[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘సమర్చన’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]
కవిగా, విమర్శకులుగా, పరిశోధకులుగా, దార్శనికులుగా సుప్రసన్నాచార్యులు గారు బహుముఖ వ్యక్తిత్వ ప్రతిభాశీలురు. సంప్రదాయ కుటుంబంలో జన్మించినా ఆ పరిధిలోనే ఇమిడిపోక సమాజాన్ని విలక్షణమైన తమ ఉదాత్త వ్యక్తిత్వంతో అవగతం చేసుకున్నారు. సౌహార్ద్రతతో జనహితం కోసం తమ గొంతు విప్పారు. ప్రకృతిని కూడా పరమాత్మగా భావించి పూర్ణత్వం నుండి పరిపూర్ణత్వం వైపుగా ప్రయాణించిన మహోన్నతులు వారు. ‘సమర్చన’ పేరుతో ఆయన వెలువరించిన ఇరవై ఒక్క దళాల వ్యాసపుష్పం భాష, సాహిత్య, ఆధ్యాత్మ సమ్మిళితమై విప్పారింది.
“శ్రీ గురుదేవులు కందుకూరి శివానందమూర్తి గారి ఆశీస్సులే తమ సాహిత్య మార్గదర్శక దీపమాలికలని, రసమూర్తులైన భావుక పరంపరయే తమ సాహిత్య వివేచనా ధారకు భూమిక”ని చెప్పుకున్న కోవెల సుప్రసన్నాచార్యగారు నిరంతర సాహిత్యాధ్యయనం ద్వారా సాహిత్య కావ్య గాఢతను అనుభూతి పొందారు.
కావ్యానుశీలనంలో ఆయన పొందే అనుభూతి వివిధ విషయాల విస్తరణాత్మక విశ్లేషణతో సమాజాన్ని జాగృతం చేస్తుంది.
తపోమయం – రామాయణం
భారతదేశం తపోభూమి. తపస్సు అనేది భౌతిక సాధనం లేకుండానే అనంత చైతన్యాన్ని అనుభవింపజేసే అనుభూతి. అంతఃకరణానికి, ఇంద్రియాలకు ఒక సమన్వయం సాధించే కృషిలో తపస్సు ప్రధాన కారణంగా చెబుతూ వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ గాథను ‘తపోమయమైన ఇతిహాసం’గా పేర్కొన్నారు సుప్రసన్న గారు. తపస్సులోనే సర్వోన్నతమైన మోక్షప్రాప్తి లక్ష్యం నెలకొని ఉంది. తనను తాను కుదించుకొని అస్మిత యొక్క కేంద్రబిందువులోకి సంగమించి, బీజంగా ఉద్భవించి మహావృక్ష చైతన్యంగా భావ సాక్షాత్కారాన్ని పొందడానికి తపస్సును మించిన సాధనం మరొకటి లేదు.
బ్రహ్మ తపస్సు చేసి వేదాలను పొంది ఆ తపశ్శక్తి చేతనే సృష్టిని కొనసాగించాడు. తపస్సుకున్న మహిమాన్విత శక్తి అటువంటిది. క్రమేణా వివిధ దశల్లో తపోవిధానం ఎన్నో పరిణామాలకు లోనైంది. ఆధ్యాత్మిక పరిధులు దాటి దుష్ట ఆలోచనలతో అర్థ కామ సమృద్ధి కొరకు సాగింది. అయినా తపశ్శక్తి చేత దుష్టులు కూడా వారు అనుకున్న కామ్యాలను నెరవేర్చుకున్నారు. శ్రీ మద్రామాయణం తపశ్శబ్దంతోనే ఆరంభమవుతుంది. తపోనిష్ఠుడు,స్వాధ్యాయ నిరతుడు నారదుని ద్వారా రామాయణ రచనకు ప్రేరణ పొందిన వాల్మీకి తపస్సు చేసినవాడే.
