Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రామం భజే శ్యామలం-24

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర.

న దేశానికి సంబంధించినంత వరకు గొప్ప రాజు అలియాస్ చక్రవర్తి అంటే ఎవరు? దీనికి ప్రాతిపదిక ఏమిటి? మన చరిత్రకారులు ఇందుకు చెప్పిన నిర్వచనాన్ని గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. కుటుంబాన్ని ఊచకోత కోసి.. లక్షలాది ప్రజల సామూహిక హననం చేసి, బౌద్ధం వేషం గట్టిన అశోకుడిని భారతదేశ రాచరిక వ్యవస్థలోనే అద్భుతమైన చక్రవర్తిగా అభివర్ణించారు. అక్బరు, షాజహాను, ఔరంగజేబుల కాలాన్ని ‘వైభవోజ్వల శకం’గా రోమిలా థాపర్ అభివర్ణించారు. అశోకుడికి ఒక విధంగా రెప్లికా (ప్రతిరూపం) అనదగ్గ రాజు ఔరంగజేబు. ఇతడి పరిపాలనను ఏ విధంగా ఉజ్జ్వల శకం అని వర్ణించారో చరిత్రకారులే చెప్పాలి. తండ్రిని జైల్లో పడేసి.. కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి.. అడ్డొచ్చినవాణ్ణి అడ్డొచ్చినట్టుగా హతమార్చిన ఔరంగజేబు.. ఛత్రపతి శివాజీని ఓడించలేక.. ఔరంగబాద్‌లో పడిగాపులు గాచి దిక్కులేని చావు చనిపోతే.. అతడిని ఏ విధంగా గొప్ప రాజు అని కీర్తించారో అర్థం కాదు. పెండ్లి చేసుకొని సంసారం చేసిన 19 ఏండ్లలో.. 14 సార్లు భార్యను గర్భవతిని చేసి.. ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేసి.. పాతిపెట్టిన తర్వాత ఆర్నెల్లకు ఆ ఎముకలను తెచ్చి ఇంకోచోట పూడ్చి.. పాలరాళ్లు కప్పితే.. ఆ ప్రేమమందిరం.. అంటూ ఊదరగొట్టేలా చరిత్ర పాఠాలు రాసిన మహానుభావులను ఏ విధంగా కీర్తించాలో అర్థం కాదు. ఈ రాజుది ప్రేమ అనడానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఏమైతేనేం ఇప్పుడది ప్రేమమందిరంగా మారిపోయింది.. షాజహాన్ చరిత్ర టాంపరింగ్ అయిపోయింది. గమ్మత్తేమిటంటే.. ఈ దేశంలో ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాజులు, చక్రవర్తులు లేనేలేరా? సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ ప్రపంచంలో ఇంకొకరిని చూపించగలరా? వీరి ప్రేమకంటే ఉన్నతమైన యూనివర్సల్ ప్రేమ ఎక్కడైనా కనిపిస్తుందా? రాముడి పరిపాలన కంటే ఆదర్శమైన పరిపాలన ఎక్కడైనా ఉన్నదా? ఇవాళ్టికీ.. రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారే తప్ప అశోకరాజ్యం, ఔరంగజేబు రాజ్యం కావాలని కోరుకున్నట్టు ఎక్కడా కనీసం వినిపించనైనా లేదు కదా.. మొఘలుల గురించి, అశోకుడి గురించి కొన్ని తరాలపాటు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసినా.. వాళ్ల ఇమ్యూనిటీ ఎంతమాత్రం పెరుగలేదు. ఇదంతా చర్చిస్తే మరో వ్యాస పరంపర అవుతుంది.

