Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రవఁణీయం!

[హాస్యానికి పెద్ద బడి, పైడి ఒరవడీ అయిన ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి, 28 జూన్ సందర్భంగా, వారి ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’ గురించి కొన్ని శాఖాచంక్రమణాలు — అనగా ఓ నాలుగు మాటలు అందిస్తున్నారు శ్రీ సముద్రాల హరికృష్ణ.]

రవఁణీయం!

(కొన్ని ‘కోతి కొమ్మచ్చి’ కబుర్లు)

***

ఏంటంటారూ?! కోతికొమ్మచ్చులు, రవఁణ గారి సొత్తా?!

నిజమే, కాదన్నదెవరూ?!

అదిగో మళ్ళీ, రవఁణెవరా?!

ఆకాశం తెలుసు, సూరీడు తెలీదన్నాడట వెనకటికి, ఎవడో!

అట్లాగుంది ఈ మాట, హాస్యం తెలుసు, రవఁణగారు తెలీదనటం!

సరే, లారీ చౌగ్గా, ‘సాక్షి’ తీసి తన/తమ (బాపూతో జంట వ్యాసంగం కదా) టాలెంటుకు సాక్ష్యంగా నిలిపిన వాడు; ముత్యాలతో ముగ్గులేసి, ఆకాశంలో సైతం మర్డర్‌లు కనుక్కున్న డిటెక్టివ్; తమ్ముడుఅన్నల ఉత్తరదక్షిణ ధృవాల బుడ్డిమంతుడూ, బుధ్ధిమంతుడూ తీసి చూపినవాడు; గంగను నాడెప్పుడో జటాజూటంలో బంధించిన తర్వాత మళ్ళీ గంగను సెల్యూలాయిడ్ మీద బంధించిన వాడుగా చిరకీర్తి కొట్టినవాడు; పావు, అర కాదు రామాయణ సం’పూర్ణా’న్ని విందుగా, పసందుగా పంచినవాడు; తోరణాలు సరే, పూతరేకులు ఓకే, కానీ పెళ్ళికి ఏకంగా పుస్తకం రచించి, చిలిపిగా, గిల్లికజ్జాలతో నింపి, అందంగా కుట్టించినవాడు — ఒకటా రెండా ఎన్నని చెప్పను! పైగా ఇవన్నీ కేవలం ఆయన తీసిన చిత్రాల్లో కొన్ని మాత్రమే, శాంపిల్ డోస్‌గా!

ఇక్కడొక మాట చెప్పి తీరాలి.

‘ఈయన’, తీసిన అంటే బాపూగారితో కలిసీ అనే అర్థం.

వాగర్థాల లాగా ఒకరి గురించి చెప్తే, రెండోది స్ఫురించేయాలన్నమాట!

అంతోటి క్లోజు, నెవెర్ ఎవర్ ఎపార్ట్!

అమ్మయ్య ఇంక ఏ అపార్థసారథి ఏవఁనుకున్నా బెంగ లేదు.

నే నివ్వవలసిన statutory clarification నేనిచ్చేశా!

నా పూచీ అంతవరకే మరి!

సరే కొనసాగిస్తే..

సినీమా చిత్రాలే కాదు, ఈయన రాసిన కాగితప్పత్రాలు చూస్తే, అవీ, కోకొల్లలు!

అదిగో, ఆ రవఁణ గారి గురించి మాట్లాడుతోంది, బోధపడిందిగా?!

సరే, ఈ నాన్చుడెందుకు గానీ, రవణ గారంటే నేననేది ముళ్ళపూడి వారబ్బాయి, వెంకటరమణ గారండీ, ఆయన గురించి!

మాటలతో అల్లికలల్లి, చెర్నాకోల ఝళిపిస్తారే, ఆయన!

“అంటే అన్నాడులే, బలే తమాషాగా అన్నాడు కదూ”, అని నాలుగు మాటలు అనిపించుకున్న వాడే మెచ్చుకుంటాడే, అద్గదిగో ఆ రవఁణగారు.

అస్తమానం ఆ కొంటె బొమ్మల బాపూ అంతటివాడు ఇంతటివాడు అని తన స్నేహితుణ్ణి ఆకాశంలో నిలబెట్తుంటాడే ఆయన!

మహా మాటల శ్రీమంతుడు!

అదీ హాస్యప్మాటలు!

ఉప్మాకు మల్లే ఇట్టే కమ్మగా ఉడికించి, వడ్డించేయగల హాస్యకుల నలచక్కురవర్తి!

అన్నట్టు ఈయనను కూడా ‘చక్రవర్తీ’ అనేట, వాళ్ళింట్లో చిన్నప్పుడు పిలిచేవారు.

