[శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ రచించిన ‘శంకర విజయం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి.]
‘శంకరుని చరిత్ర రాసే వారందరూ తమ రచనలను ‘శంకర విజయం’ గా అభివర్ణించడం ఒక సంప్రదాయం. సంస్కృత భాషలో దాదాపు 43 శంకర విజయాలున్నాయి. అయితే, శంకరుడి సమకాలీనుడైన చిత్సుఖచార్యుడు రచించిన ‘బృహచ్ఛంకర విజయం’ మొదటిది. దీనిని బట్టి ఆది శంకరుడు క్రీ పూ 509లో నందన నామసంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం నాటి ధనుర్లగ్నంలో జన్మించాడు. 1916లో టి. ఎస్. నారాయణ శాస్త్రి అనే పరిశోధకుడు ‘బృహచ్చంకరవిజయం’ ఆధారంగా ఆంగ్ల తేదీలను తెలుపుతూ ‘ఏజ్ ఆఫ్ శంకర’ అనే గ్రంథాన్ని రచించారు. అది సాధికారమేనని సుప్రసిద్ధ చరిత్రకారుఁడు కోట వెంకటాచలం అన్నారు. తమ ‘క్రోనోలోజి అఫ్ హిందూ హిస్టరీ’లో శంకరునికి సమకాలీనుడైన మగధ పాలకుడు అరిష్టశాతకర్ణి, ఉజ్జయినీ పాలకుడు శ్రీ హర్ష విక్రమాదిత్యుడు అని కోటవారు తీర్మానం చేశారు’— అని నేతి సూర్యనారాయణ శర్మ తాజా రచన ‘శంకరవిజయం’లో రాశారు.
భారతదేశంలో సందేహ పక్షులకు కొదవేలేదు. మనందరం జగద్గురువుగా భావించే ఆదిశంకర భగవత్పాదులు అసలు పుట్టాడా? పుట్టలేదా? పుడితే ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వమా? క్రీస్తు శకంలోనా? అయన నాలుగు సార్లు ఆ సేతు హిమాచలం పాదాలపై నిజంగా పర్యటించాడా? నాలుగు దక్షిణామ్నాయ మఠాలను ఆయనే స్థాపించాడా? ఇంకెవరన్నానా? – ఇల్లాంటి ప్రశ్నలు ఎవరైనా నాస్తికులు, సరిగ్గా సాహిత్యం చదువుకొని పండితులకు వచ్చిందంటే కొంతలో కొంత అర్ధం చేసికోవచ్చు. కానీ, ఈ ప్రశ్నలు, తదనుబంధ ప్రశ్నలు వేసేది హైందవంలో భాగం అని చెప్పుకొనే వేరే మత పీఠాధిపతులు.
నిజానికి ఆదిశంకరులతోనే భారతీయ ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు సర్వజన సమ్మతమైన వ్యాఖ్యానం లభించిందన్నది నిర్వివాదం. హైందవాన్ని శిరస్సునెత్తుకొని గర్వంగా మనగలిగేలా చేసింది ఆదిశంకరులే. ‘ఆచార్యులవారు ఎంతటివాడంటే, యుధిష్టరశకం, విక్రమశకం, కలిశకం లాంటివి కాకుండా శంకరాచార్యుల జననాన్నో, నిధనాన్నో ఆధారం చేసుకొని ‘శంకర శకం’ అని మన దేశంలో వ్యాప్తిలోకి తెచ్చుకోదగిన మహాత్ముడు. అంతపనీ జరగకుండా తను జీవించి ఉన్నకాలం తెలియనీయకుండా మాయలో పెట్టాడు ఆ మహానుభావుడు. ఆయన స్థాపించిన నాలుగు పీఠాలలో మూడు పీఠాలవారు క్రీ.పూ. 5వ శతాబ్దం అంటుండగా, ఒక పీఠం వారు క్రీ.శ. 8వ శతాబ్దం అంటున్నారు. ‘కంచికామకోఠి పీఠం వారు మాత్రం క్రీ.పూ. 5వ శతాబ్దం నుండి వారి మఠాధిపతుల పేర్లను ప్రకటిస్తుంటారు’ – అని ‘మనవి మాటలు’లో రవికృష్ణ గారు పేర్కొనటం కొంత ఓదార్పు నిస్తుంది. ఎందుకంటే కంచి పీఠాధిపతిగా చంద్రశేఖర పరమాచార్యులవారు కాలం చేసింది కేవలం పాతికేళ్ల క్రితమే. ఆయన తన నూరేళ్ళ జీవితంలో ఈ పరంపర సత్యమనే చెప్పారు తప్ప, అసత్యాన్ని మఠ పరంపరగా సాగనిచ్చేవారే కాదు. అందుకే ఆయనను ‘నడిచే దేవుడు’ అన్నారు నీలంరాజు ఆదిశేషయ్య.
