[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘రామ్మూర్తి సంగతులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
మోర్నింగ్ వాక్ కానిచ్చేసి ఇంటి ముఖం పట్టాను.
రామ్మూర్తి ఈ రోజు రాలేదు. ఏమై ఉంటుందో..
మా ఇద్దరికి పార్కులోనే పరిచయం ఐంది. ఇద్దరం ఉద్యోగ విరమణ చేసిన వాళ్లమే.
ఇంటికి వచ్చాను. రిప్రెష్ అయ్యాను.
అనసూయ అందించిన కాఫీ గ్లాస్ అందుకున్నాను. హాలులో సోఫాలో కూర్చున్నాను. టీపాయ్ మీది పేపర్ తీసుకున్నాను.
న్యూస్ చదువుతూ.. కాఫీ చప్పరిస్తున్నాను.
కొన్ని నిముషాల్లో అనసూయ వచ్చింది.
“ఏమండీ బంగాళ దుంపలు కావాలి.” చెప్పింది.
“సరి సరే.” అనేసాను. అనసూయ వెళ్లింది.
కాఫీ ఐయ్యేక.. పేపరు మడిచి టీపాయ్ మీద పడేసాను. ఖాళీ గ్లాస్‌ని షింక్ లోన పెట్టేసాను.
“తలుపు వేసుకో.” చిన్నగా అరిచాను.
చెప్పులు తొడిగి.. వీథి గుమ్మం దాటేనో లేదో..
“పావు కేజీ చాలు.” చెప్పి.. అనసూయ జర్రున తలుపు మూసేసింది.
హు.. ఉద్యోగ విరమణ పిదప.. ఖాళీ దొరుకుతోందని ఆశించాను. అబ్బే.. అనసూయ వాటికనీ వీటికనీ తిప్పుకు కుదేస్తోంది.
నేను ఉద్యోగంకై పోయిన రోజుల్లో ఈ పనులన్నీ ఎలా నెట్టిందో.. అదే ఓ మారు అడిగితే.. ‘ఏం చేస్తానూ.. ఈసురోమను తిరిగే దాన్ని. ఇంటి చాకిరీ బయటి చాకిరీలతో చచ్చి చెడ్డాను.’ రుసరుసలు కక్కింది.
మాకు సంతానం లేదు. ఉద్యోగ రీత్యా ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరిగి చివరికి ఇల్లు ఒకటి కొనుక్కొని ఇక్కడ స్థిరపడ్డాం. ఈ ఊరిలో దగ్గర వాళ్లు ఆడా ఈడా ఉన్నారు. అవసరంకి అగుపిస్తారని నమ్మకం. మా తల్లిదండ్రులు ఎప్పుడో కాలం చేసేసారు.
వీథి చివరి పచారి కొట్టులో బంగాళ దుంపలు కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చాను.
“స్నానం చేసి వస్తే కాస్తా వంట సాయం చేద్దురు.” చెప్పింది అనసూయ సర్రున.
నేను మారు మాట అనలేదు. ఇది వరకు అనే.. చీవాట్లు పడ్డాను.
పైగా.. ‘ఇప్పుడు మీకు పనేముంది. లేవడం.. పార్కు గట్టున తిరుక్కొను రావడం.. కాఫీ టిఫిన్లు కాగానే లైబ్రరీ కంటూ పోవడం.. రావడం.. తినేసి పక్కెక్కేయడం.. టీ తాగి మళ్లీ తిరుక్కొను రావడం. తినేసి బబ్బోడం. అంతేగా. ఇక వేళలకి అమర్చడం నా వల్ల కాదు.. ఇంటి పట్టున ఉండి.. అదని ఇదని సాయం చేయాలి. ఆఁ.’ కట్టడి అస్త్రము వదిలి పెట్టేసింది.
ఇకేం చేస్తాను.. అనసూయ చుట్టూ తిరగడం తప్ప.
నిజానికి నాకు అనసూయంటే తెగ ఇష్టం. పాపం అమాయకురాలే. నన్ను నమ్మే నా పంచన తచ్చాడుతోంది. లేదంటే.. మరొకతె ఐతే నా కొంప కొల్లయ్యేది.
