[శ్రీ శింగరాజు శ్రీనివాసరావు రచించిన ‘రెక్కలు తొడగాలి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
పోర్ను వీడియోల ప్రభావం వైరస్ కంటే ప్రమాదకరమై
వావి వరుసలు లేని కామపు కాన్సరును కంటికి అంటించింది
రాజకీయం మాఫియాతో జతకలిసి చేస్తున్న వ్యాపారం
మాదకద్రవ్యాల మత్తులో యువతను ముంచుతున్నది
విలువలు నడివీధిలో నగ్నంగా నిలబెట్టబడ్డాయి
మంచికి ఉరివేసి అవకాశవాదం సింహాసనమెక్కింది
సమాజ క్షేత్రమిప్పుడు విశాలంగా లేదు
అడ్డుచువ్వలు దించబడి జైలు గోడలను తలపిస్తున్నది
ఆకాశం చూరు క్రింది అహంకార దావాగ్నిని రగిల్చే
కుల, మత, రాజకీయ శక్తులు జడలు విప్పుతున్నాయి
మనుషుల నమ్మకాల దీపపు శిఖల మీద
విద్వేషపు అగ్గిపుల్లలను గీచి మంటలు పెడుతున్నారు
‘పలక’ తోనే అంతరించిపోయిన ‘మంచి పలుకు’ను
ఉపదేశంలా బోధించే ఉపాధ్యాయులు కావాలిప్పుడు
ఉపాధ్యాయుడంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి
తిమిరాన్ని తొలగించే జ్ఞానాన్ని అందించే విజ్ఞానగని
వలువలు ఊడిన విలువలకు వారే అంగీలు కట్టాలి
మతమౌఢ్యపు గోడలను ఛేదించే పిడికిళ్ళను తయారుచేయాలి
వేలాది సూర్యకిరణాల ప్రకాశమై నిలిచి
యువతరానికి సరికొత్త రెక్కలు తొడగాలి
మరణశయ్య మీద తులసితీర్థం కోసం చూసే మానవత్వానికి
సంజీవని అందించి తిరిగి బ్రతికేలా చేయాలి..
ఒంగోలుకు చెందిన శింగరాజు శ్రీనివాసరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా 2015 సంవత్సరంలో పదవీవిరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వీరు వ్రాసిన కథలు, కవితలు.. ఆంధ్రభూమి, స్వాతి, రమ్యభారతి, సాహితీకిరణం, విశాఖ సంస్కృతి, విశాలాక్షి, హాస్యానందం, ఉషా వంటి వివిధ పత్రికలలోను, సంచిక, తపస్వి మనోహరం, సుమతి, కథామంజరి, గో తెలుగు, నెచ్చెలి, సహరి, షార్వాణి, రవళి వంటి మరికొన్ని అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో కథలు, కవితలు బహుమతులను పొందాయి. ఫోన్ 9052048706
