[శ్రీమతి గీతారాణి అవధానుల (మయూఖ) గారు రచించిన ‘రామగీత శతకము’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు శ్రీ లోకే రాజ్ పవన్.]
తెలుగు సాహిత్యంలో ఒక ఆత్మాభివ్యక్తి సాధనంగా శతకం దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి ఒక ప్రముఖమైన సాహిత్య ప్రక్రియగా కొనసాగుతూ వస్తున్నది. మొదట్లో శైవ సాంప్రదాయకంగా మొదలైననూ తర్వాత సాంఘిక సంస్కరణలు, మార్పులకు శతకాలు సులభమైన అభివ్యక్తి రూపాలయ్యాయి. పాల్కురికి సోమన వృషాధిప శతకం నుండి మొదలై నేటి వరకు వచ్చిన వేలాది శతకాల్లో ప్రజల నోళ్లలో ఎక్కువగా నానినవి సామాజిక అంశాలపై రాసిన శతకాలే. ఆధ్యాత్మిక శతకాలకు ఉన్న వస్తుపరమైన పరిమితి వల్ల చాలా తక్కువ శతకాలు మాత్రమే ఎక్కువ కాలం ప్రజల మౌఖిక వ్యవహారాలలో నిలిచి ఉండిపోయాయి. 12,13వ శతాబ్దాలలో అప్పటి గ్రాంథిక క్లిష్ట సాహిత్య సంప్రదాయం శిష్ట సాహిత్య రూపంగా రాజస్థానాలను ఆశ్రయించి ఉండగా, జానపద మౌఖిక దేశీ సాహిత్యాలు పామరజన సాహిత్య పరంపరగా చలామణి అయి అద్భుతమైన సమాంతర చారిత్రక సాహితీ వారసత్వాన్ని కొనసాగించాయి. ఈ సమయంలోనే ద్విపద మార్గం, శతక సాహిత్యాలు ఆ రెండు రూపాలకు మధ్యరూపంగా ప్రజలలోకి వెళ్లాయి. కాశీనాథుని నాగేశ్వరరావు శతకాన్ని దేశీ కవితా రీతులలో ఒకటిగా చెప్పాడు గానీ చాలా తక్కువగా పామరజన వ్యవహారం లోతుల్లోకి వెళ్లిన శతక సాహిత్యం పండిత వర్గాలకే పరిమితమైన శిష్ట సాహిత్యం కంటే ఎక్కువగానే శిష్ట వర్గ ప్రజలలోకి వెళ్ళింది. ఇందుకు ప్రధాన కారణం శతకాలలో సహజ లక్షణంగా ఉంటూ వచ్చిన భాషా సరళత, భావ సరళతలు. తమిళం, కన్నడాలలో కూడా శతక సాహిత్యం వచ్చింది కానీ, అక్కడి ప్రజల సాహిత్య అభిరుచి శతకాలను ఆదరించలేదు. ప్రధానంగా శతకాల్లో వర్ణాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. రస పోషణ కూడా తక్కువే. పైగా శతకాలన్నీ ముక్తకాలు కావడం లాంటి కారణాల వల్ల బహుశ అక్కడ శతకాలు ఎక్కువగా వ్యాప్తి చెందలేదు. తెలుగులో మాత్రం ఈ వెయ్యేళ్ళలో శతకం యొక్క స్వరూప స్వభావాలు ఎంతగా మారిననూ ఇక్కడ శతకం బహుముఖ వికాసాన్ని పొందింది. పై అడ్డంకులను అధిగమించి తెలుగులో శతకం విస్తారమైన విషయ వ్యక్తీకరణ రూపంగా నిలబడింది.. నిరూపించుకుంది.
