[శ్రీమతి తాటికోల పద్మావతి గారి ‘సర్వము నీవే’ అనే రచనను అందిస్తున్నాము.]
ప్రేమ శిఖరాగ్రాన్ని చేరాలంటే
మీ పాదాల చెంత నిలవాలి కదా!.
నా హృదయ వాసివి నీవని తెలిశాక.
జన్మజన్మలకైనా నీ పాదాల చెంతనే
ఇంత చోటు ఇమ్మని వేడుకుంటాను.
నీ ధ్యానంలో, నీ శ్వాసలో,
నిన్నే స్మరిస్తూ నా హృదయంలో నిలుపుకుంటాను.
చివరి క్షణంలో కూడా నీ నామస్మరణతోనే మసలుకొంటాను.
ఎంత చూసినా తనివి తీరదు నీ సుందర రూపం.
ప్రతిక్షణం నీ చెంతనే నిలవాలని మనసుకి ఉబలాటం.
నువ్వు మాత్రం మాతో ఆడుతావు చెలగాటం.
ఇది నీకు న్యాయమా?
ఈ జీవితం, ఈ మనసు అన్నీ నీవు ఇచ్చినవే కదా!
అందుకే వాటిని నీకే అంకితం ఇవ్వాలని ఉంది.
నీ ఓదార్పు కోసం, నీ లాలనలో
ఈ ప్రపంచమంతా
నీకోసమే ఎదురుచూస్తుంది.
ఎప్పుడు ఎవరిని ఎలా నడిపిస్తావో,
ఎలా ఏడిపిస్తావు తెలియడం లేదు మాకు.
ప్రేమ వ్యామోహం లో పడి,
అంధకార బంధం అనే మాయలో చిక్కుకొని,
బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాము.
స్వార్థం విద్వేషాలు, పగ ప్రతీకారాలతో
రగిలిపోయే ఈ భౌతిక కాయానికి
చివరికి కావలసింది ఆరడుగులు మాత్రమే.
భవబంధాలని శాశ్వతం కాదని తెలిసినా,
నీతో బంధం విడదీయరానిది.
భ్రమలన్నీ తొలగిపోవాలి.
చేసిన తప్పులకు క్షమాపణ లర్పించాలి.
అహంకారం వదులుకోవాలి.
మోహాలు, ప్రేమ పాసాల నుండి విముక్తులం కావాలి.
నిజాయితీపరులను, దయ కరుణ, ప్రేమ పదంలో నడిపించేది నీవే కదా!
దైవత్వం నిండి ఉంటేనే ఈ జీవితానికి విలువ ఉంటుంది.
చివరి క్షణంలో కూడా నీ నామాస్మరణతోనే మెలగాలి.
సత్యం, ధర్మం మార్గంలో నడిపించి సన్మార్గాన్ని చూపించు.
దురాశలన్నీ పండుటాకుల రాలిపోయి,
దయా కరుణ అనే కొత్త చిగుళ్ళు చిగురించి
మోడుగా మిగిలిపోయిన వృక్షానికి తిరిగి వసంతాన్ని అందించు.
అందరి హృదయాలలో భక్తి మార్గం తో పాటు
మానవత్వపు విలువల్ని సమకూర్చి
మనుషులుగా తీర్చిదిద్దే సృష్టికర్తవు నీవే!
దేవుడికి భక్తుడికి ఉన్న
అనుసంధానాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేయకు.
జగత్తును కాపాడే సర్వము నీవే.
