[బాలబాలికల కోసం ‘పుస్తకమే వరం’ అనే గేయకథ అందిస్తున్నారు శ్రీ దాసరి చంద్రయ్య.]
సోము భాను ఇద్దరు మిత్రులు
చదువులొ మాత్రం పోటీదారులు
నువ్వా నేనా? నేనా నువ్వని
మార్కుల వెంట పరిగెడతారు.
ఇద్దరు మిత్రులు ఉదయం లేచి
త్వరగా స్నానం ముగియిస్తారు
పుస్తకాల సంచీలను తగిలించి
వీధి బాటలో పరిగెడతారు.
పాఠశాలకు వెళ్ళే దారిలో
ఉన్నది ఒక దేవాలయం
గుడికి కొంత దూరంలోనే
ఉన్నది ఒక గ్రంథాలయం.
సోము భక్తిగా గుడికెళతాడు
భక్తితో దేవుని పూజిస్తాడు
తానున్నత స్థాయికి చేరేలాగా
దీవించమంటూ కోరుతుంటాడు.
గ్రంథాలయమును చేరిన భాను
దినపత్రికలు తిరగేస్తాడు
గొప్పవాళ్ళ జీవిత చరితలు
చదువుతూ లోకం దర్శిస్తాడు.
సోము మంచి భక్తుడు ఐతే
భాను మంచి పాఠకుడయ్యె
ఇద్దరి చదువులు పూర్తయ్యాక
సివిల్స్ పరీక్షే రాశారు.
భాను మంచి మార్కులతో
కలెక్టరుగా తా నెగ్గాడు
సోము తక్కువ మార్కులతో
ఉత్తీర్ణతకై తడబడ్డాడు.
ఆరోజు సోము గుడికెళ్ళాడు
దేవుని తిడుతూ నిలదీశాడు
పూజారయ్య సోముని చూసి
మందహాసమే చేశాడు.
సోమూ ఎందుకు తిడుతున్నావు?
దేవుణ్ణెందుకు నిందిస్తావు?
దేవుడు అంటే నమ్మకమంతే!
చదవకపోతే ఫలితముండునా?
నారు పోసినోడె నీరిస్తాడని
దేవుడి మీద భారం వేసి
కృషి చేయక నీవు కూర్చొని ఉంటే
కదలవు కదలవు అంగుళమైనా!
పూజారయ్య మాటలు విన్న
సోము ముందుకు కదిలాడు
గ్రంథాలయమే ప్రగతికి చోటని
అటువైపే అడుగులు వేశాడు!
పేరు దాసరి చంద్రయ్య. తల్లిదండ్రులు దాసరి గోవిందమ్మ దాసరి తిరుపాలయ్య. విశాలాక్షిలో మూడు కథలకు బహుమతులు హాస్యానందంలో ఒక కథకు, ప్రియమైన రచయితల సంఘం కరోనా కథల మీద నిర్వహించినటువంటి కథల్లో తృతీయ బహుమతి.
హాస్య కథలు రాయడం చాలా ఇష్టం కొన్ని బాలల కథలు, బాల భారతం, ప్రజాశక్తి, వార్త పత్రికల్లో వచ్చాయి.
ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో మూడు హాస్య నాటికలు ప్రసారమయ్యాయి దాదాపుగా 30 జన చైతన్య గీతాలు ప్రసారమయ్యాయి.
‘మనసిస్తావా’ అనే సినిమాకు ఒక పాట రాయడం జరిగింది.
మా ఊరి సీతయ్య, కలియుగ రాక్షసుడు, అల అనే సినిమాలకు ప్రస్తుతం పాటలు రాస్తున్నాను.
