Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-11

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

 

11

రావణుడు మహానుభావుడు, నీతి తప్పనివాడు, చాలా గొప్పవాడు, మహాపండితుడని ఒకానొక దృక్పథ చరిత్రకారులు రాసుకుంటూ వచ్చారు కదా.. కానీ ఇంత గొప్పవాడు లంకను ఎట్లా కబ్జా పెట్టాడు? ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో పుట్టినవాడు.. లంక దాకా ఎందుకు వెళ్లాడు? ఈ ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఉత్తరకాండలో ఈ లంక కథ వివరంగానే మనకు కనిపిస్తుంది. రావణుడు లంకను ఆక్రమించడానికి ముందు వాళ్ల తాత సుమాలి గురించి కొంత తెలుసుకోవాలి.

ఉత్తరకాండ నాలుగో సర్గలో రావణుడి అమ్మ తరఫు వంశ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాలుగో సర్గలోని 8 నుంచి 16వ శ్లోకాలలో యక్షులు, అసురుల జన్మ వృత్తాంతం ఉంది. వీరిలో హేతి ప్రహేతులనే సోదరులు కూడా ఉన్నారు. వీరిలో మొదటివాడైన హేతి.. భయ అనే కన్యను పెండ్లి చేసుకున్నాడు. అతడికి విద్యుత్కేశుడనే కొడుకు పుట్టాడు. అతడికి సంధ్య అనే అమ్మాయితో పెండ్లి జరిగింది. ఆమెకు సుకేశుడనే కొడుకు పుట్టాడు. ఈ సుకేశుడు దేవవతి అనే కన్యను పెండ్లి చేసుకొని.. మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు కొడుకులను కన్నాడు. వీరిలో సుమాలి అనే అసురుడు ఈ రావణుడికి మాతామహుడు. అంటే తల్లికి తండ్రి అన్నమాట. ఈ ముగ్గురు అన్నదమ్ములు రెచ్చిపోయి కనపడిన చోటల్లా బీభత్సం సృష్టించారు. కనపడిన వారిని కనపడినట్టుగా చిత్రహింసలు పెట్టారు. అదే ఉత్సాహంతో ఈ ముగ్గురు అన్నదమ్ములు అప్పటి బెస్ట్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ దగ్గరకు వెళ్లి మాకు హిమాలయ పర్వతాల మీద కానీ, మేరు పర్వతం మీద కానీ, మందర పర్వతం మీద కానీ ఒక ఇల్లు లేదా విల్లా కట్టి ఇవ్వాలని కోరారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే.. ముగ్గురు రాక్షస సోదరులు ఇల్లు కావాలని అడిగిన మూడు పర్వతాలు ఉత్తర భారతంలోనే ఉన్నాయి. అప్పటికి వారంతా కూడా ఉత్తర భారత దేశానికి సంబంధించిన వారే. వారెవరూ కూడా ఉత్తర భారతేతరులు కారన్నది స్పష్టం.

ముగ్గురు అన్నదమ్ముల కోరికపై విశ్వకర్మ వాళ్లకు లంకా నగరాన్ని చూపించాడు.. ‘రాక్షస ప్రభువులారా, దక్షిణ సముద్ర తీరమునందు త్రికూటము, సువేలము అను రెండు పర్వతములు ఉన్నవి. దేవేంద్రుడు ఆజ్ఞాపింపగా నేను నల్లని మేఘములతో సమానమైన టంకముల చేత నాలుగు వైపులా చెక్కబడిన ఆ త్రికూట పర్వతము శిఖరముమీద ముప్ఫై యోజనాల వెడల్పు, నూరు యోజనాల పొడవు ఉన్న లంకాపురమును నిర్మించి ఉంటిని. దాని చుట్టూ బంగారు ప్రాకారము ఉన్నది. దాని ముఖ ద్వారములు బంగారముతో నిర్మింపబడినవి. రాక్షస శ్రేష్ఠులారా, మీరు ఆ నగరములో, అమరావతిని పొంది ఇంద్రాది దేవతల వలె ఎదిరింప శక్యము కాని వారై నివసించండి. లంకాదుర్గము చేరి అనేక రాక్షసులతో కూడిన మిమ్ములను శత్రువులెవ్వరూ ఎదిరించజాలరు.’ అని చెప్పెను’’ (ఉత్తరకాండ, ఆరవ సర్గ 21-27). అట్లా రావణుడి మాతామహుడైన సుమాలి తన అన్నదమ్ములతో కలిసి లంకకు షిఫ్ట్ అయ్యాడు. ఈ నగరం కూడా వాళ్లు కట్టుకొన్నది ఏమీ కాదు. ఫ్రీగా వచ్చిందే.

ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా నర్మద అనే గంధర్వ స్త్రీకి పుట్టిన హ్రీదేవి, శ్రీదేవి, కీర్తిదేవి అనే ముగ్గురిని పెండ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఈ ముగ్గురిలో మొదటివాడు అయిన మాల్యవంతుడు సుందరి అనే మహిళను, కేతుమతిని సుమాలి, వసుధను మాలి పెండ్లి చేసుకున్నాడు. మాల్యవంతుడికి విరూపాక్షుడు, దుర్ముఖుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోవుడు అనే కుమారులు, అనల అనే కూతురు పుట్టారు. ఇక సుమాలికి ప్రహస్తుడు, అకంపనుడు, కాలికాముఖుడు, ధూమ్రాక్షుడు, దంతుడు, సుపార్శ్వుడు, సంహాద్రి, ప్రఘనుడు, భాస కర్ణుడు అనే కొడుకులు, రాక, పుష్పోత్కట, కైకసి, కుంభీనసి అనే కూతుర్లు పుట్టారు. ఇక మాలికి అనలుడు, అనిలుడు, హరుడు, సంపాతి అనే కుమారులు పుట్టారు. (ఉత్తరకాండ ఆరో సర్గలోని 28 నుంచి 43 శ్లోకాలు). వీరిలో సుమాలి కూతురు కైకసి కుమారుడే రావణుడు. మిగిలిన వారంతా కూడా కూడా మనకు యుద్ధకాండలో రావణుడితో పాటు యుద్ధంలో పాల్గొన్నవారే. రావణుడి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వారే.

ప్రహస్తుడు రావణుడి సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ రాక్షసులందరూ అయాచితంగా సంక్రమించిన సంపదతో విచ్చలవిడిగా ప్రవర్తించారు. క్రిమినల్ మైండ్‌సెట్‌తో చేయకూడని నేరాలన్నీ కూడా చేస్తూ వెళ్లారు. దీంతో వాళ్లను నియంత్రించాలని, నిర్మూలించాలని దేవాదులు శివుడిని, విష్ణువును కోరారు.  విష్ణువు అన్ని ఆయుధాలు పట్టుకొని రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఇదంతా వాల్మీకి రాశాడని మనం చెప్పుకుంటున్న ఉత్తర రామాయణంలో మాత్రమే ఉన్నది. ఆరు కాండలున్న పూర్వ రామాయణంలో ఇదేదీ లేదని గమనించాలి.

