[‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ అంపశయ్య నవీన్. 28 సెప్టెంబర్ లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఈ సమీక్షని ప్రత్యేకంగా అందిస్తున్నాము.]
భారతదేశ వ్యాప్తంగా లతా మంగేష్కర్ పాటలు విని ఒక అద్భుతమైన పారవశ్యానికి లోను కానీ శ్రోతలు చాలా తక్కువగా ఉంటారు. ఆరు దశాబ్దాల పాటు హిందీ సినీ సంగీత ప్రపంచాన్ని మహారాణిలా యేలిన లతా మంగేష్కర్ వ్యక్తిగత జీవితం గూర్చి తెలుసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండరు. అయితే లత వ్యక్తిగత జీవితాన్ని గూర్చి హిందీలోనూ, ఇంగ్లీషులోనూ చాలా పుస్తకాలే వెలువడ్డాయి. తెలుగులో మాత్రం లత సమగ్ర జీవితాన్ని గూర్చి వెలువడిన పుస్తకాలు తక్కువే అని చెప్పాలి. ఈ కొరతను పూడ్చడానికా అన్నట్టు కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సంగీత సరస్వతి లతా మంగేష్కర్’ అనే పుస్తకం ఇటీవల వెలువడింది.
కస్తూరి మురళీకృష్ణకు సినిమాల మీద, సినిమా సంగీతం మీద గొప్ప ఆసక్తి, గొప్ప అవగాహన ఉన్నాయి. ఆయన్ను కదిలిస్తే చాలు సినిమాలను గూర్చి, సినిమా సంగీతం గూర్చి గంటలకొద్ది చెప్పగలడు.
సినిమా సంగీతాన్ని గూర్చి – అది తెలుగు కావచ్చు, లేదా హిందీ కావచ్చు, మురళీకృష్ణకున్న అపారమైన జ్ఞానం ఆయన చేత ఈ ‘సంగీత సరస్వతి – లతామంగేష్కర్’ అన్ని పుస్తకాన్ని రచించేలా చేసింది. 400 పేజీలకు పైగా సాగిన ఈ పుస్తకంలో లత వ్యక్తిగత జీవితాన్ని గూర్చి క్లుప్తంగా, యేయే సంగీత దర్శకుని దర్వకత్వంలో యేయే పాటలు పాడిందో వివరంగా తెలియజేసాడు.
హిందీ సినిమా సంగీత దర్శకుల మధ్య ఉండే పోటీలు, రాజకీయాలు, లత లాంటి అగ్రశ్రేణి గాయనికి కొన్ని చిన్న కారణం వల్ల లతకు వాళ్ళ మీద కోపం రావటం, వాళ్ళ సంగీత దర్శకత్వంలో నేను పాడనని అలగటం లాంటి అనేక సంఘటలను మురళీకృష్ణ చాలా వివరంగా రాశాడు. ఎస్.డి. బర్మన్, శంకర్ జైకిషన్, ఓ.పి.నయ్యర్, సి. రామచంద్ర లాంటి అగ్రశ్రేణి సంగీతదర్శకులకు ‘నేను పాడన’ని నిక్కచ్చిగా లత చెప్పెయ్యటం చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.
అయితే, లత పాడనని భీష్మించుకోవటం వల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదని ఆగ్రశ్రేణి సంగీతదర్శకులు లత చెల్లెలు ఆశాకు, గీతాదత్‌కు, సుమన్ కళ్యాణ్‌పూర్ లాంటి ఇతర గాయనీమణులెందరికో అవకాశాలిచ్చారు.
యేదో విషయంలో లతకు రఫీ మీద కూడా కోపమొచ్చి ఆయనతో డ్యూయెట్స్ పాడనని చెప్పేస్తే అప్పుడు రఫీ ఆశాలు కలిసి పాడిన ఎన్నో పాటలు శ్రోతలను ముగ్ధుల్ని చేశాయి. రఫీతో కలిసి డ్యూయెట్లు పాడకపోవటం వల్ల నువ్వే నష్టపోతావని లతకు అనేకమంది ఆమె అభిమానులు నచ్చచెప్పాక ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నదట!
