[ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయని ఆశా బోస్లేకు నివాళిగా ఈ రచన అందిస్తున్నారు మిడిదొడ్డి స్వామి.]
జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ధైర్యంగా ఎదుర్కొని ఆశతో ప్రయాణించి, ఒడిదుడుకులను సమతుల్యం చేసుకొని, అందలాన్ని అందుకొన్న ఆశా భోస్లే జీవితం ఒక ఇన్పిరేషనల్ స్టోరీ.
ప్రస్తుతం గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలో మంగేషి గ్రామంలోని మంగేషీ దేవాలయంలో పూజారిగా ఉండే గణేశ్ భట్ నవాతే (బ్రాహ్మణ), దేవదాసి ఏసుబాయి రానే (అబ్రాహ్మణ) లకు సహజీవనం ఫలితంగా 1900లో దీనానాథ్ జన్మించారు. మాతృభాష కొంకణి. దీనానాథ్ తండ్రి నుంచి బ్రాహ్మణ కుల వారసత్వాన్ని, ఇంటి పేరును తీసుకోకుండా తాను పుట్టిన ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకొని దీనానాథ్ మంగేష్కర్‌గా కొనసాగారు. దీనానాథ్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు మరియు స్టేజ్ ఆర్టిస్ట్. ఇతని భార్య శేవంతి. వీరికి ఐదుగురు సంతానం. లతా మంగేష్కర్, ఆశ, ఉష, మీనా, హృదయనాధ్.
మహారాష్ట్రలోని సాంగ్లిలో 1933 సెప్టెంబర్ 8వ తేదీన ఆశా జన్మించింది. లత కన్నా ఆశ నాలుగేళ్ళు చిన్నది. ఇంట్లోని పిల్లలందరికీ చిన్నతనం నుంచే ఇంట్లో గల సంగీత వాతావరణం వల్ల, శ్వాస తీసుకున్నంత సహజంగా సంగీతం కూడా అలవడింది. అలా పాడటం అనేది ఆ కుటుంబంలో మాటలు నేర్చినంత సులువుగా అలవాటు అయ్యింది. అయితే సహజంగా నాటక సమాజాల్లో ఉండే అలవాటులో భాగంగా ‘మందు’ తాగడం వ్యసనంగా మారిన దీనానాథ్ 41 సం॥ వయసులో పూణేలో మరణించారు. కుటుంబానికి గల ఏకైక పోషకుడు దీనానాథ్ మరణించే సమయానికి లతాకు 13 ఏళ్ళు, ఆశకు తొమ్మిదేళ్ళు.
ఆశా పదేళ్ళ వయసులో (1943) ‘మఝా బాలా’ అనే మరాఠీ సినిమాలో తన మొట్టమొదటి పాట ‘చలా చలా నవ్‌బాలా..’ ను పాడింది. దానికి సంగీతదర్శకుడు, దత్తా జవదేకర్. హిందీలో మొట్ట మొదటి అవకాశాన్ని సంగీత దర్శకుడు హన్సరాజ్ బెహ్ల్ తన ‘చునరియా’ (1948) చిత్రం కోసం ‘సావన్ ఆయా’ పాడించాడు. మొట్టమొదటి సోలో సాంగ్‌ను 1949లో ‘రాత్ కీ రాణీ’ సినిమా కోసం పాడింది.
ఆశా ఎప్పుడూ తాను గాయకురాలు కావాలని అనుకోలేదని తాను ఆక్సిడెంటల్ సింగర్‌ను అని చెప్పేది. ఇంట్లో తండ్రి గారు అతని శిష్యులు, అక్క లత పాడుతున్నప్పుడు జాగ్రత్తగా విని సాధన చేసే దాన్నని, అలా ఊరికే పాడటమే కానీ గాయకురాలు కావాలని ధ్యేయం మాత్రం లేదని చెప్పేది. విధి వక్రించి, ముగ్గరు పిల్లల పోషణ భారం మీద పడటంతో విధిలేని పరిస్థితుల్లో తనకు తెలిసిన విద్య పాడటంతోనే బ్రతుకు నెరపాలని పాటలు పాడటం చేసానని అనేవారు. అయితే అప్పటికి లతా తనదైన ప్రత్యేక ముద్రతో పాటలు పాడుతుంటే, మిగిలిన పాటలు శంషాద్ బేగమ్, గీతా రాయ్ పాడటం వల్ల ఆశాకు ప్రత్యేకంగా దొరికే పాటలు చాలా తక్కువ. అందువల్ల దొరికిన ప్రతి పాటను పాడటం మొదలు పెట్టింది. లతా మంగేష్కర్ తన టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఒప్పుకోని సంగీత దర్శకులతో పాడటానికి ఒప్పుకోక పోవడం అనే పరిస్థితి వల్ల అనేక మంది పెద్ద పెద్ద సంగీత దర్శకులు ఆశకు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
అలా ఎస్. డి. బర్మన్, జయదేవ్ వంటి సంగీత దర్శకుల దగ్గర నుంచి అవకాశాలు వచ్చాయి. మరొక వైపు గీతా రాయ్ గురుదత్‌ను వెళ్ళిచేసుకొని గీతాదత్ గా మారిపోయి, కెరీర్ మీద పట్టు సడలించడం వల్ల కూడా గీతా పాడే హుషారు గీతాలు ఆశకు ఇవ్వడం ప్రారంభమైంది.
