[‘సంస్కరణశీలి గురజాడ’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
“దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్”
అన్న సంస్కరణ వాది, అభ్యుదయవాది గురజాడ అప్పారావుగారు. 1862 సెప్టెంబర్ 30వ తేదిన విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో జన్మించారు. బెంగాలీ భాషకు రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా, తెలుగు భాషను ప్రజలకు దగ్గర చేర్చిన మహానుభావుడు గురజాడ అప్పారావుగారు. ఆంధ్రభాషా సాహిత్యములలో రెండుసార్లు పెను మార్పులు సంభవించాయి. ప్రాచీనకవుల రచనా విధానం దాదాపు 800 సంవత్సరాల కాలం ఒకే పంథాలో నిరాటంకంగా సాగిపోయింది. 1862లో గురజాడ జన్మించి తెలుగు సాహిత్యం రూపురేఖలను మార్చివేశారు. తెలుగు సాహిత్యాన్ని వ్యవహారిక భాషా విధానం వైపు నడిపించిన నవయుగ వైతాళికుడిగా కీర్తింపబడిన మహాకవివతంసుడు. వీరు వచన సాహిత్యంలోనే కాక ముత్యాలసరాలు అను ఒక కొత్త మాత్రాఛందస్సుకు రూపకల్పన చేసిన స్రష్ట.
పద్య, వచన, వచనకవిత్వ రచనలలో విప్లవాత్మకమైన మార్పుకు సృష్టికర్త అయ్యెను.
సాహిత్యం అనేది అంతస్తుల భేదంతో కాదని మానవుడు తన నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చర్చించినప్పుడే సాహిత్య ప్రయోజనం సిద్ధించునన్నది వారి వాదన. ఆనాడు సమాజంలో స్త్రీలను చాలా తక్కువగా చూసేవారు. ఆడదంటే అణిచివేయాలి, అణిగి మణిగి ఉండాలి అన్న భావనలకు చరమగీతం పాడాయి గురజాడ వారి రచనలు. కేవలం సాహిత్యంలో మాత్రమే కాకుండా సమాజంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంఘసంస్కర్త గురజాడ అప్పారావుగారు.
ఆయన రచనలలో స్త్రీల సమస్యలకు సంబంధించినవి ఎక్కువ. స్త్రీల సమస్యలను అనేక కోణాల్లో పరిశీలించి సంస్కరించిన మహోన్నత వ్యక్తి. కన్యాశుల్కము, బాల్య వివాహాలు, వేశ్యా వృత్తి, వేశ్యల వివాహ సమస్య, వృద్ధులకు చిన్న పిల్లలనిచ్చి వివాహం చేయడం ఫలితంగా కలిగే వైధవ్యాలు వాటి వలన జరిగే వ్యభిచారాలు వీటన్నిటినీ ఎత్తి చూపిన సమాజాన్ని నిలదీసిన సంస్కరణ శీలి గురజాడ అప్పారావుగారు. సమాజంలో ఇటువంటి దుష్కృత్యాలు పోవాలంటే స్త్రీలకు విద్య అవసరమన్నారు. స్త్రీలు ఆత్మరక్షణ కోసం ఆయుధధారణ చేయవచ్చని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు ప్రతిరూపాలే ఆయన కలం నుంచి జాలువారిన కన్యాశుల్క నాటకము, దిద్దుబాటు కథానిక, పూర్ణమ్మ, కన్యక వంటి అనర్ఘ రత్నాలు.
ఆయన రచనలలో దిద్దుబాటు మొదటి కథానిక. ఇందులో నాయిక కమలిని. వేశ్యా సంపర్కానికి అలవాటు పడిన భర్తను తన తెలివితేటలతో తనవైపు తిప్పుకోవడమే కాక భర్త తప్పును సున్నితంగా తెలియచెప్పిన సహనశీలి.
పూర్ణమని 10 సంవత్సరాల పిల్లని 60 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చిన పెళ్ళి చేసినప్పుడు మొగుడు తాతయ్యని తోటి వయస్సు వారి గేలి చేయగా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళుతూ కొలను ఒడ్డున కల దుర్గను కొలవటానికి వెళ్ళిన పూర్ణమ్మ మరలా ఇంటికి తిరిగి రాలేదని చెప్పటంలో ప్రతీకాత్మకంగా వర్ణించటం గురజాడవారి రచనా శైలికి శిఖరాయమానము.