యురోపియన్ చరిత్రకారులు ప్రపంచ చరిత్రను రచించిన తీరు గమనిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. వీళ్లు ఏరికోరి ఎంపిక చేసుకొన్న రాజులందరూ కూడా మోనార్కులే. ఉదాహరణకు అబ్బాస్ ది గ్రేట్ అని ఓ పెర్షియా రాజు ఉన్నాడు. మోనార్క్. రాజ్యంలోకి రావడంతోనే సైనిక విస్తరణ.. ఈ విస్తరణలోనూ.. లక్షల సంఖ్యలో బానిసలను తీసుకొచ్చి సైన్యం నిర్మాణం చేశాడు. తన అధికారం పోతుందేమోనని కొడుకులను అనుమానించాడు. వాళ్లలో కొందరిని చంపించాడు. మరొకొందరిని గుడ్డివాళ్లను చేశాడు. ఇతని చరిత్రలో ఎక్కువ భాగం ఈ రకమైన కథనాలే కనిపిస్తాయి. ఆ తరువాత కొందరు రాజుల తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు. ఇట్లా ఈ బిరుదు పెట్టుకొన్నవాళ్లు పదిహేను ఇరవై మంది తేలుతారు. మన దగ్గర ఇంతకుముందు చెప్పుకొన్నట్టే అశోక ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ పేర్లు పెట్టనే పెట్టారు. ఈ ‘ది గ్రేట్’ అన్న విశేషణం తగిలించిన రాజులందరి చరిత్రలు హింసాత్మకంగానే కనిపిస్తాయి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భార్యలు, కొడుకులు, మంత్రులు, అధికారులు ఇలా ఎవరినీ చూడరు. అధికారం నిలబెట్టుకోవడమే ప్రధానం. ఇందుకోసం ఎంతకైనా తెగబడతారు. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. ఈ చిత్రహింస ఎట్లా ఉంటుందంటే.. ఎవడైనా ఎదురుతిరగాలంటేనే భయపడాలి. రోమన్ కొలీజియం ఇలా పుట్టుకొచ్చిందే. ఇప్పుడంటే వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం అయిందనుకోండి. ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటనుకుంటా. రాచరికం అంటే ఇదేననే ఒక అపోహను సృష్టించి.. వీళ్లను మాత్రమే గొప్ప రాజులుగా కీర్తిస్తూ వచ్చారు. మన దేశం విషయానికే వద్దాం యావత్ దేశం మర్చిపోయిన అశోకుడిని 19 శతాబ్దంలో ఓ యురోపియన్ చరిత్రకారుడు భూగర్భంలోంచి తవ్వి తీస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ మహాశయుడికి అతనొక్కడే కనిపించాడు. నాకు అర్థం కానిదేమిటంటే.. అశోకుడికంటే గొప్ప రాజులు ఎవరూ ఈ దేశంలో లేరా? సరే.. నేను రాముడి పేరు చెప్పవచ్చు. కాసేపు రాముడిని వదిలేద్దాం. రామాయణాన్ని పక్కన పెడదాం. ఈ దేశంలో ఇతర రాజులెవరూ లేరా? విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి.. ప్రజలందరి ఆదరణను చూరగొనేలా సుపరిపాలనను అందించిన చక్రవర్తులెవరూ చరిత్రకారులకు కనిపించలేదు. కానీ.. ఒక్కసారి మన చరిత్రను పరికించి చూస్తే.. ప్రజల చేత దేవుళ్లుగా కొలువబడ్డ రాజులు.. ఎందరో కనిపిస్తారు. కొందరి గురించి తెలుసుకొందాం.

చంద్రగుప్తు మౌర్యుడు:

ఇతను అశోకుడికి తాత. బిందుసారుడికి తండ్రి. అపూర్వము.. అనన్య సామాన్యమైన మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మౌర్య వంశస్థాపకుడు. భారతదేశ చరిత్రకు మకుటాయమానమైన పేరు ఏదైనా ఉన్నదంటే అది చంద్రగుప్త మౌర్యుడే. సింధు లోయ నుంచి తూర్పున బెంగాల్ వరకు.. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, కాశ్మీర్, దక్షిణాన దక్కను పీఠభూమి, కళింగ వరకు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు. దేశాన్ని వివిధ ప్రావిన్సులుగా విభజించి.. అధికారాన్ని వికేంద్రీకరించినవాడు. ఆయా ప్రావిన్సుల్లో అధికారులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనేవారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పడవలు సమాంతరంగా సాగాయి. ఇతని కాలంలో మనుషుల ఊచకోతలు, మారణకాండలు.. కనిపించవు.

చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యం

పురుషోత్తముడు:

యురోపియన్ చరిత్రకారులకు నోరుతిరక్క.. ఇతడిని పోరస్ అన్నారు. భారతదేశంలోకి పరాయిమూకల చొరబాటును మొట్టమొదలు ఎదుర్కొన్న వీరుడు పురుషోత్తముడు. మెసడోనియానుంచి దోచుకోవడానికి రెండు లక్షల కాల్బలం, ఎనభై వేల గుర్రాలు, ఎనిమిదివేల రథాలు, ఆరువేల ఏనుగుల అసాధారణ సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్ ను కేవలం ఇరవై వేల సైన్యంతో ఎదుర్కొని.. గంగానదిని దాటకుండా అడ్డుకొన్న ఏకైక రాజు పురుషోత్తముడు.

పురుషోత్తముడు – అలెగ్జాండర్

రాజరాజ చోళుడు:

రాజులకే రాజైన రాజరాజు ఈ చోళుడే. భారతదేశంలో దక్షిణాపథంలో గొప్ప రాజులలో ఒకడైనవాడు రాజరాజ చోళుడు. దక్షిణాన శ్రీలంక నుంచి తూర్పున కళింగ దాకా విశాలమైన రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు. రాజ్యాన్ని వలనాడులుగా విభజించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించినవాడు. భారతీయ సంస్కృతిని కాపాడటం కోసం శ్రమించినవాడు. భారతదేశంలో అత్యద్భుతమైన నిర్మాణంగా నేటికీ భాసిల్లుతున్న (తాజ్‌మహల్ కాదు) తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని అపూర్వంగా నిర్మించినవాడు. 1000 సీఈ లోనే భూ సర్వే చేయించిన రాజు రారాజ చోళుడు. తమిళ కవులు అప్పర్, సంబందార్, సుందరర్ వంటివాళ్ల రచనలు సమీకరించి తిరుమురై పేరుతో ఒక సంకలనాన్ని రూపొందించాడు. భారతదేశంలో అత్యంత సమర్థుడైన పరిపాలనాదక్షుడిగా పేరున్న రాజు రాజరాజ చోళుడే.

రాజరాజ చోళుడు

కనిష్కుడు:

సైనిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, రాజకీయ పరంగా కూడా ప్రసిద్ధి చెందిన కుషాణుల వంశానికి చెందిన రాజు కనిష్కుడు. కనిష్క సామ్రాజ్యం అత్యంత విశాలమైంది. అటు ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, అముదర్యా (ఆక్సస్) దాకా, ఇటు పాటలీ పుత్రం దాకా విస్తరించిన రాజ్యం కనిష్కుడిది. కాశ్మీర్‌లోని బారాముల్లా దగ్గర్లో కనిష్కపురం అన్న పేరుగల ఊరు ఇవాళ్టికీ ఉన్నది. అక్కడ కనిష్కుడి స్తూపం కనిపిస్తుంది.

కనిష్క సామ్రాజ్యం

పృథ్వీరాజ్ చౌహాన్:

భారతదేశంలో గొప్ప యోధుడైన రాజు. 13 వ ఏటనే అజ్మీర్ కిరీటాన్ని ధరించినవాడు. యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి చనిపోతే.. అతని తాత అంగమ్ (ఢిల్లీ రాజు) ఇతని ధైర్యాన్ని సాహసాన్ని గురించి విని తన వారసుడిగా ప్రకటించాడు. చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండానే పులిని హతమార్చిన వీరుడితను. ఇతని శత్రువు జయచంద్రుని కూతురు సంయుక్తను ప్రేమించి, స్వయంవరంలో గెలుచుకొని వివాహమాడినవాడు. ఇతని ప్రేమకథ నిజంగా అమరమైంది. షాజహాన్, ముంతాజ్‌ల మాదిరి కాదు.

