Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[విజయనగరంలోని బాలాజీనగర్‍లో ఉన్న ఓ అపార్టుమెంటులో ఉండే సంఘమిత్రది అహంకారపూరితమైన స్వభావం. స్వార్థపరురాలు. సంఘసేవిక అనే ముసుగులో కీర్తి ప్రతిష్ఠల కోసం పాకులాడుతుంది. అదే అపార్టుమెంటులో మరో ఫ్లాట్లలో ఉమాదేవి, ఇందిర ఉంటుంటారు.  ఇందిర అవివాహిత కాగా, ఉమాదేవిని భర్త వదిలేస్తే, కూతురు హిమబిందుతో కలిసి బ్రతుకుతోంది. మధ్యతరగతి కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టిన ఇందిరని తండ్రి తన స్వార్థానికి వాడుకుంటాడు. ఇందిర జీతంతో ఆర్థిక ఇబ్బందులు తీర్చుకుని, ఆమెతో తన తోబుట్టువులకి పెళ్ళిళ్ళు చేయించి, వాళ్ళు జీవితంలో స్థిరపడేలా చేస్తాడు. తోబుట్టువలన్న అభిమానంతో ఇవన్నీ చేసినా, వాళ్ళు ఇందిరని గౌరవించరు. ఇక్కడ ఇలా ఒంటరిగా జీవితం గడుపుతోంది. సంఘమిత్ర భర్త మన్మథరావు ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్. స్త్రీలోలుడు. తన దగ్గరికి వచ్చే రీసెర్చ్ స్కాలర్‍లని వేధిస్తాడు. ఇంట్లో మాత్రం భార్యకి ఎదురు చెప్పలేడు. వాళ్ళ కూతురు, కొడుకు చెడు వ్యసనాలకి అలవాటు పడతారు. తన ఇంటినే చక్కదిద్దుకోలేని తాను, సంఘసేవ ఏం చేస్తానని సంఘమిత్ర అనుకోదు. ఓ రోజు మన్మథరావు పుట్టినరోజు వస్తుంది. ఆ పూట వృద్ధాశ్రమంలో పళ్ళు పంచి, వృద్ధాశ్రమంలో ఉన్న తన తల్లిని ఇంటికి తీసుకువద్దామని అనుకుంటాడు మన్మథరావు. భార్యతో మెల్లగా మాట్లాడి ఆమెని ఒప్పిస్తాడు. అతని తల్లి సత్యవతమ్మకి ఈ విషయం నమ్మబుద్ధి కాదు. కోడలికి తను ఇంటికి రావడం ఇష్టం లేదని కొడుకుతో అంటుంది. మన్మథరావు నచ్చజెప్పి తీసుకువస్తాడు. అన్నం తింటుంటే సత్యవతమ్మకి వాంతి వచ్చి కుర్చీలోనూ, నేల మీద కక్కుకుంటుంది. దాంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న సంఘమిత్ర అత్తగారిని తిడుతుంది. అక్కడంతా తొందరగా శుభ్రం చేయమని భర్తని ఆదేశిస్తుంది. చేసేదేం లేక, అతను తల్లిని పంపు దగ్గరకి తీసుకెళ్ళి శుభ్రం చేస్తాడు. వెంటనే అత్తగారిని ఆశ్రమంలో దింపేసిరమ్మని గట్టిగా అరుస్తుంది సంఘమిత్ర. ఆ అరుపులకి ఇరుగుపొరుగు వాళ్ళు  వచ్చి చూస్తారు. మన్మథరావుకి సిగ్గేస్తుంది. తల్లిని ఆశ్రమంలో వదిలిపెట్టడానికి బయల్దేరుతాడు. ఇక చదవండి.]