మాకు పిల్లలు పుట్టక పోయే సరికి.. ఐన వాళ్లు.. కాని వాళ్లు.. అనసూయనే ఆడి పోసుకున్నారు.
అనసూయ మాత్రం గుక్కుమిక్కనక పడేది. బిక్కు బిక్కున నన్ను చూసేది. నేను మాత్రం తన కేసే వంతు కాసాను.
నాది త్యాగమూ కాదు.. అలా అని ప్రేమా కాదు..
‘వద్దండి. మనకు పిల్లలు పుట్టక పోడానికి లోపం మీదని చెప్పొద్దు. నన్ను అనుకోనీయండి. మీరు మాత్రం రొచ్చు కావద్దు.’ అనసూయ ‘ఒట్టు’ నన్ను కట్టి పడేసింది.
ఓపిక వదిలేస్తుండడంతో అనసూయ పనులకు సాయంకి చికాకవుతున్నాను కానీ.. అది తాత్కాలికమే. తన మాట చెల్లుబాటుకే మొగ్గుతాను.
మా మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాయి. పిదప పాత్రల శుభ్రపర్చుటలో సాయపడేసి.. నడుము వాల్చాను. అనసూయ కూడా.
సాయంకాలం టీలు తాగుతున్నాం. డోర్ బెల్ మోగింది.
తలుపు తీసేక.. రంగారావు లోనికి వచ్చాడు.
“టీలు అవుతున్నాయా.” అన్నాడు.. నన్ను దాటుకుంటూ సోఫాలోకి చేరిపోతూ.
నేను అతడి పక్కనే కూర్చున్నాను. రంగారావు నాకు మేనమామ వరస మనిషి,
అనసూయ అతడ్ని పలకరించేసి.. “టీ తెస్తాను.” చెప్పింది. వంట గది వైపు నడిచింది.. తన టీ గ్లాస్‌తో.
నేను టీ తాగుతున్నాను.
“ఏం రా. ఏం తేల్చుకున్నారు.” రంగారావు మళ్లీ కదిపాడు.
నేనేమీ అనలేదు.
“చెప్పేది మీ మంచికే. నువ్వు కూడబెట్టుకుంది మీ తర్వాత.. అన్యాక్రాంతం కాకూడదురా. చెప్పుతుంటే పెడ చెవిన పెడుతున్నారేంటి. మీ మంచికే చెప్పుతున్నా. నాకు ఒరిగేది.. పోయేది ఏంటంటా.” చెప్పాడు రంగారావు.
“ఆలోచిస్తున్నాం మామా.” ఏదో చెప్పాలన్నట్టు చెప్పాను.
“చాల్లేరా. ఇంకా ఎన్నాళ్లు ఆలోచిస్తారు. ఈ పాటికి ఓ కొలిక్కి తెచ్చేయాలి.” మళ్లీ చురచుర లాడుతున్నాడు రంగారావు.
అంతలోనే అనసూయ వచ్చింది. రంగారావుకి టీ గ్లాస్ అందించింది. మా ఎదురు సోఫా కుర్చీలో కూర్చుంది.
“ఏంటమ్మా మీ తీరు. చెప్తే ఆలకించుకోరా.” అనసూయని నిలదీస్తున్నాడు రంగారావు.
నేను కదిలాను.
అనసూయ నన్నే చూస్తూ.. “ఏమైంది.. ఏదీ..” తడబాటుతో అంటోంది.
అడ్డై.. “అదే.. మనం ఓ బిడ్డని పెంచుకోవడం గురించి..” కలగచేసుకున్నాను.
“ఆఁ. మీ కంటూ సరైన వాళ్లు ఎవరు ఉన్నారు. మీలో ఒకరు పోతే.. మరొకరు నాస్తి. ఆస్తి ఉండి ఏం లాభం. దీపం ఉండగానే సర్దుకోవడం మంచి లక్షణం. పిల్లల సంక్షేమ కేంద్రంలో అందుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకర్ని దత్తత తీసుకుంటే.. మీకు ముందు ముందు చేదోడు వాదోడు అవుతారంటే వినిపించుకోరేం. చొరవ చూపండి.” గబగబా మళ్లీ వల్లించాడు రంగారావు.
అనసూయ నన్నే చూస్తోంది.
