[టి.వి.యెల్. గాయత్రి గారి ‘సత్యవ్రతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయం బాత్ రూమ్ లో గడ్డం గీసుకొంటున్నాడు కేశవ.
సెల్లుఫోను మోగింది. వచ్చి ఫోన్ అందుకున్నాడు.
రాకేష్ ఫ్రెండ్ యశ్వంత్!
“చెప్పు యశ్వంత్!”
“అంకుల్!.. రాకేషుకు ఒంట్లో బాగాలేదు. మీరు వెంటనే రాగలరా!”
“ఏమైంది? ఎలా ఉన్నాడు? ఫోన్ వాడికివ్వు!” కంగారుగా కేశవకు.
“బాగానే ఉన్నాడంకుల్! కంగారు లేదు. ఫుడ్ పాయిజన్ అయ్యింది.. హాస్పిటలులో చేర్పించాము.. ప్రమాదం ఏమీ లేదన్నారు డాక్టర్లు.. మేమే చూసుకొనే వాళ్ళమే కానీ మీరు వస్తే బాగుంటుందని!.. అంతకంటే ఏమీ లేదు.. మీరు ఒక గంటలో ఎయిర్‌పోర్టుకు రండి! నేను మీకు టికెట్స్ బుక్ చేశాను..” విషయాన్ని చెప్పాడు యశ్వంత్.
“భయం లేదు కదా!”
కొడుకు మాట్లాడకపోయేసరికి కేశవకు ఆపనమ్మకంగా ఉంది. యశ్వంత్ ఏదో దాచిపెడుతున్నాడేమో!
“లేదంకుల్! మీరు వస్తే బాగుంటుందని.. మాకు ఆఫీసు ఉంటుంది కదా!..”
“వెంటనే బయలు దేరుతున్నాము!” అంటూ ఫోన్ పెట్టేసి, భువనకు విషయం చెప్పాడు కేశవ.
కంగారుగా నాలుగు బట్టలు సర్దుకొని ఢిల్లీ విమానం ఎక్కారు భువన, కేశవలు.
ఆ సాయంత్రానికి నోయిడాకి చేరారిద్దరు.
హాస్పిటలుకు చేరి విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు.
రాకేష్ విషం మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అదృష్టం కొద్దీ ఆ టైముకు ఆఫీసులో ఉండాల్సిన యశ్వంత్ అనుకోకుండా ఇంటికి వచ్చాడు. రాకేషును చూసి, సమయానికి హాస్పిటల్‌లో చేర్పించటం వలన పెద్ద ప్రమాదం తప్పింది.
కారణం! ప్రేమ విఫలం! ఆఫీసులో పని చేస్తున్న గుజరాతీ అమ్మాయిని ప్రేమించాడు. రాకేషుతో హోటళ్ళకూ, మాల్స్ కు తిరిగిన పిల్ల కాస్తా “నువ్వు నాకు నచ్చలేదు” అంటూ ఇంకొకడిని పెళ్లి చేసుకొంది. డిప్రెషన్‌తో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు రాకేష్.
కొడుకు కోలుకోవటానికి పది రోజులు పట్టింది. ఆఫీసుకు సెలవు పెట్టించి రాకేషును ఇంటికి తీసికొని వచ్చారు. అల్లుడు కూతురు వచ్చి చూసి వెళ్లారు.
‘కొడుకు ఇంత అధైర్యంగా ఉన్నాడేమిటి?’ కేశవ మనసును మెలిపెడుతున్న ప్రశ్న అది.
కేశవ హైదరాబాదులో గవర్నమెంట్ వాటర్ వర్క్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య భువన. వాళ్ళకిద్దరు పిల్లలు. రాగిణి పెద్దది. రాకేష్ చిన్నవాడు. ఇద్దరు పిల్లలు చక్కటి వ్యక్తిత్వం కలవాళ్ళు. ఎప్పుడూ చదువుగురించే చర్చించుకుంటూ.. కెరీరును ఎలా మలుచుకోవాలో ఆలోచిస్తూ పెరిగిన పిల్లలు. రాగిణికి పోయిన సంవత్సరం పెళ్లి చేశారు. అల్లుడు ప్రవీణ్. ఇద్దరు బెంగుళూరులో ఉన్నారు.