ఇక కన్యాశుల్కం నాటకంలో డబ్బు కోసం కక్కుర్తి పడే అగ్నిహోత్రావధానుల్ని మోసపుచ్చే నెపంతో గిరీశం ఆయన కూతురు బుచ్చమ్మను మాయం చేస్తాడు. వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ మధురవాణి తన తెలివితేటలతో గిరీశం చేతుల్లో మోసపోకుండా బుచ్చమ్మను కాపాడుతుంది. ఇది కేవలం విద్యవలన మాత్రమే సాధ్యమన్నది కవి ఆలోచన. పండుముదుసలికి పూర్ణమ్మనిచ్చి వివాహం చేయగా, తండ్రిని ఎదిరించలేక, వివాహాన్ని అంగీకరించలేక దుర్గను చేరిన అమాయకురాలు పూర్ణమ్మ. ఆమెలోని దుఃఖాన్ని, ఆలోచనలతీరును అత్యంత ఆర్ద్రతతో కవి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
రాచరికపు అహంకారంతో
“పట్టవలె రా దీనిని బలిమిని
కొట్టవలె రా మరుని రాజ్యం”
అని రాజు కన్యకని తన వశం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తన అభిమానాన్ని కాపాడుకోవటానికి గుడి ముందర అగ్నిగుండాన్ని ఏర్పరిచి
“పట్టమేలే రాజు వైతే పట్టు నన్నిపుడు”
అంటూ అగ్నికి ఆహుతి అవుతుంది కన్యక. ఎక్కడైతే కన్యక ఆత్మాహుతి చేసుకుంటుందో అక్కడే ఆ రాజు, రాజ్యం సమస్తము మట్టి పాలవుతాయి. పరస్త్రీపై వ్యామోహంతో ప్రవర్తించేవాడు రాజైన పతనం కాక తప్పదన్న సత్యాన్ని నిరూపించిందీ సన్నివేశం.
అనాదిగా మనకు రామాయణ, మహాభారతాలలో కూడా అదే చెప్పబడింది. సీతాదేవిని అవమానించిన రావణాసురుడు, ద్రౌపదిని ఇడుములపాలు చేసిన దుర్యోధనాదులు సమస్తము వారి వంశాలతోసహా నాశనం అయినారు కదా!
18వ శతాబ్దిలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం వేశ్యా జీవితం, సాంఘిక కట్టుబాట్లతో సంప్రదాయ వాదుల చేతులలో మగ్గిపోతున్న స్త్రీల దుస్థితిని పట్టించుకున్న వారు లేరు. గురజాడవారు ఆ బాధ్యతను స్వీకరించి నానాటికి క్షీణిస్తున్న వివాహ వ్యవస్థలో విడాకుల ఆవశ్యకతను తెలియ చెప్పారు. నాలుగు గోడల మధ్య నలిగిపోతూ, పురుషుల వంచన లోబడే అమాయక స్త్రీలకు ఆనాటి వారి రచనలు ఒక కించుక మార్గదర్శకాలు అయినాయి. మారుతున్న సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సాహిత్యంలో స్థానం కల్పించి, స్త్రీ విద్యావంతురాలైనప్పుడు మాత్రమే సమాజాన్ని ఎదుర్కొని నిలబడగలదు అని వారి రచనల ద్వారా సూచించారు.
సంప్రదాయవాదులైన పురుషుల దౌర్జన్యాల నుంచి స్త్రీ తనను తాను రక్షించుకొనే స్వయంసిద్ధంగా ఎదగాలన్నది వారి ఆకాంక్ష. ఆనాడు కందుకూరి, గురజాడ వంటి మహానుభావులు ఎందరో స్త్రీల అభ్యున్నతి కోసము ఎంతగానో చేసిన కృషే నేటి మహిళ అన్ని రంగాలలో పురోగతిని సాధించడానికి పునాది అని చెప్పవచ్చును. 150 సంవత్సరముల కిందటే చెప్పిన “ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరాస్తుంది” అన్న గురజాడవారి మాటలు అక్షర సత్యాలు. అందుకే “కవిః క్రాంత దర్శిః” అన్నమాటలు వేదవాక్యాలుగా చెప్పబడ్డాయి.
గురజాడవారు తమ రచనలలో హాస్యము, సంస్కరణము, సామాజికదృక్పథము మూడింటిని సమపాళ్ళలో మేళవించిన అసమాన ప్రతిభామూర్తి. అందుకే శతవసంతాలు గడిచినా జనజీవనంలో చిరంజీవులుగా నిలిచి ఉన్నాయి. ఏ కాలానికైనా వారి మాటలు ఆదర్శప్రాయము, అనుసరణీయము.
