Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఋణం

[శ్రీ చిట్టాప్రగడ శ్రీరామ నరసింహ మూర్తి రచించిన ‘ఋణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చ్యుతం మాస్టారు క్లాసులో పాఠం చెబుతుంటే బయట వరండాలో నిల్చుని ఉన్న మల్లయ్య కేసి చూసి బయటకు వచ్చి మల్లయ్యతో “పాఠం పూర్తి అయ్యేక మాట్లాడతాను, అంతవరకు ఉండు” అని క్లాసు లోకి వెళ్ళిపోయారు.

మల్లయ్య తలమీద తలపాగా తీసి చేతిలో పెట్టుకొని వరండాలో చివరకు కూర్చున్నాడు. మోకాలి వరకు కట్టిన మాసిన పంచ, మాసిన జుబ్బా, సంస్కారం లేని జుట్టు, బక్కచిక్కిన శరీరం, కూలి నాలి చేసుకొని బతుకు ఈడుస్తున్నట్టు చూస్తూనే తెలుస్తోంది.

కొంతసేపటికి అచ్యుతం మాస్టారు పాఠం పూర్తి చేసి బయటకు వచ్చి మల్లయ్య కేసి చూసి దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేసారు. మల్లయ్య లేచి మాస్టారి దగ్గరకి వచ్చి రెండుచేతులూ జోడించి నమస్కారం చేసి “మా బుడ్డోడు సెప్పేడండి, మేట్టారు రమ్మన్నారని. అందుకే వచ్చినాను. మేట్టోరండి.. మా బుడ్డోడు ఏం తప్పు చేసినాడండీ..? బెత్తవట్టుకుని రొండు తగిలించక పోయారా? ఎదవ పనులు చేస్తే మీరు నాకు చెప్పక్కర్లేదండీ..మీరే నాలుగిచ్చుకుని దార్లో పెట్టండి.” అన్నాడు.

మాష్టారు. “ఆపు మల్లయ్యా.. నేనింకా ఏవీ చెప్పకుండానే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు.. నేను చెప్పేది విను. మీ రాంబాబు నాలుగు రోజులు స్కూలికి రాలేదు. నిన్న వచ్చేడు. ‘ఏరా.. స్కూలు ఎందుకు మానేసేవు అంటే, మా అయ్య మానెయ్యమన్నాడండి’ అన్నాడు. వాడు మంచి బుద్ధిమంతుడు, బాగా చదువుకుంటున్నాడు. అల్లరి చిల్లరగా ఉండడు. వాడు చదువుకుని పైకొస్తే మీకందరికీ మంచిది కదా? అలాంటి పిల్లాణ్ణి నువ్వు స్కూలు ఎందుకు మాన్పించేవని తెలుసు కోవడానికి నిన్ను తీసుకొని రమ్మన్నాను. ఇంతకీ వాడు చెప్పింది నిజమేనా, లేక వాడే స్కూలు మాని ఆటల్లో పడ్డాడా?”

“మేట్టోరండీ.. సెమించండి.. రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్ళమండి. నా ఆడది పేనం బాగా లేదని మంచం దిగనేదండి. ఊట్టం ఒచ్చేసినాదండి. ఆచారి గారి దగ్గరకి పారెల్లి కషాయం తెచ్చి పట్టిచ్చినా తగ్నేదండి. కామందు గారింటికి పనికి ఎళ్ళకపోతే ఆరికి ఇబ్బందయితాదని, ఈడిని ‘ఓరయ్యా, నువ్వు ఇస్కూలు మానేసి, కామందు గారింటికి పనికి పోరా’ అని తోలేసి, నాను కామందు గారి కళ్ళానికి పోయానండి. ఏదండీ.. నాలుగు రోజులకి ఆచారి గారి కషాయంతో, ఊట్టం దిగి నిన్న కామందు గారింటికి పనికి పోయింది. ఈ నాలుగు రోజుల్లో ఈడు సెప్తానే ఉన్నాడు, అయ్యా పాఠాలు అయిపోతాయి, మేష్టారు కోప్పడతారని. మరేం జెయ్యను బాబయ్యా. ..తప్పలేదు. మాలాంటోళ్ళకి పని చేస్తే గాని బువ్వ దొరకదు.

