[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
16
శూర్ఫణక అనే తన సిస్టర్‌ను కురూపిని చేసినందుకు ప్రతీకారంగా సీతను అపహరించడం తప్ప రావణుడు జీవితంలో తప్పులేమీ చేయలేదని కదా.. మన మేధావులు చెప్పే అత్యంత ముఖ్యమైన విషయం!! నిజానికి ఏ ఒక్క స్త్రీని కూడా సరైన దృష్టితో చూడలేని రావణుడు కేవలం శూర్ఫణక పరాభవానికి ప్రతీకారంగా మాత్రమే తీసుకొని వెళ్లాడంటే విడ్డూరం కాక మరేమిటి? సీతాపహరణం విషయానికి సంబంధించి మనం కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శూర్ఫణక విషయంలో ఎందుకు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. నిజంగా శూర్ఫణక విక్టిమా? లేక సీతా? మన మేధావులనబడే వారు విచిత్రంగా తమకు అనుకూలమైన వాదనలను నిర్మించుకుంటూ పోతారు. అరణ్యకాండలోని శూర్ఫణక ఎపిసోడ్ లోని పలు అంశాలను తమకు అనుకూలంగా చర్చించుకుంటూ పోయారు.
ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? తరువాత ఏం చేసింది? ఎందుకు పరాభవం పొందింది అన్న విషయాలు గాలికి పోయి.. ప్రపంచంలోనే తొలి మహిళా బాధితురాలిగా ఒక ట్యాగ్‌లైన్ తగిలించేశారు. అరణ్యకాండలోని 17వ సర్గలో శూర్ఫణక ప్రవేశిస్తుంది. గోదావరి నదిలో స్నానం చేసి ఆశ్రమానికి చేరుకున్న సీతారామ లక్ష్మణులు పరస్పరం సంభాషిస్తుండగా శూర్ఫణక అక్కడికి వచ్చింది. అక్కడ రాముడిని చూడగానే ఆయన అందాన్ని, ప్రసన్నమైన వదనాన్ని, ఉట్టిపడుతున్న హుందాతనాన్ని చూసి ఆమెకు కామంతో కాలిపోయింది. ఆమె ఆకార వికారాలను గురించి మనం గతంలోనే చర్చించుకున్నాం. సినిమాల్లో చూపించినట్టు.. శూర్ఫణక అందమైన స్త్రీలాగా వేషం మార్చుకొని రాముడి దగ్గరకు రాలేదు. వికృతమైన ముఖము, పెద్దపొట్ట, చూడటానికి వృద్ధురాలి వంటి శరీరం, కర్ణ కఠోరమైన కంఠధ్వనితో కూడిన ఆ శూర్ఫణక రాముడి దగ్గరకు వచ్చి తనను వివాహం చేసుకోవాలని కోరింది. తన ఆకారం కంటే సీత ఆకారం వికృతంగా ఉన్నదని ఆక్షేపించింది కూడా తనలాగా బాన పొట్ట లేకపోవడం అందవికారంగా ఆమెకు అనిపించింది. సన్నని నడుము ఉండటం ఆమెకు వికృతంగా అనిపించింది. సీతా లక్ష్మణులను తినివేస్తాను. నీవు నా భర్తగా రావాలని కోరింది. తరువాత రామ లక్ష్మణులు ఆమెతో వ్యంగ్యంగా వ్యంగ్యంగా పరిహాసమాడారు. ఆమెతో రాముడు ఏమన్నాడో ఒకసారి చదవండి.. ‘పూజ్యురాలా! నాకు వివాహమైనది. ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య. నీవంటి ఆడవాళ్లు సవతి ఉండుటను ఏమాత్రం సహిచజాలరు. లక్ష్మణుడను ఈతడు నా తమ్ముడు. మంచి శీలము కలవాడు. చూచువారికి ఆనందము కలిగించువాడు. శోభ కలవాడు. వివాహము కానివాడు. పరాక్రమవంతుడు. ఇతడింతవరకు భార్యాసౌఖ్యము తెలియనివాడు. భార్య కావలెనను కోరిక గలవవాడు. చూచుటకు అందమైన యువకుడు. ఇతడు నీ రూపమునకు తగిన భర్త కాగలడు. అందమైన కటి ప్రదేశము గల ఓ విశాలాక్షీ నా సోదరుడైన ఈతనిని సూర్యుని కాంతి మేరుపర్వతమును ఆశ్రయించినట్టు సేవింపుము. నీకు సవతిబాధ ఉండదు’ (వాల్మీకి రామాయణము, అరణ్యకాండ, 18 వ సర్గ 2,5 శ్లో).