లత అగ్రశ్రేణి గాయనీమణి. హిందీ సంగీత సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాణిగా యేలుతున్న రోజుల్లో ఆమెను గూర్చి అనేక పుకార్లు చెక్కర్లు కొడుతుండేవి. లత, ఆశా కలిసి కొత్తగా వచ్చే గాయనీమణులను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కేవారని, ఈ ఇద్దరి సోదరీమణుల కారణంగా ఎందరో కొత్త గాయనీమణుల జీవితాలు కనుమరుగై పోయాయన్న పుకార్లు ఆ రోజుల్లో విరివిగా ప్రచారమయ్యేవని, కానీ అవన్నీ కేవలం పుకార్లే గానీ, వాటిల్లో యే మాత్రం కూడా నిజం లేదని మురళీకృష్ణ చెబుతాడు.
ఆనాటి సంగీత ప్రపంచంలోని వాతావరణాన్ని గూర్చి చెబుతూ మురళీకృష్ణ అనే విషయాలు చెప్పాడు.
“లత సినీరంగంలో ప్రవేశించినప్పట్నించి ఓ పద్ధతి ప్రకారం తన చుట్టూ గిరి గీసుకుంది. ఆ పరిధి దాటి ఎవర్నీ లోపలకు రానివ్వలేదు. అతిక్రమణ చెయ్యాలని ప్రయత్నించిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా తన జీవితం లోంచి వెడలనడిపింది. ‘ఆయేగా ఆనేవాలా’ గేయరచయితకు ‘పెన్ను’ ఇచ్చినందుకు గేయ రచయిత సి. రామచంద్ర రకరకాల పుకార్లను ప్రచారం లోకి తెచ్చాడు. పెన్ను తనకు ప్రజెంట్ చేసినందుకు తనని ప్రేమిస్తున్నదని ప్రచారం చెయ్యడంతో లత అతన్ని దూరం పెట్టింది. హుస్న్‌లాల్ భగత్ రామ్ సంగీత దర్శక ద్వయంలో లత హుస్న్‌రామ్ ఇంటికి వెళ్ళి పాటలు పాడటం నేర్చుకునేది. ఇది అతని భార్యకు అనుమానం కలిగించింది. లత పట్ల హుస్న్‌లాల్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ఆమె నిరసించింది.” అంటాడు మురళీకృష్ణ (సంగీత సరస్వతి లతా మంగేష్కర్ పుస్తకంలో 142వ పేజీ).
“సినీ ప్రపంచం చాలా క్రూరమైనది. కళాకారులకు అంత సులభంగా అవకాశాలు రావు. ఎవరైనా అవకాశాలు అంది పుచ్చుకుంటుంటే వాళ్ళని దెబ్బ తీయాలని చూస్తుంది. పైకి వస్తూంటే వాళ్ళను క్రిందకు లాగాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా పలు రకాల వదంతులను సృష్టిస్తుంది. ఇలా సృష్టించే వదంతులలో ఒక కళాకారుడు ఏదో ఓ జట్టుకు చెందిన వాడన్న ప్రచారం ఒక భాగం. అందువల్ల ఆ జట్టు వ్యతిరేక జట్టు ఈ కళాకారుడిని దూరం పెడుతుంది. ఇది కళాకారుడి ఎదుగుదలను దెబ్బ తీస్తుంది.”