‘ఇది వేదభూమి. శుద్ధ జ్ఞాన శృతి భూమి. ఇక్కడ భగవంతుడు ‘ఊహ’ కాదు. ఓ ‘అద్భుత నిజం!’ ‘భగంతుడిని నేను చూశాను. నువ్వూ చూడగలవు’ అని బల్లగుద్ది చెప్పగలిగిన శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ భగవాన్ వంటి రుషులు, ‘నడిచే దేవుడు’ వంటి కంచి చంద్రశేఖర పరమాచార్యులు ఇక్కడే, ఈ వేదభూమి పైనే, జన్మిచారు. వీరందరికీ జగద్గురువు ఆదిశంకరులన్నది పరమసత్యం. ఆదిశంకర ప్రతిపాదిత ‘అద్వైతం’ ఆచరణీయం, నిత్య ఉపాసనీయం, అనుష్ఠాన వేదాంతం. ఆదిశంకరాచార్యులు హిందూధర్మంలోని వివిధ ఆరాధనా పద్ధతులను ఏకం చేస్తూ స్థాపించిన ఆరు ముఖ్యమైన సంప్రదాయాలనే షణ్మతాలు అంటారు. అవి: శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, స్కాందము. అంతేగాదు. ఆదిశంకరుల షణ్మతస్థాపనకు ముందే షడ్దర్శనాలుండినయ్యి. అవి: న్యాయ, యోగ, వైశేషిక, సాంఖ్య, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస ఆరు. వీటి సమన్వయం కూడ ఆదిశంకరుల వారే చేశారు. వీటిలోని పరస్పర విరుద్ధమైన వాదాలను, కుతర్కాలను తొలగించి వాటికి అర్ధం ‘ఏకాత్మ’ తత్వమనే సమన్వయము చేసిన అద్వితీయ అవతారం ఆదిశంకరులే.
అయినా, కాలంగడిచే కొద్దీ వేరే మతం అనుసరించే వారు, తరుచూ శంకరుల ఉనికిని, ఆయన జనన కాలం, ఆయన స్థాపించిన పీఠాల ఉనికిని, ఆయన జగద్గురువు కాడనే వివాదాస్పద ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తుంటారు. నిజానికి జైనా, బౌద్ధాల వంటివే ద్వైత, విశిష్టాద్వైత మతాలు కూడా. ఇవి హైందవంలో భాగం అని వారు చెప్పుకొన్నా, వారి దారులు, వ్యాఖ్యలు వేరు. సార్వజనీనమైన అద్వైతంపట్ల, జగద్గురువు ఆది శంకరుల పట్ల, గుప్త ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటారు. అర్ధ జ్ఞానం, మిడి మిడి జ్ఞానంతో వ్యర్థ ప్రసంగాలు చేస్తుంటారు.
కాబట్టి జగద్గురువుల పట్ల, శంకర స్థాపిత పీఠాల ఔన్నత్యం పట్ల ఇతర మతాల వారికి సమాధానం చెప్పేచారిత్రక పరిశోధనా గ్రంథమే ‘శంకర విజయం’. విద్వద్వరేణ్యులు, ప్రముఖ భక్తి ప్రత్రిక సంపాదకులు నేతి సూర్యనారాయణ శర్మ తన పరిశోధనలలో అనేక సందేహాలకు పరిష్కారం చూపడం ప్రస్తుత తరుణంలో ఎంతో ముదావహం.
గోవింద భగవత్పాదుల పరంపర:
మొదటగా శంకరచరిత్రలో ఆదిశంకరుల గురువులైన ‘గోవింద భగవత్పాదుల’ అవతరణను ఆవిష్కరించారు సూర్యనారాయణ. వేదవ్యాసుని కుమారుడు శుకమహర్షి. ఆయన శిష్యుడు పతంజలి. ఆదిశేషు అవతారమైన పతంజలికి గౌడపాదుడు శిష్యుడైనాడు. కారణాంతరాలవల్ల గౌడపాదుడు శాపగ్రస్తుడై కొన్ని వేల ఏళ్లపాటు బ్రహ్మరాక్షసుడిగా మిగిలిపోయాడు. చంద్రశర్మలో పతంజలి పునర్జన్మను గుర్తించి ఆయనకు విద్యలు బోధించాడు. ఆ చంద్రశర్మయే ఆదిశంకరుని గురువైన గోవింద భగవత్పాదులు. పూర్వాశ్రమమంలో చంద్రశర్మయే భర్తృహరి, విక్రమార్కుడు, భట్టి, వరరుచిలనే లోకప్రసిద్ధులను కన్న తండ్రి. టి.ఎస్. నారాయణ శాస్త్రి ప్రకారం కాళిదాసు, వరరుచి ఆదిశంకరుని సమకాలీనులుగా సూర్యనారాయణ భావించటం జరుగుతుంది.
ఎవరేమన్నా, అనకపోయినా ఆదిశంకరుల కాలం కలియుగారంభ కాలంగానే పరిగణించాలి. ఈ కారణంగా ద్వాపర యుగ వ్యాసుడు కలియుగారంభంలో పలు సందర్భాలలో దర్శనమిచ్చాడు. అందులో భాగంగా నేతి సూర్యనారాయణ ‘శంకర విజయం’లో కూడ ఆదిశంకరుల, వ్యాసుల ముఖాముఖి సంభాషణ ఉంటుంది. కమ్యూనిస్టు చరిత్రకారులు భారతీయ చరిత్రలో భాగం అయిన ‘దైవ శక్తుల’ ఉనికిని పుక్కిట కథలుగా కొట్టివేస్తారు కాబట్టి ‘శంకర విజయం’ లోని ఈ భాగాన్ని కూదా అప్రమాణికం అని తేలిగ్గా కొట్టిపారేయవచ్చు. అలా అని అన్నయ్య, రామదాసు, త్యాగరాజులను, రాములవారిని కొట్టిపారేయలేకపోయారు. రాములవారు కట్టుకథని భారతీయ ప్రజలను ఒప్పించలేకపోయారు కదా! అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వరులు ఎంత సత్యమో, రామదాసు, త్యాగయ్యలకు రాములవారు అంత సత్యమేనని, అనేక మంది మహాభక్తుల అనుభవాలు చారిత్రక సత్యాలని నమ్మక తప్పలేదు వారికైనా. ఆ విధంగా భక్తి సంవితమైన చరిత్ర భారతీయ చరిత్రలో భాగమే. ఈ క్రమంలో విశ్వనాథ సత్యనారాయణ ‘పురాణ వైర గ్రంథమాల’ను, జానపదుల వాడుకలో నున్న ఆదిశంకరుల కథలను వాడుకొన్నారు సూర్యనారాయణ. అయితే, కాల చరిత్రనేక్కడ వక్రీకరించలేదు.
