[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘సంసారంలో సరిగమ! సన్యాసంలో మగరిస!!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
“ప్రతి సంసారిలోనూ ఒక సన్యాసి ఉంటాడు. అలాగే ప్రతి సన్యాసిలోనూ ఒక సంసారి కూడా ఉంటాడు!” అన్నాను ఆనాటి సత్సంగానికి నాందీ ప్రస్తావన చేస్తూ.
“అదేంటి అంత మాట అనేశారు? నీ కంటికి మేమంతా దద్దమ్మల్లా కనిపిస్తున్నామా? నీవు ఏం చెబితే అది నమ్మేయడానికి” ఉక్రోషంగా అడిగాడు డా. కాటమ రెడ్డి.
“గుడ్డులో పిల్ల వుందంటే నమ్మేము! చిన్న విత్తులో మహా వృక్షం ఉందంటే తలలూపాము! అలా అని మరీ వెర్రి వాళ్ళలా జమ కట్టేయకండి!” రిటైర్డ్ ఎంఇఓ సుందర నిత్యానందరావు.
“కూపస్థమండూకం అంటే ఏమిటో తెలుసా మీకు?” ఎదురు ప్రశ్నించాను. ఇద్దరూ మాట్లాడలేదు
“నాకు తెలుసు. నూతిలోని కప్ప.” టక్కున చెప్పాడు నూలు నారాయణ.
“అవును. ఆ కప్పను ఈ జగత్తు వైశాల్యం ఎంత అని అడిగితే.. ఈ నుయ్యంత! అని చెబుతుంది. అలాగే మీరూను. ఈ హద్దుల్లోంచి బయట కొచ్చి పరిశీలించండి. సన్యాసులు దాని ముసుగులో దాగివున్న సంసారులు కనిపిస్తారు.” అన్నాను
“ఎలాగో వివరించండి.” అడిగాడు నూలు నారాయణ.
“గృహస్థులకు ఇల్లు ఎలాగో సన్యాసులకు మఠము లేదా ఆశ్రమము అలాగే! గృహస్థులకు పుత్ర మిత్రాదులు ఎలాగో సన్యాసులకు శిష్యులూ భక్తులూ అలాగే! ఇకపోతే పశువులు, భూములూ ఉభయులకూ సమానమే! సంసారి ‘నా యిల్లు, నా భార్య, మై పెట్’ అంటాడు. సన్యాసి ‘నా ఆశ్రమం, నా శిష్యులు, నా గోశాల’ అంటాడు. అంతే తేడా!” వివరంగా చెప్పా ను.
“మరి.. నిజమైన సన్యాసిని ఎలా గుర్తించాలి శాంతి రెడ్డి గారూ?” అడిగారు నూలు నారాయణ
“చూడగానే వాడు సన్యాసా లేక సన్నాసా అనేది చెప్పడం కష్టం! కొంత కాలం గమనిస్తే తెలుస్తుంది. కాషాయము లేదా ఎరుపురంగు వైరాగ్య జ్వాలకు ప్రతీక. ఎవ్వనిలో కోరికలు – లాలసలు జ్వాల వలె దగ్ధమౌతున్నాయో అతడే సన్యాసి!
మనస్సును వివేకం అనే అగ్నితో ప్రజ్వలింపజేసిన యెడల యోగి తప్పక బ్రహ్మపదం చేరుకోగలడు. వచ్చే వారం మన సత్సంగంలో నా అనుభవంలో వున్న అనేక విషయాలు వివరిస్తాను. అప్పుడు మీ సందేహాలు పటాపంచలై పోతాయి.” చెప్పాను.
“ఇప్పుడు నేనడిగే ప్రశ్నకు తెలిసిన వాళ్ళు జవాబు చెప్పండి. సమాధి అంటే ఏమిటి?” అడిగాను.
“ఏ చైతన్యంలో సంకల్పములు పుడుతున్నాయో అదే చైతన్యంలో అవన్నీ విలీనం కావడమే సమాధి.” చెప్పారు ఇంజనీరు సూర్యనారాయణ గారు.