అధ్యాయం-7

నిషి జీవితమే ఆట. ఆ ఆటలో ఒకరు ఒకసారి ముందుకు రావచ్చు, వెనకబడ్డవారు మరోసారి ముందుకు రావచ్చు. అలాంటి సమయంలో ముందు వెనకలకి ఆనందించాలే తప్ప ఎదుటి వాళ్ళ ఉన్నతిని చూసి అసూయపడకూడదు. క్షణకాలం అసూయపడినా విలువైన సమయాన్ని వృథా చేసుకున్నట్టే.

ఇందిర ఇలా ఆలోచిస్తుంది. చిన్నతనం నుండి తనకి బాధ్యతల మీద బాధ్యతలు వచ్చి మీదపడ్డాయి. జీవితంలో నిజమైన ఆనందాన్ని అందుకోకుండా తన వెనుకబడి పోతోందా అని అనిపించేది. అయితే ఎప్పటికీ ఈ జీవితం ఇలాగే ఉండిపోదు. తనూ ముందుకు వెళ్ళగలదు జీవితంలో, అనే ఆలోచన, ఆశ ఎదుటి వాళ్ళ ఉన్నతిని చూసి అసూయపడే తత్వానికి దూరం ఉంచింది.

‘నాకన్నా దురదృష్టవంతులు సమాజంలో చాలా మంది ఉన్నారు. వారి కన్నా నా జీవితం మెరుగ్గానే ఉంది’ అని అనుకుని తృప్తిపడేది.

“అమ్మ గోరు – అమ్మ గోరూ ఆ సంఘమిత్ర గోరు ఏఁటన్నారో తెలుసా?” అంది ఇందిరతో పనిమనిషి సింహాచలం.

“ఏంటే నీ గోల?” విసుగ్గా అంది ఇందిర.

“అదేనండీ – అదేనండీ!” నీళ్ళు నములుతోంది.

“ఊఁ చెప్పు.”

“ఉమ అమ్మగారు పెల్లి కాక ముందు ప్రేమ వ్యవహారం నడిపారట. పెల్లి అయిన తరువాత పెనిమిటికి ఈ ఇసయం తెలిసి ఒగ్గేసినాడుట.”

సింహాచలం మాటలు ఇందిరకు ఆనందం ఇయ్యలేదు కదా వెగటు అనిపించాయి.

తన మాటలు ఇందిరకు నచ్చలేదు అనుకున్న సింహాచలం “చమించండమ్మా!” అంది.

“అలా క్షమాపణ కోరడం కాదు సింహాచలం. ఈ అపార్టుమెంటులో చాలా ఇళ్ళల్లో నీవు పని చేస్తున్నావు. అలాంటప్పుడు ఒకరి ఇంటి విషయాలు మరొకరి ఇంట్లో చెప్పకూడదు. నీ గురించి నేను ఏం అనుకుంటానో తెలుసా? ఈ సింహాచలం సంఘమిత్ర గురించి నా దగ్గర చెప్పింది. రేపొద్దున్న నా గురించి మరొకరి దగ్గర చెప్పదన్న గ్యారంటీ ఏమిటని నాకనిపిస్తుంది, అందుకే ఎవరి ఇంటి విషయాలు అక్కడే వదిలి వేయడం మంచిది” అంది ఇందిర.

“తప్పయనాదండీ, నేను మరి ఎవ్వల్లకీ అలా చెప్పను” అంది సింహాచలం. “ఇది నీ తప్పు కాదు. చదువుకున్నది, పైగా సంఘ సంస్కర్తగా చెలామణి అవుతున్న ఆ సంఘమిత్రది తప్పంతా” అంది ఇందిర.

ఇందిరకి సంఘమిత్ర మీద అసహ్యం కలిగింది. ఇలాంటి వాళ్ళు గురవింద గింజ సామెతలా తమ వెనుకనున్న లోటుపాట్లు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ వ్యక్తి గల విషయాల వేపు తొంగి చూస్తారు. ఆసక్తి చూపిస్తారు. ఇది వాళ్ళ అలవాటో, బలహీతనో లేక స్వభావమో తెలియదు.