కామందు గారి బాకీ తీరాలంటే అందరం పనికి పోవాల. ఈడ్ని ఈ చదువులు మనకొద్దురా..అంటే వినడు. చదువుకోవాలని ఉందయ్యా అంటాడు.” నిట్టూర్పుతో ఆగాడు మల్లయ్య. “కామందు గారి బాకీ తీరాలంటే మేమందరం పనికి పోవాల” అన్నాడు.

“మల్లయ్యా.. నీ కష్టాలు నాకు తెలుసు. కానీ చదువుకుంటే నీ కొడుకు మంచి ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుని నీ కష్టాలు తీరుస్తాడు. మీ కామందు గారికి ఎంత బాకీ ఉన్నావు?”

“చాన్నాళ్ళ కింద ఈ రాంబాబు గాడు పుట్టినప్పుడు నా ఆడదానికి చాలా జబ్బు చేసినాదండి మేట్టోరు. అప్పుడు పేనం మీదకొచ్చింది. ఆచారి గారు పేనం దక్కాలంటే పట్నంలో పెద్ద ఆస్పత్రిలో జాయిన్ చెయ్యమన్నారండి. నా కాడ డబ్బులు లేవు. కామందు గారు అన్నీ చూసుకుని, బాగు చేయించి పుణ్యం కట్టుకున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక కామందు గారిని అడిగేనండి – ‘కామందు గారు.. మొత్తం ఎంత కరుసయినాదండీ’ అని. ఆరన్నారు గదా.. ‘ఏరా .. మల్లి గా.. ఎందుకు అడుగుతున్నావు? డబ్బు ఏమైనా దాచి పెట్టావా?’ అని. నాకాడ ఏటున్నాయండీ.. అదే సెప్పాను..

ఆరన్నారండీ.. ఓరి మల్లిగా. ఎంత కరసయిందో అంతా వివరంగా లెఖ రాసి పెట్టాను, నువ్వు ఏక మొత్తంగా ఇవ్వలేవు, గనుక, నువ్వు మీ ఆవిడ ఇంటి పని పొలం పనులు చూసుకుని బాకీ తీర్చండి, మీ ఇద్దరి జీతాల నుంచి నెలకి కొంత సొమ్ము నీ బాకీకి జమ వేసుకుని మిగిలినది నీకిస్తాను అని, నోటు రాయించి నాది నా ఆడదానిది వేలిముద్రలు ఏయించేరండి. ఆ లెక్కలు అన్నీ ఆరే సూసుకుంటారండి. నాకు తెల్వదు. బాకీ పూర్తిగా తీరిపోయీక ఆరే సెప్తారండి. గంజి తాగడానికి సరిపడా జీతం ఇవ్వడం, బాకీకి జమ చేసుకోడం మంచిదేగదండి.” అన్నాడు.

మల్లయ్య అమాయకత్వానికి మాస్టారికి జాలి వేసింది. రాంబాబు అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కనీసం పదమూడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అంటే ఈ మల్లయ్య 13 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నా, ఇతని బాకీ తీరలేదన్నమాట. అచ్యుతం మాస్టారు ఇలా ఆలోచిస్తూ, “మల్లయ్యా.. నువ్వు నీ భార్య మీ కామందు గారింటిలో పనిచేసుకుంటూ ఉండండి, కాని ఈ రాంబాబు భవిష్యత్తు పాడు చెయ్యకు. వీడి చదువు బాధ్యత నేను చూసుకుంటాను. రేపటి నుంచి వీడు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు..” ధృఢమైన సంకల్పంతో చెప్పారు.

మల్లయ్య మేష్టారిని అయోమయంగా చూసి, “ఇంక మా బుడ్డోడు ఇంటికి రాడాండీ?” అని అడిగాడు.

“వస్తాడు. స్కూలుకి శెలవులు ఇచ్చినప్పుడు.” అన్నారు మేష్టారు.

“సరే నండి.” అంటూ కదిలేడు.

