Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాగిముద్ద

[కర్ణాటక సంస్కృతిలో విడదీయరాని భాగమైన ‘రాగిముద్ద’ అనే ఆహారపదార్థం గురించి ప్రసిద్ధ రచయిత, కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చ. హ. రఘునాథ్ గారు రచించిన కన్నడ వ్యాసాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.]

గ్రామదేవత నాగమ్మ గుడికి బిడ్డకు పుట్టువెంట్రుకలు తీయడానికి వచ్చాము. అన్నతో పాటు వచ్చి గుడి ఆవరణలో అరుగుమీద వెళ్ళి కూర్చున్నాను. సరిగ్గా అప్పుడే ఆ క్షణమే నచ్చిన పరిమళం  ఒకటి నా ముక్కుపుటాలతో పాటు మనస్సును తాకి మొత్తంగా ఆవరించింది. ఆ గుడికే చెందిన ఒక కట్టడం కట్టడానికి వచ్చిన కూలీల గుంపు లోని వాళ్ళు అరుగు మీద చెట్టు నీడన తమ చద్ది మూటలను విప్పినట్టున్నారు. ఆ చద్దుల నుంచి రాగిముద్ద, పచ్చిపులుసుల నుంచి వెలివడ్డవే ఈ మనసైన ఘుమఘుమలు. రాగిముద్దను చిదిమి, చిన్న ముద్దలను పచ్చిపులుసులో దొర్లించి వాళ్ళు మింగుతుంటే నాకూ, మా అన్నకూ నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఆకలితో నిద్రతో జోగుతుంటే, కళ్ళలో రాగిముద్ద గురించి వరుసగా జ్ఞాపకాలు బొమ్మకట్టాయి.

మాకంతా రాగిముద్ద అనగానే గుర్తొచ్చేది పేదతనము, కన్నడతనము. ఈ ప్రాంతం యొక్క ఆహారపద్ధతికీ, సంస్కృతికీ మెరుపు తెచ్చే వాటి గురించి చెప్పాలంటే రాగిని విడువలేము. రాగిముద్దను గురించి చెప్పకపోతే కన్నడ సంస్కృతి గురించి మాట్లాడడం అసంపూర్ణమే.

పల్లెల జీవనచిత్రాలను గుర్తు తెచ్చుకోండి. పొలం పక్కన ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు నీడలో కూర్చున్న రైతు పడచు నెత్తి మీద మోసుకొచ్చిన చద్దిమూట విప్పుతోంది. పనికొచ్చిన కూలీలంతా మధ్యాహ్న భోజనం కోసం ఆమె చుట్టూ చేరగానే, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రాగిముద్ద పెడుతోంది. చేతిలో పడ్డ రాగి ముద్దను ఎడం చేతిలో ఉంచి మధ్యలో గుంటగా వేలితో నొక్కుతూ మొత్తం ముద్దను ఒక గిన్నెలాగా చేశారు. ముద్ద గుంటలో పచ్చిపులుసును నింపుకొని, ముద్ద పై  వైపునుంచి చిన్న చిన్న భాగాలు తుంచుతూ, మింగుతూ ఉన్నారు. అరచేయి ఖాళీ అయ్యేసరికి ఇంకొక ముద్ద ప్రత్యక్షం. అదే పల్లె బతుకు. ఇది శ్రమజీవుల బతుకు.

