[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ఈ నెల, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘పెళ్ళికానుక’ సినిమాను విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]
సి. వి. శ్రీధర్ తమిళ, హిందీ, తెలుగు చలనచిత్రరంగంలో ప్రముఖ దర్శకుడు. వెండితెర మీద ముక్కోణపు ప్రేమకథలకు ప్రాణంపోసిన అద్వితీయ కళాకారుడు శ్రీధర్. సినిమా కథ యెంత విషాదభరితంగా వున్నా ప్రేక్షకుని మనసు ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించడం ఆ దర్శకునికి వెన్నతో పెట్టిన విద్య. అతని పూర్తి పేరు చిట్టుమూరు విజయ రాఘవన్ శ్రీధర్. పుట్టింది జూలై 22, 1933 న నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా, మధురాంతకం వద్ద గల నెల్వోయి గ్రామంలో. శ్రీధర్ తండ్రి విజయరాఘవులు, తల్లి తాయారమ్మ. వారిది నెల్లూరుకు చెందిన పదహారణాల తెలుగు రెడ్ల కుటుంబం. చెంగల్పట్టు లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శ్రీధర్ చదువుకున్నాడు. తమిళ చలన చిత్ర రంగంలో అభ్యుదయ రచయితగా గుర్తింపు పొందిన ‘చిత్రాలయ’ గోపు (అసలు పేరు టి. ఎ. సదాగోపన్) శ్రీధర్‌కు సహవిద్యార్థి మాత్రమే కాదు, మంచి మిత్రుడు కూడా. శ్రీధర్ ఏడవ తరగతి చదువుతున్నప్పుడే గోపు సహకారంతో నాటకాలు రాసేవాడు.
తన పద్దెనిమిదవ యేట.. అంటే 1951లో శ్రీధర్ ‘లచ్చియావతి’ అనే ఒక కథను రాసి, ఆ కథను మద్రాసులోని ఎ.వి.యం ప్రొడక్షన్ కార్యాలయానికి వెళ్ళి వినిపిస్తే, ఆ సంస్థలోని సీనియర్ దర్శకుడు పి. నీలకంఠన్ ఆ కథను త్రోసిపుచ్చాడు. అయితే ‘అవ్వయ్’గా పిలిపించుకునే ప్రముఖ రంగస్థల, సినీ నటుడు టి.కె. షణ్ముగంకు ఆ కథ యెంతగానో నచ్చింది. అదే కథను శ్రీధర్ చేత ఒక నాటకంగా రూపొందించి ‘రత్తపాశం’ అనే పేరుతో ఆ నాటకాన్ని మద్రాసు నగరంలో వివిధ వేదికల మీద రక్తి కట్టించాడు. అంతేకాదు శ్రీధర్‌ను వేదిక మీదకు రప్పించి ప్రేక్షకులకు పరిచయం చేయసాగడంతో, చిత్ర పరిశ్రమ దృష్టి శ్రీధర్ వైపు మరలింది. ఈ నాటకాన్ని అదే పేరుతో తమిళంలో సినిమాగా నిర్మించగా అదికూడా విజయవంతమైంది. ఎ.వి.యం సంస్థ ఇదే చిత్రాన్ని హిందీలో ‘భాయిభాయి’ అనే పేరుతో 1956లో పునర్నిర్మించగా అక్కడ కూడా సినిమా విజయాన్ని సాధించింది. హిందీ సంగీత దర్శకుడు మదన్ మోహన్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే శ్రీధర్ కు మంచి కథకుడుగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పేరు వచ్చింది. తరువాత ‘ఎదిర్ పరదట్టు’ చిత్రానికి కథ సంభాషణలు రచించిన శ్రీధర్ కథ, సంభాషణల రచయితగా ‘ఎంగల్ వీట్టు మహాలక్ష్మి’, ‘యార్ పయ్యా’, ‘మంగళ్ మహిమై’, ‘పునర్జన్మం’ వంటి అనేక తమిళ చిత్రాలకు రచన చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మాతలు కృష్ణమూర్తి, గోవింద రాజన్ లతో కలిసి వీనస్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి ‘అమరదీపం’, ఉత్తమ పుతిరన్’ చిత్రాలకు కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. అదే బ్యానర్ మీద నిర్మించిన ‘కళ్యాణ పరిశు’ చిత్రంతో శ్రీధర్ దర్శకుడిగా ఎదిగారు. ‘కళ్యాణ పరిశు’ చిత్రం 25 వారాలకు పైగా ఆడి అద్భుత విజయం సాధించింది. దర్శకుడుగా అతని విజయ పరంపరకు సోపానమైంది. తరవాత తెలుగులో అదే చిత్రాన్ని ‘పెళ్లికానుక’గా నిర్మించి తెలుగు సినీ ప్రేక్షకుల మన్నన పొంది శ్రీధర్ మరో విజయం సాధించారు. ‘పెళ్లి కానుక’ చిత్రం 29 ఏప్రిల్ 1960 న విడుదలై స్వర్ణోత్సవం జరుపుకుంది.