ఉమ్మడాంధ్రప్రదేశ్‌లో తూగోజి. గోదారమ్మ ముద్దుబిడ్డన్న మాట!

వాళ్ళమ్మ పేరు కాదులే, అది వేరే ఉంది.

ఈయనలో బోల్డు నవ్వు రసం నింపిన మహానది సంగతి నే చెప్తున్నది!

తాగిన నీటిని బట్టి కాదూ ఒంట్లో చేవా, గుండెలో కలేజా, అందుకూ లోతైందీ, మాంచి తొందరగత్తే అయిన గోదావరి ప్రసక్తి!

ఈయనా అదే వాలకం గదా, అందుకన్న మాట, ఆ మాట!

అటు ఉరుకుల గోదారీ, ఇటు చురుకుల ముళ్ళపూడి!

భలే, రెండూ రెండే, పోటీ గురించి, కిమన్నాస్తి!

మాటిమాటికీ ఈ కీబోర్డొకటి!

‘రవణ’ అని కొడితే, (కర్రచ్చుకు కాదు, టైపు) “రవాణా” అని ముందుకు దూసుకొచ్చేస్తోంది, బ్రేకుల్లేని బస్సులాగా!

కానీ అదీ సరిపోతుందేమో ఈయనగారి కనిపిస్తుంది!

– ఇంతలో, అంటే చిటికెలో నవ్వుల లోకానికి రవాణా చేయిస్తాడు కదూ తన రచనలు చదివీ, తన సినీమాలు చూసేవారిని, అందుకూ!

***

ఎంత అబధ్ధాలు దుబారాగా వాడే వాణ్ణి కాకపోయినా, ఆత్మకథ అనగానే స్వోత్కర్ష, అదే అదే..

అచ్చ తెలుగులో ‘సొంత డబ్బా’, తన్నుకుని వచ్చేస్తుంది మహాప్రభో, కనుక దాని జోలి నాకొద్దని ఈయనట, కాదు కాదు, మీర్రాయగలరని ఆ హలాయుధ ఎడిటర్ గారట!

చివరాఖరుకు ఒప్పుకుని, ఎడిటర్ బలరాముడి గారి మాట మన్నించి, ఉపక్రమించారట!

హెచ్చరిక:

నేనే షెర్లాక్సు హోమ్గిరీ చేయలేదీ విషయంలో, నా సొంత కపిత్వమూ ఏమీ లేదిందులో!

రవఁణ గారే చెప్పుకున్నారు ‘కోతికొమ్మచ్చుల’ కు అచ్చులు సరిచూసుకుంటూ, లేని కాసె బిగించుకుంటూ!

కనుక ఇది ఒక సకలకథా కల్పవల్లి —

బోల్డు చిరుఉదంతాలు, పిట్టకథలూ, అనుభవగాథల బాధలూ, అన్నీ కలిసి శుభ్రమైన తెలుగందపు పాత్రలో వేసి, పాకం పట్టిన హాస్యరసాయనం, తగు మాత్రంగా ఏలకులు లవంగాలూ కలగలిపి అందించినది!

శ్రద్ధాభక్తులతో, ముఖ్యాతిముఖ్యంగా నిజాయితీతో వండి వడ్డించిన అక్షర పాయసం!

రవణ గారిని పోలిన చేయి తిరిగిన, నిండైన మనసు గల రచయితకు మాత్రమే సాధ్యమైన ప్రక్రియ, కళా విశేషం!

ఆయన పోలిన వారెవరూ..? మరి ఆయనే!

అనగా రచనలో ఈ అలవోక హాస్యాయనం అందరి వల్లా అయ్యే పని కాదు, అని పిండితార్థం!

పైగా జీవితపు అగడ్తలను కూడా పొగడ్తలతోనూ, బురిడీ వేసిన వారికి చమ్కీ లంటించుతూనూ, ఒకచో తేలికపరచే పదాలతోనూ, చాలాచో చిర్నవ్వు పెదవులు మీద తొణికింపచేసే వైనంగానూ రాయబడ్డది.

నవ్వొచ్చేటప్పుడు నవ్వే వాడిదేముందీ, ఏడుపు తన్నుకొస్తున్నప్పుడే — నిభాయించుకుని, నవ్వగలవాడే కథానాయకుడని ఏ బల్లా గుద్దకుండానే నొక్కి వక్కాణించి చెప్పే నిజాల కథనం!

ఇంతటి శతావధానం అందరి వల్లా అయ్యే పనేనా?!

కాదని వేరే చెప్పాలా, అప్పలకొండా?!

