[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
నీలం సంజీవరెడ్డోళ్ల ఇల్లూరు చావిట్లో నెల దినాలు!
ఉదయమే నేను చావిట్లో నుంచి బయటికొచ్చి బండమీద బొగ్గూ ఉప్పూ వొగ గుండ్రని రాతితో దంచి పొడిచేసి, ఆ పొడితో పండ్లు తోముకొని ముఖం కడుక్కుంటా వుండాను. అంతలోనే పక్కింట్లో నుంచి నా వయసుండే వొగ మనిషి బయటకొచ్చి నా వైపు చూసి ఆశ్చర్యపోతా, నమ్మకం కలగలేదేమో, అట్లే చూస్తానే వుండాడు. నేనైతే ఆ మనిషిని వెంటనే గుర్తించి, సిగ్గుతో తల వొంచుకొని ముఖం తుడుచుకోసాగినాను. కొంతసేపటికి నన్ను గుర్తుపట్టినాడేమో, “నువ్వు నారాయణ కదా” అని అడిగినాడు. అవునన్నట్లు నేను తలూపినాను.
“ఏం నారాయణా, ఏమిటిట్లా? అసలు నిన్ను చూస్తానే నమ్మలేకపోయినాను. ఇంతకూ నువ్వు బండమీదపల్లి నారాయణ వేనా? ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్స్‌లో నా పక్కనుండే బెంచీలో కూర్చొని పరీక్ష రాసిన నారాయణవేనా?” అని ఆశ్చర్యపోతా అడిగినాడు.
“ఔను పెద్దిరెడ్డీ! నేనే, బండమీదపల్లి నారాయణనే!” అని, లో స్వరంతో మెల్లగా చెప్పినాను. “అవునా? మరి యేమిటిట్ల? ఇక్కడికెందుకొచ్చినావు? వీళ్లెవురు?” అంతే ఆశ్చర్యంతో మళ్లా అడిగినాడు. నేను ఉన్న విషయమంతా చెప్పుతా వుంటే అవమానంతో నా కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. ‘అయ్యయ్యో’ అని దగ్గరికొచ్చి నా చేయి పట్టుకొని ఇంట్లోకి పిలుచుకొని పోయినాడు పెద్దిరెడ్డి. వాళ్లమ్మ కావొచ్చునేమో, కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతా, “సారీ నారాయణా! నిన్ను ఈ విధంగా చూస్తానని అనుకోలేదు” అని అన్న్యాడు పెద్దిరెడ్డి.
“ఏమి చేస్తాం, మా పరిస్థితి అట్లుంది! ఇట్ల రాక తప్పలేదు పెద్దిరెడ్డీ!” అని బాధపడతా చెప్పినాను. అతడూ కొంచెంసేపు మౌనంగానే ‘ప్చ్ ప్చ్’ అనుకుంటూ బాధపడినాడు. చివరికి నాకు ధైర్యం చెబుతా, “ఏదైనా అవసరమైతే బిడియపడకుండా అడుగు నారాయణా!” అని నా వెంట బయటికి వొచ్చినాడు. సరే పెద్దిరెడ్డీ, మళ్లా కలుస్తానులే అని నేను చావిట్లోకి పోయినాను.
ఇల్లూరి మాగాణిలో మడి కోతలూ కల్లాలూ ప్రారంభమైనాయని తెలిసింది. రేపటి నుంచి తినుబండారాల గంపెత్తుకొని కల్లాల దగ్గరికి పోవల్లనుకుండాం. రెండు దినాల వరకు రెండు మూడు రకాల తినుబండారాలు తక్కువ తక్కువ చేసుకొని పోయేది మేలనుకుండాం. నేను పొద్దున్నే అన్నం తిని, కావలసిన సరుకులు తీసుకొని రావడానికి కల్లూరికి పోయినాను. అనంతపురం-కర్నూలు రోడ్లో నాలుగు రోడ్ల సెంటర్లో నిల్చుకొని, కల్లూరును గమనించినాను. ఆ సెంటర్లో తూర్పు వైపు పోయే రోడ్డు, నేనొచ్చిన రోడ్డే! అది ఇల్లూరు మీద తరిమెలకు పోతాదంట! ఆ రోడ్డుకే, ఇల్లూరులో నీలం సంజీవరెడ్డి, తరిమెలలో కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి వుండడం వల్లనేమో, తార్రోడ్డు వేసినారు.
సెంటర్లో నుంచి పడమటి వైపుకు ముంటిమడుగు, కొత్తపల్లి ఇంకా నాలుగైదు పల్లెలకు పోయే రోడ్డు మట్టిరోడ్డే! ఊరికి పడమర పక్కన కల్లూరు రైల్వే స్టేషన్ ఉందంట!
ఇల్లూరులో వున్నంగనే వొగసారి కల్లూరు రైల్వే స్టేషన్ చూడల్లని అనుకుంటా శనక్కాయల ఆయిల్ మిల్ వైపు చూడసాగినాను. కల్లూరు రాధాకృష్ణయ్య ఆయిల్ మిల్ అని రాసిన బోర్డు, తూర్పు కాంపౌండ్ గోడమీద కనిపిస్తా ఉంది. ఆయిల్ మిల్లు మంచి సెంటర్లో, తూర్పు-ఉత్తరం కార్నర్లో ఉంది. మిల్లు గేట్లు అనంతపురం రోడ్డు వైపు తూర్పు దిక్కుకు కాకుండా ముంటిమడుగు రోడ్డు వైపు ఉత్తరం దిక్కుకు ఎంతో ఆలోచన చేసి పెట్టినట్లుంది.అది చాలా పెద్ద మిల్లు. అనంతపురంలో గుడకా అంత పెద్ద ఆయిల్ మిల్లు లేదంట! అందులో డాల్డా గుడకా తయారు చేస్తారంట! అందులో పని చేసే వాళ్లు మూడు షిఫ్టుల్లో పని చేస్తారంట! ప్రతి ఎనిమిది గంటలకూ షిఫ్ట్ మారుతాదంట! ఒక షిఫ్ట్‌లో డెబ్బై ఎనభై మంది పని చేస్తారంట! ఎనిమిది గంటలు పని చేస్తే వొక్కొక్కరికి రెండున్నర రూపాయలు కూలి ఇస్తారంట!
అంతా తెలుసుకొని ఆలోచన చేస్తా చిన్నాయన చెప్పిన సరుకులన్నీ తీసుకొని, ఇల్లూరుకు బయలుదేరినాను. రోడ్డు మీద నడుస్తా ఉంటే మనసులో కొత్త ఆలోచన మెదిలింది. రాత్రి ఎనిమిది గంటల షిఫ్టులో పనిచేస్తే లక్షణంగా రెండన్నర రూపాయలు వొస్తాదే! రాత్రికి చిన్నాయనతో మాట్లాడల్ల అనుకుంటా నడుస్తా ఉండాను.
కల్లూరు ఎంత అద్భుతమైన సెంటర్! రాధాకృష్ణయ్యోళ్ల ఆయిల్ మిల్లే కాకుండా ఇంకా మూడు మిల్లులు కల్లూరులో ఉండాయంట! అట్లాంటి కల్లూరులో హై స్కూల్ లేదంట! ఎక్కడో లోపల ఉండే తరిమెలలో హైస్కూల్ ఉందంట! ఇల్లూరు తరిమెల రెడ్లు చాలా పెద్దోళ్ళు కదా, నీలం సంజీవరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాడు కదా, ఆయన అనుకోనుంటే, కల్లూరులో వొక హైస్కూల్ ఏర్పాటు చేసి ఉంటే, ఇక్కడుండే ఆయిల్ మిల్స్‌లో పనిచేసే వాళ్ల పిల్లోళ్ళు బాగా చదువుకోవచ్చు కదా! ఏమిటో ఈ పెద్దోళ్ళు? అనుకుంటా పయిటాల లోపల ఇల్లూరుకొచ్చినాను. సాయంత్రం లోపల వొక మోపెడు పొయ్యిలో పుల్లలు ఏరుకొని వొచ్చినాను.
మొదటిరోజు పూర్ణ కుడుములూ అనప గుగ్గిళ్లూ చేసుకోవల్లనుకుండాం. చావిడి బయట రెండు పొయ్యిలు ఏర్పాటు చేసినాను. ఎవురో వొచ్చి మమ్మల్ని అక్కడ నుంచి వెళ్లిపోండి అని గొడవ చేసినారు. నేను పెద్దిరెడ్డోళ్ల ఇంట్లోకి పోయి ఆ విషయం చెప్పినాను. పెద్దిరెడ్డీ, వాళ్ళ నాయన నారాయణరెడ్డీ బయటికొచ్చి, వీళ్ళు మా వాళ్లే, కల్లాలు అయిపోయే వరకు ఉంటారని దబాయించి చెప్పడంతో గొడవ చేసినోళ్లు నోరు మూసుకొని వెళ్ళిపోయినారు. నారాయణరెడ్డి పెద్దయ్య ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ అని తెలిసి నాకు భలే సంతోషం అయింది .
ఆ కొత్త ఊర్లో నారాయణరెడ్డి వాళ్ళ అండ దొరకడంతో చిన్నాయనకు ధైర్యం వొచ్చింది. నాకు దిగులు తీరిపోయింది. రాత్రి అన్నం తిన్నెంక కొంచెం సేపు ముగ్గురమూ మాట్లాడుకుండాం. నేను కల్లూరు రాధాకృష్ణయ్య వాళ్ళ ఆయిల్ మిల్ విషయం చెప్పి “రాత్రి ఎనిమిది గంటల షిఫ్టులో పని చేసేకి పోతాను చిన్నాయనా! అయితే, ఆ కూలి డబ్బులన్నీ నాకే!ఆ దుడ్లతో నేను రెండు ట్రౌజర్లు, రెండు శ్లాగులు కుట్టించుకుంటాను. అట్లే కల్లాల దగ్గరికి పోయినప్పుడు రైతులను అడిగి వరిగడ్డి కట్టలు ఇన్నూరో మున్నూరో జమ చేసుకుంటాను. మనం ఈట్నుంచి అనంతపురానికి, జమ చేసిన వడ్లమూటలు వేసుకొని పోయేటప్పుడు, అట్లే వరిగడ్డి గుడకా బండిలో వేసుకొని పోయి అనంతపురంలో అమ్ముకుంటాను. ఆ దుడ్లతో వొగ జత చెప్పులు తీసుకుంటాను చిన్నాయనా!” అని మెల్లగా అడిగినాను.
“ఆలోశెన అయితే బాగనే ఉందప్పా, కానీ కల్లాల దగ్గిరికి గంపెత్తుకొని పోయి ఈటికొచ్చేదెప్పుడు? మల్లా కల్లూరికి పొయ్యేదెప్పుడు? నిద్రబొయ్యేదెప్పుడు?” అంటా చిన్నాయన అడ్డ ప్రశ్నలు వేసినాడు.
“మిల్లులో రాత్రి ఎనిమిది గంటల షిఫ్ట్ తెల్లవారుజామున నాలుగు గంటలకే అయిపోతాదంట! అప్పుడొచ్చి రోంతసేపు పండుకుంటాన్లే చిన్నాయనా! గంపెత్తుకొని కల్లాలకు పొయ్యేది పొద్దున పది గంటల తర్వాతనే కదా! నీళ్లూ, పోయిలో కట్టెలూ అట్లాంటివన్నీ నేను చూసుకుంటాన్లే! ఈడ మనం వొగ ఇరవై దినాలుంటామా చిన్నాయనా? ఈ పొద్దు మే నెల మూడో తేదీ. ముప్పయ్యవ తేదీ కల్లా మనం ఊరికి వెళ్ళిపోతాం కదా! ఎందుకంటే మా హెడ్మాస్టర్ సార్, ఎస్ఎస్ఎల్సీ రిజల్ట్స్ వొచ్చేటప్పటికి తప్పకుండా నువ్వు ఊర్లో ఉండల్లరా అని చెప్పినాడు చిన్నాయనా! అందుకే.” అని నేను కల్లూరు మిల్లు పనికి పోయేకీ, 30వ తేదీ లోపల ఊరికి వెళ్ళిపోయేకీ చిన్నాయనను వొప్పించినాను.