వీనస్ పిక్చర్స్‌లో సహ నిర్మాతగా కళ్యాణపరిశు:
1956లో తన మిత్రులు టి. గోవిందరాజన్, ఎస్. కృష్ణమూర్తిలతో కలిసి ‘వీనస్ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి ‘ఉత్తమ పుతిరన్’, ‘అమరదీపం’ చిత్రాలకు రచయితగానే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. 1959లో శ్రీధర్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్యాణ పరిశు’. వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతతోబాటు శ్రీధర్ ఆ చిత్రానికి సహనిర్మాతగా కూడ వ్యవహరించారు. సినిమా సంభాషణల రచనలో శ్రీధర్‌కు ‘చిత్రాలయ’ గోపు సహకరించగా, పాటల సాహిత్యాన్ని పి. కల్యాణసుందరం అందించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా శ్రీధర్ ప్రముఖ గాయకుడు ఎ.ఎం రాజాకు అవకాశాన్ని కలిపించారు. ‘కళ్యాణ పరిశు’ చిత్రంలో జెమిని గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు, తంగవేలు, బి. సరోజాదేవి, సి.ఆర్. విజయలక్ష్మి, నంబియార్ నటించారు. ఈ సినిమా ఒక ముక్కోణపు ప్రేమకథ. ఈ సినిమాకు శ్రీధర్ మిత్రుడు ‘చిత్రాలయ’ గోపు కామెడీ ట్రాక్ తీర్చిదిద్దారు. బ్లూ మ్యాట్లు, కంప్యూటర్ గ్రాఫిక్‌లు వంటి సాంకేతికత లేని ఆ రోజుల్లో వెండితెరపై దృశ్యాలను వర్ణరంజితం చేసిన విశిష్ట సాంకేతిక నిపుణుడు విన్సెంట్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు.
ముక్కోణపు సినిమా కథ టూకీగా:
ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకే వ్యక్తిని ప్రేమించడం, తనను చదివించి పెద్దచేసిన అక్కకోసం చెల్లెలు త్యాగం చేసి, హీరోను ఒప్పించి పెళ్లిచేయడం; వారికి కలిగిన కుర్రవాడిని చెల్లెలు పెంచడం; అక్క మంచమెక్కి మరణించడంతో హీరో తన పిల్లవాడిని చెల్లెలు దంపతులకు పెళ్లికానుకగా ఇచ్చి దూరతీరాలకు వెళ్లిపోవడం టూకీగా ఈ సినిమా కథ. ఇందులో విజయకుమారి, సరోజాదేవి అక్క చెల్లెళ్ళు (గీత, వాసంతి)గా నటించగా హీరో (భాస్కర్) గా జెమిని గణేశన్ నటించాడు. తంగవేలు ఎం. సరోజ కామెడీ పాత్రలు పోషించారు. సుబ్బులక్ష్మి అక్కచెల్లెళ్ల తల్లి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు వాసంతి పనిచేసే ఆఫీసు అధిపతి రఘుగా నటించారు. తమిళంలో మంచి ఫాలోయింగ్ వున్న అక్కినేనికి ఈ పాత్ర ఇవ్వడానికి ముఖ్య కారణం. లక్ష రూపాయల బడ్జట్‌లో ఈ తమిళ చిత్రాన్ని శ్రీధర్ పూర్తిచేశారు. ఈ సినిమాలో విలన్ లేడు. పైగా పాత్రలన్నీ సహృదయం కలిగినవే కావడం విశేషం. ‘కల్యాణ పరిశు’ సినిమా ఏప్రిల్ 9, 1959 న విడుదలైంది. ఆదేరోజు భారీ బడ్జెట్‌తో శివాజీ గణేశన్ నటించిన ‘నల్ల తీర్పు’ సినిమా కూడా విడుదలైంది. అయినా ఆ పోటీని తట్టుకొని ‘కల్యాణ పరిశు’ చిత్రం 25 వారాలు ఆడి రజతోత్సవం చేసుకుంది. ఈ సినిమా 100వ రోజు ఆడిన సందర్భంగా ఇందులో నటించిన తంగవేలు, ఎం. సరోజ మదురై మురుగన్ కోవెలలో పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఈ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఈ సినిమా బి. సరోజాదేవికి, సంగీత దర్శకుడిగా ఎ.ఎం రాజాకి బ్రేక్ ఇచ్చింది. ‘కల్యాణ పరిశు’ చిత్ర విజయంతో శ్రీధర్ ‘చిత్రాలయ పిక్చర్స్’ పేరుతో సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పి తరవాతి కాలంలో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ‘కల్యాణ పరిశు’ చిత్రాన్ని తెలుగులో ‘పెళ్లికానుక’ (1960) గా, హిందీలో రాజ్ కపూర్, వైజయంతిమాల జంటగా ‘నజరానా (1961) గా, మలయాళంలో ‘సమ్మానం’ (19 75) గా పునర్నిర్మించారు.