ఓ పర్యాయం తను స్టాఫ్ రూమ్‍లో అలమరులో ఉన్న లైబ్రరీ పుస్తకాలు సర్దుతోంది. అక్కడే కొద్ది దూరంలో కళ్యాణి, సుమిత్ర పరీక్ష పేపర్లు దిద్దుతూ మాట్లాడుకుంటున్నారు. తను అక్కడ ఉందని వాళ్ళు గమనించలేదు.

“సుమిత్రా, ఆ ఉమాదేవి గారు పైకి అంత సౌమ్యంగా అగుపడ్తారే కాని చాలా ఘటికురాలే!” కళ్యాణి అంది.

“ఏంటి విషయం?” సుమిత్ర అంది.

“పెళ్ళికాక మునుపు ఈవిడికి “లవ్ ఎఫైర్” ఉందిట. అది కప్పిపుచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేశారుట. ఆ తరువాత మొగుడికి ఈ విషయం తెలిసి ఈవిడ్ని వదిలి పెట్టాడుట.”

“ఇది నీకెలా తెలిసింది?”

“ఈవిడ్ని వదిలేసినాతను మా కజిన్ని పెళ్ళి చేసుకున్నాడు.”

“అలాగా!”

వాళ్ళ సంభాషణలు వింటున్న తనకి చాలా కోపం వచ్చింది. చాలా బాధవేసింది. వీళ్ళేం పతివ్రతలు కాదు. కళ్యాణి పెళ్ళి అయిన మరుసటి రోజు నుండి భర్తని కొంగు ముడికట్టుకుని అతని తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వేరే కాపురం పెట్టే వరకూ ఊరుకోలేదు.

ఇక సుమిత్ర అత్తగారిని వృద్ధాశ్రమంలో చేర్చించే వరకూ భర్తను చంపుకుని తింది. ఒక్కసారి బయటకు వచ్చి చెడామడా తిట్టేయాలన్నంత కోపం వచ్చింది. అయితే తను తమాయించుకుంది.

అయితే ఈ మాటలు ఎవరు వినకూడదో వాళ్ళే విన్నారు. అప్పుడే క్లాసు రూమ్ నుండి ఏదో పుస్తకం తీసుకు వెళ్లామని అనుకుని వచ్చిన ఉమాదేవి వింది. చాలా బాధపడినట్లు ఉంది ఆమె వాలకం,  వాళ్ళ మాటలు విని.

ఉమాదేవిని చూసిన వాళ్ళు తత్తరపాటు పడ్డారు. ఆ తత్తరపాటు కప్పి పుచ్చుకుంటూ “మీ గురించే అనుకుంటున్నాం. ఈసారి మీరు ఎప్లై చేస్తే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మీకే వస్తుందని. ఎందుకంటే మీరు గొప్ప సిన్సియర్,” అంది కళ్యాణి. తను బయటకి వచ్చింది. తనని చూసి వాళ్ళిద్దరూ గతుక్కుమన్నారు.

ఉమాదేవి గొప్ప సిన్సియరే కాకుండా గొప్ప సెన్సిటివ్ కూడా. ప్రతీ చిన్న విషయానికి స్పందిస్తుంది. పాజిటివ్ అవుతే పరవాలేదు కాని తన గురించి ఎవరేనా నెగిటివ్‌గా మాట్లాడుతే గొప్ప బాధ పడిపోతుంది.

“ఈ రోజుల్లో ఆదర్శ ఉపాధ్యాయుడు అదే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం, పద్మ అవార్డులు రావడం వింత లేదు. అర్హత ఉన్న వాళ్ళతో పాటు అర్హతలేని వాళ్ళకి కూడా ఈ అవార్డులు వస్తున్నాయి. ఇస్తున్నారు. పలుకుబడి పైరవీలు చేసి సంపాదిస్తున్నారు కొందరు. అందుకే వాటి విలువ లేకుండా పోయింది అయినా మన అర్హత మన పనిపాట్లు చూసి అధికార్లు సిఫారసు చేస్తే ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలి కాని, ఈ అవార్డుల కోసం మనమే స్వయంగా దరఖాస్తు చేసుకోవడం ఏంటి? నాన్సెస్!” అంది తను. కళ్యాణి, సుమిత్ర ముఖాలు తన మాటలకి పాలిపోయాయి.