పొద్దున పది గంటలకల్లా అన్నం తిని రెండు రకాల వడలూ పూర్ణం కుడుములూ గంపలో పెట్టుకుని నేనూ జేజీ ఇల్లూరు మాగాణిలోకి బయలుదేరినాం. వరిమళ్లు కోసే వాళ్లు కోస్తా ఉంటే, కల్లాలు చేసే వాళ్లు చేస్తా ఉంటే, మాగాణి నిండా జనం కనిపిస్తా ఉండారు. ఊరికి ఉత్తరం వైపున సుమారుగ వొగ మైలు దూరం వరకు వరిమళ్లే! మళ్ల తర్వాత పెన్నేటిలోని ఇసుకదిబ్బలు కనిపిస్తా ఉండాయి. ఏటి వారగా, ఈశాన్యం దిక్కులో ఎవురివో మామిడి తోటలుండాయి. కాలువ పొర్ర గెనుం మీద నడుస్తా వొగ దిన్నె మీదుండే కల్లం కాటికి పోయినాం నేనూ జేజీ. అది పెద్ద కల్లం. వడ్లన్నీ మూటలకెత్తుతా ఉండారు. కల్లంలో వొగ మూల వరిగడ్డి మీద కూర్చొనుండే వొగ పెద్దాయన మమ్మల్ని పలకరించినాడు. మా నాయన మాదిరే,సైను బట్టతో కుట్టించుకోనుండే చేతుల బనియన్ తొడుక్కొని, గోసిపంచ ఎగజెక్కి కట్టుకుండాడు. ఎండకు తలకాయ మాడిపోకుండా వొగ టర్కీటువ్వాల చుట్టుకోనుండాడు.ఆ టువ్వాలను చూసి ఆ పెద్దాయన, కల్లం షావుకారేమో అనుకుంటా దగ్గరకు పోయి నమస్కారం చేసినాను. ఆ పెద్దయ్య సంతోషపడతా, చదువుకుంటా ఉండావా పాపోడా అని ప్రేమగా పలకరించినాడు. నేను దాచుకోకుండా అంతా చెప్పినాను.
“అవునా నాయినా? ఎంత కట్టమొచ్చింది రా? నేను నిన్న సందకాడ, చూసినాను. ఆ సావిటి కాడ కూచ్చోనుండే ఆ కుంటతను మీ చిన్నాయనా? ఈ పెద్దాయమ్మ మీ జేజినా? మంచి టయానికి వొచ్చినార్లే! కల్లాలకాడ తినేటివి అంటే మా ఊరోళ్లకు భలే ఇష్టం లే పాపోడా! యెవీ, యేమేమి తెచ్చినారు?” అని గంపలో డబరా గిన్నెల్లో ఉండే వడల్ని, పూర్ణకుడాలను చూసినాడు. చూసి సంచుల్లో వడ్లు నించుతా ఉండే మనిషితో, “వొరా నారప్పా, ఆ చాటతో వొగ నాలుగు చాట్లు వడ్లు ఈ పాపోని సంచిలో పొయిరా” అని చెప్పినాడు. నారప్ప నాలుగు చాటలు నిండా వడ్లు తెచ్చి మా సంచిలో పోసినాడు. పోసినంక ఆ పెద్దయ్య నా పక్క చూస్తా, “పాపోడా, చాటెడొడ్లు నాలుగు సేర్లు అయితాయి. ఆ లెక్కన నాలుగు చాట్ల వడ్లకు కుడుములూ వడలూ యెన్నొస్తాయో నువ్వే లెక్కేసి, ఆ నారప్పకు తూకమేసియ్! వాని పిల్లోల్లందురూ తింటారు” అని చెప్పినాడు.
నేను నాలుగు శేర్ల వడ్లకు వొగ కేజీ కుడుములని, ఎనిమిది శేర్ల వడ్లకు వొగ కేజీ వడలని లెక్కలేయసాగినాను. ఆ ప్రకారంగా రెండు కేజీలు కుడుములు, వొగ కేజీ అలసంద వడలు వస్తాయి పెద్దయ్యా అని అన్నాను. కానీ ఆ పెద్దయ్య మంచితనాన్ని చూసి, ఇన్ని కుడుములొస్తాయి, ఇన్ని వడలొస్తాయి అని చెప్పబుద్ధి కాలేదు నాకు.
“పాపోడా, ఏమి లెక్కేత్తావు గానీ, గంపలో కుడాలూ వడలూ ఎన్నుండాయో అన్నీ ఈ బట్టమింద గుమ్మరీ! వోరి నారిగా, ఈ పిల్లోని సంచిలో ఇంగా ఏడెనిమిది చాట్లు వడ్లు తెచ్చి పొయ్! ఈ ఎండకు యేరే కల్లాల కాటికి యాడ బోతారు పాపం?” అని చెప్పుతానే, ఆ నారప్ప, చాటలో పొర్లిపోయేటట్ల ఎనిమిది చాటల వడ్లు మా సంచిలో పోసినాడు. ఆ పెద్దయ్య చెప్పినట్ల నేను డబరాగిన్నెలో ఉండే పూర్ణ గుడాలు, రెండు రకాల వడలు అన్నీ వొగ బట్ట మీద గుమ్మరించినాను. ఆ పెద్దయ్య కల్లంలో ఉండే వాళ్లందరికీ తలాకొగ కుడుము, రెండు వడలు ఇచ్చి,తానూ రెండు తిని మెచ్చుకుండాడు. నారప్ప పోసిన వడ్లన్నీ నేను మూట గట్టినాను. అర్థం పల్లాసంచికయినాయి. ఏదో నిధి దొరికినంత సంతోషమైంది నాకు. జేజి భలే సంతోష పడింది. నాకు ఆ పెద్దయ్య పేరు తెలుసుకోవల్లనిపించింది.
“పెద్దయ్యా, నీ పేరు ఏం పేరు పెద్దయ్యా?”అని బిడియ పడతా అడిగినాను.
“నా పేరు రామప్ప పాపోడా! సరేగానీ నువ్వు నీలం సంజీవరెడ్డి పేరు యిన్నావా?”అని ఎందుకో అడిగినాడు ఆ పెద్దయ్య.
“విన్నాను పెద్దయ్యా! మన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు గదా! ఆయనది ఈ ఊరే కదా పెద్దయ్యా!” అని నేను టకీమని చెప్పినాను. నారప్ప నవ్వుతా, “ఈ రామప్ప మామ ఎవురనుకుండావు సామీ? సంజీవిరొడ్డి దొరోల్ల యెవసాయమంతా తూగిత్తా వుండే యెడ్డు గుమాత్తా” అని అన్న్యాడు.
“అవునా పెద్దయ్యా! అయితే నువ్వు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి సార్‌కు చాలా కావాల్సిన మనిషివన్న మాట. ఓయమ్మా!” అని ఆశ్చర్యపోతా ఆ పెద్దయ్య వైపు చూడసాగినాను.
“యేదో పాపోడా, ఆ పెద్దాయన నా మింద ఈ బరువంతా పెట్టినాడు. నా వల్లకొద్దీ ఆయన యెవసాయమంతా తూగిత్తావుండాను నాయనా! సరే ఇంగ మీరు ఊర్లేకి పోండి. ఈ పొద్దు అమ్మేటివన్నీ అయిపోయినాయి గదా! ఏందన్నా అవసరముంటే నన్నొచ్చి కలు, పాపోడా” అని తన పనిలో మునిగిపోయినాడు రామప్ప పెద్దయ్య. నేను, ఆ పెద్దయ్య మంచితనాన్ని తలచుకుంటా నడుస్తావుంటే పట్టరానంత ఆనందంతో కండ్లనిండా నీళ్లు కమ్ముకోసాగినాయి. జేజీ నేనూ పొంగిపోతా సావిడి దగ్గరికొచ్చి చిన్నాయనకు అంతా చెప్పినాం.
కల్లూరు ఆయిల్ మిల్లులో రాత్రి కూలికి!
సాయంత్రం పొద్దుగలుగ అన్నం తిని రోడ్డు పట్టుకొని నడుచుకుంటా ఏడున్నర గంటలకల్లా కల్లూరులో రాధాకృష్ణయ్యోళ్ల ఆయిల్ మిల్ దగ్గరికి చేరుకుండాను. ఇంకా వొగర్ధగంట టైముంది. ఈ లోపల కల్లూరు రైల్వే స్టేషన్ చూసొస్తే బాగుంటాది కదా అని అనుకొని, అటువైపు రెండు ఫర్లాంగుల దూరం పోయినాను. అంతలోనే ఆయిల్ మిల్లులో సైరన్ గట్టిగా మోగింది. అది వింటానే గబుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తి వచ్చి, మిల్లు గేటు దగ్గరికి చేరుకుండాను. ఆ షిఫ్ట్ లో పనిచేసినోళ్లందరూ బయటికొస్తా ఉండారు. నేను లోపలికి పోయే వాళ్ల వెంట పోయినాను. అందరూ ఎవురి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోతా, సూపర్వైజర్ని కలుసుకోమని చెప్పినారు. ఆయనను కలుసుకొని నేను నా విషయం చెప్పినాను. ఆయన నన్ను కనికరించి పనిలోకి చేర్చుకొని, పుస్తకములో పేరు రాసుకొని, నాకు పొప్పు మోసే పని చెప్పినాడు.
ఆయిల్ మిల్లు చాలా పెద్దది. గోడ అవతలి పక్క మిషన్‌లో శనక్కాయలు ఆడిస్తావుండారేమో, వొగ పొగగొట్టంలో నుంచి శనక్కాయ పొప్పు వొగ మూల రాశిలోకి పడతావుంది. ఎన్ని లారీల శనక్కాయలు ఆడించినారో ఏమో, విత్తనాల రాశి చాలా పెద్దగా వుంది. వెదురు గంపలతో పొప్పు మోసేకి నాతోపాటు నలుగురుండారు. ఇద్దరు గంపలకు పొప్పు నింపుతా వుండారు. నేను టువ్వాలును తలకాయకు చుట్టుకొని, గంప తీసుకొని పొప్పురాశి దగ్గరికి పోయినాను. పొప్పులో సుమారుగా కసురుంది. ఇంట్లో వొలిచిన విత్తనాల మాదిరి శుభ్రంగా లేవు. బొటికలు, నాసులు, బేసనాలు, చిన్నచిన్న రాళ్లు, పెల్లలు ఉండాయి. పొప్పు నింపిన గంపను నెత్తిమీదికి ఎత్తుకుండాను. ముప్పై నలభై శేర్ల విత్తనాలు పట్టే గంప, మోయలేనంత బరువేమీ లేదు. పనిలోకి కొత్తగా వొచ్చినానని గంప నింపే మనిషి కొంచెం వెలితిగానే నింపినాడు.
నా ముందున్న మనిషి పొప్పు గంపను ఎత్తుకొని చెక్క పలకల నిచ్చెనెక్కి, పైన అట్టవ మీద పోసొచ్చినాడు. అతడు కిందికి దిగొచ్చినంక నేను పైకెక్కి నా గంపలోని పొప్పును అట్టవలో గుమ్మరించి చూసినాను. అట్టవ మూరడెత్తుతో పెద్ద తొట్టి మాదిరుంది. ఆ అట్టవ తొట్టిలో వొగ మనిషి కూర్చొని, విత్తనాలను అల్తిగా మిషన్ లోకి చేతులతో దొబ్బుతా ఉండాడు. దాన్ని హాపర్ అంటారంట.
