అర్ధరాత్రి దాటి ఉంటుంది. పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ మేల్కొనే ఉన్నారు. రైలు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. శంకర్ పక్కన కూచుని ఉన్న యాభైయేళ్ళ వ్యక్తి “ఎవరో రైలుని బలవంతంగా ఆపినట్టు అన్పిస్తోంది” అన్నాడు. ఆ బోగీలో కూచుని ఉన్న వ్యక్తులందరిలో భయం.. బిక్కు బిక్కుమంటూ చుట్టూ ఉన్న చీకట్లోకి చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూచున్నారు.
రెండు మూడు నిమిషాలు గడవకముందే పక్కనున్న బోగీల్లోంచీ హాహాకారాలు విన్పించాయి. వాటితో పాటు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు కూడా..
“మనం యిందులోనే ఉంటే చంపేస్తారు. కిందికి దూకి పారిపోదాం పదండి” అన్నాడు యిందాకటి వ్యక్తి. బోగీలోని మనుషులందరూ ఒక్కుమ్మడిగా లేచి తలుపుల వైపుకు పరుగెత్తారు.
శంకర్ కూడా దర్శన్‌లాల్‌ని ఎత్తుకుని కిందికి దూకి ముందుకు పరుగెత్తాడు. చీకటి.. తుప్పలు.. పొదలు.. ఏమీ కన్పించడం లేదు.
“అరే.. పకడోరే.. చోడనా మత్ ఏ కాఫిరోంకో” అంటూ వెనకనుంచి విన్పించింది. కొందరు ముసల్మానులు విచ్చుకత్తుల్తో పారిపోతున్న వాళ్ళ వెంటబడ్డారు. వాళ్ళ కత్తులకు బలౌతున్న వాళ్ళ ఆర్తనాదాలు చీకట్లని చీల్చుకుంటూ హృదయవిదారకంగా విన్పిస్తున్నాయి.
పరుగెత్తుతున్న వాళ్ళు ఒకే వైపు కాకుండా వేర్వేరు వైపులకు చీలిపోయారు. అలా చీలిపోవటం వల్లా, చీకటి రక్షణగా ఉండటం వల్లా, చెట్లూ పొదలూ ఉండటం వల్లా కొంతమందైనా బతికిపోయారు. అలా బతికిపోయిన వాళ్ళలో ఓ పొద వెనక దాక్కున్న శంకర్ కూడా ఉన్నాడు. ముసల్మానులు కొద్దిసేపు వాళ్ళ కోసం వెతికి వెనక్కితిరిగారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా రైలు దగ్గరకు వెళ్ళడానికి శంకర్‌కి ధైర్యం చాల్లేదు. ఒకవేళ వాళ్ళు అక్కడే కాపుకాసి ఉంటేనో అన్న భయం..
“ముష్కరులంతా వెళ్ళిపోయినట్టున్నారు” అని తన పక్కనుంచి ఎవరో మెల్లగా అనడంతో శంకర్ అతని గొంతుని బట్టి రైల్లో తన పక్కన కూచున్న యాభై యేళ్ళ వ్యక్తిగా గుర్తించాడు.
“వెళ్ళిపోయారో లేక మనం తిరిగి వస్తామని మనకోసం కాచుకుని కూచున్నారో” అన్నాడు శంకర్.
“లేదు.. వాళ్ళు తప్పించుకున్న మనలాంటి గుప్పెడు మంది కోసం సమయం వృథా చేసుకుంటారనుకోను. తక్కువ సమయంలో ఎక్కువ మంది హిందువుల్ని చంపడమే వాళ్ళ లక్ష్యం.”
“ఇప్పుడేం చేద్దాం?”
“యిప్పుడు మనం రైలు దగ్గరకు వెళ్ళొచ్చనుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోయి కూడా అరగంటకు పైగా అయింది” అన్నాడతను.
