[శ్రీ విజయసారథి జీడిగుంట రచించిన ‘సదదర్శ తతో రామం – రామచంద్రుని కాంచెను రావణుండు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ” శ్లోకంతో ‘ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, అలాగే రామ రావణుల యుద్ధానికి రామ రావణుల యుద్ధమే పోలిక‘ అని వాల్మీకి మహర్షి వర్ణించిన యుద్ధంలో తన సైన్యంలో మహామహులందరూ మట్టి కొట్టుకుపోయి తన వారందరూ దూరమైపోయి ఉగ్రరూపుడై రణరంగంలో అడుగుపెట్టిన రావణుడు వానరసేన పైన విజృంభించడంతో మొట్ట మొదటిసారి శ్రీరామచంద్రమూర్తి రావణుడి ముందుకు వస్తాడు. ఆ సందర్భంలో స్వామి రావణాసురునికి ఎలా కనబడ్డాడో వాల్మీకి తన రామకథా కథనంలో యుద్ధకాండ నూరవ సర్గ లో నాలుగు శ్లోకాల (11 నుంచి 14) ద్వారా ఇలా తెలియపరచి అటు పిదప వారిరువురి మధ్య జరిగిన పోరును వివరిస్తాడు.
తతోరాక్షసశార్దూలోవిద్రావ్యహరివాహినీమ్
స దదర్శతతోరామంతిష్ఠన్తమపరాజితమ్
లక్ష్మణేనసహభ్రాత్రావిష్ణునావాసవంయథా
అలిఖన్తమివాకాశమవష్టభ్యమహద్ధనుః
పద్మపత్రవిశాలాక్షందీర్ఘబాహుమరిన్దమమ్
తతోరామోమహాతేజాఃసౌమిత్రిసహితోబలీ
వానరాంశ్చరణేభగ్నానాపతన్తం చ రావణమ్
సమీక్ష్యరాఘవోహృష్టోమధ్యేజగ్రాహకార్ముకమ్
తతః (అనంతరం) రాక్షసశార్దూలః (రాక్షసులలో పులి వంటివాడు) హరివాహినీం (వానర సేనను) విద్రావ్య (తరిమివేసి), తతః (ఆ తర్వాత) అపరాజితం (ఓటమి ఎరుగని) తిష్ఠంతం (నిలబడి ఉన్న) రామం (రాముడిని) సః (అతడు/రావణుడు) దదర్శ (చూశాడు).
భ్రాత్రా లక్ష్మణేన సహ (తమ్ముడైన లక్ష్మణుడితో కూడిన), విష్ణునా (విష్ణువుతో కూడిన) వాసవం యథా (ఇంద్రుడి వలె), మహత్ ధనుః (గొప్ప ధనుస్సును) అవష్టభ్య (గట్టిగా పట్టుకుని), ఆకాశం (ఆకాశాన్ని) అలిఖంతమ్ ఇవ (గీస్తున్నట్లుగా, స్థిరంగా) ఉన్న (రాముడిని చూశాడు).
(రావణుడు చూసిన ఆ రాముడు) పద్మపత్రవిశాలాక్షం (తామర రేకుల వంటి విశాల నేత్రాలు గల), దీర్ఘబాహుం (పొడవైన బాహువులు గల), అరిందమమ్ (శత్రువులను అణచేవాడు). తతః (ఆ తర్వాత) మహాతేజాః (గొప్ప తేజస్సు గలవాడు), బలీ (బలవంతుడైన) రామః (రాముడు), సౌమిత్రి సహితః (లక్ష్మణుడితో కూడినవాడై [నిలబడ్డాడు]).
రాఘవః (రఘువంశస్థుడైన రాముడు) రణే (యుద్ధంలో) భగ్నాన్ వానరాన్ చ (చెదరగొట్టబడిన వానరులను) ఆపతంతం చ రావణం (ఎదురుగా దూసుకు వస్తున్న రావణుడిని) సమీక్ష్య (చూసి) హృష్టః (సంతోషించి, ఉత్సాహపడి) కార్ముకం (ధనుస్సును) మధ్యే (మధ్య భాగంలో) జగ్రాహ (గట్టిగా పట్టుకున్నాడు).
తెలుగులో అనువదించబడిన, అనుసృజించబడిన అనేక రామాయణాలలో రామరావణ సంగ్రామంలో ఇలా ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో రచింపబడిన పద్యాలు గానీ, వచనాలు గానీ మూల శ్లోకాలకు విధేయంగానే రాసారు తెలుగు కవులు. అయితే విశ్వనాథ తన భక్తి తాను ప్రకటించుకునే దిశలో వాల్మీకి రామాయణానికి అవసరమైన చోట తన వ్యాఖ్యానం జోడించి మరీ తన రామాయణ కల్పవృక్షాన్ని విస్తరించిన విధానానికి ఒక ఉదాహరణగా వాల్మీకి మూల శ్లోకాలలోని “సదదర్శతతోరామం” అనే పదజాలం ఆత్మని పట్టుకుని యుద్ధకాండ నిస్సంశయ ఖండంలో ఐదు సీస పద్యాలతో నిస్సంశయంగా ఇంద్రజాలం చేశారని చెప్పచ్చు. సదదర్శతతోరామం అంటే సః (అతడు/రావణుడు) దదర్శ (చూశాడు) తతః (ఆ తర్వాత/అప్పుడు) రామం (రాముడిని) – అప్పుడు రాముడిని చూశాడు రావణుడు. ఎటువంటి రాముడిని అంటే పై శ్లోకాల్లో వాల్మీకి ఇలా సూచించాడు.
రాక్షసులలో శ్రేష్ఠుడైన రావణుడు తన పరాక్రమంతో వానర సేనను మొత్తం చెదరగొట్టిన తర్వాత యుద్ధరంగంలో తన ముందర నిలుచున్న ఓటమన్నది తెలియని శ్రీరాముడిని చూశాడు.
ఆ రాముడు, తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి దేవేంద్రుడితో కూడి ఉన్న విష్ణువులా మహా తేజస్సుతో వెలిగి పోతూ రావణుడికి కనబడ్డారు. ఆ రాముడు తన గొప్ప ధనుస్సును ఆకాశం తాకేలా గట్టిగా పట్టుకుని, తన మహోన్నతమైన, నిశ్చలమైన ఆకారం అత్యంత స్థిరంగా నిలబడి ఉన్నాడు.