ఇంకొక్క మాట!

ఇదేవిఁటి, మాయాబజార్ చివరి ఘట్టం (అంత్యక్రియ అనుకోవద్దని మనవి) డైలాగ్ వచ్చేసింది, అనుకోకుండా! ‘ఘటోత్కచ క్రూరంగా రావు’, కళ్ళ ముందు మెదులుతూ!?

ఏది ఏమైనా ఘటోత్కచుడి లాగా పద్యమేమీ లేదులెండి.. “పాండవులె కాదు వారి బంధుల బంధుల బంధుల..” అంటూ!

ఇంతకీ ఆ ఇంకొక్క మాట ఏమనగా —

ఇందులో పురాణశైలీ ఉన్నది, హరికథా కాలక్షేపు పద్ధతీ ఉన్నది, భారతం చెపుతూ పౌరాణిక సార్వభౌమ ఏ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారో ఎక్కడెక్కడివో శ్లోక పద్యాలు ఉదహరించినట్లూ, ఏ ములుకుట్ల వారో హరికథా మధ్యంలో ఉపకథలు జోడించి రంజింపచేసినట్లూ!

కనుక ‘కోతికొమ్మచ్చి’ అని ఆయన సరదాగా పేరు పెట్టినా, ఇందులో అన్ని రసాలూ ఉన్నాయి, ప్రధానంగా మాత్రం హాస్యాత్మకథ!

అనగా విషాదాన్నీ, పీకలదాకా వచ్చి ముంచెత్తిన కష్టాలనీ, గుండె బరువులనూ కూడా హాస్యం జోడించి “పరవాలేదులే, అన్నీ సర్దుకుంటాయి! అయ్యో అట్లా డీలాపడితే ఎట్లా, పదండి ముందుకు” అనే ధీరోదాత్తుడి కథ!

ఈ మాట ఆయనతో అంటే మటుకూ ఆయన ససేమిరా ఒప్పుకోడు!

“ఆఁ మీ అభిమానం, అంతే! ఏముందీ ఇదీ ఒక సామాన్యుడి బతుకు విశేషాలే, దట్సాల్”, అని తేల్చేస్తారు, అసలైన వినయంతో!

***

సరే మొదలెట్టారు, సంతోషం!

కానీ ఒక్క విషయాన్నీ కొసంటా చెప్పరేఁ, ఒకటే దాట్లు, ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి.

కప్పకి దాట్లు, కోతికి కొమ్మచ్చులూ, రెండూ ఒకటేగా, పర్యవసానంలో!

అసలు ఉన్న మాట చెప్పాలంటే, భ్రమరకీటన్యాయం పనిచేసినట్టుంది.

ఆయన రాసిన పుస్తకం కోకొ అయితే దాని గురించి రాసినా కోకో నే అవుతోంది!

ఆ ప్రభావం అంతటిదీ, మరి!

మొత్తానికి దారిలో పడ్డారు, మెల్లిమెల్లిగా హలధర్ గారి ప్రామ్టింగుల వల్ల, ధవళేశ్వరం దగ్గర, తన ఇంటి వాతావరణం, హడావిడీతో ఆరంభిస్తూ, వర్ణిస్తూ!

అయ్యో మరిచాను.

అసలు ఈ ధవళేశ్వరపు సృష్ట్యాది కంటే ముందే, హరిః ఓం దగ్గరే, ఒక పంచుతో మొదలెట్టారు.

అది చెప్పక తప్పదు మరి!

“సృష్టిలో ‘తీయనిది’ స్నేహమేనోయి అన్నారు ఫలానా కవి, కానీ నేనూ బాపూ ‘తీసి’ చూపించాము”, అన్నారు.

ఏంటి తీశారు? ‘స్నేహం’ సినిమా తీశారుగా!

కవిగారన్నది తీపి రుచి గురించి. వీరు చెపుతోంది, తీయటం మూయటంలో “తీసి” గురించి!

రవఁణ గారూ, అబ్బో సామాన్యుడు కాడు లెండి!

వర్డ్సువర్తూ, వర్డ్సుస్మిత్తు – రెండూనూ!

A Wordsmith with Worthy Words!

చూశారా కవిగారి మాటను మీరిన వీరులం అని వారి ‘చమదుప్పు’!

ఇది యొక చమత్ కారము!

ఇప్పుడు ధవళేస్రం దగ్గరకొద్దాం, మళ్ళీ!

మనం అనుకుంటే ఏం లాభం, మధ్యలో బోల్డు సరదా కథలు, పర్వీన్ సుల్తానా ఎపిసోడ్‌లు, రైతుకూలీల నడిగి లాగించిన మహదాకలి భోజనాల కథలూ ఎన్ని చెప్పారో?!

