[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘సద్యోగర్భం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“లక్ష్మి మనవడు ముద్దుగా ఉన్నాడు. నెలనెలా వాడికి వేడుకలు చేస్తూ మురిసిపోతోంది. అందరికీ ఆ అదృష్టం ఉండవద్దూ” స్నేహితురాలి మనవడి బొబ్బట్ల పేరంటానికి వెళ్ళి వచ్చి నిట్టూరుస్తూ అంది ప్రభావతి.
ప్రభావతి మాట వినిపిస్తూనే గదిలో నుంచి రయ్ మని బయటకు వచ్చి, “పిల్లలు.. పిల్లలు.. అన్నమాట ఎత్త వద్దు అని మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇంకోసారి మీరు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను” గట్టిగా అరిచింది శోభిత.
“బావుంది నేనేం తప్పు అన్నాను? నువ్వేంటి రా మాట్లాడవూ? పెళ్ళి అయ్యి అయిదు సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు పిల్లలు లేకపోతే అనుకోరా?” దబాయింపుగా అంది ప్రభావతి.
“భువన్ నీకు నేనేం చెప్పాను పెళ్ళికి ముందే నాకు పిల్లలని కనడం ఇష్టం లేదని నీకు చెప్పానా లేదా? మీ అమ్మ అట్లా అంటుంటే ఊరుకుంటావు ఏంటి? ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు” అని అరుస్తూ, కోపంగా లాప్టాప్ బ్యాగ్ తీసుకొని, భువన్ పిలుస్తున్నా ఆగకుండా బయటికి వెళ్ళి, కార్ తీసుకొని వెళ్ళిపోయింది శోభిత.
***
కాంటిన్‌లో కాఫీ కప్పులో స్పూను పెట్టి తిప్పుతూ పరధ్యానంగా ఉన్న శోభిత దగ్గరకు వచ్చింది రవళి. కాసేపు గమనించింది కానీ శోభిత తన వైపు అసలు చూడటమే లేదు. “ఏమైంది శోభీ? అలా ఉన్నావు నాలుగు రోజుల తర్వాత నేను నీకు కనిపిస్తున్నా ఎక్కడికి వెళ్ళావని అడగటం లేదు. నువ్వేమో ఇట్లా ఉన్నావు.., ఆఫీసులో భువన్ కూడా విచారంగా కూర్చొని ఉన్నాడు. ఏం జరిగింది? ఇద్దరూ పోట్లాడుకున్నారా ఏంటి?” నవ్వుతూ అడిగింది.
“అవును పోట్లాటనే పెద్దదే. నా వల్ల కావటం లేదు ఈ టార్చర్ భరించటం” తల రెండు చేతులతో పట్టుకొని కాస్త దుఃఖంగా, బాధగా అంది శోభిత.
“ఏమైందే?” అనునయంగా అడిగింది రవళి.
“ఏముంది ఎప్పుడు జరిగే గోలే! పిల్లలు పిల్లలు అని నా ప్రాణాలు తీస్తున్నారు. నాకేమో పిల్లలని కనడం ఇష్టంలేదు. పెళ్ళికి ముందు ఒప్పుకొని, ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలకు తలూపుతున్నాడు” కోపంగా అంది శోభిత.
“ఎప్పుడూ అడుగుదామనుకుంటాను కానీ అడగలేక ఊరుకుంటున్నాను. ఎందుకు ఇష్టం లేదు? ప్రతి స్త్రీకి కూడా తనకు ఒక పాప అంటూ ఉండాలని ఇష్టం ఉంటుంది కదా!” అడిగింది రవళి.
“ఎందుకు ఉండదు? నాకూ ఒక పాప, బాబు ఉండాలని, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఉంటుంది. కానీ..” అంటుండంగానే శోభిత కళ్ళు పెద్దగా అయ్యాయి. మొహమంతా చెమటలు పట్టి, చెప్పటం ఆపి భయంగా చూసింది.
భయంతో వణుకుతున్న శోభిత చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ “అసలు నీ మనసులో ఉన్న భయం ఏంటో బయటికి చెప్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందేమో మనం చూద్దాం” అనునయంగా అంది రవళి.
కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, “నీకు మా అక్క, మోహిత తెలుసుకదా! నేను, మోహీ చాలా క్లోజ్‌గా ఉంటాము. తన పెళ్ళిలో నేను చాలా ఎంజాయ్ చేసాను. పెళ్ళైన రెండు సంవత్సరాలకు మోహి నెల తప్పింది. అప్పటి నుంచే ఒకటే వాంతులూ! ఏమీ తినలేకపోయేది. మూడోనెలకే చాలా బలహీనం అయిపోయింది. పైగా గర్భసంచీ జారిందని కుట్లేసారు. డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నారు. మా ఇంటికి తీసుకొచ్చాము. పూర్తిగా బెడ్ మీదనే ఉండేది. కదలలేక, మెదలలేక ఇబ్బంది పడుతుండేది. పైగా నెలలు నిండుతున్నకొద్దీ ఏమీ తినలేకపోయేది. దానితో చాలా సన్నగా ఉండి, పొట్ట ఎత్తుగా ఉంటే నాకు చూడటానికి ఎలాగో, భయంగా ఉండేది. మోహి అరుపులు, బాధ చూడలేకపోయేదాన్ని. కానుపు సక్రమంగా అయ్యి, అక్క కోలుకోవాలని అమ్మ మొక్కని మొక్కులు లేవు. చూస్తుండగానే నెలలు నిండి నొప్పులు వస్తుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్ళాము. నొప్పులు భరించలేక కేకలు పెడుతుంటే నేను భయంతో వణికిపోయాను. చివరకు సిజేరియన్ చేసి బాబును తీసారు. బాబు పుట్టాక ఆరోగ్యం కుదట పడింది. కానీ ఆ తరువాత ఇంకో బాధ. ప్రెగ్నెన్సీ లో వచ్చిన బి.పీ, షుగర్ కు మందులు.. అబ్బా.. అక్క ఆ తొమ్మిదినెలలు, ఆ తరువాత అనుభవించిన నరకం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఆ అరుపులు, ఆ నొప్పితో పెద్దగా, భయంకరంగా అయిన అక్క కళ్ళు ఇప్పటికీ ప్రతి రాత్రి నా ముందే కనబడుతుంటాయి. ఒక్క గర్భం కోసం ఇంత నరకం నడవాలంటే.. అదే మార్గం మీద నన్ను లాగుతున్నారు అన్న ఆలోచన వచ్చిన్నప్పుడల్లా నా లోపల ఏదో చిట్లిపోతుంది. ఆ తొమ్మిది నెలల్ని నేను దగ్గరుండి చూసి కూడా మళ్లీ గర్భం గురించి ఆలోచించగలనా? ‘అమ్మ కావాలి’ అనే కోరిక ఒక్క పక్క లాగుతుంటే, ‘అక్కలాగే అయితే?’ అనే భయం మరో పక్క పీడిస్తూనే ఉంది.అక్క చెమట చుక్కలతో తడిసిన ముఖం, సూదుల మచ్చలతో నిండిన చేతులు చూసిన ప్రతీసారి నాకు గర్భం అంటే పాప కంటే ముందు నొప్పే గుర్తొస్తోంది. ఆ బాధను చూసిన నేను మళ్లీ అదే చీకటిలో అడుగు పెట్టడం తలుచుకుంటేనే.. నా మనసు, శరీరం వణికిపోతుంది! అందుకే అసలు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ.. భువన్ ప్రేమించానని వెంటపడితే, నాకూ భువన్ అంటే ప్రేమ కలిగి నచ్చి, పిల్లలను కనమనవద్దు అని మాట తీసుకొని పెళ్ళి చేసుకున్నాను” అని చెపుతుంటేనే శోభిత గొంతు వణికింది.
రవళి శోభితకు తాగమని మంచినీళ్ళ బాటిల్ ఇచ్చింది. కొద్దిగా నీళ్ళు తాగి ఒక నిమిషం ఆగి చెప్పసాగింది.
“ఇప్పుడేమో ప్రతిరోజు వాళ్ళ అమ్మ నన్ను సాధించటం. పెళ్ళయ్యి అయిదు సంవత్సరాలయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదని. నేను భువన్ మీద ప్రేమను చంపుకోలేను, పిల్లలని కనలేను, అట్లాగని నాకు సరోగసీకి వెళ్ళటం ఇష్టం లేదు. ఇక ఈ సమస్య తీరేదెట్లా? “ అని చెప్తుండగానే, శోభిత కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి.
“ఓస్ దీనికేనా ఇంత గొడవ” అంది రవళి.
ఆశ్చర్యంగా రవళి వైపు చూసి “అదేంటి అలా అంటావు?” అడిగింది శోభిత.
“నీకు తెలుసు కదా! నేను మన ప్రొఫెసర్ గారితో కొద్ది రోజులుగా ఒక ప్రయోగం చేస్తున్నానని. పద ఇప్పుడు నాతో. ముందుగా కాస్త మొహం కడుక్కో. తర్వాత మంచిగా ఫ్రెష్ గా కాఫీ తాగి, ఇద్దరము మా లాబ్ కు వెళ్దాం” అని జవాబిచ్చింది రవళి.
ఇద్దరూ రవళి వాళ్ళ ల్యాబ్ కి వెళ్ళారు అక్కడ ఒక రోబోని చూపిస్తూ “ఇదిగో నీ సమస్యకి పరిష్కారం” నవ్వుతూ అంది రవళి.
“ఏంటీ.. ఈ రోబోను తీసుకపోయి పెంచుకోమంటావా?” చిరుకోపంగా అడిగింది శోభిత.
“ఆగాగు అంత కోపం తెచ్చుకోకు. చూసావా ఈ రోబో ఆడ రోబో అన్నమాట.” రోబో కడుపు మీద చిన్నగా నిమురుతూ “నీకు గర్భం దాల్చటమూ, వేవిళ్ళూ, డెలివరీ అన్నీ భయం అవుతే నీ బదులు ఇది నీ పాపను కని, నీ చేతిలో పెడుతుంది. సో సింపుల్” అంది.
“అదెట్లా?” ఆశ్చర్యంగా అడిగింది శోభిత.
“శోభి.. నీ అండం, భువన్ శుక్రకణంను ఫలదీకరించి, సాధారణ సరోగసీ బేబీ కోసం అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెడతారో అలాగే ఈ యంత్ర గర్భంలో ప్రవేశపెడతాము. ఈ రోబో గర్భంను, ఒక స్త్రీ గర్భంలోలాగా ఉమ్మనీరు మొదలయినవి, బేబీ ఎదుగుదలకు కావలసిన వాతావరణం ఏర్పాటు చేసాము. కానీ రక్తం, మాసం గర్భం కాదు.. సెన్సర్లతో, వైర్లతో నడిచే గర్భం. ఒక స్త్రీ కడుపులో తొమ్మిది నెలలు ఎలా పెరుగుతుందో, అలా నీ బేబీ తొమ్మిది నెలలు ఇనుము కడుపులో ఊపిరి తీసుకుంటూ పెరుగుతుంది. అంటే నీ బదులు గర్భం దాల్చి, పిల్లని కని నీ చేతిలో పెడుతుంది. ఇంక అందరు తల్లులా నిద్రలేని రాత్రులు, నొప్పులు, వాంతులు ఇవేవీ నీకు రావు. అవన్నీ దీని సర్క్యూట్లే మోస్తాయి. నీ బిడ్డకు జోలపాడేది నీ హృదయం కాదు.. ఈ యంత్రం గుండె లాగే కొట్టుకునే మోటారు. మీకు బాబు కావాలా పాప కావాలా ఎలా కావాలో కూడా నువ్వు నిర్ణయం చేసుకునే రోజు ముందు వస్తుంది కానీ ఇప్పటి మటుకు మీ ఇద్దరితోటి ఫలదీకరించిన అండాన్ని దీనిలో ప్రవేశపెట్టి బిడ్డని కనిచ్చి, నీకు తొమ్మిది నెలల తర్వాత మేము అప్పగిస్తాం. మేము గత కొద్దికాలంగా చేస్తున్న రీసెర్చ్ ఇదే! ఇది విజయవంతం కూడా అయింది. ఇంక నువ్వు ఆలోచించకు” అంది రవళి.
***
అన్నట్లుగానే తొమ్మిది నెలల తర్వాత ముద్దు ముద్దుగా ఉన్న ఒక బుజ్జి బాబుని శోభిత, భువన్ చేతిలో పెట్టింది రవళి.
అందంగా ముద్దుగా ఉన్న వాడిని చూసుకొని ఇంటిల్లిపాది మురిసిపోయారు. కానీ ఎన్ని రోజులు గడిచినా వాడిలో ఎటువంటి స్పందన లేదు. దేనికి వాడు స్పందించడు. మామూలుగా ఒక బొమ్మలాగా పడుకొని ఉంటాడు. అప్పుడప్పుడు వాడికి ప్రాణం ఉన్నట్టు కొద్దికొద్దిగా కాళ్ళూ, చేతులు కదుపుతుంటాడు. ఆకలి వేస్తే మాత్రం విరామం లేకుండా కదులుతుంటాడు. పాలు తాగిస్తే తాగి, మళ్ళీ నిస్తేజంగా పడుకుంటాడు. శరీరం పెరుగుతోంది. చాలా ముద్దుముద్దుగా అవుతున్నాడు. కానీ మాట, పలుకు, స్పందన ఏదీ లేదు! శోభిత రవళి తో “ఇదేమిటీ? ఇట్లా ఉన్నాడు?” అని అడిగింది.
ఇద్దరూ బాబును ప్రొఫెసర్ గారి దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన బాబును పరిశీలించి, “నువ్వు వాడితోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉండు. వాడిని కదిలిస్తూ ఉండు. మాట్లాడిస్తూ ఉండు. వాడికి అదే తెలుస్తుంది. వాడి శరీరభాగాలన్నీ, మెదడు కూడా సరిగ్గానే ఉంది మొత్తం అంతా ఎక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ ఏమీ లేదు. వాడి ఎదుగుదలకు మామూలు పిల్లలకన్నా కొంచం ఎక్కువ సమయం పడుతుంది” అని చెప్పారు.
రవళి శోభితను పంపి, తిరిగి ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి “అసలు ఏమయి ఉంటుంది సర్?” అని ప్రశ్నించింది.
“బహుశా ప్రోగ్రామింగ్‌లో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒక సంవత్సరము చూద్దాం” అపరాధ భావంతో చిన్నగా చెప్పాడు ప్రొఫెసర్.
నిశ్చేష్ట అయిపోయింది రవళి! భయపడుతున్న శోభితను తనే ఇట్లా ప్రొత్సహించింది. ఇప్పుడు ఆ చిన్నివాడి మీద ప్రేమ పెంచుకొని, ఆ బాబే లోకంగా ఉన్న శోభితకు ఈ విషయం ఎట్లా చెప్పాలి? మనసులోనే మధన పడింది రవళి.
***
దాదాపు సంవత్సరం అవుతుంటే కాస్త కూర్చుంటున్నాడు కానీ మాట లేదు. ఏమాత్రం స్పందన లేదు. చిన్నప్పుడు ఆడుకున్న రబ్బరు బొమ్మలా ఉన్నాడు. అది భరించలేక పోతోంది శోభిత. చిన్న చిన్న పిల్లలు ముద్దుముద్దుగా తల్లిని పిలుస్తూ తల్లి వెనకాల తిరుగుతున్న వాళ్ళని చూస్తుంటే వీడితోటి ఎట్లాగైనా మాట్లాడించాలని పలకరా బాబు ఒక్కసారి అమ్మ! అని పిలవరా అని తల్లడిల్లిపోతోంది. పిచ్చిదానిలా అవుతోంది శోభిత.
ఆ బాబు అమ్మ వైపు నిస్తేజంగా చూస్తున్నాడు. ఉలుకు పలుకు లేకుండా ఏ విధమైనటువంటి భావము లేకుండా అలానే చూస్తున్న వాడిని హృదయానికి హత్తుకుంటూ ఒక్కసారి అమ్మ అనరా ఇటు చూడరా కన్నా! మీ అమ్మని రా నేను! అని శోభిత హృదయ విదారకంగా ఏడుస్తుంటే..
“వాడు ఎంత పిలిచినా ఉలుకుతాడా పలుకుతాడా” ఈసడింపుగా అంది ప్రభావతి.
“ఇదంతా మీరే చేశారు మీ మూలంగానే జరిగింది” అంటూ గట్టిగట్టిగా పిచ్చిదానిలాగా అరిచింది శోభిత.
“నేనేం చేసాను? ముచ్చటగా బాబును కనమన్నాను కానీ బొమ్మను తెమ్మన్నానా? నిక్షేపంగా నువ్వే బాబును కని ఉంటే, ముద్దూముచ్చట ఉండేది. మురిపాలు తీరేవి. కోట్లు తగలేసి బొమ్మను తెచ్చి, ఇప్పుడు ఏడిస్తే లాభం ఏమిటి?” అంది ప్రభావతి.
“ప్రభా..” గట్టిగా పిలుస్తూ మందలింపుగా భార్యను చూసాడు వేణుగోపాలరావు.
