[బాలబాలికల కోసం ‘పుస్తకాలు చదవండి’ అనే కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]
వాన్య ఆరేళ్ళ చలాకీ పిల్ల. ఏడాది క్రితమే పూనానుంచి తండ్రికి బదిలీ అవటంవల్ల నాన్నమ్మా, తాతయ్యగారి ఊరు వచ్చి వారి దగ్గరే వుండటం మొదలు పెట్టారు. వాన్యకి కొత్త ఊరు, కొత్త ప్రదేశం నచ్చాయి. ముందు ఊళ్ళో తల్లీ, తండ్రీ, ఇద్దరూ ఉద్యోగస్థులవటంతో ఇంటికి వస్తూనే ఇద్దరూ అలసిపోయేవారు. పైగా యమ్.యన్.సిలు అవటంతో ఇంటికి వచ్చాక కూడా మీటింగులు వుండేవి. వాన్యకు ఏదో వండటం, తినిపించటం తప్పితే, దానితో ఆడుకోవటానికి, మాట్లాడటానికి వాళ్ళకి సమయం చిక్కేది కాదు. వారాంతంలో వచ్చే రెండు రోజుల సెలవలూ వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవటానికే సరిపోయేవి. దానితో వాళ్ళు వాన్యకి ఒక టేబ్ కొనిచ్చారు. దానిలో వీడియోలు చూస్తూ వాన్య కాలక్షేపం చేసేది.
తాతగారి ఊరొచ్చినప్పటినుంచీ వాన్యకి పండగలా వుంది. స్కూలునుంచి తనెప్పుడొస్తానా అని ఎదురు చూసే నాన్నమ్మ, తాతయ్య, తను ఇంటికి వస్తూనే ఎన్నో కబుర్లు చెప్పేవారు. అన్నం పెడుతూ ఎన్నో కథలు, కబుర్లు చెప్పేది నాన్నమ్మ. కానీ ఇక్కడ కూడా ఆడుకునేందుకు పిల్లలు లేరు. పూనాలో వాళ్ళు ఫ్లాట్స్లో వుండేవారు గనుక సాయంత్రం అయ్యేసరికి ఫ్లాట్స్లో పిల్లలంతా మధ్యలో వుండే ప్లే గ్రౌండ్కి వచ్చేవారు. వాళ్ళతో ఆడుకోవాలని తనకి చాలా వుండేదిగానీ, అమ్మా, నాన్నా సమయం లేకో, మళ్ళీ మీటింగ్ వుందనో తీసుకెళ్ళేవాళ్ళు కాదు. తన గోల పడలేక తీసుకెళ్ళినా చాలా తక్కువసేపు ఆడుకోనిచ్చేవారు, వాళ్ళ మీటింగ్ టైమయిపోతోందని. తాతగారిది ఇండిపెండెంట్ ఇల్లు కావటం, ఆ రోడ్డులో తన ఈడు పిల్లలు లేకపోవటంతో ఇక్కడ కూడా సాయంకాలం ఆటలు లేవు.
తమ ఇంట్లో అద్దెకు వుంటున్న రామారావుగారమ్మాయి రాధ పధ్నాలుగేళ్ల పాప. నానమ్మ తనని పిలిచి చెప్పింది. కొంచెం సాయంకాలం వాన్యతో ఆడుతూ వుండమని. రాధ పుస్తకాల పురుగు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే వుంటుంది. వాళ్ళు వుండేది ఫ్లాట్స్ కాకపోవటంతో ఆడుకునే స్ధలం లేదు. ఆ కాలనీ చుట్టుపక్కల ఎక్కడు పార్కు అనే మాటే లేకుండా ఇళ్ళు కట్టేశారు. ఎక్కడ ఆడుకోవాలి? కొంతమంది మగ పిల్లలు క్రికెట్ లాంటివి రోడ్డుమీదే ఆడతారు, వచ్చే పోయే వాహనాలకి అడ్డు వస్తూ. రాధ కొంచెం పెద్ద పిల్ల కనుక రోడ్డు మీద ఆడటానికి ఇష్ట పడలేదు.