భగీరథుని రాజసిక తపస్సు దేవనదిని భువికి రప్పించింది. విశ్వామిత్రుని తపస్సాధనకు శ్రీరాముని అరణ్యవాస తపస్సు తోడైంది. ఋష్యశృంగుడు, అత్రిమహర్షి తపోధనులు. అనసూయాదేవి స్త్రీ తాపసులకు ప్రాతినిధ్యం వహించే తపస్విని. కథా పరిణామంలో అరణ్యకాండ మొత్తం శరభంగుడు, సుదీక్ష్ణుడు, అగస్త్యుడు మొదలైన వివిధ ఋషులు వారి తపఃసిద్ధిని ఈ వ్యాసంలో వివరించారు సుప్రసన్నగారు. శ్రీరాముడు వారినుండి తపఃఫలాలను స్వీకరించడం ద్వారా తన బలంతో పాటు మరింత శక్తి సంపన్నుడై రావణాసురుని వధించాడు. రామునిది ప్రచ్ఛన్నంగా నిలిచి ఉన్న బహుకల్ప నిత్య తపస్సుగా అభివర్ణించారు సుప్రసన్నాచార్యులు గారు. శబరి నిరీక్షణ మరో తపస్సు. సీతాదేవి దుఃఖాన్ని వర్ణిస్తూ వాల్మీకి “భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం” అంటాడు. ఈ విధంగా రామాయణేతిహాసమంతా తపశ్శబ్దంతో కూడుకున్న విషయాన్ని సుప్రసన్నగారు విపులీకరించారు.
ధర్మేతిహాసం – మహా భారతం
“యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్ క్వచిత్” అని వ్యాసుని చేత ప్రకటింపబడిన భారతాన్ని బహుముఖగ్రంథంగా, అనంతముఖంగా అభివర్ణించారు సుప్రసన్నగారు. భారతారంభంలో నన్నయ్య “అమితాఖ్యానక శాఖలం బొలచి వేదార్థామలచ్ఛాయయై” అని పేర్కొన్న విధంగా ఇందులో రెండు వృక్షాలున్నాయని ఒకటి దుర్యోధన, మరొకటి ధర్మజ వృక్షాలని, ఈ రెండూ ధర్మాధర్మాలకు బింబ ప్రతిబింబాలని ఆయన వివరించారు. మరో విధంగా పరబ్రహ్మ శ్రీకృష్ణుడు ఒకవైపు, అమనీషి ధృతరాష్ట్రుడు మరోవైపు. ఈ తత్త్వాలను అవగతం చేసుకుంటే విద్యావిద్యలు, పాప పుణ్యాలు, సౌశీల్య దుశ్శీలాలు, సదసత్తులుగా ద్వైదీరూప వృక్ష సంకేతాలవుతాయి.
అనాదిగా అనంతమైన సంసారం మహాభారతంలో ప్రధాన వర్ణ్య వస్తువు. ఇది జీవేశ్వరుల తత్త్వాన్ని మాత్రమే కాక అనంత లక్షణ గర్భితంగా సంసార లక్షణాన్ని వ్యాఖ్యానిస్తుంది. మౌలికమైన మరో మూల పాత్ర ద్రౌపది. అగ్ని సంభూత. అందుకే ఆరని చిచ్చుగా అంతటా వ్యాపించింది. దుర్గాదేవితో అభిన్నమైన ఐంద్రీ శక్తి ఆమె. కృష్ణార్జునులు బింబ ప్రతిబింబ ఈశ్వర జీవులు. సుప్రసన్న గారు
మహాభారతాన్ని పిరమిడ్ తో పోల్చారు. వ్యాసుడు, అర్జునుడు, ద్రౌపది ముగ్గురూ మూడు కోణాలు. శ్రీకృష్ణుడు ప్రణవస్వరూప శిఖరమైతే, శాక్త ప్రణవాలుగా ఈ ముగ్గురినీ భావించాల్సి ఉంటుంది అంటారు. ఈ పరమార్థాన్ని ఎంతో లోతుగా వివేచన చేయాల్సి ఉంటుంది.
ఇందులోని అనేక ఆఖ్యానోపాఖ్యాలను అవలోకనం చేసుకుంటే మమకారం, విరోధం, త్రయీ గుణాలు, ప్రతికూల పార్శ్వాలు మొదలైన వాటితో అధర్మం పైన విజయం సాధించి ఇది ధర్మేతిహాసమే అయింది తప్ప మోక్షేతిహాసం కాలేదని, వాసుదేవ నామ సంకీర్తనమే కానీ వాసుదేవ ప్రాప్తి కాలేదని స్పష్టంగా తమ అభిప్రాయాన్ని ప్రకటించారు సుప్రసన్నగారు. భగవత్సాన్నిధ్యానికి, సాక్షాత్కారానికి మార్గం చూపిందే తప్ప భాగవతం వంటి మోక్ష స్థితి దీనికి కలుగలేదు.