రాగిముద్ద ప్రసక్తి రాగానే నా బాల్యజ్ఞాపకాలలో అచ్చుపడిన కర్రోడు గుర్తొస్తాడు. నాన్న మాస్టారుగా ఉన్న రోజులవి. ఊర్లోని హోటల్ ఒక దాంట్లో కర్రోడు పాచిపనులు చేసేవాళ్ళు. చూడ్డానికి వాడూ ఒక పెద్ద రాగిముద్దలాగే అగుపించేవాడు. పిల్లలం మాకందరికీ వాడు ఒక ఆశ్చర్యకరమైన ముచ్చట. వాడి అసలు పేరు ఎవరికి తెలుసు? చూడ్డానికి నల్లగా ఉండేవాడు కాబట్టి కర్రోడు అనేవాళ్ళం. ఈ బలభీముడు మా ఇంటి పక్కనున్న బోర్‌వెల్‌కు నీళ్ళ కోసం వచ్చేవాడు. నీళ్ళు పాతాళంలో ఉండి పెద్దగా ఊరేవి కావు. ఎంత బలంగా కొట్టినా దారప్పోగులా సన్నని ధార మాత్రమే చిమ్మేది. ఆ బోర్‍వెల్ కొట్టి కొట్టి అమ్మ చేతులు కాయలు కాశాయి. మేమందరం నీళ్ళకు ప్లాస్టిక్ బిందెలను, రాగి బిందెలను తెస్తుంటే, కర్రోడు ఒక పెద్ద బాననే తీసుకొచ్చేవాడు. బోర్‌వెల్‌ను వాడు గట్టిగా కొడుతుంటే అది చేసే బడబడ శబ్దం ఫర్లాంగు దూరం వినిపించేది. వీడి బలప్రయోగానికి బోర్‌వెల్ ఎక్కడ విరిగి పోతుందో, విరిగిపోతే మైలు దూరం నుంచి నీళ్ళు మోయాల్సి వస్తుందేమోనని మా భయం మాది. మట్టి బాన నింపుకొని నేర్పుగా దాన్ని భుజం మీదికి చేర్చుకొని సాగిపోయే కర్రోడిని చూస్తే, రెండు పెద్ద బానలు ఒకదాని మీదొకటి దారిలో పోతున్నట్టే అగుపించేది. ఈ కర్రోడికింత శక్తి ఎక్కడినుంచి వచ్చిందో? హోటల్‌లో మిగిలిపోయిన సీకుబాకు తింటేనే వాడి కడుపు నిండుతుందా? తెలీదు మరి.

రాగిముద్ద తయారయ్యాక వంటపాత్ర అడుగున అంటుకున్న సన్నటి పొర మిగిలిపోతుంది. అదే సీకు. పల్లె భాషలో సీకుబాకు అనే పదం వాడుకలో ఉంది. సీకుకు జంటపదంగా బాకు అన్నారేమో తెలీదు. సీకు మాత్రం భలే రుచి. ఎండిపోయాక సీకు కరకరలాడుతూ అప్పడంలా భలే రుచిగా ఉంటుంది. బాల్యంలో అమ్మ గిన్నెలో అంటుకున్న సీకుని విడదీసి పొయ్యిగట్టు మీద పెట్టేది. ఆ సీకును చప్పరించిన రుచి ఇంకా నాలుక మీదే ఉంది. పల్లెల్లో ఇప్పటికీ సీకును చూసిన బీదల పిల్లల కళ్ళు విప్పారుతాయి. బడికి పోతున్న కలవారింటి పిల్లల జేబుల్లో రకరకాల తినుబండారాలుంటే, బీదల పిల్ల జేబుల్లో రాగిముద్ద ఉడికిన పాత్రలోనుంచి అమ్మ తీసిచ్చిన సీకు ఉంటుంది. ఆ సీకు బీదల పిల్లల పాలిటి చాక్లెట్.

పేదతనం నుంచి కన్నడతనం వద్దకు వద్దాం. ఇంగ్గీషులో ‘ఫింగర్ మిల్లెట్’ అని పేరున్న ఈ రాగి మూలాలేమిటో వెదుకుతూ పోతే తగిలేవి ఆఫ్రికా, ఇథియోపియా. మూలం విషయం వదిలేసి, రాగికీ కన్నడ జనానికీ ఉన్న అనుబంధం విషయానికీ వస్తే, అది హెచ్చుతగ్గులుగా నాలుగువేల ఏండ్ల చరిత్ర. భారతదేశంలో రాగి పంట, వినియోగం రెండిట్లో కర్ణాటకదే మొదటి స్థానం. దేశంలోని సగం శాతం రాగి పండేదిక్కడే. మండ్య, మైసూరు, తుమకూరు, కోలారు జిల్లాలు రాగి ఖజానాలు.

