Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల వెనుక

[మణి వడ్లమాని గారి ‘రంగుల వెనుక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

అక్కడ పరిస్థితి గందరగోళంగా, హడావుడిగా ఉంది. చౌకబారు పౌడర్ వాసన, పాత హార్మోనియం నుండి వచ్చే వింతైన శబ్దాలు కలిసి ఒక రకమైన విచిత్రమైన వాతావరణాన్ని కలుగజేస్తున్నాయి. రాజరాజ నరేంద్రుడి పాత్రను పోషిస్తున్న సత్యం గారు, చేతి అద్దం పట్టుకుని తన వేషాన్ని సరిచేసుకోవడంలో మునిగిపోయాడు.

“ఒరేయ్ అంజనేయులు! కాస్త ఆ హార్మొనీ శ్రుతి చేసుకోవడం ఆపి దీని సంగతి చూడరా అంటూ”, తన మీసం చూపించాడు.

“ఉండండి సత్యం గారు దీని గమ్ము ఎండిపోయింది, సరి చేసి ఇస్తాను”

“అది సరే చిత్రాంగి అదే సుమతి ఇంకా రాలేదేంటి? ఆ పిల్లకి టైమ్ సెన్స్ లేకపోతే ఎలాగయ్యా?” అని గర్జించారు.

“అన్నట్లు మర్చిపోయాను శంఖంలో సౌండ్ బాగా వస్తుందా, గట్టిగ పూరించు, దీనితో ఈ ఊరి వాళ్ళకి మన ప్రత్యేకత తెలియాలి” అన్నాడు గంభీరంగా. ఆ గొంతే ఆస్తి అతనికి.

“ఆ.. ఆ ఇదిగో చూడండి” అంటూ శంఖం ఊది మరీ చూపించాడు. ఆ సౌండ్‌కి దూరాన ఉన్న జనాలు కూడా వెనక్కి తిరిగి చూసారు.

“నాకు తెలుసు ఆంజనేయులు, శంఖం ఊదడం నీ వల్లే అవుతుంది” అంటూ మెచ్చుకున్నాడు.

అప్పుడే లోపలికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది సుమతి. మనసులో ఏదో ఆందోళన. పైకి కనిపించకుండా ముఖాన చిరునవ్వు పులుముకుంటూ.

సుమతిని భర్త వదిలేసి రెండేళ్ళయింది. అతను కూడా ఇంతకు ముందు నాటకాలు ఆడేవాడు. హీరో వేషాలు వేసేవాడు. పెళ్ళి కాకముందు అతనితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించింది.. తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

తర్వాత సుమతి జీవితం నరకంగా మారింది.. తాగుడికి అలవాటు పడ్డాడు. నాటకాల్లో నటించటం మానేశాడు. సుమతి సంపాందించిన డబ్బునంతా వృథాగా ఖర్చు చెయ్యటం మొదలుపెట్టాడు. కొన్నిరోజులు సహించింది ఆమె. తర్వాత ఎదురు తిరిగింది. ఫలితం ఆమెని వదిలేశాడు.

వాళ్ళ సంసారానికి ఫలితం ఒక కొడుకు. తల్లితో కలిసి ఉంటోంది. ఈ పదిహేను రోజులు వరుస ప్రోగ్రామ్స్ ఉన్నాయి.

“వచ్చానండీ బాబూ! ఏంటి ఆ అరుపులు? అయినా సత్యం గారూ, ఆ మీసం ఊడిపోతుందనే భయం ఎందుకండి? మీ గొంతు మైకులో వినిపిస్తేనే గొప్ప”.

“ఆ, అది సరే తొందరగా మేకప్ చేసుకో.”

“కొంచెం డబ్బులు పడేయండి, ఈ ప్రోగ్రామ్స్ కోసం చీరలు కొనుక్కంటాను అన్నాను, ఇచ్చారా? ఇదిగో ఈ చీర చూశారా? ఈ చీరే కడుతున్నాను పాతగా ఉంది. చిత్రాంగి అంటే రాణి కదండీ, దేనితో నేను దర్జాగా, గొప్పగా ఎలా కనిపిస్తాను?” అని గట్టిగా విసుక్కుంటూ అద్దం పట్టుకుని కూర్చుంది.

సత్యం మీసం తిప్పుతూ, “నీకు ఎప్పుడూ చీరల గోలే! అక్కడ చూడు, ఉండు మన సారంగధరుడు సూరిబాబు పద్యం ప్రాక్టీస్ చేసుకోకుండా బజ్జీల రాగం తీస్తున్నాడని విన్నాను, నాకు అందరూ భలేగా దొరికారు” అని తిరిగి చురక వేశాడు.