క్షేత్రస్థాయిలో వచన కవిత్వాలు, ఇతర సరళ అభివ్యక్తి రూపాలు, మౌఖిక కళారూపాలు, పాట లాంటి సులభ సాహిత్య రూపాలు అట్టడుగు వర్గాల ప్రజలను చేరి అనేక సామాజిక మార్పులకు దోహదం చేస్తూ, ప్రజా సాహిత్యాలు మాత్రమే సమాజాన్ని దిశా నిర్దేశం చేస్తున్న ఇప్పటి కాలంలో శతక సాహిత్యం యొక్క ప్రాసంగికత గురించిన చర్చను ఇప్పటికి పక్కన పెడితే తెలుగు సమాజంలో ఇప్పటికీ తరచూ కొత్త కొత్త శతకాలు వస్తూనే ఉన్నాయి. వస్తువు ఆధ్యాత్మికమైనదైనా, సామాజికమైనదైనా.. సంఖ్యాపరమైన క్షీణత ఉంటే ఉండవచ్చు గానీ శతక రచన ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఏటా కొన్ని శతకాలు పురుడుబోసుకుంటూనే ఉన్నాయి.
అట్లా ఈ సంవత్సరం మన ముందుకు వచ్చిన పద్య శతకమే ఈ ‘రామగీత శతకం’. మయూఖ విరచితంగా గీతారాణి అవధానుల గారు ‘రామగీత మాట రాచబాట’ మకుటంతో రచించిన ప్రకీర్ణ శతకమిది.
ఇక ఈ శతకం వృత్త నియమానుసారంగా ఆటవెలది పద్యాలతో రూపుదిద్దుకుంది. భాషానియమ పరంగా చాలా మట్టుకు సరళమైన పదాలతోనే ఇందులోని పద్యాలున్నాయి. సంఖ్యలో చూస్తే ఇందులో మొత్తం 108 పద్యాలున్నాయి.
ఇక శతకంలోకి వెళ్తే సాంప్రదాయ బద్ధమైన పద్య కవితామార్గాన్ని ఎంచుకున్నందున పదకొండు శతకపూర్వ, తొమ్మిది శతకాంతర్గత ప్రార్థన పద్యాలతో ఈ శతకం ప్రారంభమవుతుంది. శతకంలో మధ్యమధ్యన కొన్నిచోట్ల ఆధ్యాత్మిక అంశాల ప్రస్తావనలు, ప్రస్తుతింపులు ఉన్నా కూడా నైతిక వికాసం, సత్ప్రవర్తన, సామాజిక చైతన్యాల గురించిన పద్యాలే ఈ శతకంలో అగ్రసంఖ్యలో ఉన్నాయి. నిజానికి వీటన్నింటినీ ప్రత్యేక విభాగాలుగా పుస్తకంలో రూపొందించలేదు గానీ ఒక్కోపద్యాన్ని ఎంచుకుంటూ క్రమబద్ధంగా సమూహపరిస్తే ఈ 108 పద్యాలలో నాలుగు ప్రధాన విభాగాలను గమనించవచ్చు. మొదటిది- ఆధ్యాత్మిక సంబంధిత పద్యాలు, రెండోది- ప్రకృతికి సంబంధించిన పద్యాలు, మూడోది- దేశభక్తి పద్యాలు నాలుగోది- మనిషి ప్రవర్తన, నైతికతల పై రాసిన పద్యాలు. రామగీత శతకం లోని సామాజిక విలువలను అధ్యయనం చేసే క్రమంలో వివిధ పద్యాలలోని విభిన్న వస్తుసారాలను ఒకసారి చూద్దాం..
1) రామగీత శతకంలో వస్తుతత్త్వం:
అ) ప్రకృతి సౌందర్యం:
కవయిత్రికి ప్రకృతి పై ఉన్న ఎనలేని ప్రేమ, పల్లెసీమల పట్ల అనురాగం శతకంలోని దాదాపు పన్నెండు పద్యాలలో కనబడుతుంది. ప్రకృతిలోని పచ్చదనానికి ముగ్గురాలై,
పచ్చదనముదెచ్చు బాటకు శోభను
పచ్చదనము మనకు ప్రాణమిచ్చు
పచ్చదనములేక భాగ్యము శూన్యము..
అంటారు.
అలాంటి పచ్చదనాన్ని నాశనం చేయడం పైన ఆవేదన చెందుతారు కూడా..
పచ్చదనము ద్రుంచి ఫలములడుగుటేల?
వసుధ వేడి పెంచి వగచుటేల?
చేయి కాలినంత చింతపడగనేల?..
