోషలు,
గజ రాజుల గట్టి గర్జనలు,
గండ్ర హయ హేషలు,
అస్త్ర శస్త్ర ప్రయోగాల
పరుష ధ్వనులూ
సమాప్తం!,
కాల గర్భాన అన్నీ సుప్తం!
సమస్తం
కాల ప్రభావం చేత విలుప్తం!

“ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించె” అంటూ
జాషువా కవి కోకిల పలికినట్లు
కడకు
ఏలికలందరూ కడదేరి
జాలి గొలిపే శిథిలాల కువ్వలను,
ధ్వస్త ప్రాసాదాల రప్పల కుప్పలను,
ఎన్నో విస్మయకరవిషయాలను,
ఎన్నో రహస్యాలను,
సందేహాలనూ ,
ఎంతో ఆర్తినీ వదలి వెళ్లారు!
రాజుల సొమ్ము రాళ్ళ పాలు!
పురాదీశుల పాప పుణ్యాలు
చరిత్ర పాఠాల పాలు!
భూమీశుల దౌష్ట్యాలు
తరతరాలు నిందల పాలు!

ప్రజల సొమ్ముతోనూ,
పర రాజ్యాల నుండీ
అపహరించిన సంపదతోనూ
వంశ పారంపర్యంగా సుఖించిన
రాచరికాలు ఇక చాలు!చాలు!
ఇసుమంత మేలు జేసి
నృపులు చేసిన చేటులు
వేనవేలు!

Exit mobile version