“ఒక ఉదాహరణ చెప్పండి?” నూలు నారాయణ.
“కెరటాలు సముద్రంలో పుట్టి అందులోనే విలీనం అయినట్టు.” చెప్పారు సూర్యనారాయణ గారు.
“వాట్ ఈస్ ఇగ్నోరెన్స్? హౌ టూ రియలైజ్ ఇట్?” ఇంగ్లీష్ అప్పారావు ప్రశ్న.
“సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ టైమ్‌లెస్. నౌ అండ్ హియర్. ఇగ్నోరెన్స్ ఈస్ ఆల్సో టైమ్‌లెస్ బట్ దెన్ అండ్ దేర్! యు మెడిటేట్ టూ నో ఇట్ వెల్!” చెప్పాను.
“నౌ ఏ డేస్ మెడిటేషన్ బికం ఫ్యాషన్ టూ ఎవిరీబడీ! వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ హిప్నోటిజం అండ్ సెల్ఫ్ రియలైజేషన్?” అడిగాడు ఇంగ్లీష్ అప్పారావు.
“ఆల్ హిప్నోటిక్ ఎఫెక్ట్స్ ఆర్ టెంపోరరీ. రియలైజేషన్ ఆఫ్ ది ఎటర్నల్ సెల్ఫ్ ఈస్ నాట్. ది ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డిహిప్నోటైజింగ్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ అవర్ అటాచ్మెంట్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్. దిస్ ప్రాసెస్ లీడ్స్ టు ది ఫైనల్ రీడిస్కవరీ ఆఫ్ ది అన్కండీషన్డ్ సెల్ఫ్!” చెప్పాను.
“కర్మ – జ్ఞానంల తేడా ఏమిటి?” గౌతమ్ చైతన్య ప్రశ్న.
“నీకు నీవు తెలియక పోతే కర్మ. నీకు నీవు తెలిస్తే జ్ఞానం.” చెప్పాను.
“సంసారం గురించి వివరంగా చెప్పండి. సంసారి బ్రహ్మజ్ఞానానికి అర్హుడా? కాదా?” రొంగల భారతమ్మ ప్రశ్న.
“మీకు ఒక కథలా చెబుతాను. ఒక తల్లి పక్షి దాని పిల్ల పక్షి ఒక చెట్టు కొమ్మపై విశ్రాంతిగా వున్న సమయంలో ఆకాశంలో చాలా ఎత్తులో ఒక ఆకారం ఎగురుతూ కనిపించింది. అది విమానమని వాటికి తెలియదు. మరో పక్షి అనుకుంటున్నాయి. ‘ఎందుకా పక్షి అంత కంగారుగా ఎగురుతుంద’ని పిల్ల పక్షి తల్లిని అడిగింది. దానికి సమాధానంగా ‘సరిగా చూడు! దాని తోకకు నిప్పంటుకుంది. పొగ కూడా వస్తుంది. అందుకే అంత కంగారు దానికి’ అని చెప్పింది. సంసారం కూడా అగ్ని వంటిదే! సంసారం ఒక కల లాంటిది. మరో ఉదాహరణ.
ఒక కుక్కకు ఎండిపోయిన ఎముక దొరికింది. దాన్ని అలా కొరగ్గా.. కొరగ్గా తన దవడ లేక నాలుక పొరబాటున కొరుక్కోవడంతో కొంచెం రక్తం వస్తుంది. ఆ రక్తం ఆ ఎముక నుండే వస్తుంది అనే భ్రమతో చాలా ఆనందంగా ఆస్వాదిస్తుంది. అలాగే సంసారం నుండి లభించే సుఖాలు మాయాజనితమే కానీ సత్యం కాదు.” వివరించాను.
“అసలు సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి? అడవుల్లోనో పర్వత గుహల్లోనో ఉండాలా? ఇప్పుడు దేశంలో చలామణిలోనున్న మఠాలు – ఆశ్రమాల గురించి చెప్పండి.” అడిగారు నూలు నారాయణ.
