[‘సన్నివేశాలు’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం శ్రీధర బనవాసి.]
1
“నీ పెళ్ళి ప్లాను ఎక్కడి దాకా వచ్చింది?”
“అయ్యో.. అబ్బాయిలు ఏమైనా కరువా నాకు.. మంచి ఉద్యోగం, లక్షలకొద్ది ప్యాకేజ్, కాస్త మామూలుగా ఉన్నా చాలు, అబ్బాయిలు క్యూ కట్టి నిలబడుతారు.. అయినా మా అమ్మ నన్ను త్వరగా పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తోంది, నాకైతే పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు.”
“రైట్ టైమ్ టు మ్యారీ..! అని నాకు అనిపిస్తూ ఉందే. ఈ వయసులో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది.”
“ఎందుకో అమ్మగారు త్వరలో పెళ్లి చేసుకుని, భర్త, సంసారం, పిల్లలు అని త్వరగా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారా?”
“ప్రతి అమ్మాయికి ఏదో ఒక రోజున పెళ్లి చేసుకోక తప్పదు కదా?”
“పెళ్లి కచ్చితంగా జరగాలి, జరగకూడదని నేను అనడం లేదు. అయితే ఎందుకు ఇంత అర్జెంట్? మనకేమైనా వయసు లేదా? సౌందర్యం లేదా? మనం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం. నెల తిరిగితే చేతి నిండా జీతం తీసుకుంటాం. కొత్త కొత్త దేశాలు తిరుగుతాం. ..ఇవన్నీ మన జీవితంలో దొరుకుతున్నప్పుడు మరింతగా లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది కదే?”
“ఎన్నేళ్లు ఎంజాయ్ చేస్తావ్?”
“ఇంకో నాలుగేళ్లు..”
“ఆ తర్వాత..?”
“ఆ తర్వాత.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను..”
“చూడవే, ఇప్పుడు నీకూ నాకూ ఇరవై ఐదేళ్లు దాటుతున్నాయి. ఈ సమయంలోనే పెళ్లి చేసుకుంటే చాలా మంచిదే.. నువ్వు పెళ్లి చేసుకునే సమయంలో ఇప్పుడు ఉన్న అందం, బిగువైన శరీర సౌష్ఠవం, దేహంలోని చైతన్యం, వికసించిన ముఖం, అన్నీ ఆనాటికీ ఉంటాయని గ్యారంటీ ఏమిటి.. ? వయసులోనే పెళ్లి చేసుకోవాలే.. నీ అంత తెలివైనదాన్ని, అనుకూలమైనదాన్ని కానటువంటి నాకే అబ్బాయిలు దొరుకుతున్నప్పుడు నీకు అబ్బాయిలు దొరకరా?”
“అరే.. నేను పెళ్ళే చేసుకోనని అనడం లేదు కదనే..! నేను కూడా లాస్ట్ వీక్ మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేశాను.. ఒక్క వారంలో వందకు పైగా ప్రపోజల్స్ వచ్చాయి. ఎందుకో ప్రపోజ్ చేసినవారి ప్రొఫైల్స్ నాకు నచ్చలేదు. ఇంటికి కూడా నలుగురైదుగురు పెళ్లికొడుకులు వెతుక్కుంటూ వచ్చారు.. నేనే వారందరినీ రిజెక్ట్ చేశాను. అందరూ నాకంటే తక్కువ జీతం తీసుకునేవాళ్లే.. నేను నెలకు ఆరు లక్షల ప్యాకేజీ తీసుకున్నాను.. నన్ను పెళ్లి చేసుకునేవాడికి కనీసం నెలకు ఆరు లక్షల ప్యాకేజీ లేకపోతే ఎలా? ఫారిన్‌లో సెటిల్ అయ్యే అబ్బాయి కోసమే నేను వెతుకుతున్నాను.. వీలైనంత వరకు అబ్బాయి ఎంఎన్‌సి కంపెనీలోనే ఉంటే మంచిదికదా? కంపెనీ నుంచి మంచి ఫెసిలిటితోపాటు క్రెడిట్ కార్డ్, క్లబ్ మెంబర్‍షిప్, లోన్ అన్నీ చాలా సులభంగా దొరుకుతాయి. నా పెళ్లి గురించి ఇన్ని కలలు, కోరికలు ఉన్నప్పుడు నేను ఎవరో అబ్బాయిని పెళ్లిచేసుకోవడంలో ఏమైనా అర్థం ఉందా?”
