Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాహసి

[బాలబాలికల కోసం ‘సాహసి’ అనే కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

పూర్వీ దేశం రాజధాని పుణ్యప్రద. ఆ దేశం రాజు పుణ్యప్రదుడు చాలా మంచివాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. వారికి 10 సంవత్సరాల వయసు వున్న ఒక కుమార్తె పుణ్యవతి. పుణ్యవతి తల్లిదండ్రుల పెంపకంలో అందాల రాశిగానే కాదు, అద్భుత సుగుణాల రాశిగా కూడా పెరుగుతోంది. చదువు సంధ్యలలో, ఆటపాటలలోనే కాదు, రాకుమారికి అవసరమైన ధైర్య సాహసలలో కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది.

అయితే రోజులన్నీ ఒకలా వుండవు కదా. ఒక రోజు రాకుమారి తన భవంతిలో చదువుకుంటూ వుండగా పక్కనే వున్న పెద్ద కిటికీనుంచి ఒక చిలుక వచ్చి ఆమె ఎదరుగా వున్న బల్ల మీద వాలింది. దానిని చూసి ముచ్చటపడిన రాకుమారి పుస్తకం పక్కనబెట్టి దానినే చూడసాగింది.

ఆ చిలుక కూడా రాకుమారి కోసమే వచ్చినట్లు ఆమెనే చూడసాగింది. రాకుమారి చిలుకను పట్టుకుని దాని తల నిమరసాగింది.

చిలుకకి కొంచెం ధైర్యం వచ్చినట్లుంది. నెమ్మదిగా “పుణ్యా” అని పిలిచింది. పుణ్య చిలుక తనని పిలుస్తోందనుకోలేదు. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. తను చదువుకుంటున్నప్పుడు తన ఏకాగ్రతని ఎవరూ భంగం చెయ్యకూడదని ఎవరినీ తన గదిలోకి రానియ్యదు.

చిలుక మళ్ళీ పిలిచింది, “పుణ్యా, నేనే పిలుస్తున్నాను. భయపడకు. నేను నీకుమల్లే ఒక రాజకుమారినే. పక్కనే వున్న స్నేహపురం మా రాజధాని. నా పేరు స్నేహ. పక్క రాజ్యమే అవటంతో నేను నీ గురించి విన్నాను.”

“నువ్వు రాజకుమార్తెవైతే ఇలా చిలుకలా వున్నావేమిటి?” అని అడిగింది పుణ్యవతి.

దానికి ఆ చిలక “మా భవనంలో ఒక దుర్మార్గుడైన మాంత్రికుడు వున్నాడు. అతను ఎంత దుర్మార్గుడైనా మాకుగానీ, మా దేశ ప్రజలకిగానీ ఎప్పుడూ హాని చెయ్యలేదు. ఊరు చివర ఒక గుహలో వుండేవాడు. అతను వుండే గుహలో ఇప్పుడు కొన్ని దెయ్యాలు వున్నయ్యట. వాటిని పారద్రోలలేక, అతను ఆ దెయ్యాలను పారద్రోలేవాళ్ళకోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాడుట. ఆ దెయ్యాల గోలకి అతను ఆ గుహలో వుండలేక పోతున్నాడు. దెయ్యాలు అతనికి చెప్పినదాని ప్రకారం 10 సంవత్సరాల వయసున్న రాకుమారి ధైర్యంగా ఒక్కతే ఒక రాత్రి అంతా అక్కడ వుండగలిగితే వాళ్ళా గుహను వదిలి వెళ్తాయట. ఆ దెయ్యాలు వాటిలో అవి పందెం వేసుకున్నాయట. రాజకుమార్తెలు కూడా సుకుమారులుగా పెరుగుతున్నారు. ధైర్య సాహసాలు తక్కువైనాయి. వాళ్ళని ధైర్యవంతులను చెయ్యాలని కొన్ని దెయ్యాలు అంటే, ఎంత రాజకుమార్తెలైనా పదేళ్ళ పాపలకి చీకటన్నా, దెయ్యాలన్నా భయం వుంటుంది వాళ్ళు ఒక్కళ్ళూ ఇక్కడ వుండలేరు అని కొన్ని దెయ్యాలన్నాయిట. రాజ కుమార్తెలు ముందునుంచీ యుధ్ధ విద్యలు నేర్చుకుంటూ వుంటారు కదా. అందుకని ధైర్యంగా వుంటారని, అలా వుండగలిగేట్లు చేసి వాళ్ళ ధైర్య సాహసాలు పెంచటమే తమ ధ్యేయమని కొన్ని దెయ్యాలు పందెం వేసుకున్నాయట. ఆ దెయ్యాలు చేసే రణగొణ ధ్వనులకు ఆ గుహలో వుండటం చాలా కష్టం. ఆ మాంత్రికుడు బలవంతంగా కొందరు రాజకుమార్తెలను తీసుకు వచ్చినా వాళ్ళు భయపడి ఆ గుహలోకే వెళ్ళలేదట. అలా వెళ్ళగలిగేవారి కోసం వెతుక్కుంటూ మా రాజ్యానికి వచ్చాడు ఆ మాంత్రికుడు. వయసులో పెద్దవాడవటంతో తానిక తిరగలేక పోతున్నానని నేనేమన్నా ధైర్యం చేస్తానేమోనని మా రాజ్యానికి వచ్చాడు.

