Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవ్య సారస్వతాంబుధి – ‘సమర్పణ’

[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘సమర్పణ’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]

చార్య సుప్రసన్నాచార్యులు గారి రచనా సంవిధానం విభిన్నమైంది. సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదాన్ని, సార్వకాలీన దృక్పథాన్ని, విశ్వలయను అనుసంధానం చేసిన మానవతావాది ఆయన. తాత్త్వికతను, సారస్వతాన్ని మిళితం చేసుకొని జాతీయాభినివేశంతో జీవన సంస్కారం పొందిన ఉదాత్తులు.

ప్రధానంగా సాహిత్యంలో నవ్యత్వాన్ని సాధించిన ఉత్తమ కవిత్వ రోచిస్సులను తరువాతి తరాలకు అందించాలన్న ఆకాంక్షతో మూడు తరాల వైవిధ్య భావ తరంగాలను, వారి సాహిత్య, జీవన విశేషాలను తెలుపుతూ ఈ వ్యాస ‘సమర్పణ’ గావించారు. వివిధ కవివరులు, వేర్వేరు సందర్భాలు, భిన్న ప్రక్రియల విషయాంతరంగాన్ని వివేచన చేస్తూ ముప్పయి ఒక్క వ్యాసావళిగా సమర్పించారు. వీటన్నింటికీ ఏకసూత్రం లేకపోయినా సాహిత్యం, తాత్త్వికత అనే అంతస్సూత్రంలో ఒదిగిపోయాయి. వాటి లోతుల్లోకి ప్రవేశించినప్పుడు అపారమైన జ్ఞాననిధిగా ఆయనను దర్శించగలుగుతాం.

స్వాతంత్య్రం సిద్ధించేనాటికి ప్రబలంగా ఉన్న ప్రగతివాదం రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాభైలలో కుప్పకూలి, నూతన చైతన్యంతో జాతీయభావ, దేశీయ, మానవీయ సంస్కృతులు మూలాంశాలుగా నవ్య సంప్రదాయ ధోరణి కనిపించిన విషయాన్ని ఆయన ఈ వ్యాసారంభంలో ప్రస్తావించారు.

అరవైల నాటికి నవ్య సంప్రదాయం, కుందుర్తి గారి వచన కవిత్వ రూప వాదం, దాశరథి కవితా సంప్రదాయం సమాజాన్ని చైతన్యదిశగా నడిపించాయి. 1970 ప్రాంతంలో అరసం, విరసం లు ఆవిర్భవించి కవిత్వానికి కొత్త రూపునిచ్చాయి. సమాజ పరిస్థితులకు అనుగుణంగా కవిత్వ ధోరణులు వివిధ మార్గాలుగా సాగాయి. మూడు దశాబ్దాలలో తెలుగు కవిత్వం విస్తృత రూపంగా ఎదిగిన క్రమాన్ని ఎన్నో రచనలను ఉటంకిస్తూ వివరించారు సుప్రసన్న గారు. ఆయన ఉద్దేశ్యంలో కవిత్వ సాధనకు లక్ష్యం పరిపూర్ణతా సిద్ధి.

ఆ లక్ష్యం వైపుగానే కళాత్మక ఉపకరణాలన్నీ ప్రయాణించాలంటారు. మానవ జీవితంలోని వివిధ పార్శ్వాలను చిత్రిస్తూ కవి యొక్క ఆర్తి అభివ్యక్తమవ్వడమే కవిత్వపు ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడిస్తారు.