అంటారు.
ప్రకృతి పచ్చదనంలో ఇమిడిపోయిన అసంఖ్యాకమైన జీవజాలం పట్ల ఆమె తన ప్రేమను ప్రకటిస్తారు చిట్టి పిట్టల నుండి కూడా గట్టి దీక్షను నేర్వమని చెప్తారు.
పూరి పుడకల గొని పొట్టి గూటిని గట్టి
పిట్ట జూపు ప్రతిభ ప్రియముగాను
చిట్టిపక్షికున్న గట్టిదీక్షను జూడు..
ఓ సినీకవి, భూపాలుని (సూర్యుడి) తోవలో భువనాలన్నీ పల్లవించి, మెలకువల వందనాలు ఆ పసిడి కిరణాలను ఆహ్వానించడంతో పాటు పక్షులు కూడా ‘కువకువల స్వాగతాలు’ చెప్తాయని రాసినట్టుగా, కవయిత్రి కూడా ఆ ఉదయపు వేకువను ఇలా వర్ణిస్తారు.
ఖగముల కిచకిచలు కడువేడ్క సలుపగా
బాల రవియే యిడగ పసిడి వెలుగు
వేకువ సమయాన వేడుకే జగమంత..
నిజానికి, కవయిత్రి అవ్యాజమైన ప్రేమను చూపిస్తున్న ఈ ప్రకృతికి సిసలైన చిరునామాలు పల్లసీమలే. అందుకే
పైరగాలి పాట పచ్చపచ్చని తోట
పరిఢవిల్లుచుండు పల్లె చెంత
పల్లెటూళ్ళు దేశ ప్రగతికి తోడౌను..
అంటారు.
ప్రకృతి శోభలకే కాదు, మమతానురాగాలకు కూడా పుట్టినిల్లు పల్లెలేనంటారామె.
పల్లెటూరునందు పల్లవించు మమత
అడుగడుగుననొక్క యాప్తుడుండు..
అయితే కవిత్రికి ప్రకృతి మీద ప్రేమ ఉండడం మాత్రమే కాదు విశాలమైన బాధ్యత కూడా ఉంది తన కళ్ళ ముందు వినాశనం బాట పడుతున్న ప్రకృతి మీద వేదన చెందుతూ అలా పట్టిస్తున్న మనిషికి
జలము వలన నిలుచు జగతిలో జీవులు
జలము లేనినాడు జగము లేదు
జలము పొదుపుసేయ జాప్యము వలదురా..
అంటూ నీటి పొదుపును గురించి,
కలుషితమ్ముజేసి యిలను స్వార్థముతో
వగచుటేల నరుడ వలదు నీకు..
అంటూ భూకలుష్యం గురించి హితోక్తులు చెప్తారు.
ఆ) దేశభక్తి:
ఇక ప్రకృతి, పల్లెల మీద ప్రేమను ఎంతగా చూపిస్తారో కవయిత్రి దేశం మీద భక్తిని కూడా అంతే చూపిస్తారు.
ఎచట కేగి యచట నేమి చేసిననేమి
భారతీయుడనిన భాగ్యమౌను
ఎందుకాలునిడిన నీ జాతి పొగడవోయ్..
అని భుజం తడతారు.
శాంతి కాముకులకు సదనమ్ము భరతము
కులమతాలు మెలగు కూర్మి తోడ
సామరస్యమందు జగతికాదర్శమే..
అంటూ జాతి పునాదులను గుర్తుచేస్తారు.
అయితే ఈ సమరసతను దెబ్బతీస్తున్న కుల మతాల తగవులు వలదని, వాటిని వదిలి స్నేహంతో మెలగాలని ప్రజలకు ఉద్బోధ చేస్తారు.
కులము మతములనుచు కుమ్ములాట తగదు
కూడియుండినపుడె కూర్మి గలుగు
భేద భావమెంచు బేషజమ్ము వలదు..
ఇ) మహిళా సాధికారత:
స్త్రీల మీద, వారి శక్తి యుక్తుల మీద విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వారి సున్నితత్వం మీద, ఔదార్యం మీద తన మద్దతును తెలియజెప్తూ కవయిత్రి పలుచోట్ల కొన్ని పంక్తులు రాశారు..