“ఇప్పుడు నడుస్తున్న మఠాలు, ఆశ్రమాలలో చాలా వరకూ మార్కెట్ లోని దుకాణాలతో సమానం. దాతల భయం-బలహీనతల వల్ల విరాళాలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని వేల ఆశ్రమాలు-మఠాలు నడుస్తున్నాయి. బ్రహ్మజ్ఞానం దిశగా నడిపించే ఆశ్రమాలు చాలా అరుదుగా వున్నాయి. మనిషి జన్మించినపుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు. తర్వాత తల్లిదండ్రుల ఆసక్తి వల్ల, ఉపాధ్యాయుల వల్ల, భాషల వల్ల, కాలం వల్ల, పరస్పర విరుద్ధ భావజాలం వల్ల కలుషితం అవుతాడు. ఈ విమర్శ నుండి వేదాంత గురుకులాలను, ఆశ్రమాలను కూడా మినహాయించలేము. ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగినా.. ఆత్మజ్ఞానం కలుగదు. నామరూప, కాలరూప, దేశ బుద్ధులతో మమేకమైవున్న వారికి ఎప్పటికీ బ్రహ్మజ్ఞానం కలుగదు. అన్నిటికీ అవకాశం ఇచ్చి దేనితోనూ సంగం కలిగి ఉండని ఆకాశం చాలా గొప్పది. ఆకాశం కంటే గొప్పది ఒక్కటే. అదే ‘సత్యం’. అలా నిప్పులా నిగ్గు తేలాలి సన్యాసి. కోరికలు-భయాలు లేని వాడికి ఏ ఉపాసనల తోనూ అవసరం ఉండదు.” వివరంగా చెప్పాను.
“అన్నీ వున్న ఈ జగత్తులో లేనిదేమిటి?” భారతమ్మ ప్రశ్న.
“ఎండమావిలో నీరు లేనట్టే ఈ జగత్తులో జాతి, కుల, గుణ, మత రహితమైన ఆనందం లేదు.” మా సువర్ణ జవాబు చెప్పింది.
“చిత్రంగా వుందే.. ఈ జగత్తు ఉన్నట్టా? లేనట్టా?” తిరిగి ప్రశ్నించింది భారతమ్మ.
“జగత్తు ఉందనిగాని.. లేదని గానీ చెప్పలేము. నీవు చూస్తే వుంటుంది. చూడకపోతే వుండదు.” సువర్ణ జవాబు.
“అదెలా?” భారతమ్మ.
“అందరూ తాము జగత్తులో వున్నామని భ్రమపడతారు. ధ్యాన సాధన చేస్తే తెలుస్తుంది జగత్తే తమ లోపల ఉందని!” సువర్ణ లక్ష్మి.
“మతానికీ వేదాంత శాస్త్రానికి తేడా ఏమిటి?” బ్రహ్మచారిణి శ్రీలక్ష్మీ చైతన్య.
“మతం దేవుణ్ణి నీ నుండి దూరంగా తీసుకు పోతుంది. వేదాంత శాస్త్రం దేవుడు నీ లోపలే వున్నాడని బోధిస్తుంది. ‘జ్ఞాత ఆత్మః ఈశ్వరః!’” సువర్ణ లక్ష్మి.
“సర్వం దుఃఖం అన్నాడు బుద్దుడు. అలా ఎందుకన్నాడు రెడ్డిగారూ?” అడిగాడు డా. కాటమ రెడ్డి.
“నిజాన్నీ.. నిజం కాని దాన్నీ కలగాపులగం చేయడమే జీవితం లోని దుఃఖమునకు కారణం. సూర్యునిలో పగలు – రాత్రి ఉన్నట్టు ఎలా భ్రమపడతారో అలాగే ఒక మనిషి మరో మనిషిని ‘భార్య- భర్త, తల్లీ-తండ్రి, కొడుకు-కూతురు, అత్త-మామ అని భావిస్తాడు. అవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పరమ సత్యాలు కాదు. ఈ భ్రమలు మనసులో కలుగుతాయి. మనసు యొక్క మరో పేరే అజ్ఞానం.” పంచ భ్రమలు వివరించి ఆ రోజు సత్సంగం ముగించాను.