“అలాగని నీ కలల అబ్బాయి దొరికేవరకు నువ్వు వివాహం చేసుకోనని అంటావా?”
“కచ్చితంగా.. నాకేం తక్కువనే.. నాకు అబ్బాయిలు దొరకరా? ఇప్పటికే ఇన్ని ఆఫర్లు వస్తుంటే, రేపు నా శాలరీ ప్యాకేజీ, డిజిగ్నేషన్, ప్రమోషన్ పెరిగితే ఇంకా మంచి ప్రొఫైల్స్ దొరకవా?”
“నీకు వస్తుందో రాదో అని నేను అనడం లేదు. కానీ నువ్వు అలా ఎందుకు మారవు? ఈ రోజు తక్కువ జీతం పొందే అబ్బాయి రేపు నీకంటే మంచి ప్యాకేజీ పొందుతాడు.. మామూలు కంపెనీలో పని చేస్తాడు, తదుపరి ఎం.ఎన్.సి. కంపెనీలో ఉద్యోగం పొందలేడా? ఒక్క మాట గుర్తుంచుకో.. కాలం ఎప్పుడూ నిలబడే నీరు కాదు. ప్రవహించే సముద్రంలా, కురుస్తున్న జలపాతంలా.. కచ్చితంగా దొరకరని నేనేమి అనటం లేదు. అయితే నువ్వు అనుకున్న తీరులోనే జరుగుతుందని అనుకోలేంకదా?.. ఈ రోజు తక్కువ శాలరీ తీసుకున్న అబ్బాయి రేపు నీ కన్నా మంచి ప్యాకేజీ తీసుకోవచ్చు.. సాధారణమైన కంపెనీలో ఉద్యోగం చేసే అతనికి భవిష్యత్తులో ఎంఎన్‌సిలో ఉద్యోగం దొరకదా? ఒక మాట చెబుతాను గుర్తుపెట్టుకో.. కాలం ఎప్పుడూ నిలువ నీరు కాదు. అది ప్రవహిస్తున్న నదిలాంటిది. భోరుమని శబ్ధం చేసే జలపాతంలాంటిది..”
“అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి.. ఆడపిల్లలం మన సేఫ్టీలో మనం ఉండాలే..ఇప్పటి కాలంలో ఏ మగవాడినీ నమ్మలేం.. అదే నా ప్రిన్సిపల్ ..!”
“సరే లేవే.. నాకు నీలా ప్రిన్సిపల్స్, పెద్ద పెద్ద కలలు, శాలరీ ప్యాకేజీ, ఫారిన్‌లో సెటిల్ కావడం ..ఈ విధమైన కోరికలు నాకు లేవే. నా కల ఏమిటో తెలుసా, అతను ఎంత జీతమైనా రానీ, ఏ కంపెనీలోనైనా పనిచేయనీ, అతనికి, అతని కలలకు భార్యగా సపోర్ట్ చేస్తూ జీవిస్తే అదే చాలు నాకు. నన్ను అర్థం చేసుకునే మంచి కుర్రవాడు దొరికితే చాలు. అదే నా పెద్ద కల..”
“థూ.. కేవలం మగవాళ్లే బాగుపడాలని అనుకుంటున్నావు కదే..! ఎంతకని ఇన్ని శతాబ్దాలుగా పురుషులను ఉద్ధరించడం? ఇకనైనా ఒక స్త్రీగా మరో స్త్రీ మనసును అర్ధం చేసుకో.. పెళ్లిచేసుకుని భర్తతో ఈ విధంగా బతకడానికి బదులుగా నాలా ఆత్మగౌరవంతో బతకడమే ఎంతో మేలు..!”
“సరే లేవే.. నువ్వు అనుకున్న విధంగానే నువ్వు జీవించు. నేను అనుకున్న విధంగానే నేను జీవిస్తాను.. ఎలా జీవిస్తే ఏమిటి ప్రయోజనం..? ప్రధానంగా మనిషికి జీవితంలో శాంతి, ఆత్మసంతృప్తి కావాలి కదా? అంతకంటే ముఖ్యమైనవి జీవితంలో ఏమీలేవే.. ఆ విషయం ముందుగా అర్థం చేసుకుంటే చాలు, జీవితం చాలా అందంగా ఉంటుంది.”
“డబ్బు, హోదా, ఉద్యోగం ఉంటే నువ్వు చెప్పినవన్నీ దక్కుతాయే.. ఇవి లేకుండా శాంతి, ఆత్మసంతృప్తి ఉండదే..”