‘పెళ్లి కానుక’గా తెలుగులో..:
‘కల్యాణ పరిశు’ చిత్రాన్ని తెలుగులో ‘పెళ్లికానుక’గా వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీదే ఎస్. కృష్ణమూర్తి, టి. గోవిందరాజన్, సి.వి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో శ్రీధర్, ‘చిత్రాలయ’ గోపు సంభాషణలు రాయగా తెలుగు వర్షన్‌కి ఆచార్య ఆత్రేయ సంభాషణలు సమకూర్చడంతోబాటు ముఖ్యమైన పాటలు రాసారు. స్క్రీన్‌ప్లే శ్రీధర్ రూపొందించారు. విన్సెంట్ ఛాయాగ్రహణం, ఎ.ఎం. రాజా సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం తయారయింది. హీరో భాస్కర్‌గా అక్కినేని నాగేశ్వరరావు నటించగా వాసంతిగా బి. సరోజాదేవి, ఆమె అక్క గీతగా కృష్ణకుమారి నటించారు. తమిళంలో అక్కినేని నాగేశ్వరరావు పోషించిన రఘు పాత్రను ‘పెళ్లికానుక’లో జగ్గయ్య పోషించారు. కామెడీ పాత్రల్లో సత్యంగా రేలంగి, అతని భార్య కాంతంగా గిరిజ నటించారు. విజయా వారి ‘పాతాళ భైరవి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సీనియర్ నటి మాలతి అక్కచెల్లెళ్ల తల్లిగా నటించింది. ఇది అక్కినేనికి 82వ సినిమా. అక్కినేనితో కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం కూడా!
రాజా మెప్పించిన తెలుగు పాటలు..:
ఇక్కడ ఎ.యం. రాజా గురించి చెప్పుకోవాలి. రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంది. తొలినుండి రాజాకు స్వంతంగా స్వరకల్పన చేయాలనే ఆశ ఉండేది. చివరకు ఆ ఆశ పొన్నలూరి బ్రదర్స్ నిర్మించిన ‘శోభ’ చిత్రంతో తీరింది. కానీ రాజాను ఒక గొప్ప సంగీతదర్శకునిగా నిలబెట్టిన చిత్రాలు ‘కళ్యాణ పరిశు’, `పెళ్లికానుక’. దీని వెనుక ఒక చిన్న కథ కూడా వుంది. ఒకసారి రాజా శ్రీధర్‌తో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీధర్ తను దర్శకత్వం నిర్వహించబోయే మొదటి సినిమాకి సంగీత దర్శకుడిగా రాజాని తీసుకుంటానని మాటిచ్చాడు. ఆ అవకాశం ‘కళ్యాణ పరిశు’తో కలిసివచ్చింది. అలా ‘పెళ్లి కానుక’ చిత్రానికి కూడా ఎ.ఎం.రాజానే సంగీత దర్శకునిగా నియమించారు. ఈ చిత్రంలో రాజాకు సహాయకుడిగా పనిచేసిన సెబాస్టియన్ తదనంతర కాలంలో శంకర్ జైకిషన్‌లకు సహాయకునిగా స్థిరపడ్డారు. ‘పెళ్లికానుక’ చిత్రానికి కథ ఎంత ప్రాధాన్యమో, ఆ కథలోని భావోద్వేగాలను ప్రేక్షకుల మనసుల్లోకి తీసుకెళ్లడంలో పాటలకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఆ పాటలకు ఎ.ఎం. రాజా సమకూర్చిన బాణీలు ఈ చిత్రానికి చిరస్థాయిని కలిగించాయి. పాటలన్నింటినీ ఒకే తరహా సంగీత పద్ధతిలో కాకుండా, సందర్భానికి తగిన రాగఛాయలను, పాశ్చాత్య వాద్యాలను, హిందుస్తానీ ప్రభావాలను, సున్నితమైన వాద్య విన్యాసాలను కలిపి రాజా రూపొందించడం ఈ చిత్ర ప్రత్యేకత.
