[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘పుస్తకం చేసిన పెళ్ళి!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ పెళ్ళి, ఒక్కళ్ళకి తప్ప అందరికీ యిష్టమే.
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి తప్ప!
ఆయనంటే ఎంత గౌరవమో అంత భయం అందరికీ!
ఆయన మాజీ ప్రజానాయకుడు కూడా, డబ్బూ దస్కం; మందీ,మార్బలం అన్నీ ఉన్న గండరగండడు!
ఇంతకీ ఆయన ఎవరో కాదు, అమ్మాయిని గారాబంగా పెంచిన తాతయ్యే!
పెళ్ళి తప్పించాలని, పక్క ఊళ్ళో, ఎవ్వరికీ ప్రవేశం లేని, కాస్త విసిరేసినట్టుండే, కొత్తగా ఆ మధ్యనే రంగులూ గట్రా వేసి తీర్చిదిద్దిన, తన స్వంతమే అయిన పాత ఇంట్లో బంధింపచేశాడు, కూతురు కూతురైన పెళ్ళికూతుర్ని.
అది ఆయన అప్పుడప్పుడు విడిదిగా వాడుతుండే విశ్రాంతి గృహం లాంటిదన్న మాట!
పాత బంగారం అని తన కోసమే ఉంచేసుకున్నాడు —
వారసత్వంగా వచ్చినదనే మోజుతో, కొత్త రంగులతో శుభ్రంగా ఉంచుతూ-ఏ ఇతర మార్పులూ చేయక, చూడముచ్చటగా ఉండే విశాలమైన ఆవరణలోని పెంకుటింటిని!
అరమైలు దూరం ఎవ్వరూ అడుగు కూడా పెట్టరు, ఇంకా కాపలా ఎందుకు అని ఎవ్వరినీ ఉంచలేదు నిఘా కోసం! సాయంత్రం తానే వెళ్ళి తాళం తీద్దామని ఆయన ఆలోచన.
గండరగండడిని ఎదిరించే సాహసం ఎవ్వరూ చేయలేదు, పిల్ల తల్లిదండ్రులతో సహా!
వాళ్ళకు ఆ పెళ్ళి యిష్టమే, ఈ నిర్బంధమే అయిష్టం-
కానీ ఆయన్ను ఎదిరించడానికి భయం!
***
ఆ అమ్మాయి చాలా చురుకైనది. చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్టే!
పొడగరి, సొగసరి, మాటకారి, అన్నింటినీ మించి సుగుణమణి!
పెళ్ళికొడుకో మరి?!
ఆఁ, మహా పెళ్ళికొడుకు, ఇట్లాంటి తెగించే విషయాల్లో, శుద్ధబుద్ధావతారం!
ఉత్త బోళా, మహా మెతక!
కానీ ‘బుధ్ధి’, బంగారం!
అదే అమ్మాయికి నచ్చిన ఏకైకం!
ఈ బంధం పెళ్ళిగా ముడిపడాలంటే, ఏదైనా చేస్తే తానే చేయాలని, ఆ అమ్మాయికి బాగా తెలిసిన విషయమే కూడా!
***
ఆ ఇంట్లో బంధింపబడినప్పటి నుంచీ ఆమెకు ఒకటే ఆలోచన, ఎక్కడైనా ఆ ఇంట్లో సుత్తి లాంటిది ఏదైనా దొరుకుతుందేమోనని – గొళ్ళెం, తాళం పగులగొట్టి తప్పించుకోవటానికి!
అమ్మాయి కూచోడానికి ఒక్కటే ఒక్క కుర్చీ ఉంచాడు పెద్దాయన, ఒక మంచినీళ్ళ కుండా, గ్లాసు!
మొబైలు మొదట్లోనే లాగేసుకున్నాడు!
అంతే ఇంకేమీ లేవు, పూచికపుల్లైనా!