ఈ మాటలు విన్న శూర్ఫణక లక్ష్మణుడి దగ్గరకు వెళ్తే.. ఆయన ఆమెను మరింత పరిహాసమాడాడు.. ‘నీవు పద్మము వంటి రంగుగల అందగత్తెవు. నేనా పూజ్యుడైన నా అన్నగారికి అధీనుడనైన దాసుడను. దాసుడనైన నాకు భార్యవై నీవు కూడా దాసివగుటకు కోరుచున్నావేమి. నిర్మలమైన శరీరచ్ఛాయ గల నీవు అన్ని విషయములందు సఫలుడైన మా అన్నగారి చిన్న భార్యవై నీ కోరిక సిద్ధించగా ఆనందించుము. వికృతరూపంతో అణిగిపోయిన పొట్టతో భయంకరురాలుగా ఉన్నది, చెడ్డది, ముసలిది అయిన ఈ భార్యను విడచి రాముడు నిన్నే పొందగలడు. నీవు ఉత్తమమైన రంగు, అందమైన కటిప్రదేశము కలదానవు. శ్రేష్ఠమైన ఇట్టి సౌందర్యమును విడచి బుద్ధిమంతుడెవడైనా మనుష్య స్త్రీల యందు ఆసక్తుడగునా? (వాల్మీకి రామాయణము, అరణ్యకాండ, 18 వ సర్గ 2, 5 శ్లో). అని అన్నాడు.
ఇదీ శూర్ఫణక విషయంలో రామలక్ష్మణులు మాట్లాడిన మాటలు. ఇందులోనూ మన హేతువాదులకు అద్భుతమైన విషయం కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా దొరికింది. పైన రాముడు మాట్లాడుతూ లక్ష్మణుడికి వివాహము కాలేదు. భార్యాసౌఖ్యమును ఎరుగనివాడు అని అన్నాడు కదా.. అంతే.. లక్ష్మణుడికి పెండ్లే కాలేదు. నలుగురు సోదరులకు జరిగినదంటున్న పెండ్లి అనేది అంతా అబ్సర్డ్ అంటూ వాదనలు మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే వాదిస్తుంటారు. సోకాల్డ్ హేతువాదులు, లిబరలిస్టులు కూడా మాట్లాడే మాటలివే. ఎందుకంటే.. వాళ్లు చెప్పేవి వింటారు కానీ, రామాయణం ఎలాగూ చదువరు కదా.. అన్నది వారి ధీమా. అందుకే వారి మాటలు పట్టుకొని నిజమే అని నమ్మే వారు కొల్లలుగానే ఉంటారు. కానీ ఆ తరువాతి శ్లోకాలలో అంటే 18వ సర్గలోని 13, 14 శ్లోకాలన్నమాట.. ‘భయంకరురాలు, వంగిన పొట్ట గలదీ అయిన ఆ శూర్ఫణక లక్ష్మణుని మాటలు విని, పరిహాసమందు నేర్పులేనిదగుటచే అది నిజమేనని తలంచి కామమోహితురాలైన శూర్ఫణక సీతాసమేతుడై పర్ణశాలలో ఉన్న రామునితో ఇట్లు పలికెను’ ఇవీ ఈ రెండు శ్లోకాల తాత్పర్యం. తమను పెళ్లి చేసుకోవాలని వచ్చిన మహిళతో వాళ్లు పరిహాసమాడారు.. ఆమెకు అర్థం కాలేదు అని వాల్మీకి చాలా విస్పష్టంగా చెప్పాడు. ఇక ఇందులోనుంచి మధ్యలో ఉన్న వాక్యాలను తీసుకొని.. దాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకొని మాట్లాడటం ఎడమ కంటి చూపువాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. శూర్ఫణకతో రామలక్ష్మణుల పరిహాసం పనిచేయలేదు. వారి వ్యంగ్యాన్ని అర్థం చేసుకోకపోగా.. సీతను చంపి తినడానికి ఉరికురికి వచ్చింది. దీంతో.. రాముడు లక్ష్మణుడితో.. క్రూరులైన చెడ్డవారితో పరిహాసం ఎంత ప్రమాదమో తెలిసింది కదా.. ఆమెను అంగవిహీనురాలను చేయమని ఆజ్ఞాపించడంతో లక్ష్మణుడు శూర్ఫణక ముక్కు చెవులు కోస్తాడు. ఇదీ జరిగిన కథ. ఇప్పుడు చెప్పండి.. విక్టిమ్ ఎవరన్నది? పరిహాసంగా చెప్పిన వాక్యాలను నిజం చేయాలని చూసే దొంగ చరిత్రకారులను ఏమని పిలవాలో కూడా ఆలోచించండి.