“రైలు దగ్గరకెళ్ళినా ఏం లాభం ఉండకపోవచ్చు. ముష్కరులు డ్రైవర్ని కూడా చంపేసి ఉంటే మనం ఎక్కడికీ వెళ్ళలేం. రైలు ఎవరు నడుపుతారు?” అన్నాడు శంకర్.
“అలా చేయరు. రెండ్రోజుల క్రితం రైల్లో ఉన్న అందర్నీ చంపేసి డ్రైవర్ని మాత్రం ప్రాణాలతో వదిలేశారు. వాళ్ళు ప్రతీకారంతో చేసిన మారణకాండ హిందువులకు తెలియాలంటే రైలు బాంబే వెళ్ళాలనే వాళ్ళూ కోరుకుంటారు” అన్నాడతను.
“వెళ్దామంటావా?” భయంగా అన్నాడు.
“ధైర్యం చేయక తప్పదు” అన్నాడతను.
యిద్దరూ పొదల్లోంచి బైటికొచ్చి రైలు వైపుకు నడుస్తుంటే మరికొంత మంది కలిశారు. రైలుని సమీపించిన వాళ్ళలో కొంతమంది అక్కడి దృశ్యాన్ని చూసి వాంతి చేసుకున్నారు. ఆడవాళ్ళలో ఒకరిద్దరు కళ్ళు తిరిగిపడిపోయారు. బోగీలనిండా శవాలే.. రక్తం ధారలుగా పారుతోంది.
యాభైయేళ్ళ వ్యక్తి వాళ్ళను అక్కడే ఉండమని చెప్పి యింజన్ వైపుకెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చి “నేను చెప్పాను కదా వాళ్ళు డైవర్ని చంపరని. మనం ఈ ఎదురుగా ఉన్న బోగీలోకి ఎక్కుదాం. పది నిమిషాల తర్వాత రైలు బయల్దేరుతుందని చెప్పాడు. ఎక్కండి” అన్నాడతను.
శంకర్‌తో పాటు అందరూ బోగీలోకి ఎక్కారు. మొత్తం పదిమందికి మించి ఉండరు. అందరి మొహాల్లో చావుని అతి సమీపంగా చూసినదానికి గుర్తుగా ప్రేతఃకళ కన్పిస్తోంది.
రైలు కదిలింది. రక్తపు వాసన.. ముక్కలుగా నరకబడ్డ శవాల శరీర భాగాలు.. భీభత్స భయానక వాతావరణం.. దాంతో పాటు మరోసారి రైలుని ఆపి ముష్కరమూక దాడి చేస్తుందేమోనన్న భయం..
రైలు బాంబే స్టేషన్ చేరేవరకు ఆ పదిమంది నరకాన్ని అనుభవించారు. రైలు స్టేషన్లో ఆగంగానే మిలటరీ వాళ్ళెవరో వచ్చి వాళ్ళని ట్రక్కుల్లో ఎక్కించుకుని సహాయక శిబిరాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్నాక శంకర్‌ని జమ్మూ వెళ్ళే రైలెక్కించారు. సహాయక శిబిరానికొచ్చిన డాక్టర్ దర్శనలాల్‌కి జ్వరం తగ్గడానికి మందులిచ్చాడు. జ్వరం తగ్గింది. కానీ దర్శన్‌లాల్ మానసిక సమతుల్యత దెబ్బతింది.
***
శంకర్ ఎంతటి విషాదాన్ని మోసుకుంటూ యింటికి తిరిగొచ్చాడో.. తండ్రిని పోగొట్టుకున్న విచారం.. తన కళ్ళముందే తండ్రిని కత్తుల్తో తెగనరుకుతుంటే నోరు పెగుల్చుకుని వస్తున్న కేకని, గుండెని తొల్చుకుని ఉబికుబికి వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపుకోవటం కన్నా విషాదం మరేముంటుంది? పెదనాన్న కుటుంబం మొత్తం కళ్ళముందే ఆహుతైపోయింది. కమ్లేష్ ఇచ్చిన సలహానే తమల్ని కాపాడిందనుకున్నాడు. అటకమీద చుట్టబెట్టిన పాత పరుపుల వెనుక దాక్కోవడం వల్ల ముష్కరమూకల కళ్ళబడకుండా తప్పించుకోగలిగామని సంతోషపడ్డాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. తనకు ప్రాణంలో ప్రాణమైన పెద్ద కూతురు షామ్లీ ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది.