నేను రాజకుమార్తెనైనా స్వతహాగా కొంచెం పిరికిదాన్ని. ధైర్య సాహసాలు లేవు. యుద్ధ విద్యల జోలికి పోలేదు. విసుగెత్తిన మాంత్రికుడు నన్ను చిలకలా మార్ఛి ఈ భారం మామీద పెట్టాడు. తను మా భవంతిలో తిష్ట వేశాడు. ఏ రాజకుమార్తె అయినా ధైర్యంగా ఆ దయ్యాలను పారద్రోలితే అతను తన గుహకి వెళ్తానన్నాడు. ఆ మాంత్రికుడు బాధ్యత మామీద వేశాడు కదా. మేము మా కర్తవ్యాన్ని మర్చి పోకుండా వుండటానికి నన్నిలా మార్చాడు. మాంత్రికుడి గుహలోంచి దెయ్యాలు వెళ్ళిపోయిన రోజు నాకు నా రూపం వస్తుందని చెప్పాడు. నా నిజరూపం కోసం నేను తప్పనిసరై ధైర్య సాహసాలుగల రాకుమార్తెలకోసం వెతుకుతూ ఇలా తిరుగుతున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యగలవా? నువ్వు వయసులో చిన్నదానివైనా, నీ ధైర్య సాహసాల గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. నీ సహాయంతో నాకు నిజ రూపం వస్తుందని కొండంత ఆశతో వచ్చాను” అన్నది చిలుక.

చిలుక నిస్సహాయ స్ధితిచూసి పుణ్య జాలిపడింది. తనకి ధైర్యం వుందనుకున్నా, చిన్న పిల్ల తనేం చెయ్యగలదు. అమ్మా, నాన్నలు, గురువుగారు ఏమంటారో. వారందరి సలహా, అనుమతి లేకుండా తనేమీ చెయ్యలేదు. అదే చెప్పింది చిలకకి. “నీకు సహాయపడాలని నాకు ఉత్సాహంగా వున్నా అమ్మా, నాన్నా, గురువుగారి అనుమతి లేకుండా నేను ఏమీ చెయ్యలేను. ఇవాళ్టికి నువ్వు నా మందిరంలోనే వుండు. రేపు వారిని సంప్రదించాక నీకు ఏ విషయమూ చెప్తాను” అన్నది.

పుణ్య తొందరపాటు పిల్ల కాదనీ, ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనీ తెలుసుకుంది చిలుక. అలా ఆలోచించి చేసేవారే తనకి సహాయం చెయ్యగలరనే నమ్మకం కుదిరింది. పుణ్య పెట్టిన పళ్ళు తిని రాత్రి హాయిగా నిద్రపోయింది తన సమస్య త్వరలో తీరిపోతుందనే నమ్మకంతో.