పృథ్వీరాజ్ చౌహాన్

హేమచంద్ర విక్రమాదిత్యుడు:

పదహారో శతాబ్దంలో ఉత్తరభారతదేశాన్ని అద్భుతంగా ఏలిన రాజు. 1556లో ఢిల్లీ తుగ్లకాబాద్ ప్రాంతంలో మొఘలుల సైన్యాన్ని యుద్ధంలో ఓడించినవాడు. ఆ విజయం తరువాత తన పేరుకు చివరన విక్రమాదిత్యుడన్న పేరు పెట్టుకున్నాడు. దాదాపు 350 సంవత్సరాలపాటు సాగిన టర్కిష్, మొఘల్‌ల పరిపాలన నుంచి తక్కువ కాలమే అయినా.. స్వపరిపాలనను పునఃస్థాపించిన మహారాజు.

హేమచంద్ర విక్రమాదిత్య
హేమచంద్ర విక్రమాదిత్య సామ్రాజ్యం

మహారాణా ప్రతాప్:

మేవాడ్ రాజసింహమైన చక్రవర్తి మహారాణా ప్రతాప సింహుడు భారతదేశంలో చాలామంది రాజులు మొఘలులకు లొంగిపోయినా.. చివరకు అక్బర్ కొలువులో, సైన్యంలో కమాండర్లుగా పనిచేసినా.. రాణా ప్రతాపసింహుడు ఒక్కడే నిలుచొని అక్బర్‌ను ఎదిరించాడు. రాణాప్రతాపునితో సంధికోసం అక్బర్ చేసిన రాయబారాలేవీ ఫలించలేదు. చిత్తోడ్‌పై అక్బర్ విరుచుకుపడి.. ఇస్లాంలోకి మారబోమని అన్న పాపానికి ముప్ఫై వేల మందిని హతమార్చిన అక్బర్‌ను ఎదిరించిన వీరుడు రాణాప్రతాపుడొక్కడే.

మహారాణా ప్రతాప్

ఛత్రపతి శివాజీ:

ఇతని గురించి విననివారెవ్వరు? మార్క్సిస్టు చరిత్రకారులు తప్ప. మొఘలుల సామ్రాజ్యాన్ని పతనం చేసి అఖండ భారతాన్ని పరిపాలించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. క్రమశిక్షణ గల సైనిక వ్యవస్థ నిర్మాణం, పటిష్ఠమైన, నిర్మాణాత్మకమైన పరిపాలనా వ్యవస్థల ఏర్పాటుకు ఆధునిక భారతదేశ చరిత్రలో శివాజీయే ఆద్యుడు. గెరిల్లా యుద్ధవిద్యను సృష్టించివాడు శివాజీ. అతి తక్కువ సైన్యంతో శక్తిమంతమైన రాజులను ఆశ్చర్యకరరీతిలో ఓడించడంకోసం.. పాయింట్‌బ్లాంక్ రేంజిలో అకస్మాత్తుగా దాడిచేయడం.. ఊహించడానికి కూడా సాధ్యంకాని రీతిలో వ్యూహరచన చేయడం శివాజీకి మాత్రమే సాధ్యమైనది. తన తండ్రి దగ్గరి నుంచి లభించిన రెండువేల సైన్యాన్ని లక్షకు విస్తరించి తన రాజ్యంలోని ప్రజలకు రక్షణ వలయాన్ని నిర్మించాడు. మన ప్రాచీన హిందూ రాజకీయ సంప్రదాయాలను శివాజీ పునరుద్ధరించాడు. మాతృభాష మరాఠీతోపాటు, సంస్కృతాన్ని, పెర్షియాను ప్రోత్సహించాడు. భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన రాజు ఎవరైనా ఉన్నారా అంటే శివాజీయే. నౌకాదళం ప్రాముఖ్యాన్ని మొట్టమొదట గుర్తించిన వాడు. భారతనౌకాదళ పితామహుడు. తన రాజ్యానికి ఉన్న భౌగోళిక స్వరూపానికి ఉన్న అడ్వాంటేజెస్‌ను సమర్థంగా వినియోగించుకొన్నవాడు. దేశంలో ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన రాజు, జనరల్.. ఇంకా ఇంకా.. మీకు తెలుసా.. శివాజీ రాజ్యాన్ని రైతుల రాజ్యం (కింగ్‌డమ్ ఆఫ్ ఫార్మర్స్) గా పిలిచేవారు. రాజ్యంలో ప్రజల మధ్య సామాజిక చైతన్యాన్ని, సమగ్రతను సాధించినవాడు. రాయ్‌గఢ్‌లో ముస్లిం సైనికుల కోసం మసీదును కూడా నిర్మించాడు. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారికి మరణ దండన విధించినవాడు. ప్రజల పట్ల ఎంతో దయ, ప్రేమ, ఆర్ద్రత కలిగిన చక్రవర్తి ఛత్రపతి శివాజీ.

ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం

మహరాజా రంజిత్‌సింగ్:

సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు. ఒక కన్ను, ఒక చేయి లేకపోయినా.. ముల్తాన్, పెషావర్, సులేమాన్ పర్వత శ్రేణులు, జమ్ము కాశ్మీర్, ఖైబర్ పాస్, నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ వంటి అనేక ప్రాంతాలతో కలిసిన మహా సామ్రాజ్యాన్ని రంజిత్‌సింగ్ పరిపాలించాడు. హరిసింగ్ నాల్వా, దీవాన్ మాఖమ్ చాంద్, జోరావర్ సింగ్, జీన్ ఫ్రాంకోయిస్ అల్లార్డ్ వంటి జనరళ్ల సహాయంతో ఆయన పరిపాలన సాగించాడు.

రంజిత్ సింగ్

బింబిసారుడు:

చంద్రగుప్త మౌర్యుడి కంటే చాలా ముందే.. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు మగధను ఏలాడు. ఇతను బుద్ధుడికి సమకాలికుడని చెప్తారు. బుద్ధుడికి రక్షకుడిగా కూడా వ్యవహరించాడని అంటారు. ఇతను రాజ్‌గిర్ రాజధానిని చేసుకొని పరిపాలించాడని బౌద్ధ గ్రంథాలు చెప్తాయి. మహాభారతంలో ప్రసిద్ధి చెందిన అంగరాజ్యం కూడా ఇతని పరిపాలనలోనే ఉన్నది.

బింబిసారుడు – బుద్ధుడు

అజాతశత్రు:

బింబిసారుడి కుమారుడు. ఇతను రాజ్యాధికారం చేపట్టేనాటికి బుద్ధుడి వయసు 72 సంవత్సరాలని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. ఇతని హయాంలోనే మగధ ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగింది.

అజాతశత్రు

చంద్రగుప్తుడు:

ఇతను మౌర్య చంద్రగుప్తుడు కాదు. గుప్తవంశస్థాపకుడైన చంద్రశ్రీ కుమారుడు. మౌర్యుల తరువాత ఎంతోకాలానికి మగధను ఏలిన రాజు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, అయోధ్య వంటి అన్ని ప్రాంతాలు ఇతని రాజ్యంలోనే ఉండేవి. ఇతని పరిపాలనాకాలం ఇతని కుమారుడి పరిపాలనాకాలం స్వర్ణయుగమని భావిస్తారు.

సముద్రగుప్తుడు:

గుప్త చంద్రగుప్తుడు కుమారుడు. నాలుగు దశాబ్దాల పాటు ఎంతో గొప్పగా దేశాన్ని పరిపాలించిన వాడు. ఇతని పరిపాలన నిజంగా ప్రజలకు స్వర్ణయుగమే. ఉత్తరాన నేపాల్‌నుంచి దక్షిణాన కాంచీపురం వరకు విస్తరించిన మహాసామ్రాజ్యానికి చక్రవర్తి ఇతను.