రావణుడు చూసిన ఆ రాముడు ఇంకా ఎలా ఉన్నాడంటే: ఆయన తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగి, యుద్ధానికి సిద్ధమైన భుజబలం సూచించే పొడవైన చేతులు కలిగి, శత్రువులను అణచివేయగల శక్తి తో, గొప్ప తేజస్సు తో ఆ రాముడు సుమిత్రానందనుడైన లక్ష్మణుడితో కలిసి యుద్ధ రంగంలో స్థిరంగా నిలబడ్డాడు.
రఘువంశానికి చెందిన రాముడు, యుద్ధంలో శత్రువుల చేత చెల్లాచెదురైన వానర సేనను మరియు తన మీదికి వేగంగా దూసుకు వస్తున్న రావణుడిని కూడా గమనించి కూడా ఏమాత్రం భయపడక పోగా, శత్రువు ఎదురైనందుకు సంతోషించి ఎంతో ఉత్సాహంగా తన ధనుస్సును మధ్య భాగంలో మరింత గట్టిగా పట్టుకుని, యుద్ధానికి పూర్తిగా సిద్ధమయ్యాడు.
అదీ వాల్మీకి వర్ణించిన శ్రీరామచంద్రమూర్తి రూపం. మరి ఉన్నదున్నట్టు గా అలాగే అనువదించుకుంటూ పోతే “కవి ప్రతిభలోన ఉండును కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది” అని అవతారికలో చాటుకున్న తన కవి పలుకులకు సార్థకత ఎలా చేకూరుతుంది ?
అందుకే వాల్మీకి పలికిన “సదదర్శతతోరామం” అన్న మహర్షి వాక్యాన్ని “రామచంద్రుని గాంచెను రావణుండు” అనే మకుటంగా మార్చి అయిదు అందమైన సీస పద్యాలలో (నిస్సంశయ ఖండం, 193 – 197) యుద్ధభూమి లో రావణుడు దర్శించిన శ్రీరామచంద్రమూర్తిని మన కోసం ఎంతో ఔచిత్యం పాటిస్తూ ఇలా ఆవిష్కరిస్తున్నారు కవి సమ్రాట్.
మనం ఎవరైనా ఎదురుపడితే ముందుగా వారి రూపాన్ని గమనిస్తాం. అందుకే మొదటి పద్యంలో రావణుడు రాముణ్ణి నఖశిఖ పర్యంతమూ పరిశీలించినప్పుడు స్వామి దేహ సౌందర్యం కనబడింది. సరే బాగానే ఉంది కానీ వచ్చింది యుద్ధరంగానికి. దేహ సౌందర్యం తో పని లేదు. దేహ ధారుఢ్యం ముఖ్యం. కాబట్టి రెండో పద్యంలో శ్రీరామ పరాక్రమాన్ని గమనించాడు రావణాసురుడు. వీరుడి లాగే ఉన్నాడు అయితే ఏంటట? తాను కూడా తక్కువేమీ కాదు. తన విజయాలు తనకున్నాయి. ఇంతకీ రాముడు ఏం చేశాడట? అదిగో ఆ విజయాలనే మూడో పద్యం ద్వారా రావణుడి కళ్ళ ముందు దృశ్యమానం చేసారు విశ్వనాథ.
నిజానికి కదనరంగంలో కోదండరాముని వర్ణన ఈ మూడు పద్యాలతో సరి పెట్టేయ్యచ్చు. కానీ రామతత్వం ఏది? శ్రీరాముని శాంత స్వభావం, కరుణ, దయలాంటి మానవీయ లక్షణాలు ఎక్కడ? అందుకే నాలుగో పద్యంలో మర్యాదా పురుషోత్తముని లక్షణాలని రావణుని స్వగతము ద్వారా మనకి తెలియజేశారు. అంతా బాగానే ఉంది. ఇదేంటి? తాను రాముని మత్తులో పడిపోతున్నానా? అతని గత విజయాల బట్టి, పరాక్రమం బట్టి చూస్తే తాను ఓడిపోతానా? లేదు. నేను శ్రీరాముడి గురించి అనవసరంగా ఎక్కువ అంచనా వేస్తున్నాను. అంత గొప్పవాడైతే కేవలం కైక పట్టిన మొండి పట్టుకి లోబడి అడవుల్లోకి పారిపోతాడా? ఎవరో సన్యాసి మూక పురిగొలిపితే యుద్ధం చేసి తన విలువిద్య ప్రదర్శిస్తే వీరుడు అయిపోతాడా? మూడు లోకాల్లోనూ అందగత్తె అయిన తన భార్యనే రక్షించుకోలేని అసమర్థుడు.ఎంత తెలివితక్కువ వాడు కాకపోతే కోతి మూకను వెంటేసుకుని ఏకంగా లంక మీదకే దండెత్తి వచ్చేసాడని రాముని గురించి చులకనగా అంచనా వేస్తున్నాడు రావణుడు. ఈ ఆలోచనలకే అద్భుతమైన రూపం ఇచ్చారు విశ్వనాథ ఐదవ పద్యంలో.
అయితే ఈ చివరి సీస పద్యానికి రాసిన ఎత్తుగీతిలో రాముణ్ణి ఏది ఏమైతే నాకేంటి అనే బైరాగిలాగా, అదృష్టవశాత్తు అన్నీ అనుకూలించిన సాధారణ మానవుడి లాగ రావణుడు అంచనా వేశాడన్న భావనకి పద్య రూపమిస్తూ రామతత్వాన్ని కూడా అద్భుతంగా ధ్వనింప చేసారు విశ్వనాథ. ఆ పద్యాల అల్లిక, ప్రతి పదార్థం , భావాల్ని చూడండి. ఎంత హృద్యంగా ఉన్నాయో.