***
ఆ రోజు ఆదివారం. ఆశ్రమవాసులంతా దక్షిణామూర్తి వటవృక్షం ఛాయలో సత్సంగానికి హాజరైనారు. పీఠం అధిపతి మాతా సద్విద్యానంద సరస్వతి కూడా ఆ రోజు సత్సంగానికి వచ్చారు. సంసారుల్లోని సన్యాసుల గురించి, సన్యాసుల లోని సంసారుల గురించి నేను ఆ రోజు వివరించాల్సి వుంది. అందుకే అందరి లోనూ ఒకటే ఉత్కంఠ!
నేను గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాను.
“సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం।
అస్మదాచార్య పర్యంతం వందేగురు పరంపరాం॥
నేనూ, మా సువర్ణా ఈ దేశం గర్వించదగ్గ సన్యాస మహాత్ముల వద్ద వేదాంత శాస్త్రం చదువుకొన్నాము. మాకు ఆ మహాత్ములంటే పూజనీయమైన భావం. వారిలో స్వామీ తత్త్వవిదానంద సరస్వతి, స్వామీ పరమార్థానంద సరస్వతి, స్వామీ బ్రహ్మ విద్యానంద, స్వామినీ వినమ్రానంద సరస్వతి ప్రముఖంగా పేర్కొనదగినవారు. వారు మాకు నిత్యస్మరణీయలు! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మా విమర్శలు విని మీరు అపార్థం చేసుకోకూడదని. సన్యాస మహాత్ములంటే మాకు ఎంత గౌరవమో, సన్యాసిగా నటించే ‘సన్నాసు’లంటే అంతే అసహ్యం! వారు గోముఖ వ్యాఘ్రములే! అటువంటి వారి గురించి అందరూ ముఖ్యంగా తత్త్వ జిజ్ఞాసులు జాగరూకులై వుండాలనేదే మా ఉద్దేశం! ఇటువంటి వంటి వారి వల్ల మన హిందూ మతానికి, సనాతన ధర్మానికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మన ఆంధ్రాలో సన్యాసులకు సన్నాసులకు పెద్ద తేడా తెలియదు కానీ, ఋషికేశ్ లాంటి యాత్రా స్థలాల్లో కొంత కాలముండి గమనిస్తే చాలా ప్రస్పుటంగా తెలుస్తుంది!
ఆ సంవత్సరం శివరాత్రి వెళ్లిన మరునాడు నేనూ, సువర్ణా ఋషీకేశ్ యాత్ర కెళ్ళాము. రెండు నెలలు అక్కడే గడపాలనేది మా సంకల్పం. మునీ కీ రేతీలో వున్న కోవిలూరు వేదాంత మఠంలో కుటీరం దొరికింది. స్వామీ దయానంద ఆశ్రమానికి దీనికీ సరిహద్దు గోడే హద్దు. మా అదృష్టం కొద్దీ పరిచయమైన స్వామీ వాసుదేవానంద గారి ఆశీస్సులతో మాకు భోజన సదుపాయం దయానంద ఆశ్రమంలో ఏర్పాటయ్యింది. అదే సమయంలో అక్కడ స్వామీ తత్త్వ విదానంద క్యాంపు జరుగుతుంది. ఉపదేశ సహస్రి చెబుతున్నారు. ఆ క్లాసులకు మా ఇద్దరినీ అనుమతించడంతో ఆనందంగా హాజరయ్యే వారము. క్లాసు లేని సమయాల్లో గంగా తీరం లోనూ, నగర వీధుల్లోనూ చక్కర్లు కొడుతూ గమనించేవారము.