పాశ్చాత్య దేశాల పారిశ్రామిక విప్లవం ఫలితంగా కథన ప్రక్రియలు ఆవిర్భవించాయి. ప్రాచీన కాలం నుండీ ప్రపంచ సాహిత్యంలో అన్ని దేశాలలోనూ ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ‘కథానిక’ ప్రధాన పాత్ర వహించింది. ప్రాచీన కథారూపాలు ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానికలకు ఈనాడు ప్రచారంలో ఉన్న చిన్నకథ, కథానికలకు మౌలికమైన భేదాన్ని గ్రహించారు సుప్రసన్నగారు. అసంక్లిష్ట సమాజంలో నిర్మితమైంది ప్రాచీన కథ అయితే సంక్లిష్ట సమాజంలో నిర్మితమైంది ఈనాటి కథ అంటారాయన. ఇది ఆలోచించాల్సిన విషయం. ఏ కాల పరిణామమైనా సంక్లిష్టతకు లోనవుతూనే ఉంటుంది. సామాజిక వాస్తవాల రూపమే కథ. అలాంటప్పుడు ప్రాచీన కథలో సంక్లిష్టత లేదన్న రచయిత మాటలను పరిశీలించాలి. “మన సాహిత్యానికి ఒనగూడిన నాలుగైదు మేళ్లలో చాలా ముఖ్యమైంది కథానిక” మధురాంతకం రాజారాం గారి మాటలివి. (మహతి- 1972). గురజాడ అప్పారావు, మాడపాటి హనుమంతరావు, చింతా దీక్షితులు, చలం, బాపిరాజు, విశ్వనాథ, మునిమాణిక్యం, నోరి నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, పాలగుమ్మి, రావిశాస్త్రి మొదలుకొని ఈనాటి నవీన్, ఇనాక్, శీలా వీర్రాజు వంటి రచయితలే కాక ముదిగంటి సుజాతారెడ్డి, ఓల్గా వంటి రచయిత్రులు కూడా కథా సాహిత్యాన్ని విస్తృతం చేశారు.

పాశ్చాత్య సాహిత్యం నుంచే కాల్పనిక కవిత్వ సాహిత్య మూలాలు కూడా అవతరించి, మన దేశపు మట్టిలో కూడా అనుభూతి గుత్తులుగా పరిమళించాయి. నాగరీకరణం, మానవ సంబంధాల యాంత్రికీకరణ, ప్రకృతి సంబంధాలు దూరం కావడం, కుటుంబ సంబంధాలు శిథిలం కావడం, పరివ్యాప్తమవుతున్న ప్రేమరాహిత్యం కాల్పనిక కవిత్వోద్యమానికి ప్రధాన కారణాలు. తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణకిరణ కాంతిగా ఈ కవిత్వాన్ని అభివర్ణించారు. రసభావనలో కవిని సంలీనం చేసిన కవిత్వమిది.

ప్రయోగవాదులు చేసిన ప్రయత్నాలకు ఫలితంగా ఆవిష్కరింపబడిన కవిత్వం వచన కవిత. పద్యకవులు కూడా కొంతమంది ఈ మార్గాన్ని అనుసరించారు. శ్రీశ్రీ, కుందుర్తి, దాశరథి, ఆరుద్ర, మాదిరాజు రంగారావు, గోపాలచక్రవర్తి, అరిపిరాల విశ్వం, సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య, వరవరరావు, శీలా వీర్రాజు, దిగంబర కవులు మొదలగు వారు క్రమంగా వచన కవిత్వాన్ని వెలయించారు. వర్తమాన కాలంలో కవులందరూ ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీన్ని కేవలం ఖండకావ్య రచనకే కాకుండా కథా నిర్మాణ యోగ్యమైన కావ్యరూపంగా కూడా పరిణతి చెందాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అనుభూతిపరంగా, ఆలోచన ప్రధానంగా ఈ కవిత్వం మంచి ఒరవడి సృష్టించిందని సుప్రసన్నగారు అభిప్రాయపడ్డారు.

తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవులలో తిరుపతి వేంకట కవులు అసామాన్యులు. “కవనార్థం బుదయించితిన్ సుకవితా కార్యంబె నా వృత్తి” అని చెప్పుకున్న ఘనులు వారు. కొచ్చెర్ల వేంకట కృష్ణారావు ప్రేరణతో వీళ్ళు రచించిన ‘బుద్ధచరిత్రము’ కావ్యాన్ని అవలోకిస్తూ ప్రాచీన ప్రబంధమైనా, అపూర్వ వస్తువు ఇతివృత్తంతో ఆధునిక లక్షణాలున్న కావ్యంగా, వివిధ ఘట్టాలలో ఇందులోని నవ్యతను సుప్రసన్న గారు తెలియజేశారు. సంప్రదాయ సాహిత్యంలోని కొన్ని లక్షణాలను పరిహరించి, ఆధునిక కవిత్వంలోని నూతన అభివ్యక్తిని ఈ కావ్యంలో నిరూపించిన వేంకటకవులు సరళమైన నుడికారంతో తమ అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ఆధునిక యుగంలో తొలి చారిత్రక కావ్యంగా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన కావ్యం.

ఈ వ్యాస సంపుటిలో సుప్రసన్న గారు గురజాడ చైతన్యాన్ని, దానికి దోహదపడిన పరిసరాలు, ఆనంద గజపతి ద్వారా ఆయన కన్యాశుల్క రచనకు ఉపక్రమించడం వంటి అంశాలను వెల్లడిచేస్తారు. గురజాడ దేశభక్తి గీతం దేశస్వాతంత్ర్యాన్ని కోరేదిగా కాక ఆంగ్లేయులు తెచ్చిన ‘నాగరీకరణ’ యుగానికి స్వాగతం పలికినట్లుగా ఉందంటూ కొత్త కోణంలో దాన్ని ఆవిష్కరించారు. సంఘ సంస్కరణ విషయంలో కూడా వీరేశలింగం గారు తన దృక్పథంలో రాజీ పడని వ్యక్తిగా, గురజాడ కంటే కూడా సంఘ సంస్కారిగా ముందు ఎన్నదగిన వాడని నిర్ద్వంద్వంగా స్పష్టం చేస్తారు. కన్యాశుల్కంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కాన్ని నిరసించినప్పటికీ, వితంతు పునర్వివాహ విషయంలో ధైర్యాన్ని చూపకపోవడం, ఆచరణాత్మకంగా నిరూపించలేకపోవడం గమనించవలసిన అంశాలుగా పేర్కొంటారు. మరోవైపు ఆయన రచించిన ‘కన్యక’, ‘పూర్ణమ్మ’ లను గొప్ప గీతాలుగా అభివర్ణిస్తారు. ఈశ్వర భక్తికి సంబంధించిన సంప్రదాయ రూపకాలు కూడా గురజాడ వారి నీలగిరి పాటల్లో స్పష్టంగా గోచరించే విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తారు. ప్రధానంగా వర్ణభేదాలు తొలగి లోకమంతా ఒకే కుటుంబంగా ఉండాలన్నది గురజాడ ఆశించిన సంస్కారమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు.

“మానవుడు ఒంటరియై దిక్కు తోచక కాలచక్రము క్రింద నలిగిపోతూ హాహాకారాలు చేస్తూ ఉన్నాడు. నా శరీరం దానికింద నలిగిపోయినది. ఆ దారిలో రక్తనదములింకినవి. అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమి కన్పడును”. క్రమంగా మానవుడు తన గుర్తింపును కోల్పోయిన సమాజాన్ని చూస్తూ వ్యధ చెందిన విశ్వనాథ వారి మాటలివి. మరో పార్శ్వంలో అవ్యక్త జగత్తుకు, వ్యక్త జగత్తుకు సేతువు నిర్మించాలన్న తపన. దైవాసురసంఘర్షణను చిత్రించడంతో పాటు ఆధునిక సిద్ధాంతాలను పరామర్శించిన కల్పవృక్షం, అసామరస్య, అనాత్మీయ, అమానవీయ ఆధునిక జీవనానికి దర్పణం పట్టిన వేయిపడగలు విశ్వనాథ వారి లోని ఆధునిక దృక్పథాన్ని చాటుతాయి. పాశ్చాత్య చరిత్రకారులు మన చరిత్రను కల్లోలం చేసిన విధానాన్ని ఎదుర్కొనేందుకు “పురాణ వైర గ్రంథమాల”ను రచించారు. సాహిత్యాన్ని స్వీయ ప్రతిభా ప్రకాశనంగానే కాక ఆత్మ సాధకంగా భావించడం ఆయన వ్యక్తిత్వ విశిష్ట లక్షణం. సామాజిక చింతనాపరునిగా తొలి నుండి చివరి రచనల వరకు పరిణామం పొందిన ఆయన ఆలోచనా వైశిష్ట్యాన్ని వివరిస్తారు సుప్రసన్న గారు. ప్రాసక్తికంగా “కవిత్వమంతా లోక విస్తారం – లోకమ్ము లేక రసమ్ము లేదు” అని ఆచరణలో చూపి, జ్ఞాన మూలాల్లోకి ప్రవేశించిన విశ్వనాథ వారిని ‘జ్ఞానపీఠ’ వరించిన జ్ఞాపకాన్నీ పంచుకుంటారు.