వచ్చినప్పటి నుంచీ, ఇప్పటికి పది సార్లు వెతికింది అల్మారాలన్నీ, ఎందులోనూ ఏమీ లేదు, అన్నీ ఖాళీలు, కొత్త పెయింట్ వాసనతో గుప్పుమంటూ!
***
మొదటి సారే కంటపడ్డది, ఒక చిరుగుల పుస్తకం – ఆమె పెద్దగా పట్టించుకోలేదు దాన్ని!
విసుగు పుట్టి యాభయ్యోసారి ఆ గదిలో పచార్లు చేస్తూ, యథాలాపంగా తెరిచింది ఆ పుస్తకాన్ని!
ఎప్పటిదో పాత పుస్తకం, ఎట్లా ఉండిపోయిందో, అంతా ఖాళీ చేసి రంగులేసినా, ఆశ్చర్యమే!
అక్కడక్కడా చిరుగులతో కనబడ్డది.
కనిపించినంత మేర, ప్రింటు బాగానే ఉన్నది.
దాని మొదలూ, చివరా లేవు, పేజీ అంచులు చిరిగి ఉన్నాయి. టైటిల్ మాత్రం అరకొరగా ఇట్లా కనబడుతోంది
‘క.. రి.. గ.. ము’ అని.
అదేమిటో అర్థం కాలేదు ఆ అమ్మాయికి అస్సలు!
అక్కడక్కడా మాత్రమే పూర్తి పేరాలున్నాయి మిగతా చాలా భాగం చిరుగులే.
“ఎందుకూ పనికిరాదు, వేస్ట్”, అనుకుంటూ విసుగ్గా పడేయబోతుంటే, తెరిచిన పేజీలోని ఒక పేరా కనబడ్డది:
“రాకుమారి సౌదామినికే మార్గము తోచక, ‘హా దైవమా’, అని శిరము పైకెత్తెను. ఎత్తిన శిరస్సు లోని మెదడులో ఆలోచన యొకటి సౌదామిని పోలిక తళుకు మన్నది. ఆమె కురంగిని వలె చెంగనాలు వేసినది! మయూరి వోలె కేళీ నృత్యము చేసినది. నదీ లహరుల వలె నాట్యమాడినది. ఆమె స్వేచ్ఛా విహగమై విశాల గగనమున కెగసినది. ఆమె అచటనే అటక పైన గల ఒక నిశ్శ్రేణి నెక్కి పైకప్పు రెల్లును, పెంకుల కదల్చి ఎటులో తా దూర గంత చేసికొని ఆ కారాగారము వంటి గృహము నుండి బయలు వెడలినది. సమీపమునె యున్న అశ్వశాలలో ఉద్యోగి యైన తన ప్రాణసమాన ప్రియుని వీరసేనుని కలిసి, పరిణయమాడి చిరకాలము సుఖముండినది” అని ఉన్నది.
***
చదివిన మరుక్షణం ఈ హీరోయిన్ పైకి చూసింది, ఒకసారి లీలా దరహాసం చేసింది.
చూడటానికి అక్కడ ఎవ్వరూ లేరు కానీ, ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనబడ్డది, ఆ లిప్తలో!
కింద ఒక్క వస్తువు ఏమీ లేకుండా, అయ్యవారింటి నట్టిల్లు లాగా ఉన్నా, అటక మీద కనబడ్డది పొడుగాటి నిచ్చెన!
అచ్చం ఆ కథలో లాగానే!
ఇదేమిటి, కలా నిజమా అని గిల్లి చూసుకుంది!
తాను నిర్బంధింపబడటమూ నిజమే, అటక మీద నిచ్చెన ఉండటమూ – నిఝంగా నిజమే అని అప్పుడు నమ్మకం కలిగింది, గిచ్చుకున్న చోట మంట పుట్టడంతో!!
“దేవుడా దేవుడా నన్నూ ఆ రాకుమారి లాగా తప్పించేయ్ ప్రభో”, అనుకొని అదే పని చేసింది, బయటపడ్డది.
