[శ్రీ రఘు శేషభట్టర్ రచించిన ‘రహస్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చేతికందిన గడ్డి పరక నుండి
కంటి కందని తళుకు తారక దాకా
లోకంలో ఏ సృష్టికైనా ఒక రహస్యం పులమబడి ఉంటుంది
లేదా నీకు తెలియనిదేదో రహస్యంగా ఉండిపోతుంది
అడుగుల కింద కరకర నలిగే ఎండుటాకులకు కూడా
వాటి రాపిడి భాష మిగిలి ఉంటుంది
తెలియనిదల్లా నీ ఇనప లిపికి అది అతకదని
నీకు మాత్రమే భాష ఉందనే అహంకారమే
పక్షి కూతకు నిన్ను దూరం చేస్తుంది
నువ్వు ముద్దుగా పెంచుకున్న ఇంటి కుక్కకు
పెంపుడు పిల్లికి నీ మాట అర్థమైనప్పుడు
పాడి ఆవు నీ మాటకు తలూపి పోతున్నప్పుడు
వాటికున్న హేతువేదో నీకు లేదని బోధ పడుతుంది
సంకేతాలు వాడుక భాషల్లా స్థిరపడిన మధుర లోకంలో
ప్రతి అరుపు వ్యాకరణంగానే వినబడినప్పుడు
పశువులు నీకు వశమౌతాయి
పక్షులు వృక్ష శాఖలతో తలొంచుతాయి
విసవిసలాడే గాలులు ఆపన్న పవనాలౌతాయి
లిపి కేవలం ఉపకరణంగా మారినప్పుడు
సృష్టి రహస్యాలు యోగులకే కాదు
కవులకు కూడా తెలుసని స్పష్టమౌతుంది
రఘు శేషభట్టర్ గారి స్వస్థలం ఖమ్మం. 18 నవంబర్ 1970వ తేదీన జన్మించిన రఘు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బహుళ జాతి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం, సూర్యుడు పొడిచిన రాత్రి, నిద్రపోని మానవ కోయిల, లిపి తడిసిన తరుణం, మోహధూపం, నేను కల వెన్నెల, అసంకల్పిత పద్యం, అనల్పం, దిశాంతర స్వప్నం (9 కవితా సంపుటాలు), సౌరభం (వ్యాస సంపుటి) ప్రచురిచమయ్యాయి. ప్రస్తుతం హైదరబాద్ నేరేడ్మెట్ లోని రామకృష్ణాపురంలో నివాసం. ఫోన్స్: 9676144904 & 9603264732