ఇక ఈ రాక్షసులను మనం సినిమాల్లో చూసినట్టు.. విష్ణువు సింపుల్‌గా సుదర్శన చక్రాన్ని వదిలి ఒక్క సెకన్‌లో చంపేయలేదు. రాక్షసులతో పెద్ద యుద్ధాన్నే చేశాడు. ఉత్తరకాండ ఆరో సర్గ లోని 1 నుంచి ఆరు శ్లోకాలు చదవండి.. ‘రాక్షసులనే మేఘములు గర్జించుచు మేఘములు పర్వతము మీద వర్షించినట్టు నారాయణుడనే పర్వతము మీద బాణవర్షము కురిపించిరి. నల్లని రాక్షసులందరూ చుట్టుముట్టగా నల్లగా శుభ్రముగా ఉన్న విష్ణుడు వర్షించుచున్న మేఘముల చేత కప్పబడిన అంజనగిరివలె ఉండెను. రాక్షసుల ధనుస్సుల నుండి బయలుదేరి వజ్ర, వాయు, మనస్సుల వేగము వంటి వేగముతో వచ్చిన బాణములు మిడతలు పంటచేనును వలె, దోమలు అగ్నిని వలె, ఈగలు అమృత కలశమును వలె, ప్రళయకాలమునందు లోకములు వలె విష్ణువు శరీరములో ప్రవేశించినవి. రథముల నెక్కివచ్చిన రథికులు, గజములనెక్కి వచ్చిన గజారూఢులు, అశ్వములనెక్కి వచ్చిన అశ్వికులు, ఆకాశము మీద నీలిచిన కాలి బంట్లు, పర్వతముల వంటి రాక్షస శ్రేష్ఠులు బాణముల చేతను రుష్టులచేతను తోమరముల చేతను విష్ణుమూర్తిని ఊపిరి సలపకుండా చేసిరి’. ఈ యుద్ధ వర్ణన దాదాపు రెండు సర్గలు.. 80 శ్లోకాలలో విస్తరించింది. భీకరమైన యుద్ధంలో విష్ణువు రాక్షసులను ఓడించి రసాతలానికి తరిమికొట్టారు. ఆ తరువాత భూమి మీద చాలాకాలం పాటు రాక్షసుల సమస్య లేకుండా పోయింది. ఆ తరువాత చాలా కాలం పాటు లంక ఖాళీగా పడి ఉంది. ఆ నగరంలో ఉండేందుకు తన కొడుకైన కుబేరుడికి అతని తండ్రి విశ్రవసుడు అనుమతించాడు. ఆయన అనుమతితోనే కుబేరుడు అక్కడికి వెళ్లి నివసించాడు.రావణుడు పుట్టిన తరువాత కథలో ట్విస్ట్ మొదలైంది.

లంక నుంచి తండ్రి దగ్గరకు పుష్పకం మీద వెళ్తున్న కుబేరుడిని మార్గమధ్యంలో రావణుడి తల్లి కైకసి చూసింది. కొడుకును పిలిచి.. మీ అన్న లాగా తయారు కావాలని హితవు చెప్పింది. అప్పటికి రావణుడికి ఆ పేరు రాలేదు. దశగ్రీవుడనే పేరే ఉన్నది. ఆ పేరూ ఎలా వచ్చిందో తరువాతి వ్యాసాల్లో చెప్పుకుందాం. తల్లి మాట విన్న కొడుకు తపస్సు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. దశగ్రీవుడు అలియాస్.. రావణుడికి వరాలు వచ్చాయన్న వార్త వినీవినంగనే.. తాత సుమాలి రసాతలం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. మనవడి వరాల ధైర్యంతో.. తాము విడిచిపెట్టి వెళ్లిన లంకను మళ్లీ స్వాధీనం చేసుకోవాలని రెచ్చగొట్టాడు.

‘గతంలో మేం ఉన్న నగరమది. ఇప్పుడు నీ అన్న ఉంటున్నాడు. వాడిని ఎలాగైనా వెళ్లగొట్టు. నువ్వు లంకకు అధిపతివి అవుతావు’. అని అన్నాడు. మొదట రావణుడు కొంత తటపటాయించాడు. కుబేరుడు తన అన్న కాబట్టి అన్నను వెళ్లగొట్టడం ఏమిటని కొంత ఆలోచించాడు. కానీ.. తాత కంటిన్యూగా కొన్ని రోజుల పాటు అతడి బ్రెయిన్ వాష్ చేయడంతో ఇక సరేనన్నాడు. వెంటనే తన మామ వరుస అయిన ప్రహస్తుడిని అన్న దగ్గరకు పంపించాడు. ఇక్కడ జాగ్రత్తగా చదవండి.. ఇది ఉత్తరకాండలోని 11వ సర్గలోని విషయం. ప్రహస్తుడు కుబేరుడి దగ్గరకు వచ్చాడు. “నీ సోదరుడైన దశగ్రీవుడు నన్ను నీ వద్దకు పంపినాడు. దశాననుని ఆజ్ఞచేత నేను చెప్పుచున్న వాక్యము వినుము. పూర్వము రమ్యమైన ఈ లంకానగరమును భయంకరమైన పరాక్రమము గల సుమాలి మొదలైన రాక్షసులు ముందుగా అనుభవించినారు. అందువలననే నాయనా కుబేరా! సామము చేత యాచించుచున్న దశగ్రీవునకు ఈ నగరమును ఇచ్చివేయుము. ఇప్పుడు నేను ఈ విషయమునే నీకు తెలుపుచున్నాను”. (25 -29 శ్లోకాలు).

