Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-1

[ శరన్నవ రాత్రుల సందర్భంగా  శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే ప్రత్యేక  వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

నా జాతి పూర్వ ప్రథా జీవరహితమై
శక్తినాడుల యందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజో మహశ్చ్యుతిని
బ్రహ్మక్షత్ర తేజంబు మంట గలిపి
నా మాతృభాష నానా దుష్ట భాషల
ఔద్ధత్యమును తల నవధరించి
నా తల్లి నేల నేనాటి వాచారముల్
పై మెఱంగుల చూచి బ్రమసిపోయి

ఏమి మిగిలినదీనాటి కిట్లు పొంగు
లొలయు వర్షానదీ గభీరోదకముల
దైన్యగర్భ చారిత్రముల్ దక్క భిన్న
గిరిశిఖర దుర్గ పరిదీన గీతిదక్క
(ఆంధ్ర ప్రశస్తి, విశ్వనాథ సత్యనారాయణ).

వందల ఏండ్లు బానిస తనంలో మగ్గి, స్వీయ నాగరికతను నేల గరచేట్లు అణచివేసే హేతు రాహిత్యం వల్ల, వ్యక్తిత్వం కోల్పోయిన మన దేశంలో.. అంతర్లీనంగా ఉన్న ఆత్మతో బంధం తెంచడానికి ఒక బృహత్ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో సుమారు వందేండ్ల క్రితం వచ్చిన పద్యమిది. ఒక విధంగా చూస్తే.. ఈ నాటికీ ఈ పద్యం మన సమాజానికి పూర్తిగా వర్తిస్తుంది. ఇందుకు కారణాలు అన్వేషిస్తే.. కొద్ది కాలం వెనుకకు తిరిగి చూడాలి.

స్వాతంత్ర్యం రావడానికి ముందు దాదాపు 800 ఏండ్లు గడచిన బానిస జీవనం.. సామాజిక జీవనంలో, రాజకీయ, మత, కళా, సాంస్కృతిక రంగాలలో పతన మార్గంలో ప్రయాణించింది. జాతీయోద్యమంలో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమంలో హిందూ ముస్లిం సమైక్యత వంటి అంశాలు జాతిని సమగ్రమైనదిగా నిర్మించాలనే ప్రాతిపదికకు పునాదులు వేశాయి. కానీ ఆ ప్రాతిపదిక తరువాతి కాలంలో పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. ఆ భావన మరో రూపంలో ఆవిష్కారమైంది.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ద్విజాతి సిద్ధాంతం ప్రబలిపోయింది. జాతిపితను రంగం నుంచి తొలగించేశారు. ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం ఒక విచిత్రమైన విదేశీ సైద్ధాంతిక భూమికపై, దేశీయమైన ఆలోచనలు లేని, దేశీయమైన వాస్తవ పరిస్థితులకు సుదూరంగా.. ముక్కలు చెక్కలైన భారతదేశంలోని బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకొని భారతీయ ఆత్మను కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ సంస్కృతిపైన దీర్ఘకాలిక, నిరంతర దాడికి ఒక బృహత్ప్రణాళిక రచించారు. ఇందుకు వారికి ఆధార భూమికలు చాలానే లభించాయి. ముఖ్యంగా ఆంగ్ల చరిత్రకారులు భారతీయ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రాజ వంశాల కాలక్రమాన్ని నిర్వచించిన వాటిని వ్యవస్థీకృతంగా మార్చే యత్నం విజయవంతంగా చేశారు. అధికార రాజకీయ ప్రాధమ్యాలు కూడా ద్విజాతి సిద్ధాంత పునాదులపై కొనసాగుతుండటం వల్ల ఈ ప్రయత్నాలకు అడ్డు లేకుండా పోయింది.