అప్పుడొచ్చింది ప్యాసింజర్ రైలు లాగా ఠంచనుగా, ధవళేశ్వర బాల్యానికి!

***

చిన్నప్పుడు వీరి అవతారమిదట, ఆయనగారు చెప్పిందే —

“నాకు చేతికి పలకల మురుగులు చెవులకు లోలక్కులు, పాలకాయలూ ఉండేవి. వాటికోసం నన్ను దొంగలెత్తుకు పోకుండా బంట్రోతు కాపలా..!”

చిన్నప్పటి నుంచీ అంతేనన్నమాట, ఈ మనిషి నిండా బంగారమే, దరిమిలా అది పోయినా ఈ మనిషే బంగారంగా మిగిలిపోయారన్న మాట! ఉన్న మాట కూడానూ!

శాస్త్రం ఎప్పుడూ కర్కశంగా నిష్కర్షగానే చెపుతుంది మరి, పింగళి వారన్నట్టు!

మనమే సూక్ష్మంగా సారం గ్రహించాలి.

అది సరే,అంతా పోవడమేమిటీ, ఎట్లా?! అంటే, వాళ్ళ నాన్నగారూ, అమ్మమ్మ గారూ చేసిన దానాల వల్లా, సహాయాల వల్లా, సంతర్పణల వల్లా అని తేల్చేసారు!

చాలా చులాగ్గా “అదట్లా జరిగిపోయింది”, అన్న ధోరణిలో చెప్పేస్తారు.

ఆ నాన్నగారు, పోవటంతో, అమమ్మగారూ భద్రాచలం వెళ్ళిపోయారు.

వీరికి అండ, కార్యదుర్గ దుర్గాబాయమ్మ గారయ్యారట అప్పుడు, మెల్లిగా ఆమె సలహా మేరకు మద్రాసు చేరుకున్నారు.

ఇక్కడ నుంచి కష్టాలను ఓర్చుకున్నది ఎంత మామూలుగా చెప్పేశారో, ఆ జీవనపోరాటంలో ఎంతగా సర్దుకున్నారో అన్నది ఎక్కడా గోప్ప అని చాటుకున్నట్టు కాకుండా, గొప్ప సంయమనంతో చెప్పి చదివిస్తారు.

దట్ ఈజ్ రవఁణీయం అనిపించేలా, ఇంకొకరు ఈ విధంగా చెప్పలేరన్నట్లు!

ఆకులే కుట్టారో, మిలటరి వాళ్ళ పాంట్లకీ కోట్లకీ కాజాలే కుట్టారో, చేతులతో కాయితాలే చేశారో, అమ్మగారి స్వయంకృషీ, స్వతంత్రంగా బతకడం అన్న లక్షణాలతో తన వంతు చిట్టి చేయి వేస్తూ, వేస్తూ; చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా ట్యూషన్ మేస్టరయ్యారు రవణ గారు – కొన్నిచోట్ల లెక్కలూ,కొన్నిచోట్ల రుక్మిణీ కళ్యాణం లాంటి పద్య పాఠాలూ – చిత్రమైన స్పెషలైజేషన్‌గా!

ఒక చిట్టి కొమ్మచ్చి:

రెండు ఇడ్లీలు కొని, రెండూ తనకు పెట్టి పచ్చడి మాత్రం ఆమె తినేదని రాస్తూ, ఇట్లా రాస్తారు: “సాయంత్రం నాలుగున్నరకి వెడితే ప్రెస్సువాళ్ళు (ఆమె అక్కడ పనిచేస్తున్న కాలం) ఏదేనా పెట్టేవారు. మేమిద్దరం తినేవాడిని!”

ఆ చివరి వాక్యం తప్పచ్చయ్యింది అనుకునే ప్రమాదం ఎంతైనా ఉంది.

కానీ అది తప్పు కాదు, శుద్ధ రైటు!

ఇదింకో రవఁణీయపు కమనీయమైన ఉదాహరణ అన్నమాట.

ఆ మహాతల్లి తాను ఏమీ తీసుకోకుండా ఆ పెట్టినదంతా ఆకలిగా ఉన్న కొడుకుకే ఇచ్చేసేదని ఆ వాక్యం అట్లా రాసిన వారి భావసారం!

భవసాగరం టేకెన్ ఈజీ!!

అది భవసాగరం తాలూకే అయినా, అట్లాంటి డీలా మాటలు ఆ కలంలో రావేఁ?!

రావంటే రావు!