హాపర్లో నుంచి విత్తనాలు టెంపరింగ్ లోకి పోతావుండాయి. ఆ టెంపరింగ్ లోకి స్టీమును వొదులుతారంట! స్టీముతో విత్తనాలన్నీ వేడెక్కి, నరమ్స్ లోకి పోతాయంట! అక్కడ ఆ విత్తనాలన్నీ నరమ్స్లో క్రష్ అయితాయంట! విత్తనాలు క్రష్ అయితా ఉంటే, నూనె జాలరీ మీదికి కారుతాదంట! ఆయిల్లో వొచ్చే మడ్డీ గసీ అంతా జాలరీ మీద నుంచి మాటిమాటికీ, పారమాదిరుండే గసికడ్డీతో పక్కకు తీసి విత్తనాలలో కలపల్లంట! కిందికొచ్చిన ఆయిల్, ఎక్స్పెల్లర్ లోకీ, దాంట్లో నుంచి ఫిల్టర్ లోకీ పోయి,అక్కడ ఫిల్టరయిన -శనక్కాయ నూనె, బయటుండే ట్యాంకులోకి పోతాదంట! అంతా మిషన్ తోనే జరుగుతాదంట! ఎక్స్పెల్లర్ ముందర చెక్కలు చెక్కలుగా పడతా వుండే శనక్కాయ చెక్కను గంపలతో గోడౌన్లలోకి మోస్తారంట!
వొగ పది నిమిషాలు సేపు అంతా తెలుసుకుండాను. తెలుసుకొని పొప్పు అట్టవమీదికి మోస్తా, మిగతా వాళ్లు చేసే పనులన్నీ గమనించ సాగినాను. వొగ మనిషికి రోజూ వొగే పని కాకుండా మారుస్తా వుంటారని తెలుసుకొని,ఏ పని ఎట్ల చెయ్యల్లనో గమనించినాను. పనేమో బరువైన పని కాదు. మిషన్ దగ్గర పని కాబట్టి, కొంచెం జాగ్రత్తగా వుండల్లని అర్థమయింది.
కొత్త పని! చుట్టూరా పనిచేసే మనుషులు! పనిలో నిమగ్నమై, నిద్రబోయే టైం కదా అనే ఆలోచనే లేదు! నిద్ర దగ్గరికే రాలేదు! పైగా విపరీతమైన వేడి! ఉక్క పోత! ఇంకెక్కడ నిద్ర వొస్తాది? సైరన్ మోగింది! మా షిఫ్ట్ అయిపోయింది! ఇల్లూరుకు బయలుదేరినాను. ఎవరైనా తోడుంటారేమోనని పరిశీలించినాను. ఇల్లూరు రోడ్లో నరమానవుడు లేడు. గబ్బ చీకటి. కొత్త ప్రాంతం కదా, కొంచెం భయమయింది. గుండె దడ ఎక్కువైంది. గట్టిగా ఆలోచన చేసినాను. పగలు చూసిన రోడ్డే కదా! రాత్రి కాగానే ఏమైనా మారుతాదా! రోడ్డుకు అటు ఇటు అవే పొలాలు, అవే చెట్లు! మరి భయమెందుకు? ధైర్యం తెచ్చుకుండాను. మూడు మైళ్లే కదా అని స్పీడందుకుండాను. అర్ధగంటలో ఇల్లూరు చేరుకుండాను. సందుల్లో ఉండే కుక్కలన్నీ వొచ్చి మొరుగుతా వెంటబడినాయి. కొత్త మనిషిని కదా మల్ల! దాండ్లను అదిలిస్తా చావిట్లోకి చేరుకుండాను. కుంటి చిన్నాయన పలకరించినాడు. రెండు మాటలు మాట్లాడి వొగ మూల ముడుక్కుండాను.
***
ఆయిల్ మిల్లులో ఇప్పుడు నా డ్యూటీ ఎక్స్పెల్లరుకు సైడ్‌లో ఉండే జాలరీ మీద గసి తీయడం! గసికడ్డీ కింద పారరేకు మాదిరి మందమైన ఇనప ప్లేటుంది. గసికడ్డీ పైకొనను పట్టుకొని రేకుతో జాలరీ మీదుండే గసిని పక్కకు లాగేస్తా ఉంటే, మిషన్‌లో నుంచి ఛట్ ఛట్ మంటా వేడివేడి ఆయిల్, నా కాళ్ల మీదికి చిట్లుతావుంది. వరుసగా ఆ పని నాలుగు రోజులు చేయడం వల్ల కాళ్ళ మీద బొబ్బలు పుట్టినాయి. నిన్న రాత్రి గసితీస్తా ఉంటే లైట్ ఆరిపోయింది. చీకట్లో పొరపాటున ఆయిల్ గుంతలోకి కాళ్లు పెట్టినాను. అడుగులోతున్న వేడివేడి నూనెలో కాళ్లు కాలిపోతావుండాయి.
“అమ్మా” అని గట్టిగా అరిచినాను. వెంటనే పక్కనుండే వాళ్లొచ్చి నా చేయి పట్టుకుని బయటికి లాగినారు. వొగ మనిషి పాత బట్టతో నా కాళ్ళ మీదున్న ఆయిల్ ని తుడుస్తా, “ఓరి నీ పాసుగులా, ఆయిల్ గుంతలేకి కాలు ఎట్ల పెడితివప్పా? పొరపాట్న ఆయిల్ గుంతలేకి పడిపోయింటే వొళ్లంతా బొబ్బులు పోయిండేదే! ఆ వేడి నూనెలో తలకాయి పడింటే ఎంత ప్రమాదమయిండేది!” అని వోదార్చినాడు. నూనెలో కాలడంతో మోకాళ్ళ కింద రెండు కాళ్లూ మంటకెత్తుకుండాయి. ప్రమాదం తప్పిందని ఊరట పడతా, రోంతసేపు కూర్చుండాను. అంతలోనే లైట్ వెలిగింది. సాటి మనుషులు నామీద దయ తలచి నా పనిని వాళ్లే చేసినారు.
***
ఇరవై దినాలయినంక రేపటి నుంచీ పనికి రానని సూపర్వైజర్తో చెప్పినాను. తెల్లారినంక పది గంటలకల్లా వొస్తే కూలి డబ్బులు ఇస్తానన్నాడు సూపర్వైజర్. ఇల్లూరికి పోయి మల్లా రావడం ఎందుకని, తెల్లారేదంకా అక్కడక్కడే ఉండి, ఫ్యాక్టరీ కాంపౌండ్ లోపలే ముఖం కడుక్కొని, బయట బజార్లో కాఫీ తాగి, రైల్వే స్టేషన్ అంతా చూసినాను. కల్లూరు రైల్వే స్టేషన్లో టిఫన్ అద్భుతంగా ఉంటాదని తెలియడంతో ఐదణాలకు తృప్తిగా ఇడ్లీ వడ తిని, మిల్లులోకి పోయి, చూసి ఆశ్చర్యపోయినాను. వేల శనక్కాయ మూటలు నెట్లు నెట్లు బేర్చినారు. ఐదారు లారీల్లో నుంచి కూలోళ్లు శనక్కాయ మూటల్ని గబగబా సులకాగా కిందికి మోస్తా వుండారు. లారీల వెనకలుండే డోర్లు తీసి లారీలో నుంచి ఫ్లాట్ఫార్మ్ మీదికి మెట్ల మాదిరి, అడ్డపట్టెలేసిన చెక్కపలకలను ఏటవాలుగా వొంచినారు. కూలోళ్లు మూటలెత్తుకొని ఆ చెక్కపలకల మీద ఆడుతా పాడుతా బిరబిరా నడుస్తా, మూటల్ని నెట్టేస్తా వుండారు. వాళ్లను చూసి, ఆ శనక్కాయల ఫ్యాక్టరీ వల్ల ఎన్ని వందల కుటుంబాలు బతుకుతా ఉండాయి! ఈ పేదోళ్లకు పని చేయగలిగితే కరువే ఉండదేమో! కూటికీ గుడ్డకూ దిగులే వుండదేమో! ఎంత సంతోషంగా నవ్వుతా జోకులు వేసుకుంటా పని చేస్తా వుండారు వీళ్లు! మా కుటుంబమూ ఇట్లా చోటికొచ్చి లక్షణంగా బతకొచ్చు కదా!
అనుకుంటా కూలి దుడ్ల కోసరం మిల్లు లోపలికి పోయినాను. సూపర్వైజర్, మిల్లు యజమాని రాధాకృష్ణయ్య దగ్గరికి పిల్చుకొని పోయినాడు. తెల్లని పరుపుల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని, పక్కనున్న ఇనుప బీరువాలో నుంచి డబ్బుల కట్టలు తీసి, లెక్కబెట్టి గుమాస్తా చేతికిస్తా వుండాడు షావుకారి. నేను ఆయనకు నమస్కారం చేసినాను. సూపర్వైజర్ చెపుతానే నా కూలి 50/- రూపాయలు ఇస్తా, నా గురించి అడిగినాడు. నేను విషయమంతా చెప్పినాను. బాగా చదువుకో పాపోడా అని మల్లా వొగ పది రూపాయలు ఇచ్చినాడు. నేను పరమానందంతో ఆయనకు మల్లా నమస్కారం చేసి ఇల్లూరుకు బయలుదేరి నాను. రోడ్డుమీద నడుస్తా, ఈయనకు చదువుకుంటా వుండే వాళ్ల మీద ఎంత ప్రేమ! నేను ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాసింది ఈ మహానుభావుడు కట్టించిన గర్ల్స్ హైస్కూల్లోనే కదా! అని ఆ బిల్డింగును తలచుకుంటా ఇల్లూరు చేరుకుండాను.
ప్రధానమంత్రి నెహ్రూ చనిపోయినాడని..
ఇల్లూరు కల్లాల్లో గుగ్గిళ్లూ వడలూ అట్లూ అమ్మి, జమ చేసుకున్న వడ్లూ, నేను రామప్ప పెద్దయ్య సహాయంతో ఆడింత ఈడింత కుప్పేసుకున్న గడ్డీ అన్నీ రెండు బండ్లల్లో వేసుకొని, మొన్ననే అనంతపురానికి బయలుదేరల్లని అనుకుండాం. కానీ ఆ రోజు 25వ తేదీ సోమవారం, బాడుగ బండ్లన్నీ అనంతపురానికి పోవడం వల్ల వొక్క బండీ దొరకలేదు. కడాకు రామప్పపెద్దయ్య మాట్లాడడంతో రెండు బండ్లు బాడుగకు కుదిరినాయి. ఆ పెద్దయ్యే కొంచెం సలీసుగా బాడుగ మాట్లాడినాడు. నేను వరిగడ్డి కట్టలను పైకి విసురుతా ఉంటే బండిమనిషే వరిగడ్డి టోపు వేసినాడు. ఇద్దరమూ వరిగడ్డి టోపును పగ్గాలతో బిగించి కట్టినాం. ఇంకొగ బండిలో 9 వడ్లమూటలు మట్టంగా పొందేసినాం.
రాత్రి ఎనిమిది గంటలకల్లా అందరమూ అన్నం తిని సామాన్ల సంచులూ గంపలూ వడ్లబండిలో పెట్టి, చిన్నాయననూ జేజినీ ఆ బండిమీదికే ఎక్కించినాను. బండ్లను బజార్లో నిలబెట్టి, మొదట ప్రెసిడెంట్ నారాయణరెడ్డోళ్ల ఇంట్లో చెప్పి, ఆ తర్వాత నేను రామప్ప పెద్దయ్యోళ్ల ఇంటికాటికి పోయి, పోయొస్తాం పెద్దయ్యా అని అంటా ఉంటే కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. ఆ పెద్దయ్య దగ్గరికొచ్చి నా కన్నీళ్లు తుడిచి తల మీద చేతితో సాదుతా, “బయపడొద్దు పాపోడా, కట్టాన్ని నమ్ముకుండావు, తప్పకుండా పైకొత్తావు నాయనా! బద్రంగా పోండి.” అని దీవించినాడు. నేను ఆ పెద్దయ్య పాదాలకు నమస్కరించి బయలుదేరినాను. ఆ పెద్దయ్య గుడకా నాతోపాటు ఎద్దులబండ్ల దగ్గరికొచ్చినాడు.
వడ్లమూటల బండిమనిషి, “వడ్లమూటలూ సామాన్లూ ముగ్గురు మనుషులూ వొగే బండ్లో అయితే బరువైతాది సన్నోడా! నువ్వు వరిగడ్డి టోపు మింద కూచ్చో అని అన్నాడు.
