[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
18
రామాయణంలో అస్సలు కనిపించని పాత్ర మండోదరి.. ఈ మండోదరి రావణుడి ఇల్లాలు. ఎక్కడో ఉత్తరకాండలో రావణుడితో వివాహం అయిందని చెప్పటమే తప్ప.. ఆ తరువాత ప్రధానమైన ఆరు కాండల్లో మండోదరి పాత్ర ఏమీ ఉండదు. రావణుడి వధ తరువాత మాత్రమే ఒక ఘడియ కాలం ఆమె కనిపిస్తుంది. సాధారణంగా భారతీయ సంప్రదాయం ప్రకారం మనం విశ్లేషిస్తే.. పతివ్రతల లిస్టులో, పతివ్రతల ఆరాధనా వేదికమీద ఆమె స్థానం పదిలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. భర్త ఎలాంటి దుర్మార్గుడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా.. కొట్టినా, తిట్టినా మౌనంగా భరిస్తూ, భర్తను గౌరవిస్తూ జీవించే ఇల్లాళ్లకు మండోదరి అచ్చమైన ప్రతీక. రావణుడు దుర్మార్గుడని తెలిసి కూడా మండోదరి తండ్రి మయుడు.. అతనికి కూతురునిచ్చి పెండ్లిచేశాడు. ఇవాళ మన సమాజంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో కూతుళ్ల తండ్రులకు ఉండే మానసిక దౌర్బల్యాలన్నీ కూడా మయుడికి ఉన్నాయి. అయినా.. కూతురును ఇచ్చి పెండ్లి చేస్తే.. పెండ్లి తరువాత మారుతాడేమోనని మన లాగే అనుకున్నాడేమో.. మొత్తానికి పెళ్లి చేశాడు. కానీ, రావణుడు కించిత్ కూడా మారలేదు. రావణుడు అలాంటిలాంటి కాముకుడు కాదు. ఏ కీచకుడు కూడా అతని ముందు పనికిరారు. తీవ్రమైన కామోద్రేకం కలిగిన వాడు. దేశ విదేశాల నుంచి, అనేక లోకాల నుంచి కనపడిన మహిళను కనపడినట్టుగా లంకకు తెచ్చి పడేసేవాడు. అవకాశం ఉన్నచోట రంభను చెరచినట్టుగా అక్కడే అనుభవించి వచ్చేవాడు. అతడు ఎంత నీచుడంటే.. ఈ మహిళలందరికీ బాస్‌గా సీతాదేవిని ఉండమని కోరాడు. విపరీతమైన తాగుబోతు. ఇవాళ్టి భాషలో చెప్పాలంటే రావణుడు తాగని బ్రాండ్ ఆనాటి ప్రపంచంలో లేదేమో. వాల్మీకే అన్నాడు.. వివిధ రకాలైన మద్యాలు సేవించి తాను అపహరించుకొని తెచ్చిన యువతీమణులతో జీవితాన్ని గడిపాడని. రావణుడి క్యారెక్టర్ లాంటి వ్యక్తిత్వం కలిగిన తాగుబోతులు, వ్యభిచారులు అయిన భర్తలను భరించుకుంటూ ఉండే ఆడవాళ్లను మనం ఎంతోమందిని చూస్తూనే ఉంటాం. సినిమాల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్లు మనకు కనిపిస్తుంటాయి. భర్త ఎంతటి దుర్మార్గుడైనా అతడిని ఏమీ చేయవద్దని కోరుకునే స్త్రీ పాత్రలు మన సమాజంలో, సినిమాల్లోనూ కోకొల్లలు. అలాంటి రావణుడిని భరిస్తూ జీవితాన్ని గడిపిన ఒక అబల మండోదరి. ముందుగానే చెప్పినట్టు మండోదరి పాత్ర ప్రత్యక్షంగా కనిపించేది రావణ వధ తరువాత మాత్రమే. యుద్ధకాండ నూట పదకొండవ సర్గలో మండోదరి యుద్ధరంగానికి వచ్చి నేలపై పడి ఉన్న రావణుడిని చూసి విలపిస్తుంది. ఈ ఒక్క సర్గలోనే మండోదరి మనకు కనిపిస్తుంది. దీనికి ముందు కానీ, వెనుక కానీ మనకు ఎక్కడా కనిపించదు. ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు. ఎలాంటి సామర్థ్యమూ లేని, భర్త చాటు భార్యగా మాత్రమే జీవించిన మండోదరికి వాల్మీకి ఇచ్చిన స్పేస్ అంత మాత్రమే. వాల్మీకి కూడా మండోదరిని రావణుడి జ్యేష్ఠ భార్య అన్నాడే తప్ప పట్టమహిషి అని మాత్రం అననే లేదు. రావణుడు చనిపోయిన తరువాత ముందుగా మిగతా ఆడవాళ్లంతా వచ్చారని రాశాడు. వారి తరువాతే మండోదరి వచ్చినట్టుగా పేర్కొన్నాడు. కానీ, ఈ కొద్ది సేపు కనిపించే మండోదరితోనే, వాల్మీకి