అలరించిన రాజా పాటలు:
ఈ చిత్రంలో మొత్తం 8 పాటలున్నాయి. వాటిని విడివిడిగా చూస్తే ఎనిమిది. కానీ సినిమా కథతో కలిపి వింటే అవి ఒకే భావకథకు ఎనిమిది అధ్యాయాలుగా భావించాలి. అన్ని పాటలూ సందర్భానికి ప్రతిరూపాలుగా నిలిచేవే! గీతరచన, సంగీత సమన్వయానికి ఈ పాటలు అధ్యయన వస్తువులుగా పరిగణించవచ్చు. పాటలు వింటూ వాటిని విశ్లేషిస్తే ఆ పాటల సాహిత్య విలువలు, వాటి చిత్రీకరణలో దర్శకుని ప్రతిభ మనకు తెలుస్తాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చిన శ్రీధర్, తెరమీద ఆ పాటల నడకను అమర్చడంలో అతను చూపిన నైపుణ్యం వలన ప్రతి పాట కథను సహజంగా ముందుకు తీసుకెళుతుంది. ఇదే శ్రీధర్ స్క్రీన్‌ప్లే గొప్పతనం. పియానో , సితార్ వంటి వాద్యాలను భావ వ్యక్తీకరణకు ఉపయోగించడం; మోహన–కళ్యాణి, మాండ్, శివరంజని, రాగేశ్రీ వంటి విభిన్న రాగఛాయలను కథా సందర్భాలకు అనుగుణంగా మలచడం.. ఇవన్నీ కలిసి ‘పెళ్లికానుక’ సంగీతానికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి. అందుకే ఆరు దశాబ్దాల తరువాత కూడా ‘పెళ్లికానుక’ పాటలు వింటే మనకు కేవలం పాట వినిపించదు – ఒక పూర్తి సినిమా మనసులో మళ్లీ ఆడుతుంది.
(1) వాడుక మరచెదవేల, నను వేడుక చేసేదవేల, నిను చూడని దినమూ నాకొక యుగమూ, నీకు తెలుసును నిజమూ
గానం: ఎ.ఎం. రాజా, పి. సుశీల- రచన: ఆచార్య ఆత్రేయ
ఈ పాట ‘పెళ్లికానుక’లో ప్రేమ చిగురించే దశకు ఒక అందమైన దృశ్యరూపం. సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి క్రమం తప్పకుండా సైకిళ్లపై వెళుతూ కలుసుకునే సందర్భంలో ఈ పాట వస్తుంది. అందువల్ల “వాడుక” అనే పదానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన కథాసందర్భం ఉంది. ప్రతిరోజూ కలుసుకోవడం ఒక అలవాటుగా మొదలై, ఆ అలవాటు క్రమంగా ప్రేమగా మారుతుంది. “నిను చూడని దినము నాకొక యుగము” అని రాజా పాడితే, సుశీల “నిను చూడని క్షణము నాకొక దినము” అని స్పందించడం ద్వారా ఆత్రేయ ప్రేమలో కాలం ఎలా మారిపోతుందో చమత్కారంగా చెప్పారు.