ఈ మధ్య రాకేషుకు కూడా సంబంధాలు చూద్దామంటోంది భువన.
“ఈసారి వాడు వచ్చినప్పుడు పెళ్లి గురించి మాట్లాడదాం!” అన్నాడు కేశవ.
ఈ లోపల ఇలా పరుగెత్తి రావాల్సి వచ్చింది.
కొడుకు ఇలా ఎందుకు చేశాడు? ప్రస్తుతం మనసు చెదిరి పోయిన కొడుకుని బాగు చేసుకోవాలి.
ఉదాసీనంగా ఉన్న కొడుకు.. నిశ్శబ్దంగా కంప్యూటరులో కూరుకుపోయిన కొడుకు.
ఆ రోజు సాయంత్రం రాకేషుతో గార్డెనులో నడుస్తున్నాడు కేశవ.
“నీకు రామాయణం తెలుసుగా! రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి? చివరకు కడుపుతో ఉన్న భార్యను వదిలేసాడు కదా! చచ్చిపోదామనుకోలేదే!”
“వాళ్ళు వేరు నాన్నా! వాళ్లంతా పురాణ పురుషులు. మనం వేరు..”
“ఎలా వేరు?.. ద్రౌపదిని చూడు! అంతమంది ముందు ఘోరంగా అవమానం! రక్షిస్తారనుకున్న తన వాళ్లే చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇంత కంటే ఘోరం మరొకటి లేదు! నలచక్రవర్తి.. ఆత్మహత్య గురించి ఆలోచించలేదే!.. మంచి బుక్స్ చదివితే నువ్వు ఇలా ఉండవు!”
బెంచి మీద కూర్చున్నాడు రాకేష్. కొడుకు భుజం మీద చెయ్యి వేశాడు కేశవ.
“మీ యువతరం అంతే! మీరు ఉష్ట్రపక్షుల్లాగా ఫోన్లల్లో కూరుకుపోయి పెరిగారు. ఏదన్నా ప్రాబ్లెమ్ వస్తే తట్టుకోలేరు.. మీరు మాలాగా కష్టపడి చదువుకోలేదు. చిన్నప్పుడు మేము చదువుకోవాలంటే వేరే ఊళ్ళో ఉండాల్సిందే! అప్పట్లో మీ తాతయ్య ఊరిలో ఐదో తరగతి దాకా మాత్రమే ఉండేది. ఆ పైన చదవాలంటే ముప్ఫయి మైళ్ళ దూరంలో ఉండే కందుకూరుకు రావాల్సిందే! కందుకూరులో మా మేనత్త దగ్గర చదువు.. అదే మీ శేషు మామయ్య ఇంట్లో ఉండి ఎంతో నెమ్మదిగా ప్రవర్తిస్తూ ఎలాగోలా చదువులు పూర్తి చేసుకున్నాము. చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకొనే మీ తాతయ్య మా నలుగురు పిల్లలకు మంచి చదువులే చెప్పించారు. ఇప్పుడు మీ తరానికి అలాంటి ప్రాబ్లమ్స్ లేవు.. మీరు చదువంతా హైదరాబాద్ లో చదువుకొన్నారు.. డబ్బుకు లోటు లేదు. కానీ ప్రపంచజ్ఞానం లేకుండా పెరగటం.. దీని వల్ల చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడి పోవటం..”
కేశవ మాటలకు అడ్డు వచ్చాడు రాకేష్.
“ప్రేమను పొందలేక పోవటం చిన్న సమస్య కాదు నాన్నా!”
“ప్రేమ జీవితంలో ఒక భాగం.. కాదనను! కానీ నీ జీవితాన్ని త్యాగం చెయ్యటమెందుకు? తెలివి తక్కువగా! ఆ అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని వదిలేశావనుకో! ఎవరికి నష్టం? నాలుగు రోజులకు అందరూ మరచిపోతారు. దాని వల్ల ఏమి లాభం? నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి! ఈ వయసులో సరిగ్గా ఆలోచించలేక పోతున్నావు..”
“నేనొక అమ్మాయిని గెల్చుకోలేక పోయాను! ఓడిపోయాను నాన్నా! మొదటిసారి ఫెయిల్ అయ్యాను..”