రావణుడి వ్యక్తిత్వాన్ని.. అతడు జీవించిన తీరు.. అతడు రాజ్యాన్ని పరిపాలించిన తీరు, అతడి నిరంకుశత్వం, అతడి కాముకతను అద్భుతంగా చెప్పించాడు. రావణుడి మొత్తం జీవితాన్ని అరటిపండును వలచినట్టు మండోదరి చేత వ్యాఖ్యానింపజేస్తాడు. రావణుడి చేష్టల వల్ల తాను అనేక సందర్భాల్లో ఎంతగా బాధపడిందో తాను బయటపడి ఏడ్చింది. ఏయే తప్పులు చేయకూడదో అవన్నీ చేశావని నిందించింది. గొప్ప వీరుడనని చెప్పుకునేవాడు ఇలా మానవ మాత్రుడైన రాముడిచేతిలో చనిపోవడమేమిటని ప్రశ్నించింది. వానరుడైన హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడే తాము భయపడ్డామని చెప్పింది.. కానీ తాము ఏమీ చేయలేకపోయామని వాపోయింది. ఆమె ఏమి అన్నదో ఒకసారి చదువుదాం. ‘ఓ గొప్ప బాహువులు గలవాడా! ఓ కుబేరుని తమ్ముడా! కోపించిన నీ ఎదుట నిలబడుటకు దేవేంద్రుడు కూడా భయపడును కదా.. నీకు భయపడి మహర్షులు, కీర్తిమంతులైన గంధర్వులు, చారణులూ కూడా దిక్కులు పట్టి పోయినారు కదా! రాక్షసాధిపతివైన ఓ రాజా! అట్టి నీవు మానవ మాత్రుడైన రామునిచేత యుద్ధమునందు జయింపబడి సిగ్గు చెందుట లేదా? ఇది ఏమిటి? మూడు లోకములను ఆక్రమించి ఐశ్వర్య పరాక్రమములతో ప్రకాశించు ఎదిరింపశక్యము కాకుండ ఉన్న నిన్ను అడవిలో తిరుగు మానవుడు ఎట్లు చంపినాడు?’ (1-6 శ్లో. 111వ సర్గ యుద్ధకాండ). ఒక వైపు రావణుడి వీరత్వాన్ని గురించి చెప్తూనే.. ఒక కామన్ మ్యాన్ చేతిలో ఎట్లా ఓడిపోయావని బాధపడింది. ఆ తరువాత ఆమె అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. రాముడు ఎలాంటి వాడో ముందే తాము అందరమూ ముందే ఊహించినా, రావణుడు మాత్రం రాముడి వీరత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, సీత మీదనే దృష్టి సారించడం వల్ల ఇంత వినాశనం జరిగిందని స్పష్టంగానే పేర్కొన్నది.
‘జనస్థానంలో అనేక రాక్షసులతో కూడిన, నీ సోదరుడు ఖరుడు చంపబడినాడనగా అలా చంపిన రాముడు మానవ మాత్రుడు కాజాలడు. దేవతలకు కూడా ప్రవేశింప శక్యము కాని లంకాపురములో హనుమంతుడు పరాక్రమముచేత ప్రవేశించిన నాడే మేము చాలా వ్యథ చెందినాము. భయంకరులైన వానరులు మహా సముద్రము మీద ఏనాడు సేతువు కట్టినారో.. ఆనాడే రాముడు మానవ మాత్రుడు కాడని నేను మనస్సులో శంకించితిని. లేదా నిన్ను చంపుటకై ఎవరూ ఊహించని మాయను కల్పించి యముడే స్వయముగా రాముని రూపములో వచ్చి ఉండును. ఓ మహాబలశాలీ! లేదా దేవేంద్రుడు నిన్ను ఎదిరించి ఉండును. కానీ యుద్ధములో నిన్ను చూచుటకు కూడా దేవేంద్రునకు శక్తి ఎక్కడిది?’ (9-13 శ్లో, 111 వ సర్గ, యుద్ధకాండ). రాముడి పరాక్రమం గురించి, శక్తి సామర్థ్యాల గురించి ఏనాడూ అంతఃపురాన్ని వదిలి బయటకు రాని మండోదరి సైతం ఒక అంచనాకు వచ్చిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాముడు సముద్రంపై సేతు నిర్మాణం చేయడమే రావణుడికి పెద్ద మైనస్ పాయింట్. రాముడు సముద్ర తీరానికి ఆవల చేరినప్పటి నుంచీ కూడా రావణుడు ప్రతి చర్యనూ గమనిస్తూనే ఉన్నాడు. తన గూఢచారులను పంపించి వానరసేనను అంచనా వేసుకున్నాడు. తాను తన ప్రాసాదం పైనుంచి రామ సేనను, దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ, యుద్ధ నివారణకు మాత్రం అతను ఏ కోశానా ఆలోచించలేదు. సీతను వదిలిపెట్టడం అన్న ఒక్కటి తప్ప ఏదైనా చేస్తానని మంకుపట్టు పట్టాడు.