ఒకరోజు గంగా తీరంలో ఒక ముసలి సన్యాసి ఎదురైనాడు. అతని చేతిలో ఒక ఖాళీ కంటి అరుకు సీసా వుంది. మా దగ్గర కొచ్చి అది కొనుక్కోడానికి సహాయం అడిగాడు. నేను జేబులోనుండి ఇరవైనోటు తీసి ఇవ్వబోయాను. అతను తీసుకోలేదు. అతని చేతిలోని సీసా మీద వున్న ఎం.ఆర్.పి. చూపించాడు. రూ. 297/- అని వుంది. మాకు అతనికీ మధ్య వున్న సమస్య భాష. నాకెందుకో అతనికి సాయం చెయ్యాలనిపించింది. మూడు వంద నోట్లు ఇచ్చాను. అవి తీసుకొని అతను మూడు రూపాయ కాసులు నా చేతిలో పెట్టి ధన్యవాదములు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీపరులు, అమాయకులు ఉన్నారా అన్న నా సందేహానికి జవాబు రెండు రోజుల్లోనే దొరికింది.
ఒకరోజు సాయంత్రం మేము రామ ఝాలా దాటిగంగ అవతలి ఒడ్డునున్న గీతా భవన్ పుస్తకశాలలో కొన్ని పుస్తకాలు కొని బయటకు వచ్చేటప్పటికి అక్కడే వున్నాడు ఆ సాధువు. అతని చేతిలో ‘అదే’ కంటి అరుకు సీసా! అది చూపిస్తూ అడుక్కుంటున్నా డు. మమ్మల్ని చూసి కలవర పడ్డాడని అనిపించింది. మా వద్దకు రాకుండా దూరంగా తొలగిపోయాడు ఆ సన్యాస వేషం వేసుకున్న యాచకుడు! మేము అక్కడున్న రెండు నెలలలో కనీసం పదిసార్లు వివిధ ప్రాంతాల్లో తారసపడ్డాడు, అదే ‘సీసా’ చూపించి అడుక్కొంటూ! యాచనకు అతను ఎన్నుకున్న మార్గం అది. ఏ యాత్రీకుడు ఋషీకేశ్లో రెండు రోజులకంటే ఎక్కువ ఉండరనేది అతని మార్గము లోని బలం అయితే.. అప్పుడప్పుడూ మాలాంటివారు తారసపడటం అతని మార్గంలోని అడ్డంకి! మే గాడ్ బ్లెస్ హిం. అతను సన్యాసా? లేక సన్యాసి వేషం వేసుకున్న సంసారా? మీరే ఆలోచించండి!” అంటూ ఒక నిముషం ఆగాను. కొద్దిగా నీరు తాగాను.
“ఒకరోజు ఉదయం పదిగంటలు. ఆకాశం మేఘావృతమైవుంది. టీ తాగాలన్పించి కుటీరం బయట కొచ్చాము. స్వామీ స్వతంత్రానంద ఆశ్రమం గేటు పక్కన ఒక సాధువు వద్ద యాభై గొడుగులు వున్నాయి. పంచిపెడుతున్నాడనుకొన్నాం. దగ్గరకు వెళ్ళాకా తెలిసింది అమ్ముతున్నాడని! ‘చూడండి సార్! బజారులో రెండు వందలుంటుంది. నా దగ్గర వంద మాత్రమే!’ అంటున్నాడు.
చాలా మంది యాత్రీకులు కొనుక్కొంటున్నారు! మేము గమనిస్తున్నాము. ఎవరో ఏదో అడిగితే వారితో – ‘పావుగంటలో ఇవి అమ్మేస్తాను. తర్వాత నా కూడా రండి. మీకు కావాల్సినవి నా కుటీరంలో దొరుకుతాయి’ అంటున్నాడు.
నా మరో ప్రక్కనున్న వారి మాటలు నా చెవిని తాకాయి – ‘ఇవన్నీ వీరికి భండారాల్లో దక్షిణగా లభించినవి. అమ్ముకుంటున్నాడు’. పావుగంటలో గొడుగులన్నీ అమ్మేసిన ‘సన్యాస వ్యాపారి’ – ‘మేరా సాథ్ ఆయీయే సాబ్’ అన్నాడు. మేము కూడా అనుసరించాము. సాయి మందిర్ ప్రక్కన వున్న శ్రీరామ్ ఆశ్రమం లోని తన కుటీరానికి తీసుకెళ్లాడు. అక్కడున్న వస్తువులు చూసి మేమొక పెద్ద షో రూంలో అడుగుపెట్టిన ఫీలింగ్ మాకు కలిగింది. రగ్గులు, రజాయ్లు, మంకీకాప్స్, గ్లోవ్స్, స్వెట్టర్లు.. ఒకటేమిటి భండారాలలో సాధువులకు వితరణ చేసే ప్రతీ వస్తువు అక్కడుంది. ఎవరికి కావాల్సినవి వారు సెలెక్ట్ చేసుకుంటున్నారు.