ఆధునికాంధ్ర సాహిత్యంలో, భావుకతలో ఎల్లలు దాటి నేల నుండి నింగి దాకా ఎగిసిన కృష్ణశాస్త్రి గారి కావ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ సుప్రసన్న గారు మరో వ్యాస పారిజాతాన్ని అందించారు. భావ తాదాత్మ్యంలో మైమరచిన కృష్ణశాస్త్రి గారు వ్యష్టి నుండి సమష్టిలో లీనమయ్యారు.

“..అడుగిడ లేక నిట్టూర్పు విడువలేక/ పొరలు కన్నీటి కాల్వలు కురియ లేక/ మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట” పరిణామానికి ముందు జీవుడు మోడుగా, రాయిగా నిలిచి ఉన్న దశలో, దుఃఖమయ జగత్తులో మునిగి..”ఎడ తెగని యాత్ర నెట్లొ సాగించు వరకు/ ఎట్లొ నీ దర్శనమ్ము సాధించు వరకు”..అంటూ అంతశ్చేతనం వైపు ఆయన పయనిస్తారు. ఆయన కవిత్వం ఆత్మాశ్రయధోరణిలో సాగినా సమష్టిగా ఈశ్వరగమ్యం కోసం సాగింది.

కృష్ణశాస్త్రి గారు రచించిన అనేక సంగీత రూపకాలలో ఎక్కువభాగం భక్తిప్రధానాంశంగా రూపొందాయి. అనంతమైన ఈశ్వరాన్వేషణ వీటికి ప్రాణాధారం. వస్తు సౌందర్య వర్ణనలతో, విశ్వచైతన్యానికి ప్రతీకలుగా, సంగీతసాగరంలో వాటిని ఓలలాడించారు కవి.

కాల్పనిక కవితా సరస్వతిని కైవసం చేసుకున్న రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటివారి అడుగు జాడల్లో నవ్య సాంప్రదాయ, ప్రగతి వాద ఉద్యమాలకు ఊపిరులూదిన కవివరుల్లో ప్రయోగశీల కవిత్వంతో ఆంధ్రజాతి చరిత్రను ఒక పురాణంగా మలిచిన ఘనత మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారిదే. పురాణ పంచ లక్షణాలలో ‘వంశానుచరిత’ మనే ఏకైక లక్షణాన్ని కలిగి ఉన్న చరిత్ర ఇది. చరిత్రలోని వాస్తవికతకు భంగం వాటిల్లకుండా వ్యక్తుల వ్యక్తిత్వ, శీల నిర్మాణంలో కవికి బాధ్యతతో రసోల్లాసాన్ని కలిగించే నేర్పు కూడా ప్రధానం. తొమ్మిది పర్వాల సమన్వితంగా ఆంధ్రజాతి ఆవిర్భావంతో మొదలై విజయరాఘవుని రాజ్య వైభవం దాకా ఆద్యంతం రసరమ్యంగా ఆవిష్కరించబడింది. సుప్రసన్న గారు”మధునాపంతుల వారి కవితా తేజస్సు” వ్యాసంలో వారి కవితాభిజ్ఞతను శ్లాఘిస్తూ వాల్మీకి, కాళిదాసు, భవభూతి వంటి మహాకవుల తాత్త్విక రసచైతన్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న కవిగా తన రచనలో సృష్టిలోని ఏకాత్మ లక్షణాన్ని గొప్పగా ధ్వనింపజేసినట్లు తెలుపుతారు.