అపురూప పురాణ వాఙ్మయము
పురాణమంటే మతపరమైనదిగానో, కట్టుకథలనో భావించడం పొరపాటు. పురాణానికి వివిధ రకాల నిర్వచనాలున్నాయి. “పురా అపి నవాం” అనేది ప్రసిద్ధం. అమరకోశం ప్రకారం సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితం అనే ఐదు లక్షణాలు కలది పురాణం.
- సర్గం: సృష్టిని, సృష్టి క్రమాన్ని వివరించడం
- ప్రతిసర్గం: సృష్టికి మూల తత్త్వాలను, విస్తరణను తెల్పడం
- వంశం: దేవాసురుల, బ్రహ్మర్షులు, దేవర్షులు, దివ్యుల జన్మక్రమం వివరించుట
- మన్వంతరం: పూర్వకాలాల్లో నశించిపోయిన నాగరికతల్లోని జనుల వృత్తాంతం
- వంశానుచరితం: పృథ్వి మీద ప్రవర్తిల్లిన మానవ నాగరికతా విస్తారాన్ని తెలుపుట.
పురాణం ఏదో ఒక ఉపాసనా పథానికి పరిమితం కాదు. సార్వజనీన లౌకిక ప్రక్రియా విశేషం. అంతేకాదు పురాణంలో అనేక విషయాల విశ్లేషణ ఉండడం వల్ల విజ్ఞానసర్వస్వ లక్షణాన్ని ఏర్పరచుకొంది.
మేడం హెచ్. పి. బ్లావట్ స్కీ రచించిన ‘సీక్రెట్ డాక్ట్రిన్’ అనే మహా గ్రంథం ద్వారా పురా సమన్వయం జరిగేవరకు పురాణాల అంతస్త్వం ప్రపంచానికి అవగాహనకు రాలేదు. ప్రఖ్యాతంగా పురాణాలు మొత్తం
పద్ధెనిమిది అని చెప్పబడుతున్నది. డా. వేదవ్యాస చెప్పినదాని ప్రకారం నష్టమై అలభ్యాలుగా ఉన్న ఉపపురాణాం ముప్ఫయి రెండు ఉన్నట్లు తెలుస్తోంది.
చారిత్రకంగా పురాణ వాఙ్మయం యొక్క ఆవిర్భావ వికాసాలు బౌద్ధమత విజృంభణం తరువాత క్రీ.శ. ఐదారు శతాబ్దాల వరకూ సాగినట్లు తెలుస్తోంది. రాజవంశాల కథనమాధారంగా వీటికి ఈ విభజన చేయడం జరిగింది. కానీ పూర్వక జీవన వ్యవస్థలు, తాత్త్విక దేవతారాధనలు, సృష్టిని గురించిన భావాలు పరిశీలించిన ఆయన వీటి మూలం వేదాలకు సమకాలీనమైనదని నిర్ధారించారు. పురాణాలు కాలక్రమేణా అనేక మార్పులకు లోనై కుంచించుకు పోయినప్పటికీ మహా పురాణాలలో నిక్షిప్తమై ఉన్న సర్వ విజ్ఞాన తత్త్వ గాథా సర్వస్వ లక్షణం చెడకుండా నిలిచి ఉండడాన్ని ఆయన వివరించారు.
పోతన భాగవత తత్త్వం
జానపదుల నుండి విద్వన్మూర్తులవరకు ఆంధ్ర మహా భాగవతానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.
పదిహేను, పదహారు శతాబ్దాలలో భారతదేశంలో భక్తి ఉద్యమం శిఖరాగ్ర స్థాయిలో ఉంది. అదే సమయంలో పదిహేనవ శతాబ్దం మధ్యభాగంలో భాగవతం తెలుగులో అవతరించింది. ఇది సమాజంలోని అన్ని స్తరాలను ప్రభావితం చేసింది. భక్తిధర్మాన్ని నాల్గువైపులా వ్యాపింపజేసింది. సాహిత్య, సంగీత, నృత్య, చిత్రకళలు కొత్త చైతన్యంగా కొత్త రూపంతో సాక్షాత్కరించాయి.
కృష్ణభక్తి దేశమంతటా వర్షించింది. పురందరదాసు, అన్నమాచార్యులు, మీరాబాయి, కబీరు, సూరదాసు, రూప గోస్వామి వంటి ఎందరో భక్త కవులు హరిభక్తి గంగను ప్రవహింపజేశారు.