ఉమాదేవి మరి స్కూల్లో ఉండలేదు. సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఆమె హృదయం వీళ్ళ మాటలకి ఎంత గాయపడిందో ఇందిర ఊహించగలిగింది. తనకి కూడా ఆమె వైవాహిక జీవితం గురించి ఇన్నాళ్ళ తమ ఇన్నాళ్ళ పరిచయంలో అడగాలనిపించినా ఆమెను బాధ పెట్టిన దాన్నవుతానన్న భావంతో అడగలేదు.

మొదటిసారిగా ఆమెను కలిసిన రోజులు గుర్తుకు వచ్చాయి. తను ఈ పాఠశాలకి క్రొత్తగా బదిలీ అయి వచ్చింది. తెలియని ప్రదేశం – తెలియని మనుష్యులు. అటువంటి సమయంలో ఆప్యాయతతో పలకరించి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది ఉమాదేవి. ఆమె మాటల్లో నిర్మలత్వమేకాని కల్మషం తనకి అగుపించలేదు. చేతనయితే సహాయం చేయడమే తప్ప మోసం, దగా చేసే స్వభావం ఆవిడిది కాదని ఆనాడే గుర్తించింది.

ఇంచుమించు ఇద్దరూ ఒకే వయస్సు వాళ్ళు. మహా ఉంటే తనకన్నా రెండు మూడేళ్ళు పెద్ద ఉండచ్చు. ఆవిడే తనుంటున్న అపార్టుమెంటులో ఫ్లాటు ఖాళీగా ఉందని, అద్దె కిప్పించింది. తమిద్దరి మధ్య రోజు రోజుకి స్నేహం పెరిగి చిక్కగా చక్కగా అల్లుకుపోయింది. గారూ, గీరూ అని పిలుచుకోవడం మానేసి, ఇందూ అని ఆవిడ పిలిస్తే, ఉమా అని తను పిలిచేది. తనకి ఒక్కొక్క పర్యాయం “అక్కా!” అని పిలవాలని కూడా అనిపించేది. ఇలా సాగిపోతున్నాయి ఇందిర ఆలోచన్లు.

ఇంటికి వెళ్ళగానే ఇందిర చేసిన పని ఉమాదేవి ఫ్లాటులోకి అడుగుపెట్టింది. ఆమె వెళ్ళెప్పటికి ఉమాదేవి సోఫాలో చేరబడి కణతలు అమృతాంజనంతో మర్దనా చేసుకుంటోంది. చాలాసేపటి నుండి ఏడ్చి ఉంటుంది కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి.

“ఉమా!” పిల్చింది ఇందిర.

కళ్ళు తెరిచిన ఉమాదేవి కళ్ళలో ఆవేదన.

“లోకంటే ఉన్న వాళ్ళందరూ తమకి నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడుతూ ఉంటారు అయితే అందరి మాటలూ పట్టించుకుంటామా?” ఓదార్పుగా అంది ఇందిర.

ఆమె ఓదార్పుకి తట్టుకోలేకపోయింది ఉమాదేవి. ఇన్నాళ్ళ వరకూ ఉన్న ఆమె బింకం సడలిపోయింది. “ఇందూ!” అంటూ ఇందిర గుండెల మీద తలవాల్చి రోదిస్తోంది. ఆమె తల మీద చేత్తో రాస్తూ సముదాయించడమే తప్ప ఏం చేయలేకపోయింది ఇందిర. అలా ఏడుస్తే దుఃఖ భారం తగ్గుతుందని అని అనుకుంది ఇందిర.