పరాజితులు విజేతలను వేష భాషల్లోనే కాక, జీవన విధానంలోనూ, సంస్కృతిలోనూ అనుకరిస్తారన్న నానుడిని, స్వతంత్ర భారతదేశంలో రాజకీయ వ్యవస్థలు, కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక విధంగా రుజువు చేశాయి. పాశ్చాత్యులు భారతీయ చరిత్రపై, నాగరికతపై చేసిన వ్యాఖ్యానాలకు కమ్యూనిస్టు ఉద్యమం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా భారతీయ సమాజంపై మార్క్స్ చేసిన వ్యాఖ్యానం కమ్యూనిస్టు ఉద్యమానికి భారతదేశంలో ఒక అజెండాను సుప్రతిష్ఠితం చేసింది. “We must not forget that this undignified stagnatory. And vegetative life, that this passive sort of existence evoked on the other part, in contradistinction, wild, aimless, unbounded forces of destruction and rendered murder itself a religious rite in hindostan. We must not forget that these little communities were contaminated by distinctions of caste and slavery, that the subjugated man to external circumstances instead of elevating man the sovereign of circumstances that they transformed a self developing social state into never changing natural destiny, and thus brought about a brutalizing worship of nature, exhibiting its degradation in the fact that man, the sovereign of nature, fell down on his knees in adoration of hanuman, the monkey, and sabbala, the cow.. England it is true, in causing social revolution in hindostan, was actuated only by the vilest and was stupid in her manner of enforcing them (“The British Rule in India” by Karl Marx published in the New-York Herald Tribune on June 25, 1853).

వాస్తవానికి కార్ల్ మార్క్స్ ఎన్నడూ కూడా భారతదేశాన్ని కన్నెత్తి కూడా చూడలేదు. ఈ గడ్డపై కాలు మోపలేదు. కానీ.. తనదైన వ్యాఖ్యానాలు చేసేశారు. ఇక విస్సన్న చెప్పింది వేదం అన్నట్టుగానే కమ్యూనిస్టులకు మార్క్స్ మార్గం నిశ్చయంగా అనుసరణీయమైపోయింది. పైపై పొరల్లో మానవహక్కులు, సమాజంలోని ఆర్థిక అంతరాలపై పోరాటం చేస్తున్నట్టు కనిపించినప్పటికీ, దేశీయమైన ఆలోచనలను, ధర్మాన్ని, సంస్కృతిపైనే తీవ్రమైన దాడిని కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పటికీ కూడా అదే అజెండాతో ముందుకు సాగుతున్నది.

చరిత్ర రచన అంటే, పురావస్తు పరిశోధన అంటే విదేశీయులు తమకు తెలిసిన కొంచెపు తెలివి మేరకు.. విదేశీ ప్రవక్త ప్రకటించిన భూ ప్రళయ తేదీ ప్రకారం కొలమానాలు ఏర్పరుచుకున్నారు. వారు రచించిన చరిత్రను పట్టుకొని ఆ చరిత్రకే కొంత మేకప్ వేసి చరిత్రకారులుగా ప్రమోట్ అయిన వారి పుస్తకాలను దాదాపు పది తరాల పాటు ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం మొదలు పెట్టారు.

రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలు.. భారతీయ సమాజం, నాగరికతల చరిత్రను తెలిపే గ్రంథాలు. మన దేశానికి సంబంధించిన చరిత్ర అంతా వీటిలోనే నిక్షిప్తమై ఉన్నది. అనేక వేల సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. 18వ శతాబ్దం వరకు ఈ విషయంలో భేదాభిప్రాయాలు లేవు. ముస్లింల పరిపాలనలోనూ వీటి విషయంలో భిన్నాభిప్రాయాలు రాలేదు. వీటిని అందరూ అంగీకరించారు. రాజులు, పరిపాలకులు రోజూ కొంత సమయాన్ని చరిత్రను చదవడానికి కేటాయించేవారు. పరిశోధకులు కూడా అధ్యయనం చేసేవారు. వారికి ఏవైనా అనుమానాలు వచ్చినా ఈ ఇతిహాసాలు, పురాణాలలోకి వెళ్లి సమాధానాన్ని వెతుక్కొనేవారు. వేద వాఙ్మయంతో పాటు చరిత్ర అధ్యయనం అన్నది మన విద్యావిధానంలో అంతర్భాగంగా ఉండేది. కానీ బ్రిటిష్ రాజ్యం వచ్చిన తరువాత చరిత్ర అన్నది కుంచించుకుపోయింది. ఆధునిక భారత సమాజంలో ఈ చరిత్ర గ్రంథాలకు స్థానం లేకుండా పోయింది. గత ఏడున్నర దశాబ్దాలలో ఈ గ్రంథాలు ఏ పాఠ్యాంశాలలో కూడా చోటు చేసుకోకుండా, వివిధ సాంస్కృతిక, చారిత్రక, సామాజిక సంస్థలను తన చేతుల్లో బంధించి పెట్టుకున్న కమ్యూనిస్టు ఉద్యమం చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకొని తన అజెండాను అమలు చేసింది.

చరిత్ర కాలాన్ని కుంచింపజేయడం వేరు. చరిత్రను ఏమార్చే ప్రయత్నం వేరు. బ్రిటిష్ వాళ్ల కంటే కూడా కమ్యూనిస్టు ఉద్యమం.. దాని నుంచి పాయలు పాయలుగా విస్తరించిన అనేక వ్యవస్థల దశకంఠ రూపం, ఒక నిర్దిష్టమైన అజెండా ప్రకారం భారతీయ చరిత్రను ఏమార్చే ప్రయత్నం చేసింది. ఒక సెలెక్టివ్ ఐడియాలజీని పంప్ చేసేందుకు విజయవంతమైన కృషి జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి

  1. భారతీయ చరిత్రను చరిత్రగా అంగీకరించకపోవడం.
  2. ఇతిహాసాలను కూడా పురాణాలుగా, పుక్కిటి పురాణాలుగా సిద్ధాంతీకరించడం.
  3. ఒకానొక కాలంలో.. ఒకానొక సందర్భంలో జరిగిన కొన్ని ఘటనలను, అమలైన అంశాలను మొత్తం భారతీయ ధర్మానికి అంటగట్టి బురద కుమ్మరించడం.
  4. పరిమిత కాలానికి సంబంధించి ఒకానొక సమాజంలో అమలులో ఉన్న అవకరాలను మొత్తం నాగరికతకు ఆపాదించి ప్రతికూల భావనలను విస్తృతంగా కొత్త తరాల్లోకి ఇంజెక్ట్ చేయడం.
  5. చరిత్రలో సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహా పురుషులను చిన్న చేసి చూపించడం, వారిని వ్యక్తిత్వం లేని వారిగా చిత్రించడం.. దుర్మార్గులుగా, చోరులుగా, జారులుగా ప్రచారం చేయడం
  6. భారతీయ చరిత్రలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో.. చెడు వర్తన కలిగిన వారు ఉన్నారో.. సమాజానికి ద్రోహం చేసిన వారు ఉన్నారో వారందరినీ మంచివాళ్లుగా, ఉత్తములుగా వ్యాఖ్యానించడం. వారి కార్యకలాపాలను చాలా తేలికగా తీసిపారేయదగినదిగా పేర్కొనడం.
  7. మొట్టమొదటగా ప్రాచీన సాహిత్యాన్ని సమకాలీన సమాజానికి దూరం చేయడం. ఆ భాషను మృతభాషగా ముద్రవేయడం, ఆ పదాలను గ్రాంథికాలుగా నిర్వచించడం, ప్రజల భాష, వ్యవహార భాష పేరుతో కొన్ని తరాలను ప్రాచీన సాహిత్యానికి, అందులోని భాషకు దూరం చేయడం.
  8. ఈ అజెండాను వ్యాప్తం చేయడం కోసం విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను, సాంస్కృతిక వేదికలను, అనేకానేక కళారూపాలను ఎఫెక్టివ్‌గా వాడుకోవడం.
  9. భారతదేశంలోని మత సమాజాలను ఏనాటికి కూడా ఇంటిగ్రేట్ కాకుండా చేయడం కోసం ప్రణాళికగా బద్ధంగా ముందుకు పోవడం
  10. దీనికి అనుకూలంగా సాహిత్యాన్ని సృజించడం, ఆ సాహిత్యాన్ని మాత్రమే చదివేట్టుగా చేయడం.. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. బుర్రల్లో తాము చెప్పింది తప్ప మరేదీ ఉండకుండా వాష్ చేసేయడం.