యయాతితో ఆరంభమయ్యే ఆంధ్ర, కేరళ భాషా పదాలు:
సూర్యనారాయణ తన చారిత్రక పరిశీలనా గ్రంథం ‘శంకర విజయం’లో ఆదిశంకరుడికి పూర్వచరిత్ర వివరించటం జరిగింది. కేరళుడు పురువంశ క్షత్రియుడు. ఒకనాటి చంద్రవంశమే ఒకానొకప్పుడు పురువంశంలో కలిసిపోయింది. చంద్రవంశంవాడైన యయాతి తనకు యవ్వనాన్ని ధారపోయనందుకు గాను కన్నకొడుకుల్నే శపించాడు. యయాతి కొడుకుల్లో ఒకడైన తుర్వసుడి నుంచి ఏడోతరం దుష్యంతుడనే రాజు పురువంశానికి దత్తత వెళ్ళిపోయాడు. ఆ దుష్యంతుడి మూడోతరం జన్మించినవారే పాండ్యుడు, కేరళుడు, చోళుడు, ఫల్గుదు. వారిలో కేరళుడు పాలించిన దేశం కనుక దానిని కేరళ అన్నారని తొలి అధ్యాయం ‘ఫలించిన తపస్సు’ లో వివరించాడు సూర్యనారాయణ. ఇది ‘మనవి మాటలు’ రాసిన రవికృష్ణ అభిప్రాయానికి దగ్గరగా ఉన్నాయి. ‘చంద్రవంశానికి చెందిన యయాతి చక్రవర్తి నుండి 14వ తరంవాడైన ‘బలి’ కి ఆరుగురు కొడుకులు. వాళ్ళు తండ్రి రాజ్యాన్ని సమానంగా పంచుకొని తమ పేర్లే తమ రాజ్యాలకు పెట్టుకొని పాలించారు. ఆరవ వాడైన ‘ఆంధ్రుడు’ పాలికి వచ్చిన భాగమే నేటి ఆంధ్ర ప్రదేశ్. ఈ ఆంధ్ర దేశంలో నాడు శంకరుడు ఉన్నప్పుడు ప్రచారంలో ఉన్న భాష ‘ఆంధ్రం’ అయిందన్నది రచయిత సూర్యనారాయణ భావం’ – అని రవికృష్ణ అభిప్రాయ పడ్డారు.
ఎందుకంటే ఆదిశంకరులు ప్రియమైన భాష ‘ఆంధ్రం’ అని సూర్యనారాయణ శాసనాల అక్షరాలను బట్టి నిర్ణయానికి వచ్చారు. మరోకారణం ఏమిటంటే ఆదిశంకరుల పూర్వీకులు ఆంధ్రదేశంలోని ద్రాక్షారామ భీమమండలం అని వారి నిశ్చితాభిప్రాయం. అతి ప్రాచీనకాలం లోనే ఎన్నో వేద కుటుంబాలు కేరళ ప్రాంతానికి తరలి వెళ్లాయి. అటువంటి వారిలో విద్యాధిరాజు పూర్వీకులు కాలటి అగ్రహారంలో స్థిరపడ్డారు. మడి మాన్యాలు సాధించుకొన్నారు. విద్యాధిరాజు కాలటిలో మకుటం లేని మహారాజు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తన ఇంట్లోనే చేయాలనుకున్నాడు విద్యాధిరాజు. వృషాచలేశ్వరుడు స్వయంభువుగా వెలసిన కొండపై శివగురుడు, ఆర్యాంబ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. ఈ శివగురుడు, ఆర్యమాంబలే ఆదిశంకరుని తల్లిదండ్రులు.
శంకర విజయం – కీలక ఘట్టాలు
శంకర విజయం మొత్తం 52 అధ్యాయాల గ్రంథం. మొదటి అధ్యాయం ‘ఫలించిన తపస్సు’ నుంచి చివరి అధ్యాయం ‘మహాప్రస్థానం’ వరకూ శంకరుడే కేంద్రంగా ఆయన జ్ఞాన ప్రదర్శన, ప్రేమతత్వం, ధర్మనిరతి అప్రతిహతంగా ఎలా సాగాయో మనోహర పదగుంఫనలతో, చక్కని తెలుగులో వర్ణిస్తారు నేతి సూర్యనారాయణ.
శివగురుడు, ఆదిశంకరుల తండ్రి. శివగురుడు తండ్రి విద్యాధిరాజు. నివాసం కాలడి అగ్రహారం. పూర్ణా నది ఆ ఊరిని పునీతం చేసి నిరంతరం సాగుతున్న నది. శివగురుడు గురుకులంలో విద్యనభ్యసిస్తూ గురువును సన్యాసం గొప్పదా, యజ్ఞ యాగాదులు గొప్పవా అన్న సందేహం లేవనెత్తటంతో ప్రథమాశ్వాసం ‘ఫలించిన తపస్సు’ మొదలెడతారు నేతి సూర్యనారాయణ. ‘యజ్ఞ, యాగాదులు గృహస్థు విద్యుక్త ధర్మాలు. అయితే, జ్ఞానమే జన్మముక్తికి హేతువు’ కాబట్టి సన్యాసం కన్నా గృహస్థాశ్రమమే మేలని’ స్పష్టం చేస్తాడు శివగురుడి గురువు. అదేసమయంలో కుమారుడ్ని ఇంటికి తీసుకెళ్లి, సశాస్త్రీయంగా వివాహం చేయటానికి అనుమతి కోరడానికి వస్తాడు విద్యాధిరాజు. గురువు సంతోషంగా అనుమతిస్తారు. అలా అనుమతిస్తూనే శివగురుని గురువు శివగురుడితో ‘నాయనా! నీ వివాహ ఫలితంగా జన్మించే కుమారుడు లోకోత్తరుడవుతాడు. అతనిని సూర్యచంద్రులు ఉన్నంతవరకూ లోకం గుర్తుపెట్టుకొంటుంది’ అని తెలిపాడు. కొడుకును తోడ్కొని కాలటి చేరతాడు విద్యాధిరాజు. ఒక సుముహూర్తాన ఆర్యమాంబ నిచ్చి వృషాచలేశ్వర స్వామి సమక్షంలో వివాహం జరిపించాడు. అలా వివాహం జరిగిన కొన్నేళ్ళకే శివగురుని తండ్రి విద్యాధిరాజు కాలం చేస్తారు.
శివగురుడు, ఆర్యాంబల సంసారం అన్యోన్యంగా సాగినా శివగురుడు గురువు చెప్పినట్టు సంతానం కలగలేదు. కానీ గురువు మాట వృథా కాదు. పెద్దల సలహాతో, సంతానం కోసం వృషాచలేశ్వరుని ఉపాసన చేస్తాడు శివగురుడు. ఒక నాటి మధ్యాహ్నం ఒక పన్నెండేళ్ల బాలుడు చేతిలో తేనెతో వచ్చి శివగురుడికిచ్చి, దీనిని సేవిస్తే నీకు పుత్రసంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు. దానిని ఆర్యమాంబ స్వీకరించి గర్భం దాలుస్తుంది. నందన నామ సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి సాయంవేళ ఆర్యమాంబ ఒక చక్కని పండంటి శిశువును ప్రసవించింది. శివగురుని మనస్సు పుత్రోత్సాహంతో పొంగిపోయింది. పదకొండో రోజున నవజాత శిశువుకు జాతక కర్మ నిర్వహించాడు శివగురుడు. ‘ఈ బాలుడు సకలవిద్యా విశారదుడవుతాడు. శారదను సైతం ధిక్కరించే మేటి పండితుడవుతాడు’ అని డైవజ్ఞులు పలికారు. శివగురుడు తన బిడ్డకు శంకరుడు అని నామకరణం చేశాడు.
కలియుగం ప్రవేశించి 2,601 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి శంకరుడికి ఎనిమిదేళ్లు వచ్చాయి. (కంచి పీఠం ఆదిశంకరుల అవతరణకు చేసిన కాలనిర్ణయాన్నే సూర్యనారాయణ ప్రామాణికంగా తీసుకొన్నారన్నది స్పష్టం). శంకరుడికి మూడేళ్లు వచ్చేప్పటికే ముదిమి వయస్సుతో శివగురుడు కాలం చేశాడు. అక్కడినుంచి శంకరుడు తల్లి ఆర్యమాంబ సంరక్షణలో గురుకుల విద్యాభ్యాసం చేస్తున్నా, తల్లి నిత్యం గమనిస్తూనే ఉండింది.
కనకధారా స్తోత్రం:
భిక్షాటనలో శంకరుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్లి ‘భగవతీ, భిక్షామ్ దేహి’ అని అరుస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు అప్పటికి భోంచేయక రెండు దినాలు అయింది. అయినా బ్రహ్మచారి శంకరుడు వచ్చి భిక్ష అడిగేటప్పటికి, ఆ ఇల్లాలు దుఃఖపడుతూ, ‘తండ్రి, నీవు సన్యాసివి కాబట్టి సహజంగానే మధ్యాహ్న భోజనం అడిగావు కానీ, నా వద్ద ఈ ఎండిపోయిన ఉసిరిగ కాయ తప్ప మరేదీ లేదు. రెండురోజులైంది–నాకు, నా జీవనభాగస్వామికి అన్నం లేక’ అని చెప్పింది. అది విని, ఆ ఇంటి ఇల్లాలు కళ్ళవెంబడి కారే కన్నీళ్లను చూసి శంకరుడు లక్ష్మీ స్తోత్రం చేస్తాడు. ఇది ‘కనకధారా’ స్తోత్రంగా లోక ప్రసిద్ధి. ఆ వెంటనే లక్ష్మి అనుగ్రహంతో ఉసిరిక్కాయలంత పరిణామంలో బంగారు గోలీలు కురుస్తాయి. అలా శంకరుడు కురిపించిన ధనంతో వాళ్ళ దరిద్రం తొలగిపోయిన సంగతి లోకమంతా వింతగా చెప్పుకోసాగారు.
అదే సమయంలో ఆదిశంకరులు నిమిత్త గురువులైన గురుకుల గురువు ఆదిశంకరులకు దిశా నిర్దేశం చేస్తారు. ‘బీద వారికి కనక వర్షం కురిపించావు సరే. కానీ, ఈ లోకానికి కావలసింది జ్ఞాన వర్షం. అది నీ ప్రధాన బాధ్యత. ఉత్తరం దిక్కున నీ అసలు గురువును ఆశ్రయించు. ఆయన నీకు పూర్తి దిశానిర్దేశం చేస్తాడు’ అని చెబుతాడు. అలా గురువు అనుమతి పొంది కాలడి చేరిన ఆదిశంకరులు సన్యసించాలన్న కోరిక వ్యక్తం చేస్తాడు తన తల్లి ఆర్యమాంబతో.
ఈ ‘శంకరవిజయం లో నేతి సూర్యనారాయణ తనకు పూర్వం శంకర విజయాలు రచించిన రచయితలు ప్రకటించిన ఘటనల ఆధారంగానే తన రచననూ కొనసాగించినా, ఈ శంకర విజయానికి కొంత కొత్తదనం తెచ్చారనటంలో సందేహం లేదు. ముఖ్యం ఆదిశంకర విరచిత స్తోత్రాలను, ఆయన ఉత్తరముఖ పర్యటనలకు, ఆయా ప్రదేశాలలో ఆయన జరిపిన పూజలకు, వివాదాలకు ముడిపెడుతూ, తన రచనను భక్తిమయం చేశారు. అందువలన, ఈ పుస్తకం పామరులకు, పాండితీ ప్రకర్షలేని వారికి కూడ కడు రమణీయ పాఠంగా మారింది.
శంకరుని తల్లి ఆర్యమాంబకు శంకరుడు గృహస్థాశ్రమం స్వీకరిస్తే బాగుండునన్న అభిప్రాయం ఉంది. అందువల్ల శంకరుడు అడిగినప్పుడల్లా ఆర్యమాంబ తిరస్కరిస్తూ వచ్చింది. ఒకసారి తన తల్లి పూర్ణానదిలో నీరు తెద్దామని బయల్దేరింది. కానీ, ఎండ ప్రతాపానికి సొమ్మసిల్లిపోయింది. అది చూసిన శంకరుడు పూర్ణానదిని ప్రార్థించాడు. ‘నా తల్లి నీ పవిత్ర తీర్థం కోసం ఈ ఎండలో రాలేకపోతున్నది. అందువల్ల, నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి నా మొర ఆలకించి నీ పయన దిశ మార్చుకొని మా ఇంటివైపుగా ప్రవహించు’ అని ప్రాధేయపడ్డాడు. శంకరుడి ప్రార్థనకు, తల్లి భక్తికి ముగ్ధురాలైన నదీమాత ‘రేపటి వరకు సమయమివ్వు. అలానే, నీవు కోరినట్టే ప్రవహిస్తాను’ అని అభయమిచ్చింది. ఆ మార్పు ఎలా జరిగిందంటే ఆర్యమాంబ ఇంటికి ఒరుసుకొంటూ ప్రవహించటమేగాక, పశ్చిమ ముఖాన ఉన్న శ్రీకృష్ణ ఆలయం చుట్టేసింది. అలా శంకరుని తల్లికి శ్రీకృష్ణ అభిషేకానికి నీళ్లు ఎక్కడినుంచో తెచ్చే బాధ తప్పించారు ఆదిశంకరులు. దీనికి తల్లి ఆర్యమాంబ ఎంతో సంతసించినా, కొడుకు సన్యాసానికి అంగీకారం తెలుపలేదు.
కాలం వేగంగా ముందుకు సాగిపోతున్నది. అత్రి, ఉపమన్యు, గౌతమ, అగస్త్య మహర్షులు ఆదిశంకరుడి దర్శనానికి వారింటికి వచ్చారు. తన పుతృడిని చూడటానికి మహర్షులు రావటం ఆర్యమాంబకు ఎంతో ఆనందాన్నిచ్చింది. వారితో తన పుత్రుడి ఆయుర్దాయం, వివాహ విషయం ప్రస్తావించింది ఆర్యమాంబ. ఆవిడ మనోగతం ఎరిగిన మహర్షులు ఆదిశంకరుని సన్యాసానికి అనుకూలంగా పలు హితవాక్యాలు చెప్పారు ఆర్యమాంబకు. అయినా ఆర్యమాంబ పుత్రుడి సన్యాసం దీక్షకు అంగీకరించలేకపోతున్నది. ఒక నాడు పూర్ణా నదిలో సంధ్యా కార్యక్రమాలు చేస్తుండగా ఒక ముసలి ఆదిశంకరుడి కాలు పట్టుకొంది. శంకరుడు గిలగిలలాడిపోతున్నాడు. ఊరంతా ఈ వింత చూడటానికి అక్కడ చేరారు. ఆర్యమాంబ కూడ కడు దుఃఖిస్తూ అక్కడికి చేరి, తన పుతృడిని వదిలేయమని ప్రార్థించింది. అప్పుడు శంకరుడు తన తల్లితో ‘నా సన్యాసానికి అంగీకరిస్తే ఈ మొసలి కరుణించవచ్చుట. లేకపోతే నా జీవితం ముగియక తప్పద’ని మొసలి మనోగతాన్ని తెలిపాడు. కన్న కొడుకు ప్రాణం ఏ తల్లికైనా ఎంతో ముఖ్యం కనుక చివరకు ఆర్యమాంబ శంకరుడి సన్యాసానికి అంగీకరించింది. ఆ విధంగా సన్యాసానికి అంగీకరించడంతో నీళ్లలోనుంచి బయటికి వచ్చాడు ఆది శంకరుడు. మొసలి తన రూపం విడిచి గాంధర్వ రూపం దాల్చి ఆదిశంకరుడికి నమస్కరించి మాయమైంది.