మహమ్మద్ రఫీ సినిమాల్లో అడుగుపెట్టిన కొన్ని రోజులలోనే అతడు నౌషాద్ క్యాంపుకు చెందిన వాడన్న వార్త సినీ పరిశ్రమలో ప్రచారమయింది. నౌషాద్ అంటే అనిల్ బిశ్వాస్‍కి పడదు. సి. రామచంద్ర కయితే నౌషాద్ అంటే అస్సలు నచ్చదు. సజ్జాద్ హుస్సేన్ వంటి వారు నౌషాద్ పేరు చెప్తేనే మండిపడతారు. ఇతర అనేక సంగీత దర్శకులకు నౌషాద్‍తో పోటీ, ద్వేషం. దాంతో రఫీ, నౌషాద్ క్యాంపుకు చెందిన వాడని తెలియగానే అనిల్ బిశ్వాస్, సి. రామచంద్రలు తమ సినిమాల్లో రఫీతో చాలా తక్కువ పాటలు పాడించారని మురళీకృష్ణ చెప్పాడు. సి. రామచంద్ర తన సినిమాల్లో తానే ‘చితల్కర్’ పేరుతో పాడేవాడు. రఫీ నౌషాద్ క్యాంపుకు చెందినవాడన్న ప్రచారం జరగటం వల్ల రఫీకి చాలా అన్యాయం జరిగిందంటాడు మురళీకృష్ణ.
ఎస్.డి. బర్మన్‌కు లత పాడిన పాట తనకు సంతృప్తికరంగా లేదని ఎస్.డి. ఆమెతోటే ఆ పాటను మళ్ళీ రికార్డు చేపిద్దామని అనుకొని లతకు ఈ విషయం చెప్పి ఆమెని ఆ పాట రికార్డింగ్‌కు రమ్మని కోరాడు. లత అప్పుడు ఇంగ్లాండ్‌కు వెళ్లే తొందరలో ఉండి రికార్డింగ్‌కు రాలేకపోతే ఎస్.డి. ఆ పాటను ఆశాతో పాడించాడట – తను పాడిన పాటని ఆశాతో పాడించాడని లత ఎస్.డి.కి పాటలు పాడనని చెప్పేసిందట.
శంకర్-జైకిషన్‌తో రాజ్‍కపూర్ మరో కొత్త గాయనిని చూడమని చెప్పటం వల్ల శంకర్ శారద అనే కొత్త గాయనిని ప్రవేశపెట్టి ఆమెతో ‘సూరజ్’ సినిమాలో ఓ పాట పాడించాడు. దాంతో లత శంకర్-జైకిషన్‌లకు పాడనని చెప్పేసింది.
ఇక రాజకపూర్ మీదనైతే లతకు తీవ్రమైన కోపం వచ్చింది. ‘సంగమ్’ సినిమాలో ‘క్యా కరూఁ రామ్, ముఝే బుడ్డా మిల్ గయా’ పాటను లత పాడనందట. కానీ రాజకపూర్ చాలా బలవంతం చెయ్యటం వల్ల లత ఆ పాట పాడింది. ఇదే లతకు కోపం తెప్పిస్తే, ‘సంగం’ సినిమాలో లత పాడిన పాటలకు చెల్లించాల్సిన డబ్బును రాజకపూర్ ఎగగొట్టేశాడు. దాంతో లతకు రాజ్‌కపూర్ పైనున్న కోపం రెట్టింపైందట.
సినిమా పాటల విషయంలో లతతో పోటీ చెయ్యాల్సినంత ప్రతిభ ఉన్నది ఒక్క గీతాదత్‌కేనట. కానీ గీతాదత్ గురుదత్ ప్రేమలో పడి అతన్ని పెళ్ళి చేసుకోవడంతో ఆమె జీవితం గందరగోళంలో పడిపోయింది. గురుదత్ వహీదా రహ్మాన్ ప్రేమలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన గీతాదత్ గొప్ప ఆందోళనకు లోనై తాగుడు లాంటి వ్యసనానికి బానిసై తన జీవితాన్ని తానే నాశనం చేసుకుందని మురళీకృష్ణ చెప్పాడు.