***
ముందు కుర్చీ మీద ఎక్కి అతి కష్టం మీద,ఆ నిచ్చెన దించింది. గోడకు ఆన్చి పై మెట్టు మీద నుంచొని, పైన అమర్చబడిన కిటికీ అరలో కూచుని, కప్పులో ఒక పెంకును కదల్చబోయింది.
ఉహుఁ ,అది “నేను కదలను”, అని మొండికేసింది!
ఇట్లా కాదని, కుర్చీ మీద నుంచొని గోడకు ఆన్చి ఉన్న నిచ్చెనను తన బలం అంతా కూడగట్టుకుని ఎత్తి దానితోనే మెల్లిగా ఒక పెంకును తోసింది. అది కాస్త మొరాయించి, కొద్దిగా కదిలి, తరువాత భళ్ళుమని కింద పడిపోయింది.
అయినా ఆ కంత చాలదు ఈ డోలు దూరడానికి అని గ్రహించి, మళ్ళీ ఒకసారి నిచ్చెనతో తట్టి రెండోదాన్ని కూడా విజయవంతంగా పడేసింది.
ఇప్పుడు ఫర్వాలేదు తల దూరే చోటొచ్చింది, అమ్మాయికి ధైర్యం పెరిగింది!
ఊళ్ళో దొమ్మరివాళ్ళను చూసిన అనుభవం గుర్తు తెచ్చుకొనీ, తను అథ్లెటిక్ ఆడిన రోజుల్లోని ప్రజ్ఞ చూపించీ మొత్తానికి అతి కష్టంమీద బయటపడ్డది.
బయట అంతా నిర్మానుష్యంగా ఉంది పగలు ఒంటిగంట అయినా!
***
ఇక తరువాత, వారి కళ్యాణం, అలనాడు కాగల కార్యం చేసిన గంధర్వులు చేయలేదు గాక చేయలేదు.
వారిద్దరే చేసుకున్నారు!
ఇద్దరు అంటే, ఒకరే అనాలి నిజానికి!
అంటే దర్శకత్వం అంతా ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఇచ్చిన పాత్ర చేసే నటుడు అని!
అంటే అపార్థం చేసుకోకూడదు అతనేదో పిరికివాడని!
అతనిది ధైర్యమే ఊతంగా చేసే ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగం.
ప్రస్తుతానికి ఏదో ఆఫీసు. పని మీద హైద్రాబాదు వచ్చాడు.
ఇట్లాంటి ‘లైను’ దాటే కార్యక్రమాల్లో కాస్త చొరవ తక్కువ అని మాత్రమే సారాంశం సులువుగా గ్రహించాలి!
ఎంతైనా, సైనికుడు కదా, ‘హద్దులు’ బాగా పాటిస్తాడన్న మాట, అంతే!
***
మొదటగా అమ్మాయి కాస్త దూరం నడిచి, ఒక ఆటో పట్టుకుని ఆ అబ్బాయి ఆఫీసు కెళ్ళింది, అది లంచ్ టైమ్ కావటంతో అతను క్యాంటీన్లో తేలిగ్గానే దొరికాడు.
అంతా వివరించింది, అమ్మాయి.
“సరే ఉండు పై ఆఫీసరుకు చెప్పి వస్తాను” అని అతను అది పూర్తి చేసి బయట పడ్డాడు!
***
ఏది ఏమైనా, ముందు ఇంటికి వెళ్ళి పెద్దలను కలవాలనే నిర్ణయంచుకున్నారిద్దరూ!
అతని కారులో సరాసరి ఇంటికి వెళ్తే, పనివాడు చెప్పాడు – అందరూ కలిసి హడావిడిగా ఓ గంట క్రితం ఎటో వెళ్ళారని.
కంగారుపడి ఆ బందిఖానా ఇంటికే తప్పకుండా వెళ్ళుంటారు అనుకొని, అక్కడికే బయలుదేరారు.
