[డా. చిత్తర్వు మధు రాసిన ‘సైనికుడి లేఖ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కనుచూపు మేర అంతా వ్యాపించిన తెల్లని పరదా లాగ మంచు వర్షం. రెండు కొండల మధ్య తెల్లటి కొండచిలువలా మెలికలు తిరుగుతూ సాగిపోయే హిమానీనదం.
ఉపరితలానికి 2,700 అడుగుల ఎత్తులో మంచు కొండల మధ్య ఉన్నది, అదే సియాచిన్ గ్లేసియర్.
బేస్ క్యాంప్ దగ్గర నల్లటి చుక్క లాగా భారత సైనికుల బేస్ క్యాంప్. ‘ఇందిరా కాల్’. ప్రపంచం మొత్తం మీద ఇంత ఎత్తులో మంచు కొండల మధ్య ఉన్న సైనిక స్థావరం వేరేది లేదు.
హిమాలయాలలోని తూర్పు కారకోరం పర్వతశ్రేణుల మధ్య 75 కిలోమీటర్ల పాటు విస్తరించింది సియాచిన్ హిమానీనదం, అంటే గ్లేసియర్.
ఒక విశాలమైన మంచు మైదానాన్ని ఊహించండి. రెండు పర్వతాల మధ్య మెలికలు తిరిగిన కొండచిలువ లాగా సాగిపోతుంది రెండు కిలోమీటర్ల వైశాల్యంతో వున్న ఈ హిమానీనదం. దీని మీద అడుగు పెట్టగానే ప్రపంచం నిశ్శబ్దమైనట్టు అనిపిస్తుంది. గాలి పల్చబడిపోతుంది. మీ ఊపిరి కూడా గడ్డ కడుతుంది. చుట్టుపక్కల పర్వతాలని దిగంతాల దాకా తెల్లటి మంచు దుప్పటి కప్పి పెట్టినట్లు ఉంటుంది. సూర్యకాంతి తెల్లటి మంచు మీద పడి కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో వెలిగిపోతూ ఉంటుంది.
ఉపరితలానికి 20,062 అడుగుల ఎత్తులో ఈ హిమానీ నదం ‘ఇందిరా కాల్’ పడమటి పాదం దగ్గర మొదలవుతుంది. నిర్మానుష్యమైన మంచు పర్వతాలూ, లోయల మథ్య వేగంగా హోరుమని వీచే గాలి చప్పుడుతో, ఈ మంచు కనుమ రాళ్లు మంచు కలిసిపోయిన గడ్డకట్టినది. అప్పుడప్పుడు సూర్యకాంతికి చిన్న చిన్న ప్రవాహాలతో నిండి ఉంటుంది. ఈ హిమానీనదం గతుకుల నేల మీద వేగంగా మెలికలు తిరుగుతూ కిందికి జారిపోతూ ఉంటుంది. నేలలో మంచుతో కప్పబడిన నెరియలు నీలి రంగు కాంతితో మెరుస్తూ ఉంటాయి. వాటిలో జారిపడితే అడుగున అగాధంలో కూరుకుపోవడం తథ్యం. కాంతిని మింగేసే వాటి నీలిరంగు లోతులని దాటి క్షేమంగా వెళ్లాలంటే ఎంతో నేర్పు అవసరం, యుద్ధ నైపుణ్యం అవసరం, ధైర్యసాహసాలు అవసరం.
అక్కడే దేశ సరిహద్దుల్ని కాపాడుతూ భారతదేశపు సైనిక స్థావరం ఉంది. కొన్ని ముందే కట్టబడిన (prefabricated) నివాసాలు, కొన్ని గుడారాలు, కొన్ని బంకర్లు, కలిపి నిర్మితమైన బేస్ క్యాంప్.