నాన్నమ్మ దానికీ మార్గం కనిబెట్టింది. తాతగారు రోజూ డాబా మీద వున్న కొన్ని మొక్కలకి నీళ్ళు పోసేవాళ్ళు. తాతగారికి వాన్యని తీసుకువెళ్ళి, మొక్కల్లో నీళ్ళు పోయిస్తూ, మొక్కలని, పూలనీ, కాయగూరలనీ పరిచయం చెయ్యమనీ చెప్పింది. వాన్యకి ఆ పని అంత ఇష్టం లేకపోయినా, రాధని కూడా తోడు పంపించటంతో వెళ్ళేది. అయితే రాధ ఒక అర్ధగంట కూడా వుండేది కాదు. చదువుకోవాలి అంటూ వెళ్ళిపోయేది.
వాన్యకి బోలెడు ప్రశ్నలు. ఆకాశం నీలంగా ఎందుకు వుంది. చెట్లు ఎందుకు ఆకులు రాల్చి రోడ్డంతా ఖరాబు చేస్తాయి. లైట్లు, ఫాన్లు తియ్యకుండా వస్తే, కరెంటు బిల్లు ఎక్కువ వస్తందని నాన్నమ్మ కేకలేస్తుంది. కరెంటు వాళ్ళకెలా తెలుస్తుంది. వానలెలా వస్తాయి. వానలు రావటానికి చెట్లెందుకు అవసరం. అవి వుంటేగానీ వానలు రావంటారు, ఎందుకు? ఎక్కడ ఏమి చూసినా దానికో అనుమానం, అనుమానానికి అనుసంధానంగా పది ప్రశ్నలు వేసేస్తుంది. నాన్నమ్మ, తాతయ్యలు వీలయినంతమటుకూ చెప్పి, వాళ్ళకి తెలియనివి నాన్నను అడుగు అంటారు. అమ్మా, నాన్న, ఆఫీసు పనిలో వుంటారుగనుక తర్వాత వాన్యకి కనిపించింది ఎప్పుడూ పుస్తకాలు చదివే రాధ.
రాధకి పుస్తక పరిజ్ఞానం ఎక్కువ. వాన్య అడిగిన ప్రశ్నలు చాలావాటికి సమాధానం చెప్పేది. అయితే కొన్ని వాన్యకి అర్ధమయ్యేవి, కొన్ని కాదు. రాధ పుస్తకాలు చదవటం గురించి చెప్పిన మాటలు మాత్రం అర్ధమయ్యాయి. “వాన్యా, పుస్తకాలు చదవటం వల్ల మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.” అన్నది రాధ.
“అమ్మయ్యో, ఇంత పెద్ద పుస్తకాలు మనమెక్కడ చదువుతాం. పెద్దయ్యాకగానీ చదవలేం” అన్నది వాన్య
“ఇవ్వన్నీ నీ వయసు పిల్లలకి కాదులే. ఇందులో కొన్ని నేను చదివేవి, కొన్ని అన్నయ్యవీ, అమ్మవీ, నాన్నవీ కూడా వున్నాయి. అంటే ఈ పుస్తకాలు చిన్న పిల్లలకీ, పెద్దవాళ్ళకీ, అందరికీ వేరు వేరుగా వుంటాయి. నీ వయసుకి తగ్గట్లు నీకు అర్థం కావాల్సిన విషయాలు, నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు నీకర్థమయ్యే భాషలో వుంటాయి. అలాగే మనం పెద్దవుతున్నకొద్దీ, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి అనేక విషయాలు నేర్చుకోవచ్చు.”
“సునామీ, జాంబీ అన్నీ టేబ్లో వస్తాయి” అంది వాన్య. వాన్య టేబ్లో వాళ్ళ అమ్మా, నాన్నా ఎన్నిసార్లు అలాంటివన్నీ తీసేసినా మళ్ళీ ఏవో కొన్ని చెత్త వీడియోలు వస్తూనే వుంటాయి. అవి చూసి వాన్య ఎప్పుడూ వాటి గురించే మాట్లాడుతుంది. ఆకాశంలో కొంచెం మబ్బు కనబడితే సునామీ వస్తోందని భయపడుతుంది. ఒక సారి టేబ్ లో వీడియోలో ఒక చిన్న పిల్లని జాంబీలాగా చూపించారు. అప్పటినుంచీ జాంబీ అంటే భయపడుతోంది.