“తొమ్మిది వడ్లమూటలు,ముగ్గురు మనుషులే నీ దేశిపెద్దుల బండికి బరువయితాయేమోయ్, అన్నీ బైకారి కూతలు కాకుంటే? గడ్డిటోపు మింద కూర్చొని ఆ పిల్లోడు రేత్రిపొద్దున తూగితే ఏం గతి?” అంటా రామప్పపెద్దయ్య, బండిమనిషిని గదురుకొని,నన్ను వడ్లబండి మీదికే ఎక్కించినాడు .
“పోయ్యొస్తామన్నా రామప్పన్నా!” అంటా చిన్నాయనా, పొయ్యొత్తాం నాయినా” అంటా జేజీ ఆ పెద్దయ్యకి చెబుతా ఉంటే, రెండు బండ్లూ యెల్లవారినాయి. నేను చేతులెత్తి నమస్కారం చేసి, తర్వాత చేయి ఊపుతా ఉండాను. బండి ముందుకు పోతావుంది. కొంచెం సేపటికి ఆ పెద్దయ్య రూపం చీకట్లో కనిపించలేదు. బండ్లు రెండూ వొగదాని వెనక వొగటి పోతా ఉండాయి. వడ్ల బండిలో వెనక వైపు కూర్చొని కాలు కిందికి చాపుకొని నేను, దూరమైపోతా ఉండే ఇల్లూరు వైపు చూస్తా ఉండాను.
ఎంత మంచి మనిషి రామప్ప పెద్దయ్య! ఎంత సహాయం చేసినాడు! నేను ఏ ఊరి వాన్నో! ముక్కూ మొగం తెలియని నామీద ఆ పెద్దయ్యకు ఎందుకో అంత ప్రేమ! ఏమి సంబంధమో! ఏదో రుణానుబంధం అని అంటా ఉంటారు,అది ఇదేనేమో! కొంత మందిలో ఎంత మంచితనం ఉంటాదో! ఏమిటో ఇదంతా! నీలంపల్లి పెద్దిరెడ్డోళ్లూ రేగడి కొత్తూరు నాగలింగారెడ్డోళ్లూ మా హెడ్మాస్టర్ సారోళ్లూ వీళ్లంతా, నామీదా మా కుటుంబం మీదా ఎందుకంత ప్రేమ చూపుతారో!
ఆలోచిస్తా నేను ముందుకు తిరిగి, “ఈ పొద్దు మే నెల ఏడో తేదీ చిన్నాయనా! ఇంక వారం పది దినాలకల్లా మా ఎస్సెల్సీ పరీక్షల రిజల్ట్స్, అంటే ఫలితాలొస్తాయి” అని అన్నాను.
“అవునా రా? దేవుని దయతో పాసయి నువ్వు యాదో వొగ సన్న ఉద్యోగంలో చేరుకొని, మీ నాయనోళ్లు తొందరగా మన ఊరికి వొచ్చేటట్ల సూడల్ల నాయనా! పిల్లోల్లు అందురూ కండ్లల్లో మెదులుతాండారు.” అని మమకారంతో చెప్పినాడు చిన్నాయన. జేజీ అట్లనే చెప్పింది. అదీ ఇదీ మాట్లాడుకుంటా వుండాం. అంతలోనే బండ్లు రెండూ కల్లూరు నాలుగు రోడ్ల సెంటర్లో ఆగినాయి. ఎందుకో జనమంతా గుంపులు గుంపులుగా రోడ్లమీద వుండారు. వొగ పెద్ద గుంపు, చేతుల్లో కొవ్వొత్తులు వెలిగించుకొని, రాధాకృష్ణయ్యోళ్ల ఆయిల్ మిల్లు దగ్గర ఆలకూడి, మౌనంగా నిలుచుకొని వుండారు. వాళ్ల మధ్యలో ముందుపక్క, ఆ మిల్లు షావుకారి, నాకూ నాతో పాటు పనిచేసిన మిగతా కూలోళ్లకూ వారానికి వొగసారి కూలి బట్వాడా చేసిన కల్లూరు రాధాకృష్ణయ్య, కొవ్వొత్తిని చేతిలో పట్టుకొని నిల్చుకుండాడు. నేను బండ్లో నుంచి కిందికి దిగి రోడ్లో వుండే మనుషుల్ని అడిగి తెలుసుకుండాను. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చనిపోయినాడంట! ఆ వార్త వింటానే నేను ఆశ్చర్యపోతా బాధ పడతా వొచ్చి చిన్నాయనోళ్లకు చెప్పినాను.
అనంతపురం -కర్నూలు రోడ్లో లారీలన్నీ ఆగినాయి. ట్రాఫిక్‌ను దాటుకొని పోయేకి అర్థగంట పట్టింది. జేజీ చిన్నాయనా కొంచెం సేపు మాట్లాడి పండుకుండారు. నేను మూటల సందులో వెల్లకిలా పండుకొని ఆకాశంలోకి చూసినాను. మేఘాలన్నీ పిచ్చోళ్ళ మాదిరి తిరుగుతా వుండాయి. నిన్ననో ఈరోజో పున్నమేమో! అయినా వెన్నెలంతా ఏడుపు మొగంతో వున్నెట్ల కనిపిస్తావుంది. నెహ్రూ చనిపోయినందుకు చందమామ అట్ల దిగులుగా వుండాడేమో అనిపించింది!
జవహర్లాల్ నెహ్రూ! భారతదేశ మొదటి ప్రధానమంత్రి! ఆయన ఎంత గొప్పవాడో, హెడ్మాస్టర్ సార్ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రను చెప్పే సందర్భంలో ఆయనను గురించి చెప్పినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుండేటివి. ఆయన తండ్రి మోతిలాల్ నెహ్రూ, కాశ్మీర్ నుండి అలహాబాదుకు వొచ్చేటప్పుడు సిరిచాపా దిండూ తీసుకొని వొచ్చినాడంట! అట్లావాడు కోట్లకు పడగలెత్తినాడంట! నెహ్రూ చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు బ్రిటిష్ రాణి వొగసారి “మీలో ఎవురు పెద్ద షావుకారులో తెలుసుకోవల్లని అనుకుండాను కాబట్టి, మీరు వొక్కొక్కరు వొచ్చి వొగ కోటి రూపాయల ఆస్తి ఉంటే వొగ గంట, రెండు కోట్లు ఉంటే రెండు గంటలు, పది కోట్లు ఉంటే పది గంటలు కొట్టండి” అని పిలిచిందంట! అక్కడున్న వాళ్లు వొక్కొక్కరు పోయి వాళ్ళ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటే అన్ని గంటలు కొట్టినారంట! నెహ్రూ పోయి గణ గణ గణమంటా పిచ్చోడు కొట్టినట్ల గంటలు కొట్టినాడంట! రాణి, నెహ్రూ దగ్గరికి పోయి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అన్ని గంటలు కొట్టినావు అని అడిగిందంట! అప్పుడు నెహ్రూ, ‘నాకేమీ పిచ్చి పట్టలేదు. మా ఆస్తి ఎన్ని కొట్లుందో లెక్కించడానికి వీలు కాదు కాబట్టి ఆ విధంగా గంటలు కొట్టినాను.’ అని చెప్పినాడంట! అది విని బ్రిటిష్ రాణి ఆశ్చర్యపోయిందంట! అంత పెద్ద కోటీశ్వరుని కొడుకు జవహర్లాల్ నెహ్రూ అని, దేశ స్వాతంత్యం కోసం అంత ఆస్తినంతా త్యాగం చేసిన మహా దేశభక్తుడు నెహ్రూ అని హెడ్మాస్టర్ సార్ చెప్పినప్పుడు వొళ్ళు గగుర్పొడిచింది.
అటువంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు దాదాపు 18 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా ఉన్న మహానుభావుడు, ఆకస్మాత్తుగా చనిపోయినాడని చాలాసేపు బాధపడినాను. బాధపడతా, గొప్ప వ్యక్తులు చనిపోతే భూమి కంపిస్తాదని, సముద్రాలు అల్లకల్లోలం అయితాయని ఇంకా ఏమేమో చెబుతారే, అవేమీ జరగలేదే, ఆ కథలన్నీ ఉత్తుత్తివేనా అనుకుంటా పండుకుండాను.
తెల్లవారుజామున నిద్రలేచేటప్పటికి బండ్లు రెండూ అనంతపురం చేరుకుండాయి. పాతూరు గుత్తిరోడ్డు పక్కన బయల్లో బండ్లు ఇడిచినారు. అక్కడ, అంతకుముందే ఐదారు గడ్డిబండ్లు, నాలుగు వడ్లబండ్లు వొచ్చినాయి. ఎండకారు వడ్లు, వడ్లమిషన్లకు వేసుకొని పోతే చాలా అద్వాన్నంగా రేటు అడుగుతారని, అందుకే రైతులు బొరుగుల బట్టీ వాళ్లకు నేరుగా అమ్ముతారని, చిన్నాయన మా వడ్ల బండిని ఇడిపించినాడు. దగ్గర్లో ఉండే బొరుగుల బట్టీల మనిషి వొచ్చి, వడ్లు పల్లా 18/-రూపాయల రేటుతో వొగదెంచుకొని, తీరా వాళ్ళ బట్టీకాడ మూటలన్నీ దించి కొలుచుకున్న తర్వాత, వడ్లు కొంచెం పసిమిగా ఉండాయని, మూట మీద అర్ధ రూపాయి ప్రకారం తగ్గించుకొని 157/- రూపాయలు చేతికిచ్చినాడు. చిన్నాయన గట్టిగా అడిగేసరికి వొగ రూపాయి మళ్లా ఇచ్చినాడు. వడ్లు అమ్మినంక, వరిగడ్డి అమ్మినాం. వరిగడ్డికి 14/- రూపాయలు వొచ్చినాయి. బండ్లోళ్లకు నాలుగు రూపాయల ప్రకారం ఎనిమిది రూపాయలు బాడుగ ఇచ్చి పంపినాం. అక్కడే వొగ కొట్టం హోటల్ దగ్గర ముఖాలు కడుక్కొని, ముగ్గురమూ టిఫిన్ తిన్నెంక, నేను బట్టలు కొనుక్కొని వొస్తానని చెప్పి, చిన్నాయనోళ్లను తాడిపత్రికి పోయే బుడ్డప్పోళ్ల బస్సెక్కించినాను.
టైం పది గంటలయింది. పాతూరులో ధర్మవరం పోయే రోడ్లో పవర్ ఆఫీస్ వరకు, మార్కెట్ దగ్గర నుంచి శ్రీకంఠం టాకీసుకు పోయే రోడ్లో మరవవంక వరకు చూసినాను. షాపులు యావీ తీయలేదు. ఎందుకో అర్థం గాక వెంకటసత్యం వాళ్ల మామ వెంకటేశమయ్యోళ్ల ఇల్లు మెయిన్ రోడ్డుకు దగ్గరే కదా అనుకొని, అక్కడికి పోయి అడిగినాను, “ఈరోజు సెలవు కదా నారాయణా! నెహ్రూ చనిపోయినాడని, ఆయనకు సంతాప సూచకంగా మొత్తం అన్ని రకాల అంగళ్లూ స్వచ్ఛందంగా బంద్ పాటించడానికి మూసేసినారు” అని వెంకటేశమయ్య చెప్పుతానే, అవునా, అయ్యో అని నోరెళ్ళ బెట్టినాను. “ఏమి సంగతి? ఏమైనా కొనల్లని వొచ్చినావా”అని అడిగినాడు వెంకటేశమయ్య. నేను విషయం చెప్పినాను. సరే మధ్యాహ్నం వరకు అట్లా తిరిగిరాపో, నేను వొక షాపుకు పిలుచుకొని పోతానని చెప్పినాడు వెంకటేశమయ్య.
నేను శ్రీకంఠం టాకీస్ రోడ్లో ముందుకు పోయినాను. మరవవంకలో రోడ్డు వేసినారు. నేను చెంచులక్ష్మి సినిమా చూసేకి వొచ్చినప్పుడు శ్రీకంఠం టాకీస్ దగ్గరికీ కొత్తూరులోకీ పోవడానికి వంక మురికినీళ్లలో రాళ్లూ బండలూ వేసిండ్రికదా! ఆ రాళ్ళ మీద మనుషులు భయపడతా కాళ్లెత్తిపెట్టి దాటుకొని పోతావుండ్రి కదా! ఇప్పుడు రోడ్డు వేసినారే అని సంతోషపడతా, అట్లే ముందుకు పోయినాను. శ్రీకంఠం టాకీస్ వొచ్చింది. పెద్ద టాకీస్. రైల్వే స్టేషన్‌కు పోయే రోడ్డుకు ఉత్తరం పక్కనే, రోడ్డుకానుకొని తూర్పు పడమరలుగా పొడవుగా వుంది టాకీస్. తూర్పు వైపున కాంపౌండ్ గోడ పక్కనే చిన్న సందు! ఆ సందుకు ఇరువైపులా చిన్నచిన్న కొట్టాలు! అక్కడక్కడ చిన్న మిద్దెలు! ఆ సందులో కొంచెం దూరం పోయినంక, అన్నీ మరవంక మురికినీళ్లతో పండే వరిమళ్లు! శ్రీకంఠం టాకీసుకు ఎదురుగా స్టేషన్ రోడ్డుకు దక్షిణం వైపున, పెద్దపెద్ద సందుల్లో కనిపించేదంతా కమలానగరంట! ఈ సందులన్నీ అట్లే దక్షిణానికి పోయి రఘువీరా టాకీస్ రోడ్డులో కలుస్తాయంట! మధ్యాహ్నం లోపల ఆ రోడ్లన్నీ చూడల్లని అనుకుంటా ముందుకు పోతా ఉండాను.
శ్రీకంఠం టాకీస్ దాటినంక రోడ్డుకు రెండు వైపులా అన్నీ రంపం మిషన్లే! వొగొగటి పాతిక ఎకరా స్థలంలో వుంది. రకరకాల పేర్లు రాసిన బోర్డులు వేలాడేసినారు. యా సామిల్లూ ఆడడం లేదు. వొకొగ సామిల్లులో అబ్బబ్బ, ఎంత పెద్ద మొద్దులో! వొకొగ మొద్దు రౌండు, రెండు బారలకు పైగానే ఉంటాదేమో! అట్లే వొకొగ దాని పొడవు ముప్పై నలభై అడుగులు ఉంటాదేమో! చక్కగా వుండే అంత పెద్ద మొద్దులు తెచ్చినారంటే, ఆ మాన్లు ఎంతెత్తు ఉన్నింటాయో! అంతెత్తు చక్కగా పెరిగిండే మాన్ల పేరేమిటో! అవి యా అడవుల్లోనివో! ఆశ్చర్యపోతా నడుస్తా వుండాను.
ఉత్తరం వైపుండే సామిల్లుల వెనకాల మురికి నీళ్లతో మడికట్లలో పెంచిన పచ్చిగడ్డి లెస పెరిగిందని అనుకుంటా ముందుకు పోయినాను. రోడ్డు పక్కనే ఉత్తరం వైపున కాంపౌండ్ గోడ ఉంది. కాంపౌండ్ లోపల కొంచెం పడమటి వైపున, రెండంతస్తుల పెద్ద బిల్డింగు ఉంది. గేటు పైన బోర్డు మీద ఇంగ్లీషులో, తెలుగులో రాసిన అక్షరాలను చదివినాను. గవర్నమెంట్ మల్టీపర్పస్ హై స్కూల్ అని రాసినారు. మల్టీపర్పస్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. లోనికి పోయినాను. స్కూల్ పని చేయలేదు. నెహ్రూ చనిపోయినందు వల్ల సెలవు ఇచ్చినట్లుంది. బిల్డింగ్ గేట్ దగ్గర ఫీవన్ని అడిగి లోనికి పోయినాను. 28/6/1937 తేదీన స్కూల్ ప్రారంభమైనట్లు వొక గోడలో పొందించిన రాతి పలకమీద ఉన్న అక్షరాలను చదివి తెలుసుకుండాను. అయితే ఆ రాతి పలక మీద మున్సిపల్ హై స్కూల్ అని రాసినారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ STATHA, Esqr అనే ఆయన ఆ స్కూల్ బిల్డింగును ప్రారంభించినాడని, ఆ బిల్డింగ్ ఇంజనీర్ రావు సాహెబ్ విశ్వనాథ అయ్యర్ అని, మున్సిపల్ చైర్మన్ ఖాన్ సాహెబ్ అమీరుద్దీన్ సాహిబ్ అని రాతి పలక మీద రాసిన పేర్లను చదివి, అవేమి పేర్లో అర్థం కాక కొంచెం సేపు తలకాయి గోక్కుండాను. మొత్తం బిల్డింగ్ H ఆకారంలో ఉంది. లోపల నల్లబండలు పరిచిన వరండా! వరండాల చివర రాళ్లతో పేర్చిన స్తంభాలు! స్తంభాలపైన కూడా వరండా! వరండాలో అడ్డంగా, రవంతయినా పుచ్చూ చెదలూ పట్టకుండా బలంగా ఉన్న చెక్క తీర్లు ఎంత అద్భుతంగా ఉండాయో! పెద్ద పెద్ద కిటికీలు! కిటికీల రెక్కలలో క్లోజ్ చేయడానికీ ఓపెన్ చేయడానికీ ప్లేట్ల మాదిరి పలకలు! ఎంత నైపుణ్యంగా అమర్చినారో! చూసి, ఆశ్చర్యపోయినాను. బిల్డింగ్ బయటికొచ్చి, చుట్టూ ఉండే కాంపౌండును గమనించినాను. దాదాపు ఏడెనిమిది ఎకరాలుంది. టౌన్లో ఇంత స్థలంలో, వొగ వైపున స్కూల్ బిల్డింగు కట్టిన బ్రిటిష్ వాళ్లది ఎంత దూరదృష్టో అనుకుంటా రోడ్లోకి వొచ్చినాను.
రాయలసీమ కీర్తికిరీటం ఆర్ట్స్ కాలేజీ బిల్డింగు!
ఎదురుగా కాంపౌండ్ గోడలేని పెద్ద గ్రౌండ్! అది కాలేజీ గ్రౌండ్ అని తెలిసింది. ఆ గ్రౌండుకు ఎదురుగా, తూర్పుమొగంతో రెండంతస్తుల ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్, తెల్లగా అత్యద్భుతంగా కనిపిస్తావుంది. దాని ముందర ఉండే రోడ్డు, రైల్వే స్టేషనుకు పోతాదంట! పాతూర్‌లో నుంచి నేను వొచ్చిన రోడ్డు, హై స్కూల్ కాంపౌండ్ నైరుతి మోటు దగ్గర స్టేషన్ రోడ్లోకి కలుసుకుంది. స్టేషన్ కంటే ముందు ఆర్ట్స్ కాలేజీని లోపలికి పోయి చూడల్లని ఆశ కలిగింది. గేటు లాక్ చేసినారు. లోపల ఎవురో మనిషి కనిపిస్తే పిలిచినాను. అతడు దగ్గరకు వచ్చినాడు. ‘కాలేజీ చూస్తానన్నా! రోంత గేటు తీయన్నా!’ అని రిక్వెస్ట్ చేసుకుండాను. దయ తలచి ఆయన గేటు తీసి నన్ను పిలుచుకొని పోయి బిల్డింగు బయటంతా చూపించినాడు. చూపిస్తా,తాను అదే కాలేజీ వాచ్‌మన్‌గా ఇరవై ఏండ్ల నుంచి పని చేస్తావుండానని చెప్పినాడు. నువ్వు ఏమి చదువుతావుండావు తమ్ముడూ అని నా గురించి అడిగినాడు. నేను నా చదువు గురించి చెప్పినాను. ఆ అన్న సంతోషపడి కాలేజీ బిల్డింగ్ బయటంతా చూపించినాడు.
బిల్డింగు లోపలికి పోయే ఎంట్రెన్స్ గేట్ పక్కన వరండాలో, గోడ లోపల పొందించిన రాతిపలక మీద ఉండే అక్షరాలను ఆసక్తిగా చదివి అబ్బురపోయినాను. అది మున్సిపల్ హై స్కూల్ కోసరం కట్టించిన బిల్డింగంట! అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెన్ ట్లాండ్ అనే ఆయన 1-7-1914 నాడు పునాదిరాయి వేసినాడు! 1916వ సంవత్సరంలో ఆ బిల్డింగు, మొత్తం రాయలసీమలో మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీగా దత్త మండలాల కాలేజీగా మార్పు చెందిందంట! కాలేజీ కోసరం ఖాన్ బహదూర్ ఇమాముద్దీన్, ఖాన్ బహదూర్ రహంతుల్లా అనే అన్నదమ్ములు సుమారు 80 ఎకరాల భూమిని దానం చేసినట్లు, ఎంట్రన్స్ హాల్లో, పైకి ఎక్కిపోవడానికి వేసిన భద్రమైన చెక్క మెటికల(steps) పక్కనుండే గోడలోని రాతి పలక మీదున్న అక్షరాలను చూసి ఇంకా ఆశ్చర్య పోయినాను. అనంతపురం టౌన్ నడిబొడ్డులో అంత భూమిని కాలేజీ కోసరం దానం చేసిన ఆ గొప్ప వ్యక్తులను, ఎవురో చదువుకోడానికి అంత ఆస్తిని త్యాగం చేసిన వాళ్ల గొప్పతనాన్ని గురించి ఆలోచన చేస్తా కాలేజీ పైకి పోవడానికి ఆశపడినాను. కానీ ఆ అన్న, అందుకు ఒప్పుకోలేదు. ఆ హాల్లో నుంచి అంతా గమనించినాను.
దాదాపు ఇరవై అడుగుల పైన పైకప్పు! దానిపైన అంతే ఎత్తున్న రెండో అంతస్తు! పెద్దపెద్ద దూలాలు! దూలాల పైన అడ్డంగా చెక్కుచెదరని చెక్క మొద్దులు! అన్నీ బర్మా టేకుమొద్దులంట! కింద వరండా! వరండా అంచుల్లో సందిట లావుండే స్తంభాలు! స్తంభాలపైన రెండో అంతస్తు వరండా! రెండడుగుల వెడల్పుతో ఉండే రాతిగోడలు! మొత్తం గోడలూ స్తంభాలూ గారతో మెత్తి నునుపు చేసినారు! మొత్తం బిల్డింగ్, భాగాలు భాగాలుగా, భాగాల మధ్యలో ఖాళీ స్థలం వొదిలిపెట్టి కట్టినారు. మొత్తం బిల్డింగులో ప్రతి రూమునూ హాలునూ చూడడానికి పోతే కాళ్లు నొప్పిస్తాయేమో!
బిల్డింగ్ ఉత్తరం వైపు చివర పెద్ద లైబ్రరీ! తలుపులు తీసి ఉంటే లైబ్రరీని చూసి ఉండొచ్చు! కానీ వీలు కాదు. లైబ్రరీ పైన పెద్ద డ్రామా హాలు ఉందంట! బిల్డింగును అంతా చూస్తా వెనక వైపుకు పోయినాను. వోయమ్మా, చాలా పెద్ద గ్రౌండ్! పడమర వైపు రైల్వేలైను వరకు ఉంది. గ్రౌండుకు దక్షిణం వైపున్న బళ్లారి రోడ్డు పక్కనుండే రెండంతస్తుల బిల్డింగ్, హాస్టల్ బిల్డింగంట! అంతా చూస్తా, మళ్లా కాలేజీ ముందు వైపుకొచ్చి ఎదురుగా నిలబడి, ఈ కాలేజీలో చదువుకోవల్లంటే ఎంత అదృష్టం ఉండల్లనో! ఇందులో చేరి నేను చదువుకోవడం ఈ జన్మలో సాధ్యమయి తాదా? ఈ కాలేజీ మెట్లెక్కడం నావంటి వానికి అయ్యే పనేనా? అయినా ఏదో వొగ నాడు మొత్తం కాలేజీని చూసి, దీని గొప్పతనాన్ని గురించి తెలుసుకోవల్లని అనుకుంటా వాచ్‌మన్ అన్నకు థాంక్స్ చెప్పి, రోడ్డు మీదికొచ్చి టైం తెలుసుకొని, రైల్వే స్టేషన్ వైపు అడుగులేసినాను.