ఉదాహరణకు: ‘సుజాత’ (1959) సినిమాలో – ‘కాలీ ఘటా చాయే’ పాట
‘నౌ దో గ్యారా’ (1957) లో ‘ఢల్తీ జాయె చునారియా’ పాట.
ఆ సందర్భంలో జయదేవ్‌తో స్పర్థ వల్ల లతా మంగేష్కర్ పాడనన్నారు.
‘హమ్ దోనోం’ (1961) సినిమాలో ‘అభీ న జావో చోఢ్ కర్..’ అనే అజరామరమైన మధుర గీతాన్ని ఆలపించింది ఆశ.
ఇలా అందివచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా వినియోగించుకొని అంత్యంత తక్కువ సమయంలోనే లత తర్వాత అశానే అనే స్థాయికి చేరింది.
***
ఆశా స్వరాన్ని తీర్చిదిద్దిన మ్యూజిక్ ఆర్కిటెక్ట్ – ఓ.పి. నయ్యర్. కారణాలేమైనా ఓ.పి. నయ్యర్ అనే సంగీత దర్శకునికీ, లతా మంగేష్కర్‌కీ సరి పడలేదు. అందువలన లతా మంగేష్కర్‌తో పాటలు పాడించకూడదని భీష్మించుకున్న నయ్యర్, లతాకు ప్రత్యామ్నాయంగా శక్తివంచన లేకుండా ప్రయత్నించి, ఆశాను అగ్రశ్రేణి గాయనిగా నిలబెట్టారు. ఆ క్రమంలో ఆశా – ఓ.పి. నయ్యర్‍ల బంధం సంగీత దర్శకుడు గాయని సంబంధం కంటే ఎక్కువగా ఒక అనుబంధంగా మారింది. ఆ సంగీత సంగమంలో ఓ.పి. నయ్యర్ ఎన్నో ఆణిముత్యాల వంటి పాటలు ఆశా కోసం సృజించాడు. హిట్ చేసాడు. వీటిలో కొన్ని:
1964లో ‘కాశ్మీర్ కలీ’ లో ‘దీవానా హువా బాదల్’, ‘ఇషారో ఇషారోఁ మే’ పాటలు రఫీతో కలిసి పాడిన ఆశా; ఓ.పి. నయ్యర్ సంగీతంలో తారాపథానికి చేరింది.
1966 లో ‘తీస్రీ మంజిల్’ సినిమా సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ దర్శకత్వంలో, ఆ సినిమాలో రఫీతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అందులో (1) ఓ మేరా సోనారే (2) ఓ హసీనా జుల్ఫోం వాలే .. ముఖ్యమైనవి.
ఆర్.డి.తో పరిచయం – వారి కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రింది పాటలు ఆశా Signature Songs గా మారిపోయాయి. నూటికి 70 మందికి ఆశా పాటలు అనగానే ఇవే గుర్తుకువస్తాయనడంలో సందేహం లేదు.
1) 1971 ‘కారవాన్’ లో- ‘పియా తూ అబ్ తో ఆజా’
2) 1971 ‘హరే రామ హరే కృష్ణ’ లో – ‘దమ్ మారో దమ్’
3) 1972 ‘అప్నా దేశ్’ లో – ‘దునియా మే లోగోంకో’
4) 1973 – ‘యాదోం కీ బారాత్’లో – ‘చురాలియా హై తుమ్నే’
ఇలాంటి పాటలలో 1970 వ దశకాన్ని ఆశా తన శకంగా మార్చుకొని దేశ యువతను ఓ ఊపు ఊపేసింది. పాశ్చాత్య బాణీలలోని ఈ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ అదే Spark ను కలిగి ఉన్నాయి. వెలుగుతున్నాయి.