“చూడు సునీతా.. నాకు నీలా బ్రతకడం ఇష్టం లేదు. నువ్వు జీవితాన్ని చూసే దృష్టి వేరు.. నేను జీవితాన్ని చూసే దృష్టి వేరు.. నీ బతుకు బండి కదులుతున్న దారే విభిన్నమైనది.. నా బండి చక్రాలు పెరుగెడుతున్న దిశనే వేరు.. కానీ చేరాల్సిన లక్ష్యం మాత్రం ఒకటే. అది మంచిదే కావాలని నేను ఆశిస్తున్నాను. మళ్లీ కలుద్దాం..”
2
“ఏయ్ సునీతా.. ఎలా ఉన్నావ్..? చాలా రోజులు గడిచాయి కదా..! నా పెళ్లికి ఒక రోజు ముందు కలిశావు..”
“అవును కదా, ఎలా ఉన్నావు రేవతి?”
“నేను చాలా బాగున్నాను సునీతా, ఇల్లు, భర్త, కొడుకు, కుటుంబం నాదైన ప్రపంచంలో హాయిగా ఉన్నాను.. నా జీవితంలో పెళ్లి గురించి అంతగా కలలు కనలేదు. అయితే నాకు మంచి అబ్బాయి దొరికాడు.. అతనితో జీవితం సాగిపోతోంది.. నా గురించి వదిలేయ్ సునీతా.. నీ గురించి చెప్పు? ఇప్పటికీ నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్న అబ్బాయి గురించి అవే కలలు ఉన్నాయా?”
“నా మొహం చూస్తే ఏమనిపిస్తుంది రేవతి?”
“ఎలా చూడాలి సునీత, నేను ఇప్పటికే నా పాత సునీతను పోగొట్టుకున్నాను.. నేను నీ మొహంలో కొత్త సునీతను చూస్తున్నాను..!”
“నువ్వు చెప్పింది నిజమే రేవతి.. ఆరేడేళ్ల క్రితం సునీత చాలా మొండిది, డబ్బు, ఐశ్వర్యం, అహంకారం ఆమె కల. తాను అందంగా ఉందనే నిప్పు ఆమె ముఖంలో తీవ్రంగా మండుతుండడం వల్ల, ఆమె తన నిజమైన అంతరంగ సౌందర్యాన్ని మరచిపోయింది. ఆమె అహంకారపు కోటలో తేలుతున్న వెలుతురు ఇప్పుడు నూనె లేకుండా మందగించింది. తక్కువ జీతం తీసుకునే అబ్బాయిలందరినీ అసహ్యంగా చూస్తున్న సునీత ఇప్పుడు వాటన్నిటీ మరిచిపోయింది. తన తప్పులన్నీ దిద్దుకుంటోంది.. ఆమెకు ఆమె తప్పు అర్థమైంది రేవతి..”
“జీవితంలో తెలిసీ చాలా తప్పులు చేస్తుంటాం, అలాంటప్పుడు తెలియకుండా చేసే తప్పులను క్షమించవచ్చు. అందదువల్ల నువ్వు తెలియకుండా చేసిన తప్పులు ఇప్పటికే నీ అంతరంగాన్ని క్షమాపణ అడిగివుండాలి, అవునా?”
“అవును.. అవి క్షమాపణలను అడిగివుండొచ్చు.. కానీ క్షమించేది నేను కాదు రేవతి.. తప్పులు ఇప్పటికే ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాయి. అప్పుడు నువ్వొక మాట చెప్పేదానివి, మనం అనుకున్న విధంగానే జీవించాలి, ఉండాలి అని ఆనుకోవడమంతా కోరికకు ప్రతీకమైనప్పటికీ, అనుకున్నది జరిగితే అదృష్టపు క్రీడ అని, జరగకపోతే విధిలీల అని చెప్పడం సులభం.. ఇలా బ్రతకడం వల్ల ఏమిటి ప్రయోజనం.. నలుగురికీ శాంతిని ఇవ్వకపోతే.. మనిషికి జీవితంలో శాంతి, ఆత్మసంతృప్తి గొప్పవి.. ఆ మాట ఎంత నిజం కదా?”
“సునీతా, నిన్ను చూస్తూ ఉంటే, నీ మాటలు వింటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే దాన్ని జీవితం అని ఎందుకు అంటాం? జీవితం అంటే ఏమిటో చెప్పటానికి సాధ్యంకాదు.. అనుభవించాల్సిందే..!”