శంకరుడి సన్యాసం:
‘సన్యసించినా నా కళ్ళముందే ఉండు’ అని ఆర్యమాంబ కోరగా, ‘తను ఎప్పుడు కోరుకొన్నా, ఎక్కడ ఉన్నా తక్షణమే తల్లి సాన్నిధ్యానికి వస్తా’ అని మాట ఇచ్చి, క్రమ సన్యాసానికి ఉత్తరం వైపుగా ప్రయాణమైనాడు ఆదిశంకరుడు. కృష్ణాలయంలో కృష్ణుని ‘అచ్యుతాష్టకం’తో స్తుతించి, కృష్ణుని కృపానుగ్రహం పొంది ఉత్తరంగా ప్రయాణమై, తొలుత గోకర్ణం చేరాడు. గోకర్ణ క్షేత్రంలో తన బాల్య మిత్రుడు, సహా విద్యార్థి అయినా విష్ణు శర్మతో కలిసి వారక్కడినుంచి తూర్పుగా ప్రయాణించి శ్రీ శైలం చేరారు.
పశ్చిమ ద్వారంనుంచి శ్రీశైల పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించారు ఆదిశంకరుడు. సాక్షిగణపతిని ఆరాధించి శివస్థానానికి చేరుకొన్నారు. మల్లికార్జున జ్యోతిర్లింగం ముందు మోకరిల్లి ఆశువుగా ‘సంధ్యారంభ విజృంభిత శ్రుతిశిర స్థానంతరాధిష్ఠితం/సప్రేమ భ్రమరాభిరామా మాంసకృత్ సద్వాసనాశోభితం//భోగీంద్రభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం//సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం శివలింగితం//’ అనే పద్యం చేతులు కైమోడ్చి పలికాడు. ఆదిశంకరుని నోటి నుంచి వచ్చిన ఈ తొలిపద్యం విని విష్ణుశర్మ పులకించిపోయారు. అటుపై శివానుగ్రహం కోసం, జ్ఞాన సిద్ధికి యోగసిద్ధి అవసరమని భావించి, కుంభకం చేసి కుండలిని సహస్రారం అవతల ఉన్న పన్నెండు అంగుళాలకు పైన ఆవరించి ఉన్న చంద్రకళా స్థానానికి చేర్చాడు. పదహారు కళలతో శోభిల్లే చంద్రకళ క్రమమంగా కరగడం మొదలు పెట్టింది. ఒక్కొక్కబొట్టుగా అమృతబిందువులు స్రవించడం ఆరంభమైంది. అంగిట్లో కొండనాలుకతో అమృతాన్ని గుటకవేసి, కుండలినీ శాంతిపొందింది. చంద్రుని చలవ అనాహతానికి వ్యాపించి శంకరుడికి దివ్యత్వం కలిగించింది.
పై వర్ణన పూర్తి రాజయోగ ప్రక్రియ. పతంజలి రాజయోగ సూత్రాలలో ఉంటుంది. సాధకులకు నిత్యానుభవం. ‘భగవంతుడి ఉనికి సత్యమా, కల్పనా తేల్చే ఒకే ఒక యోగప్రక్రియ ఇదే’ అని పలికారు స్వామి వివేకానంద. ఆయన స్వయంగా రాజయోగి కదా! నిజానికి నేతి సూర్యనారాయణ రచనను బట్టి ఇది ఆయన స్వానుభవమా, లేక పుస్తక పఠనం వలన కలిగిన అంతః జ్ఞానమా అనే సందేహం రాకమానదు. ఆసక్తి కల పాఠకవరేణ్యులు దీని మూలం ‘శంకరవిజయం’లో పఠించి తెలుసుకోగలరు.
అలా అద్వైతసిద్ధి పొంది యావత్ జగత్తో మమేకమైన క్షణంలో శంకరునికి ఆకస్మికంగా కలిగిన దివ్యదర్శనమే ‘శివానందలహరి’గా అప్రయత్నంగా ఆయన ముఖతః బయటికివచ్చింది. ‘భక్తోభక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ! తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం/………//’ అంటూ శివుని గానం ఆలపించారు శంకరులు.
అక్కడినుంచి శంకరులు తన గురుకుల మిత్రుడు విష్ణుశర్మతో కలిసి ముందుకు సాగాడు. భయంకర అరణ్యాలు దాటారిద్దరూ. దూరాన నర్మదా నది, ఆ పక్కనే ఓంకారేశ్వరం కనిపించాయి. ‘కావేరికా నర్మదాయో: పవిత్రే /సమాగమే సజ్జన్ తారణాయ/ సదైవ మాంధాతృపురే వసంత/ మోంకార మీశం శివమేక మీడే!’ అని శివ సన్నిధిలో శివుని స్తుతించాడు. ఆలయం బయట ఎదురుగా ఉన్న గుహలో తన గురువు గోవిందభగవత్పాదులు తపస్సులో నున్న విషయం గ్రహించి లోపలి రావడానికి అనుమతి కోరాడు. ఇద్దరి మధ్య జరిగిన సంవాదంలో శంకరులు గోవిందభగవత్పాదులకు సరైన సమాధానాలు ఇవ్వడంతో గుహ లోపలికి అనుమతి పొందాడు. గోవిందభగవత్పాదుల ఆశీస్సులు పొంది కొంతకాలానికి గుహ బయటికి వచ్చాడు శంకరుడు.
