[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘సంబరాల క్రాంతి.. సంక్రాంతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ సూచిక సంక్రాంతి!
భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో
తెలుగువాళ్ళు మాత్రమే కాకుండా
దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో
ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే
సంబరాల వేడుకల శుభసమయం సంక్రాంతి!
గంగిరెద్దుల విన్యాసాలు,
హరిదాసుల సంకీర్తనల శ్రావ్యమైన గానాలు,
తెలుగింటి ఆడపడుచులు
గుమ్మాల ముందు తీర్చిదిద్దిన
అందమైన రంగవల్లులు, పూల మధ్య అందంగా
అలంకారమై నిలిచే గొబ్బెమ్మలు,
సాయంత్రవేళ కుర్రాళ్ళంతా
మేడ పైకి చేరగా గాలిపటాల ఆటలు,
పౌరుషాన్ని ప్రతిబింబిస్తూ
కోడిపుంజులు కాలుదువ్వుతుంటే
కోడి పందాల పోటీలు,
ధాన్యరాశులు ఇంటికి చేరగా
ఆరుగాలం శ్రమించిన రైతన్నల
ఇళ్ళలో సంక్రాంతి లక్ష్మీ దేవి కొలువై ఉండగా..
ఆర్థికంగా ఎదుగుతున్న రైతు..
అన్నదాతగా గుర్తింపు పొందుతూ..
రైతే రాజుగా అందుకుంటున్న గౌరవాలు
సందడంతా పల్లెల్లో వెల్లువై వర్థిల్లుతుంటుంది!
పట్టణ వాసానికి,
ప్లాస్టిక్ ప్రపంచానికి దూరంగా
ప్రజలంతా పల్లెబాట పడుతుంటే..
పిల్ల పాపల కేరింతల నడుమ
అమ్మమ్మ, తాతయ్యలు మురిసిపోతుంటే
సిరులక్రాంతే ఈ సంక్రాంతి!
పల్లెసీమలు దేశ అభ్యున్నతికి
పట్టుగొమ్మలు అన్నట్లుగా
వైభవానికి ప్రతీకలై నిలుస్తుంటే..
సంక్రాంతి హృదయాల నిండా
నింపేను మధుర జ్ఞాపకాల క్రాంతి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.