వాటిలో మైనస్ 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నుండి తట్టుకోవడానికి నిర్మించబడ్డ గోడలతో గదులు, కొన్ని రోజులకి సరిపడా ఆహార పదార్థాలు, శీతల ఉష్ణోగ్రతను తట్టుకునే దుస్తులు, మంచు గొడ్డళ్లు లాంటి పరికరాలు, మెషిన్ గన్స్, గ్రనేడ్స్ లాంటి ఆయుధాలూ, అన్నీ ఉంటాయి.
మేజర్ విక్రమ్ సింగ్ బేస్ క్యాంప్ బయటికి వచ్చి చుట్టూ పరికించాడు.
1984లో కంటే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు సమాచార సదుపాయాలు నివాస సదుపాయాలు చాలా మెరుగైనాయి. ఒక వైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా ఇటువైపు భారతదేశానికి మధ్యలో వ్యూహాత్మకంగా ఉండే ఈ ప్రదేశాన్నీ 1984లో ‘ఆపరేషన్ మేఘదూత్’ లో భారత సైన్యం ఆక్రమించింది. అప్పటినుంచి ఎన్నోసార్లు రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 2003లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన శాంతి ఒప్పందం తర్వాత కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న కాల్పులు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
కల్నల్ రియా శర్మ అతని పక్కనే వచ్చి నిలబడింది. ఈ స్థానంలో ఆమె ఈ మధ్యనే వచ్చి చేరింది. చాలా తెలివైన వ్యూహకర్త. మంచు పర్వతాల యుద్ధాలలో ఆరితేరిన వ్యక్తి. ఇది కాక వ్యక్తిగతంగా ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే జరిగిన యుద్ధంలో మరణించిన తన సోదరుడి జ్ఞాపకం మనసులో పదిలంగా ఉంది. ఆ పగ తీరాలని ఆ బాధకు ముగింపు పలికాలని కృతనిశ్చయం ఆమెలో ఉంది.
“శాటిలైట్ నుంచి వచ్చిన రిపోర్టు చూశారు కదా!” అన్నది రియా.
“చూశాను, ఈ రాత్రికి పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు అనుకుంటున్న మెరుపు దాడి మొదలవచ్చు. పాకిస్తాన్ కెప్టెన్ జాఫర్ ఖాన్ మనని ఆశ్చర్యపరచాలని అనుకుంటూ ఉండొచ్చు, కానీ మనకి ఆ విషయం ముందే తెలిసింది. మనం పూర్తి ప్రిపరేషన్లో ఉన్నాం. దాడిని ఎదుర్కోవడమే కాదు, ‘కుమార్ పీక్’నీ పదిలంగా కాపాడుకుంటాం.”
దూరంగా హవల్దార్ రాజునాయక్ బంకర్ నుంచి అప్పుడే బయటికి వస్తున్నాడు. సూర్యకాంతి అతని హెల్మెట్ మీద పడి తళుక్కున మెరిసింది.
“సాయంత్రం ఏడు గంటలకి మనం ఎదురుదాడి ప్రారంభిద్దాం. అంతా సిద్ధమే కదా. మెషీన్ గన్నులు, హ్యాండ్ గ్రనేడ్లు, ఐస్ ఆక్సులు అందరికీ సరిపడా ఉన్నాయి కదా?”
“ఉన్నాయి, సాబ్! మేజర్!” రాజు నాయక్ దృఢంగా సమాధానం ఇచ్చాడు.
సియాచిన్ మిలిటరీ క్యాంపులో సైనికుల జీవితం ఉదయం 5 గంటలకే ప్రారంభం అవుతుంది. కమాండింగ్ ఆఫీసర్ బిగ్గరగా కేక వేసి పిలవడంతోనో లేక అలారంతోనో నిద్ర లేస్తారు. మంచు లోనే దూరంగా కట్టబడిన బయోడిగ్రేడబుల్ టాయిలెట్లలో కాలకృత్యాలు తీర్చుకుని కొద్దిసేపు ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేస్తారు. ఆ తరువాత వేడి చేసిన సూప్, బ్రెడ్, గుడ్లు, కూరగాయలతో ఉదయపు అల్పాహారం ముగిస్తారు. చాలాసార్లు బంకర్ నుంచి నివాసాల నుంచి బయటకు వచ్చి మిలిటరీ విన్యాసాలు చేసుకుంటారు.