దీంతో సహజంగానే శూర్ఫణక, రామలక్ష్మణులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నది. మొదట వెళ్లింది, దండకారణ్యాన్ని రావణుడి గవర్నర్‌గా ఏలుతున్న ఖరుడి దగ్గరికే. సీతారామ లక్ష్మణులను చంపి వారి రక్తం తాగాలన్నది తన కోరికగా చెప్పుకొచ్చింది. వెంటనే ఖరుడు ఓ పద్నాలుగు మంది రాక్షసులను పంపించి వారిని చంపేసి రమ్మంటాడు.. కానీ వారందరినీ రాముడు హతమార్చడంతో ఆమె పగ మరీ పెరిగిపోయింది. దీంతో ఖరుడిని రాముడితో యుద్ధం చేయాలని పదే పదే రెచ్చగొట్టింది. దీంతో ఖరదూషణులు 14 వేల మంది రాక్షసులను తీసుకొని జనస్థానం నుంచి పంచవటికి వెళ్లారు.
విషయం నుంచి కాస్త పక్కకు వెళ్లినా.. ఇక్కడ సందర్భం కాబట్టి ఒక విషయాన్ని మనం చర్చించుకోవలసి ఉన్నది. అధినేతకు సెక్యూరిటీ లేయర్లు ఎలా ఉంటాయో తెలుసుకోండి.. ఉదాహరణకు ఇటీవల 2025 మే నెలలో ఇదే దండకారణ్యంలో మావోయిస్టుల అధిపతి బసవరాజును గ్రేహౌండ్ దళాలు హతమార్చాయి. ఆయనకు మూడంచెల వలయాల్లో భద్రత వ్యవస్థ ఉంటుంది. ఆయన్ను కాపాడటానికి ఆయన చుట్టూ మూడు వలయాల్లో 30 మంది మావోయిస్టులు ఉన్నారు. ఈ వలయాన్ని ఛేదించుకొని బసవరాజును భారత బలగాలు హతమార్చాయి. ఇక రామాయణ కాలంలో ఇదే దండకారణ్యంలో ఖరదూషణులు రాముడితో యుద్ధానికి వెళ్లినప్పుడు వీళ్లకు కూడా పక్కాగా సెక్యూరిటీ లేయర్లు ఉన్నాయి. శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞ శత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పురుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు అనే పన్నెండు మంది రాక్షసులు ఖరుడికి పర్సనల్ సెక్యూరిటీ వలయంలో ఉన్నారు. ఒక్కో వలయంలో నలుగురు చొప్పున మూడు వలయాల్లో వీరు ఖరుడికి రక్షణగా ఉన్నారు. అటు దూషణుడి సెక్యూరటీలో మహాకపాలి, స్థూలాక్షుడు, ప్రమాథి, త్రిశిరస్సు అనే నలుగురు మాత్రమే ఉన్నారు. రాజును, అధినాయకుడిని కాపాడటానికి ఈ రక్షణ వలయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