మహిళ తోడ జగతి మహిమాన్వితము సుమ్మి
ముదిత వలన గల్గు ముదములవియె
మగువలేని నాడు మనుగడ యెక్కడ?..
అని,
ఎందు వెతికి చూడ నందు గలదు నారి
నింగి నేల తనది నీరు తనది
అతివలేని చోటు నవనిపై గనలేము..
అని చెప్తూ మనగడకు పునాదే స్త్రీ అంటారు. అలాంటి స్త్రీలను నొప్పించవద్దని, వారి పట్ల సహానుభూతిని ప్రదర్శిoచమని అంటారు..
ఈ) ప్రజాహిత దృష్టి:
ఇక ఆ తర్వాత మనిషి యొక్క నెగటివ్ అంశాలను కేంద్రీకరిస్తూ, వాటిని బట్టబయలు చేస్తూ, దునుమాడుతూ వాటిని మార్చుకునే దిశగా కవయిత్రి మనను ప్రేరేపిస్తారు.
డబ్బు వల్ల మనిషి ఎలా పతనమవుతున్నాడో చాలా చోట్ల వేదనతో రాస్తారు. డబ్బు కోసం అక్రమార్జనలకు దిగడం కూడదని చెప్తూ,
ఆస్తిపాస్తులనుచు నక్రమార్జననేల
కలిగినంతలోనె గంజి మేలు పంచభక్ష్యములకు ప్రాకులాడగరాదు..
అంటారు.
బంధువులు కూడా అంతే !డబ్బు కలిగి ఉన్న వారి చుట్టే పరిభ్రమిస్తుంటారు.
కలిమి కలిగెనేమి కలసిపోదురు జనుల్
లేని వార్ని కనరు లేశమైన
కలిమి చుట్టు తిరుగు కలినరులెల్లరు..
అలాంటి డబ్బు విషయంలో తృప్తితో మెలగాలని, డబ్బు కంటే మంచి మనసు ముఖ్యమని అంటారు.
ఆస్తులెంతయున్న నాత్మీయతలు లేక
తృప్తినీయదు కద తెరువరులకు
కలిమికన్న మేలు కలసిన మనసులు..
ఇక ఈ శతకంలో చాలా పద్యాలలో మనిషి స్వభావాన్ని చాలా స్పష్టంగా, పారదర్శకంగా విప్పి చెప్పారు కవయిత్రి.
ఒకచోట అంటారు- మనిషి మనసు ‘ఒరుల కూర్మి చూసి యోర్వలేదెపుడు’ అని. అలా ఓర్వలేని గుణం ఉంటే ‘ఎంత చదివెనేమి యేమి నేర్చిననేమి’ అంటూ చదివిన చదువంతా వ్యర్థమంటారు.
స్వార్థబుద్ధి కలిగి సలిపిన కార్యము
లివ్వబోవు ఫలములెవరికైన
ఫలముకాశపడక బాధ్యతయని యెంచు..
అంటూ స్వార్థం మనిషికి సత్ఫలితాలివ్వదంటారు.
అలాగే అన్ని అనర్థాలకు కారణం మాట సరిగ్గా లేకపోవడమేనంటూ,
పలుకులందు సుధలు చిలుకుచు మాటాడు
పరుషమైన పదము పలుక బోకు
పలుకు వలెనె నిలుచు బంధములిలలోన..
అని మధురవచనాలనుద్భోదిస్తారు. ‘పరుషమైన మాట పదును కత్తి పగిది’ అని హెచ్చరిస్తారు. మాట మాత్రమే కాదు కాపట్యం లేని స్వచ్ఛమైన మనసూ అవసరమేనని చెప్తారు.
మాటలోని చెరకు మనసులో గరళము
కామరూపి బోలు కపటగుణము
నమ్మబోకు నరుడి నైజమునెరుగక..
ఇక శతకంలో చాలాచోట్ల మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా పద్యాలను చేర్చారు కవయిత్రి.
జయము నిశ్చయంబు జంకకుమెపుడును
కష్టపడిన జయముగానవచ్చు
పట్టుబట్టి చదువ వాణి దీవించురా..