“రేవతీ, ఐదారేళ్లలో అన్నీ అనుభవంలోకి వచ్చాయి.. రిసెషన్ వచ్చిన తరువాత చేతినిండా డబ్బులొచ్చే ఉద్యోగం పోయింది.. వచ్చిన మంచి ఆఫర్స్ అన్నీ చేజారిపోయాయి.. నాన్న చనిపోయాడు.. ప్రియమైన అన్నలు భార్యలు వచ్చిన తర్వాత మారిపోయారు. పొదుపు చేసినది కష్టాల కాలంలో ఖర్చయిపోయింది.. పని లేకుండానే బిపిఓ చేరాను. కాల్ సెంటర్లలో రాత్రిపూట పని. పగటి నిద్రలో రాత్రులు వ్యర్థమయ్యాయి.. శరీరం క్షీణించింది. శరీర సౌందర్యం తగ్గిపోయింది.. ముఖం కాంతిహీనమైంది.. అబ్బాయిలకు నేను నచ్చలేదు.. నా బాహ్య సౌందర్యం చూసిన అబ్బాయిలు నన్ను తిరస్కరించారు కానీ నాలో మారిన అంతరంగ సౌందర్యాన్ని ఎప్పుడూ చూడనేలేదు.. చాలా ఏళ్ల క్రితం నేను కూడా ఇదే తప్పు చేశాను..”
“సునీతా నువ్వు తప్పు చేశావు.. నేను తొందరగా పెళ్లి చేసుకున్నానని నువ్వు చాలా బాధపడివుండాలి.. అందుకేకదా నువ్వు నాతో మూడేళ్లు మాట్లాడలేదు, ఒక్క మెసేజ్, ఈమెయిల్ కూడా పంపలేదు.. ఆలస్యంగానైనా ఇద్దరమూ ఒకే సమయంలో పెళ్లి చేసుకుందామని నువ్వు చాలాసార్లు చెబుతూనే ఉన్నావు.. నేను మాటను నేను వినలేదు. నేను నా గురించి ఆలోచించి, వచ్చిన సంబంధాన్ని నిశ్చయించుకుని మెరుగైన జీవితం వైపు నా ప్రయాణం ప్రారంభించాను.. అయితే నువ్వు కేవలం వరాణ్వేషనే ఒక వ్యాధిగా మార్చుకున్నావు.. నీ మానసిక వ్యాధే ఈ విధమైన మౌనానికి కారణమైంది..”
“నిజం చాలా చేదుగా ఉంటుంది. దాన్ని అంగీకరించడం చాలా కష్టమే.. అందుకే నా మౌనమే ప్రాయశ్చిత్తం. ప్రస్తుతం నేను దాన్నే అనుభవిస్తున్నాను.”
‘…….’
“జీవితంలో అనుభవం కంటే గొప్పది ఏమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు అనుకున్నట్టు నేను మారాను, మారాలి అని నా నుదుటిపై రాసివుంది.. మారాను.. ఇంకా మారాల్సివుంది. ఇప్పటికే ఆత్మసంతృప్తిని, ప్రశాంతతను వెతుకుతూ ఇక్కడిదాకా వచ్చాను.. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతాను..”
“భయపడకు సునీతా.. నువ్వు అనుకున్న జీవితం చుట్టే నువ్వు తిరుగుతున్నావు.. ప్రశాంతమైన జీవితానికి చాలా దగ్గరలోనే నువ్వు ఉన్నావు.. దాన్ని చేరడానికి నీకింకా కొంచెం ఓపిక కావాలి..”
“చూద్దాం.. రేపు ఎవరో కొత్త కుర్రవాడు నన్ను చూడ్డానికి వస్తున్నాడు.. వయస్సు నా అంత వయస్సే అని అమ్మ అంటోంది.. మెగామార్ట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడట.. జీతం తక్కువగా ఉన్నప్పటికీ, మంచి గుణాలున్న కుర్రవాడని చూసినవాళ్లూ అంటున్నారు. నేను కూడా ఆశావాదినయ్యాను.. అతను నన్ను అంగీకరిస్తే చాలు..”
“సునీతా, నిజంగా నువ్వు చాలా మారిపోయావే..! “
వెలుతురుని ఆక్రమించిన చీకటి, వారి మాటలను మెల్లగా వింటోంది.
కన్నడ ములం: శ్రీధర బనవాసి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు