Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్గత సంఘర్షణ నుంచి పుట్టిన అక్షర వేదన ‘రవిక’ కవితా సంపుటి

[శ్రీమతి రేణుక అయోల గారి ‘రవిక’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి మణి వడ్లమాని.]

దేళ్ల పిల్లకి పాతికేళ్ళ భర్త పోతే, అమానవీయ రీతిలో విధవా తంతు జరిపి తను పుట్టిన ఇంట్లోనే చనిపోయేంత వరకు జీతం బత్తెం లేని నౌఖరీ చేసిన మా చిన్నాన్నమ్మ ఈ రవిక కవిత సంపుటి లోని ప్రతి అక్షరంలో కనిపించింది.

అలాగే కవయిత్రి తను రాసుకున్న ముందుమాటలో ప్రతి అక్షరం మా ఇంట్లోని మా నాన్నమ్మ, అమ్మమ్మ కాలంలో జరిగాయి.

నిజానికి అప్పటి సమాజం కుటుంబం కూడా స్త్రీల పట్ల వివక్ష చూపిస్తూనే వచ్చారు. అలాగే వీళ్ళ మెదళ్లని ఒక రకమయిన హిప్నోటైజ్ చేసేసారు. అందుకే అప్పటి ఆడవాళ్ళు ఆ మాటల ట్రాన్స్ లోనే ఉండిపోయారు. ఒక రకమయిన భీతి, భయం వాళ్ళని ఆవహించి ఉండేవి. అందుకు కారణం, ఆలోచించే అవకాశం, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం. అన్నిటికన్నా స్త్రీని అణిచి వేయడంలో వివక్ష చాల ముఖ్య పాత్రను పోషించింది

రవిక అనేది, కొన్ని ఆసియా దేశాలలో స్త్రీలు ప్రధానంగా ధరించే పై వస్త్రం.

రేణుక అయోలా కవిత్వం స్త్రీ జీవితాన్ని ఒకే కోణంలో కాదు – అణచివేత, తిరుగుబాటు, ఆత్మగౌరవం, అనుభవం అన్నింటినీ కలిపి చూపిస్తుంది.

‘రవిక’ అనే పేరుతో రాసిన ఈ కవితా సంపుటి మహిళలు వేసుకునే జాకెట్టు గురించి కాదు. అది ఒకప్పటి కాలంలో స్త్రీ మానమర్యాదల పేరుతో ఆమె శరీరాన్ని, స్వేచ్ఛను, గుర్తింపును నియంత్రించిన వ్యవస్థపై ప్రశ్న. రవిక లేని తనం ఒక వ్యక్తిగత లోటు కాదు – సామూహిక అణచివేతకు, వివక్షకు చిహ్నం.

బ్రాహ్మణ కుటుంబాల్లో వితంతువులకు రవిక నిషిద్ధమైన సంప్రదాయం, ముఖ్యంగా కేరళలో వచ్చిన కొన్ని ఉద్యమాలు, స్త్రీ శరీరంపై పన్నులు, శిక్షలు – వంటి విషయాలని ఈ కవితల్లో నేపథ్యంగా కాక, జీవంత అనుభవంగా ప్రవేశిస్తుంది.

కవయిత్రి తన నానమ్మ జీవితం చూసినది కాబట్టి ఆ అనుభవంతో రాయటం వల్ల, సహజంగా అనిపిస్తుంది, ఇది ఒక బాధ, అంతర్గత సంఘర్షణ నుంచి పుట్టిన అక్షర వేదన

ఈ సంపుటి ఒక స్త్రీ యొక్క Soliloquy (సోలొలోక్వి). Soliloquy (సోలిలోక్వి) ఒక స్త్రీ తనకు తాను చెప్పుకున్న అంతర్గత సంభాషణ. అందుకే ఇందులో నాటకీయత లేదు, కృత్రిమ ఆర్భాటం లేదు. ప్రతి పంక్తి అనుభవానికి దగ్గరగా నిలుస్తుంది.

వైధవ్యం, శరీరంపై చూపుల వేట, రంగు వివక్ష, వివాహ వ్యవస్థలోని అణిచివేత, సహజీవనం వంటి సమకాలీన ప్రశ్నల వరకూ ఈ కవిత్వం విస్తరిస్తుంది. సమస్యను మాత్రమే కాదు, దానికి ఎదురైన ధైర్యాన్నీ చూపిస్తుంది. ఇదే ఈ కవిత్వాన్ని బలంగా నిలబెట్టే అంశం.

రవిక ఇక్కడ అలంకరణ కాదు; రక్షణ. అది మగ చూపుల నుంచి కాపాడే కవచం, స్త్రీకి భద్రత ఇచ్చే గడప. “రవికని కప్పుకున్న గుండెలు పసిపాపల్లా నిద్రపోతున్నాయి” అనే పంక్తి ఈ సంపుటి సారాన్ని చెప్పేస్తుంది.

సంప్రదాయం – ఆధునికత మధ్య నలిగిన స్త్రీ అనుభవమే ‘రవిక’. నిన్న ‘హక్కు’ కోసం సాగిన పోరాటం, నేడు ‘ఇష్టం’గా మారిన ప్రయాణం – ఈ రెండు మధ్య ఉన్న వారధి ఆత్మగౌరవం. అదే ఈ కవిత్వం నిరంతరం గుర్తు చేస్తుంది.

స్త్రీని వస్తువుగా చూసే సంస్కృతి నుంచి బయటపడాలని కోరే ఈ కవితలు పాఠకుడిని ఊరుకోనివ్వవు. చదివి ముగించేసే కవిత్వం కాదు ఇది; చదివాక ఆలోచింపజేసే కవిత్వం.

అంతే కాదు ఈ సంపుటిలో ఒక్కో శీర్షికకు ముందు రాసిన బ్లర్బ్స్(blurbs) మరింత లోతుగా ఆలోచింప చేస్తాయి.

ముఖ్యంగా ఖాళీ నుదురు, గాజుల మలారం, రంగు దోపిడీ, యుద్ధం ఓర్వని ఇల్లు, సామాన్య ఇల్లాలు. వీటిల్లో ఒక సాధారణ గృహిణి ఆలోచనలు యెంత ఉన్నతంగా ఉంటాయో రాసిన తీరు అద్భుతం.

వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ‘రవిక’ కవితా సంపుటి తప్పకుండా చదవాల్సిందే.

***

రవిక (కవిత్వం)
రచన: రేణుక అయోల
ప్రచురణ: బోధి ఫౌండేషన్
పేజీలు: 108
వెల: 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
రచయిత్రి: 9676853987

Exit mobile version