గీతాదత్, మీనాకుమారి లాంటి వాళ్ళు పెళ్ళి చేసుకుని ఎలా తమ జీవితాలను నాశనం చేసుకున్నారో గమనించిన లత పెళ్ళి అనే తంతుకు దూరంగా ఉండిపోయింది.
మొదట్లో సి.రామచంద్ర అంటే చాలా ఇష్టమున్నప్పటికి దాన్ని ఆమె పెళ్ళి వరకు తీసికెళ్ళలేదు.
లత గొంతులో ఉన్న మృదుమధురమైన, అనితర సాధ్యమైన ధ్వనిని గమనించిన సంగీత దర్శకులు ఆమె కోసం ప్రత్యేక బాణీలను సృష్టించి ఆమెను ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపేవారు. కొత్తగా వెండితెరకు నాయికలుగా వస్తున్నవారికి, వాళ్ళు తన కన్నా వయస్సులో ఎంత చిన్నవాళ్ళయినా వాళ్ళ వయస్సుకు తగ్గట్టు లత పాటలు పాడేది.
***
ఎంతో గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యల కారణంగా ఎలా విడిపోయారో మరళీకృష్ణ ఈ పుస్తకంలో ఎన్నో ఉదాహరణలను చెప్పాడు. ఉదాహరణకు ఈ ఉదంతం చూడండి:
“‘సంగం’ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ పాటలయినా మహమ్మద్ రఫీ పాడిన ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’, ముకేష్ పాడిన ‘దోస్త్ దోస్త్ న రహా’ పాటలు పోటా పోటీగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఈ సమయంలోనే పల్లవితో జైకిషన్‍కు వివాహమయింది. ఆ సందర్భంగా ఫిల్మ్‌ఫేర్ పత్రికలో ఓ వ్యాసంలో ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్’ పాటను తాను పల్లవి కోసం రూపొందించానని రాశాడు జైకిశన్. అది తుఫాను సృష్టించింది.
శంకర్ జైకిషన్ ఓ జట్టుగా ఏర్పడినప్పుడే శంకర్ ఒక నియమం ఏర్పాటు చేశాడు. ఎవరు ఏ పాట రూపొందిస్తున్నారో ఎవరికీ తెలియకూడదు. పాటను శంకర్ రూపొందించినా, జైకిషన్ రూపొందించినా బయట ప్రపంచానికి అది శంకర్ జైకిషన్ పాటగానే తెలియాలి.”
జైకిషన్, ఫిల్మ్‌ఫేర్ పత్రికలో ‘యే మేరా ప్రేమ్ పత్ర్ పడ్‌కర్’ పాటను తాను రూపొందించానని వెల్లడించి, ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో, ఎంతో కాలంగా శంకర్-జైకిషన్‍ల మధ్య ఉన్న స్నేహం ఆ ఒక్క సంఘటనతో బ్రద్దలయిపోవటం ఎంతో దురదృష్టకరం.
ఇట్లాంటిదే మరో సంఘటన.
‘మాయ’ సినిమాలో లత, రఫీలు ‘తస్వీర్ తేరే దిల్ మే’ అనే డ్యూయట్‌ను పాడారు. చాలా గొప్ప పాట. ఈ పాటని దేవానంద్, మాలా సిన్హాల పైన చిత్రీకరించారు. ఈ పాటలో మూడో చరణం పాడి మళ్ళీ పల్లవి ఎత్తుకునేటప్పుడు లత ఒక సూచన చేసింది. ఆ పల్లవిని రఫీ ఎలా పాడితే బాగుంటుందో సూచించింది. అందుకు రషీ ఒప్పుకోలేదు. నేను పాడింది బాగానే వుందన్నాడు. అప్పుడు లత సలీల్ చౌదరీని ఈ విషయంలో ఎవరి సూచన కరెక్టో చెప్పమన్నది. లత సూచనే కరెక్ట్ అన్నాట్ట సలీల్ చౌదరీ. అంతే – అప్పట్నించి రఫీ సలీల్ చౌదరీకి పాడనన్నాడట. ఈ విషయం ఎవరికీ ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఈ సంఘటన తర్వాత సలీల్ చౌదరీతో రఫీ పాడకూడదని నిర్ణయించుకున్నాడు. దీని కారణంగా నష్టపోయిందెవరంటే శ్రోతలు.