కొందరికి రామ్రామ్ ఊతపదం అయితే, ఈయనకు జారిపోయే అధైర్యపు మాటలు, ‘రావ్రావ్’!

“మా చిన్నప్పు డిన్నిన్ని కష్టాలు.. మేమింత కష్టపడి పైకొచ్చాం తెల్సా”, లాంటి టోన్‌లూ, జీవన్టోన్లూ ఏవీ ఉండవ్ గాక ఉండవ్ రవఁణీయంలో.

ఎ బార్న్ హ్యూమరిస్ట్ నెవెర్ క్రైస్ యూ నో!

ఇక్కడే కళ్ళు చెమరిస్తుంటే తన సొంత అమ్మతో పాటు మద్రాసులో తనను అక్కున చేర్చుకున్న అమృతవల్లుల లాంటి తల్లులు తొమ్మండుగురు గురించి రాశారు.

ఆ వివరం చదివి తీరాల్సిందే, మన కళ్ళూ చెమర్చాల్సిందే!

జుట్టున్నమ్మ ఏ ముడి పెట్టినా అందమే అన్నట్టు ఏది చెప్పినా ఈయనది హాస్యాస్యమే, నవ్వు ముఖమే,

నవ్వించే పలుకులే, కొండొకచో కలకండ ములుకులే!

నాది తూగోజీ, నా కంటే రెండేళ్ళు లేటుగా పుట్టిన బాపూది, పగోజీ!

భిన్నధృవాలం, చుక్కెదురులం దిక్కుల్లో, కానీ ఒకటిగా ఉంటున్నాం ఇన్నేళ్ళూ, ఎన్నేళ్ళూ?!

లెక్కలేనన్ని!

“అతనికి ప్రథమ కోపం. తిక్క, దూకుడు. ..అతను అపార్థసారథి అయితే, నేను అప్పార్థసారథిని.” అంటారు తమిద్దరి గురించి చెప్తూ!

ఆయన ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకుంటాడనీ; తాను అప్పులు చేసి, బంధాలను గట్టిపరచుకుంటాననిన్నీ ఆ ఇద్దరు ‘సారథు’లకూ వారిచ్చిన టీకాటిప్పణి!

ఇక మద్రాసు ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో బాలానందం గురించి చాలానందంగా చెప్పుతారు, క్యాంటీన్ సప్లై ఇంఛార్జులుగా వడ, కూల్ డ్రింకుల విషయంలో వేసిన దొంగ లెక్కల వరకూ, నిర్భయంగా, నిస్సంకోచంగా!

మరి నిజాలు మాత్రమే చెప్పటం రవఁణీయంలో భాగం చేసుకున్నారు కదూ, మొదట్లోనే అబధ్ధా లాట్టే వాడననీ, ఆడననీ ఒట్టేసి!

ఇక్కడే ‘బాల’ బాలల పత్రికలో రచనలూ ఆరంభించారు.

సూటిగా పోయేవాణ్ణి అన్నారే గానీ చిలిప్పనులు చేయలేదని అనలేదే, అబధ్ధాలెప్పుడైనా మేలు చేయటానికి వాడుతాననే కదూ అన్నారు.

ఈ తనకు తాను మేలు చేసుకోటానికి ఆడిన అబద్ధపు దొంగరాముడి కథ, లేదా దొంగరవఁణ కథ చూడండి:

వేద హరిశ్చంద్ర రేడియో నాటకంలో ఆ నాటకం రచయిత, కవిసామ్రాట్ విశ్వనాథ వారితో కలిసి నటించారు.

రేడియో వారు ఇరవై రూపాయలు ఇచ్చారు, చెక్కు రూపంలో. దాన్ని మార్చుకుని రూపాయి పావలా బాల్కనీ టికెట్ కొని రాబిన్ హుడ్ సినిమాకు చెక్కేసి, ఇంట్లో పద్ధెనిమిది రూపాయలు ముప్పావలా ఇచ్చారట.

అమ్మమ్మ మిగతాదేదీ అంటే, వాళ్ళెవరికో జెరం అని తెలిస్తే, మందూ బన్నూ కొనిపెట్టాను అని, ఇప్పుడు నయమయ్యే ఉంటుందిలే అని వీరి కొసరు కలిసిన జవాబు.

పూర్వం దొంగరాముడి సినిమాలో నాగీస్సర్రా వాడిన అబద్ధం బట్టీ కొట్టినట్టు లేదూ!

అయినా ఆయన లెక్కలో ఫరవాలేదు!

‘మాఫ్’, ఎందుకూ అంటే — ఇది అబధ్ధమైనా, ఒకరికి మేలైంది కదా, ఆ ఒక్కరూ వారే కదా?!