సిమెంటు రోడ్డుకు ఇరువైపులా ప్యాచ్ మాదిరి బారెడు బారెడు వెడల్పుతో అతికించినట్ల తార్రోడ్డు వేసినారు. మధ్యలో పదైదడుగుల సిమెంట్ రోడ్డును ఎప్పుడు వేసినారో యేమో, బండ మాదిరుంది. చిన్న చిన్న కంకర రాళ్లు కనిపిస్తా ఉండినా, అవి రోడ్డుకు అతికించి తోపడా పట్టినట్లుండాయి. ఎన్నో ఏండ్ల నుంచి మనుషులూ బండ్లూ వాహనాలూ పారాడి పారాడి రోడ్డంతా నునుపు తేలింది కానీ వొక్కచోటైనా చిన్న పెచ్చు ఊడిపోలేదు. అంత అద్భుతంగా ఉన్న సిమెంటు రోడ్డును గమనిస్తా, రెండు విద్యాలయాల మధ్యలో ఉండే రోడ్డు వెంట చివరికి పోయినాను. ఎడమవైపున అనంతపురం రైల్వే స్టేషన్! కుడివైపుకు పోయే రోడ్డునూ ఆ ప్రాంతాన్నంతా రామచంద్ర నగర్ అని అంటారంట!
నేను ఆ వైపు పోకుండా, రైల్వే స్టేషన్ లోకి పోయినాను. చాలా పెద్ద స్టేషన్!
అనంతపురం రైల్వే స్టేషన్ 1893లో ప్రారంభమైందంట!
స్టేషన్ ముందర ఏడెనిమిది జట్కాబండ్లుండాయి. ఉత్తర దక్షిణంగా విశాలమైన స్థలం సుమారుగా మూడెకరాలంత ఉంది. రాబోయే కాలంలో స్టేషన్ ఇంకా పెద్దగా చేసుకుండేకి అంత స్థలం వొదిలినారేమో, బస్సులూ లారీలూ వొచ్చి ఫ్రీగా తిప్పుకోవడానికి అనుకూలంగా ఉంది. వొగ రూమ్ లోపల కిటికీ పక్కన వొగాయన కూర్చుండాడు. బయట ముగ్గురు నలుగురు ప్యాసింజర్లు నిల్చుకొని ఉండారు. కిటికీ కింద ఉండే పెద్ద బొక్కలోకి చేయి పెట్టి, డబ్బులు ఇచ్చి, గుంతకల్లు టికెట్ ఇవ్వమని వొగ మనిషి అడుగుతా ఉండాడు. టికెట్టు ఎట్లుంటాదో చూడల్లని నేను ఆ కిటికీ దగ్గరికి పోయి చూసినాను. టికెట్ ఇచ్చే మనిషి, తన పక్కన వొగ చెక్క బోర్డ్ మీద వొగ వరుసలో రెండు అంగుళాలు పొడవు వొక అంగుళం వెడల్పు ఉండే వొగ చిన్న కార్డుముక్కను పైనుంచి బయటికి తీసుకొని ఏందో వొగ మిషన్ కింద పెట్టి హ్యాండిల్ తో వొత్తి తీసి, కిటికీ బొక్క దగ్గర పెట్టినాడు. ప్యాసింజర్ దాన్ని తీసుకొని చూస్తా ఉండాడు. నేను దాన్ని చూసి ఆశ్చర్య పోయినాను. ఆ కార్డుమీద గుంతకల్ పేరు, టికెట్టు రేటు, ఇంకా ఏంటివో ప్రింట్ చేసినారు. మిషన్‌తో వొత్తినప్పుడు 28-5- 1964 అని తేదీ, నొక్కులు నొక్కులుగా పడింది. ప్యాసింజర్లు నలుగురూ టికెట్లు తీసుకున్న తర్వాత లోపలుండే ఆఫీసర్ కు నమస్కారం చేసి, ఆ రైలు టికెట్లను గురించి వినయంగా అడిగాను. ఆ సార్ నవ్వుతా చెప్పినాడు.
“ఇది ప్రింటెడ్ కార్డుటికెట్! చెక్కతో చేసిన ఈ ఉడెన్ రాక్,టికెట్ చెస్ట్! ఈ చెస్ట్ మీదున్న ఇవన్నీ టికెట్ ట్యూబ్స్! వొక్కొక్క రైల్వే స్టేషనుకు చెందిన టికెట్లన్నీ వొక ట్యూబ్‌లో ఉంటాయి! ట్యూబ్‌లో నుంచి టికెట్ తీసుకొని దాన్ని ఈ డేటింగ్ ప్రెస్ మిషన్ కింద పెట్టి నొక్కితే డేట్ పడుతుంది. ఇదమ్మా రైల్ టికెట్ కౌంటర్లో పద్ధతి! ఈ టికెట్లన్నీ సికింద్రాబాద్ రైల్వే ప్రెస్‌లో ప్రింటయి వొస్తాయి” అని ఆ టికెట్ బుకింగ్ ఆఫీసర్ చెప్పిందంతా విని భలే సంతోషమయింది నాకు .
“థాంక్యూ సార్, నమస్తే!” అని ఆయనకు చెప్పి స్టేషన్ ఫ్లాట్ఫార్మ్ మీదికి పోయినాను. ప్లాట్ఫార్మ్ సుమారుగా నాలుగైదు ఫర్లాంగుల పొడవుంది. ఫ్లాట్ఫార్మ్ ఆనుకొనే కమ్మీలుండాయి. స్టేషన్ వైపు వొగ లైనూ అవతలపక్కన ఎదురుగా ఇంకొగ లైనూ ఉండాయి. అక్కడా ప్లాట్ఫార్మ్ ఉంది. ఆ ప్లాట్ఫార్మ్ అవతల వైపున కూడా రెండు లైన్లుండాయి. అవి గూడ్స్ రైలు పోయేకి అనుకుండాను. ఎదురుగా ఉండే ప్లాట్ఫార్మ్ అవతల కమ్మీల మీద వొగ గూడ్స్ రైలు ఆగి ఉంది. బొగ్గుల రైలింజన్ దక్షిణ మొగం చేసుకొని ఉంది.అది బెంగళూరుకు పోతుందేమో అనుకుంటా ప్లాట్ఫార్మ్ మీద నడుస్తా ఉండంగనే రెక్క మాను వొంగింది. గ్రీన్ లైట్ పడింది. తెల్ల డ్రెస్ వేసుకొని తల మీద క్యాప్ పెట్టుకొని, వొగ చేతిలో పచ్చజెండా ఇంకొగ చేతిలో, వైరు అల్లకుండా బ్యాట్ మాదిరుండే దాన్ని పట్టుకొని ఫ్లాట్ఫార్మ్ అంచులో నిలుచుకొని ఉండాడు. నేను బెంగళూరు వైపు నుంచి వొచ్చే రైలును గమనించినాను. చూస్తా ఉండగానే అది చాలా స్పీడ్‌గా వొచ్చింది. ఇంజన్లో నుంచి డ్రైవర్ కొంచెం వొంగి తన చేతిలో ఉండే బ్యాట్‌ను ప్లాట్ఫార్మ్ మీద పడేసి, పచ్చ జెండా పట్టుకున్న ఆఫీసర్ అందించిన బ్యాట్‌లోకి చేయి దూర్చి అందుకొని, ఇంజన్ డ్రైవర్ లోపలికి వెళ్ళిపోయినాడు. గూడ్స్ రైలు స్పీడుగా పోతావుంది. ప్లాట్ఫార్మ్ అదురుతా ఉంది. అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ప్లాట్‌ఫామ్ మీద ఎర్రంగీ వేసుకొని నా పక్కనే పోతా ఉండే మనిషిని చూసి, రైల్వే మనిషి అనుకొని రైలింజన్ డ్రైవర్‌కు అందించిన ఆ బ్యాట్‌ను గురించి అడిగినాను. దాన్ని లైన్ క్లియర్ అంటారని చెప్పినాడతడు.
రైళ్లు ఎదురెదురుగా వొస్తే అప్పుడు ఎట్లనో అని ఆలోచన చేస్తా కొంచెం సేపు అక్కడే ఉండి గుంతకల్లుకు పోయే రైలును చూడల్లనుకుండాను. ఆ రైల్వే లైన్, మీటర్ గేజ్ అని, అనంతపురం రైల్వే లైన్ 1893వ సంవత్సరంలో ప్రారంభమైందని తెలుసుకొని, ఓరి నాయనో డెభ్బై సంవత్సరాల కిందటనే అని ఆశ్చర్యపోతా, దాదాపు బొంబాయి-మద్రాసు లైను ప్రారంభమయినంక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రైల్వే లైన్ ప్రారంభమైందని మదింపు వేసుకుండాను. గుంతకల్ రైలు వొగ అర్ధగంట ఆలస్యమని అనౌన్స్ చేయడంతో నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చి మల్లా ఆర్ట్స్ కాలేజీ రోడ్లో గడియారం వైపొచ్చినాను. గడియారం దగ్గర నిల్చుకొని పడమర రైల్వే గేటు వైపు చూసినాను.
ఇది బళ్లారి, కళ్యాణదుర్గం వైపు పోయే రోడ్డు అని తెలుసుకొని, ఆర్ట్స్ కాలేజీ కోసరం బహదూర్ ఇమాముద్దీన్ బహదూర్ రహంతుల్లా ఇచ్చిన భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఆలోచన చేయసాగినాను. పడమర రైల్వే గేట్ దగ్గర నుంచి తూర్పున బండెప్ప సత్రం వరకు, బండెప్ప సత్రం దగ్గర్నుంచీ ఉత్తరం దిక్కులో ఉండే శ్రీకంఠం టాకీస్ రోడ్డు వరకు, అక్కడ్నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ మధ్యలో ఉండే సుమారు 80 ఎకరాల భూమి అని, ఈ భూమిలోనే గడియారం దగ్గర ఉండే బస్టాండు, బస్టాండ్ వెనకలుండే పోలీస్ ఆసుపత్రి, బళ్లారి రోడ్డు పక్కనుండే తాలూకాఫీస్, ఆర్ డి ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, జైలు ఇవన్నీ కట్టినారేమోనని అనుకుండాను.
మా ఊరోళ్ళు అప్పుడప్పుడు చెపుతా ఉండిన గడియారాన్ని చూడల్లని చాలాసార్లు అనుకుండాను. అట్లాంటి గడియారాన్ని ఇన్నాళ్లకు చూసినానని సంతోషపడతా, దీన్ని క్లాక్ టవర్ అని కొంతమంది, టవర్ క్లాక్ అని కొంతమంది పిలుస్తారని తెలుసుకుండాను. క్లాక్ టవరుకు ఎదురుగా దక్షిణం వైపుండే విఠల్ బిల్డింగును చూసి, ఈ బిల్డింగ్ లేకుండా దక్షిణం వైపునా రోడ్డు ఉన్నింటే కరెక్టుగా నాలుగు రోడ్ల మధ్యలో క్లాక్ టవర్ ఉండేదని, అట్లా ఉండి ఉంటే అనంతపురం ఎంతో అందంగా కనిపించేదని అనుకుంటా ముందుకు తూర్పుకు సాగిపోయినాను. ఎడమవైపున రఘువీరా టాకీస్ వొచ్చింది. దాన్ని చూడగానే అది మాల్యవంతం వాళ్ళది అన్న సంగతి గుర్తుకొచ్చింది. అనంతపురంలో ఉండే మూడు సినిమా టాకీసులలో రఘువీర టాకీస్ అద్భుతంగా ఉంటుందని, సౌండ్ సిస్టం రఘువీర హాల్లో ఉన్నట్లు రాయలసీమలోనే కాదు మొత్తం రాష్ట్రంలో ఇంకెక్కడా లేదని శింగనమలలో చదువుకున్న వాళ్ళు చెబుతా ఉంటే చాలాసార్లు విన్నాను. అట్లాంటి టాకీస్‌ను బయట నుంచి చూస్తానే దాంట్లో సినిమా చూడల్లనిపించింది. కానీ ఈరోజు బంద్ కారణంగా సినిమా హాల్ క్లోజ్ చేసినారని తెలుసుకొని, వెంకటేశమయ్య రమ్మనిండే విషయం గుర్తుకు తెచ్చుకొని, భోజనం చేయకుండా వాళ్ళింటికి పోవడం మంచిది కాదనుకొని, అక్కడే ఉన్న గజేంద్ర విలాస్ హోటల్లో అర్ధరూపాయి ఇచ్చి ప్లేట్ భోజనం తిని, వెంకటేశమయ్య దగ్గరికి పోయినాను.