భోజ మహారాజు:

మధ్య భారతదేశంలో మాల్వ ప్రాంతాన్ని ఏలిన మహారాజు భోజుడు. కాళిదాసాది మహాకవులు ఈయన ఆస్థానంలోని వారే. చిత్తోడ్‌నుంచి కొంకణ్ వరకు.. విదిశ నుంచి సాబర్మతి నది వరకు ఇతని రాజ్యం విస్తరించింది.

భోజ మహరాజు
భోజ మహరాజు సామ్రాజ్యం

మహేంద్రవర్మ:

పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన సింహవిష్ణు కొడుకు మహేంద్రవర్మ. ఇతను గొప్ప ఆర్కిటెక్ట్, పెయింటర్, స్వయంగా స్కాలర్. కంచి యూనివర్సిటీని స్థాపించినవాడు. మన చరిత్రకారులు ప్రాచీన విశ్వవిద్యాలయాలు అనగానే నలంద, తక్షశిల అని చెప్తారే కాశీ విశ్వవిద్యాలయాన్ని గురించి ప్రస్తావించరు. కంచి విశ్వవిద్యాయాన్ని గురించి మాట్లాడరు. ఎన్నో రాతి నిర్మాణాలను చేపట్టినవాడు. ఇవాళ మనం చూస్తున్న అద్భుత రాక్ కట్ నిర్మాణమైన మహాబలిపురం మహేంద్రవర్మ నిర్మించిందే. భారతదేశం అంటే తాజ్‌మహల్ ఒక్కటే కాదు. అనడానికి ఇంకో ఉదాహరణ ఇది.

పులకేశి 2:

చాళుక్య రాజుల్లో గొప్ప రాజుగా కీర్తి గడించినవాడు. దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని మొత్తం ఏలినవాడు. శాతవాహన రాజైన హర్షవర్ధనుణ్ణి ఓడించి రాజ్యాన్ని విస్తరించినవాడు. వ్యవసాయం, వృత్తి ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చినవాడు. ఎగ్జిమ్ విధానంతో వ్యాపారం చేసినవాడు.

పులకేశి 2

విక్రమార్కుడు:

భారతదేశంలో ఆదర్శ వంతుడైన చక్రవర్తులలో అగ్రగణ్యుడు విక్రమార్కుడు. ఉజ్జయిని రాజధానిగా దేశాన్ని పాలించాడు. 57 బీసీ నుంచి దేశంలో విక్రమార్క శకాన్ని ఈనాటికీ అనుసరిస్తున్నదంటే.. అతను ఎంత గొప్ప రాజు అయి ఉంటాడో ఊహించడం కష్టంకాదేమో. అశోకుడికి ఇచ్చిన ప్రాధాన్యంలో ఒకటోవంతు ప్రాధాన్యం కూడా ఈ చక్రవర్తికి దక్కలేదు. ఇతని తరువాత దేశాన్ని ఏలిన చాలామంది రాజులు.. ఒక విశేషణంగా విక్రమాదిత్య పేరును తమ పేరుకు తగిలించుకున్నారు. బృహత్కథ, బృహత్కథా మంజరి, కాశ్మీర రాజతరంగిణి, సింహాసన ద్వాత్రింశిక వంటి అనేక గ్రంథాలు విక్రమార్క చక్రవర్తి గురించి విశేషంగా వ్యాఖ్యానించాయి. ఇంత గొప్ప చక్రవర్తిని భారతదేశం ఎందుకు విస్మరించాల్సి వచ్చిందో తెలియదు.

విక్రమాదిత్య సామ్రాజ్యం

శాలివాహనుడు:

మహారాష్ట్ర లోని నేటి పైఠాన్.. నాటి ప్రతిష్ఠానపురం రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు.

శాలివాహనుడు

యావత్ దక్షిణాపథాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి. దేశంలో పరిపాలనా సంస్కరణలకు ఆద్యుడు. ఇతనిపేరుమీద శాలివాహన శకం మనం ఇవాళ్టికీ పాటిస్తున్నదే.