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రధానంగా చేసింది ఇదే. కార్మికుల హక్కుల కోసం, పేద ప్రజల భూహక్కుల కోసం, వారి భుక్తి కోసం, ఆర్థిక అంతరాల విముక్తి కోసం కమ్యూనిస్టు ఉద్యమం చేసిన కృషి స్వల్పమేనని చెప్పాలి. అంతకుమించి ధార్మిక రాజకీయమే ఎక్కువగా చేసిందని చెప్పవచ్చు.

ఇతిహాస పురాణాలు మన సంస్కృతికి దీపస్తంభాల లాంటివి. కానీ, ఈ పరిణామాల వల్ల ఈ అజెండా అమలు వల్ల అనేక తరాలు వీటిని అనుకూల ముఖంగా కాకుండా వ్యతిరేక ముఖంగా చూడటం.. వ్యాఖ్యానించడం జరుగుతూ వస్తున్నది. ఆర్య ద్రావిడ విభేదాలు, అగ్ర, నిమ్న వర్గాలు వంటివి, సతీ సహగమనం వంటివి ఏవీ కూడా భారతీయ ధర్మంలో ఎక్కడా కనిపించవు. ఎక్కడో ఒక చోట కొన్ని మూఢమైన ఆచారాలు కనిపిస్తాయే తప్ప, భారతీయ శాశ్వతమైన నాగరికతలో మనకు కనిపించేదల్లా ధర్మము, అధర్మము.. మంచి, చెడు.. దైవీ భావన, అసుర భావన.. ఇంతే. మనం ఎంత వెనకకు వెళ్లి చూసినా.. 5 వేల ఏండ్ల భారత కాలం నాటికి వెళ్లి చూసినా, అంతకు ముందు మరో రెండు వేల ఏండ్ల నాటి రామాయణ కాలం నాటికి వెళ్లి చూసినా ఈ విభేదాలు ఎంత మాత్రం కనిపించవు. ఆనాటి వ్యక్తులకు, వ్యవస్థలకు లేని వికారాలను ఆపాదించి ఈ విభేదాల సృష్టి జరిగింది. ప్రధానంగా 20వ శతాబ్దంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అని చెప్పవచ్చు. ఇతిహాసాలను, చరిత్రను ఆనాటి కొలమానాలను బట్టి వ్యాఖ్యానించకుండా ప్రస్తుత కొలమానాలతో కొలిచి చూసి, భారతీయ నాగరికతనే చిన్నచేసే ఒకానొక ప్రయత్నం చాలా తీవ్రంగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది.

ఇందులో భాగంగానే రామాయణంలో రావణ, మేఘనాథుల పాత్రలైనా, భారతంలో దుర్యోధన కర్ణులైనా, భాగవతంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులైనా సరే.. అందరినీ గొప్పవారిగా, మహానుభావులుగా, రాజ్యాలను సమర్థంగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొన్న వారిగా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అదే సమయంలో రాముడు, కృష్ణుడు దుష్ట వర్తన ఉన్నవారిగా, దుర్మార్గాలు చేసిన వారిగా వ్యాఖ్యానించడం ఇవాళ్టికి కూడా జరుగుతున్నది. రామాయణంలో రావణుడి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించి విశ్లేషణ చేశారు. రామాయణానికి సరికొత్త భాష్యం చెప్పుకుంటూ వచ్చారు. రావణుడు భారతీయ జాతి చైతన్యంలో ఉండేటువంటి ఉజ్జ్వల పార్శ్వానికి వ్యతిరేక ముఖంగా నడచినవాడు. అతను ఎంత తపస్సు చేసినా, ఎంత శక్తి ఉన్నా, అతనిలోని ఈ వ్యతిరేక పార్శ్వం జాతి ఉన్నతికి అవరోధంగా మారినది.