ఇంతలో ఎవరో ఆమెకు కాఫీ ఇచ్చారు. వేడిగా ఉంది కాఫీ. తాగింది. ఆమెకు కొంచెం హాయిగా ఉన్నట్లు అనిపించింది. వచ్చేటప్పటికి జ్వరంతో బాధపడుతూన్న కొడుకు, ముసలి తల్లి గుర్తుకు వచ్చారు. వెంటనే ఆమె మొహం నిండా విచారం అలుముకుంది. కానీ తప్పదు వృత్తి ధర్మం. నాటకాలే తన జీవనాధారం అనుకుంది.

అప్పుడే సారంగధరుడి వేషంలో ఉన్న సూరిబాబు నోట్లో ఒక ఉల్లిపాయ బజ్జీని కష్టంగా మింగుతూ లోపలికి వచ్చాడు. “అబ్బబ్బ.. ఈ ఊరిలో బజ్జీల రుచి చూస్తే రాగం దానంతట అదే వస్తుందండి! అయినా సుమతి గారు, ఇందాక మీరు అందరి పైన అరిచినట్టు స్టేజి మీద అరిస్తే, జనం నన్ను కాదమ్మా, మిమ్మల్ని అడవికి పంపేస్తారు జాగ్రత్త!”

“సరే సరే జనం కొంతసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి నాటకం మొదలుపెడితే బాగుంటుంది.” అన్నాడు సత్యం.

***

ఆంజనేయులు నాటకం మొదలయింది అన్నట్లు గట్టిగా శంఖం ఊదాడు.

తెర లేచింది. స్టేజి మీద లైట్ల వెలుగుల మధ్య సత్యం నిజంగానే రాజరాజనరేంద్ర చక్రవర్తిలా మెరిసిపోతున్నారు.

చిత్రాంగి తన కళ్ళతోనే శృంగారాన్ని, కోపాన్ని కురిపిస్తుంటే, జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.

నాటకం చివరి సన్నివేశానికి వచ్చింది. సారంగధరుడి కాళ్లు చేతులు నరకమని రాజు ఆజ్ఞాపించే సీన్. సత్యం గారు ఆవేశంతో ఊగిపోతుంటే, ముందు వరుసలో కూర్చున్న ఒక వృద్ధురాలు, అది నాటకం అని మర్చిపోయి స్టేజీ మీదకి పరుగెత్తుకొచ్చేసింది. “వద్దు బాబోయ్.. వద్దు! ఆ పిల్లాడు ఏం పాపం చేశాడు? ఆ చిత్రాంగి మాటలు నమ్మకండి రాజుగారు! అదో మోసకత్తె” అని ఆమె ఏడుస్తుంటే, కొద్దిక్షణాలు అందరూ విస్తుబోయారు. అది చూసిన సత్యం తన ‘రాజు’ గంభీరాన్ని పక్కన పెట్టి, కిందకు వంగి ఆ ముసలావిడ చేతులు పట్టుకుని, “అమ్మమ్మా.. ఇది నాటకమే తల్లి, నిజం కాదు. ఆ పిల్లవాడు క్షేమంగానే ఉంటాడు, వెళ్లి కూర్చో” అని బుజ్జగించి పంపాడు. ఆ క్షణంలో జనం కొట్టిన చప్పట్లు నది ఆవలి గట్టు దాకా వినిపించాయి.

ప్రదర్శన ముగిసింది. అర్థరాత్రి దాటాక ముఖాలకి రంగులు తీసేసారు. ఇప్పుడు అసలు బతుకులు మొదలయ్యాయి.

***

సత్యం మొహనికి ఉన్న రంగులు తుడుచుకుంటుంటే, సూరిబాబు నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. “సత్యం గారూ.. ఇంటికాడ నుంచి మనిషి వచ్చాడు. మా అమ్మకి ఒంట్లో బాలేదట. డబ్బులు ఇప్పిస్తే అతని చేత మందులు కొని పంపిస్తాను” అన్నాడు దీనంగా.

సత్యం సూరిబాబు చేతిలో కొంత డబ్బు పెట్టాడు.

అప్పటిదాకా సూరిబాబుని ఆటపట్టిస్తున్న సుమతి ఒక్కసారిగా మౌనమైపోయింది. తన పర్సులోంచి మూడువందలు తీసి సూరిబాబు చేతిలో పెట్టింది. “ఇదిగో సూరిబాబు, ఇవి ఉంచుకో, అమ్మకి మందులు కొని పంపించు. తరువాత చూసుకుందాంలే” అంది.

“సుమతీ నీ మేము మర్చిపోను” అంటూ చేతులు పట్టుకున్నాడు.

“సర్లే, మనలో మనం ఆ మాత్రం సాయం చేసికోపోతే ఎలా” అభిమానంగా అంది.

***

తెల్లవారుజామున మూడు గంటలు. రైల్వే స్టేషన్‌కి వెళ్తున్న ఆటో రిక్షాలో ఆ ముగ్గురు కూర్చున్నారు. కిరీటాలు, గిల్టు నగలు, రంగుల పెట్టెలు అన్నీ ఒక మూలన సర్దేసి ఉన్నాయి. గట్టు మీద నుంచి రిక్షా వెళ్తుంటే, ఓ పక్కగా నది వేగంగా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తోంది.