అన్నట్టు గానే మేష్టారు ఆ రోజే పర్వత సుబ్బాయమ్మ గారి హాస్టల్‌లో రాంబాబుకి వసతి, మూడు పూటలా భోజనం ఏర్పాటు చేశారు. పుస్తకాలు బట్టలు మేష్టారే ఏర్పాటు చేశారు. ఆ విధంగా రాంబాబు జీవితంలో చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. స్కూలు ఫైనల్ మంచి మార్కులతో ప్యాసవడంతో కాకినాడలో గవర్నమెంట్ కాలేజ్‌లో సీటు, స్కాలర్షిప్ హాస్టల్ వసతి ఏర్పడి బీ.కాం పూర్తి చేసిన తర్వాత, బేంక్‌లో ఉద్యోగం దొరికింది. తల్లిదండ్రులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసి, వారితో సహా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో అమ్మా నాన్నలతో సంతోషంగా ఉన్నాడు.

అచ్యుతం మాస్టారి మంచితనానికి రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే. చాలా మంది పేద విద్యార్థులకు దిక్సూచి ఆయన. పెంకి పిల్లలను దండించి దారిలో పెట్టడం మంచి పిల్లలు దారి తప్పకుండా చూడడం ఆయనకి ఆనందం.

కాలగర్భంలో రెండు దశాబ్దాలు గడిచిపోయాయి.

***

ఆదివారం. అందరికీ శలవు. రొటీన్‌కి ఆటవిడుపు. నగరం బద్దకంగా లేచింది. వెంకట్రావు మేనకోడలి వివాహానికి హైదరాబాద్ వచ్చి ఓ వారం అయింది. వివాహం కోలాహలం ముగిసిన తర్వాత ఇంట్లో సందడి తగ్గింది. చెల్లాయి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి నాలుగు రోజుల నుంచి చూడని మెసేజ్స్ అన్నీ చూస్తున్నాడు.

ఓ మెసేజ్ దగ్గర ఆగాడు.

“హాయ్.. ఎలా ఉన్నావ్? నేను హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నీ నెంబరు మొన్నామధ్య మన క్లాస్‌మేట్ నూకరాజు ఇచ్చాడు. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుద్దాం. ఫోన్ చేసేను. కానీ నీ ఫోన్ కలవలేదు. నీకు తీరికైనప్పుడు ఓ సారి ఫోన్ చెయ్యి.. రాంబాబు.”

వెంకట్రావు పెళ్లి హడావిడిలో ఫోన్‌లో మిస్సడ్ కాల్స్ కూడా చూడలేదు. చూసినా కొత్త నెంబరు కనుక పట్టించుకోలేదు. రాంబాబు తను ఒక ఊరిలో పుట్టి పెరిగి, ఒకే బడిలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్లు. చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలు కదిలేయి. వెంటనే రాంబాబుకి ఫోన్ చేసేడు. అతనితో మాట్లాడాలని, కలుసుకోవాలని ఆతృతగా ఉంది. అటునుంచి ఫోన్ రింగ్ అవుతోంది. కొంత సేపటికి అవతలి నుంచి “హలో.. ఎవరూ?” ఆడ గొంతు.

“నా పేరు వెంకట్రావు.. రాంబాబు ఉన్నాడా?”

“ఉండండి. పిలుస్తాను.. నాన్నా.. ఎవరో రాంబాబుట. మాట్లాడండి.”

వెంటనే రాంబాబు గొంతు. “ఎవరండీ” అన్నాడు.

“నేను రా.. వెంకట్రావుని. నీ మెసేజ్ ఇప్పుడే చూసేను. గుర్తు పట్టావా?” అన్నాడు.

“హాయ్.. వెంకట్.. వాటే సర్ప్రైజ్.. ఎలా ఉన్నావ్? ఎక్కడ ఉన్నావ్. మొన్న మన ఫ్రెండ్ నూకరాజు కలిసి నీ నెంబరు ఇచ్చాడు. వెంటనే మెసేజ్ పెట్టాను. ఎనీ వే.. చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడుతుంటే. చెప్పు.‌. ఏంటి సంగతులు?”

“ఒరే రాంబాబూ.. నేను ప్రస్తుతం హైద్రాబాద్లోనే ఉన్నాను. ఫోన్‌లో మాట్లాడం కంటే కలుసుకుని మనం మాట్లాడడం బావుంటుంది. ఈరోజు కలవగలవా?” అడిగాడు.

“ఓ యస్ తప్పకుండా. నీ అడ్రస్, లొకేషన్ షేర్ చెయ్.”

ఆ సాయంత్రం బాల్య స్నేహితులు ఇద్దరు కలుసుకుని చాలా కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళతో కలిసి చదివిన క్లాస్‌మేట్సు గురించి వివరాలు తెలుసుకున్నారు.