వెంకటేశమయ్య నన్ను బట్టల షాపు దగ్గరికి పిల్చుకొని పోయినాడు. ఆ షాపు మూసేసినారు. పక్కన మూడడుగుల సందులో నుంచి ఇద్దరమూ లోపలికి పోయినాం. వెంకటేశమయ్య అడగడంతో ఆ షాపు ఓనర్ ఇంట్లో నుంచి షాపులోకి పెట్టుకున్న వాకిలి తీసి, లైట్లు అన్నీ వేసినాడు. బట్టల షాపు పెద్దగానే ఉంది. కిందన్నీ తెల్లని పరుపులు( బెడ్లు) వేసినారు. ఓనర్ ట్రౌజర్ బట్టలూ అంగీ గుడ్డలూ తాన్లు తాన్లు సుమారుగా తీసి బెడ్స్ మీద వేసినాడు. అన్నీ చాలా ఖరీదైనవి. అంత రేటు వద్దన్నాను. వేరేటివి కొంచెం తక్కువ రేటు తీసి చూపించినాడు. నేను గోధుమ రంగుది వొగటి ఊదా రంగుది వొగటి సెలెక్ట్ చేసుకొని, రెండు ట్రౌజర్ల గుడ్డలూ, ఆ ట్రౌజర్ల కలరుకు సరిపోయే రెండంగీ బట్టలూ తీసుకుండాను. అంతా నలభై రూపాయలయింది. అవి ప్యాక్ చేయించుకొని బయటకొచ్చి వొగ జత చెప్పులు కావల్లయ్యా అని అడిగినాను. ఈరోజు చెప్పులు తీసుకోవడం కష్టమే అన్నాడు వెంకటేశమయ్య. సరే, మల్లా తీసుకోవచ్చులే అనుకొని, ఆయనకు చెప్పి బస్సెక్కి సాయంత్రానికి ఊరు చేరుకుండాను. మరుసటి రోజు సీతంపల్లికి నాయనకు జాబు రాసినాను. పల్లెలన్నీ తిరిగిన సంగతీ, ఇల్లూరు కల్లాల సంగతీ, కల్లూరు ఆయిల్ మిల్లుకుపోయిన సంగతీ, ఆ కూలి డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కున్న సంగతీ అన్నీ వివరంగా రాసినాను.
పది రోజులు గడిచిపోయినాయి. రిజల్ట్స్ కోసరమూ, నాయన జాబు కోసరమూ ఎదురు చూస్తా ఉండాను. పది దినాలయినంక నాయనోళ్ల నుంచి జాబు వొచ్చింది. నాయన బాధపడతా రాసినాడు. “మేము ఇక్కడ ఎండనక వాననక చలి అనక నానా అవస్తలు పడతా ఉంటే నువ్వు నీ కూలి దుడ్లతో నీ బట్టలు నీ సోకులు చూసుకుంటే ఎట్ల? నిన్ను చదివించేకే మేము ఈ కానని దేశానికొచ్చినాం. మేము ఏమి తింటా వుండామో ఎట్లుండామో నీకు కాబట్టిందా? యాభై అరవై రూపాయలు చేతికొచ్చి గుడకా మాకు చెప్పకుండా అంతా నువ్వే ఖర్చు పెట్టుకుండేదేనా? ఈడ ఆడపిల్లలు ఉండారే, వాల్లకన్నా రెండు లంగా బట్టలు తీసినావా? ఇట్లా వానివి రేప్పొద్దున ఉద్యోగం వొస్తే నువ్వు మమ్మల్ని చూస్తావని నమ్మకమేముంది? మాకు చాలా బాధ అయింది” అని రాసినదంతా చదివి నా మనస్సు వికలమైంది.
ఇది నాయన రాసిన జాబు కాకపోవచ్చు. వేరే వాళ్లతో రాయించినాడు. నాయన ఈ మాటలన్నీ చెప్పితేనే కదా రాసే మనిషి రాసింటాడు! నాయన చెప్పకపోతే జాబు రాసే మనిషి ఇదంతా ఎందుకు రాస్తాడు?
నెలకొగసారి నాయన పదీ పన్నెండు రూపాయలు నాకోసరం పంపిండేది నిజమే! ఆ దుడ్లతోనే నేను చదువుకోగలనా? నా తిండీ నీళ్లకూ నా చదువుకూ ఆ దుడ్లు సరిపోతాయా? ఇక్కడ చిన్నాయనోళ్లు లేకపోతే సంవత్సరం కిందట సీతంపల్లికి పోయేటప్పుడు ఇంట్లో పెట్టి పోయిన ఏడెనిమిది శేర్ల బియ్యపు గింజల తోనే నేను సంవత్సర కాలం గడపడానికి అయితాదా? బుద్ధి వొచ్చినప్పటి నుంచి ఏ రోజు నేను పని చేయకుండా ఉండాను? నేను తినిన తిండికి చేసిన కష్టం సరిపోదా! యాభై అరవై రుపాయలు నా చేతికి వొచ్చినాయంటే ఆ దుడ్ల కోసరం నేను ఎన్ని తిప్పలు పడినానో నాయనకు తెలుసునా? శనక్కాయ మిల్లులో రాత్రి పని చేసేటప్పుడు అనుభవం లేక వొగనాడు వేడివేడి చెనక్కాయ నూనె గుంతలో పడినప్పుడు కాళ్లు రెండూ మోకాళ్ల వరకు బొబ్బలు పోయి మంటకెత్తుకున్నప్పుడు ఎంత బాధపడినానో నాయనకు అర్థమయితాదా? జరిగిందంతా జాబు రాస్తే అమ్మయ్య ఏడ్చుకుంటూ పరిగెత్తి వొస్తాదని జాబు రాయలేదు. కడుపుకూటి కోసరం చిన్నాయన వాళ్ల వెంట గంపెత్తుకొని పల్లెలు పల్లెలు తిరుగుతా కష్టపడినాను. కష్టపడకుంటే నాకు తిండి పెట్టేదెవురు? ఆ కష్టం కాకుండా రాత్రిపూట అదనంగా కష్టం చేసినందుకే కదా నా చేతికి యాభై అరవై రూపాయలు వొచ్చిండేది! ఆ దుడ్లతో నేను జల్సాలు చేయలేదే! బట్టలు తీసుకుండాను, అంతే కదా! ట్రౌజర్లు కుట్టించుకోకుండా వొగ ఇరవై రూపాయలు పంపించి ఉంటే బాగుండేదేమో!
అవును, ఎస్.ఎల్.ఎల్.సి. రిజల్ట్స్ వొస్తానే హెడ్మాస్టర్ సార్ ఎక్కడైనా ఉద్యోగం చూస్తానన్నాడు కదా! వొగవేళ అదృష్టం కొద్దీ ఆయన ఎక్కడైనా వొగ ఆఫీసులో వొగ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే అప్పుడు నేను నిక్కర్‌తో ఉద్యగానికి పోలేను కదా! ఇవన్నీ నాయనకు ఎట్ట తెలుస్తాయి? నా చేతికి యాభై అరవై రూపాయలు వొచ్చినాయని తెలుస్తానే చూపంతా ఆ దుడ్ల మీదేనా? మొన్న చిన్నాయన గుడకా గడ్డి అమ్మిన దుడ్లు తనకు ఇవ్వలేదని కొంచెం సేపు బాధపడినాడు. డబ్బులు విషయంలో నాయన గానీ చిన్నాయన గానీ ఎందుకు ఇట్ల మారుతారు? అసలు హెడ్మాస్టర్ సార్ శింగనమలకు రాకుంటే, మా నాయన నన్ను చదివించేవాడా? ఆ సార్ ఎంత సహాయం చేస్తా ఉండాడో వీళ్లకు అర్థం అయితాదా?
వికలమైన మనస్సుతో రకరకాలుగా ఆలోచన చేస్తా లోలోపలే కాలిపోయినాను. పడిన కష్టాలూ నాయన రాసిన మాటలూ గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీళ్లు కారసాగినాయి. చిన్నాయనోళ్లు చూస్తే రకరకాల ప్రశ్నలు వేస్తారని వాళ్లకు కనిపించకుండా రెండు మూడు రోజులు మా కొట్టం లోపలికి పోయి కన్నీళ్లన్నీ అయిపోయే వరకు ఏడ్చినాను. ఏడుస్తా, నేనేమీ తప్పు చేయలేదని నాకు నేనే జవాబు చెప్పుకుండాను.
ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు – అసంతృప్తి తోనే సంతృప్తి!
నాలుగైదు రోజులు గడిచిపోయినాయి. ఎస్సెసెల్సీ రిజల్ట్స్ వొచ్చినాయని తెలిసింది. నేను ప్రెసిడెంట్ సుంకు రంగయ్యోళ్ల ఇంటికి పోయి ఆంధ్ర పత్రికను ఇప్పించుకొని భయం భయంగా నా నంబర్ని వెతక సాగినాను. ఆశతో ఫస్ట్ క్లాస్ నంబర్లలో చూసినాను. నా నంబర్ తర్వాత ఉండే నంబర్ వెంకట్ సత్యంది. అది ఫస్ట్ క్లాస్ నెంబర్లలో ఉంది. అక్కడ నా నంబర్ కనిపించకపోవడంతో శరీరంలో ఒణుకు పుట్టింది. సెకండ్ క్లాస్ లిస్టులో భయపడతా వెతికినాను. 329129 నంబర్ కనిపించింది. కొంచెం అసంతృప్తి కలిగింది. అయితే ఫస్ట్ క్లాస్‌లో పాసయిండేది వెంకటసత్యం, శంకర్ ఇద్దరే! నేనూ ఉమావతీ రాధాకృష్ణా మురళీ ఇంకొగ ఇద్దరు సెకండ్ క్లాస్‌లో పాసయినాం. మిగతా వాళ్లలో కొంతమంది మాత్రమే థర్డ్ క్లాస్‌లో పాసయినారు. చాలా మంది ఫెయిలయినారు. ఏదో అదృష్టం బాగుండబట్టి సెకండ్ క్లాసయినా వొచ్చింది, పర్వాలేదునుకొని అసంతృప్తితోనే సంతృప్తి చెందినాను. అయితే బాలన్న ఫెయిల్ అయినందుకు బాధపడినాను.
నేను సెకండ్ క్లాస్‌లో పాసయినానని చిన్నాయనోళ్లతో చెప్పినాను. వాళ్ళు సంతోషపడినారు. నాయనోళ్లకు జాబు రాసినాను. హెడ్మాష్టర్ సార్‌ను కలుసుకొని సెలవుల్లో గడిపిన విషయాలన్నీ చెప్పి,అట్లే ట్రౌజర్లు శ్లాగులు కుట్టించేకి కొత్త బట్టలు ఇచ్చి రావల్లని శింగనమలకు పోయినాను. హెడ్మాస్టర్ సార్ నన్ను చూసి సంతోషపడతా, “పోనీలేరా, సెకండ్ క్లాస్‌లో పాసయినావ్, సంతోషం! వొక వారానికల్లా ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికెట్స్ వొస్తాయి. నేను మలేరియా డిపార్ట్మెంట్లో మాట్లాడి పెట్టినాను. సర్టిఫికెట్స్ రాగానే నువ్వు ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌కు పోయి, పేరు రిజిస్టర్ చేసుకో! వాళ్లు వొక నెంబర్ ఇస్తారు. అది దగ్గర పెట్టుకొని ఉండు” అని క్లియర్‌గా చెప్పినాడు. అంతలోనే సోదనపల్లె నుంచి బాలన్న వొచ్చినాడు. సార్ బాలన్నను మెత్తగా మందలించి, సర్టిఫికెట్స్ రాగానే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో నేమ్ రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఇద్దరినీ వారం తర్వాత రమ్మన్నాడు.