మర్నాడు ఉదయమే లేచిన పుణ్య కాలకృత్యాలు తీర్చుకుని తల్లిదండ్రులతో దైవ పూజలో పాల్గొన్నది. అక్కడ వున్న గురువుగారికి పాదాభివందనం చేసి చిలుక సమస్య చెప్పింది. రాణీగారు తమ చిన్నారి కుమార్తెను దెయ్యాల గుహకి పంపటానికి ఒప్పుకోలేదు. రాజుగారు తమ సైన్యంతో సహా తాను కూడా సహాయానికి వెళ్తానన్నారు. గురువుగారు మాత్రం ఆలోచనలో పడ్డారు. ఇది దెయ్యాలు వాటిలో అవి పెట్టుకున్న పందెం తప్పితే వేరే ఆలోచించాల్సింది వున్నట్లు లేదు. దెయ్యాలు రాజ కుమార్తెలలో ధైర్య సాహసాలున్నవారిని ప్రోత్సహించటానికో, వారిలో నీరుకారుతున్న సాహసానికి ఊపిరిపోయటానికో, ఏది ఏమైనాగానీ క్షత్రియులలో కొరవడుతున్న క్షాత్రానికి ఊపిరి పోయటానికి ఒక విధంగా దోహద పడుతున్నాయి.

తమ రాజకుమారి ధైర్య సాహసాలుగల బాలిక. ధైర్యంగా ఈ పందెంలో పాల్గొని చిలుకకి మామూలు రూపం ప్రసాదించటమే కాదు, మిగిలిన రాకుమార్తెలందరికీ మార్గదర్శకురాలు కాగలదు.

“తల్లీ, నీ ఉద్దేశ్యమేమిటి?” అని అడిగారు గురువుగారు పుణ్యవతిని.

“గురువుగారూ, దెయ్యాలు అంటే ఏమిటి? అవి నిజంగానే వుంటాయా? మనకి కనబడతాయా? అవి మనలాంటి మనుషులకి హాని చేస్తాయా. నిన్న స్నేహ కథ విన్నదగ్గరనుంచి నాకు అనేక సందేహాలు వస్తున్నాయి. దయచేసి నా సందేహాలు తీర్చగలరు” చేతులు జోడించి వినమ్రంగా అడిగింది పుణ్య.

గురువుగారు పుణ్య ఆలోచనా పరంపరకు మెచ్చుకున్నారు. పుణ్య ధైర్య సాహసాలే కాదు. తెలివి తేటలు, ఆలోచనా శక్తి కల బాలిక. తోటి రాకుమారి అడిగిందికదా అని వెంటనే ఏదో సమాధానం చెప్పలేదు. ధైర్యం కలదిగనుక తనవల్ల అవుతుందో కాదో అని కూడా ఆలోచించలేదు. ముందు విషయం లోతులు తెలుసుకోవలనుకున్నది. అనుకుని పుణ్యకు సమాధానం చెప్పసాగాడు.

“రాకుమారీ, మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు తిరిగి జన్మ ఎత్తే లోపల అలా గాలిలో తిరుగుతాయంటారు. అవి సాధారణంగా మనుషులకి కనబడవు. పిరికివారు ఎక్కడో ఏదో వినో, ఎవరో చెప్పారనో లేనిపోనివి ఊహించుకుని గాబరా పడతారు. నిజంగా వాటిని చూసినవారెవరూ లేరు. అందుకనే అలాంటి అపోహలను ఎదుర్కోవటానికి, ఆలోచించే మనసు, ధైర్యంతో నిండిన గుండె వుంటే చాలు. నువ్వు తెలివికల దానివి. నీ వయసుకు మించి యుధ్ధ విద్యలలో ఆరితేరావు. చిన్నదానివైనా ధైర్యం కలదానివి. కనుక నువ్వు ఈ కార్యం సాధించే అవకాశం వుంది.” అన్నారు.

రాణీగారు కుమార్తె మీద ప్రేమతో అభ్యంతరం చెప్పబోయి ఆగింది రాజ గురువు మాట కాదనే ధైర్యం లేక. రాజుగారు తన కుమార్తె క్షత్రియ కన్య అనిపించుకుంది. ఇప్పటినుంచే ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వచ్చిందని సంతోషించాడు. బాలికని ఒంటరిగా పంపించటం ఇష్టం లేక తను కొందరు అనుచరులతో గుహకి కొంత దూరంలో వేచి వుంటాను రాజకుమారికి సహాయంగా అని గురువుగారి అనుమతి అడిగాడు.