నిజానికి రంగారావు ప్రతిపాదన గురించి మేము యోచిస్తూనే ఉన్నాం.. కానీ కొలిక్కి రాలేక పోతున్నాం.
“నాకు ఆ సంక్షేమ కేంద్ర ముఖ్య నిర్వాహకుడు స్నేహితుడు. మీకు చెప్పాను కూడా. అతనిని కలవడానికి తరుచు వెళ్తుంటాను. అక్కడి పిల్లల్ని చూస్తుంటాను. వాళ్లలో మంచి క్రమశిక్షణ నాకు అగుపిస్తోంది. పైగా మీ దత్తతకి ఎంపికలో నా స్నేహితుడు భరోసా తప్పక ఉంటోంది.” చెప్పుతున్నాడు రంగారావు.
ఈ మారు రంగారావు మరింత పట్టున ఉన్నట్టు అగుపిస్తోంది.
అడ్డై.. “సరే మామా. మరో మారు ఆలోచించుకోడానికి మాకు టైం ఇవ్వు.” చెప్పాను.
“సరే. ఇదే అఖరు మారు.” ఖండితంగా చెప్పేసాడు రంగారావు.
ఆ పిదప.. “మళ్లీ వారంలో కలుస్తాను.” చెప్పేసి.. ఖాళీ టీ గ్లాస్‌ని కింద పెట్టేసి.. వెళ్లిపోయాడు.
నేను తలుపు మూసేసి వచ్చాను. అనసూయ ముందు కూర్చున్నాను.
“వదిలేలా లేడు.” అన్నాను.
“మరే. ఒక పక్క ఆయన చెప్పేది ఆలకించ తగ్గదే. మరో పక్క చేరతీసుకుంటే ఎలా ఉంటుందో తేల కుంటుంది.” అనసూయ అంది.
“అదేగా మరి మన అవస్థ.” అన్నాను.
“ఈ వేడిలో ఏమీ తేల్చుకోలేం. రెండు మూడు రోజులు పోనీయండి.” అనసూయ చెప్పింది.
నేను తలాడించాను.
మర్నాడు కూడా మోర్నింగ్ వాక్‌కు రాలేదు రామ్మూర్తి.
‘ఏమైందబ్బా.’ అనుకున్నాను.
ఇంటికి తిరిగి వస్తూ.. దార్లోనే అతడి ఇల్లు ఉంది కనుక.. అతడి ఇంటి వైపు నడిచాను.
డోర్ బెల్ తర్వాత.. ఆ ఇంటి తలుపు తీయబడింది. ఎవరో.. ఒకావిడ.
“రామ్మూర్తి ఉన్నారా.” అడిగాను.
“మీరు..” ఆవిడ సంశయిస్తోంది.
నా పేరు చెప్పాను. రామ్మూర్తిని కలవడానికి వచ్చినట్టు కూడా చెప్పాను.
ఆవిడ లోనికి వెళ్లింది.
ఆ వెంబడే రామ్మూర్తి వచ్చాడు.
“రండి.. రండి.” ఆహ్వానించాడు.
నేను ఇంట్లోకి వెళ్లాను.
రామ్మూర్తి నన్ను ఒక గదిలోకి తోడ్చుకు పోయాడు.
నాకు కుర్చీ చూపాడు. తను మంచం అంచున కూర్చున్నాడు.
“రెండు రోజుల నుండి అగుపించడం లేదు. వంట్లో బాగుందా.” అడిగాను.
“ఆఁ. ఆఁ. బాగుంది.” పొడి పొడిగా అనేసాడు రామ్మూర్తి.
కానీ ఏదో కారణం ఉన్నట్టు నాకు తోస్తోంది.
మళ్లీ ప్రయత్నించాను. “ఏమైంది.” నెమ్మదిగా అడిగాను.
రామ్మూర్తి ఓ నిట్టూర్పు పిమ్మట.. “కుటుంబ సమస్య.” చెప్పాడు మెల్లిగా.
“అభ్యంతరం కాకపోతే చెప్పొచ్చు.” అన్నాను.
ఆ వెంబడే.. “ఒకరికి ఒకరి మాట తోడు కాగలదు. మంచిదేగా.” అన్నాను.