మండోదరి తాను రావణుడికి ఒక దశలో హితవు చెప్పడానికి ప్రయత్నించిన విషయాన్ని కూడా మండోదరితో ఇదే సర్గలో చెప్పిస్తాడు. ‘దేవతలు కూడా ప్రవేశింపశక్యము కాని లంకాపురంలోకి హనుమంతుడు పరాక్రమము చేత ప్రవేశించినాడే మేము చాలా వ్యథ చెందినాము. ‘రాముడితో మైత్రి చేసికొనుము’ అని నేను చెప్పగా విననందుకే ఈ ఫలితము వచ్చినది. రాక్షస శ్రేష్ఠుడా! ఐశ్వర్యము, నీ దేహము, బంధు జనము నశించుటకే నీకు హటాత్తుగా సీతయందు కోరిక పుట్టినది. ఓ దుర్బుద్ధి కలవాడా! అరుంధతి కంటే, రోహిణి కంటే కూడా ఉత్తమురాలైన, గౌరవింపదగిన సీతను అవమానించి చెడ్డపని చేసితివి కదా?’ (14-23 శ్లో. 111 వ సర్గ, యుద్ధకాండ). రావణుడు ఏమి చేసినా భరిస్తూ వచ్చిన మండోదరి కూడా రాముడి శక్తి గురించి ఆందోళనపడి అతడిని మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమైంది. రావణుడు ఎలాంటి వాడో మండోదరే చెప్పుకుంటూ వచ్చింది. ‘నా భర్త శత్రువుల ముందు గర్వోక్తులు పలుకువాడు, తన వారిని, తన భృత్యులను రక్షించువాడు, భయంకరమైన పనులు చేయువారిని చంపువాడు. నా భర్త వేల కొలది దానవ వీరులను, యక్షులను సంహరించినవాడు. యుద్ధములో నివాతకవచులను రాక్షసులను చేరదీయుచుండెడివాడు. నా భర్త అనేక యజ్ఞములను పాడు చేసినవాడు. స్వజనమును రక్షించువాడు. ధర్మ వ్యవస్థను చెడగొట్టినవాడు. యుద్ధంలో మాయను సృష్టించెడివాడు. నా భర్త ఆయా దేశములనుంచి దేవ, అసుర, మానవ కన్యలను తీసుకొని వచ్చిన వాడు. శత్రువుల స్త్రీలకు శోకము కలిగించువాడు. స్వజనమునకు నాయకుడు. నా భర్త లంకాద్వీపమునకు రాక్షసుడు. భయంకరములైన కర్మలు చేయువాడు. మాకు అన్ని భోగములు ఇచ్చువాడు. రథికులలో శ్రేష్టుడు. ఇట్టి భర్తను రాముడు పడగొట్టవేయగా చూచి, చంపబడిన భర్తగల నేను ఇంకనూ దేహమును ధరించి ఉన్నాననగా నేను చాలా మొండిదానను (49-57, 111 సర్గ, యుద్ధకాండ) భార్య కంటే గొప్పగా భర్త వ్యక్తిత్వాన్ని చెప్పగలవారు ఇంకెవరుంటారు? రావణుడి ధర్మ ధ్వంస లక్షణాన్ని, స్త్రీ లోలత్వాన్ని, కాముకతను, యజ్ఞ యాగాదుల విధ్వంసానికి, స్త్రీలకు శోకాన్ని కలిగించే లక్షణాన్ని, రాక్షసులను చేరదీసి కల్లోలం సృష్టించే లక్షణాన్ని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. మండోదరి అంతఃపురానికే పరిమితమైనప్పటికీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగానే పరిశీలిస్తూ వచ్చింది. రావణుడి చర్యలు.. ఆ తరువాత అతడి సన్నిహితులు చేసిన హితోపదేశాలను, హెచ్చరికలను గురించి కూడా విన్నది. ముందుగానే చెప్పినట్టు తాను కూడా చెప్పడానికి ఒకసారి సాహసించి విఫలమైంది. రావణుడి మృతదేహం దగ్గర ఆమె ఇంకా ఏమని విలపించిందో ఒకసారి చూద్దాం. ‘నా మరిది విభీషణుడు తీసుకొని రాబడిన సీతను చూసి, ఆలోచించి, దీర్ఘముగా నిట్టూర్చి చెప్పినట్లుగా కామ క్రోధముల వలన కలిగిన నీ స్త్రీ ప్రసంగ వ్యసనము చేత ఈ రాక్షస నాయకుల వినాశనము