గణపతిదేవుడు:

కాకతీయ మహాసామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడైన చక్రవర్తి. తంజావూరు దాకా రాజ్యాన్ని విస్తరించినవాడు. దాదాపు 62 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన సమ్రాట్టు. ప్రజాపాలనకు, సాంస్కృతిక నిర్మాణానికి ఆదర్శ పురుషుడు గణపతి దేవుడు.

కాకతీయ సామ్రాజ్యం

శ్రీకృష్ణదేవరాయలు:

విజయనగర సామ్రాజ్యాధీశుడు. హంపి నగర నిర్మాత. విరూపాక్ష దేవాలయ నిర్మాణకర్త. రాయలు ఏలిన ప్రాంతం అంతా రతనాల సీమగా ప్రసిద్ధి చెందిందే. ఆయన కాలంలో అంగళ్లలో రతనాలు రాసులు పోసి అమ్మేవారు. పశ్చిమదేశాలతో విస్తృతంగా వ్యాపారం చేసి రాజ్యాన్ని సుసంపన్నం చేసినవాడు. సంక్షేమానికి, లౌకికవాదానికి పెద్దపీట వేసినవాడు. స్వయంగా వైష్ణవమతాన్ని పాటించినప్పటికీ, కాళహస్తిలో స్వామివారికి రాజగోపురం నిర్మించి ఇచ్చినవాడు. హంపిలో మసీదు నిర్మాణం చేసినవాడు.

శ్రీకృష్ణదేవరాయలు
విజయనగర సామ్రాజ్యం

ఖారవేలుడు:

మహాభారతంలో పేర్కొన్న చేది వంశానికి చెందిన రాజు ఇతడు. కళింగ రాజుల్లో అత్యంత ప్రముఖుడైన చక్రవర్తి. హథిగుంఫా శాసనం (ఏనుగు గుహ) ఇతని కీర్తిని గురించి పేర్కొన్నది. మౌర్యసామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి కళింగరాజు. అశోకుడి అవసానదశలోనే కళింగానికి రాజై.. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి ఒకవిధంగా మౌర్యసామ్రాజ్య పతనానికి కారణమైనవాడు. అశోకుడు కళింగులపై జరిపిన మారణకాండకు ప్రతీకారం తీర్చుకుని, తన జనదేవతల విగ్రహాలను తిరిగి కళింగం చేర్చినవాడు. తూర్పు భారతంలో అత్యంత సమర్థుడైన రాజుగా కీర్తి గడించినవాడు. పౌర జానపదులకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి ఉన్నత పదవులు కూడా కల్పించినవాడు. రాజధానితోపాటు.. రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రాణాధారమైన నీటి వసతిని కల్పించి వ్యవసాయాన్ని సుసంపన్నం చేశాడు. 164 జైన మత గ్రంథాలను పునరుద్ధరించాడు. ఇతని రాజ్యంలో జనాభా 35 లక్షలు.

మిహిరకులుడు:

గాంధారం, కశ్మీర్ ప్రాంతాలను ఏలిన హూణ వంశరాజు. మొదట్లో బౌద్ధ ధర్మాన్ని పాటించినా.. ఇతనికీ.. అత్యంత క్రూరుడు, నియంత అన్న పేరు ఉన్నది. ఇతని తండ్రి తోరమాణుడు. మిహిరకులుడు అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగి పెద్ద ఎత్తున పొరుగురాజ్యాలపై దాడులుచేసి ఆక్రమించుకొన్నవాడు. కశ్మీరునుంచి శ్రీలంక వరకూ జైత్రయాత్ర చేసినవాడు. చివరిదశలో బౌద్ధారామాలను ధ్వంసం చేశాడని కూడా చెప్తారు.