“కృష్ణస్తు భగవాన్ స్వయమ్” భగవంతుడైన శ్రీమహావిష్ణువు స్వయంగా భూమి మీద అవతరించి చరాచరజగత్తును పునీతం చేశాడు. అటువంటి భక్తి యోగ స్థితిని పొందిన మహాత్ములు శ్రీ శుక మహర్షి. ఆయన వక్తగా భాగవతపురాణం అవతరించింది. అందువల్ల దీనికి ‘పారమహంస్య’ అని పేరు. జ్ఞానంలో వ్యాసాదుల కంటే ముందున్న వాడు. భాగవతంతో సహా పురాణాలన్నీ వ్యాస కర్తృకాలే అయినా ఇందులో శుకమహర్షి వక్తగా ఉండడం విశేషం.
శ్రీ మద్భాగవత పురాణంలో శరణాగతి, తాదాత్మ్యం కేంద్రాలు. పురాణశైలికి భిన్నంగా ఉంటూ కావ్య శైలికి సన్నిహితంగా ఉండడం దీని మరో ప్రత్యేకత.
పురాణాలకున్న పంచ లక్షణాలకే పరిమితం కాకుండా ద్వితీయ స్కంధంలో సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, విస్తరం, ఈశానుచరితం, నిరోధం, ముక్తి, ఆశ్రయం అనే దశ లక్షణాలను భాగవతం పేర్కొంది.
పాంచరాత్ర సంహితల ప్రభావంతో పాటు శాక్త తంత్రాల ప్రభావం, అవధూత శుకుడు ప్రవచించడం ద్వారా అవధూత మార్గం కూడా విస్తృతంగా వివరించడం విశేషం.
పద్యమాధుర్యం చేత భాగవతం ఎంతో ప్రశస్తిని గడిచింది. అనర్ఘమైన నృసింహావతార ఘట్టం, స్వర్గ వర్ణన వంటి సౌందర్యపూరితమైన గద్య రచనలు ఒక లయను అనుసంధానం చేసుకొని ఈశ్వర తత్త్వాన్ని చేరుకునే అలౌకిక సిద్ధిని కలిగిస్తాయని పోతన రచనా మాధుర్యాన్ని వేనోళ్ళ కొనియాడతారు సుప్రసన్న గారు. శ్రీకృష్ణ తత్త్వంలోని అనిర్వచనీయ సత్యాన్ని శిశువుగా, రక్షకునిగా, ప్రియునిగా, సఖునిగా, ప్రాప్తించిన పరమాత్మగా తెలుగు జనులకు దర్శనం చేయించిందని ఆనందపరవశులౌతారు. ఇదే క్రమంలో మరో వ్యాసంలో భాగవత కృష్ణుని లీలా విశేషాలను వర్ణిస్తారు.
‘సమర్చన’లో అన్నమాచార్యుల రమణీయ కవిత్వాన్ని దృశ్యీకరించారు సుప్రసన్నగారు. అన్నమయ్య అపూర్వమైన అలౌకిక పారమార్థిక చింతన ఆంధ్రదేశంలో భక్తి ఉద్యమానికి కనకాభిషేకం చేసింది. అన్నమయ్య వంశంలోని కవులందరూ దేశి మార్గంలో రచనలు చేశారు. తాళ్ళపాక తిమ్మక్క, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, తిరు వెంగళ నాథుడు మొదలగు వంశీయులందరూ భక్తి ప్రపత్తులతో రచనలు చేసి భగవంతుని చరణాలకు పుష్పాలుగా అర్పించారు. వీరి రచనలలో ‘శరణాగతి తత్త్వం’ ప్రధానం.
అన్నమయ్య సాహిత్యానికి శ్రీ వేంకటేశ్వరుడే ఆత్మ. మధుర గాంభీర్యమైన ఆయన రచనలో శృంగార వైరాగ్యాలు రెండు పాయలుగా ప్రవహిస్తాయి. ఆయన వాక్కులలోని వైవిధ్యం, తాత్త్వికత, లాలిత్యం ఇవన్నీ శ్రీ శఠగోపుల పునరావతారంగా భావిస్తారు సుప్రసన్నగారు.