“అందరం ఓసారి కలుసుకుంటే చాలా బావుంటుంది కదా” అన్నాడు రాంబాబు.

“అవును, కాని, ఎలా? ఓ పని చేస్తాను. నూకరాజు మనం చదువుకున్న ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. వాడి ద్వారా మన వాళ్ళందరి ఫోన్ నెంబర్లను సంపాదించి ఓం గ్రూప్ ఏర్పాటు చేసి నీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఎలా ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో ప్లాన్ చేద్దాం” అన్నాడు వెంకట్. రాంబాబు ఆలోచిస్తున్నాడు.

“అప్పటి మా టెంత్ క్లాసు పది మంది ఆడపిల్లలు, మేం అందరం కలిసి పదిహేను మంది మగ పిల్లలం ఉండేవాళ్ళం. కనీసం మగపిల్లలు అందరూ కలిసినా బావుంటుంది.”

“సరే వెంకట్.. అందరి సమాచారం దొరికితే ఫోన్ చెయ్యి. ఉంటా మరి..”  లేచాడు.

***

కొద్ది రోజుల తర్వాత రాంబాబుని ‘సరస్వతీ హైస్కూల్ 1980 టెంత్ క్లాసు బాచ్’ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చినట్లు మెసేజ్ వచ్చింది. గ్రూప్‌లో పదహారు మంది, ఇద్దరు ఆడవాళ్ళు కలిపి ఉన్నారు. అందరి పేర్లు చూసి ఒక్కసారి గతంలోకి తొంగి చూసి అందర్నీ గుర్తు చేసుకున్నాడు. ఒక్కొక్కరికి విడిగా ఫోన్ చేసి ఎవరేం చేస్తున్నారు, కుటుంబ విషయాలు, మొదలు అన్ని వివరాలు తెలుసుకున్నాడు. పర్వత సూర్య ప్రకాష్ రాజకీయాలలో రాణించి మంచి స్థితిలో ఉన్నాట్ట. అయినా గర్వం లేకుండా చాలా బాగా మాట్లాడాడు. భాస్కర్ గవర్నమెంట్ జాబ్. నూకరాజు రెండు రైస్ మిల్లులతో సుఖంగా ఆ వూళ్ళోనే ఉన్నాడు. రాజేష్ వ్యవసాయం. ఇలా అందరూ మంచి స్థితిలో ఉన్నవాళ్ళే. ఆడవాళ్ళు సావిత్రి, ఇందిర. సావిత్రికి తమతో చదివిన క్రిష్టతో ప్రేమ వివాహం అయింది. ఇద్దరూ సూపర్ మార్కెట్ వ్యాపారం.

మొత్తానికి అందరం కలిసి సూర్య ప్రకాష్ ఫాం హౌస్‌లో సెప్టెంబర్ 4, శనివారం సాయంత్రం కలుద్దామని నిర్ణయం జరిగింది. సూర్య ప్రకాష్ అందరికీ వసతి మొదలైన అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేసాడు. రాంబాబు ఒక్కడే హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వచ్చాడు. మిగిలిన అందరూ అక్కడికి దగ్గర ప్రాంతంలో నివాసం. వాళ్ళందరూ సాయంత్రం గాని రారు. రాంబాబు సాయంత్రం వరకు చేసేపని ఏమీ లేదు కాబట్టి, నూకరాజుతో కలిసి హైస్కూల్ చూద్దామని వెళ్ళాడు. అంతా మారిపోయింది. అప్పటి స్కూలులా లేదు. రెండస్తుల బిల్డింగ్ కట్టారు. సుబ్బాయమ్మ గారి హాస్టల్ లేదు. ఏమైందిరా అని నూకరాజునడిగితే ఆవిడ పోయిన తరువాత మూత పడిందన్నాడు. బాధ పడ్డాడు రాంబాబు. తన లాంటి ఎందరో పేద విద్యార్థులకు అన్నం పెట్టి ఆదరించిన ఆ ప్రదేశం ఖాళీగా కనబడింది. రాంబాబు మనసులో రోదించాడు.