గురువుగారు దానిని తోసిపుచ్చారు. భవిష్యత్తులో రాజ్యభారం వహించాల్సిన క్షత్రియ బాలిక. దెయ్యాల పందెం గురించి ఆలోచించినా అవేవో మంచి దెయ్యాలలాగానే వున్నాయి. క్షత్రియ కన్యలలో అణగారుతున్న ధైర్య సాహసాలని పెంపొందించాలనే ఆలోచనతో వున్నట్లున్నాయి. ఈ పందెం గెలిస్తే రాజకుమారితోపాటు రాజ్యానికి కూడా పేరు వస్తుంది. అవేమీ రాజ కుమారిని భయపెడతామనిగానీ, మా పరీక్షలు నెగ్గాలి అనిగానీ షరతులు పెట్టలేదు. కేవలం వాటి హాహాకారాలను, గందరగోళ ధ్వనులను ఎదుర్కోవాలి. రెండు రోజుల సమయమడిగి రాజకుమారికి వాటిని తట్టుకోగలిగిన మెళకువలు నేర్పితే

సరిపోతుంది అనుకున్నారు. అదే రాజుగారికి చెప్పారు.

“రాజా, మీరనవసరంగా కంగారు పడకండి. రాజకుమార్తె ఒక్కతే ఈ పందెంలో గెలవగలదు. మనం రెండు రోజుల సమయం తీసుకుందాము. రేపు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో రాజకుమారికి కొన్ని విషయాలు చెబుతాను. ఎల్లుండి విశ్రాంతి తీసుకుని మర్నాడు పందెంలో పాల్గొంటుంది. మన రాజకుమారి తప్పకుండా విజయం సాధించి తనకీ, మన రాజ్యానికి కూడా మంచి పేరు తెస్తుంది” అని ధైర్యం చెప్పారు.

కుమార్తె మీద ప్రేమ ఒకపక్కలాగుతున్నా, తమనీ, రాజ్యాన్నీ అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడే గురువుగారి మీద నమ్మకంతో ఇంకేమీ మాట్లాడలేక పోయారు రాజుగారు. పుణ్యవతి గురువుగారి మార్గదర్శకత్వంలో స్నేహకి మామూలు రూపం తెప్పించగలననే సంతోషంతో గురువుగారు అంగీకరించారని, రెండు రోజుల్లో తనకి మామూలు రూపం వస్తుందని చెప్పటానికి స్నేహ దగ్గరకి బయల్దేరింది.

మర్నాడంతా గురువుగారు నేర్పిన అనేక విషయాలతో పుణ్య ధైర్య సాహసాలు ఇంకా పెరిగాయి. ఎలాగైనా ఈ కార్యం తను సాధించాలనే పట్టుదల పెరిగింది. గురువుగారు నిర్ణయించిన రోజు తల్లిదండ్రులనీ, గురువుగారినీ, చిలుక రూపంలో వున్న స్నేహనీ వాళ్ళ భవనంలో వదిలి తనొక్కతే సంధ్యా సమయంలో గుహకి బయల్దేరింది.

ప్రత్యేకమైన కర్ణాభరణాలు చెవులను చాలామటుకు కప్పేస్తున్నాయి. శబ్దాలు మరీ పెద్దగా వినబడకుండా వుండేందుకు తీసుకున్న జాగ్రత్త అది. రాజకుమారికి సహజమైన చీనాంబరాలు కాకుండా దళసరి దుస్తులు ధరించి పైన కవచం ధరించింది. దెయ్యాలు ఈదురు గాలులు సృష్టించినా ఎక్కువ ఇబ్బంది లేకుండా వుండటానికి గురువుగారు చెప్పిన సలహా అది. చేతిలో ఆమె కత్తిసాము నేర్చుకునే ఖడ్గం తీసుకుంది. అన్నింటినీ మించి తల్లిదండ్రుల, గురువుగార్ల ఆశీస్సులు తీసుకుంది. వీటన్నిటికీ తోడు ఒక మంచి పని చేసి స్నేహకి మామూలు రూపం తెప్పించాలనే ధృఢ సంకల్పంతో బయల్దేరింది.

గుహ దాకా తోడు వచ్చిన స్నేహపురి రాజు నియమబధ్ధుడై కొంత దూరంలో పుణ్యని వదిలి భారమైన గుండెతో తిరిగి వెళ్ళాడు.