***
వీరిని, దూరం నుంచి చూసింది ముందుగా అమ్మాయి తాతయ్య గండరగండడే!
అంతటి బిగువు చూపించేవాడు మనవరాలిని క్షేమంగా చూడగానే గబగబా గేటు దగ్గరికొచ్చి అమ్మాయిని హత్తుకుని “ఏంటమ్మా కనిపించకపోతే నా ప్రాణమే పోయినట్లైంది, తెలుసా,” అన్నాడు కళ్ళనీళ్ళు ఆపుకుంటూ!
ఇంతలో అమ్మాయి తల్లీ తండ్రీ కూడా వచ్చారు బయటికి, అమ్మాయిని చూసి ‘అమ్మయ్య’ అనుకున్నారు.
***
అమ్మాయి తన తల్లికి అంతా చెప్పి, తాత వైపు నడుస్తుంటే, ఆయనే “ఆగండి” అన్నాడు పెద్దగా!
మళ్ళీ ఏమి ఉపద్రవం రా బాబూ అనుకునే లోపలే, ఆ అబ్బాయిని ఆప్యాయంగా, గౌరవంగా రమ్మని సైగ చేసి, “మా అమ్మాయిని నీ చేతుల్లో పెట్తున్నాను, జాగ్రత్తగా చూసుకో బాబూ”, అని, ఇంక మాటలు రాక ఆపేశాడు.
అందరి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లినై, ఓ క్షణం!
***
అందరి సమ్మతంతో, అతి స్వల్ప కాలంలోనే పెళ్ళి బాజాలు వారి యింట మోగాయి.
ఇరు యువ హృదయాలు పులకించాయి.
***
గంగరగండడికి ‘టఫ్ మ్యాన్’, పదవి మాత్రం పోయింది ఈ పెళ్ళి తరువాత!
అయినా ఆయన అంతగా ఏమీ దిగులుపడినట్టు లేదు తన మనవరాలి సంతోషం చూసి!
పైగా, ఇది వరకు కంటే ఆయన ఏదో తృప్తితో, ఆనందంగా ఉండటం గమనించారు అందరూ!
***
ఒక నెల రోజులైంది వీళ్ళ పెళ్ళై!
ఒక రోజు యువ దంపతులిద్దరూ, అమ్మాయి స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు.
వెళ్ళి భోజనాలు ముగించుకుని బయటకు వస్తుండగా వాళ్ళు వరండాలో ఒక అందంగా చేయబడ్డ plaque చూసింది అమ్మాయి, గోడమీద!
చిరునవ్వుతో, అతనికీ చూపించింది ఆ చిన్న బోర్డుని.
అతనూ చూశాడు, చిరునవ్వుతోనే జవాబిచ్చాడు!
***
ఇంటికి వెళ్తూ, కారులో అడిగింది అమ్మాయి,
“ఎట్లా ఉంది!?” అని!
“భోజనమా, చాలా బాగుంది”, జవాబు!
“భోజనం కాదు, ఆ బోర్డు మీద రాసున్నది!”
“ఓ అదా, గ్రేట్! మన కథే మంచి ఉదాహరణ కదూ”, అని, గుర్తు తెచ్చుకొంటున్నట్టు ఆ రాసిన కాప్షన్ పైకే అన్నాడు:
“Life is a Saga with Absurd Possibilities, Never Give up!”
“How true”, అన్నారు ఇద్దరూ ఒకేసారి, ఆనందంతో!
***
అన్నట్టు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ!
ఆమె పేరు కూడా ‘సౌదామిని’, ఆ చిరుగుల పుస్తకంలోని మెరుపుల రాకుమారి లాగానే!
ఆ పుస్తకం పేరు, చుక్కలను కలిపితే, అదే if you join the dots – ‘కథాసరిత్సాగరము’ అని అనిపిస్తోంది
What a coincidence, my Lord!