ఇది ఒక ఒంటరి విశాలమైన మంచు ఎడారి లాంటి ప్రాంతం. ఇక్కడ మైనస్ 50 డిగ్రీల చలిలో భీకరమైన గాలి మంచు వానలు, హిమానిపాతాల మధ్య జీవితం సైనికుడికి చాలా సాహసోపేతంగా ఉంటుంది. శత్రువు బుల్లెట్ల కంటే కూడా ప్రకృతి ఉత్పాతాల వల్ల ఎక్కువ మంది చనిపోతూ వుంటారు. ఈ ప్రాంతం ‘ఇందిరా కాల్’ – భారతదేశం అధీనం లోనే 1984 నుంచి ఉన్నది. అప్పటికంటే ఇప్పుడు సదుపాయాలు ఎంతో పెంచారు. ఇక్కడ సైనిక స్థావరం నడిపించడానికి రోజుకి ఒక మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తారు. అయినా కానీ సియాచిన్‌లో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా భారతదేశానికి ఎంతో లాభం. అందువల్లనే ఇక్కడ సైనిక స్థావరాలు వున్నాయి.
సియాచిన్ గ్లేసియర్ ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య 1949 నుంచి ఘర్షణలకు కారణం అవుతూనే ఉంది. 1949 కరాచీ ఒప్పందంలో గాని 1972 సిమ్లా ఒప్పందంలో కానీ ఈ ప్రాంతం ఎవరిదో సరిగ్గా నిర్ణయించకపోవడం వల్ల తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 1980 ప్రాంతాల్లో కల్నల్ కుమార్ అనే సర్వేయర్ ఈ ప్రాంతాన్ని సర్వే చేసి మ్యాపులలో నిక్షిప్తపరిచి వివిధ రకాల శిఖరాలని పేర్లతో గుర్తించడం వల్ల ఈ ప్రాంతం భారతదేశంలో అధీనంలో వుందని తెలిసింది. అయితే దీనిని పాకిస్తాన్ కూడా తనదని వాదించడం సంఘర్షణలకు దారితీసింది.
పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించబోతోంది అని సమాచారం ముందే తెలియడం వల్ల భారతదేశం ‘ఆపరేషన్ మేఘదూత్’ అనే సైనిక చర్యని ఏప్రిల్ 13 1984 న ప్రారంభించింది. దీని లక్ష్యం సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, భారతదేశపు అధీనంలోనే ఉంచుకోవడం. ఈ సైనిక చర్య సఫలమైంది. దీనివల్ల ఈ ప్రాంతమంతా భారతదేశపు అధీనంలోకి వచ్చింది. కీలకమైన దారులని కొండ శిఖరాలనీ కొండ చరియలలోని కనుమలనీ పర్యవేక్షిస్తూ వుండే వ్యూహత్మకమైన ప్రయోజనం భారతదేశానికి లభించింది. ఇప్పటికీ ఈ ప్రాంతం భారతదేశ పరిధిలోనే ఉంది. అయినా తరచూ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తరచూ చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం చాలా ఎత్తైన మంచు కొండల ప్రాంతంలో ఉండటం వల్ల, యుద్ధాల కంటే అతి శీతల వాతావరణం వల్లే సైనికుల మరణాలు ఎక్కువగా సంభవిస్తూ వుంటాయి.
మేజర్ విక్రమ్ సింగ్ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మధ్యాహ్నం నీరెండలో బయటికి వచ్చి చుట్టుపక్కల పరికిస్తున్నాడు. కల్నల్ రియా శర్మ అతని పక్కనే వచ్చి నిలబడింది. “ఈ రోజు సాయంత్రం కానీ అర్ధరాత్రి కానీ శత్రువు దాడి చేయబోతున్నాడని మనకు సమాచారం అందింది. మీ పథకం ఏమిటి మేజర్?” అడిగింది రియా.
కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన ఘర్షణలో రియా శర్మ తన సోదరుడిని పోగొట్టుకుని ఎంతో వేదనతో బాధపడింది. అతని శవాన్ని ఊరికి తీసుకొచ్చినప్పుడు, గన్ సెల్యూట్‌తో దహనం చేసినప్పుడు ‘జైహింద్’, ‘చేతన్ శర్మా అమర్ రహే’ అనే నినాదాలతో గ్రామస్థులు ఆవేశంతో ఏడ్చినప్పుడు జరిగిన దృశ్యాలు ఆమె కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. అందుకనే ఆమె ప్రత్యేకంగా కోరి మరీ ఇక్కడ పోస్టింగ్ వేయించుకుంది. ఒక సైనికుడికి పగ ప్రతీకారం ఉండకూడదు. విధ్యుక్తధర్మంగా పోరాటం చేస్తూ వుండాలి. కానీ ఆమె అంతరాంతరాలలో, తన సోదరుడి ఒక్క ప్రాణానికి శత్రువుల పది ప్రాణాలు బలి తీసుకోవాలనే పగ రగిలిపోతూనే ఉంది.
హవల్దార్ రాజూ నాయక్ కూడా పక్కనే వచ్చి నిల్చున్నాడు. ఆకాశం హఠాత్తుగా మళ్లీ మేఘావృతం అవుతోంది. త్వరలో మంచు తుఫాను రావచ్చు. రాజు నాయక్‌కి కూడా ఇలాంటి చరిత్రనే ఉంది. అతని స్నేహితుడు సూర్య నాయక్ కూడా ఈ ప్రాంతంలోనే 1990 ఘర్షణలలో చనిపోయాడు. మళ్లీ ఘర్షణ జరిగితే దానికి ప్రతీకారం తీసుకోవాలని అతను కోరుకుంటున్నాడు.
గాలి వేగం ఉధృతం అవుతోంది. ఎండ పోయి ఆ హిమానీనదమంతా చీకటితో నిండిపోతోంది. హఠాత్తుగా మంచు వర్షం కురవడం మొదలయింది. మంచు నిండిన కొండల్లో ఎక్కడ నుంచో ఒక బుల్లెట్ వేగంగా తళతళా మెరుస్తూ విక్రమ్ సింగ్ పక్కగా దూసుకుపోయింది.
“స్నైపర్ ఫైర్” పెద్దగా అరిచాడు విక్రమ్ సింగ్. “గో టు బంకర్స్. గెట్ రెడీ! ఎమర్జెన్సీ” అని మళ్ళీ అరిచాడు.
ఒక పక్క నుంచి వర్షం, గాలి వేగం ఎక్కువ అవుతూ ఉంటే, మరొక పక్క ఎత్తు ప్రాంతం మూడు వైపుల నుంచి పాకిస్తాన్ సైన్యాల స్నైపర్ ఫైర్ వల్ల బుల్లెట్లు దూసుకు రాసాగాయి.
యుద్ధం ప్రారంభమైంది. చీకటిలో చలిలో మంచు కొండల చరియలు విరిగిపడే వేళ శత్రువుల దాడిని తిప్పి కొట్టాలి.
మేజర్ విక్రమ్ సింగ్ త్వరగా బెటాలియన్ అంతటినీ సిద్ధం చేశాడు.
ఒకరి తరువాత ఒకరు భారత సైనికులు బంకర్ల నుంచి వస్తూ తుపాకులతో ఎదురుదాడి చేయసాగారు. శత్రు సైనికులు ఎత్తులో ఉన్నారు. స్నైపర్ ఫైర్ చేస్తున్నారు. చాలా అధునాతనమైన గన్స్ అవి. అతి ఎత్తు నుంచి దూరం నుంచి ఉన్న టార్గెట్లని షూట్ చేసేందుకు పనికొచ్చే గన్స్. క్రమ క్రమంగా గాలి ఎక్కువవుతోంది. చీకట్లో బుల్లెట్ల కాంతులు మెరుస్తున్నాయి. కొన్ని గంటలపాటు జరిగిన యుద్ధంలో విక్రమ్ సింగ్ బెటాలియన్‌లో కొంతమంది సైనికులు గాయపడి కొంతమంది చనిపోగా మిగిలిన పదిమంది క్రమక్రమంగా దాడి జరిగిన కుమార్ శిఖరానికి పాక్కుంటూ ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆ శిఖరాన మంచులో పాతిపెట్టి ఎగురవేశారు. ఇప్పుడు శత్రు సెన్యాల తుపాకీ కాల్పులు ఆగిపోయినాయి. అక్కడక్కడ శత్రు సైనికుల శవాలు మంచులో కప్పబడి గడ్డ కట్టిన రక్తంతో కనిపిస్తున్నాయి.
తెల్లవారుతోంది. రియా శర్మకి గాయం తగిలింది. ఎడమవైపు వీపు మీద. అయినా బలంగా మంచులో శిఖరం పైకి పాకుతూనే ఉంది. మేజర్ విక్రమ్ సింగ్ స్నైపర్ ఫైర్‌లో చనిపోయాడు. “మేజర్ సాబ్, ఎక్కడ, మేజర్ సాబ్ ఎక్కడ?” అని రాజు నాయక్ అరుస్తూ వెతుకుతూ ఏడవసాగాడు.
“మేజర్ సాబ్ అమర్ హోగయే, దేశ్ కేలియే. నేను మాత్రం పదిమంది శత్రువులని చంపాను” అన్నది రియా శర్మ బలహీనమైన స్వరంతో.
నాయక్ “అయ్యో” అని నడుం మీద చేతులు వేసుకొని చుట్టూ చూడసాగాడు. చీకట్లో మంచు పొగల మథ్య విక్రమ్ సింగ్ శరీరం కనబడటం అసాధ్యం. తెల్లవారిన తర్వాత వెదకాల్సిందే. ఇంకా ఉదయపు చీకట్లు పోలేదు.
ఉరుము ఉరిమినట్లు పెద్ద చప్పుడుతో దూరాన ఉన్న మంచు పర్వతం నుంచి హిమపాతం రాసాగింది.
దీన్ని avalanche అంటారు. భయంకరమైన వేగంతో పడిపోతున్న మంచు పెళ్ళలతో ఆ ప్రదేశమంతా మునిగిపోతోంది. ఆయుధాలు, ఇతర పరికరాలు ఇరు దేశాల సైనికుల శవాలు చెల్లాచెదరైపోతున్నాయి. ఎక్కడికో కొట్టుకు పోయి మంచులో అదృశ్యం అయిపోతున్నాయి.
పెద్ద శబ్దంతో గాలీ వర్షం, వేగంగా కొట్టుకు వచ్చే రాళ్లు, ఈ బీభత్సం అంతా ఒక గంట సేపు సాగింది.
చివరికి మిగిలింది రియా శర్మ, రాజు నాయక్.
ఇప్పుడు తెల్లవారింది. సూర్యకాంతితో మంచు గడ్డలు తళతళతో మెరుస్తూ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చుట్టూ చూస్తే మాత్రం విధ్వంసం, శవాలు తప్ప మరి ఏమీ లేదు.
అప్పటివరకు ధైర్యంగా ఉన్నా ఒక్కసారి బలహీనత దుఃఖం ముంచుకొచ్చింది రియా శర్మకు. “ఇదంతా అవసరమా? ఎన్ని త్యాగాలు! ఎన్ని మరణాలు! ఈ మంచు మరుభూమి కోసం నిర్మానుష్యమైన ప్రాంతం కోసం జీవితమంతా త్యాగం చేసుకుని కుటుంబానికి నిరాశను మిగిల్చి చనిపోవటం అవసరమా!” అంది.
రాజు నాయక్ అన్నాడు “ఏడవ వద్దు మేడమ్! మన కన్నీరు ఎప్పటికీ వృథా కాదు. నా పగ అయితే తీరింది. మీ పగ కూడా. వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ‘కుమార్ కాల్’ మన అధీనంలోకి వచ్చింది. దేశానికి మన వంతు సేవ చేసాం అనుకోండి!”
“ఏం లాభం రాజూ. నా సోదరుడే చనిపోయాక! మేజర్ సాబ్ పోయాక!”
“అవన్నీ ఆలోచించకండి! ఒక్క విషయం గుర్తుంచుకోండి..ఈ నాడు ఇక్కడ మనం బలిదానాలు చేసేది మనకోసం కాదు. మన తరువాత రాబోయే తరాలకోసం. వారి భద్రత కోసం.”
ఆమె అతనివైపు నిర్భావంగా చూసింది.
“మన బంకర్స్ వేపు వెళ్దాం. ఏదైనా తినటానికి తాగటానికి దొరుకుతుందేమో. మీరు చాలా నీరసంగా ఉన్నారు. గాయాలు కూడా అయినాయి.” అన్నాడు.
అలాగే బలహీనంగా నాయక్ భుజం మీద చేయి వేసి కుంటుకుంటూ రియా శర్మ మంచులో, దగ్గరగావున్న ఒక స్థావరం కోసం వెతుకుతూ నడిచింది.
రాత్రి అంతా కురిసిన మంచు తుఫాను వెలిసిపోయి ఇప్పుడు సూర్యకాంతి తళతళా మెరవ సాగింది. ఒకచోట వారికి ఒక పాత బంకర్ ఉన్న గుర్తుగా సగం విరిగిన జండా కర్ర కనిపించింది. గబగబా అటు నడిచి నేలలో ఉన్న ఇనుప బంకర్ తలుపులు తీసుకుని మెట్లు దిగి వెళ్లారు. ఆశ్చర్యంగా లోపల గదులలో చూసుకుంటూ వెళితే పాతబడిన మంచాలు పరుపులు పాత సైనికులు యూనిఫాంలు కనిపించాయి. అయితే సైనికులు ఎవరూ లేరు. నాయక్ “కిచెన్‌లో చూస్తాను” అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ తినేందుకు ఏమీ లేవు.
“మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి మేడమ్! నేను పోయి బయట ఇంకా ఎక్కడైనా ఆహారం కానీ టీ కానీ పాలు గాని దొరుకుతుందేమో చూసి తీసుకు వస్తాను” అని వెళ్ళిపోయాడు.
ఒక గదిలో బెడ్ మీద కూర్చుని బలహీనంగా కళ్ళు మూసుకుంది ప్రియా శర్మ.
కొంచెం సేపు నిద్ర వచ్చింది. అస్పష్టమైన మనోఫలకం మీద ఎప్పుడో జరిగిపోయిన యుద్ధ దృశ్యాలు. మళ్లీ తుపాకుల బాంబుల మోతలు, గాయపడిన వారి ఆర్తనాదాలు. ఆ తర్వాత నిశ్శబ్దం.
ఇలాంటి కల తర్వాత ఉలిక్కిపడి నిద్రలేచింది.
“కల్నల్, మేడం ఇదిగో కొద్దిగా బ్రెడ్ దొరికింది. దూరంగా నిర్మానుష్యమైన పాకిస్తానీయుల గుడారంలో ఆహారం దొరికింది. ఫ్లాస్కులు దొరికినాయి. వాటిలో కొంచెం వేడిగానే ఉన్న చాయ్ దొరికింది. తినండి! టీ తాగండి!” అభిమానంగా అన్నాడు.
బ్రెడ్ ముక్కలు తిని వేడి చాయ్ తాగితే మళ్ళీ శరీరంలో శక్తి వచ్చినట్టు అనిపించింది.