“సంజ రంగుల చల్లని గాలుల, మధుర రాగము మంజుల గానము, తేనె విందుల తీయని కలలూ మరచిపోయిన వేళా ఇక మనకీ మనుగడ ఏలా” అంటూ ప్రకృతినీ ప్రేమానుభూతిలో భాగం చేశారు. సైకిల్‌పై సాగే దృశ్యానికి చల్లని గాలి, సంజరంగులు, తేనె రంగుల కలలు, కలసి మెలసిన కన్నులలో మనసును చూడడం వంటి ప్రతీకలు జతకావడంతో పాటకు చలనశీలమైన రొమాంటిక్ వాతావరణం ఏర్పడింది. “ఎంతటి ఆశలు వున్నా హద్దు కాదనగలనా” అనే సంస్కారవతమైన భావాన్ని హీరోయిన్ చేత పలికించి ఆత్రేయ ఈ పాటను అర్థవంతం చేసారు. తొలుత తమిళ పాట చిత్రీకరణ కోసం సరోజాదేవి సైకిలు నడపటం నేర్చుకుంది. ఆ అభ్యాసం తెలుగు పాట చిత్రీకరణలో ఉపకరించింది. ఇద్దరూ సైకిళ్ళను వేగంగా నడుపుతూ ఒక ఇసుక తిన్నె మీద పడిపోయినప్పుడు రాబోయే చరణం మధ్యలో వినిపించే ఇంటర్లూడ్ రాజా సంగీత ప్రతిభకు అద్దం పడుతుంది. ఈ పాటను యదుకుల కాంభోజి ఛాయతో, పహాడీ హిందుస్తానీ ప్రభావంతో సాగే బాణీగా రాజా స్వరపరచారు.
(2) కన్నులతో పలకరించు వలపులు – ఎన్నటికీ మరువరాని తలపులు, రెండూ ఏకమై ప్రేమే లోకమై నా మది పాడే పరాధీనమై
గానం: ఎ.ఎం. రాజా, పి. సుశీల- రచన: ఆరుద్ర
ఇది ప్రేమను మాటలకంటే ముందుగా చూపులతో వ్యక్తం చేసిన అత్యంత సున్నితమైన యుగళగీతం. “కన్నులతో పలకరించు వలపులు, ఎన్నటికీ మరువరాని తలపులు” అంటూ పల్లవిలోనే ప్రేమకు ఒక కొత్త నిర్వచనం చూపారు. ప్రేమికులు మాట్లాడుకోకపోయినా వారి కన్నులు మాట్లాడతాయి. ఆ పలకరింపులు తరువాత జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఈ పాటకు ప్రత్యేకమైన సంగీత విశేషం ప్రారంభంలోనే వినిపించే పియానో ప్రీల్యూడ్. పాట మొదలయ్యే ముందు రాజా వినిపించిన ఆ పియానో బిట్ పాటకు ఒక ప్రత్యేకమైన మూడ్‌ను సృష్టిస్తుంది. గాత్రం ప్రవేశించేలోపే ప్రేమభావాన్ని వాద్యం పరిచయం చేస్తుంది. ఇది రాజా ఆర్కేస్త్రైజేషన్ లోని సున్నితత్వానికి మంచి ఉదాహరణ. ఈ గీతం శంకరాభరణ స్వరపరిమితిలో మాండ్ రాగ ఛాయతో సాగుతుంది. మాండ్ రాగంలోని హిందుస్తానీ లలితత్వం, పియానో వినియోగం, పాటకు ఒక ప్రత్యేకమైన ఆధునిక ప్రేమగీత రూపాన్ని ఇచ్చాయి.