“అదే. మీకు చెప్పి లేనుగా.. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసేసాం. నేను నా భార్య ఇక్కడ ఉంటున్నాం. కొడుకు ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటున్నాడు. కూతురు భర్తతో మరో ఊరిలో ఉంటోంది.” రామ్మూర్తి చెప్పడం ఆపేసాడు.
నేను ఏమీ కలగ చేసుకోలేదు.
తిరిగి సర్దుకుంటూ.. “ఆ మధ్య పిల్లలు.. కోరి.. పోరి.. నేను కూడదీసిన ఆస్తిని పంచుకున్నారు. కొడుకు ఇల్లు కట్టుకుంటాడట.. కూతురు తన భర్త వ్యాపారంకి పెట్టుబడికట.” చెప్పాడు రామ్మూర్తి.
నేను రామ్మూర్తినే చూస్తుండగా.. తను తల దించుకున్నాడు.
“ఈ ఇల్లు కొడుకు వాటా కింద వచ్చింది. అవసరమైందంటూ ఇప్పుడు దీన్ని అమ్మకంకి పెట్టేసాడు.” రామ్మూర్తి గొంతు బొంగరవుతోంది.
“కూల్ రామ్మూర్తి.. కూల్.” అనగలిగాను.
“మేము ఏ పంచన ఇక ఉండాలి. ఆస్తి పంపకాల తర్వాత.. దీని నీడన.. నా పెన్షన్‌తో మేము ఏదోలా సర్దుకు సాగుతున్నాం. ఇప్పుడు ఎలా.” రామ్మూర్తి గింజుకుంటున్నాడు.
అయ్యో. రామ్మూర్తి..
కలగచేసుకున్నాను. “మరి. మీ కొడుకు ఇంటికి మీరు వెళ్లవచ్చుగా.” అన్నాను.
“లేదు. మేము ఆ పంచన ఉండలేం. కనికరించి ఆస్తి పంపకాలు చేసేసాం. నమ్మబలికి మొండి చేయి చూపాడు వాడు. మేమున్నంత వరకు ఈ ఇల్లు మా ఇద్దరిదే అన్నాడు.” బాగా అవస్థ పడుతున్నాడు రామ్మూర్తి.
“పోనీ.. అమ్మాయి..” అంటున్నాను.
“లేదు లేదు. ఆడపిల్ల ఇంటిన. ఛ.” విసుక్కున్నాడు రామ్మూర్తి.
నేను తగ్గిపోయాను.
“పెన్షన్ డబ్బులిచ్చి ఏదైనా ఆశ్రమంలో తల దాచుకుంటాం. ఆ పనుల్లో ఉన్నా. అందుకే పార్కు వైపు రావడం లేదు.” రామ్మూర్తి ఆందోళన తెలుస్తోంది.
నా మనసు అకస్మాత్తుగా ఊగిసలాటలో పడింది.
ఏమీ చేయాలో తేలక.. లేచిపోయాను. రామ్మూర్తి భుజం తట్టి.. “మళ్లీ కలుస్తాను. డీలా పడవద్దు.” చెప్పేసి.. అక్కడి నుండి ఇంటి వైపుకు కదలగలిగాను.
“ఆలస్యమైందేమిటి.” తలుపు తీసేక.. అడిగింది అనసూయ.
నేను ఏమీ చెప్పలేక.. ఇంట్లోకి నడిచాను.
కాఫీ గ్లాస్ అందిస్తూ.. “ఏమైంది. మీ వాలకం కంగారు పెడుతోంది.” అంది అనసూయ.
కాఫీ గ్లాస్ అందుకొని.. దానిని టీపాయ్ మీద పెట్టేసి..
“మనం ఎవర్నీ దత్తత తీసుకోవద్దు. మన తదనాంతరం ఈ ఆస్తి ఓ ఆశ్రమంకి చెందేలా ఏర్పాటు చేద్దాం. అలాగే మనలో ఒకరు పోతే మరొకర్ని ఆ ఆశ్రమం వారు చేర తీసుకునేలా ఏర్పాటు చేసుకుందాం.” చెప్పాను.
అనసూయ అయోమయం అవుతోంది.
తల విదిలించుకున్నాను. అనసూయను సోఫాలో నా పక్కన కూర్చుండ పెట్టుకున్నాను. రామ్మూర్తి సంగతులు చెప్పనారంభించాను..