అది సన్యాసం ముసుగు వేసుకున్న వ్యాపార సంస్థ! మేము బయటకు వచ్చేసాము. పక్క కుటీరంలో చక్రపాణి అనే ఒక బ్రహ్మచారిణి పది సంవత్సరాలుగా మౌన దీక్షలో ఉండి సాధన చేస్తుందని తెలిసి దర్శనం చేసుకుందామని లోపలికెళ్లి నమస్కరించాము. ఆశ్చర్యం! ఆమె చేతిలో ఒక ఐఫోను. వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ చాలా బిజీగా వుంది. పక్కనే రెండు లాప్‌టాప్‌లు ఆన్ చేసి వున్నాయి. ఒక పక్క రఫ్ పాడ్ల కట్ట వుంది. ఒక పాడ్ అందుకొని ‘ఏం పని మీద వచ్చారు?’ అని హిందీలో రాసి మాకు చూపించింది. ‘మీ దర్శనం కోసం’ అంటూ ఒక వంద రూపాయలు దక్షిణగా సమర్పించి బయట పడ్డాము. ఆమె మౌనం నోటికేగానీ మనసుకు కాదు. ఇలాంటివారు మౌనం యొక్క మానాన్ని కూడా చెరుస్తున్నారు. వీరు సంసారుల కంటే ఏమీ తక్కువ కాదు! మరో రోజు ప్రక్కనే వున్న జ్ఞాన కార్తారు ఆశ్రమంలో స్వామినీ విద్యానంద గిరి వేదాంతం క్లాస్ ఉందని తెలిసి వెళ్ళా ము. ఇంకా క్లాస్ మొదలు కాలేదు. మా వెనుక సీట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘ఇప్పుడు ప్రవచనం చేయబోయే మాతాజీది తమిళనాడు. వేదాంత శాస్త్రంలో పట్టభద్రురాలు అయ్యాక కూడా, ఒకటి విఫలమయ్యాకా మరోటి చొప్పున మూడు సార్లు వివాహం చేసుకున్నారు. మూడో వివాహం కూడా ఫెయిల్ అయ్యాక నాలుగోసారి వివాహానికి బదులుగా ‘సన్యాసం’ తీసుకున్నారు. ఇక్కడ వేదాంత టీచర్‌గా స్థిరపడ్డారు. ఒక చిత్రమేమిటంటే.. ఆ మూడో వరుసలో కూర్చున్న నాలుగో వ్యక్తి చంద్రు ఈ మాతాజీ యొక్క రెండో భర్త. ఈనాడు అతను శిష్యుడు ఆమె గురువు! విధిలీలలు అలాగే ఉంటాయి.’
సన్యాస సంప్రదాయమా వర్ధిల్లు అనుకుంటూ లెక్చర్ హాల్ నుండి బయటికి వచ్చేసాము.