(3) పులకించని మది పులకించు – వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు.. గానం మనసునే మరపించు
గానం: జిక్కి- రచన: ఆచార్య ఆత్రేయ
ఈ పాటను కృష్ణకుమారి మీద చిత్రీకరించారు. సాహిత్యపరంగా, సంగీతపరంగా అత్యంత విశిష్టమైన పాటల్లో ఇది ఒకటి. రాగానికి పులకించని మదిని పులకింపజేసే శక్తి, వినిపించని కథను వినిపింపజేసే శక్తి వున్న విషయాన్ని ఆత్రేయ కృష్ణకుమారి అంతరంగం ద్వారా తెలియజేసారు. రాగం అనురాగాన్ని ఒలికించగలదని, దానితో రక్తికి బీజం పడుతుందనే భావాన్ని అక్కినేనికి వినిపించేలా తన మనసులో అంకురించిన ప్రేమను పాటలో ‘ఐ లవ్ యు’ అని చెప్పడానికి ఇది సంకేతం. ఈ పదాల అనుసంధానం ఆత్రేయ కవితా నైపుణ్యానికి నిదర్శనం. వాడిపోయిన పైరు నీరు అందితే నర్తిస్తుంది. కూలిపోయిన తీగ కొమ్మను ఆశ్రయించి మళ్లీ పైకి ప్రాకుతుందని, అలాగే ప్రేమించిన మనసుకు కోరుకున్న తోడు దొరికితే వలపు కురుస్తుందని.. జీవంలేని దానికి జీవం పోస్తుందనే భావాన్ని ప్రకృతి ఉపమానాలతో చెప్పడం ఈ పాటకు గొప్ప సాహిత్య బలాన్ని చేకూర్చింది. ఈ పాటతో కృష్ణకుమారి తనను ప్రేమిస్తున్నదనే విషయం అక్కినేనికి సూత్రప్రాయంగా తెలుస్తుంది. సన్నివేశాన్ని మలుపు తిప్పే పాట ఇది. ఈ పాటకు మోహనకళ్యాణి స్వర నిర్మాణం ఒక విశేష ప్రయోగం. ఈ పాటలో రాజా వినిపించిన సితార్ బిట్స్ మరొక విశేషం. ఈ పాటలో రాజా వినిపింపజేసిన సితార్ బిట్లు అప్రయత్నంగా మన చేతి వ్రేళ్ళను రిథమిక్‌గా కదిలింపజేస్తాయి. ఆ సితార్‌ను కేవలం అలంకార వాద్యంగా కాకుండా, పాటలోని “పులకింత”కు స్వరరూపం ఇచ్చే వాద్యంగా ఉపయోగించారు. జిక్కి గాత్రంలోని మృదుత్వం ఈ పాటకు మరింత వలపు తెచ్చింది. గానం గురించి రాసిన పాటను జిక్కి గానం చేయడం కూడా ఒక అందమైన అంతర్గత సారూప్యత. పాట మొదటి చరణంలో గానాన్ని, రెండవ చరణంలో ప్రేమను ఆత్రేయ ప్రతిబింబింప జేశారు.
(4) అక్కయ్యకు సీమంతం, చక్కని బావకు ఆనందం- ఊరంతా ఉత్సాహం, వచ్చారు అందరూ పేరంటం
గానం: పి. సుశీల, ఎస్. జానకి మరియు బృందం – రచన: ఆచార్య ఆత్రేయ
‘పెళ్లికానుక’ సినిమాలో ఇది సంపూర్ణ కుటుంబ ఆనందాన్ని ప్రతిబింబించే గీతం. “అక్కయ్యకు సీమంతం, చక్కని బావకు ఆనందం, ఊరంతా ఉత్సాహం, వచ్చారు అందరూ పేరంటం” అంటూ ఒక ఇంటి శుభకార్యాన్ని మొత్తం ఊరి ఆనందంగా ఆత్రేయ మలిచారు. సీమంతం వంటి సంప్రదాయ కుటుంబ వేడుకను పాటలోకి తీసుకురావడం వల్ల అప్పటి తెలుగు కుటుంబ జీవన విధానం, ముత్తైదువుల సందడి, బంధువుల కలయిక, సామూహిక ఆనందం అన్నీ తెరపై సజీవంగా కనిపిస్తాయి. ఈ పాటలో సుశీల, జానకి స్వరాల పరస్పర స్పందన, సందర్భానుగుణమైన వాద్య విన్యాసం పాటకు సామూహిక ఉత్సవ వాతావరణాన్ని ఇచ్చాయి. అక్కినేని పెళ్ళికానుకగా జగ్గయ్య, సరోజాదేవి దంపతులకు ఇవ్వబోయే కానుకగా మగపిల్లవాడు మరో మూడు నెలలలో పుడతాడని, పసిడి కొండలాగా ఇంటిలో వెలగనున్నాడని ఆత్రేయ రాబోయే కథా సన్నివేశాన్ని ఈ పాటలో ప్రేక్షకులకు ముందుగానే తెలియజేసారు. ఆ వెలుగే రాబోయే “ఆడేపాడే పసివాడ ఆడేనోయి నీతోడ” అనే పాటకు నాందీ ప్రస్తావనగా, ఆ వెలుగే దీపావళి సంబరానికి సంకేతంగా ఆత్రేయ ముందుగా చెప్పడం ఈ పాట గొప్పదనం.