కమ్లేష్ భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా మంటల్లో కాలి బూడిదైపోయారు. అదో విముక్తి.. కొన్నాళ్ళు ఏడ్చి మనసుని శాంత పర్చుకోవచ్చు. కానీ షామ్లీ విషయం అలా కాదే.. ఎత్తుకెళ్ళి ఏం చేశారో అనే దిగులు.. పదమూడేళ్ళ లేత ప్రాయం.. పగతో రగిలిపోతున్న పులికి జింకపిల్ల దొరికితే నమిలి తినేయకుండా వదుల్తుందా? ఒకటా రెండా.. చుట్టూ ఎన్ని పులులో.. పీక్కుతింటూ.. రాత్రుళ్ళు నిద్ర పట్టదు. మాగన్నుగా పట్టినా భయంకరమైన పీడకలలు.. పెద్దగా కేక పెట్టి లేచి కూచుంటున్నాడు.
దర్శన్‌లాల్ పరిస్థితి తనకన్నా మరింత అధ్వాన్నంగా ఉంది. తను నిద్దట్లోంచి గావు కేకలు పెడ్తూ లేచి కూచుంటుంటే వాడు మెలకువలోనే దయ్యాన్ని చూసినట్టు కేకలు పెడ్తున్నాడు.. “నాన్నా.. రక్తం.. నా కాళ్ళు చూడు ఎర్రగా ఎలా ఉన్నాయో.. చుట్టూ రక్తం నాన్నా.. మోకాళ్ళ ఎత్తున పారుతున్న రక్తం..” అంటూ అరుస్తాడు. వాడి దగ్గరకు ఎవరెళ్ళినా “నాన్నా.. చంపేయడానికి వస్తున్నాడెవడో.. వాడి చేతిలో కత్తి ఉంది చూశావా.. దాన్నిండా రక్తమే.. ఇప్పుడేగా తాత పొట్టని అదే కత్తితో చీల్చాడు.. పేగులు బైటికొచ్చాయి చూశావా నాన్నా.. పాపం తాత.. పరుగెత్తు నాన్నా” అంటూ దూరంగా పరుగెత్తుకుని పోతాడు.
తన భార్య దిగులుతో చిక్కి సగమైపోయింది. ఆమె ఏడ్వని రోజు లేదు. కూతుర్ని తల్చుకుని ఏడుస్తుంది. కొడుకు చూసే పిచ్చి చూపులు చూసి ఏడుస్తుంది. టౌన్లో ఉన్న వైద్యుడికి చూపించారు.
“మీ నాన్ననీ పెదనాన్ననీ చంపుతున్నప్పుడు ఈ కుర్రాడు చూసి ఉంటాడు. దార్లో చెల్లాచెదురుగా పడిఉన్న శవాలు, తన అక్కను వాళ్ళు బలవంతంగా తీస్కెళ్ళిపోవడం, రైల్లో మీకెదురైన అనుభవాలు.. పిల్లాడి మనసు మీద గాఢమైన ప్రభావాన్ని కలిగించి ఉంటాయి. కొన్నాళ్ళు పోతే ఆ జ్ఞాపకాలు మరుగున పడి, మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది” అని చెప్పి డాక్టర్ మందులిచ్చాడు.