వచ్చిపడినది. మూలమునే హరించిన ఈ గొప్ప అనర్థము నీ వలననే జరిగినది. నీవు ఈ రాక్షస కులము నంతనూ రక్షకుడు లేని దానినిగా చేసినావు. ప్రసిద్ధములైన, బలపౌరుషములు గల నిన్ను గూర్చి నేను విచారించకూడదు. కానీ, స్త్రీ స్వభావముననుసరించి నా బుద్ధి దైన్యమును పొందుచున్నది. నీ పుణ్యపాపములను తీసుకొని నీ దారిన నీవు వెళ్లిపోయినావు. నీ మరణము చేత దుఃఖితురాలైన నన్ను గూర్చియే నేను విచారించుచున్నాను. దశాననా! నీవు నీ హితమును కోరు మిత్రుల వచనమును కానీ, సోదరులు చెప్పిన హిత వచనమును కానీ, ఏమాత్రమూ వినలేదు. విభీషణుడు మంచి హేతువులు, అర్థమూ గల, శాస్త్ర సమ్మతమైన, శ్రేయస్కరమైన, క్రూరము గాని, యుక్తి యుక్తమైన కార్యమును బోధించగా నీవు అది చేయలేదు. పరాక్రమము చేత మదించిన నీవు మారీచ కుంభకర్ణుల మాట, నా మాట, నా తండ్రి మాట కూడా వినలేదు. ఇది దాని ఫలమే (72-80, 111 వ సర్గ యుద్ధకాండ). మండోదరి పేర్కొన్న ఈ మాటలలో చాలా స్పష్టంగా రావణుడి మెండితనమేమిటో, మూర్ఖత్వమేమిటో వ్యక్తమవుతున్నది. రావణుడి కామోద్రేకం ఎంతటి వినాశనానికి దారి తీసిందో స్పష్టమవుతున్నది. విభీషణుడు మాత్రమే కాదు.. మారీచుడు, చివరకు కుంభకర్ణుడు కూడా హితవు చెప్పినా వినలేదు. కట్ట కడపకు మండోదరి తండ్రి మయుడు వచ్చి చెప్పినా లెక్క చేయలేదు. విభీషణ, మారీచ, కుంభకర్ణాదులు రావణుడికి హితవు చెప్పిన విషయం మనకు యుద్ధకాండలో మొదట వివరంగా వస్తుంది. రావణుడి మామగారైన మయుడు కూడా వచ్చి అల్లుడికి హితవు చెప్పిన విషయం ఇక్కడ మండోదరి ద్వారానే మనకు అర్థమవుతున్నది. మండోదరి కేవలం గృహిణిగానే ఉన్నప్పటికీ, భర్తను భరించినప్పటికీ రావణుడు జీవించి ఉన్నంతవరకూ బయటపడని ఆమె ఆవేదన.. అతడు చనిపోయి.. రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చింది. రావణుడు చేసిన దురాగతాలన్నీ ఆమె ఏకరువు పెట్టింది. రాముడి పరాక్రమము గురించి విన్న తరువాత కూడా ఎంతోమంది హితవు చెప్పినా కూడా కేవలం శూర్ఫణక మాటలతో కామము, క్రోధము నియంత్రణలో ఉంచుకోలేని రావణుడు లంక సర్వనాశనానికి ఒడిగట్టాడు.
రావణుడి వ్యక్తిత్వం ఏమిటన్నది ఇతరులెవరో చెప్పటం కాదు.. ముందు శూర్ఫణఖ చెప్పింది.. తరువాత మారీచుడు చెప్పాడు.. తరువాత విభీషణుడు చెప్పాడు.. తరువాత కుంభకర్ణుడు చెప్పాడు.. చివరకు భార్య మండోదరి కూడా చెప్పింది. అతడు ఎంత వ్యక్తిత్వ హీనుడో ఇంత స్పష్టంగా ఉన్న తరువాత కూడా మన ఎర్ర చొక్కా చరిత్రకారులు మాత్రం రావణుడు చాలా గొప్పవాడు.. మహానుభావుడు, మార్తాండ తేజుడు.. కీర్తిమంతుడని ఎలా కీర్తిస్తారో అర్థం కాదు. వాళ్లు రామాయణాన్ని చదువరు. అదీ వాల్మీకి రాసినదాన్ని అసలు చదువరు. చదివినా అర్థం కాదు. అర్థం అయినా.. దాన్ని అంగీకరించడానికి మనసొప్పదు. అలాంటి వారు మన చరిత్రను నిర్దేశిస్తారు. మన దురదృష్టం కాకపోతే మరేమిటి?
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