అని ఒకచోట,
కష్టమైన పనికి గట్టిగా శ్రమియించు
వెరచి వెనుకడుగును వేయబోకు
ఇష్టమైనదెపుడు నింపుగా తోచును..
అని మరోచోట, ఇంకా అనేకచోట్ల ఎక్కడికక్కడ పాఠకులలో ఆత్మవిశ్వాసం పెరిగేలా అక్షరధైర్యం నింపుతూ పోయారు.
స్నేహం ఎంత గొప్పదో, దాన్ని ఇలా నిలుపుకోవాలో, మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా చాలాచోట్ల చెప్పారు.
కాల మహిమ వలన కలిసిన బంధాలు
కలిసియుండు కట్టె కాలు వరకు
స్వార్థ బుద్ధిలేని సౌఖ్యము మైత్రియే..
అనేది అలాంటి వాటిలో మచ్చుకొకటి.
– ఇలా ఉదహరిస్తూ పోతే మరిన్ని విభిన్న అంశాలపై కూడా కవయిత్రి యొక్క అద్భుతమైన వ్యక్తీకరణలను శతకంలో చూడవచ్చు. ఎన్నో హితోపదేశాలను వినవచ్చు. ఎన్నెన్నో సుభాషితాలను మనసుకెక్కించుకోవచ్చు.
మొత్తంగా రామగీత శతకం మనుగడలో ఉన్న జీవనవిధానాలలోని మేలిమి జీవితాచరణల నిర్వచనాలను మనముందు పెడుతుంది.
2) రామగీత శతకం- భాషాగమనం:
మాతృభాషయనిన మధురమే యిలలోన
భావమెల్ల పలుకు భవ్యముగను!
అన్యభాష యనిన యాతురతది యేల..
అంటూ ఒక సందర్భంలో భాష పై తన అభిమానాన్ని ప్రకటించుకున్న కవయిత్రి తన భావాన్ని ఆచరణలో కూడా నిలుపుకున్నారు. శతకం లో ప్రతి చోట రమ్యమైన భాషను వాడారు. సొంపైన పదాలతో, సొగసైన వాక్యాలతో చదువరులను కట్టిపడేసే లాంటి భాషను వాడారు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో ఉపయోగించిన భాష చాలా సరళమైన భాష. ఎక్కడికక్కడ తెలుగులోని సరళమైన, అతి సరళమైన పదాలతో వాక్యాలను తయారుచేసి, పద్య పంక్తులుగా మార్చారు. మొత్తం పుస్తకానికి ఇదొక ప్రయోజనాన్ని చేకూర్చింది భాష లోని పదాలు,వాక్యాలు ఎంత కఠినంగా అవుతూ పోతుంటే, అంతగా ఆ సాహిత్యం పాఠకులకు దూరమైపోతుంది. ఇది ఒక కవి,రచయిత తెలుసుకోవాల్సిన అతి ప్రాథమికమైన విషయం. సూటిగా విషయాన్ని మాట్లాడుకుంటే, ఇప్పటికే ప్రక్రియలతో రాసిన సాహిత్యాన్ని గానీ, గణాలు, చందస్సులతో రాసిన సాహిత్యాన్ని గానీ పాఠకులు చదవడం లేదు. చందోబద్ధమైన సాహిత్యం, పద్యం లాంటి ప్రాచీన సాహిత్యం లేదా గణాలతో, మాత్రలతో ఆ మధ్య విరివిగా వచ్చిన మినీ సాహిత్యం లాంటివి కనుమరుగవుతూ ఉండడానికి కారణమిదే. అంతకంటే సరళమైన రీతుల్లో రాసిన కథ, పాట, వచనకవిత్వం లాంటి సాహిత్య రూపాలు అందుబాటులో ఉన్నప్పుడు సహజంగానే పాఠకుడు గణాలు, మాత్రలతో తయారైన నియమబద్ధమైన సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడడు. వాటిలో ఉండే క్లిష్టత పాఠకుణ్ణి ఆ సాహిత్యానికి దూరం చేస్తుంది. ఒకవేళ కవి లేదా రచయిత తన అభిరుచి కి అనుగుణంగా తప్పనిసరిగా పద్య సాహిత్యం లాంటివే రాయాల్సి వచ్చినప్పుడు భాషా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో వాడే భాష సరళమైన ఇతర సాహిత్య రూపాల భాషకు దగ్గరగా ఉంటే తప్పకుండా ఆ పద్యాలను పాఠకుడు చదివి తీరతాడు. పాఠకుడు సాహిత్యానికి దూరమయ్యేదల్లా క్లిష్టమైన భాషను ఉపయోగించడం వల్లనే కనుక సరళమైన భాషే పద్యంలో లభిస్తే పాఠకుడు సంతోషంగా ఆ పద్యాన్ని ఆస్వాదిస్తాడు.. ఆదరిస్తాడు.. ఇది గమనించని చాలామంది కవులు ఎంత కఠినమైన భాష ఉపయోగిస్తే తమ కీర్తి ప్రతిష్టలు అంత పెరుగుతాయని భావిస్తారు.