పరుపుల చాటున తను భయంతో కళ్ళు మూసుకుని పడుకున్నాడు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారో గమనించలేదు. బహుశా దర్శన్‌లాల్ పరుపుల మధ్య ఉన్న సందులోంచి వాళ్ళు తన నాన్ననీ పెదనాన్ననీ కిరాతకంగా చంపడం చూసుంటాడు. కాలిపోతూ తన పెద్దమ్మ, కమ్లేష్ పిల్లలు పెట్టిన కేకలు కూడా వాడిని భయ విహ్వలుడిని చేసుంటాయి. అన్నిటికీ మించి వాడికి చాలా యిష్టమైన షామ్లీని వాళ్ళు లాక్కెళ్ళడం..
నెల రోజులు గడిచిపోయినా ఆ భయానక దృశ్యం తన కళ్ళముందు నుంచి మాయం కావడంలేదు. షామ్లీ ‘నాన్నా’ అంటూ అరిచిన అరుపు తన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఎత్తుగా లావుగా ఉన్న పఠాన్ ఎవడో దాన్ని ఎత్తుకుని భుజం మీద వేసుకున్నప్పుడు అది విలవిల్లాడుతూ చేతులూ కాళ్ళూ కొట్టుకోవడం ఈ క్షణమే తన కళ్ళముందు జరుగుతున్నంత స్పష్టంగా కన్పిస్తోంది.
“మన షామ్లీ బతికే ఉందంటారా? చంపేసి ఉంటారేమో.. బతికుంటే బావుంటుంది కదండీ.. ఎక్కడో ఓ చోట అది సుఖంగా… అయ్యో నా మతి మండా.. వాళ్ళ చేతుల్లో పడ్డాక పిల్ల సుఖంగా ఎలా ఉంటుందండీ” అంటూ తన భార్య ఏడ్చినపుడల్లా తనకూ వెల్లువలా పొంగుతూ ఏడుపొస్తోంది.
షామ్లీ నిజంగానే బతికుంటే.. తను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటే.. తనతో పంపిస్తారేమోనన్న ఆశ.. ముస్లింలు ఎత్తుకెళ్ళిన హిందూ స్త్రీల గురించి రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. బక్రీద్ రోజు గొర్రెల్నీ, మేకల్నీ అమ్మేసినట్టు ఆడవాళ్ళని అమ్మేస్తున్నారని.. అమ్మే ముందు వాళ్ళని కొనుగోలుదార్లు చూసేలా నగ్నంగా నడిపిస్తున్నారని.. కొంతమందిని బానిసలుగా చేసి వాడుకుంటున్నారని.. కొంతమందితో మతం మార్పించి వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటున్నారని..
యిటువంటి వార్తలు చెవిన పడినపుడల్లా షామ్లీని తల్చుకుని నరకం అనుభవిస్తున్నాడు. ఒకవేళ షామ్లీని అమ్మేస్తే ఏం చేయాలి? తనకున్న యిల్లు, పొలాలు, గొడ్డూ గోదా అమ్మేసి దానికి రెండింతలిచ్చి తన కూతుర్ని విడిపించి తెచ్చుకుంటాడు. ఒకవేళ మతం మార్పించి సంసారం చేసి, దాని వల్ల షామ్లీ కడుపు తెచ్చుకుని … ఆ ఆలోచనకే అతనికి భయమేసింది. అటువంటి ప్రమాదం జరక్కముందే షామ్లీని వెనక్కి తెచ్చుకోవాలి.
కానీ ఎక్కడని వెదుకుతాడు? ఎవరెత్తుకెళ్ళారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెల్సినా తను వెళ్ళి అడిగితే ఇస్తారా ముసల్మానులు? అసలు తను ప్రాణాల్లో తిరిగి రాగలడా? ముక్కలుగా నరికేయరూ…
ఆ భయానక అనుభవం జరిగి ఏడాది దాటినా అది నిన్న మొన్న జరిగినట్టే అన్పిస్తోంది. విషాదం తన యింటినిండా దట్టంగా పర్చుకుని తిష్ఠవేసుకుని కూచుంది.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.