తర్వాత సంభాషణ చదువు చెప్పిన గురువుల మీదకి మళ్ళింది. రాంబాబు “నూకరాజూ.. మన అచ్యుతం మాస్టారు ఎలా ఉన్నారు? హెడ్మాస్టర్ సుబ్బారావు గారు, లెఖ్ఖల మేష్టారు సాంబశివరావు గారు, సైన్స్ మాష్టర్ పోతూరు నాగరాజు గారు, తెలుగు మాష్టారు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఎక్కడ ఎలా ఉన్నారు? వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పు.” అన్నాడు.

“ఒరే రాంబాబూ, అచ్యుతం మాస్టారు ఈ ఊర్లోనే ఉన్నారు. హెడ్మాస్టర్ సుబ్బారావు గారు, సాంబశివరావు గారు కాకినాడలో ఉన్నారు. నాగరాజు మాష్టారు, ఈమధ్యే పోయారు. సుబ్రహ్మణ్యం గారు అమెరికాలో పిల్లల దగ్గర ఉన్నారట.” నూకరాజు వివరించాడు.

“సాయంత్రం వరకు ఏం పని లేదు కాబట్టి అచ్యుతం మాస్టారి దగ్గరకి వెళ్దాం రా.. నాకు చూడాలని వుంది. తీసుకెళ్తావా” రాంబాబు అభ్యర్థన.

“సరే. మధ్యాహ్నం తీసుకెళ్తా.”

రాంబాబుకి ఆతృతగా ఉంది, తనకి జీవితాన్ని చ్చిన మేష్టారిని కలవాలని.

మధ్యాహ్నం ఇద్దరు కలిసి మాస్టారింటికి వెళ్ళారు. ఇల్లు శిధిలావస్థలో ఉంది. ముందు చూరు పెంకులన్నీ జారిపోయి, చివికిన దూలాలు వేలాడుతున్నాయి. ఇల్లు తాళం వేసి ఉంది. పక్క ఇంటికి వెళ్లి మాస్టారు ఎక్కడి వెళ్ళారని అడిగాడు రాంబాబు.

ఓ పెద్దాయన వచ్చి మాస్టారికి నాలుగు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చింది. కాకినాడలో అపోలో హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పారు. రాంబాబు కళ్ళు వర్షిస్తున్నాయి.

“నూకరాజూ.. నేను కాకినాడ వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను. నాకు నీ కారు ఇవ్వగలవా?” అడిగాడు రాంబాబు..

“రేపు ఉదయం మనం ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు తొందర పడొద్దు” అన్నాడు నూకరాజు.

 “కాదు.. నేను ఇప్పుడే వెళ్లి వస్తాను. నాకు కారు ఇవ్వగలవా..?”

“సరే! నీ ఇష్టం.” నూకరాజు ఫోన్ చేసి కారు తీసుకుని రమ్మని డ్రైవర్‌కి చెప్పి కారు వచ్చిన తర్వాత రాంబాబుని త్వరగా తిరిగి రమ్మని చెప్పాడు.

మరో గంటలో అపోలో హాస్పిటల్ దగ్గర దిగి రిసెప్షన్‌లో మాస్టారి గురించి అడిగితే, రూం నెంబరు చెప్పి ఈ రోజు డిస్చార్జ్ అవుతున్నారు అని చెప్పారు. మాస్టారి రూం దగ్గరకి వెళ్లి తలుపు తోసి ఆగాడు రాంబాబు.

మాస్టారు నీరసంగా గడ్డం పెరిగి, హాస్పిటల్ డ్రెస్‌లో మంచం మీద ఉన్నారు. పక్కన అమ్మగారు స్టూల్ మీద కూర్చుని ఉన్నారు .

మాస్టారు.. “సుశీలా.. ఉదయం డాక్టర్ వచ్చి డిస్చార్జ్ రాస్తున్నాను. ఈ రోజు వెళ్ళిపోవచ్చని చెప్పారు కదా.. బిల్లు ఎంతో కనుక్కున్నావా?..” అని అడిగారు.

“ఆ.. రిసెప్షన్‌లో అడిగితే, మూడు లక్షల ఏభైవేలు కట్టమన్నారు. నా దగ్గర ముఫ్ఫై వేలు మాత్రమే ఉన్నాయి.”

“మరేం చేద్దాం?” మాస్టారు ఆందోళన పడుతున్నారు.

సుశీలమ్మ గారు “మీరు పెళ్ళయిన కొత్తలో చేయించిన ఈ గొలుసు నాలుగు తులాలు ఉంటుంది. హాస్పిటల్ ఎదురుగా ఉన్న బంగారం షాపులో అమ్మేసి, డబ్బు రిసెప్షన్‌లో కట్టేస్తాను. మీరేం కంగారు పడకండి,” అని లేస్తుంటే మేష్టారు ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోమని, “ఆ ఉన్న ఒక్క గొలుసు అమ్ముకోవాల్సిందేనా? ” అంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు.

“మీరు కొన్న బంగారం మీ ప్రాణం కంటే విలువైనది కాదు. అయినా అవసరానికి ఉపయోగించడానికే కదా ఈ బంగారం. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్లి వస్తాను” సుశీలమ్మ గారు లేచారు.

అప్పటికే రాంబాబు రిసెప్షన్‌లో తన అక్కౌంట్ నుంచి హాస్పిటల్‌కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాడు. రశీదు తీసుకుని మాస్టారి రూం దగ్గరకి వస్తుంటే సుశీలమ్మ గారు ఎదురు వచ్చేరు.

“నమస్కారమమ్మా.. నేను గుర్తున్నానా..? నా పేరు రాంబాబు.. చిన్నప్పుడు మీ ఇంట్లో ఉండి చదువుకున్నాను. మాష్టారు ఆ తర్వాత హాస్టల్‌లో వేశారు..” అన్నాడు.

సుశీలమ్మ కళ్ళజోడు సరిగా పెట్టుకుని, రాంబాబు మోహం లోకి పరిశీలనగా చూసి, “గుర్తు రావడం లేదు. చాలా సంవత్సరాలయింది గదా.. సరే! ఇక్కడేం చేస్తున్నావు? మీ వాళ్ళెవరైనా ఈ హాస్పిటల్‌లో ఉన్నారా..? ” అన్నారు.

“లేదమ్మా మాస్టారి సంగతి తెలిసి చూడాలని వచ్చేను.”

“సరే! మాస్టారి దగ్గర కూర్చో. ఈరోజు ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేను బిల్లు కట్టి వస్తాను.” అని కదులుతూ ఉంటే,

రాంబాబు.. “అమ్మా బిల్లు కట్టడం అయింది. మనం మాస్టారి ని తీసుకుని వెళ్లి పోదాం రండి.” అన్నాడు.

సుశీలమ్మ గారు ఆశ్చర్యంగా.. “బిల్లు ఎవరు కట్టేరు?” అని అడిగారు.

“అవ్వన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పదండి.”

మాస్టారిని సుశీలమ్మ గారిని తీసుకుని కారులో సాయంత్రానికి ఇంటికి తీసుకుని వచ్చేడు రాంబాబు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు.

కారక్కెన తర్వాత స్థిమితంగా కూర్చుని మాష్టారు అడిగారు.. “నువ్వు రాంబాబువిట కదా.. సుశీల చెప్పింది. ఎక్కడ ఉన్నావ్? ఏం చేస్తున్నావ్?”

“మీరు ఇప్పుడు ఎం మాట్లాడకుండా హాయిగా పడుకోండి మాష్టారూ, రేపు మీ ఇంటికి వస్తాను. అన్నీ చెబుతాను.”

మాస్టారింకేం మాట్లాడకుండా నిద్రపోయారు.

***

సాయంత్రం ఆరు గంటలకి అందరూ వచ్చారు. సూర్య ప్రకాష్ చాలా చక్కగా ఏర్పాటు చేశాడు. అందరూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రకాష్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని చెప్పసాగాడు.‌

“ఫ్రెండ్స్.. ఈ మీటింగ్‌కి వచ్చిన మీకందరికీ నా స్వాగతం. నా శక్తి మేరకు అందరికీ కంఫర్టబుల్‌గా ఈ రెండు రోజులు ఉండడానికి ఏర్పాటు చేసేను. ఎవరికి ఏం అవసరం అయినా నన్ను గాని నూకరాజుని గాని అడగండి. ఒకరి తర్వాత మరొకరు ఈ వేదిక మీద కి వచ్చి వారి గురించి, మన హైస్కూల్ చదువు తర్వాత జీవిత విశేషాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ముందుగా దూరం నుంచి వచ్చిన రాంబాబుని ఆహ్వానిస్తున్నాను.”