ఈ దశలో రాను రాను ఓ.పి. నయ్యర్‌తో ఆశా అనుబంధం బలహీనపడింది. వారిద్దరూ (14 ఏళ్ళు కలిసి ఉన్నారు) కలిసి పనిచేసిన చివరి సినిమా 1973 నాటి ‘ప్రాణ్ జాయె పర్ వచన్ నా జాయె’. ఈ సినిమాతో ఓ.పి. నయ్యర్ – ఆశా విడిపోయారు. ఇక కలిసి పనిచేయనే లేదు. ఈ సినిమాలో ఆశా పాడిన ఒక పాటకు వచ్చిన trophy ని తీసుకోవడాని కూడా ఫంక్షన్‌కు ఆశా హాజరు కాలేదు. ఆవిడ తరపున ఓ.పి. నయ్యర్ తీసుకున్న ఆ ట్రోఫీని వెళ్తూ వెళ్తూ కారు లోంచి బయటకు పడేశాడని చెప్తారు.
ఓ.పి. నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో ఆశా గురించి చెప్తూ, “నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆశా. నేనింత వరకూ కలిసిన స్త్రీలలో ది బెస్ట్ ఆశానే” అని మెచ్చుకున్నాడు. మరొక ఇంటర్వ్యూలో, “ఆశా ఏదో ఒకనాడు నన్ను వదిలి వెళ్ళిపోతుందని నాకు తెలుసు” అని నిర్వేదంగా అన్నాడు. ఆ తర్వాత ఓ.పి. నయ్యర్ నెమ్మదిగా తెరమరుగు అయ్యాడు [ఆశా ఓపి నయ్యర్ 14 ఏళ్ళు (1958-1973) కలిసి ఉన్నారు].
ఆర్.డి., ఆశా – లత లతో పాడించిన పాట ‘పడోసన్’ (1968)లో ‘మై చలీ మై చలీ’ పాట. అక్కాచెల్లెళ్ళిద్దరి పాట ఎంతో బాగుంటుంది.
ఆశా ఆర్.డి.ల సంగీత సంగమం వారిద్దరి కెరీర్‌లో స్వర్ణయుగం. 1994 లో ఆర్.డి. చనిపోయే కొన్ని రోజులు మినహాయిస్తే, వారిద్దరూ కలిసే ఉన్నారు. చనిపోయిన తరువాత పార్థివ శరీరాన్ని చూడలేనని ఆశ, చూడకూడదని మౌనంగా ఉండిపోయింది.
నౌషాద్‌ను ఓ సందర్భంలో “మీరు ఆశాతో ఎందుకు పాడించలేదు?” అని అడిగినప్పుడు – “లతాలో ఉండే ఒక ఏదో విషయం ఆశాలో లేదు” అని అన్నాడు. అతనే మరో సందర్భంలో ఆశా అగ్రపథానికి చేరిన తర్వాత మరో ఇంటర్వ్యూలో “అప్పుడు నేను చెవులు మూసుకొని విన్నాను. ఆశాకు న్యాయం చేయలేకపోయాను” అని ఆవేదన వెలిబుచ్చాడు.
ఇతర సంగీత దర్శకుల దగ్గర కూడా ఆశా మధురమైన పాటలెన్నో పాడింది. అందులో నాకు బాగా నచ్చిన కొన్ని ఉదహరిస్తాను.
మదన్ మోహన్ సంగీతంలో ‘అదాలత్’ (1958) సినిమాలో 1) ఝుంకా గిరారే 2) దుపట్టా మేరా మల్‍మల్ కా.
సి. రామచంద్ర సంగీతంలో ‘ఇన మిన డికా’, ‘దిల్ లగా కర్ హం యె సంఝే’, ‘ తుమ్ మేరే మై తేరీ ‘
రవి సంగీత దర్శకత్వంలో మధురమైన పాటలు పాడింది. ‘డిల్లీ కా థగ్’ (1958) లో ‘యే రాతేఁ యే మౌసమ్ నదీ కా కినారా’; ‘వచన్’ (1958) లో ‘చందామామా దూర్ కర్’; ‘కాజల్’ (1965) లో ‘తేరా మన్ దర్‌పన్’ అనే భజన, దో బదన్ లో ‘ జబ్ చలీ ఠండీ హవా’ వంటివి.
కళ్యాణ్‌జీ – ఆనంద్‌జీ సంగీతంలో – ‘డాన్’ (1978) లో ‘యే మేరా దిల్ ప్యార్ కా దీవానా’ (ఇది ఆర్.డి బర్మన్ స్టయిల్ పాట అనిపిస్తుంది).
ఖయ్యూం సంగీత దర్శకత్వంలో ‘ఉమ్రావ్ జాన్’ (1981) లో ‘దిల్ క్యా చీజ్ హై’ (1st National award వచ్చింది). ‘ఇన్ ఆంఖోం కీ మస్తీ’ అయితే అజరామరమే కదా!