ఋషీకేశ్లో అన్నీ వదిలేసి సన్యాసం తీసుకొన్న సన్యాసులకు ఒక అసోసియేషన్ వుంది. దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ మొదలైన ఆఫీస్ బేరర్స్ వుంటారు. అక్కడ మొత్తం నాలుగు వందల ఆశ్రమాలు వున్నాయి. ఏ ఆశ్రమంలో భండారా జరిగినా ప్రెసిడెంటుకు తెలియజేస్తే సాదువులనూ, బ్రహ్మచారులను ఏర్పాటు చేస్తుంటాడు. ప్రెసిడెంట్ నామం ‘చిత్ ఘనానంద సరస్వతి’. ఒక్కో రోజు కనీసం పది ఆశ్రమాల్లో భండారా వుంటుంది. అలాంటప్పుడు ఆశ్రమాలకు టైమింగ్ కేటాయిస్తారు. మునీ కీ రేతిలో వున్న ఆశ్రమానికి 11 గంటలకూ, త్రివేణి ఘాట్ లోని ఆశ్రమానికి 12 గంటలకు, స్వర్గాశ్రమ ప్రాంతంలో 1 గంటకు, లక్ష్మణ ఝాలా ప్రాంతములో 2 గంటలకూ కేటాయిస్తారు. ఒకే రోజు ఇన్ని చోట్లకు భండారాలకు హాజరవ్వాలంటే పాపం ఎంత కష్టం! అందుకే కొంతమంది సాధువులకు కార్లు, చాలా మందికి కనీసం మోటార్ బైక్ వుంటుంది. ఏ ఆశ్రమంలో స్వీట్ బావుంటుందో, ఎక్కడ కూర, సాంబారు ఎలా ఉంటాయో ముందే వారికొక ఐడియా వుంటుంది కాబట్టి ఎక్కడ ఏది తినాలో ఎంచుకోవడం సులువుగా ఉంటుంది. ఇంతటి బిజీ షెడ్యూల్ వుండే ఈ సాధు పుంగవులకు ‘బ్రహ్మ నిష్ఠ’, ‘ఆత్మ జ్ఞానం’ లాంటి మాటలు వినడం కాస్త మింగుడుపడని వ్యవహారం! అజ్ఞాన తిమిరమా వర్ధిల్లు! వర్ధిల్లు!!”
గొంతు సవరించుకొని చెప్పడం మళ్ళీ మొదలెట్టాను.
“సన్యాసుల్లో వున్న సంసారుల గురించి నేను చెప్పిన వాస్తవ ఘటనలు చాలనుకొంటున్నాను. ఇక సంసారుల్లోని సన్యాసుల గురించి కొద్దిగా చెప్పి ముగిస్తాను. ఆ రోజు నేనూ మా సువర్ణా గ్రంథాలయంలో స్వామీ రామతీర్థ సారస్వతం తిరగేస్తున్నాం. అప్పుడక్కడికి వచ్చాడు బోళాశంకరుడు అని మనమంతా పిలుచుకొనే కోలా సత్యనారాయణ. అతనొక బహు సంసారి.”
“రెడ్డిగారూ! నిన్న మాతాజీ ఒక మాటన్నారు. దాని అర్థం ఎంత ఆలోచించినా నా ఈ మట్టి బుర్రకు తట్టడం లేదండి” అన్నారు.
“ఏమన్నారు?” అడిగాను.
“నిరంతరం మారిపోయే దాంట్లో మారనిది ఒకటుంది అన్నారు. అదేంటండీ?” కోలా సత్యనారాయణ.
“అది మీరే!” అన్నాను.
“నేనా?.. అదెలా?” అడిగారు.
“మీరు చిన్నప్పటి నుండీ ఇప్పటి వరకూ ఎన్నో మార్పులు చెంది, ఈ రూపంలో ఇలా వున్నారిప్పుడు. మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఎన్నో వికారాలు చెందుతూ వున్నాయి.
ఇన్ని మార్పులు ప్రతీ క్షణం జరుగుతున్న మీలో ఏ మాత్రం మార్పు లేని ‘మీరు’ వున్నారు. ‘నేనున్నాను’ అనే ఎరుకే ‘అహం అస్మి’! అదే మీ స్వరూపం! క్షణ క్షణం మారిపోయేవాటిని ‘నేతి – నేతి’ విచారణలో నిషేధించుకుంటూపోతే మిగిలేది అదే సచ్చిదానందం. అదే నామ రూపాలకు అతీతమైన మీరు.” చెప్పాను.
“చాలా బాగా చెప్పారండి! మీ దంపతులిద్దరు వచ్చే ఆదివారం కాకినాడ మా ఇంటికి భోజనానికి రావాలండి.” అంటూ ఆహ్వానించాడు.