కానీ ఈ కవయిత్రి ఆ దారిలో వెళ్లలేదు. రామగీత శతకం మొత్తంలోనూ పూర్తి సరళమైన భాషతో కూడిన ఆటవెలది పద్యాలే మనకు కనిపిస్తాయి. తద్వారా ఇది తప్పకుండా పాఠకులకు చేరువవుతుందని, ఇందులోని పద్యాలు వారి నోళ్లలో నానుతాయని భావించవచ్చు.
3) రామగీత శతకం – శిల్ప సౌందర్యం:
రామగీత శతకంలోని ప్రతి పద్యం ఆటవెలది ఛందస్సులోనే సాగడం ఈ కృతికి ప్రధాన విశిష్టతగా నిలుస్తుంది. కవయిత్రి ప్రతి పద్యంలో ఛందోనియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా తన కవితా పటిమను చాటారు. ఆటవెలది అనే సులభస్రవంతి ఛందస్సు వల్ల పద్యాలు చదవడానికి ఎంతో మాధుర్యంగా అనిపిస్తాయి. ఈ ఛందస్సు పాఠకునికి ఒక లయానుభూతిని కలిగిస్తుంది. ప్రతి పద్యం పంక్తీసమతూకంతో, సరళమైన గమనంతో ముందుకు సాగుతుంది. అందువల్ల పాఠకుడు విసుగుకు గురికాకుండా పద్యాలను ఆస్వాదించగలుగుతాడు.
అదేవిధంగా ఈ శతకంలో ఉపమానాల వినియోగం కూడా ప్రత్యేకంగా గమనించదగినది. ప్రతి ఉపమానం సందర్భానుసారంగా సరిపడేలా ఎంతో సహజంగా ఉపయోగించబడింది. ఉపమానాలు బలవంతంగా చేర్చినట్లుగా కాకుండా భావప్రవాహంలో భాగంగా కనిపిస్తాయి. అవి భావాన్ని మరింత స్పష్టంగా, హృద్యంగా వ్యక్తపరుస్తాయి. సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలనే ఉపమానాలుగా తీసుకోవడం వల్ల అవి పాఠకునికి సులభంగా అర్థమవుతాయి. ఈ ఉపమానాల ద్వారా కవయిత్రి తన భావాలను పాఠకుని హృదయానికి దగ్గర చేశారు. పద్యాన్ని ఒకసారి చదివితేనే భావం స్పష్టంగా అర్థమవుతుంది. భాషలో,శైలిలో సహజత్వం, రమ్యత కలగలిపి కనిపిస్తాయి. ప్రతి పద్యం చదివిన తర్వాత వెంటనే తదుపరి పద్యం చదవాలనే ఆసక్తి పాఠకునిలో కలుగుతుంది. ఈ ప్రవాహాత్మకత శతకానికి ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది.