లత చివరి రోజుల్లో పాడిన కొన్ని గొప్ప పాటలు:
1985 – 186 తర్వాత లతా మంగేష్కర్ వాయిస్‌లో మార్పు వచ్చిందని, ఆమె గొంతులో ‘జీర’ లాంటిది ఏర్పడడం వల్ల ఆమె హై పిచ్‌లో పాటలు పాడలేక పోయిందని కొందరు ఫిల్మీ సంగీత విమర్శకులు – ఈ పుస్తక రచయిత కస్తూరి మురళీకృష్ణతో సహా భావించారు (లతా మంగేష్కర్ సమగ్ర జీవిత చరిత్రను రచించిన రాజూ భరతన్ కూడా). అయితే వాళ్ళ మాటలు నిజం కావని 1986 తర్వాత ఆమె పాడిన చాలా పాటలు ఋజువు చేశాయి. ఉదాహరణకు ‘తుఝే దేఖా హై తో జానా సనమ్’ (దిల్‍వాలే దుల్హనియా లే జాయెంగే), ‘దిల్ దీవానా బిన్ సజానా కే మానేనా’ (మై నే ప్యార్ కియా), ‘చాంద్ నే కుఛ్ కహా’ (దిల్ తో పాగల్ హై), ‘కుఛ్ నా కహో’ (1942 ఎ లవ్ స్టోరీ), ‘నా జానే మేరే దిల్ కో హ్యా కో గయా’ (దిల్‍వాలే దుల్హనియా లే జాయెంగే), ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ లో టైటిల్ సాంగ్, ‘లమ్హే’ లో లతా పాడిన అన్ని పాటలు, రుడాలీ సినిమాలో అన్ని పాటలు – ఇలా చెప్పుకుంటూ పోతే, లతా చివరి క్షణం వరకూ ఇలాంటి మోస్ట్ పాపులర్ సాంగ్స్ పాడుతూనే ఉంది.
అప్పుడప్పుడే హిందీ సినిమాల్లో ప్రవేశించిన నాయికలు కాజల్, భాగ్యశ్రీ, మాధురీ దీక్షిత్, మనీషా కొయిరాలా, కరిష్మా కపూర్, కరీనా కపూర్, టబూ, రాణీ ముఖర్జీ లాంటి వాళ్ళకెందరికో లత కొన్ని అద్భుతమైన పాటలు పాటలు పాడింది. తుది శ్వాస విడిచేంతవరకు లతా మంగేష్కర్ పాడుతునే ఉంది – ఆమె గొంతులో ఎలాంటి మార్పు రాలేదు.
ఆమె పాడిన ‘కుహూ కుహూ బోలే కోయలియా’, ‘జ్యోతి కలశ్ ఛల్‌కే’, ‘మొహబ్బత్ కీ ఘూఠీ కహానీ పే రోయే’, ‘యే షామ్ కీ తన్హాయియాఁ ఐసే మే తేరా గమ్’, ‘హవా మే ఉడ్‌తా జాయే’, ‘కుఛ్ దిల్ నే కహా, కుఛ్ భీ నహీఁ’, ‘దిల్ దీవానా బిన్ సజనా కే మానేనా’, ‘ముఝ్ సే జుదా హోకర్’, ‘యే జిందగీ ఉసీ కీ హై’, ‘చాంద్ ఫిర్ నికలా’, ‘పియా తుమ్ సే’, ‘తుఝే దేఖా హై తో జానా సనమ్’, ‘పియా బినా పియా బినా’, ‘ముఝే భూల్ గయే సావరియా’, ‘యారా సీలీ సీలీ’ లాంటి ఎన్నో – మన చెవుల్ని మరో అద్భుత ప్రపంచంలోకి తీసికెళ్ళే సంగీత సరస్వతి లతా మంగేష్కర్ పాటలు – మన దేశ సంగీత ప్రేమికుల గుండెల్లో ఎప్పుడూ పలుకుతూనే ఉంటాయి.