“ఏంటి విశేషం?” అడిగాను.
“మా పెద్దబ్బాయి ప్రసాదు కూతురు స్పందన స్విమ్మింగ్ ఛాంపియన్. యీ మధ్య తమిళనాడు ఆక్వాటిక్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ‘పాక్ జలసంధి’, అంటే శ్రీలంక తలైమన్నారు నుండి ధనుష్కోటి వరకూ రాత్రి సమయంలో ఈది రికార్డు నెలకొల్పింది. ఆ అకేషన్ సెలెబ్రేట్ చేసుకోడానికి మా కుటుంబ సభ్యులంతా కలుస్తున్నారు. మీ దంపతులు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలండి. కాదనకండి. మా పెద్దోడు కారు పంపిస్తాడండి.” అన్నారు.
ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన లోని సంసారిదే పైచేయి. ‘మా ఇంటికి’, ‘మా పిల్లలు’, ‘మా పెద్దబ్బాయి’ అంటున్నాడు.
“సరే లెండి.” అంటూ ఆయన ఆహ్వానాన్ని ఒప్పేసుకున్నాము.
అనుకున్న రోజున ఆయనింటికి కాకినాడ భోజనానికి వెళ్ళాము. గుమ్మంలోనే ఎదురొచ్చాడు.
“ఆయ్! రండి! ఈ ఇల్లు నేను కట్టలేదండి. ఈశ్వరుడు నా చేత కట్టించాడు. వీళ్లందర్నీ కూడా ఈశ్వరుడే నాకిచ్చాడండి. వీళ్ళల్లో నలుగురు నన్ను ‘నాన్న’ అంటారు. నల్గురు ‘మావయ్యా’ అంటారు. ఈ పిల్లలంతా ‘తాతయ్య’ అంటారు. అసలు నేను ఏమిటి? ఎవరు తెలుసుకోవాలనే మీలాంటి తత్త్వవేత్తలుండే ఆశ్రమానికొచ్చి వుంటున్నానండి.” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు.
కర్తృత్త్వ, భోక్తృత్త్వములు లేనట్టు మాట్లాడే ఈ మనిషి సంసారి ఎలా అవుతాడు?
అందరూ భోజనానికి కూర్చున్నాము. కోడళ్లిద్దరూ వడ్డిస్తున్నారు. ఆయనలోని బోళాశంకరుడు నిద్ర లేచాడు.
“ఈ సాంబారు, చక్ర పొంగలి, బూర్లు సుబ్బయ్య హోటల్ నుండి తెచ్చారు. ఈ గుత్తివంకాయ కూర, పప్పు – మామిడికాయ, వడియాలు చిట్టెమ్మ మెస్ నుండి తెచ్చారు. ఈ పొడులు – పచ్చళ్ళు సర్పవరం సన్యాసమ్మ మెస్ నుండి తెచ్చారు. ఆ కాజాలు కోటయ్యవీ, పూతరేకులు అభిరుచివి, అదిగో మల్లెపువ్వులా మెరిసిపోతుంది వైట్ రైస్ ఆవూ దూడా బ్రాండ్ మన ఇంట్లోనే మా కోడళ్ల చేతి వంట! ఈ రోజుల్లో అతిథులకు భోజనం పెట్టడం ఎంత సులువో!” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. వారి కోడళ్ల చురచుర చూపుల్ని గానీ, అబ్బాయిల నిస్సహాయ దృక్కులను గానీ పట్టించుకోకుండా! – శ్రీ కోలా సత్యనారాయణ అలియాస్ బోళాశంకరుడు.
“ఇప్పుడు చెప్పండి ఈ మహా సంసారికీ, ఋషీకేశ్ లోని భండారా సన్యాసులకు తేడా ఏమిటి?” అడిగాను.
ఎవ్వరూ మాట్లాడలేదు. బ్రహ్మచారిణి శ్రీలక్ష్మీ చైతన్య అందుకుంది.
“మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుః సహోదరః।
అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత జాగ్రత॥
– స్వస్తి –