(5) ఆడే పాడే పసివాడా – ఆడేనోయి నీ తోడా, ఆనందం పొంగేనోయీ దీపావళీ, ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా
గానం: పి. సుశీల- రచన: చెరువు ఆంజనేయశాస్త్రి (కార్తీక్)
ఈ హ్యాపీ సాంగ్‌ను తన శిష్యుడు ఆంజనేయ శాస్త్రి చేత ఆత్రేయ వ్రాయించడం; తను విషాద వర్షన్‌కు రచన చేయటం ప్రత్యేకత. చెరువు ఆంజనేయ శాస్త్రి ఈ సినిమాకు సహాయ దర్శకునిగా కూడా పనిచేయడం విశేషం. తమిళ చిత్రానికి శ్రీధర్ స్నేహితుడు గోపు హాస్య సంభాషణలు సమకూర్చితే, పెళ్లి కానుక చిత్రానికి ఆంజనేయ శాస్త్రి కామెడీ ట్రాక్ రాసారని చెబుతారు. “ఆనందం పొంగేనోయి దీపావళి, ఇంటింట వెలుగు, దీపాల మెరుగు” అంటూ దీపావళి పండుగను ఒక పసివాడి ఆనందంతో ముడిపెట్టారు. చివరికి “నీ రూపమే ఇంటి దీపము బాబు” అన్న భావం ద్వారా అసలు వెలుగు దీపాలలో లేదని, ఆ బిడ్డే ఇంటికి రాబోయే దీపమని చెప్పకనే చెప్పారు. సంగీతపరంగా ఈ పాటకు రాగేశ్రీ ప్రధాన ఛాయ, అక్కడక్కడ జయజయవంతి స్పర్శ కూడా వినిపిస్తుంది. “నా మదిలో నీకు నెలవే కలదు” అని పలికించడం ద్వారా సరోజా దేవే ఆ బిడ్డకు భవిష్యత్తులో అమ్మ కాగలదని, అదే పెళ్లి కానుక అవుతుందని కూడా ఈ పాట సారాంశం.
(5 A) ఆడే పాడే పసివాడా, అమ్మలేని నిను జూడ కన్నీటి కథ ఆయె దీపావళి, ఊరెల్ల వెలుగు ఆనందం మనకు కనరాని దూరమురా
గానం: ఎ.ఎం.రాజా – రచన: ఆచార్య ఆత్రేయ
ఈ పాట సరోజాదేవి ఆలపించిన హ్యాపీ సాంగ్‌కు విషాద ప్రతిరూపం. మంద్ర స్థాయిలో పలికే రాజా స్వరం ఈ పాటకు మరింత ప్రాణం పోసింది. మొదటి పాటలో దీపావళి ఇంటింట వెలుగైతే, ఇక్కడ అదే దీపావళి కన్నీటి కథగా మారింది. “ఊరెల్ల వెలుగు, ఆనందం మనకు కనరాని దూరమురా” అనే పాదంలో బయట ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోయినా, తల్లి లేని ఆ ఇంటికి మాత్రం ఆనందం అనేది అందని దూరంగా మారిపోయింది. “నెనరెల్ల అనలాన నీరైన నాడు నెమ్మది నాకింక కనరాదు.. ఇలవేల్పు వలె ఇంట వెలసిన దేవి మమతే మరచి మరుగైనదేమి? కన్నులలోని కాంక్షలు అన్నీ కలలాయె నేటికిరా” అనే చరణంలో ద్వందార్ధం ఉంది. ఆ అర్ధం అటు కృష్ణకుమారికి, ఇటు సరోజాదేవికి సమానంగా వర్తింపజేయడం ఆత్రేయ కలానికి రెండవ పార్శ్వం. అయితే “అనురాగమున తానె అనిపించు దేవి, ఎనలేని భావాల పెనవేసి; పాశము తెగతెంచి మోసము చేసే” అనే చరణంలో “మోసము” అని ఆత్రేయ రాయడం ఎందుకో అర్ధరహితం అనిపిస్తుంది. అన్నీ పరిస్థితుల ప్రభావాలే తప్ప మోసం ఎక్కడా కనిపించదు. “పాశము తెగతెంచి దూరము చేసే” అని ప్రయోగిస్తే ఈ సినిమాలోని పాత్రల త్యాగనిరతి ద్విగుణీకృతం అయ్యేది. ఈ పాదం వినిపించే ఇంటర్‌లూడ్‌కు రాజా భాగేశ్రీ రాగాన్ని వాడడం సందర్భోచితం. సంగీతపరంగా ఈ పాట మొత్తం రాగేశ్రీ, జయజయవంతి ఛాయలతో పాటు కొన్ని ఇంటర్‌లూడ్‌లలో భాగేశ్వరి స్పర్శ వినిపించడం పాటలోని విషాదాన్ని మరింత గాఢం చేస్తుంది.