దీనికి కుబేరుడు చెప్పిన జవాబును కూడా చదవండి “ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నాకు నా తండ్రి ఇచ్చినాడు. దీనిని నేను ప్రజలకు తగు దాన గౌరవాదులు చేయడం ద్వారా నివాస యోగ్యము చేసితిని. నీవు వెళ్లి దశగ్రీవునితో చెప్పుము. ‘ఓ మహాబాహూ! ఈ పట్టణము, నా ఈ రాజ్యము నీకు కూడా సంబంధించినవే. ఏ బాధలూ లేని రాజ్యమును అనుభవింపుము. నా రాజ్యము, ధనమూ కూడా నీతో పంచుకొనవలసిన పనిలేదు. ఇవి మనమిద్దరము కలిసి అనుభవించవలసినవి’” (30..33).

ఇక్కడ కుబేరుడు రావణుడిని నిందించలేదు. సోదరుడిగా సాదరంగా చూశాడు. గౌరవించాడు. కలిసి ఉందామని ప్రపోజల్ చేశాడు. జరిగిన ఇదే విషయాన్ని తమ తండ్రి విశ్రవసుడికి కూడా చెప్పాడు. కానీ విశ్రవసుడు కుబేరుడితో లంకను విడిచి వెళ్లిపొమ్మన్నాడు. “కుమారా నేను చెప్పుచున్న మాట వినుము. ఆ దశగ్రీవుడు ఈ విషయమును నా దగ్గర కూడా చెప్పినాడు. నేను చాలా దుష్టబుద్ధి గల వానిని మందలించి అనేక విధాల చెప్పితిని. నేను కోపముతో ఇట్లు చేసినచో నీవు నశించెదవు అని అనేక పర్యాయములు చెప్పినాను. అయినా వినలేదు.. వాని కేమీ మంచి చెడ్డలు తెలియుట లేదు. కుబేరా అందుచేత నీవు లంకను విడచి, నీ అనుచరులతో కూడా కలసి కైలాస పర్వతమునకు వెళ్లి అక్కడ నివాసార్థమై నగరము ఏర్పరుచుకొనుము. కైలాస ప్రాంతమునందు మందాకినీ నది ఉన్నది దాని జలము సూర్యునితో సమానములైన బంగారు పద్మములతోనూ తెల్ల కలవలతోనూ నల్ల కలవలతోనూ సుగంధము గల ఇతర వృక్షములతో నిండి ఉండును. కుబేరా! ఆ రాక్షసునితో వైరము పెట్టుకొనుట మంచిది కాదు” (34..44 శ్లోకాలు). దీంతో కుబేరుడు లంకను వదిలేసి.. ఉత్తరాన ఉన్న కైలాస పర్వతం దగ్గర అలకాపురిని నిర్మించుకొని అక్కడికి వెళ్లిపోయాడు. కుబేరుడు వదిలేసిన లంకను రావణుడు ఆక్రమించుకొని.. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకొన్నాడు.