శ్రీరాముడి సుందర రూప వర్ణన
శ్రావణాంభోధరచ్ఛాయా మనోజ్ఞాసిత స్వాదు నీల సుందర శరీరు
సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాలనయను
మధురప్రాతః కాల మహీరుహాధాశ్చ్యుత పున్నాగక సనాళపుష్పనాసు
పరిసితారగ్వధావనిజాత కిసలయోపరిసాంధ్యరాగ సంవ్యానయుగళు
బాల వల్మీక వర జటాభర కిరీటు
నవకుటజకోరకాగ్ర కాంత్యాభ సహజ
సూక్ష్మ మృదు మందహాస భాసుర కపోలు
రామచంద్రుని గాంచెను రావణుండు.
ఈ పద్యం రావణుడు యుద్ధానికి ముందు శ్రీరామచంద్రుని దివ్య రూపాన్ని చూసిన సందర్భాన్ని వర్ణిస్తుంది. ఇందులో శ్రీరాముడి రూపాన్ని సూర్యోదయం, ప్రకృతి అందాలతో పోలుస్తూ, అత్యంత శోభాయమానంగా కవి వర్ణించారు. రామచంద్రుని రూప వర్ణన (రామాయణ కల్పవృక్షం) ఈ పద్యం శ్రీరాముడి రూపాన్ని నాలుగు విశేషణాలతో వర్ణించి, చివర్లో ఆ రూపాన్ని రావణుడు చూశాడు అని ముగిస్తుంది.
శ్రీరాముడి శరీర వర్ణన
శ్రావణాంభోధరచ్ఛాయా: శ్రావణ మాసంలోని మేఘం యొక్క నీడ (నలుపు) వలె.
మనోజ్ఞాసిత: మనోహరమైన నల్లదనం.
స్వాదు నీల సుందర శరీరు: రుచి (చూడముచ్చటైన) నీల వర్ణంలో ఉన్న అందమైన శరీరం కలవాడు.
భావం: శ్రీరాముడు శ్రావణ మాసపు నల్లని మేఘపు ఛాయ వలె, చూడముచ్చటైన నీల వర్ణపు అందమైన శరీరం కలవాడు. శ్రావణ మేఘం చాలా దట్టంగా నీరు కలిగి, నల్లగా, భారంగా ఉంటుంది . అటువంటి శ్రావణ మేఘపు ఛాయ తో మనోజ్ఞమైన , అసిత అంటే నల్లనైన, ఇంపైన, మధురమైన నీల సుందర దేహం కలవాడు సుందరరాముడు.
శ్రీరాముడి కళ్ళ వర్ణన
సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన: అన్ని వైపులా వ్యాపించిన ఉదయపు మంచును తొలగించే (ఉదయం).
భాస్వర వారిజాత: కాంతివంతమైన పద్మం (తామర).
విశాలనయను: విశాలమైన కళ్ళు కలవాడు.
భావం: ఉదయపు మంచును . అంతటా వ్యాపించిన ప్రాతః కాలమందలి తెలిమంచుని, తొలగిస్తూ వికసించిన కాంతివంతమైన పద్మాల వలె విశాలంగా ఉన్నాయి స్వామి నేత్రాలు.
శ్రీరాముడి ముక్కు వర్ణన
మధుర ప్రాతః కాల: మధురమైన ఉదయకాలంలో.
మహీరుహాధాశ్చ్యుత: చెట్టు (మహీరుహం) నుండి జారిన.
పున్నాగక సనాళ పుష్పనాసు: కాడతో సహా ఉన్న పున్నాగ పువ్వు వంటి ముక్కు (నాస) కలవాడు.
భావం: రాఘవుని ముక్కు, మధురమైన ప్రాతఃకాలపు సమయంలో సురపొన్న వృక్షం నుండి కాడతో సహా జారిపడిన పున్నాగ పువ్వులాగా చాలా అందంగా ఉంది.
శ్రీరాముడి వస్త్రాల వర్ణన
పరిసితారగ్వధా: కొండపసుపు (రేలపువ్వు) చెట్టుపై ఉన్న.
వనిజాత కిసలయోపరి: అడవిలో పుట్టిన చిగురాకులపై (లేత ఆకులపై).
సాంధ్యరాగ సంవ్యానయుగళు: సంధ్యా సమయంలో ఉండే ఎరుపు రంగు (సాంధ్యరాగం) తో మెరిసిపోతున్న ఉత్తరీయాల జత ధరించినవాడు.
భావం: అడవుల్లో పుట్టిన అరగ్వధ వృక్షాలకి పూచిన కర్ణికారపుష్ప కేసరముల మీద సంధ్యా సమయంలో ఎర్రని కెంజాయ కాంతులతో మెరిసిపోతున్న ఉత్తరీయాల జతతో వక్షస్థలాన్ని కప్పుకున్న శ్రీరాముని అందాన్ని ఏమని వర్ణించాలి.
శ్రీరాముడి జటలు ముఖ వర్చస్సు వర్ణన
బాల వల్మీక వర జటాభర కిరీటు: లేత పుట్టమన్ను (వల్మీకం) వలె అందమైన జటాభారం (జడల కిరీటం) కలవాడు. (రాముడు అప్పుడు జటలు ధరించి ఉన్నాడు.)
నవకుటజకోరకాగ్ర కాంత్యాభ: కొత్త కుటజ పువ్వు (కొండమల్లె పువ్వు) మొగ్గ యొక్క చివర్ల కాంతి వలె ఉండే.
సహజ సూక్ష్మ మృదు మందహాస భాసుర కపోలు: సహజమైన, చిన్నదైన, మృదువైన మందహాసంతో ప్రకాశించే చెంపలు (కపోలం) కలవాడు.
భావం: చిన్న పుట్టలా పెరిగిన జుట్టుని ముడివేసుకున్న జటాభరమనే కిరీటం తో, కొత్తగా వికసించిన కొండమల్లె పువ్వు మొగ్గ చివర్ల కాంతి వలె ఉండే సహజమైన, సూక్ష్మమైన, మృదువైన చిరుఅందహాదంతో ప్రకాశించే చెంపలు కల ఆ రామచంద్రుని దివ్య మంగళ స్వరూపాన్ని రావణుడు చూశాడు.