(6) తీరెనుగా నేటితో నీ తీయని గాధ, మిగిలిపోయె నీ (నే) మదిలో మాయని బాధ
గానం: సుశీల, ఎ.ఎం. రాజా (విడివిడిగా) – రచన: సముద్రాల రాఘవాచార్య
ఒకే భావానికి స్త్రీ, పురుష రూపాలుగా వినిపించే ఈ రెండు నేపథ్య గీతాలు ‘పెళ్లికానుక’ కథలోని విషాదానికి సంగీత ప్రతిరూపాలు. “తీరెనుగా నేటితో నీ తీయని గాధ” – ఒకప్పుడు తీయగా సాగిన ప్రేమకథ ఇప్పుడు ముగిసింది. అయితే కథ ముగిసిన చోట జ్ఞాపకం ముగియదు. “మిగిలిపోయెనే మదిలో మాయని బాధ” – ఈ ఒక్క పాదమే మొత్తం పాటకు కేంద్రబిందువు. సముద్రాల రాఘవాచార్య పదప్రయోగంలో “తీయని గాధ”కు “మాయని బాధ”ను ఎదురుగా నిలపడం ఎంతో అందమైన కవితా నిర్మాణం. ప్రేమ ముగిసినా దాని జ్ఞాపకం మనసులో శాశ్వతమైన బాధగా మిగులుతుందనే భావం ఈ పాటకు విషాదగాంభీర్యాన్ని ఇస్తుంది. ఈ నేపథ్య గీతాన్ని మిశ్రమ శివరంజని ఛాయల్లో మట్లు కట్టారు. శివరంజని స్వభావంలోనే విషాదం, విరహం, ఆవేదనకు అనుకూలమైన స్వరరంగు ఉంటుంది. “తీయని గాధ” ముగిసిన తరువాత “మాయని బాధ” మిగిలిన కథాసందర్భానికి ఆ స్వరరంగు అచ్చంగా సరిపోతుంది. పురుష గాత్రంలో ఎ.ఎం. రాజా బాధను అంతర్ముఖంగా వ్యక్తం చేస్తే, సుశీల గాత్రంలో అదే బాధకు మరింత స్త్రీ సహజమైన ఆవేదన వినిపిస్తుంది. ఒకే బాణీని రెండు గాత్రాలలో వినిపించడం ద్వారా పాత్రల అంతరంగాలకు వేర్వేరు రంగులు వచ్చాయి.
ముగింపు:
ఈ సినిమా పాటల అసలైన విజయం ఒక్కొక్క పాట అందంగా, వీనుల విందుగా ఉండడంలో మాత్రమే లేదు. ఆ పాటలు కథతో పుట్టాయి. కథతో కలిసి బాధపడ్డాయి. చివరకు మనసులో నిలిపాయి. అందుకే ఆరు దశాబ్దాలు దాటినా ‘పెళ్ళికానుక’ సినిమా పాటలు వింటుంటే మనకు కేవలం పాటలు మాత్రమే వినిపించవు. ఒక సంపూర్ణమైన సినిమా మన మనసులో ఒదిగిపోతుంది. అందుకే ఈ సినిమాను చూస్తూనే వుండాలి.. తీరిక దొరికినప్పుడల్లా!