అధ్యాయం-8

మనస్సు చికాగ్గా ఉండి స్కూలుకి వెళ్ళ బుద్ధి వేయక ఉమాదేవి స్కూలుకి సెలవు పెట్టింది. ర్యాగింగుకి బయపడి కాలేజీకి వెళ్ళకుండా కూతురు అలా పడుకోవడం చూసి మరింత అసహనానికి గురి అయింది. తన అసహనం తెలియ చేస్తూ కూతుర్ని కసురుకుంది.

ఎన్నడూ పల్లెత్తు మాట అనకుండా తనని అభిమానంగా చూసుకునే తల్లి అలా కసురుకోవడం సహించలేకపోయింది హిమబిందు. గుడ్ల నీరు కక్కుకుని మనస్తాపం చెందిన ఆ కూతురు అలా పడుకునే ఉంది.

ఉమాదేవి నిశ్శబ్దంగా ఉంది. కష్టమైన పనే నిశ్శబ్దంగా ఉండటం. ఏ పనీ చేయకుండా కూడా ఎక్కువ సమయం ఉండలేరు ఎవ్వరూ. మాట్లాడనంత మాత్రాన్న మౌనంగా ఉన్నామని చెప్పడానికి వీల్లేదు. మనస్సు కదుల్తూ ఉంటుంది. ఆలోచనలు సాగుతూ ఉంటాయి. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి గంభీరంగా ఉపన్యసిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలకి లొంగుతే అవి వదిలిపెట్టవు. ఆలోచిస్తూ పోతే పనులు జరగవు.

మనం ఖాళీగా కూర్చోకుండా ఉంటే నిశ్శబ్దం మాధుర్యాన్ని రుచి చూడలేము. ఏమీ చేయకుండా కూచుని మనస్సులో కదిలే ఆలోచనల్ని మనకి సంబంధించినవి కావని

ఊరుకోలేము. ఆలోచనలకి, ఉద్వేగాలకి బానిస అవుతాము. మన ఆందోళన బట్టే మన శరీరాంగాలు చలిస్తాయి.

ఉమాదేవి పరిస్థితి అలాగే ఉంది. ఇందిర పరిస్థితి అలాగే ఉంది. ఇద్దరికి ఇద్దరూ ఆలోచన్లకి ఉద్వేగాలకి లోనయ్యారు. ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్కలాగ ఉన్నాయి. ఉమాదేవిది ఒక విధమైన అనుభవమయితే, ఇందిరది మరోరకమైన అనుభవం.

సమాజంలో ఆడదానికి భద్రత లేదు. అభద్రతా భావం అడుగడుగునా ఆమెను వెంటాడుతున్నాయానడానికి తనకి ఎదురయిన అనుభవమే సాక్ష్యం. సమాజంలో నేడు ముక్కు పచ్చలారని ఆడపిల్ల దగ్గర నుండి పండు ముదుసలి వరకూ, వీళ్ళు, వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ అత్యాచారాలకి గరవుతూనే ఉన్నారు.

క్రిందటి సాయంత్రం ఉమాదేవిని ఓదార్చి ఇందిర తన ఇంట్లోకి వెళ్ళి తలుపేయబోతున్న సమయంలో వెకిలిగా నవ్వుతూ మన్మథరావు ఎదురుగా నిలబడి ఉన్నారు. “మా ఆవిడ తాళాలు పెట్టుకుని క్లబ్బుకి వెళ్ళింది. ఫ్రిజ్‍లో చల్లని నీళ్ళు త్రాగడానికి ఇస్తారా?” అని అడిగాడు.