శ్రీరాముడి వీర రూప వర్ణన
పీనాంస యుగ దృశ్యమాన తూణీరేషు నటగరుద్భ్రమర సేవిత ముఖాబ్జు
కోదండ ప్రాగ్దిశా కుంభి శుండాదండ భాస్వర స్వర్గలక్ష్మీ స్వరూపు
ఆయసవల్లి సమాశ్లిష్ట కవచ దీప్తోరు వక్షో మహామేరుభూతు
ఫాల ద్యుతిచ్ఛటా శ్రీలీన శితలోచన ప్రభా హృత గగన పరిణాహు
ఘోర ఫణి పరీభావజకోప లిప్త
నవ వివృత్యభిముఖిలీన సూక్ష్మ
చలన పటు ఫణా సదృశ హస్తముల వాని
రామచంద్రుని గాంచెను రావణుండు .
మునుపటి పద్యంలో శ్రీరాముడి దివ్య సౌందర్యం వర్ణించబడితే, ఈ పద్యంలో యుద్ధ సన్నద్ధుడై, ధర్మాగ్రహంతో పౌరుషమూర్తి యైన రాముడి వీర రూపాన్ని వర్ణించారు విశ్వనాథ. ఈ పద్యంలో రామ బాణాలు, మహా ధనుస్సు (కోదండం), వాటిని ఉపయోగించే చేతులు, ఛాతీని అంటిపెట్టుకుని ఉన్న కవచం, కళ్ళల్లో క్రోధం వంటి యుద్ధ చిహ్నాలు, కోదండ రాముని పౌరుషం వర్ణించబడ్డాయి.
భుజాలు, అమ్ములపొది మరియు ముఖ వర్ణన .
పీనాంస యుగ దృశ్యమాన తూణీరేషు: బలమైన భుజాల జంటపై (పీనాంస యుగ) కనిపిస్తున్న అమ్ములపొదులు (తూణీరములు) కలవాడు.
నటగరుద్భ్రమర సేవిత ముఖాబ్జు: నటించే (కదులుతున్న) రెక్కల (గరుత్) రూపంలో ఉన్న తుమ్మెదలు (భ్రమరములు) సేవించే పద్మం లాంటి ముఖం కలవాడు
భావం: శ్రీరాముడి ముఖం పద్మంతో సమానం, ఆ పద్మం చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయా అన్నట్టుగా వెంట్రుకలు, చెమట బిందువులు కనిపిస్తున్నాయని భావం.
తన వీపుకి కట్టబడి, బలిష్ఠమైన తన రెండు భుజాలకు వ్రేలాడుతున్న తూణీరములలో ( రెండు అమ్ముల పొదలు ఎందుకంటే రాముడు కూడా సవ్యసాచి కాబట్టి) ఉన్న బాణాల చివర్లలో వున్న పక్షి ఈకలు ముఖానికిరుప్రక్కలా భ్రమర సమూహంలా కనిపిస్తూ దూరం నించి స్వామి నడచి వస్తుంటే స్వామి ముఖ పద్మం చుట్టూ తిరుగుతున్న తుమ్మెదల్లా ఉన్నాయట.
ధనుస్సు (కోదండం)
కోదండ: విల్లు (ధనుస్సు).
ప్రాగ్దిశా కుంభి శుండాదండ: తూర్పు దిక్కున ఉండే దిగ్గజం యొక్క తొండం వలె (ప్రాగ్దిశా కుంభి శుండాదండ) దీర్ఘంగా ఉన్న.
భాస్వర స్వర్గలక్ష్మీ స్వరూపు: ప్రకాశించే స్వర్గ లక్ష్మి (విజయ లక్ష్మి) యొక్క స్వరూపం కలవాడు.
భావం: శ్రీరాముడి ధనస్సు కోదండం, తూర్పు దిక్కున ఉండే దిగ్గజం అంటే ఐరావతం తొండం లాగా బలంగా, ప్రకాశవంతంగా ఉంది. ఆ విల్లు పట్టుకున్న రాముడు, విజయాన్ని ప్రసాదించే స్వర్గ లక్ష్మీ స్వరూపంగా కనిపిస్తున్నాడు.
కవచం మరియు వక్షస్థలం
ఆయసవల్లి: ఇనుప తీగలు.
సమాశ్లిష్ట కవచ: ఆ ఇనుప తీగలచే అల్లుకున్నట్లుగా ఉన్న కవచం కలవాడు.
దీప్తోరు వక్షో మహామేరుభూతు: ప్రకాశించే, విశాలమైన వక్షస్థలం (ఛాతీ) కలవాడు. ఆ వక్షస్థలమే మహామేరు పర్వతం వలె ఉంది.
భావం: ఇనుప తీగలు అల్లుకున్న కవచంతో ప్రకాశిస్తున్న శ్రీరాముడి విశాలమైన వక్షస్థలం, ఎంతటి దాడి ఎదుర్కొన్నా చెక్కుచెదరని మహామేరు పర్వతంలా ఉందట.
కళ్ళ తేజస్సు
ఫాల ద్యుతిచ్ఛటా: నుదుటి యొక్క కాంతి సమూహం.
శ్రీలీన శితలోచన ప్రభా: ఆ కాంతిలో ఇమిడిపోయిన తీక్ష్ణమైన (శిత) కళ్ళ (లోచన) యొక్క కాంతి.
హృత గగన పరిణాహు: ఆ కాంతి ఆకాశమంతటి విస్తీర్ణాన్ని (పరిణాహు) కూడా తొలగించింది (హృత).
భావం: రాముడి కళ్ళ నుండి వచ్చే తీవ్రమైన కాంతి, నుదుటి తేజస్సుతో కలిసి, ఆకాశం యొక్క విస్తృతిని సైతం కప్పివేసేంతటి శక్తివంతంగా ఉంది. (క్రోధంతో కూడిన చూపు.)
చేతులు (హస్తాలు)
ఘోర ఫణి పరీభావజ కోప లిప్త: భయంకరమైన పామును అవమానించడం వలన కలిగిన కోపంతో నిండిన (లిప్త).
నవ వివృత్యభిముఖిలీన సూక్ష్మ చలన పటు ఫణా సదృశ: కొత్తగా పైకి లేస్తూ, ఎదురుగా ఉన్న సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టే సామర్థ్యం గల పాము పడగ (ఫణా) వలె ఉండే.
హస్తముల వాని: చేతులు (హస్తములు) కల ఆ.
రామచంద్రుని గాంచెను రావణుండు: రామచంద్రుడిని రావణుడు చూశాడు.
భావం: శ్రీరాముడి చేతులు ఎలా ఉన్నాయంటే, అవి అవమానం పొందిన భయంకరమైన పాము కోపం వలె ఉండి, కొత్తగా పైకి లేచి, కదులుతున్న పడగ వలె ఉన్నాయి. ఆ పడగ కదలిక ఎంతటి సూక్ష్మమైన కదలికనైనా పట్టుకునేంత పదునుగా ఉంటుంది. అంతటి కోపంతో, కదలికతో, వేగంతో కూడిన చేతులు కల ఆ రామచంద్రుడిని రావణుడు చూశాడు.
శ్రీరాముడి గత విజయాల వర్ణన
శైవ శరాస లస్తక హస్త సంతృటనాత్త కీర్తి ప్రథమావతారు
పరశురామాభీల బాహుగర్వవిభంజన జ్ఞాత దోరనంత ప్రభావు
ఖర దూషణాది రాక్షస చతుర్దశ చమూ లీలా విధూనన క్లేశకారు
సప్త తాళీ ప్రభంజన కార్య చాపకళా శ్లక్ష్ణతర కౌశల ప్రశస్తు
దర్పితాసుర వీరవధ ప్రచండ
కృతి కృత మహాపకారు, దూరీకృతోగ్ర
మూలసేనా మహాక్రూరు, మోహదూరు
రామచంద్రుని గాంచెను రావణుండు.
రాముడి గత విజయాలను, పౌరుషాన్ని కీర్తించే పద్యం. రావణుడు శ్రీరాముడిని చూసినప్పుడు, అతనికి రాముడు కేవలం వనవాసిగా కాక, గతంలో అసాధ్యమైన వీర కార్యాలు చేసిన మహా పరాక్రమశాలిగా కనిపిస్తున్నాడు. ఈ పద్యంలో శ్రీరాముడు సాధించిన నాలుగు ముఖ్యమైన విజయాలు వర్ణించబడ్డాయి.
శివ ధనుస్సు భంగం
శైవ శరాస: శివుడి ధనుస్సు (శరాస).
లస్తక హస్త సంతృటనాత్త: (రాముడి) అందమైన చేతిచే (లస్తక హస్త) విరిచివేయబడిన (సంతృటనాత్త).
కీర్తి ప్రథమావతారు: ఆ కీర్తిని పొందిన మొదటి అవతారం (వీర కార్యానికి మొదటి రూపం).
భావం: శివుడి ధనుస్సును తన సుకుమారమైన చేతితో విరిచివేసి, కీర్తిని పొందిన మొట్టమొదటి వీరుడు శ్రీరాముడే. శివ సంబంధమైనది శైవం. శరాసనము అంటే శరాలకు ఆసనం. బాణాలను ప్రయోగించడానికి ధనుస్సుకావాలి. లస్తకం అంటే ధనుస్సుని పట్టుకునే మధ్య భాగం. శివధనుస్సు లస్తకము తన చేత్తో పట్టుకుని ఎక్కు పెట్లేటాడో లేదో, సంతృటనం అంటే అది రెండు ముక్కలయింది. అలాంటి కీర్తిని పొందిన మొదటి వాడు, నిజానికి ఒకే ఒక్కడు శ్రీరామచంద్రుడు.
పరశురాముడి గర్వ భంగం
పరశురామాభీల: పరశురాముడి యొక్క భయంకరమైన.
బాహుగర్వ విభంజన: భుజబల గర్వాన్ని విరిచివేసిన (నశింపజేసిన).
జ్ఞాత దోరనంత ప్రభావు: ఆ విధంగా తెలిసిన గొప్ప అంతులేని ప్రభావం (శక్తి) కలవాడు.
భావం: భయంకరమైన శక్తి గల పరశురాముడి బాహుబల గర్వాన్ని అణచివేసి, తన అంతులేని గొప్ప ప్రభావాన్ని ప్రపంచానికి చాటినవాడు శ్రీరాముడు.
ఖర–దూషణాది రాక్షస సంహారం
ఖర దూషణాది రాక్షస: ఖరుడు, దూషణుడి వంటి రాక్షసులు.
చతుర్దశ చమూ: వారి పద్నాలుగు వేల (చతుర్దశ) సైన్యాన్ని (చమూ).
లీలా విధూనన: లీలగా (అతి సులభంగా) సంహరించడం.
క్లేశకారు: (శత్రువులకు) బాధను కలిగించినవాడు.
భావం: ఖరదూషణాదులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యాన్ని అతి సులభంగా, ఒక క్రీడా మాత్రంగా సంహరించి, శత్రువులకు తీవ్రమైన బాధను కలిగించినవాడు స్వామి.
సప్త తాళ వృక్షాల ఛేదనం ( వాలి వథ )
సప్త తాళీ: ఏడు తాటి (తాళ) వృక్షాలు.
ప్రభంజన కార్య: వాటిని ఛేదించే (పడగొట్టే) కార్యం.
చాపకళా: విలువిద్యలో (ధనుర్విద్య).
శ్లక్ష్ణతర కౌశల ప్రశస్తు: చాలా మెత్తని (సున్నితమైన) నైపుణ్యాన్ని (కౌశలం) కలిగి, ప్రశంసలు పొందినవాడు.
భావం: ఏడు తాటిచెట్లను ఒకే బాణంతో ఛేదించిన గొప్ప కార్యాన్ని తన విలువిద్యలోని సున్నితమైన, అద్భుతమైన నైపుణ్యం ద్వారా పూర్తి చేసి, ప్రశంసలు పొందినవాడు. (ఈ పనిని సుగ్రీవుడికి నమ్మకం కలిగించడం కోసం చేశాడు.)
యుద్ధ సన్నద్ధత
దర్పితాసుర వీరవధ ప్రచండ కృతి: గర్వంతో (దర్పిత) కూడిన రాక్షస వీరులను సంహరించడంలో తీవ్రమైన (ప్రచండ) కార్యం చేసినవాడు.
కృత మహాపకారు: (రావణుడికి) గొప్ప అపకారాన్ని (నష్టాన్ని) కలిగించినవాడు.
దూరీకృతోగ్ర మూలసేనా మహాక్రూరు: భయంకరమైన మూలసేనను (యుద్ధపు ప్రధాన దళాన్ని) కూడా దూరం చేసిన మహాక్రూరుడు (తీవ్రమైన కోపంతో ఉన్నవాడు).
మోహదూరు: మోహం (అజ్ఞానం) నుండి దూరమైనవాడు (స్పష్టమైన దృష్టి, జ్ఞానం కలవాడు).
రామచంద్రుని గాంచెను రావణుండు: అటువంటి రామచంద్రుడిని రావణుడు చూశాడు.
యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాముడు, తనను గెలుస్తాడని గర్వించిన రాక్షస వీరులకు గొప్ప అపకారాన్ని (నాశనాన్ని) కలిగిస్తాడని, మూలసేనను సైతం పారద్రోలే శక్తిమంతుడని, మోహం లేని జ్ఞాని అని రావణుడు భావిస్తున్నాడు. ఈ రూపంలో రాముడిని చూసిన రావణుడు, రాముడి శక్తికి నిశ్చేష్టుడయ్యాడు. ఈ పద్యం శ్రీరాముడిని ‘అవతార పురుషుడి’ గానే కాక, ‘యుద్ధం’ లో ఎదురులేని యోధుడిగా రావణుడి కళ్ళ ముందు నిలబెడుతుంది. శివ ధనుర్భంగం నుండి ఖరదూషణాదుల సంహారం వరకూ రాముడు సాధించిన అసాధ్యమైన వీర కార్యాలు రావణుడికి గుర్తుకు వచ్చాయి. ఎందుకో యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాముడు, తనను గెలుస్తాడని, గర్వించిన రాక్షస వీరులకు గొప్ప అపకారాన్ని (నాశనాన్ని) కలిగిస్తాడని, మూలసేనను సైతం పారద్రోలే శక్తిమంతుడని, మోహం లేని జ్ఞాని అని రావణుడు నిశ్చేష్టుడయ్యేలా కనిపించాడు శ్రీరామచంద్రమూర్తి.
శ్రీరాముడి దివ్య సౌందర్య వర్ణన
నఖ శిఖా పర్యంత ముఖరిత బంభరీ కమనీయ వనమాలికా మనోజ్ఞు
వక్షస్థలీ మార్దవగుణ సమాకృష్ట మృదుమందహాస లక్ష్మీ సనాధు
రాక్షసవ్రజ సంహరణకార్య చక్రీభవత్క్రూర కార్ముక బాహుయుగళు
ఇందిరాసిత కాపోలేందురోచి: పరీస్పందనానందిత మందహాసు
నిబిడాకాశ నీలకాంతి ప్రరోహ
కందళీకృతమంజుల కాంతదేహు
వినిహత సమస్తలోకమోహుని , నిరీహు
రామచంద్రుని గాంచెను రావణుండు .
ఈ పద్యం ద్వారా శ్రీరాముడి రూపాన్ని మనోజ్ఞమైన సౌందర్యం, ప్రశాంతత, అపారమైన శక్తి కలగలిసిన దివ్య రూపంగా కవి అద్భుతమైన వర్ణన చేస్తున్నారు
వనమాల మరియు ముఖ సౌందర్యం
నఖ శిఖా పర్యంత: గోళ్ల నుండి శిరస్సు వరకూ (అంటే శరీరం నిండా).
ముఖరిత బంభరీ: శబ్దంచేసే తుమ్మెదలతో (బంభరి) కూడిన.
కమనీయ వనమాలికా మనోజ్ఞు: అందమైన వనమాలను (పూల దండ) ధరించి, దానిచే మనోజ్ఞుడు (అందమైనవాడు).
భావం: శ్రీరాముడి మెడ నుంచి పాదాల వరకు రకరకాల పుష్పాలతో , తులసీ దళాలతో కట్టబడి ఉన్న వనమాల ఎంతో కమనీయంగా , మనోజ్ఞంగా ఉంది . అంతే కాదు, ఆ వనమాల చుట్టూ ఝుమ్మని ధ్వని చేస్తూ తిరుగుతున్న తుమ్మెదల వల్ల ఆ దృశ్యం మరింత మనోహరంగా ఉంది. అలాటి వనమాలతో స్వామి మనోజ్ఞంగా కనబడుతున్నాడు .
వక్షస్థలం మరియు మందహాసం
వక్షస్థలీ మార్దవగుణ: వక్షస్థలం (ఛాతీ) యొక్క సున్నితమైన (మార్దవ) గుణం చేత.
సమాకృష్ట: ఆకర్షించబడిన (వశమైన).
మృదు మందహాస లక్ష్మీ సనాధు: మృదువైన చిరునవ్వు (మందహాసం) రూపంలో ఉన్న లక్ష్మీదేవితో (విజయం, ఐశ్వర్యం) కూడినవాడు.
భావం: ఆయన వక్షస్థలం యొక్క సౌమ్య గుణం (మార్దవం) వల్ల ఆకర్షితులైన లక్ష్మీదేవి, ఆయన వద్ద మృదువైన చిరునవ్వు రూపంలో నిలిచింది. (శ్రీరాముడి చిరునవ్వు అత్యంత ఐశ్వర్యవంతంగా, మంగళకరంగా ఉంది అని భావం).
ధనుస్సుతో కూడిన చేతులు
రాక్షసవ్రజ సంహరణకార్య: రాక్షస సమూహాన్ని సంహరించే (నాశనం చేసే) కార్యానికి.
చక్రీభవత్: చక్రంగా మారిన (వంపు తిరిగిన).
క్రూర కార్ముక బాహుయుగళు: క్రూరమైన (శక్తివంతమైన) విల్లును (కార్ముకం) పట్టిన జత చేతులు (బాహు యుగళం) కలవాడు.
భావం: రాక్షస సమూహాన్ని సంహరించే కార్యానికి సిద్ధపడి, ఆయన చేతిలోని శక్తివంతమైన విల్లు చక్రంలా వంపుతిరిగి కనిపిస్తోంది. (శ్రీరాముడి చేతులు విల్లు ఎక్కుపెట్టి, దానిని వలయాకారంలో (చక్రం) పట్టుకున్నాయి అని భావం.)