లలితాదిత్యుడు:

ఇతనికి మరోపేరు ముక్తపాదుడు. కాశ్మీర రాజుల్లో ప్రముఖుడైన చక్రవర్తి. మధ్య భారతానికి చెందిన యశోవర్మను ఓడించి రాజ్యాన్ని విస్తరించినవాడు. కర్కోట వంశానికి చెందిన ఈ రాజు గురించి కల్హణుడు తన రాజతరంగిణిలో విస్తృతంగా ప్రస్తావించాడు. ఇతను ప్రపంచాన్ని జయించాడని కల్హణుడు చెప్పాడు. లలితాదిత్యుడు అసాధారణ శక్తులు కలిగిన వాడని.. మధ్య ఆసియాలో అనేక ప్రాంతాలను ఇతను పరిపాలించాడని పేర్కొన్నాడు. భారతదేశంపై దండెత్తిన తురుష్కసేనలను తరిమికొట్టినవాడు. కాశ్మీర్‌లో ఇవాళ మనకు కనిపిస్తున్న మార్తాండ సూర్య దేవాలయం లలితాదిత్యుడు నిర్మించిందే. దాదాపు 36 సంవత్సరాలు ఆయన రాజ్యం కొనసాగింది. ఇతని గురించి మరింత వివరంగా నీలమత పురాణం, కశ్మీర రాజతరంగిణి (కస్తూరి మురళీకృష్ణ) లలో చర్చించడం జరిగింది.

బప్పారావల్:

భారతదేశానికి చెందిన కచ్చితంగా చెప్పుకోవాల్సిన చక్రవర్తులలో బప్పారావల్ ఒకరు. రాజస్థాన్‌లోని మేవాడ్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. గుహ్లియా వంశానికి చెందిన బప్పా రావల్.. నాగాదిత్యుడి కుమారుడు. నాగులకు ఇతనికి ఏదైనా సంబంధం ఉన్నదేమో తెలియాలి. బప్పా అంటే.. బాపు అని అర్థం. మనం మహాత్మాగాంధీని పిలుస్తామే.. అలా అన్నమాట. భారతదేశ రాజుల్లో బాపు అని ప్రజలచేత పిలిపించుకొన్న మహారాజు బప్పా రావల్. మహమ్మద్ ఖాసింను ఓడించినవాడు. అరబ్బులను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. ఇతనికి కాలభోజాదిత్యుడనే మరో పేరు కూడా ఉన్నది. అతను పాలించింది చాలా తక్కువ ఏండ్లు. 39వ ఏట సన్యాసం స్వీకరించి రాజ్యాన్ని త్యజించి వెళ్లిపోయాడు.

దిద్దాదేవి:

కాశ్మీర రాజ చరిత్రల్లో పేర్కొన్న మహారాణుల్లో ఒకరు. కాశ్మీర ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాణుల్లో దిద్దాదేవి ఒకరు. యుద్ధనైపుణ్యాల్లో ఆరితేరిన యోధ. వారియర్ క్వీన్‌గా ఈమె పేరు ప్రసిద్ధి చెందింది. రాజనీతిలో కూడా ఈమెకు సాటిరాగల రాజులు కనిపించరు. రణతంత్రాన్ని మించిన రాజతంత్రంతో రాజ్యాలను హస్తగతం చేసుకొన్న నేర్పరి.

ఇలా ఒక్కొక్కరి గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటూ పోతేనే.. ఇంత పెద్ద వ్యాసమైంది. ఇంకా మహారానులగురించి చర్చిస్తే… ఒక్కొక్కరి గురించి విస్తారంగా చర్చిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ విధంగా ఎంతోమంది రాజులు మనకు ఈ దేశ చరిత్రలో కనిపిస్తారు. ప్రజలకు సుపరిపాలనను అందించినవారు. ప్రజలచేత దేవుళ్లుగా కొలువబడ్డ రాజులు ఎందరో ఈ దేశంలో ఉన్నారు. కానీ.. మన చరిత్రకారులు మాత్రం.. మహామారణ కాండ చేసి.. కొలీజియంలు నిర్మించిన వాడిని నెత్తినెత్తుకొని.. వాడి రాజ చిహ్నాలను ప్రస్తుత చిహ్నాలుగా చేసుకొని.. గొప్పతనం అంటే ఇదేనని ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం. ఇది మన దురదృష్టం కాకపోతే మరేమిటి? 

Exit mobile version