పుణ్య మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు తనకి కావాల్సింది అదే. ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఈ గుహలో దెయ్యాల ధాటికి తట్టుకోగలిగితే రేపు స్నేహకి మామూలు రూపం వస్తుంది. దెయ్యాలు ఈ గుహని వదిలి వెళ్తాయి. మాంత్రికుడు తన గుహకి వెళ్ళిపోతాడు. స్నేహపురి ప్రజలందరూ సంతోషంగా వుంటారు. ఇవ్వన్నీ జరగాలంటే ఈ ఒక్క రాత్రీ తను చాలా ధైర్యంగా వుండాలి. కేవలం ఈ ఊహలు మాత్రమే మనసులో

నిలుపుకుంది. ఏది ఏమైనా, దెయ్యాలు తనని ఎంత భయపెట్టినా రేపు ఉదయం దాకా తను చలించకూడదనే ధృఢ నిశ్చయంతో గుహలోకి అడుగు పెట్టింది.

గుహ లోపలకి అడుగు పెడతూనే ఒక్కసారి హోరు గాలి మనుషులు ఎగిరి పోతారా అనిపించేటట్లు వచ్చింది. కాళ్ళు బలంగా నేలకి అదిమిపెట్టి, పక్కనున్న కొండ రాళ్ళ ఆధారంతో నిలదొక్కుకుంది. ఇంతలో బ్రహ్మాండమైన ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. పుణ్య భయపడకుండా కోసుగా వున్న కొండరాయి కింద నుంచుంది నవ్వుకుంటూ. దెయ్యాలు ఏమి చేస్తాయోనని అంతా కంగారు పడ్డారు

గానీ, ఈ ఈదురు గాలులు, కుంభవృష్టులు ప్రకృతి సహజమే కదా అనుకుంది.

ఈ ఒక్క రాత్రి వీటిని భరిస్తే రేపు స్నేహకి నిజ రూపం వస్తుంది. ఆ ఆలోచనే ఎంతో ధైర్యాన్నీ, సంతోషాన్నీ ఇస్తోంది. ఏది ఏమైనా తను ధైర్యంగా వుండాలి.

ధృఢ నిశ్చయంతో వున్న పుణ్యని దెయ్యాలు చేసిన భీభత్సమైన అరుపులు, ఈదురు గాలులు, కుంభ వృష్టులు ఏమీ చెయ్యలేక పోయాయి. కళ్ళముందు స్నేహ నిజ రూపంతో తనతో ఆడుకోవటమే కనిపిస్తోంది. ఆ దృశ్యాలనే సంతోషంగా తలచుకుంటూ చాలా సేపు అలాగే నిలబడింది. వాన తగ్గి, గాలులు భయంకర శబ్దాలు సాగుతున్న సమయంలో వాటికి దడవకుండా గుహలో అటూ ఇటూ తిరుగుతూ కొంతసేపు కాలక్షేపం చేసింది. అర్ధరాత్రి తర్వాత నిద్ర ఆపుకోలేక రెండు పెద్ద బండ రాళ్ళ మధ్య పడుకుని నిద్రపోయింది తెల్లవారేదాకా. దెయ్యాలు పుణ్య ధైర్యానికి మెచ్చుకుని ఆమెని ఏమీ చెయ్యలేక, మాంత్రికుడికి ఇచ్చిన మాట ప్రకారం గుహ వదిలి వెళ్ళిపోయాయి.

మర్నాడు నిద్ర మెలకువ వచ్చిన పుణ్య ఎదురుగా గురువుగారినీ మిగతా అందరినీ చూసి సంతోషించింది. ధైర్యంగా దెయ్యాలని పారద్రోలినందుకు అందరూ పుణ్యని మెచ్చుకున్నారు. దెయ్యాలు పారిపోగానే స్నేహకు మామూలు రూపం వచ్చింది. పుణ్య, స్నేహలేకాక రెండు రాజ్యాలవారూ మంచి మిత్రులయ్యారు. పుణ్య సహవాసంతో స్నేహ కూడా ధైర్యంగా వుండటం నేర్చుకుంటోంది. స్నేహకే కాదు, అందరికీ పుణ్య చేసిన ధైర్యంతో మనిషికి ధైర్యం ఎంత అవసరమో తెలిసింది.

Exit mobile version