తనకు తాను మేలు చేసుకోవటానికి చిన్న అబధ్ధం ఆడినంత మాత్రాన, ఏ బ్రహ్మాండం బద్దలై పోతుందటా?!

ఇదీ, దానికి ఇచ్చుకునే జస్టిఫికేషన్!

పైగా, ఆ మేలు – ఇంగ్లీషు సినిమా చూట్టం! సామాన్యమైన మేలా, ఆలోచించండి!

అదన్నమాట బాలరవఁణ తంతు!

అసలు కోకొ లో ఇప్పుడొక అంతర్కోతి కొమ్మచ్చి:

మా క్రికెట్ టీమ్‌లో ఒకతను అంటుండేవాడు, “hitting sixes is my weakness, you know” అని.

యాభై మ్యాచుల్లో ఒకటి కొట్టాడేమో, దానికే ఆ నిక్కు!

అప్పటికి మేమంతా ఇంటర్ స్టూడెంట్సు, ఆయనేమో మంచి కంపెనీలో ఉద్యోగం, పైగా మాకప్పుడప్పుడు బాళ్ళకీ, మ్యాచ్ రోజుల్లో, లంచ్ లకీ ఫైనాన్షియర్ కూడా!

పైగా వయస్సులో పదేళ్ళైనా పెద్దవాడే!

అందుకుని కిసుక్కునో పుటుక్కునో మొహం మీదే నవ్వకుండా, నవ్వాపుకునేవాళ్ళం, ఆయన ఆ మాట తరుచూ అంటున్నా!

ఒకసారి ఇట్లా వెళ్ళి డక్ ఔట్ అయి వచ్చేశాడు.

అందరూ ఏంటిదీ అన్నట్టు చూశారంతే, ఆయన తన సహజమైన స్టైల్లో, “అది కాదు బాస్, ఆ చెత్త బౌలింగుకి బలే చిరాకేసింది, ఫస్ట్ బాలే సిక్స్ బాదేద్దామనుకుని ఊపాను. బ్యాడ్ లక్, కనెక్ట్ అవలే, స్లో వికెట్. చూసి ఆడండి అందరూ జాగ్రత్త, డోంట్ సే యూ హావ్ నాట్ బీన్ వార్న్డ్!” అంటూ బయటికి టీ కి వెళ్ళిపోయాడు.

కొందరు కోతరాయళ్ళు అంతే, ఏం చేస్తాం?!

ఇంతకీ ఇదంతా ఎందుకొచ్చిందంటే, చిన్నప్పుడు రవణ గారికి వింత అలవాటొకటి ఉండేదట! చీటికీ మాటికీ తెలిసిన వారి నెవరినైనా సరే అప్పు అడిగేవారట, ఆటోమ్యాటిక్‌గా!

అట్లా అప్పడిగిన అందాల సీత గురించిన ఎపిసోడ్ సరాసరి పుస్తకంలో ఆయన మాటల్లోనే చదవాల్సిందే!

చెపితే ఏం బాగుంటుంది?!

ఇక ఆయన 1940లలో మద్రాసుకు ఇంట్లో చెప్పకుండా జేబులో పదిరూపాయలతో బయలుదేరటం, రైల్వే క్లర్కు ఈ దాదాపో సంపూర్ణమో గుండుతో ఉన్న కుర్రాడి వాలకం చూసి, పదిరూపాయలే ఉన్నాయని తెలుసుకుని జాలిపడి, “పది రూపాయలతో మద్రాసుకు టిక్కెట్ రాదు గానీ, రెండ్రూపాయలు దారిలో తిండికుంచుకో; ఇంద, ఎనిమిది రూపాయల టిక్కెట్ ఏలూరు వరకు”, అని ఇవ్వటం, ఈయన ఏదో ఒకటిలే అని రైల్లో ఎక్కి కూచోటం – ఒక సాహస బాలుడి కథే; ఏలూరు చేరి వదాన్యులు ఈదర వెంకట్రావు గారింట ఉండటమూ, వారి ఆదరణా, సహాయం అర్థించి వచ్చిన మనుషులపై వారు చూపిన అక్కరా –

ఈ కథ చదివితే, కాలం ఎంత మారిపోయింది ఈ డెబ్బై ఎనభై ఏళ్ళలో, ఏరీ అట్లాంటి వ్యక్తిత్వాలూ, ఆ ఆప్యాయతలూ, ఆ సహృదయతలూ అని అనిపించక మానదు!