సుప్రసన్నగారి రామరాజ భూషణుని ‘వసుచరిత్ర’ కావ్యానుశీలనం అద్భుతమైంది. మనుచరిత్రలో ఇతివృత్తం కేవలం మన్వంతర గాథ మాత్రమేనని, సృష్ట్యాది వృత్తాంతం, ప్రకృతిలోని కదలికయే ‘వసుచరిత్ర’ లో ఇతివృత్తమని రెండింటి తారతమ్యాన్ని తెలుపుతారు. సృష్ట్యాది వృత్తాంతం, ఇంద్రాది దేవతలు పాల్గొన్న పురాణ గాథ, మర్త్య సమాజం ఈ మూడింటికి లంకె ఏర్పరచి కావ్యసూత్రంలో ముడి వేసినట్లు స్పష్టం చేస్తారు. దీనివల్ల ప్రత్యేక కథా సంవిధానం, మూడు రూపాల్లో వ్యక్తమయ్యే శబ్దం కవికి ప్రత్యేకతను ఆపాదించింది. కావ్యంలో అనేకార్థాల స్ఫూర్తి చేత ఎక్కడికక్కడ అద్భుతమైన లక్షణాన్ని సంపాదించుకొని
మయసభను పోలుస్తూ కవిని ప్రశంసిస్తారు ఆచార్యుల వారు. ఈ కావ్యంలో అనేక చోట్ల రామరాజ భూషణునిలో ఉన్న రహస్య సంగీత పరిజ్ఞానం ద్యోతకమవుతుంది.
అదేవిధంగా ఈ వ్యాసావళిలో ‘పాండురంగ మాహాత్మ్య’ కావ్యాన్ని వర్ణించారు సుప్రసన్నగారు. దీనిలో ఉన్న దేవతా మహిమల ప్రాతిపదికగా
ఉన్నటువంటి స్తోత్రాలు, భక్త గాథలు, వర్ణనలు, ధార్మికచర్చలతో ఒక పురాణఖండంగా అభివర్ణించారు. తెనాలి రామకృష్ణుని రచనా వైభవానికి “పాండురంగ విభుని పద గుంఫనమ” ని ప్రశస్తి. రామకృష్ణ కవి సరసార్థ ఘటనా శక్తి చేత వినూత్న పద కల్పనలో సిద్ధహస్తునిగా ప్రశంసిస్తూ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన కవులలో ప్రత్యేక ఒడుపూ, కవితా వైఖరీ, ప్రకాశనం ఉన్న కొద్దిమందిలో తెనాలి రామకృష్ణులు కూడా ఒకరని సుప్రసన్న గారి భావన.
ఒక క్షేత్ర మహిమ అక్కడికి నిరంతరం వచ్చిపోయే భక్తుల సంకల్పం చేత, తపస్సంసిద్ధి చేత పరివర్ధితమవుతూ ఉంటుంది. ఈ గ్రంథ ప్రారంభం కాశీ నగర వర్ణన నుండి ప్రారంభమవుతుంది. వైష్ణవ క్షేత్ర మహిమను ప్రతిపాదించడానికి మొదటగా శివక్షేత్ర వర్ణనతో ప్రారంభించి శైవ వైష్ణవ సాంప్రదాయాలలోని అంతర్గతమైన ఏకతా సూత్రాన్ని వివరిస్తాడు రామకృష్ణ కవి. పుణ్య క్షేత్ర ఆవిర్భావం ప్రధానంగా స్వర్గ మర్త్యాలకు సంధి బిందువుగా ఏర్పడిందని ఆయన భావన.
ఈ విషయాన్ని వివరిస్తూ క్షేత్రంలో అడుగు పెట్టినప్పటినుండీ ఈశ్వరానుభవం చేతస్సులోకి పొంగుతుందని దైవానికి, క్షేత్రానికి ఉన్న అభేద భావన పారమార్థిక చింతనను ఏర్పరుస్తుందని సుప్రసన్నగారు వెల్లడిస్తారు. ‘పాండురంగ మాహాత్మ్యం’ లో అనేక తీర్థాలు ప్రస్తావించబడ్డాయి. భగవంతుని ఎవరైతే కోరుకుంటారో ఆయన అపార కరుణ వలన వారికి సాధ్యమవుతాడు. ఇది భక్తి సాంప్రదాయ విశిష్టత.