***
‘భారతరత్న’ పురస్కారాన్ని – భారత ప్రభుత్వం అందచేసే అత్యంత ఉన్నతమైన పురస్కారాన్ని పొందిన లతా మంగేష్కర్‌లో ఒక దైవత్వం ఉందనిపిస్తుంది.
కస్తూరి మురళీ కృష్ణ రాసిన ఈ పుస్తకంలో ఆనాడు సినీ సంగీత ప్రపంచంలో జరిగిన ఎన్నో వింతలు, విశేషాల గురించి చాలా సాధికారతతో, చాలా ఆసక్తికరంగా చెప్పాడు. ఒక్క లతా మంగేష్కర్ గురించే కాకుండా ఆమెతో సమానమైన ప్రతిభ కల్గిన మహమ్మద్ రఫీ గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. అయితే ఈ పుస్తకాన్ని కొన్ని చాప్టర్స్‌గా విభజించి రచిస్తే బావుండేది.
లత జీవిత విశేషాలు, లత ప్రారంభ దినాల్లో ఎదుర్కున్న సమస్యలు, ఆమెకు తిరుగులేని అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు తెచ్చిన పాటలు, ఒక్కొక్క సంగీత దర్శకునికి పాడిన ముఖ్యమైన పాటలు; ఆనాటి సినీ సంగీత ప్రపంచంలోని రాజకీయాలు, ఇతర విషయాలను అనేక అధ్యాయాలుగా విభజించి రాస్తే బావుండేది. అట్లా అధ్యాయాలుగా విభజించి రచించకుండా చెప్పదల్చుకున్న విషయాన్నంతా ఏకబిగిన రాస్తూ వెళ్ళిపోవడం వల్ల చెబుతున్న విషయమంతా కలగాపులగమైపోయింది, కొన్నిసార్లు ఇది వరకు చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్పినట్లనిపించింది. చివర్లో లతో పాడిన కొన్ని గొప్ప పాటల లిస్టు ఇవ్వడం బాగున్నది.
నేను గత ముప్పై సంవత్సరాల నుండి ప్రతీ రాత్రి పడుకోబోయే ముందు రెండు గంటల సేపు లతా మంగేష్కర్ తో పాటు, రఫీ, కిషోర్, ఆశా భోస్లే లాంటి వాళ్ళు పాడిన పాటలు తప్పకుండా విన్నాకనే పడుకుంటాను. అలా నాకు లత పాడిన వందల పాటల్ని నేను గుర్తించగలను.
మొత్తం మీద లతను గూర్చిన ఈ సమగ్ర గ్రంథాన్ని మనకి అందజేసి, మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసిన కస్తూరి మురళీకృష్ణకు మనం కృతజ్ఞతలు చెప్పాలి.
వెల్‌డన్ మురళీకృష్ణ. థాంక్యూ.
***
రచన: కస్తూరి మురళీకృష్ణ
పుటలు: 424
వెల: ₹ 300.00
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‌లో తెప్పించుకునేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1298&BrandId=82&Name=Lata+Mangeshkar
https://www.amazon.in/Lata-Mangeshkar-Kasturi-Muralikrishna/dp/B0C6Y8QW1Z
అంపశయ్య నవీన్ సుప్రసిద్ధ తెలుగు రచయిత. వీరి ‘కాలరేఖలు’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి నవలలు రవిత్రయ నవలలుగా పేర్గాంచాయి.
కాళోజీ సాహిత్య పురస్కారం, రావి శాస్త్రి పురస్కారం, జ్యేష్ట సాహిత్య పురస్కారం లభించాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