ఉన్నట్లుండి విసురుగా ఎక్కడి నుంచో గాలి. పాత బంకర్లలో గోడలలో ఏదో రంధ్రం ఉండొచ్చు. గాలికి కొట్టుకుంటూ పాత కాగితాలు ఎగురుకుంటూ దుమ్ము ధూళితో సహా గదిలోకి వచ్చాయి.
గోధుమ రంగులో పాతబడి చిరుగులు పట్టిపోయిన వాటిలో ఏ వివరాలు, ఎన్ని సైనిక వ్యూహాల సమాచారాలు ఏమున్నాయో!
చూస్తే ఏవేవో వివరాలు లాజిస్టిక్స్ ఉన్న అనేక కాగితాల మధ్య ఒక ఉత్తరం బయటపడింది. పాత ఇండియన్ పోస్టల్ కవర్ లోనే పెట్టబడి ఉంది. పోస్ట్ చేయని ఉత్తరం.
ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన ఒక సైనికుడి లేఖ. చిరుగులు పట్టి పాతగా గోధుమ రంగులోకి మారిన కవర్ తెరిచి ఆ లేఖ చదివింది రియా శర్మ.
చాలా పాత సంవత్సరం. 1984 ఏప్రిల్ 10. కుమార్ కాల్ , సియాచిన్.
అది ఎవరికి రాద్దాం అనుకున్నాడో వారి్కి అది చేరలేదు, ఇంకా ఇక్కడే ఉంది.
‘ప్రియమైన జస్బీర్,
అక్కడ మీరందరూ కులాసా అని తలుస్తాను. నేనిక్కడ సియాచిన్ మంచు శిఖరాల మధ్య ఒంటరిగా మబ్బు పట్టిన ఆకాశం కేసి చూస్తూ నిలబడి వున్నప్పుడు మీరందరూ గుర్తుకు వస్తారు. ఇక్కడి చలి నేను ఎప్పుడూ అనుభవించని భయంకరమైన చలి. అయితే మీ అందరి ప్రేమ జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని ఆ సంతోషంతో వెచ్చగా ఫీల్ అవుతాను. ఆ అనుభూతి నన్ను ఈ కష్టం కాలంలో రోజులు గడిపేట్లు చేస్తుంది. ‘ఆపరేషన్ మేఘదూత్’ చాలా కఠినమైనది జటిలమైనది. ఎంతో క్లిష్టమైన వాతావరణంలో కొండలలో నివసిస్తూ రోజులు గడుపుతూ ఈ సైనికచర్యను చెయ్యాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మన దేశపు సరిహద్దుల్ని కాపాడటానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఏ మాత్రం వాతావరణం సహకరించని ఈ పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ దొరకని ఎత్తులో ప్రతి అడుగు ఒక సాహసంలా ఉంటుంది. అయితే నా సహచరులలోని స్నేహం సాన్నిహిత్యం, కృత నిశ్చయం నన్ను ముందుకు నడిపిస్తోంది. ఒకరి నుంచి ఒకరు ధైర్యం తెచ్చుకుని మేము ముందుకు సాగుతున్నాం.
మన ఊర్లో మన ఇంట్లో వెచ్చటి వాతావరణం, పరస్పర అనుబంధాలు, ఎప్పుడూ సంతోషంగా ఉండే మన గ్రామం, అన్ని మిస్ అవుతున్నాను. అయితే ఆ క్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని సంతోష పడుతున్నాను.
పిల్లలకు చెప్పు! మీ తండ్రి దేశం కోసం సాహసంగా సరిహద్దుల్లో కష్టపడుతున్నాడని, అనుక్షణం మీ గురించి తన జ్ఞాపకాల్లో తలచుకుంటున్నాడని కూడా. వాళ్ళు పెయింటింగ్ చేసి ఇచ్చిన చిన్న చిన్న బొమ్మలు నా కష్ట సమయాల్లో చూసుకొని సంతోషపడతాను. అవి ఎప్పుడూ నాతోనే ఉంటాయని వాళ్ళకి చెప్పు.