కన్నడ నాడును కంనాడు అని పిలిచే వాడుక ఉంది. ఈ ప్రత్యేకతకు కారణమే ఈ రాగి. రంగు, గట్టిదనము, మన్నిక అన్నిట్లోనూ కన్నడ జనాలకు రాగి దగ్గర. ఆ కారణంతోనే రాగి కన్నడ ఆహార సంస్కృతి యొక్క ప్రముఖ ధాన్యము. ఈ రాగి శ్రేష్ఠత గురించే ప్రముఖ వాగ్గేయకారుడు పురందరదాసు తన కృతిలో ‘యోగ్యరాగి భోగ్యరాగి’ అని నొక్కిచెప్పారు. కనకదాసు ‘రామధాన్య చరిత’నే రచించారు.

జానపదుల మాటకొస్తే రాగి, రాగిముద్ద తప్పితే బతుకేముంది? ‘ముద్దకు, నిద్రకూ దూరం చేయకు శివా’ అనే వారి ప్రార్థనలో ముద్ద రాగిముద్దనే. రాగి పిండి విసిరే తిరగలిరాయి కూడా వారికి పవిత్రమైనదే.

‘కల్లమ్మా మా తాయి
మెల్లమ్మా రాగియ!
జల్లజల్లన ఉదురమ్మ’

అని జానపద స్త్రీల ప్రార్థన. అంటే

‘రాయమ్మా, మా తల్లీ
నలగనీ రాగిని!
జల్లుజల్లుగా చల్లమ్మా (పిండిని)’

అని అర్థం. రాగి పిండి విసిరే తిరగలి రాయి వారి పాలిటికి దైవం మాత్రమే కాదు. కష్టం పంచుకునే సఖి కూడా.

అన్నట్టు రాగిముద్ద ఆకారం గమనించారా? ఆ గోళాకారం లోనే చేయాలని మన పూర్వులకు ఎలా తోచిందో! ఆ గోళం వెనుక భూగోళం ఉందా? బ్రహ్మాండపు తత్వముందా? ఉందేమో! ఏమున్నా లేకున్నా కళాత్మకత ఉండనే ఉంది. మర్లే నీళ్ళలో రాగిపిండి కలిపి, పదునుగా ఉడికించి, పాకానికొచ్చిన మిశ్రమాన్ని ముద్ద చేసే ప్రక్రియ పైకి సులువుగా కనిపించినా, దానికి అనుభవం కావాలి. ఉండగట్టకుండా, పెళుసు కాకుండా ముద్దలు చేయాలంటే బాగా అలవాటు పడిన చేతులే అయ్యుండాలి. ఆవిర్లు కక్కే రాగిపిండిని చేతులు తడి చేసుకొని ముద్ద కట్టాలంటే నేర్పు కావాలి. మా తాత ఇంటి పెరట్లో పదుల మందికి పెద్ద బానలో ముద్ద చేసే నాటి కథలను అమ్మ నోటినుంచి వినాలి. దేహశక్తినంతా కూడగట్టుకొని పెద్ద కఱ్ఱనొకదాన్ని తీసుకొని రాగిపిండిని మర్లేనీళ్ళలో కలపడం చాల కష్టమైన పని. ఒక్కోసారి చేతిని బలంగా వాడినా, లేక బాన పాతదైనా కఱ్ఱ పాత్రను పగలగొట్టేస్తుంది, ఎసరు పెట్టిన నీళ్ళన్నీ పొయ్యిమీద పడిపోతాయి. అప్పుడు అంతా నేలపాల్జేసిన కూతురు మీద కోపంతో ఆ పిండి అంటిన కఱ్ఱతోనే వెంట పడిన అమ్మల కోపాలు వట్టి జ్ఞాపకాలు కాదు. గడచిపోయిన జీవనశైలుల నెమరువేత.

ఇంకా కొందరు నాజూకు మనుషులకు అరటిపండంత మెత్తని ముద్ద కావాలి! శ్రమైక జీవులకు మాత్రం గోడకు కొడితే తిరిగి బౌన్స్ అయ్యే బంతి లాంటి గట్టి ముద్ద కావాలి. రాగిలోని కార్బోహైడ్రేట్ అనే పదార్థం కొద్దికొద్దిగా మాత్రమే విడుదల అవుతుంది కాబట్టి రాగి ముద్ద జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ కారణంగానేమో శ్రామికులకు రాగిముద్ద భోజనమే ప్రియమైనది.