“అరి శిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే!” అనే వ్యాసంలో ‘తిమిరంతో సమరం’ చేసి, ‘రుద్రవీణ’లు మీటి, అగ్నిధారలుగా కురిసిన దాశరథి కవితావైభవాన్ని కట్టెదుట నిలుపుతారు సుప్రసన్న గారు. వికసించిన జాతీయచైతన్యంతో “నా కవితా లతాంతము తృణమ్ములలో నయినన్ సువాసనల్ ప్రాకెడి రీతి పూచినది, పాతదనమ్మును త్రావి తేన్చి నాజూకగు కొత్త వాసనలు చూపినదీ రసికాంధ్ర సాహితీ లోకమునందు” అని రొమ్ము విరుచుకొని చెప్పగలిగిన ధీశాలి. “నేను దుష్టులతో రాజీ పడలేదు. వారితో సామరస్యం నా చేత కాదు. సమరసం కన్నా సమరమే నాకు ఇష్టం” అనడంలో ఆయన భావ తీవ్రత వ్యక్తమవుతుంది. తెలంగాణలోని ప్రతీ అంశం ఆయన కలంలో కవితగా, పాటగా వెలువడింది. ఆధునిక భావనకు ఆయన పద్యం ఆధారంగా నిలిచింది. రవీంద్రుని కావ్య మార్మికత, విశ్వనాథ భావనా పారమ్యం, కృష్ణశాస్త్రి రీతి మాధుర్యం, శ్రీశ్రీ జలపాత కవిత్వ ధోరణుల సంగమమైనప్పటికీ, సాహితీలోకంలో తన పేరును సుస్థిరం చేసుకున్న కవితావతంసులు దాశరథి గారు.

తమకు ఆచార్య చేకూరి రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని, చేకూరి వారి విమర్శనారీతిని ఈ వ్యాస సంకలనంలో పంచుకున్నారు సుప్రసన్న గారు. నిష్కల్మషమైన వాగ్ధోరణి, కవిత్వాన్ని ఆస్వాదించడంలోను, అంచనా వేయడం లోనూ ప్రమాణాలను, హేతువును ప్రధానంగా గ్రహించడం వల్ల చేరా గారి నిశ్చయాలు, వైయక్తికం నుండి సార్వజనీనతకు చేరువయ్యాయి. సాధారణ సాహిత్య వ్యాసాలలో కనిపించని విలక్షణం చేరా గారి వ్యాసాల ప్రత్యేకం. సందిగ్ధానికి తావులేని స్పష్టత, ప్రశంస గానీ, లోపాలను గానీ ఎత్తి చూపడంలో సమతౌల్యత, ముఖ్యమైన లక్షణాన్ని ఆత్మీయంగా చెప్పడం మూలంగా సాహిత్యంలో ఆయన పేరును శాశ్వతం చేసింది. నిశిత పరిశీలన, అనిందా పూర్వక విమర్శ, శాస్త్ర పద్ధతికి తగ్గని పరిశోధన, తెలుగు భాషకు సంబంధించిన అన్ని రంగాలపై ఆయన పరిశోధనలు ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనాలు.