చేతిలో ఉన్న భాగవతాన్ని పక్కన పెడుతూ “చూడమ్మా శోభితా!, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే, తల్లికి నారదమహర్షి బోధించిన నారాయణ మంత్రం నేర్చుకున్నాడని, అభిమన్యుడు సుభద్ర గర్భాన ఉన్నప్పుడే తండ్రి అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడని, మీ అత్తగారు చదివే మాఘపాదివారపు నోము కథలో ఉప్పరి సోదమ్మ గర్భంలో ఉన్న పాప లచ్చుమమ్మ చెప్పే విని ఊ కొడుతుందని విన్నాము. అంతెందుకు గర్భస్థ శిశువు తల్లి మాటకి, జోల పాటకి స్పందిస్తుందని, తల్లి భావోద్వేగాలను పంచుకుంటుందని, ఆహారం గ్రహిస్తుందని, అందుకే తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, మంచి భావాలు కలిగి మంచి మాటలు తనలోని పాపకు చెబుతుండాలని, అప్పుడే ఆ పాప ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతారు ఈనాటి డాక్టర్లూ అవునా? మరి వీడు పెరిగింది ఒక యంత్రం లోని ఇనుప కడుపున! వీడు ఎలా స్పందించగలడు? నువ్వే ఆలోచించు” అన్నాడు.
“అంటే ఇంక వీడు ఇంతేనా?” గట్టిగా ఏడవసాగింది శోభిత.
శోభిత బాధ చూడలేక నిస్సారంగా, నిస్తేజంగా కూర్చున్న ఆ పిల్లవాడిని చూడలేక “వీడు ఇంక ఉండటానికి వీలులేదు” అంటూ బాబును బయట పారేస్తానని కోపంగా చేతిలోకి తీసుకున్నాడు భువన్! వద్దు వద్దు అంటూ గట్టిగా అరుస్తూ లేచింది శోభిత.
“ఏమైంది ఎందుకు భయపడుతున్నావు?” అని పక్కన పడుకున్న భువన్ కూడా లేచి మొహం అంతా చెమటలు అల్లుకొని వణికిపోతున్న శోభితను దగ్గరగా పొదువుకుని, శోభిత మొహాన అలుముకున్న చెమటలను తుడుస్తూ, మృదువుగా “ఏమైంది శోభి?” అని అడిగాడు. కొద్ది సేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది శోభిత. ఆ భయంకరమైన పీడకల గుర్తొచ్చి వణికిపోతోంది. భువన్ ఓదార్పుతో సేదతీరి తన కలను చెప్పింది. అసలు ఆ కల ఎందుకు వచ్చిందా? అని ఆలోచిస్తుంటే, రెండురోజుల క్రితం ఆఫీస్‌లో అటెండ్ అయిన ఎ.ఐ వర్క్ షాప్ గుర్తు వచ్చింది. అందులో ఒక వక్త, ఇక ముందు ముందు కాలంలో ఒక అమ్మాయి తనకి ఎట్లాంటి అబ్బాయి కావాలో, ఒక అబ్బాయి తనకు ఎట్లాంటి అమ్మాయి కావాలో ప్రోగ్రామింగ్ చేసి సృష్టించుకుని పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పటం గుర్తొచ్చింది. తను ఇంకొంచెం ముందుకు పోయి రోబోలో గర్భసంచిని సృష్టించి, బాబును ప్రోగ్రామింగ్ చేసేసుకుని రోబోను సరోగసి మదర్ చేసేసింది. కానీ కలలో కనిపించిన ఆ ముద్దుల బాబు ఒకటే అల్లరి చేసేస్తున్నాడు.
***
“ఇట్లు దనకుఁ బరిచర్య జేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షావిశారదుం డైన నారదుండు..” భాగవతములోని సప్తమస్కందం లోని, పద్యము శ్రావ్యంగా ప్రభావతికి వినిపిస్తున్న వేణుగోపాలరావుతో,
“ఆగండి మామయ్యా! నేనూ బుజ్జిగాడూ కూడా వింటాము” అంటూ భారంగా వచ్చి తనపక్కన కూర్చున్న శోభితను ఆప్యాయంగా చూసింది ప్రభావతి.
అత్తగారి పక్కన కూర్చొని, భక్తిగా చేతులు జోడించి, మామగారు వినిపిస్తున్న భాగవతం శ్లోకం వినిపిస్తుండగా శోభిత మనసులో: ‘కథలోని ప్రహ్లాదుడు గర్భంలోనే మంత్రం నేర్చుకుంటే, నా పాప గర్భమే లేకుండా ఏం నేర్చుకుంటుంది? కలలో కనిపించిన యంత్ర గర్భాలూ, బొమ్మ బిడ్డలూ.. ఇవన్నీ నిజంగానే ఒక రోజు వస్తాయా? లేక ఇవి నా భయాలకే పుట్టిన శకునాలా?’ అన్న భావన ఒక్కసారిగా కలిగింది!