బౌన్స్ అయ్యే బంతి లాంటి రాగి ముద్ద అని చెప్పుకున్నాం కదా! అలాంటి ముద్దను ఇంగ్లీషులో ‘రాగి బాల్’ అంటారు. ఇదొక స్వారస్యమైన సంగతి. జర్మనీలో ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్న రోజులు. [2006వ సంవత్సరం] ఆ సమయంలో క్రీడా ప్రాంగణపు ఆఫీస్ క్యాంటీన్‌లో వారానికి రెండు రోజులు ‘రాగి బాల్’ అనే పేరు మెనూలో ఉండేది. ఈ బాల్స్‌ను తట్టలో పెట్టుకొని ‘లిప్‌స్టిక్’ చెడకుండా చెంచాతో తినే సుందరీమణులొకపక్క, మొత్తం ముద్దను ఒకేసారి పైకెత్తిపట్టుకొని కొరికి తినే సుందరులొకపక్క. వీరి వల్ల క్యాంటీన్ రసమయసన్నివేశాల రంగస్థలమయ్యేదట. మొత్తానికి రాగి ముద్ద గట్టితనం ఎప్పుడూ ప్రకటితమౌతూనే ఉంది.

‘హిట్టు తిందు జట్టియాగు’
‘హిట్టం తిందం బెట్టం కిత్తిట్టం’

అనే అనుభవసారమొలికే సూక్తులు ఈ గట్టితనాన్నే చాటి చెప్తాయి. ఈ కన్నడ మాటలకు అర్థం. పిండి తిని దండిబలం పొందమని.

బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగి ఎనిమిది, పది రెట్లు ఎక్కువ పౌష్టికం. రోగనిరోధకం కూడా. రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. క్షార గుణం ఉన్నందువలన రాగి తిండి దేహానికి చలువ.రాగులలో గుండె నొప్పి, క్యాన్సర్ లను నిరోధించే ఔషధీయ గుణాలున్నాయి. సన్నబడాలనుకునేవారికి రాగిముద్ద అతికినట్టు సరిపోయే భోజనము. ఇలా రాగి, రాగిముద్ద గురించి వందల మెచ్చుకోళ్ళు, నమ్మకపు మాటలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన దేహం కలిగి ఉన్న పల్లెవారే రాగి మహిమను ప్రపంచానికి చాటిచెప్పగల సజీవ ఉదాహరణలు. అదే విధంగా రాగి పసివారికి కూడా పౌష్టికాహారం. రాగిపిండి సూప్‌ను బుగ్గల్లో నింపుకొని పిల్లలు నవనవలాడతారు. రాగిలోని హెచ్చు ప్రమాణపు కాల్షియం పిల్లల పెరుగుదలకు సంబంధించిన టానిక్‌గా పనిచేస్తుంది.

రాగిముద్దకూ ఆకుకూర పులుసు మేలుజంట. అసలు చెప్పాలంటే రాగిముద్దకు దేనితోనైనా రుచినిచ్చే గుణముంది. పచ్చిపులుసు, ఆకుకూర పులుసు, అనపగుగ్గిళ్ళు, మొలకెత్తిన ఉలవల చారు, ఉప్పు మిరపకాయల గొజ్జు, కోడిచారు ఇలా అన్నిటితోనూ రాగిపిండి అపురూపమైన జంట కాగలదు. ఏమీ లేదనుకోండి, చివరికి నీళ్ళమజ్జిగ ఉన్నా చాలు. మజ్జిగలో రాగిముద్దను కలగలిపి తాగితే ఉండే సుఖం, ఉప్పు మిరపకాయల గొజ్జులో రాగిముద్దను అద్ది నమిలే ఆనందం అనుభవించిన వారే ఎఱుగుదురు. అది మాటలకు దొరకని రసానుభవం.