అప్పుడే పుష్కర స్నానాలు మొదలెట్టేసారు, రేవులన్నీ దీపకాంతులతో వెలిగిపోతున్నాయి.

సత్యం గారు నది వైపు చూస్తూ గొంతు సవరించుకున్నారు. “మనం వస్తాం, వేషాలు వేస్తాము. నాటకం ముగుస్తుంది. పాత్రలు వేసిన వాళ్ళు ఎవరి దారిన వాళ్ళువెళ్ళిపోతారు. మనం ఎంతటి గొప్ప పాత్రలు పోషించినా, ఎంతటి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినా.. శాశ్వతం కాదు: ‘వచ్చాం, నటించాం, వెళ్ళిపోయాం..’ అనుకుంటాం.. కానీ మనం పండించిన పాత్ర పోషణ మటుకు మాత్రం జనాల గుండెల్లో ఉండిపోతుంది.”

సుమతి, సూరిబాబు కూడా తలలు తిప్పి నది వంక చూశారు. గోదారమ్మ పైన నుంచి వచ్చే ఆ తెల్లవారుజాము గాలి వాళ్ళ మనసుల్లో ఏదో తెలియని శాంతి నింపుతోంది.

ఆ ముగ్గురి ఆలోచనలని తనలో కలిపేసుకుంటూ ఆ ప్రవాహం సాగిపోతోంది.

***

రిక్షా స్టేషన్ చేరుకుంది. సత్యం గారు జేబు లో సిగెరెట్టు కోసం వెతుకుతూ ఉండగా, చేతికి ఒక కాగితం తగిలింది. అది ఆయనకి రావలసిన డబ్బులు తాలూకు.

దాని వెనుక ఆయన పెన్సిల్‌తో ఒక చిన్న లెక్క రాసుకున్నారు: “చీర అద్దె – 50 రూపాయలు, మీసం గమ్ము – 10 రూపాయలు, టిక్కెట్లు. అద్దె – 1000 రూపాయలు.. సూరిబాబు కిచ్చింది..” ఇలా చాలా లిస్టు.

నిన్నటిదాకా సామ్రాజ్యాలను శాసించిన చక్రవర్తి, ఇప్పుడు పది రూపాయల గమ్ము కోసం, పాత చీర అద్దె కోసం లెక్కలు చూసుకుంటున్నాడు.

ఆనాటి ప్రదర్శన అయిపొయింది. ఒక్క నిమిషం క్రితం వరకు వేలాది మంది ముందు ‘మహారాజా’ అని పిలిపించుకున్న ఈ గొంతు, ఇప్పుడు కనీసం తనని తాను పలకరించుకోవడానికి కూడా వణుకుతోంది. ‘ఎంత విచిత్రం! ఆ కిరీటం తల మీద ఉన్నంత సేపు నేను ఈ లోకానికే చక్రవర్తిని అని నమ్మాను. కానీ దాన్ని తీసి ఆ మూలన పడేయగానే.. నేను మళ్ళీ సామాన్య ‘సత్యం’ అయిపోయాను.

రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోయాడు.. కేవలం సత్యం మిగిలాడు. ఇదే అసలు జీవితం’ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు

***

స్టేషన్‌లో రైలు కూత వినిపించింది. సత్యం ప్లాట్‌ఫారంపై నడుస్తూ సుమతితో అన్నాడు, “రేపు నాటకంలో ఆ పాత చీర వద్దులే సుమతీ, కొత్తది తీసుకుందాం. చక్రవర్తి భార్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా!” అని నవ్వాడు.

అప్పుడు అక్కడ ఆయన చక్రవర్తి కాదు, కేవలం ఒక నటుడు. కానీ ఆ ‘కొత్త చీర’ వాగ్దానంలో ఒక చక్రవర్తికి ఉండాల్సిన ఉదారత ఉంది. జీవితం వాళ్ళని సామాన్యులుగా మార్చినా, వాళ్ళు మాత్రం జీవితాన్ని ఒక నాటకంలాగే గౌరవిస్తూ ముందుకు సాగిపోయారు.

తెర ముందు మాత్రమే వాళ్ళు రాజాధిరాజులు.

వాళ్ళు తమ నటనతో ఆ ఊరి చరిత్రను బతికించారు, తెర వెనుక వాళ్ళ మధ్య ఎన్నోచిత్రమైన సంకీర్ణభావాలతో, ఈసులు, అక్కసు, కోపాలతో, కూడిన అభిమానాలతో, వాళ్ళు ఉన్నవాళ్లు ఉన్నట్టుగానే ఉంటారు.

అయినా వాళ్ళు.. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకునే సామాన్య మనుషులు.

అదంతా నిశబ్దంగా గమనించే ఊరు, గంభీరంగా సాగిపోయే గోదారమ్మలే సాక్ష్యం.

Exit mobile version