కపోలం (చెంప) మరియు చిరునవ్వు
ఇందిరాసిత: లక్ష్మీదేవి వంటి నల్లదనం (లేదా లక్ష్మీదేవి యొక్క కాంతి)
కాపోలేందురోచి: చెంపపై ఉన్న చంద్రుని వంటి కాంతి (చంద్రకాంతి).
పరీస్పందనానందిత మందహాసు: ఆ కాంతికి కదలిక (స్పందన) చెంది, ఆనందించే చిరునవ్వు కలవాడు.
భావం: ఆయన చెంపపై ఉన్న చంద్రుడి కాంతి (నిర్మలమైన, శీతల కాంతి), లక్ష్మీదేవిని పోలిన నల్లని ఛాయతో కలసి మెరుస్తూ, ఆ మెరుపుకు స్పందించి ఆనందించే చిరునవ్వు కలవాడు. (ముఖంపై చంద్రకాంతి, నల్లని ఛాయ, మందహాసం అద్భుతంగా కలగలిశాయని భావం.)
సంపూర్ణ శరీర రూప వర్ణన
నిబిడాకాశ నీలకాంతి ప్రరోహ: దట్టమైన ఆకాశం యొక్క నీల కాంతి పెరుగుతున్న (ప్రరోహ) కారణంగా.
కందళీకృత మంజుల కాంతదేహు: కళేబరంగా (పుట్టుకగా) మారిన, అందమైన కాంతివంతమైన శరీరం (దేహం) కలవాడు.
వినిహత సమస్త లోకమోహుని: సమస్త లోకాల మోహాన్ని (అజ్ఞానాన్ని) సంహరించినవాడు.
నిరీహు: ఏ కోరికలు లేనివాడు (నిష్కాముడు).
రామచంద్రుని గాంచెను రావణుండు: అటువంటి రామచంద్రుడిని రావణుడు చూశాడు.
దట్టమైన నీలాకాశంలో స్వామి ప్రకాశవంతమైన దేహం యొక్క కాంతులు అన్నివైపుల వ్యాపింప చేసేవాడు. సమస్తమైన లోకాల మొహాలనీ పోగొట్టగలిగేవాడు. ఈహా అంటే కోరిక. నిరీహుడు అంటే ఏ కోరికా లేనివాడు. అటువంటి రామచంద్రుని రావణుడు చూశాడట.
ఈ పద్యం రాముడిని శక్తి, సౌందర్యం, వైరాగ్యం కలగలిసిన రూపంగా వర్ణిస్తుంది. ఆయన శరీరం దట్టమైన ఆకాశపు నీలి రంగు నుండి ఉద్భవించినంత కాంతివంతంగా, అందంగా ఉంది. ఆయన తుమ్మెదలు ఝుమ్మనే వనమాలను ధరించి ఉన్నాడు. ఆయన వక్షస్థలంపై ఉన్న చిరునవ్వు, సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమై, విజయానికి ప్రతీకగా నిలిచింది.
ముఖ్యంగా, శ్రీరాముడు సమస్త లోకాల మోహాన్ని నశింపజేసి (జ్ఞాన ప్రదాత), ఏ కోరికలూ లేని (నిరీహుడైన) పరమాత్మ అని రావణుడు గ్రహించాడు. యుద్ధానికి ముందు రావణుడి కళ్ళ ముందు నిలిచిన రాముడు కేవలం శత్రువు కాక, తన నాశనానికి కారణమైన దివ్య శక్తి అని పై పద్యంలో వర్ణన ద్వారా తెలియజేస్తున్నారు విశ్వనాథ వారు.
రావణుడి చులకన దృష్టిలో శ్రీరాముడి వర్ణన
గిడసపాఱిన కైక గడుసుదనమ్మున బంపగా నడవుల బట్టువాని
జడదారిమూక వెన్బొడిచి యెక్కింపగా నతంత వింటివాడైన వాని
ముల్లోకముల యందముం జూరగొన్నట్టి చాన రక్షించుకోలేని వాని
కోతిమూకలను వెన్కొని లంకపై నెందు నెరుగని సేతగా నెత్తువాని
నేది ఎట్లైన బోవునదేమి తనకు
నన్న రీతి బైరాగిగా నున్నవాని
ప్రతిది తనకును ననుకూలపడెడు వాని
రామచంద్రుని గాంచెను రావణుండు !
ఇది రావణుడు యుద్ధరంగంలో శ్రీరాముడిని చూసినప్పుడు, శ్రీరాముడి పూర్వపు పరిస్థితులు, లోకంలో ఆయన గురించి ఉన్న అపోహలు/విమర్శలను తన కోణంలో ఎలా చూస్తున్నాడో వర్ణించే పద్యం. ఈ పద్యంలో రావణుడిలోని అహంకారం, అపార్థం, మరియు చివరికి భయాన్ని విశ్వనాథ భలే నేర్పుగా ఆవిష్కరించారు. రావణుడు శ్రీరాముడిని చూస్తూ, తన మనసులో రాముడిని ఇలా అంచనా వేసుకుంటున్నాడు:
కైక కారణంగా వనవాసం
గిడసపాఱిన కైక: మొండిపట్టు పట్టిన, మనసు గట్టిపడిన (గిడసపాఱిన) కైక.
గడుసుదనమ్మున బంపగా: మొండితనంతో (గడుసుదనం) అడవులకు పంపగా.
నడవుల బట్టువాని: అడవుల పాలైనవాడు (లేదా అడవులలో పట్టినవాడు).
భావం: మొండిపట్టు పట్టిన కైక కఠినత్వం వల్ల అడవులకు పంపబడిన సాధారణ వ్యక్తి (రాజ్యాన్ని కోల్పోయినవాడు) ఇతడు.
అయోధ్యలో హాయిగా పట్టాభిషేకం చేసుకుని రాజు కావలసినవాడిని , తన వరాలతో కైకేయి అడవుల పాలు చేసింది . కాదనే ధైర్యం గానీ , ఎదిరించే దమ్ము కానీ లేకపోయేయి . నేను వెళ్లను , రాజ్యాధికారం నా హక్కు అని ఆ ముసలి తండ్రికి చెప్పలేకపోవడమే ? చేతకాని తనం కాకపోతే .
