Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాజుగారి వందెకరాల ఉసిరితోట!

[విడదల సాంబశివరావు గారి వ్రాసిన ‘రాజుగారి వందెకరాల ఉసిరితోట!’ అనే దీర్ఘకవితని అందిస్తున్నాము.]


ది..
రాజుగారి వందెకరాల ఉసిరితోట!
ఒకప్పడు ఊరి పొలిమేరలో వుంది..
ఊరిప్పుడు పల్లె సాయి నుండి
పట్నం స్థాయికి ఎదిగింది
పిల్లలందరూ యువకులై
చదువులమ్మ బడిలో ఉత్తీర్ణులై
అమెరికా జర్మనీ యూరప్ దేశాలకు
కరెన్సీ కట్టల కోసం విమానాలు ఎక్కారు!
ఉన్నతోద్యోగాలలో స్థిరపడిపోయి
సంపన్నులుగా రూపాంతరం చెందారు!
ఒకప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని
బిడ్డల ప్రయోజకత్వం చూడాలని
గాజు కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకోని
కొండంత ఆశతో ఎదురు చూస్తోన్న
తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలలో
విదేశీ డాలర్లు జమ అవుతోన్న దృశ్యం
కడ రమణీయమై..
కన్నుల కింపుగా మారి..
మాతృ పితృ హృదయాలు
ఆనంద తరంగాలతో ఓలలాడుతున్నాయి!
డాలర్ల పుణ్యమా అని..
ఊరు స్వరూపం పూర్తిగా మారిపోయింది!!
మట్టి మిద్దెలు బంగళాలుగా రూపు దిద్దుకున్నాయి
ప్రతి ఇంటి ముంగిట
మోటారు సైకిళ్ళు.. కార్లు
అందంగా కొలువై వుండి..
చూపరులకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి!
“ఊరెంత మారిపోయింది?” అంటూ..
ప్రక్క ఊరి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు! ‘\
ఊరు మారింది.. ఊరితోబాటు
ఊరి జనం స్థాయి కూడా మారింది!
కానీ..
రాజుగారి వందెకరాల ఉసిరితోట మాత్రం
అక్కడే వుంది.. అలాగే వుంది!
దాని చుట్టూ ఎత్తైన భవనాలు
వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు
హోటళ్ళు.. షాపింగ్ మాల్స్
ఉసిరితోట ప్రక్కగానే బైపాస్ రోడ్దు
దాని ప్రక్కనే వున్న భూములకు రెక్కలొచ్చి
రియల్ స్టేట్ బూమ్ ఆకాశాన్ని తాకింది!
ఆ ఊరి కుటుంబాలన్నీ
‘సిరి’కి నిలయాలై
సంపదతో కళకళలాడుతున్నాయి!
అయినా.. అదేమి చిత్రమో గానీ..
తలరాతలు ఆకాశాన్ని ఏలుతున్నా
బుద్ధులు భూమి లోపలకు
కుంచించుకు పోతున్న చందాన..
మనుషుల్లో..
మానవత్వపు జాడలు
సమ సమాజ నిర్మాణ భావనలు
ఐకమత్యం వీచికలు
మచ్చుకైనా కనిపించడం లేదు!
రాజుగారి హయాంలో
ఊరిజనులందరూ ఉమ్మడిగా
ఉసిరితోటలో వన భోజనాలు
ఏక పంక్తిగా చేసుకోవడం
ఘనమైన సంప్రదాయంగా విలసిల్లినది
కులమతాల కతీతంగా
పేద ధనిక భేదాలను మరచి
అన్నదమ్ముల్లా.. అక్కచెల్లెళ్ళలా కలసి మెలసి
వందెకరాల ఉసిరితోటలో సందడి చేశారు
ఊరంతా ఒక్కటిగా కలిసిపోయి
ఐకమత్యమే బలంగా
ఆనందానుభూతులను
హాయిగా పంచుకున్నారు!
ఈ ఐక్యత కలకాలం వర్థిల్లాలని
ఊరంతా చిరకాలం ఐక్యంగా వుండాలని
రాజు గారు సదాశయంతో
వందెకరాల ఉసిరితోటను
ముక్కలు చేయకుండా ఉంచారు!
మనిషికి సంపదతో బాటు
జ్ఞానసంపద కూడా పెరిగింది
నేటి ఆధునిక జీవనంలో
ఆదర్శ భావనలు పెరగక పోగా
సంకుచిత భావజాలంతో కుంచించుకు పోతున్నాడు
ఈ అణుయుగం మానవుడు!
కులపిచ్చి.. మత జాఢ్యం
నరనరాన అల్లుకుపోయాయి!
కార్తీక మాసం శోభలతో
ఊరంతా దీప కాంతులు ప్రజ్వరిల్లుతున్న వేళ..
నాగరికత వెర్రితలలు వేసినా
సంప్రదాయం సరదాలు మాత్రం
ఉసిరితోట బాట పట్టాయి!
రాజుగారి వందెకరాల ఉసిరితోట
వన భోజనాలకు వేదికగా మారింది
అయితే ఈసారి మాత్రం..
వందెకరాల ఉసిరితోట
వంద భాగాలుగా ముక్కలైపోయింది!
ఒక్కో భాగంలో..
ఒక్కో కులం కుంపటి రాజేసి
వనభోజనాలకు సరికొత్త అర్థాన్ని
వందెకరాల ఉసిరితోటలో
కొత్తగా లిఖించారు ఆదునిక సంపన్న మానవులు!
ఆ ఊరి చరిత్రను..
రాజుగారి ఐకమత్యం, ఆశయాన్ని..
ఉసిరితోట మట్టిలో కప్పెట్టి
పండగ చేసుకుంటున్నారు
కుహనా కులపిచ్చి మేధావులు; సంపన్నులు!
దశాబ్దాలుగా..
ఒకే రూపంతో విలసిల్లుతోన్న
అందమైన వందెకరాల ఉసిరితోట..
వంద భాగాలైన తన వికృతరూపాన్ని
తానే చూస్తూ జీర్ణించుకోలేక
కన్నీటి పర్యంతమై..
శోక సంద్రంలో మునిగిపోయింది!
ఆధునిక మానవజాతి చేస్తోన్న
వికృత కార్యాల విన్యాసాలను..
పరలోకంలో విశ్రాంతి తీసుకుంటోన్న రాజుర్గాఉ
ఏకాగ్రతా చిత్తంతో దీక్షగా చూస్తూ..
కులమతాల విద్వేషాలతో
ముక్క చెక్కలై పోతోన్న
ఇరవై ఒకటో శతాబ్దం మనుష్య సంతతిపై
ఒకింత జాలి చూపుతూ..
నిర్వేదంగా నవ్వుకున్నారు!

Exit mobile version