మొదటి నుండి ఆమెకి అతనంటే ఒళ్ళు మంట. ఆడవాళ్ళ వేపు ఆశగా – ఆబగ వెకిలిగా చూస్తాడు. అందులోనూ ఒంటరిగా ఉంటున్న ఆడవాళ్ళంటే అతనికి చాలా చులకన. తన వేపు ఉమాదేవి వేపు అతను అలా చూడ్డం ఆమె సహించలేకపోతోంది. ఒకవేపు అతని మీద కోపం ఉన్నా మరో వేపు జాలి.

ఆ జాలి ఎందుకు? అంత ఆస్తి అంతస్తు, పరపతి ఉన్నా అతని స్థితి ఇదేనా? అని ఉన్నత పదవిలో ఉన్న అతని గతి ఇంట్లో ఇదా అన్న జాలి. అతని వెకిలి చేష్టలు చూసి కోపం.

‘మగవాడు ఇలా పతనమవుతున్నాడంటే కారణం అతని ఒక్కడిదే కాదు తప్పు. భార్య కూడా అందులో భాగస్థురాలే. భర్తకి ఇంట్లో అన్ని విధాలా సుఖ సంతోషంతో కూడిన జీవితం ఉంటే అతను ప్రక్కదార్లు ఎందుకు పడ్తాడు. అందుకే అతని పతనానికి, హీన స్థితికి భార్య కూడా కారణమే’ అని అనుకుంటుంది ఇందిర.

ఇందిర ఇచ్చిన ఫ్రిజ్ వాటరు త్రాగిన తరువాత అతను కదలకుండా అలా నిలబడి ఉండడం చూసి ఇందిరకి చిరాకు అనిపించింది. “ఓ పది నిమిషాలు మీ ఇంట్లో కూర్చోవచ్చా!” అతను అడుగుతున్నాడు. చెట్టంత మనిషి అలా అర్థిస్తూ ఉంటే ఆమె కాదనలేక, “వచ్చి కూర్చోండి” అంది. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

ఎదురుగా అతనుంటే తను లోపలికి వెళ్ళిపోవడం పనిపాట్లు చేసుకోవడం సభ్యత కాదు కదా! అందుకే తను కూడా ఎదురుగా నున్న సోపాలో కూర్చుంది.

“మాకు తెల్సినతను బొంబాయి నుండి ఈ చీరెలు తెచ్చాడు. మా ఆవిడికి తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు ఓ చీరె తీసుకోండి,” అన్నాడు అతను సంచిలో నుండి చీరలు తీస్తూ. అంతవరకూ అతని చేతిలో సంచి ఉన్న విషయమే గమనించలేదు ఇందిర. ‘తన భార్యకని తీసుకున్న చీరల్ని తననెందుకు తీసుకోమంటున్నాడు? ఇతని ప్రవర్తనలోని, మాటల్లోనీ, నిజాయితీ లేదు. గూడార్థంలో మాట్లాడుతున్నాడు. ఎలా తిరస్కరించాలి? ఎలా వదిలించుకోవాలి?’ చురుగ్గా ఇందిర మెదడు ఆలోచిస్తోంది. ఇబ్బందికరంగా ముఖం పెట్టింది.

ఇంతలో ఆమె స్టూడెంట్సు రాబట్టి బ్రతికిపోయింది కాని, లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోడానికే భయమేస్తోంది. తన స్టూడెంట్సుని చూడగానే అతను ఇబ్బందిగా ముఖం పెట్టి బయటికి జారుకున్నాడు. ‘అమ్మయ్య! గొప్ప గండం గడిచింది’ అనుకుంది ఇందిర.

అతను తను ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా తన ఫ్లాటులోకి రావడం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు అసలే అక్కడున్న వాళ్ళు అదో రకమైనవారు. తనకున్న మంచి పేరు పోయే పరిస్థితి వస్తుంది. ఇలా ఆలోచిస్తున్న ఇందిర కంపించింది. ప్రస్తుతానికి ఈ గండం నుండి బయటపడింది కాని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎన్ని ఫేస్ చేయాలో, ఉమాదేవితో చెప్పి ఇల్లు మారాలి, ఇలా సాగిపోతున్నాయి ఆమె ఆలోచన్లు.

మనుష్యులు చిత్రమైన వారు. ఫలితాల గురించి పర్యవసానాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అతి జాగ్రత్తగా ఉంటారు. ఎంత పరిచయం వున్న వ్యక్తి అగుపడినా అతని చరిత్ర మంచిది కాకపోతే వారితో సన్నిహితంగా ఉండడానికి జంకుతారు. వాళ్ళతో దూరంగా ఉండడానికి కంచెలు కట్టుకుంటారు. గోడలు నిర్మించుకుని తాము ఇష్టపడని వ్యక్తులకి దూరంగా ఉంటారు.

ప్రస్తుతం ఇందిర పరిస్థితి అదే. ఆ రోజు ఇందిర స్కూలుకి సెలవు పెట్టింది. ఉమాదేవి మనస్సు చికాకనిపించి స్కూలుకి సెలవు పెడ్తే, తమ్ముడు రవి వస్తున్నాడని ఇందిర స్కూలుకి సెలవు పెట్టింది.

తమ్ముడ్ని అభిమానంగా, అనురాగంగా ఆహ్వానించింది ఇందిర. ఆమె కళ్ళల్లో తమ్ముడి ఎడల అభిమానం, అనురాగం ఉంటే అతని కళ్ళల్లో ఉన్నది అక్క యడల కృతజ్ఞతా భావం. తమందరి కోసం క్రొవ్వొత్తి కరిగిపోతూ, అదే క్రొవ్వొత్తిగా తను మండిపోయి కరిగిపోతూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగు ప్రసాదించినట్టు తమ జీవితాలు బాగు కోసం, తమ జీవితాల్లో వెలుగు ప్రసాదించడం కోసం క్రొవ్వొత్తిలా మండి కరిగి పోతోంది అక్క జీవితం అని.

జీవితంలో పెళ్ళి చేసుకోకుండా తన వాళ్ళ కోసం మ్రోడులా మిగిలిపోయి గొప్ప త్యాగం చేసింది తన అక్క. అందుకే ఆమె ఋణం కుటుంబ సభ్యులు ఎవరూ తీర్చుకోలేరు అనుకుంటాడు. అందుకే అక్కని చూసి జాలిపడ్తూ ఉంటాడు. బాధ పడ్తూ ఉంటాడు ఆ తమ్ముడు.

“అక్కా! మా అందరి కోసం మా బాగు కోసం ఏకాకిగా మిగిలిపోయావు,” బాధగా రవి ఇందిరతో అన్నాడు.

అతని మాటలు తేలికగా తీసిపారేస్తూ “అంతేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడ్డం ఎక్కడ నేర్చుకున్నావురా?” గల గల నవ్వుతూ అంది ఇందిర.

“నిజం అక్కా!”

“పద పద, మనస్సులో ఉద్వేగాలకి తావివ్వకు” అంది ఇందిర తమ్ముడితో. “మీరందరూ ఉండగా నేను ఏకాకిగా ఎలా మిగిలిపోతాను” తిరిగి అంది.

తమ్ముడితో భావోద్వేగాలకి లోనవద్దు అని చెప్పింది కాని ఆమెకీ తెలుసు ఈ భావోద్వేగాల వల్ల ఆనందం బాధా రెండూ తప్పవు అని. ‘అలాగే జీవితం నుండి పలాయన మంత్రం జపించడం కూడా జరగచ్చు. లేకపోతే సమాజంలో ఉంటూ పోరాడడమేనా జరుగుతుందని ఒక విధంగా మన సంక్షేమాన్ని కాపు కాసేవి ఈ భావోద్వేగాలే,’ అని అనుకుంటుంది ఇందిర ఒక్కొక్క పర్యాయం.

(ఇంకా ఉంది)

Exit mobile version