ఇక వచన పద్యమే వ్రతంగా, నిష్ఠగా స్వీకరించిన కవి మాదిరాజు రంగారావు గారు. చాలా కాలం వచన కవిత్వ పరిణామంలో ఆయన కీలకపాత్ర వహించారు. బలంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. మొదట ఆయన రచనల్లో సంస్కృత భాష, సమాస ప్రయోగాలు ఉన్నా తరువాతి కాలంలో వదిలించుకున్నారు. వచన రచనకు ఒక క్రమాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించారు.

ఈ నిర్మాణ క్రమం వల్ల ఒక మొనాటనీ ఏర్పడిందని విమర్శ కూడా ఎదుర్కున్నారు. వచన కవిత్వంలో ముక్తక రచనలు ప్రారంభించింది కూడా ఆయనే. వాచ్య లక్షణం ఉండకూడదన్న విషయాన్ని ముఖ్యంగా భావించి కేవలం సంకేతాల ద్వారానే దాన్ని వ్యక్తీకరించిన కవి రంగారావు గారు. ఆయన మానవ జీవనానుభవంలోని ఏ ఒక్క పార్శ్వాన్ని మాత్రమే కాక అన్ని కోణాలను ఆవిష్కరించారు. “జీవితంలో బాధల నుండి, దుఃఖాల నుండి, హద్దుల నుండి, అజ్ఞానం నుండి, అసంపూర్ణం నుండి, మృత్యువు నుండి ఉన్నత స్థితికై, ఉన్నత దశకై, దివ్య దశకై జరిగే ప్రయత్నాల్లో, సంఘర్షణల్లో విజయమే మానవ లక్ష్యం కావాలి. పరిపూర్ణత సిద్ధించాలి” అని స్పష్టం చేసి మానవజీవన లక్ష్యాన్ని చాటారు.

ఈ వ్యాసావళిలో ఆధునికాంధ్ర కవితా యుగకర్తగా భాసిల్లిన కవి రాయప్రోలు సుబ్బారావు గారు. వారితో తమ ప్రత్యక్ష అనుభూతులను నెమరు వేసుకుంటూ సుప్రసన్న గారు ప్రణవాన్ని, ప్రణయాన్ని సమన్వయించిన రాయప్రోలు వారి కవితా దక్షతను, తెలుగు కవిత్వానికి కొత్త ఊపిరి పోసి, అభినవ కవితా లోకానికి నూతన కవాటాలు తెరిచిన వ్యక్తిగా అభివర్ణిస్తారు. తేటతెలుగులతో, తేటగీతి సొగసులతో, సరళమైన భాషతో కవితా మార్మికతను సాధించి, సుకుమార లావణ్య పద ప్రయోగాలు చేసి, వైవిధ్యాన్ని సాధించిన అనుమాండ్ల భూమయ్య గారిని అంతర్జగద్యాత్రికుడని ప్రశంసిస్తారు.

జపాన్ లో బౌద్ధులు తమ అనుభూతిని చెక్కుకునేందుకు పుట్టిన చిన్న కవితారూపం ‘హైకూ’. ఈ ప్రక్రియలో పెన్నా శివరామకృష్ణ గారు రచించిన ‘ఋతుభ్రమణం’ గురించి వివరిస్తూ అనునిత్యం ధ్యానంలో ఉండే కవితా శిల్పియని కితాబునిస్తారు.

కాలానుగతంగా కవిత్వంలో వస్తున్న పరిణామాల పట్ల సుప్రసన్న గారి సునిశిత పరిశీలనకు ఈ వ్యాసం నిదర్శనం. ఉషశ్రీ గారు, బి.ఎన్. శాస్త్రి గారు, రామా చంద్రమౌళి గారు, నవీన్ గారు మొదలైన వారి సాహిత్య వ్యక్తిత్వాలను ఆయన ఆవిష్కరించిన తీరు అభినందనీయం. సాత్త్వికులైన సుప్రసన్న గారు కవులు, రచయితల సాహిత్య, జీవన విషయాలను విశ్లేషించడంలో వినూత్న మార్గాన్ని సాధించారు.

Exit mobile version