మనకు పురాణాల్లో రాక్షసులందరూ తపస్సు చేసిన వారే. వాళ్ల తపస్సు కానీ, శక్తి కానీ, లోక క్షేమం కోసం చేసింది కాదు. ఉపయోగించింది కాదు. స్వీయ అహంకారం తృప్తి పరుచుకోవడం కోసం, మృత్యువు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడమే జరిగింది. మన గొప్ప గొప్ప సైంటిస్టులు తాము పరిశోధించి కనుగొన్నవాటిని జాతి క్షేమం కోసం కాకుండా వినాశనానికి వినియోగించడం చూస్తుంటాం. చివరకు వాటివల్లనే వారు నాశనమవడాన్ని కూడా మనం చూస్తుంటాం. సరిగ్గా రావణాది రాక్షసులు ఇలాంటి వారే. తాము తపస్సు చేసి ఏవైతే సాధించారో.. వాటి వల్లనే వారు నాశనమైపోయారు. మరో కోణంలో విశ్వామిత్ర, వశిష్ఠుడి లాంటి అనేక మంది మహర్షులు చేసిన తపస్సు వెనుక లోక కల్యాణ కాంక్ష కనిపిస్తుంది. జాతి మీద ఉండే సమష్టి ప్రేమ ఉన్నది. జాతిని ఆపదను తొలగించేవారిని ప్రోత్సహించి సహకరించి జాతిని సంరక్షించే బాధ్యతను వారి చేత చేయించే లక్షణం ఉన్నది. ఈ దృష్టి కోణంలో మన ఇతిహాసాలను అధ్యయనం చేయాల్సినవారు, వ్యాఖ్యానించాల్సినవారు.. వాటన్నింటినీ పక్కన పెట్టి, దుర్వ్యాఖ్యానాలు చేయడం ద్వారా మన ఇతిహాసాల్లోని మంచి చెడుగా, చెడు మంచిగా కనిపించడం ప్రారంభమైంది. ఒకే దేశంలో భిన్న ప్రాంతాల మధ్య అతికించినా అతకని స్థాయిలో విభేదాలు పెరిగిపోయాయి. నిజానికి అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 108 దివ్య దేశాలు విస్తరించి ఉన్న ఈ దేశంలో ఏ ప్రాంతం పవిత్రం కాదని అనగలరు? ఏ ప్రాంతం ఉన్నతమైనది కాదని అనగలరు? ఏ ప్రాంతం ఆధ్యాత్మిక భావభూమికలు లేనిదని చెప్పగలరు? ఏ ప్రాంత ప్రజలను తక్కువ చేసి చూపగలరు? ఏ సంస్కృతిని చిన్న చేసి చూపగలరు? ఈ వ్యాస పరంపర రామాయణంలోని రావణుడి గురించి. రావణుడికి సంబంధించి నిరంతరంగా చేస్తూ వస్తున్న వ్యాఖ్యానాలను, నిర్ధారించిన అంశాలను ఒకసారి స్పృశించి వాస్తవంగా రావణుడి వ్యక్తిత్వం ఏమిటి? రామాయణ మూలాన్ని రచించిన మహర్షి వాల్మీకి చూపించిన రావణుడి గురించి విశ్లేషణ చేయడం..

(ఇంకా ఉంది)

Exit mobile version