జడధారుల అండ
జడదారిమూక: ఋషుల సమూహం (జడలు ధరించిన వారి గుంపు).
వెన్బొడిచి యెక్కింపగా: వెనుక ఉండి ప్రోత్సహించడం (లేదా పొగడడం) వల్ల.
నతంత వింటివాడైన వాని: గొప్ప ధనుర్విద్యా పరాక్రమం కలవాడయ్యాడు.
భావం: ఈయనకు అసలు పరాక్రమం లేదు, కేవలం ఋషుల గుంపు వెనుక నుండి ప్రోత్సహించడం వల్లే ఇతను ఏదో అంతంత మాత్రమైన విలుకాడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాని లేకపోతే ఎవరైనా అసలు పట్టించుకునే వారేనా ?
భార్యను రక్షించుకోలేని అసమర్థత
ముల్లోకముల యందముం జూరగొన్నట్టి చాన: మూడు లోకాల అందాన్ని దోచుకున్నంతటి (అంటే పరమ సుందరి అయిన) స్త్రీ (సీత).
రక్షించుకోలేని వాని: రక్షించుకోలేనివాడు.
భావం: మూడు లోకాలలో అత్యంత సుందరి అయిన తన భార్యను (సీతను) అపహరించబడకుండా రక్షించుకోలేని అసమర్థుడు ఇతడు.
వానర సైన్యాన్ని తీసుకురావడం
కోతిమూకలను వెన్కొని: కోతుల సమూహాన్ని వెంటేసుకుని (అండగా తీసుకుని).
లంకపై: లంకపైకి.
నెందు నెరుగని సేతగా నెత్తువాని: లోకంలో ఎవరూ ఇంతకుముందు ఎరగని (తెలియని) వారధి (సేత) కట్టించినవాడు
భావం: మనుషులను కాదు, కోతి మూకలను వెంటబెట్టుకుని లంక పైకి దండెత్తి వచ్చాడు. వాటి సహాయంతో సముద్రంపై ఎవరూ ఊహించని వంతెనను కట్టించాడు. (రావణుడు రాముడి సైన్యాన్ని తక్కువ చేసి చూస్తున్నాడు).
రాముడి వైరాగ్యంపై రావణుడి అంచనా
నేది ఎట్లైన బోవునదేమి తనకు నన్న రీతి: ‘ఏదైనా ఎలా జరిగితే నాకేమిటి?’ అనే విధంగా (అంటే దేనిపైనా పట్టుదల లేనివాడిలా).
బైరాగిగా నున్నవాని: సన్యాసి (బైరాగి) లాగా ఉన్నవాడు.
ప్రతిది తనకును ననుకూలపడెడు వాని: అయినప్పటికీ, ప్రతి సంఘటనా తనకు అనుకూలంగా (ప్రయోజనకరంగా) మారినవాడు.
రామచంద్రుని గాంచెను రావణుండు: అటువంటి రామచంద్రుడిని రావణుడు చూశాడు.
ఈ పద్యం ద్వారా విశ్వనాథ వారు రావణుడి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రావణుడు రాముడిని చులకన చూపుతో చూస్తూ వెటకారంగా ఇలా అనుకుంటున్నాడు: ఇతడు రాజ్యాధికారం కోల్పోయిన అనాథ. ఋషుల ప్రోత్సాహంతో ఏదో అంతంత మాత్రమైన విలుకాడయ్యాడు . భార్యను కూడా రక్షించుకోలేని అసమర్థుడు. కోతి మూకతో సముద్రం మీద వంతెన కట్టించుకుని ఏకంగా లంక మీదకే దండెత్తి వచ్చేశాడు. (ఈ వాక్యం రావణుడికి తెలియకుండానే రాముడి గొప్ప తనాన్ని ఒప్పుకుంటుంది). బైరాగిలా ఉన్నా, ప్రతి విషయం అదృష్టవశాత్తు ఇతనికి అనుకూలంగా మారుతోంది తప్ప అతని ప్రతిభ కాదు. పైకి రాముడిని సామాన్య వ్యక్తిగా, బైరాగిగా రావణుడు చూస్తున్నప్పటికీ, “ప్రతిది తనకును ననుకూలపడెడు వాని” అనే మాట ద్వారా, రాముడి వెనుక ఉన్న దైవశక్తిని, అదృష్టాన్ని (కాలం) రావణుడి మనసు అప్రయత్నంగా గుర్తించినట్లుగా విశ్వనాథ సూచిస్తున్నారు. ఈ అహంకారం, అసమర్థత, భయం కలగలిపిన దృష్టితోనే రావణుడు రామచంద్రుడిని చూశాడు.
విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇలా ఒకే మకుటంతో పద్యాలు రాయడం చాలా ఇష్టం అయి ఉండాలి. కల్పవృక్షం లో బాలకాండ లో పాయస పాత్రలోకి ప్రాజాపత్య పురుషుడు ప్రవేశించడాన్ని “జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె” అనే మకుటం నాలుగు సీస పద్యాలలో ఉపయోగించారు. అలాగే అయోధ్య కాండలో సీతమ్మ వారిని అరణ్యవాసానికి రావద్దని శ్రీరామచంద్రమూర్తి చెప్పినప్పుడు ఏడు మధ్యాక్కర పద్యాలు “వల దోసి! వైదేహి! వలదు!” అనే మకుటంతో ముగిస్తారు. ఇంక సుందరకాండలో చంద్రుని వర్ణన చేసే ఇరవై పద్యాలలో పది పద్యాలు ఆటవెలది ఛందస్సుతో “చెలగె మింట కలువ చెలిమికాడు” అనే చివరి పాదం తో అంతమయితే, మరో పది పద్యాలు తేటగీతి ఛందస్సుతో “చెలగె నడిమింట కలువపూ చెలిమికాడు” అని అంతమవుతాయి. విశ్వనాథ కల్పవృక్షంలో ఇటువంటి ప్రయోగం చాలా చోట్ల చేసారు. వాటి గురించి మరెప్పుడైనా మరో వ్యాసంలో చర్చించుకుందాం.