మద్రాసులో వారి నిరుద్యోగ పర్వం గురించి రాస్తూ, న్యూస్ పేపర్ల కాగితాల మీద పడుకోవటమూ, అవే దుప్పటిగా కప్పుకోవడమూ వగైరా కష్టాలూ, ఫుల్ మీల్సు తిన్నట్టు వచ్చిన కలల గురించీ సరదాగా ‘రవణీయం’గా రాసేసి కంటతడి పెట్టించేస్తారు.

 పైగా ఒక ముక్తాయింపు కూడా ఇస్తారు ఈ సందర్భంలో, పడ్డ కష్టాల గురించి:

“..ఇదంతా ఈదేసిన గోదావరి – గడిచిపోయిన కష్టాలు – అనుభవించినపుడు బాధగా ఉన్నా ఇప్పుడు చెప్పకోవడానికి గొప్పగానే ఉంటుంది..” అని!

ఈ సమయంలోనే మద్రాసులో అనేక మంది రచయితలతో, కవులతో పరిచయాలు, లేఖక ఉద్యోగాలు, ఒకటిన్నర అద్దె ఇళ్ళ కథనాలు, ఆకళ్ళు, పస్తులలోనే మస్తుగా పుస్తకాలు చదివి మింగేయటాలు — వగైరాలన్నీ– నిండు భోజనం చేసిన వాడి ధీమాతో రాసి ‘ఔరా’, అనిపిస్తారు.

మధ్యమధ్యలో ఎంతో కృతజ్ఞతతో తనను ఆ పస్తు ఆపదల కాలంలో ఆదుకున్న ఆదరించిన అనేక మంది గూర్చి సరదాగా, వ్యంగ్యంగా, అన్నీ కలిసిన తిరగమోతగా మోస్ట్ నవ్వబుల్‌గా రాస్తూంటారు!

పత్రికారంగ అనుభవాలు, అప్పటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభల ప్రభలూ; ఆ పత్రికారాజాల్లో పని చేసిన పెద్దల సుద్దులూ, ఎడిటర్/ఓనర్ల తలల, నడతల తరహాలు, అచ్చుతప్పుల వింత రామాయణాలూ, తన పొగరు విగర్లూ, విసుర్లూ; అన్నీ సరదాగా సాగే ఉద్యోగపర్వపు కబుర్లే!

ఉద్యోగం సీరియస్సే, చెప్పటమే సరదాస్ అని భావము!

‘సూరదాస్’, అని చదువుకుంటే, భక్తిలో కాలేసినట్లే, జాగ్రత్తోయ్, మరి జాగ్రత్త!

ఇక ఆపై నేరాల రిపోర్టర్‌గా, ఆయనే అన్నట్టు హైలెవెల్ నేరాల రిపోర్టర్‌గా అనగా రాజకీయ రిపోర్టర్‌గా — అనుభవాలు కోకొల్లలు, వాటికి రంగులు హంగులతో చెప్పే వైనాలు కొక్కోకొల్లలు!

చదివిన వాడికి చదివినంత, రాజకీయ హాస్యామ్రరసం!

ఈ కథల్లో దేశ ప్రెసిడెంట్లూ ఉన్నారు, ముఖ్యమంత్రులూ ఉన్నారు. వారితో రవణ గారి భేటీకథలూ ఉన్నాయి.

ఇక కేవలం కథలూ, పకోడీల వంటి కబుర్లూ, మొగలిపూల మొనల విసుర్లూ, సినీమాయా డైలాగులు, సైసై చొక్కాలూ మాత్రమే అని రవణ గారినీ; ఉత్త ఉత్తమ బొమ్మలార్టిస్టూ, బెస్ట్ ఆర్టి ‘ష్ట్రిక్ట్’ డైరెక్టర్ అని అని బాపూ గారిని లెక్కెట్టితే, ‘శంకరాభరణం’లో కాముడు లేదా కామేశ్వర్రావ్ హిందోళంలో రిషభం అన్నంత బ్లండరరూ, త్యాగరాయ కీర్తనలో అపస్వరం పాడినంత సిన్నరూ అయిపోయినట్లే!

సంగీతంలోనూ ఇద్దరివీ కడియం వేసిన చేతులట!

‘అందె’ ప్పప్ప పాతదైపోయిందేమోనని, కడియం వేశాం, మాయా శశిరేఖ కూడా సంతోషిస్తుంది కదా అని!

ఎవరెవరో కాదు మన మహానటి సావిత్రి, మాయాబజార్ లో!