‘వ్యాసభగవానుడు విభజించిన వేద రాశులకు, వేదాంతానికి సరైన అర్థం కలిపించు. నాలుగు దిక్కులా నాలుగు ఆమ్నాయాలను రక్షణగా ఏర్పరచు. శంకరా నీ పర్యటన కాశీ నుంచి ఆరంభించు. సాక్షాత్తు కైలాస శంకరుడే నీ రూపం దాల్చి భూమిమీదకు వచ్చాడు. అందువల్ల అద్వైత మత వ్యాప్తే నీ ధ్యేయం, ధర్మం. కూడా. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని పరిణామాలు వచ్చినా నీకు నేనిచ్చిన అద్వైతం శాశ్వతం, స్థిరం’, ఆజ్ఞాపించాడు పరమాచార్య గౌడపాదుడు. శిరస్సు వంచి ‘తమ ఆజ్ఞ’ అని కాశీ దిక్కుగా అడుగులేశాడు శంకరుడు ఆదిశంకరుడు.
కాశీలో చండాల దర్శనం, వారితో వివాదం గంగానది ఒడ్డున మణికర్ణిక వద్ద కూడ పెక్కుమంది పండితులతో వాగ్వాదం జరిగింది. ఇవన్నీ శంకరుని లోని అద్వైతాన్ని పరీక్షించి, ఆయన అద్వైతపటిమకు మెరుగుపెట్టినయ్యి. శంకరులు భగవద్గీతకు భాష్యం ‘గీతా భాష్యం’ రాయాలని నిర్ణయించుకొని గంగా తీరం వెంట పడవలో బయల్దేరారు. దారిలో ధర్మ ప్రచారం, అద్వైత బోధ, కర్మాచరణ అంటే ఏమిటీ, కర్మ ఎవరికీ ఎంత అవసరం వంటివి శిష్యులకు, జ్ఞానార్హత ఉన్నవారికి బోధిస్తూ బదరికాశ్రమం వైపు పయనించారు.
పద్మపాదాచార్య, అగ్నిశర్మల రాక: మహాప్రస్థానం
బదరీకి చేరే మార్గంలోనే సదానందుడు, అగ్నిశర్మ వచ్చి ఆదిశంకరుడిని కలుస్తారు. అగ్నిశర్మ కాలటి నుంచి ఆదిశంకరుల తల్లి సమాచారం తెస్తాడు. సదానందుడు గంగ ఆవల ఒడ్డు నుంచి ఈవలకు నీళ్లపై తేలుతూ నడుస్తాడు. అప్పుడతని ప్రతి అడుగుకు ఒక పద్మం ఉదయిస్తుంది. నీటమునగకుండా ఒడ్డుకు చేరి గురు ఆపన్న హస్తం అందుకొని, పద్మపాదాచార్యుడవుతాడు సదానందుడు. హిమాలయాల మధ్యనున్న కైలాసగిరిలోని సౌగంధికా వనంలో దక్షిణామూర్తి నెలకొని ఉంటారు. ఆయన గోవిందభగవత్పాదులను వెళ్లి ఆదిశంకరుడిని తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించటంతో గోవిందభగవత్పాదులు కొండదిగి ఆదిశంకరులను కేకేస్తాడు. అలా ఆదిగురువులను దర్శించుకోను గురు శిష్యులిద్దరు దక్షిణామూర్తిని దర్శిస్తారు.
అక్కడ శుకమహర్షి ఆదిశంకరుడిని ఇతర మహర్షులకు పరిచయానంతరం శుకుని ఆదేశాల మేరకు బ్రహ్మవిద్య రహస్యాన్ని, ‘తత్వమసి’ని బోధించమని కోరుకొంటాడు. క్షణంలో దక్షిణామూర్తి శిరస్సు నుంచి వెలువడిన నాదం శంకరుని ప్రవేశించి ఆ జ్ఞానం స్థిరపడుతోంది. దక్షిణామూర్తి స్త్రోత్రం చేస్తాడు ఆది శంకరుడు. వ్యాసుడి ఆదేశానుసారం బ్రహ్మసూత్ర వ్యాఖ్య చేపడతానని మాటిస్తాడు ఆదిశంకరుడు. ‘అంతేగాదు, పదహారవ ఏడు రాకముందే బ్రహ్మసూత్ర రచన ముగించాలి’ అని గూడ చెబుతాడు. ‘అలాగే’ అంటాడు ఆదిశంకరుడు. గోవిందభగవత్పాదులు తిరిగి ఓంకారేశ్వరానికి పయనమవుతాడు. వ్యాసుడు అంతర్ధానమవుతాడు. గోవిందభగవతపాదుల ఆదేశం మేరకు శంకరుడు బ్రహ్మసూత్ర రచన పూర్తైన తరువాత తిరిగి కాశీ విశ్వేశ్వర దర్శనానినికి వెళ్ళవలసి ఉంటుంది. దారిలో ప్రయాగ దర్శించి అక్కడ పృధ్వీధరుడికి క్రమ సన్యాసం అనుగ్రహిస్తాడు ఆదిశంకరుడు. అతనే హస్తమలకాచార్యులు అయ్యారు.