ఈ విధంగా లౌకిక లోకాన్ని ఈశ్వరుని లీలా కైవల్యంగా భావించి లౌకిక పారమార్థిక జీవనాలకు ఒక ప్రకృష్ట బంధం ఏర్పరచిన భక్తి ప్రబంధం తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యం’.
పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ ఆంధ్ర కావ్య జగత్తులో అత్యంత ప్రతిభా సమన్విత ప్రబంధరాజం.
కేవలం కల్పనా కథలు కృత్రిమ రత్నములని సమకాలికులు ఈసడించినా ఈ కావ్యం వాస్తవ, సౌందర్య జగత్తులకు ఒక విలక్షణమైన స్పర్ధను ఏర్పరిచింది. వాస్తవ జగత్తు కావ్య గతమైనప్పుడు దేశ కాల పరిమితులను అతిక్రమించి సాధారణీకరణను పొందుతుందని సుప్రసన్న గారు విశ్లేషించారు.
కళాపూర్ణోదయ కథ కృష్ణుని అవతారమైన ద్వారకాపురంలో ప్రారంభమై సత్యలోకంలోని కాసారానికి ప్రతిబింబమైన కాసారపురంలో ముగుస్తుంది. సర్వ కళా పరిపూర్ణుడైన శ్రీకృష్ణుని నుండి చతుర్ముఖుని భావనకు ప్రతిబింబితమైన కళాపూర్ణుని వరకు కొనసాగి ప్రాతిభాసిక జగత్తు దాకా ప్రయాణం చేసి ఒక వృత్తాన్ని పూర్తిచేసుకుంది. మూడు లోకాలలో సంచరించే చైతన్య ప్రతీక నారదుడు ఈ కథను ప్రవర్తింప జేయడం కూడా సమంజసమంటారు సుప్రసన్నగారు.
కళా పూర్ణోదయంలో దేవ, గంధర్వ, దానవ, మనుజ ఇలా ఎన్నో లోకాలు చిత్రించబడ్డాయి. సుమారు పాతిక ప్రవృత్తులను కావ్యంలో చిత్రించడం విశేషం. వాస్తవము, సౌందర్యశాస్త్ర పరము, తాత్త్విక పరములైన మూడు స్థాయిలలో ఈ కావ్యాన్ని అద్భుతావహంగా నిర్వహించడం సూరన కావ్య కళా నైపుణ్యానికి నిదర్శనం.
శ్రీ అరవిందుల తత్త్వ ప్రభావశీలురైన సుప్రసన్న గారు ఈ వ్యాస సంపుటిలో అరవిందుల మహత్తర రచనా సంవిధానాన్ని అభివర్ణిస్తారు. మహా భారతంలోని సావిత్రి ఉపాఖ్యానాన్ని మూలంగా అరవిందులు రచించిన కావ్యం ‘సావిత్రి’ ఆయన యోగసాధనకు, సాఫల్యానికి, తాత్త్విక దర్శనానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ గ్రంథంలో ప్రపంచంలోని గుప్త విద్యలు, జ్ఞానవిద్యలు, సృష్టి పరిణామం, మానవ పరిణామం, దేవతల, ప్రకృతి రహస్యాలు, అనంతలోకాలు సంపుటీకరించబడి అద్భుత గ్రంథరాజంగా భాసిల్లిందని తెలుపుతారు.
ఆధునిక భారత దేశ చరిత్రలో తత్త్వవేత్తగా, దార్శనికులుగా, ద్రష్టగా, ఋషిగా, మహాయోగిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ అరవిందులు మహాకవి. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాఫల్య దిశగా నడిపించిన యోధుడు. సనాతన ధర్మ వాస్తవిక స్వరూపాన్ని, మంత్రమయ కోశాలలోని నిగూఢ రహస్యాలను వెలికి తెచ్చిన మహానుభావులు అరవిందులు.
ఈ వ్యాస సంపుటిలో ఇంకా ప్రాచీన సాహిత్య వ్యక్తిత్వాలు, సాహిత్య సంప్రదాయాలు, పద్యరచనా విషయం, ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వ చింతన మొదలగు విషయాలను సుప్రసన్నాచార్యులు గారు విపులీకరించారు. విషయమేదైనా లోతైన అధ్యయనంతో కూడిన తాదాత్మ్యత, సందేహాలకు తావివ్వని కూలంకష వివరణ సుప్రసన్న గారి నిశిత పరిశీలనకు నిదర్శనంగా నిలుస్తుంది.
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్‌గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323