‘ముద్ద మహిమ’ మహాభారతమంత ఉన్నా, ఆధునిక సందర్భంలో ముద్ద అంటే ముఖం తిప్పుకునే వాళ్ళు, అది మధుమేహానికి పథ్యం అని మూతి ముడిచేవాళ్ళు బోలెడు మంది. రాగిముద్ద రంగు తమ వంటి రంగు కందిపోయేలా చేస్తుందేమోనని కంగారుపడే కోమలాంగులూ ఉన్నారు. రాగి అంటే ముద్ద లేక రొట్టె మాత్రమే అని చెప్పే రోజులు నేడు లేవు. రాగి ఇడ్లీ, రాగి దోసె, రాగి సేమియా, రాగి చక్కిలాలు, రాగి అప్పడాలు, రాగి బిస్కత్తులు – ఇలా రాగి మహిమ పొడుగ్గా సాగిపోతూనే ఉంటుంది.

రాగి గురించి మాట్లాడేటప్పుడు ‘రాగి లక్ష్మణయ్య’ అనే పేరుతో రైతులలో ప్రసిద్ధి పొందిన డా. సి హెచ్ లక్ష్మణయ్యగారిని తలచుకోవాలి. మైసూరు తాలూకాలోని హారోహళ్ళిలోని ఈ రాగి ప్రేమికుని గమనము రాగి వైపు సాగే వేళకు రాగి రకముల గురించి పరిశోధన ఆగిపోయి దశాబ్దాలు గడిచిపోయిన స్థితి. పంటగా ఆర్థికంగా అంత లాభదాయకం కానటువంటి స్థానిక రకాలను రైతులు పండించేవారు. అటువంటి సందర్భములో లక్ష్మణయ్య ‘సంపర్క పద్ధతి’ అనే తమ కొత్త కాన్సెప్ట్ ద్వారా కొత్తరకాల అన్వేషణ ప్రారంబించారు. ఈ పరిశోధనలో మైసూరు మరియు తమిళనాడు రకాలను ఉపయోగించారు. తత్పరిణామంగా ఆయనకు అద్భుత యశస్సు లభించింది. అదే కర్ణాటక యొక్క ‘రాగి క్రాంతి’.

వర్షాధారంగా ఏడాదికి రెండు సార్లు రైతులు రాగి పెంచడం చూసిన లక్ష్మణయ్య, ఏడాది పొడుగునా తక్కువ వ్యవధిలో, కొద్ది నీటిలో పెంచగల కొత్త రకాలను అభివృద్ధి చేశారు.

అనారోగ్యపీడితులైన స్థితిలోనూ లక్ష్మణయ్య గారు ‘రాగి’ ధ్యానాన్ని మరువలేదు. చివరి రోజుల్లో అతి ముఖ్యమైన శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ గదిలోకి వెళ్ళే ముందు, “శస్త్రచికిత్స తర్వాత స్పృహ వచ్చాక నాకు  రాగి పరిశోధన కొనసాగించడం సాధ్యమవుతుందా? సాధ్యమైతే మాత్రమే నన్ను ఆపరేషన్‌కు పంపండి. లేదంటే నా చావు నన్ను చావనివ్వండి.” అని వైద్యులను అర్ధించారట. అంతటి మహా రాగి ప్రేమికుడతడు.

దురదృష్టవశాత్తూ వారి శస్త్రచికిత్స సఫలం కాలేదు. ‘అంత్యసంస్కారాల కన్నా ముందు నా దేహం పైన ఒక పిడికిలి రాగులను చల్లండి.’ అని లక్ష్మణయ్య గారు తమ భార్యకు చెప్పిన చివరి కోరిక.

ఇలా లక్ష్మణయ్య గారిని తలచుకుంటూ రాగిముద్ద విలాసంలో మునిగిన నన్ను పూజ ముగించి వచ్చిన అమ్మ పిలుపు తట్టి లేపింది. నిద్రలో తూగే కళ్ళను ఎలాగో విప్పి బయటకు చూశాను. ప్రకృతిమాత పచ్చదనాన్నే మంటగా వెలిగించి, భూమినే పాత్రగా చేసుకొని రాగి ముద్దలను కట్టి కట్టి బయట పేర్చిపెట్టినట్టున్న కొండలు కనిపించాయి. నెత్తి పైన మబ్బులు, అటూ ఇటూ తారట్లాడే మబ్బులు ముద్ద ఉడికించడానికి ఉడుకుతున్న అత్తెసరు నీళ్ళలా కనిపిస్తున్నాయి.

కన్నడ మూలం: చ. హ. రఘునాథ్
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

Exit mobile version