బ్లాక్ అండ్ వైట్ యుగం నుండి నేటి డిజిటల్ యుగం వరకు కాల పరీక్షను, ట్రెండ్ మార్పిడిని తట్టుకొని ఆశా స్వరం update అవుతూ, నిత్య నూతనంగా నదిలా సాగుతూ, పాడుతూనే ఉన్నది. దక్షిణాది సంగీత దర్శకులతో కూడా ఆశా ఎన్నో మంచి పాటలు పాడింది.
ముఖ్యంగా ఎ.ఆర్. రహమాన్ ప్రభంజనంలో ‘రంగీలా’ (1995) లో 62 ఏళ్ళ వయస్సులో 23 ఏళ్ళ ఊర్మిళకు పాడిన – తన్హా తన్హా..; రంగీలా రే.. అనే పాటలు ఆశా స్వరానికి కాలదోషం లేదని నిరూపించాయి.
లగాన్ లో ‘రాధ కైసే న జలే’
తాల్ లో – ‘కహీ ఆగ్ లగే’
దౌడ్ లో – ‘ఓ బాప్ రే’
వంటి పాటలు వింటే మనసు ఉరకలు వేస్తుంది. 60 ఏళ్ళు పైబడిన స్వరం అదని గుర్తుకురాదు.
ఇళయరాజాతో సద్మా (1983), ఓ బబువా (హిందీ); హేరామ్ (2000) – నీ పార్థ పరమై (తమిళం); మీరా (1992) – ఓ బట్టర్ ఫ్లై ఓ బట్టర్ ఫ్లై వంటి సినిమాలలో పాటలు పాడింది.
తెలుగులో ‘పాలు నీళ్ళు’ (1981) సినిమా కోసం సంగీత దర్శకుడు సత్యం ‘ఇది మౌనగీతం’తో మొదలై, అశ్వమేధం (1992) శీతాకాలం ప్రేమలు పండే కాలం, ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ (ఇళయరాజా సంగీతం); సందీప్ చౌతా అని సంగీత దర్శకుడి ‘కంభక్త్ ఇష్క్’ అనే పాటను; సోనూ నిగమ్, సుఖ్వీందర్ సింగ్ లతో కలిసి పాడి దుమ్ము లేపారు. ఒక్క సినిమా పాటలే కాకుండా గజల్స్, ఖవ్వాలీలు, రవీంద్ర సంగీతం మొదలైనవి ఎన్నో పాడింది. ఏది పాడినా అందులో ఆశా ముద్ర కనిపిస్తుంది.
ఈ మధ్యే ఎక్కడో చదివిన ఒక విషయం గుర్తొస్తోంది
అసలు వారిద్దరినీ పోల్చనే వద్దని అంటాను.
కొన్ని కొన్ని పాటలు ఆశాలా లత పాడలేదని అనిపిస్తుంది. కనుక సినిమా పాటల్లో ఎవరి దారి వారిదే. ఒక్కొకరిది ఒకొక్క పంథా.. ఒక జలాశయానికి ఉన్న కుడి, ఎడమ కాల్వల వంటి వారు లతా, ఆశా. సరస్వతీ ప్రవాహం నుండి జనించి, భివి చేరి, వేర్వేరు దారుల్లో ప్రయాణించి, చివరికి ఇద్దరూ సరస్వతీమాతలో కలసిపోయారు.
ఆశా సాధించిన అనేక అవార్డులలో ముఖ్యమైనవి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, నేషనల్ అవార్డు, భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్.
20 భాషల్లో 12000 కు పైగా పాటలు పాడిన ఆశా గిన్నిస్ బుక్‌లో రికార్డ్ నెలకొల్పింది.
92 వయస్సులో ముంబై లోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో 12 ఏప్రిల్ 2026 న ఆశా పరమపదించిన సంగతిని జానై బోస్లేనే లోకానికి తెలియచేసింది.
ఆశాకు పాడటంతో పాటుగా cooking అంటే ఉన్న ఇష్టంతో UAE, UK లాంటి దేశాలలో Asha’s అనే పేరుతో Restaurants తెరిచింది. పాడటంతో మునసును, వంటలతో కడుపును ఒకేసారి నింపుతూన్నది.
సంగీత ప్రియుల ఆకలిని
ఆహార ప్రియుల ఆకలిని
ఏక కాలంలో తీరుస్తున్న అమ్మ.. ఆశా.
ఆమెకు నివాళి.
ఆచంద్రతారార్కం ఆమె పాటలు వినబడుతూనే ఉంటాయి.