ఇదీ లంకకు రావణుడు అధిపతి అయిన కథ. ఇక రావణుడు లంకను అద్భుతంగా నిర్మించుకున్నాడనో.. లేక తమిళుడనో.. ద్రవిడుడు అనో పేరు పెట్టినవాళ్లను ఏమని అనాలో కూడా తెలియదు. లంకను ఆక్రమించుకొని అంతటితో ఆగితే బాగుండేదేమో.. అప్పటికీ రావణుడు ఎలాంటివాడో తండ్రే స్వయంగా చెప్పాడు. అన్నట్టుగానే లంకను ఆక్రమించుకున్న తరువాత మరింత రెచ్చిపోయాడు. అధికారం, ఆధిపత్యం కోసం యుద్ధ కాంక్షతో రగిలిపోయాడు. లోకాలన్నింటినీ ఏకం చేశాడు. దీంతో ప్రపంచమంతా రావణుడికి శత్రువులే అయ్యారు. అతడిని చంపడానికి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఈ వార్త విన్న కుబేరుడు ఊరుకోకుండా.. తమ్ముడు కదా అని ఒక దూతను పంపించాడు. ఆ దూత వెళ్లి అతనికి మంచి చెప్పడానికి ప్రయత్నించాడు. అధర్మ కార్యాలు చేయవద్దని నచ్చచెప్పాడు. కానీ రావణుడి మెదడుకు అవేవీ ఎక్కలేదు. భయంకరమైన కోపం వచ్చేసింది. ‘ఇక ఎంతమాత్రం సహించేది లేదన్నాడు. అన్న కాబట్టి తాను చంపనని భావిస్తున్నాడో ఏమో కానీ.. ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టనన్నాడు. ఇప్పుడు దూతను పంపించి నన్ను మరింత రెచ్చగొట్టాడు. ఇక ముల్లోకాలను జయించాల్సిందేనని డిసైడ్ అయ్యాడు. వెంటనే దూతను చంపేశాడు. ఆ తరువాత కుబేరుడు ఉన్న చోటికి దండెత్తి వెళ్లాడు. కుబేరుడు, యక్షులకు, రావణ సైన్యం మధ్యన పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఉత్తరకాండ 14, 15 సర్గల్లో ఈ యుద్ధ వర్ణన మనకు కనిపిస్తుంది. చివరకు రావణ కుబేరుల మధ్యన ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. జీవ రసాయనాయుధాల ప్రయోగమూ జరుగుతుంది. చివరకు కుబేరుడి తలమీద కొట్టి.. అతడిని రావణుడు ఓడిస్తాడు. కుబేరుడి ఇంట్లో ఉన్న పుష్పక విమానాన్ని రావణుడు విజయచిహ్నంగా పట్టుకుపోతాడు.

ఇదీ లంక కథ, రావణుడి పుట్టుక కథ, రావణుడు లంకను ఆక్రమించిన కథ. రావణుడిని హీరో చేయడానికి ఒకరు.. రావణుడిని విక్టిమ్‌గా చూపించడానికి మరొకరు.. తెగ తాపత్రయపడ్డారు. రావణుడు యూపీలో పుట్టి.. యూపీ నుంచి బయలుదేరి.. అన్న చేతిలో ఉన్న నగరాన్ని బెదిరించి లాక్కుని.. అక్కడితో ఊరుకోకుండా తనను బాగు చేయడానికి ప్రయత్నించిన అన్నను చంపడానికి ప్రయత్నించిన వాడు ఎలా గొప్పవాడని నిర్వచిస్తారో ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని పేరు పెట్టుకున్నవారు సమాధానం చెప్పాలి. తమకు అనుకూలంగా ఉత్తరకాండలోనే ఉన్న శంబూక వధ, సీతాపరిత్యాగం కథను పట్టుకొని అటు లాగి.. ఇటు లాగి రాముడి వ్యక్తిత్వాన్ని హననం చేసే మేధావులు.. అదే ఉత్తరకాండలో ఉన్న రావణుడి దుర్మార్గపు ముఖాన్ని, వ్యక్తిత్వాన్ని, రాక్షసత్వాన్ని కన్వీనియంట్‌గా మరచిపోయి, ఇగ్నోర్ చేసి.. రామాయణంలో ఏ విధంగానూ, ఏ రకంగానూ లేని, కనీసం ప్రస్తావనగా కూడా కనిపించని గొప్పతనాన్ని అదే పనిగా ఎలివేట్ చేసేశారు. చివరకు హీరో చేశారు. సీనియర్ ఎన్టీయార్ పుణ్యమా అని మహాపురుషుడు అయ్యాడు. పెరియార్ పుణ్యమా అని దేవుడయ్యాడు. లంకలో లేని పూజలు సైతం దక్షిణ దేశాన వీర లెవల్లో జరిగాయి. రాముడి వ్యక్తిత్వాన్ని హననం చేసే ఈ రెండు ఘటనలు ఉత్తరకాండలోనే ఉన్నాయి. రావణుడి వ్యక్తిత్వం ఎలాంటిదో పూర్తిగా, సంపూర్ణంగా విశ్లేషణ కూడా ఉత్తరకాండలోనే ఉన్నాయి. . మరి అలాంటప్పుడు రావణుడు ఎలా గొప్పవాడయ్యాడు? రాముడు విలన్ ఎలా అయ్యాడు? విజ్ఞులు తేల్చాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version