రాంబాబు లేవగానే అందరూ చప్పట్లు కొట్టారు. రాంబాబు లేచి మైక్ అందుకుని చెప్పసాగాడు.

“చిన్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదో మీకందరికీ తెలిసిందే. మా నాన్న వెట్టి చాకిరీ చేసి నన్ను చదవద్దని తనతో కలిసి కూలికి రమ్మన్నాడు. ఆ సమయంలో అచ్యుతం మాస్టారు మా నాన్నని వారించి నన్ను సుబ్బాయమ్మ గారి హాస్టల్‌లో జాయిన్ చేసి, నాకు పుస్తకాలు ఫీజులు ఆయనే కట్టి స్కూల్ ఫైనల్ వరకు చదివించారు. కాలేజీలో సీటు వస్తే, ఆయనే ఫీజు కట్టి స్కాలర్షిప్ ఇప్పించి చదివించారు. నా డిగ్రీ అర్హతతో బాంక్‌లో ఉద్యోగం వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు జనరల్ మేనేజర్ అయాను. మా తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ఇవీ నా గురించి వివరాలు.

నా సంపాదనలో ప్రతినెలా కొంత డబ్బుని వెనకేసి సంవత్సరానికి ఒకసారి ఒక బీద విద్యార్థికి పుస్తకాలకి, ఫీజులకి సహాయం చేస్తున్నాను.

ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని ఋణాలు తప్పక తీర్చాలి. తల్లిదండ్రులు, దేవతలు, గురువులపట్ల మానవునికి పుట్టుకతో సంక్రమించే ఋణాలు ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం ఎప్పటికీ తీర్చలేనిది. వారి పట్ల బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం ఒకటే మార్గం. గురు ఋణం తప్పక తీర్చాలి. నాకు ఆ అవకాశం ఈ రోజు వచ్చింది. మీకందరికీ తెలిసిందే. అచ్యుతం మాస్టారు కేవలం మనకి పాఠాలు చెప్పడమే కాక అన్ని విధాలా సహాయం చేసేవారు. ఆయన పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. ఆయనకి చేతనైన సహాయం చేసి వచ్చాను. మీరందరూ కూడా ఈ సహాయంలో భాగమైతే ఆయన బతికున్నంత కాలం సుఖంగా జీవితం గడపగలరు. ఆయనకి పిల్ల లు లేక ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్ట్స్ అందరినీ ఆయన తన పిల్లల్లాగే చూసుకున్నారు. మనందరం కలిసి ఆయనకు చక్కటి జీవిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది..” అన్నాడు.

ఇందిర లేచి తన గురించి చెప్పి “రాంబాబు చెప్పిన మాస్టారి విషయం నాకు తెలుసు. ఆయనకి పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది. నేను ప్రతి నెలా కొంత సహాయం చెయ్యగలను” అంది.

నూకరాజు లేచి “మేష్టారికి కావలసిన నెలవారీ సరుకులు అన్ని నేను పంపుతాను. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఇల్లు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఆ ఇల్లు బాగు చేయించాలి. ఆ సంగతి చూడండి.” అన్నాడు.

సూర్య ప్రకాష్, కృష్ణ లేచి “ఎంత డబ్బు అయినా ఫర్వాలేదు ఆ స్థలంలో కొత్త ఇల్లు కట్టిస్తాం” అన్నారు. రాంబాబు మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది. లేచి చప్పట్లు కొడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ, “రేపు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం. రేపు అందరం మేష్టారింటికి వెళ్ళి మన నిర్ణయం తెలియచేద్దాం” అన్నాడు.

ప్రకాష్ ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం చూసిన తర్వాత అందరం తృప్తిగా నిద్రపోయారు.

మర్నాడు మాస్టారింటికి వెళ్ళి అందరు తమని పరిచయం చేసుకుని ఆయన గురించి తమ నిర్ణయం తెలియజేశారు.

చాలా ఆనందంగా ఉందన్నారు మాస్టారు. ఈరోజుల్లో ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారా? అన్నారు.

సాయంత్రం హైదరాబాద్‌కి ట్రైన్ ఎక్కి సంతృప్తితో బెర్త్ మీద వాలాడు రాంబాబు.

Exit mobile version