రాధ ఆరిందాలాగా చెప్పసాగింది. “అదికాదు వాన్యా, టేబ్ ఎక్కువ సేపు చూస్తే మన కళ్ళు పాడవుతాయి. పైగా మనకి మంచి ఆలోచనలు రావు. తెలివితేటలు కూడా పెరగవు. ఎందుకంటే టేబ్ చూడటంతో మన బుర్ర ఎక్కువ ఆలోచించదు. అదే ఒక పుస్తకం చదివావనుకో, నువ్వు చదివే విషయం మీద దృష్టి పెట్టి చదువుతావు. దానితో నీ మెదడులోని కణాలన్ని బాగా పని చేస్తాయి. దానితో నువ్వు ఎక్కువ గుర్తు పెట్టుకోగలవు, ఇంకా ఎక్కువగా ఆలోచించగలవు, విషయాన్ని అర్ధం చేసుకోగలవు, మర్చిపోకుండా వుండగలవు.” తనకి తెలిసిందంతా వాన్యకి చెప్పసాగింది రాధ.
“అంటే నేను ఎప్పుడూ ఒకే పుస్తకం చదవాలా? బోర్ కొడుతుంది.” బోర్ అనే మాట మాత్రం ఈ కాలం పిల్లలకి ముందే వచ్చేస్తోంది.
“నువ్వు ఎప్పుడూ ఒకే పుస్తకాన్ని చదవక్కరలేదు. ఇదివరకుకన్నా ఇప్పుడు రాసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. అనేక రకాల పుస్తకాలు, అనేక భాషల్లో, అన్ని వయసులవారూ చదివేట్లు వస్తున్నాయి. అందులో పిల్లలకోసం కూడా చాలా కథల పుస్తకాలు వస్తున్నాయి. మనం అన్నీ కొనుక్కోలేక పోవచ్చు. మన కాలనీలో లైబ్రరీ వుంది కదా. అక్కడనుంచి కూడా తెచ్చుకుని, చదివి, మళ్ళీ ఇచ్చేయచ్చు. చిన్న చిన్న కథల పుస్తకాలు మనమే కొనుక్కోవచ్చు. నీకనేక సందేహాలు వున్నాయి కదా. ఆకాశం నీలంగా ఎందుకుంటుంది వగైరా. ఇలాంటి ప్రశ్నలకన్నింటికీ సమాధానాలిచ్చే పుస్తకాలు కూడా వున్నాయి. అవి చదివి మనం అర్ధం చేసుకోవచ్చు. అర్థం కానివి పెద్దవాళ్ళనడిగితే చెప్తారు.” పుస్తకాలవల్ల ఉపయోగం చెప్పసాగింది రాధ.
“సరే అక్కా, నేనూ పుస్తకాలు చదువుతాను. నాన్నని పుస్తకాలు కొనమంటాను.” వాన్య తనకి వచ్చే సందేహాలు తీర్చుకోవటానికి పుస్తకాలు చదవాలనుకుంది.
“మంచిది వాన్యా, నా దగ్గర పిల్లల కథల పుస్తకాలు కొన్ని వున్నాయి. నీక్కావాల్సింది ఒక్కొక్కటే తీసుకెళ్ళి చదివి ఎలా వుందో చెప్పు. ఇవి చిన్న చిన్న కథల పుస్తకాలే కనుక నీకు నచ్చుతాయి. నీకర్థంకాని మాటలుగానీ, కథలుగానీ, నాన్నమ్మనీ, తాతయ్యనీ అడుగు చెప్తారు. ఇదిగో, ఈ చిన్ని చిన్ని కథల పుస్తకం చదువు ముందు. నీకు అర్థమవుతుంది.”
రాధనుంచి వాన్య కూడా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంది. టేబ్ మానేసిందని చెప్పక్కర్లేదుగా.
పిల్లలూ, మీకందరికీ రాధక్కలాగా చెప్పేవాళ్ళు వుండకపోవచ్చు. కానీ రాధక్క చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోండి. ముందు పుస్తకాలు చదివి నేర్చుకుంటేనే మీరు పెద్దయ్యాక ఏ రంగంలోనైనా అభివృధ్ధి సాధించగలరు. చదవటం, రాయటం రాకుండా మీరు కంప్యూటర్లో ఎన్ని వీడియోలు చూసి ఏం లాభం!?
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్గా వచ్చింది.
