“కొత్త అక్షరాలమై…” డా. శాంతినారాయణ గారి మూడవ కవితాసంపుటి. 1988 నుంచి 2016 వరకూ వ్రాసిన 31 కవితలు ఇందులో ఉన్నాయి.
***
“కవిత్వం ఆయనకు వినోదం కాదు, వేడుక అంతకన్నా కాదు. ప్రాణ భూతమయిన ఒక చర్య, సామాజిక బాధ్యత. ముప్పై యేళ్ళలో వచ్చిన, ఈ ముప్పయి కవితలు మూడు దశాబ్దాల చరిత్రకు రుజువులు-సాక్షాలు. తెలుగు నేలమీద జరుగుతున్న, జరిగిన అనేక ఘటనలకి ప్రతిబింబాలు. తన క్రోధాన్ని వెలిగక్కే వేళలో తనని తాను సంబాళించుకోవటం – అదుపులో పెట్టుకోవటం – దాన్ని కవితగా వెలిగక్కటం అనే ఒక సంయమనం పాటించారు” అన్నారు కె. శివారెడ్డి తమ ముందుమాటలో.
“శాంతినారాయణ కవిత్వంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక కోణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. శాంతినారాయణ మరో ప్రపంచ స్వాప్నికుడు. కులం, మతం, వర్గం లేని వ్యవస్థ ఆయన స్వప్నం. ఆ వ్యవస్థ ఏర్పడడానికి అడ్డుపడుతున్న సకల సామాజికాంశాలను శాంతినారాయణ ముసుగు లేని భాషతో ఎండగట్టాడు” అని వ్యాఖ్యానించారు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తన ముందుమాట “రెండు దశాబ్దాల నడుమ”లో.
“శాంతి నారాయణ కవిత్వం చదువుతుంటే చిన్న చిన్న విషయాలనుంచి పెద్ద పెద్ద సామాజిక దురాగతాలకి ఆయన స్పందించిన తీరు స్పష్టమవుతుంది. మనకెందుకులే అని పక్కకు తప్పుకోకుండా “మనకి కాక ఇంకెవరికి’ అనే చైతన్య వంతమయిన మానవుని ఆత్మమథనం కనబడుతుంది. లోపల హృదయంలోని పోటు, మానసిక ఉక్కపోత, ఈయన్ని కవిత్వంలోకి నెట్టిన అనుభూతి పాఠకులకు అందుతుంది” అన్నారు జి. లక్ష్మీ నరసయ్య “కొత్త అక్షరాలలోకి స్వాగతిస్తు…” అనే తమ ముందుమాటలో.
“ఈ నా అక్షరాలను చదవడానికి ముందు, ఒకసారి లాటిన్ అమెరికా చిలీ దేశపు కవి ‘నికోనార్ పారా’, ఆయన అనుయాయులు నడిపిన ‘అకవిత్వ ఉద్యమం’, అది ఆ దేశ సమాజాన్ని నడిపిస్తున్న తీరు ఎంత గొప్పదో గమనించమని కోరుతున్నాను. రెండుసార్లు నోబెల్ బహుమతి కోసం అర్హుడుగా పరిశీలించబడిన 106 సంవత్సరాల నికోనార్ పారా కవి, నేటికీ తన నిరలంకృత ‘అకవిత్వ’ రీతులతో సామాన్య ప్రజల సర్వసాధారణ సమస్యల్ని ఎంత బలంగా చిత్రిస్తున్నాడో ఆ సమాజాన్నీ ప్రభుత్వాలనూ ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో చూడమని అభ్యర్థిస్తున్నాను. ఆ ‘అకవిత్వ’ రూపురేఖల్ని చూస్తారని ఆశిస్తున్నాను. ఆ ఆశతోనే నా అక్షరాల్ని ఇలా నిరలంకృతంగా పేర్చానని విన్నవించుకుంటున్నాను” అని “రచయితగా నా మాటలు కొన్ని…”లో చెప్పారు డా. శాంతినారాయణ.
కొత్త అక్షరాలమై… రచన: డా. శాంతినారాయణ ప్రచురణ: విమలాశాంతి ప్రచురణలు పుటలు: 158, వెల: రూ. 150/- ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, ప్రచురణ కర్తల వద్ద విమలాశాంతి ప్రచురణలు, 202, ఎస్, ఎస్. అపార్ట్మెంట్స్, మారుతీనగర్, అనంతపురం–01, ఫోన్: 9916671962
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™