నేనూ బాలన్నా అనంతపురం బస్టాండ్‌లో కలుసుకొని, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎక్కడుండేదీ తెలుసుకొని, బళ్ళారి రోడ్లో రైల్వే గేట్ దాటగానే కుడిపక్కనుండే ఎంప్లాయ్మెంట్ ఆఫీసుకు చేరుకుండాం. అప్పటికే చాలామంది మా మాదిరి వొచ్చినోళ్ళు క్యూలో ఉండారు. మధ్యాహ్నం కల్లా మా పేర్లు రిజిస్టర్లో రాసుకొని, మాకు కార్డ్స్ ఇచ్చినారు. అందులో పేరు కింద ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు అపియర్ అయినట్ల రాసి, రిజిస్ట్రేషన్ నంబర్ వేసి, కింద ఆఫీస్ సీల్ గుద్ది, సంతకం చేసి,తేదీ రాసి, చేతికిస్తూ సర్టిఫికెట్స్ వొచ్చిన తర్వాత తీసుకొని రమ్మన్నారు. సరే అని మేము ఇద్దరమూ బస్టాండ్ కు వొచ్చి బస్సెక్కి ఊర్లకు బయలుదేరినాం.
వేశ్యల కొట్టాలలో మా మకాం!
పది రోజులకు మా ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికెట్స్ వొచ్చినాయి. మార్కులు చూసుకుండాను. టోటల్ మార్కులు 317. కాంపోజిట్ మ్యాథ్స్‌లో 34 మార్కులే వొచ్చినాయి. ఇంకొగ ఐదు మార్కులు తక్కువ వచ్చుంటే ఫెయిల్ అయ్యే వాడినని కొంచెం భయపడినాను. జనరల్ మాథ్స్ తీసుకొని ఉంటే ఇంకొగ పదైదు ఇరవై మార్కులు పెరిగేవని, ఎట్లో సెకండ్ క్లాస్ వొచ్చిందని వూరటపడినాను. నేనూ బాలన్నా హెడ్మాస్టర్ సార్‌ను ఇంటి దగ్గర కలుసుకుండాం. సార్, ఎల్లుండి ఇద్దరినీ అనంతపురం రామచంద్ర నగర్లో ఉండే మలేరియా డిపార్ట్మెంట్ ఆఫీసుకు రమ్మని చెప్పి, వారం దినాలు ఆఫీసులో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మీరు దానికి సిద్ధపడి రండి అని అన్నాడు.
హెడ్మాస్టర్ సార్ చెప్పినట్లే నేను వొక వారం దినాలు వండుకుని తినడానికి కావలసిన ఉరువులు, దినుసులు వొగ యూరియా బ్యాగులో మూట గట్టుకుండాను. జంఖానమూ రగ్గూ మడత పెట్టి, మధ్యలో కొత్త ట్రౌజర్లూ శ్లాగులూ రెండు డ్రాయర్లూ వొగ టువ్వాలూ అన్నీ పెట్టి జంఖానాన్ని బెడ్ హోల్డర్ మాదిరి చుట్ట చుట్టి పగ్గం తాడుతో గట్టిగా బిగించినాను. చిన్నాయనతో చెప్పి బయలుదేరి అనంతపురం బస్టాండ్ లో దిగి, బాలన్న కోసం చూసినాను. ఎక్కడా కనిపించలేదు. నాకంటే బాలన్నకు కొంచెం టౌన్‌తో పరిచయం ఉంది. బాలన్న వొచ్చిన తర్వాతనే బాడుగ రూము కోసరం వెతికేది మేలని బస్టాండ్ హాల్లో కూర్చుండాను.
మధ్యాహ్నానికంతా బాలన్న వొచ్చినాడు. సోదనపల్లి నుంచి శింగనమలకు లగేజీ మోసుకొని వొచ్చినా, ఆర్పీజీటి బస్సులో సీటు దొరికేది నమ్మకం ఉండదని, మడికట్లల్లో పోతురాజు కాల్వకు వొచ్చి తాడపత్రి-అనంతపురం బస్సు పట్టుకొని రావడం వల్ల ఆలస్యమైందని చెప్పి, బాలన్న నన్ను బస్టాండ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి పిల్చుకొని పోయినాడు. ఆ పెట్రోల్ బంక్ ఎక్స్‌ప్రెస్ మోటార్ సర్వీస్ బస్సు ఓనర్ గోవిందరెడ్డి వాళ్ళదని, గోవిందరెడ్డోళ్లు తనకు బాగా పరిచయమన్నాడు. మా ఇద్దరి లగేజీ అక్కడ పెట్టి, వారం దినాలకు వొగ రూమ్ బాడుగకు కావల్లని పెట్రోల్ బంక్ మేనేజర్ని అడిగినాడు బాలన్న. వారం దినాలకు బాడుగకు రూము ఎవరూ ఇవ్వరని, ఆయన మమ్మల్ని ఎదురుగా ఉన్న విఠల్ బిల్డింగ్ వెనకల ఉండే కొట్టాల దగ్గరికి పిల్చుకొని పోయి, ఎవురినో పిలిచినాడు. వొగ ఆడమనిషి పరిగెత్తుకుంటా వచ్చి, ఏమి కావల్లయ్యా అని అడిగింది. “వీళ్ళు వొగ కొట్టములో వారం దినాలుంటారు ఓబుళమ్మ! ఆఫీసులో ఏదో ట్రైనింగ్ ఉందంట! ఏదైనా శుభ్రంగా ఉండే వొగ కొట్టం ఇవ్వు, ఐదు రూపాయలు ఇస్తారులే” అని ఆజ్ఞాపించినట్ల చెప్పినాడు. ఆమె సరేనయ్యా అని ఒప్పుకొని మాకు ఖాళీగా ఉన్న వొగ కొట్టం చూపించింది. చూసి పర్వాలేదులే అనుకొని లగేజ్ తెచ్చుకుంటామని ఆమెతో చెప్పి, మేనేజర్‌తో కలిసి పెట్రోల్ బంక్ దగ్గరికి పోతా, కాదన్నా, అవి బ్రోతల్ కొట్టాలు కదా, పర్వాలేదా అని బాలన్న అడిగినాడు.
“దాందేముంది? ఆ వెనక వైపు ఉండే కొట్టాల్లో, వాళ్ల వ్యాపారం ఏదో వాళ్ల చేసుకుంటారు. మీకేం భయం? ఏం పర్వాలేదు. ఎదురుగానే నేనుంటాను కదా” అని ధైర్యం చెప్పినాడు మేనేజర్. బ్రోతల్ కొట్టాలంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. లగేజీ తీసుకొని వొస్తా, “బ్రోతల్ కొట్టాలంటే ఏమిటివి బాలన్నా” అని ఆసక్తిగా అడిగినాను. బాలన్న నవ్వుతా, “లంజల కొట్టాలబ్బా” అని చెప్పినాడు. “అవునా? ఎట్ల మరి?” అని కొంచెం వెనకంజ వేసినాన్నేను. “ఏముంది రారా, దా! వాళ్ల పని వాళ్ళది! మన పని మనది!” అని చాలా తేలికగా చెప్పినాడు బాలన్న.
ఇద్దరమూ ఒగ కొట్టంలో చేరినాం. కొట్టం ఇచ్చినామె వొగ ఇనపరేకు బిందె, బకీటు ఇచ్చింది. “ఇంకా ఏమైనా అవసరం ఉంటే అడగండి” అని అదొగ రకంగా చూసి వెళ్ళిపోయింది. మనిషి బాగుంది కానీ, ఏదో వొగ రకంగా కనిపించింది. కొంచెం వయసైన మనిషి! ఎట్లుంటే మనకెందుకులే అనుకొని వంట పనికి పూనుకుండాం.
బాలన్న శింగనమలకు తెచ్చిన కిరోసిన్ స్టౌనే తెచ్చినాడు. చూసి సంతోషమైంది నాకు. ఇద్దరమూ కొట్టాల పక్కనే ఉన్న గుల్జారు పేటలో వొగ అంగట్లో వొగ సీసా నిండా గబ్బునూనే, వొగ సబ్బూ, వొగ అగ్గిపెట్టీ తెచ్చుకొని, అన్నం వండుకొని, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోనుండే చిట్లం పొళ్లతో ఆ పూట భోజనం ముగించుకొని, సాయంకాలం వరకు స్కూల్ విషయాలు అవీ ఇవి మాట్లాడుకుండాం. సాయంకాలం ఇద్దరమూ నడుచుకుంటూ వెళ్లి రామచంద్ర నగర్ లో మలేరియా ఆఫీసును చూసినాం. ఒక ప్రైవేట్ బిల్డింగులో ఉంది ఆఫీస్. ఆ బిల్డింగు దాడి తోట వేణుగోపాల్ రెడ్డిదంట! దానికి ఎదురుగనే వేణుగోపాల్ రెడ్డి ఇల్లు! ఆఫీస్ చూసినాం, రేపొద్దున్నే ఆఫీసు టయానికి సులభంగా రావచ్చునని అనుకుంటా రామచంద్ర నగర్‌ని చూసినాం. మలేరియా ఆఫీస్ దగ్గర నుంచి వొక ఫర్లాంగు వరకే ఊరు! అవతలన్నీ మళ్లే! అక్కడ్నుంచి వెనక్కి వస్తా, ఆర్ట్స్ కాలేజీలో ముందర ఉండే గ్రౌండ్లో బస్టాండుకు వెనక, ఉత్తరం వైపున పెంకుల కప్పుతో భద్రంగా కట్టిన పోలీస్ ఆసుపత్రినీ దాని పక్కనే ఉన్న శవపరీక్ష కేంద్రాన్నీ చూసుకుంటా తాలూకా ఆఫీసు వైపు పోయినాం. ఆఫీస్ కాంపౌండ్ గోడకు ఇవతల, రోడ్డు వారన జట్కాబండ్లన్నీ ఉండాయి. బండ్ల కింద వేలాడగట్టిన సంచిపట్టలోని పచ్చి గరికగడ్డినీ పచ్చి జొన్నసొప్పనూ పిడికెడు పిడికెడు తీసి జట్కావాలాలు, గుర్రాలకు తినిపిస్తా, జట్కా కావల్లా సార్ అని రోడ్డు వెంట పోయే మనుషుల్ని అడుగుతా ఉండారు.
జిల్లా కోర్టును చూడల్లని మేము కోర్టు రోడ్డు వైపు పోతావుండాం. వొగ బిల్డింగును చూపి, ఇది పైడి లక్ష్మయ్య మాజీ ఎంపీ వాళ్ళ ఇల్లు అని చెప్పుతా, ఇంకా కొంచెం ముందుకు పోయినంక ఎడమవైపున పడమటి ముఖంగా ఉండే వొగ బంగ్లాని చూపి, ఇది ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వేమారెడ్డి వాళ్ల బిల్డింగ్ అని, దాని వెనకల, గుల్జార్ పేటకు పోయే వీధిలోని ఒక బిల్డింగును చూపి, ఇది మాజీ ఎమ్మెల్యే తరిమెల రామచంద్రారెడ్డి వాళ్ల బంగ్లా అని చెప్పుతా ఉంటే బాలన్నకి అనంతపురం బాగా తెలిసినట్టుందని అనుకుంటా నడుస్తా ఉండాను. అంతలోనే కోర్టు కాంపౌండ్ వచ్చింది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