వీరిద్దరూ మాంఛి సంగీతాభిమానులే మాత్రం కాదు అఖండ వైవిధ్యమున్న సంగీతాలను విన్న మహా శ్రోతలు. ఇటు శుద్ధ కర్ణాటక కీర్తనలు, అటు ఠప్పా ఠుమ్రీ ఖయ్యాళ్ళూ, గజళ్ళూ- అన్నీ రకాలూ, రసాలూ ఆస్వాదించిన వారే, ఆ ఆపాతమధురాలలో మునగానాం తేలానాం గా!

అటు పక్క బీటిల్స్, మోనార్క్, బాక్ వగైరాలు పాశ్చాత్యంతో సహా!

పైగా, కొన్నాళ్ళు వీణ (రవణ గారు), ఆర్గానికా (బాపూగారు) నేర్చుకుని కొంత సాధించి వాయించిన వారూను!

రవణ గారైతే మద్రాసులో సంగీత కచ్చేరీ తిరునాళ్ళను సందర్శించీ, శ్రద్ధగా వినీ, ఆస్వాదించిన రసికాగ్రేసరులు కూడానూ!

వీరి సినీ రివ్యూల మాటకొస్తే, అవిన్నీ హాస్యం ఒలికించే వచన పచనాలే.

తిడ్తున్నాడా మెచ్ఛుకుంటున్నాడా అని నిర్(ధన) మాతలు ముక్కున వేలేసుకునేట్టు!

అంత కమ్మని తిట్లూ చురకలూ అన్నమాట ఆ రాత కుట్టులు. సినీమా రివ్యూల పేరిట అల్లిన సరదా పూల ఎంబ్రాయిడరీలు!

ఉదా: సినీమా లెంగ్త్ ఎక్కువైతే ప్రేక్షకులకు ఈయనిచ్చిన ఉచిత సలహా/హెచ్చరిక: “ఈ సినిమాకి పిల్లలతో వెళ్ళే వాళ్ళు, జంతికలూ, చేగోడీలతో పాటు మరచెంబుల మంచినీళ్ళు రెండేసి తీసుకెళ్ళడం మంచిది!”.

సినిమా ఫ్లాపైపోయి, ఎగనామం పెట్టినా, సదరు నిర్మాత గారు ఓ సారి చిర్నవ్వైనా నవ్వక మానడు, ఇది చూసే యోగం ఆయనకుంటే!

పాపం ఆ పూర్ రిచర్డ్‌కి విషాదంలోనూ నవ్వే పరిస్థితి కల్పించిన పుణ్యమూర్తి రవఁణ గారు!

ఇంకోతి!

అరెరే, పొరపాటు. టకారోచ్చారణాశక్తత!

ఇప్పుడు గొంతు సవరించుకొని, బిగ్గరగా, స్పష్టంగా-

ఇంకోటి- ఏదీ…………. ఉదాహరణ:

“ ‘అప్పు చేసి పప్పు కూడు’, చూశాను. గందరగోళం గలీజు బజారులా ఉంది!”.

హతవిధీ, ఏమి ఈ రివ్యూయర్ సాహసము! అదియునూ, విజయావారి చిత్రమునకు ఇంత డిస్మిసివ్ టోన్‌లో వాక్రుచ్చుటయా?!

పాతాళభైరవి లోని సాహసవీరుడు తోట రాముడికి బంధువేమో ఆరా తీయుడి!

తీశాం మహాప్రభో! బంధువేనట,

అతను తోట రాముడైన, ఇతను మాటవీరుడట!

అవునవును వీరుడే, ముమ్మాటికీ, మూడుమూళ్ళ తొమ్మిదిటికీ!

కాకపోతే అన్నన్ని చేస్తారా, రిజైనూ చేస్తారా అది కూడా వాలంటరీగా – ఉద్యోగాలు!

మాట నచ్చకో, మనసు నొచ్చో, రాసినవే ఏ నాడూ రాయకపోయినా, చేసినదే చేసినట్టనిపించో కారణమేదైనా — అవి అనేకం!

ఎల్లాగైనా బతకొచ్చులే మన దగ్గర మాటాయుధం ఉందిగా అనే వీర ధీరసా! మాట ఖలేజా! పెన్ను భరోసా!

A born fighter, an irresistible Freelancer and an irrepressible spirit – అదీ రవఁణీయమంటే!

అదీ ఉత్త simply, కాదు కాదు సింబ్లీ, ఇనిమిటబుల్!

అననుకరణీయుడైన వెంకటరమణ!

ఒంటిపేరు, ఇంటిపేరు – ‘ముళ్ళ’పూడి!!

పూయించేవి మాత్రం నవ్వు పువ్వులే!

ఆంధ్ర పాఠకులూ, ప్రేక్షకులే – వీర భక్తులు!

🙏

Exit mobile version