వారణాసిలో ఈశ్వర దర్శనం చేసి కాలభైరవాష్టకంతో స్ట్రోత్రించాడు శంకరుడు. ‘భూతసంఘానాయకం, విశాలకీర్తి దాయకం, కాశీవాసం లోకపుణ్యపాప శోధకం విభుమ్/ నీతి మార్గ కోవిదం పురాతన జగత్పతిం, కాసికాపురాధినాథ కాలభైరవం భజే//’. సరిగ్గా ఆ సమయానికే వ్యాసుడు ముసలివాని వేషంలో వచ్చి ఆదిశంకరుడితో మాట కలుపుతాడు. ఆదిశంకరులు విరచించిన ‘గీతాభాష్యం’, ‘బ్రహ్మసూత్ర భాష్యం’ పై కొన్ని సందేహాలున్నాయని వివరాలు కావాలని కోరతాడు. ఆ వచ్చినది వ్యాసభగవానులని గ్రహించి అందుకు అంగీకరిస్తాడు ఆదిశంకరులు. ఈసారి కాశీ దర్శనంతో ఆదిశంకరులు పదహారేళ్లే ఆయుర్దాయం అని అగస్త్యుడు తెలిపిన ఆయువు మరి ఇరవై దినాల్లో ముగియపోతున్నదని శంకరునికి తెలుసు. వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలలో శంకరుని వ్యాఖ్యలపై వివరణ కోరుతున్నాడు. శంకరుడు వైదిక వాక్యానికి, సూత్రానికి మద్యవైరుధ్యం ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుపుతున్నారు.
ఈలోగా తల్లి ఆర్యమాంబ కాలం చేసిన ఘట్టం శంకరుని మనోనేత్రంలో ప్రత్యక్షమైంది. శంకరుడు తన తల్లికిచ్చిన వాక్కు నిలబెట్టటానికి వ్యాసుని అనుమతి కోరి కాశీలో అంతర్ధానమై కాలడిలో ప్రత్యక్షమైనాడు. తల్లి అంత్యక్రియలు తానే చేస్తానని ప్రకటించాడు. ఊరివారు కనీసం నిప్పు ఇవ్వడానికి కూడ అంగీకరించలేదు. పైగా సన్యాసికి కర్మలు చేసే అధికారం లేదని, ఆదిశంకరులపై విరుచుకుపడ్డారు. అయినా శంకరులు, ఊరివారిని నిరుత్తరులు చేస్తూ, అంత్యక్రియలు జరీపేశాడు. తల్లి కిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రామునికి, శంకరులకు ఏమీ తేడా లేదని నిరూపించాడు. మండన మిశ్రుడు, ఉదయభారతిల సంవాదం, కాళిదాసు, వరరుచిల సందేహాలను జగద్గురు పరిష్కరించడం వంటి అద్భుతఘట్టాలతో, వేదాంత చర్చలతో శంకరుని జీవితం భక్తి, జ్ఞాన రసరమ్యం అవుతుంది.
ఆనందలహరి, సౌందర్యలహరి విరచించాడు. దక్షిణాన ఉన్న రామేశ్వరం నుంచి కాళహస్తి, తిరుమల వంటి పుణ్య క్షేత్రాలను దర్శించి యంత్ర ప్రతిష్ఠ గావించాడు. దక్షిణామ్నాయ పీఠాలను నెలకొల్పి తన ప్రముఖ శిష్యులను మఠాధిపతులుగా ప్రతిస్తిన్చాడు. భట్టభాస్కరుడు వంటి ఈశాన్య తత్వవేత్తలను కూడ సునాయాసంగా ఓడించి అద్వైతాన్ని భారతీయ జ్ఞాన సిద్ధాంతంగా ప్రతిష్ఠించాడు ఆదిశంకరుడు. శంకరుడు ఒక వ్యక్తి అయితే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఆయన లీలా మానుష స్వరూపం. సర్వశక్తులు, మాయలు ఆయన ఆధీనంలో ఉండటం వలననే ఆయన విజయపరంపర సాధ్యమైంది. అందువల్ల ఆయన ఉత్తరాది వెళ్లి తిరిగివచ్చిన దాఖలాలు లేవు అని వాదించే కొంతమంది మఠాధిపతుల వాదనలు శంకర విశ్వరూపం తెలిసినవారు (విజ్ఞులు, ప్రాజ్ఞులు) విని నవ్వుకోవటం జరుగుతున్నది.
నేతి సూర్యనారాయణ శర్మ తన శంకర విజయంలో శంకరుడు తెలిపిన అనేక ఆధ్యాత్మిక రహస్యాలు చాలా వివరంగా తెలియ జేశారు. అవి సాధారణ పాఠకుడికి ఎక్కడా దొరకవు. అంతేగాక శంకరాచార్య పరంపరకు ఆయన కంచిపీఠాన్ని పరిగణలోకి తీసుకొన్నారు. ఈ కంచిపీఠాధిపతుల్లో ఇటీవలి వారైన కంచి పరమాచార్య బ్రహ్మజ్ఞాని, సర్వాంతర్యామి, నడిచేదేవుడు. కాబట్టి ఈ పుస్తకంలో చెప్పినవి చాలా కంచి పరమాచార్యులు నిజమైనవని రూఢి చేసినవేనని మరిచిపోవద్దు.
***
శంకరవిజయం
రచన: నేతి సూర్యనారాయణ శర్మ
ప్రచురణ: VVIT
పేజీలు: 360
వెల: ₹ 350/-; ₹ 400/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000 413 413
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
ఆన్లైన్లో:
https://www.amazon.in/SANKARA-VIJAYAM-Nethi-Surya-Narayana/dp/8192068536