పెద్ద ఎత్తున వచ్చిన రాక్షసులతో యుద్ధం చేయడానికి రాముడు కావాల్సిన ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. మొట్టమొదట సీతాదేవిని సేఫ్ జోన్‌కు తరలించాడు. ఎవరూ ప్రవేశింపలేని గుహలోకి తరలించి.. ఆ గుహకు లక్ష్మణుడిని కాపలాగా ఉంచాడు. ఆ తరువాత కవచధారణ చేసి మరీ యుద్ధానికి బయలుదేరాడు. ఈ యుద్ధం సినిమాల్లో చూపినట్టు ఒకటి రెండు బాణాలు వేసి అందరినీ చంపివేసినట్టు జరుగలేదు. మొత్తం ఆరు సర్గల్లో 242 శ్లోకాలలో ఈ యుద్ధాన్ని వాల్మీకి రచించాడు. అత్యద్భుతమైన యుద్ధ సన్నివేశమిది. అత్యంత నాటకీయమైన యుద్ధ సన్నివేశం ఇది. మన సినిమావాళ్లు ఏదేదో హాలీవుడ్ సీన్లు చూసి కాపీ కొడుతుంటారు కానీ.. నిజంగా రామాయణంలో రామరావణ యుద్ధం కానీ, ఖరదూషణులతో యుద్ధ సన్నివేశాలను చదివితే ఏ హాలీవుడ్ సినిమాలు.. ఏ గ్రాఫిక్స్‌లు, ఏ విఎఫ్‌ఎక్స్‌లు నిలబడతాయి? కానీ మనవాళ్లు వీటిని చదువరు కదా.. ఈ రాక్షసులతో రాముడి యుద్ధం చాలా బీభత్సంగా జరిగింది. బాణాలతో రాముడి శరీరం ఛిద్రమై రక్తసిక్తమైంది. రాముడు అత్యంత క్రోధంతో విజృంభించి వేలమంది రాక్షసులను హతమార్చాడు. మనం బాహుబలి లాంటి సినిమాల్లో కథానాయకుడు ఒక ధనస్సును చేతపట్టుకొని ఒకే సారి మూడు నాలుగు బాణాలను వదిలి శత్రువులను హతమార్చడాన్ని చూసి మనం చూసి అబ్బో దర్శకుడు ఎంత ప్రతిభావంతుడో అని అబ్బురపడతాం. కానీ ఖరదూషణులు వారి సైన్యాన్ని సంహరించడంలో రాముడు ఏ విధంగా తన పరాక్రమాన్ని ప్రదర్శించాడో వాల్మీకి అద్భుతంగా వ్యక్తీకరించాడు. రాముడు తన కోదండమనే ధనుస్సును మండలాకారంలో ఉండేటట్టుగా వంచి పట్టుకున్నాడట.. ‘రాముడు చాలా కోపించి ధనుస్సును మండలాకారముగా ఉండునట్లు వంచి, వందల వేల కొలది వాడియైన బాణాలను విడచెను, యుద్ధములో నివారింప శక్యముకానివి, సహించుటకు శక్యము కానివి, యమదండముతో సమానములుగా, వంకరగా కాక తిన్నగా పోయే బాణాలను రాముడు అనాయాసంగా ప్రయోగించెను’ (16, 17 శ్లోకాలు.. 25వ సర్గ అరణ్యకాండ). ఇదీ రాముడి పరాక్రమం. మండలాకారంలో ధనుస్సును వంచి పట్టుకోవడం ద్వారా అన్నివైపులా ఒకేసారి అనేక బాణాలను విడిచేందుకు అవకాశముంటుంది. ఇది ధనుర్విద్యలో అత్యంత కీలకమైన విన్యాసం. ఆ తరువాత భీకర యుద్ధం చేసి ఖరుడిని, దూషణుడిని, త్రిశిరస్సును రాముడు హతమార్చాడు.
కేవలమంటే కేవలం గంటా పన్నెండు నిమిషాల్లోనే ఈ యుద్ధాన్ని ముగించాడు రాముడు (5,11 శ్లో. 34 వ సర్గ, అరణ్యకాండ).