కవయిత్రి భావవ్యక్తీకరణలోని స్పష్టతపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. అందువల్ల ప్రతి పద్యం సూటిగా, స్పష్టంగా సందేశాన్నిచ్చింది. పుస్తకంలోని భాషలో తక్కువగానే అయినా కొన్నిచోట్ల అలంకారాలు ఉన్నప్పటికీ అవి క్లిష్టతను సృష్టించవు. సరళతలోనే సౌందర్యాన్ని ఆవిష్కరించడం ఈ కృతికి ముఖ్య లక్షణం.
మొత్తం మీద రామగీత శతకం యొక్క శిల్పం ఛందస్సు, ఉపమానాలు, భాష అనే మూడు అంశాల సమన్వయంతో కూర్చబడి పాఠకుని మనసును ఆకట్టుకునే అద్భుతమైన పద్య కృతిగా నిలుస్తుంది.
4) రామగీత శతకం- కావ్య ప్రయోజనం:
కవిత్వమంటే కదిలించేది, పెనునిద్దుర వదిలించేది అంటాడు శ్రీశ్రీ. ఇక్కడ రామగీత శతకంలో ‘పద్యం’ ఆ పనిని పూర్తిగా నిర్వర్తించింది.
ఒక కావ్యానికి ఉండాల్సిన సంపూర్ణ లక్షణాలు ఈ శతకానికున్నాయి.
‘అదోషాలు, సగుణాలు, సాలంకారాలైన శబ్దార్ధాలే కావ్యం’ అంటాడు మమ్మటుడు కావ్యప్రకాశంలో. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నది రామగీత శతకం.
అంతేకాదు, రామగీత శతకం ఒక సమగ్ర నైతిక సందేశాన్ని అందించే విలువైన పద్యకృతి. ఈ శతకంలోని ప్రతి పద్యం మనిషి జీవన విధానాన్ని సరిదిద్దే ఒక నైతిక సందేశాన్ని కలిగి ఉంది. నైతిక విలువలను సాధారణ జీవితానికి అన్వయిస్తూ చెప్పడం ఈ కృతికి ప్రత్యేకత. మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను ఇది సరళంగా, సులభంగా వివరిస్తుంది. ధర్మం, నీతి, సత్యం వంటి విలువలు పద్యాల రూపంలో అందంగా ఇందులో ప్రతిఫలిస్తాయి. ఈ శతకం పాఠకునిలో మంచి ఆలోచనలను పెంపొందిస్తుంది. సమాజంలో మంచితనాన్ని పెంచే అనేక లక్షణాలు ఇందులో విస్తారంగా కనిపిస్తాయి. ప్రతి పద్యం ఒక చిన్న సందేశాత్మక రచనలా పనిచేస్తుంది. జీవన సత్యాలను సరళమైన పద్యభాషలో ఇది తెలియజేస్తుంది. అందువల్ల ఇది అన్ని వర్గాల వారికి సులభంగా అర్థమవుతుంది. ఈ శతకాన్ని చదవడం ద్వారా మనిషి తన ప్రవర్తనను పరిశీలించుకునే అవకాశం పొందుతాడు. మంచి మార్గంలో నడిచే ప్రేరణను ఇది ఇస్తుంది. శైలీ పరంగా ఈ కృతి ఎంతో అందంగా ఉంటుంది. సాహిత్య సౌందర్యంతో పాటు భోదనాత్మకతను కలగలిపి రచించబడింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది ఒక మంచి కావ్యానికి ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉంది. భావం, భాష, ఛందస్సు అన్నీ సమన్వయంతో ఉంటాయి. ఉపమానాలు, అలంకారాలు భావాన్ని మరింత హృద్యంగా వ్యక్తపరుస్తాయి.
5) రామగీత శతకం: పరిమితులు:
రామ గీత శతకంలో ప్రధానంగా రెండు పరిమితులున్నాయి.
మొదటిది – శతకంలోని కొన్ని పద్యాలలోని వాక్యాలు యథాతథంగా పునరావతమయ్యాయి లేదా ఒకటి రెండు పదాల మార్పుతో పునరావృతమయ్యాయి. ఈ విషయాన్ని గమనించి ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉన్నవి అయినా, ఆ పునరావృతాలను కూడా ప్రచురణకు ముందే సరిచేసి ఉంటే ఆ పద్యాలకు కూడా కొత్తదనం వచ్చి ఉండేది.