ఇక్కడి జీవితం ఎంతో కష్టమైనది. కానీ మన దేశపు భద్రత కోసం భవిష్యత్ తరాల సంతోషం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలకైనా సిద్ధపడి ఉండాలి అనే నిశ్చయంతో రోజులు గడుపుతున్నాం. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మేము చేసే ఆత్మ త్యాగాలే భవిష్యత్తులో మన దేశ ప్రజల సంతోషానికి పునాది.
నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో! పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో! అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో! మీ అందరి దగ్గరికి వచ్చి కలుసుకొని సంతోషంగా రోజులు గడిపే సమయం కోసం అనుక్షణం ఎదురుచూస్తూ ఉన్నాను.’
ప్రేమతో అభిజిత్.
పాతబడి పోయి చిరుగులు పడిన లేఖ. ఆ అభిజిత్ చివరికి ఏమయ్యాడో తెలియదు. ఆ యుద్ధంలో మరణించాడో, లేక తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడో. కలుసుకోకపోక ఉండటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఉత్తరం ఇంకా ఇక్కడే ఉంది. వారికి చేరలేదు.
హఠాత్తుగా కల్నల్ రియాశర్మకు తీరని దుఃఖం వచ్చింది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్ని కాపాడటం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేసి ఉంటారో! ఎన్ని కష్టాలు పడి ఉంటారో! ఈ రోజు తాము చేసిన యుద్ధం కూడా ఆ కష్టాల్లో ఒక భాగమే. అదృష్టవశాత్తు తాను రాజు నాయక్ బతికారు. అందరికీ ఉత్సాహం ఇచ్చి ముందు నుంచి నడిపించిన మేజర్ విక్రమ్ అమరుడయ్యాడు.
ఎన్ని సంవత్సరాలు ఇలా అయినా ఒక సైనికుడికి ఈ విధ్యుక్తధర్మం తప్పదు. ప్రాణాలు త్యాగం చేసినా సరే దేశ రక్షణ కోసం ఎలాంటి సాహసమైనా చేయక తప్పదు.
ఇప్పుడు మంచువాన అల్లకల్లోలం అంతా తగ్గిపోయి వేడిగా ఎండ కాస్తోంది. ఆకాశంలో దూరం నుంచి హెలికాప్టర్ రోటర్ బ్లేడ్లు తిరుగుతూ ఉన్న చప్పుడు వినిపిస్తోంది. కాసేపట్లో రీ-ఇన్ఫోర్స్మెంట్స్ అంటే అదనపు సైనికులు, దుస్తులు, ఆహార సప్లైలు అన్నీ వస్తాయి. ఇంతవరకు యుద్ధం చేసి అలసిపోయిన తమకు రిలీఫ్ వస్తుంది. సెలవు వస్తుంది. ఇంటికి పోవచ్చు. మరొక దళం డ్యూటీలో చేరుతుంది. సరిహద్దులకి రక్షణగా కాపలా ఉంటూనే ఉంటుంది. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ.
కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ పోవు. మేజర్ విక్రమ్ సింగ్ తిరిగి రాడు.
“ఎప్పటిదో ఈ ఉత్తరం నాయక్! ఇది మనలో ఎవరైనా రాసి ఉండొచ్చు. మన ఆశల్ని ఆశయాలని బాధలని ప్రతిబింబిస్తుంది ఈ సైనికుడి లేఖ. ఇది మన అందరి ఆలోచనల బాధల దర్పణం. జాగ్రత్తగా దాయి! ఈ అభిజిత్ ఎవరో మనం తెలుసుకుని ఇవ్వవచ్చు. వారి కుటుంబం దీన్ని అమూల్యమైన జ్ఞాపకంగా దాచుకోవచ్చు. జైహింద్.” అంది.
“జైహింద్” అన్నాడు నాయక్ కూడా.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.