ఖరదూషణాది రాక్షసులను హతమార్చడంతో శూర్ఫణక తన ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. దండకారణ్యం రావణ ముక్తమైంది. ఇక తన అన్న రావణుడిని ఆశ్రయించక తప్పలేదు. రావణుడి దగ్గరకు వెళ్లిన శూర్ఫణక తన అన్న బలహీనత ఏమిటో బాగా తెలుసు. అందుకే రాముడితో తన దుర్వ్యవహారాన్ని దాచిపెట్టి సీత అందాలను వర్ణిస్తూ రావణుడిని రెచ్చగొట్టడానికి లంకకు బయలుదేరింది. అయితే చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే శూర్ఫణక చెప్పిన మాటమీదనే రావణుడు సీతాపహరణానికి ఆలోచించాడని. కానీ, ఖరదూషణుల వధ అనంతరం శూర్ఫణక కంటే ముందు రావణుడి దగ్గరకు వచ్చిన వాడు అకంపనుడనే రాక్షసుడు (అరణ్యకాండ 30,31 సర్గలు). దండకారణ్యంలో జరిగిన యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడి తప్పించుకొని వచ్చాడు. అతడే ముందుగా దండకారణ్యం రావణ ముక్తమైందన్న విషయాన్ని ముందుగా వివరించాడు. రాముడనే మానవుడు దండకారణ్యంలో రావణ సైన్యాన్ని సమూలంగా నాశనం చేసిన విషయాన్ని విడమర్చి చెప్తాడు. దీంతో రావణుడు కోపంతో ఊగిపోయి దండకారణ్యానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయమేమిటంటే.. ముందుగా దండకారణ్యంలో అంతవరకు కాపాడుకుంటూ వస్తున్న రాజకీయ అధికారం పోయింది. అప్పటివరకు ఓటమే ఎరుగని రావణుడికి తొలి ఓటమి ఎదురైంది. అది కూడా రాముడి ద్వారానే. దట్టమైన దండకారణ్యంపై తన పట్టును కోల్పోవడాన్ని అతను ఎంతమాత్రం సహించలేకపోయాడు. దీంతో వెంటనే దండకారణ్యాన్ని తిరిగి స్వాధీన పరుచుకోవడానికి బయలు దేరాడు. అప్పుడు కూడా అకంపనుడే రావణుడి యుద్ధోన్మాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తాడు. అక్కడే రాముడు ఎంత పరాక్రమశాలియో, అతడి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో.. వివరించి చెప్తాడు.. అతని వెంట ఎవరైనా దేవతలున్నారా అని రావణుడు అడిగితే ఒకే ఒక్కడు పద్నాలుగు వేలమందినీ హతమార్చి రావణుడి జనస్థానాన్ని నిర్మూలించాడని వివరిస్తాడు. రాముడి దగ్గర బంగారు పెన్నులు, రెక్కలు గల బాణాలు కూడా ఉన్నాయని చెప్తాడు. రాముడిని జయించడం సాధ్యం కాదని కూడా చెప్తాడు. రాముడిని తన దారిలోకి తీసుకొని రావాలంటే.. అతనికి ప్రాణాధికుడైన భార్య అయిన సీతను అపహరించుకొని వస్తే.. ఎలాంటి యుద్ధం లేకుండానే.. రాముడు ప్రాణాలు విడుస్తాడని కూడా సలహా ఇస్తాడు. దీంతో రావణుడు యుద్ధం కంటే.. సీతాపహరణమే మేలని భావిస్తాడు. వెంటనే మారీచుడి ఆశ్రమానికి వెళ్లి సీతాపహరణానికి సహాయపడాలని కోరాడు. అప్పుడు మారీచుడు బుద్ధి చెప్తాడు. రాముడనే సింహాన్ని నిద్రలేపడం మంచిది కాదు.. నీ మానాన నువ్వు లంకకు వెళ్లి హాయిగా ఉండు.. ఆఫ్టరాల్ జనస్థానం పోతే పోయింది అని చెప్తాడు. అప్పుడు మారీచుడి మాటలు చక్కగానే చెవికెక్కించుకొని రావణుడు లంకకు తిరిగి వెళ్తాడు. అప్పటికి సీతా సౌందర్యం గురించి రావణుడు పెద్దగా పట్టించుకోలేదు. జనస్థానంపై ఆధిపత్యం గురించే ఆలోచించాడు కాబట్టి.. ఆగిపోయాడు. కానీ.. సీత గురించి పూర్తిగా తెలిసేసరికి.. ఇక ఆగలేకపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే.. రాజ్యం కంటే.. రాజ్యాధికారం కంటే.. రాజ్యంపై తన ఆధిపత్యం కంటే, స్త్రీలోలత్వమే రావణుడిని కమ్మేసింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