రెండవది – కవయిత్రి కొన్నిచోట్ల రాయప్రోలును, వేమనను, బద్దెనను అలాగే లోకోక్తులుగా ఉన్న కొన్ని జాతీయాలు, సామెతలను అనుసరించినట్లుగా చదవగానే పాఠకుడికి సందేహం తలెత్తుతుంది. అలా అనుసరించడం ఏమాత్రం తప్పు కాదు గానీ, తను అనుసరించిన విషయం పాఠకుడి స్ఫురణలోకి రాకూడదు. అలాంటి జాగ్రత్త కవయిత్రి తీసుకోవాల్సి ఉండేది. నిజానికి ఇదొక ఎత్తుగడ. చాలా మంది కవులు, రచయితలు అనుసరించే ఎత్తుగడ. ఈ శతక కవయిత్రి కూడా ఆ ఎత్తుకుడను అవలంబించాల్సింది. కానీ ఏ కారణం చేతనో అలా జరగలేదు.
– నిజానికి ఇక్కడ చెప్పుకున్న ఈ రెండు పరిమితులు చాలా చిన్న పరిమితులు. నిజానికి నిర్లక్ష్యపరచవలసినంత చిన్న పరిమితులు. అయితే ఆ చిన్న పరిమితులు కూడా లేకుంటే ఈ శతకం పరిపూర్ణ లక్ష్యాన్ని సాధించి ఉండేది.
చివరగా..
రామగీత శతకం లో వివిధ అంశాలపై కవయిత్రి లోతైన ఆలోచనలను వ్యక్తం చేశారు. కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలు, వ్యక్తిగత గుణాలు వంటి అంశాల ద్వారా నైతిక విలువలను సాధారణీకరించడంలో కవయిత్రి సఫలీకృతులయ్యారు. ఇందులోని ప్రతి పద్యం పాఠకునికి ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఈ శతకం చదివితే మార్పును అర్థం చేసుకునే ఏ మనిషి జీవన దృక్పథమైనా తప్పకుండా మారే అవకాశముంది. మంచి చెడులను వేరు చేయగల సామర్థ్యం పెరుగుతుంది. ఈ శతకం సాంప్రదాయ విలువలను ఆధునిక జీవితంతో అనుసంధానిస్తుంది. ఈ కృతి విద్యార్థులకు, యువతకు, సాధారణ పాఠకులకందరికీ ఉపయోగపడుతుంది. పద్యం ద్వారా చక్కని సందేశాన్ని చేరవేయవచ్చుననడానికి రామగీత శతకం ఒక మంచి ఉదాహరణ. ఈ శతకం చదవడం వల్ల కొందరిలోనైనా ఉన్న సద్గుణాలు మరింత బలపడతాయి. తద్వారా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారేందుకు అవి వారిని ప్రేరేపిస్తాయి. అందువల్ల ఈ శతకాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా రామగీత శతకం ఒక సాహిత్య కృతి మాత్రమే కాకుండా జీవన మార్గదర్శక గ్రంథంగా కూడా నిలుస్తుంది. పాఠకుడికి నేడు కావలసింది ప్రవచనాలు కాదు, ఉపదేశాలు కాదు.. కావలసింది నిజజీవితపు విలువలు. వాటిని సరళంగా సమన్వయంతో చెప్పే ఏ సాహిత్యాన్నయినా పాఠకుడు ఆదరిస్తాడు.. ఇప్పుడు ఈ రామగీత శతకాన్ని కూడా తప్పకుండా ఆదరిస్తాడు.
***
రామగీత శతకము
రచన: మయూఖ (గీతారాణి అవధానుల)
పుటలు: 41
వెల: అమూల్యము
ప్రతులకు:
గీతారాణి అవధానుల
geetharaniavadhanula@gmail.com
లోకే రాజ్ పవన్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుత నివాసం మంథని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కవిత్వం, కథారచన, సాహిత్య విమర్శ, చరిత్ర పరిశోధన వీరి ప్రవృత్తి.
వివిధ పత్రికలలో, ఆన్లైన్ మేగజైన్లలో కవితలు, కథలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు ప్రచురితం.