అర్థం అయ్యింది కేశవకు.
చిన్నప్పటి నుండి బుద్దిగా చదువుకోవటం.. ఇంటాబయట మంచి పేరు.. పెద్దగా కష్టపడకుండా ఉద్యోగం దొరకటం.. కంప్యూటర్ తప్ప మరో కాలక్షేపం లేక పోవటం.. తనలో తానుగా అంతర్ముఖంగా ఉండే వాడికి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏమిటో తెలియక పోవటం.. సమస్య ఏదైనా వస్తే ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేక పోవటం.. చివరకు డిప్రెషనుతో.. భయంకరంగా..ఆలోచించటం.. ఎలా దారికి తెచ్చుకోవాలి?
“ప్రపంచాన్ని చూడు! మనకంటే తక్కువ వాళ్ళని చూడు! కాళ్ళు లేని వాళ్ళను, కళ్లు లేని వాళ్ళను.. ఆఖరికి బుర్ర లేని వాళ్ళను చూడు! నీ చేయూత కొద్దిమందికైనా జీవితాన్ని ఇస్తుంది. ప్రాణాన్ని పోగొట్టుకోవటం సులభం. నువ్వే ఇంకొకరికి ఆసరాగా ఉండటంలో ఎంతో తృప్తి ఉంటుంది! కాస్త ఆలోచించు నాన్నా!”
ఆ నీరెండలో తండ్రి వైపు చూశాడు రాకేష్. కొత్తగా కనిపిస్తున్న నాన్న.. గురువులాగా బోధిస్తున్న నాన్న..
చిన్నపిల్లాడిలా తండ్రి చేతిని గట్టిగా పట్టుకొన్నాడు రాకేష్.
ఇలా రోజూ రాకేషుకు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు కేశవ. ఒక రోజు రాకేషుతో తన స్నేహితులు నడుపుతున్న సేవాసంస్థకు వచ్చాడు కేశవ.
‘నవజీవనం’ అనే స్వచ్ఛంద సంస్థ అది. పేదవాళ్లకు చాలా రకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. అందులో చాలా విభాగాలు ఉన్నాయి. ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నసంస్థ అది.
“నోయిడాలో కూడా మా బ్రాంచ్ ఉంది.. మీరు అక్కడ కూడా మీకు నచ్చిన పని చేయవచ్చు! పేదవాళ్లకు చదువు చెప్పొచ్చు! లేదా వాళ్లకు ఏదైనా పనిని నేర్పించవచ్చు!.. ఇలా ఏదైనా సరే! మీ ఇష్టం!” వివరించాడా సంస్థ చైర్మన్.
ఒక నెలరోజులకు నోయిడాకు వెళ్తానన్నాడు రాకేష్.
కేశవ కూడా ప్రక్కనే వచ్చాడు. వారం తర్వాత
“నువ్వు వెళ్ళు నాన్నా! నేను బాగానే ఉంటాను!” తండ్రికి సర్ది చెప్పాడు రాకేష్.
కొడుకు దగ్గరే ఉందామన్నా ఉద్యోగం ఎలాగా? పైగా భువన ఒక్కతే దిగులు పడుతూ ఉంటుంది.
రూమ్మేట్ యశ్వంతుకు జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ వచ్చాడు కేశవ. యశ్వంత్ స్నేహశీలి. కలుపుగోలుగా ఉండే కుర్రవాడు. ఒక్కోసారి రాకేష్ దిగులుగా ఉంటే ఊరుకొనేవాడు కాదు. బలవంతంగా ఏ సినిమాకో తీసికెళ్లేవాడు. రాకేష్ సేవ చేసే నవజీవనంలో తను కూడా సభ్యుడిగా చేరి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నాడు. కాస్త నిశ్చింతగా ఉంది కేశవకు.
“చాలా మంది ఇక్కడికి వస్తుంటారు నాన్నా! ఎక్కువ మంది దుర్భరంగా జీవిస్తుంటారు కూడా! వాళ్ళల్లో ఉన్న మానసిక ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది!” అంటూ చెప్తూ ఉంటాడు.
కొడుకు బాగుపడుతున్నాడు. ఇంకో సంవత్సరం గడిచింది.
ఆ రోజు కేశవ మేనత్త కొడుకు శేషు ఫోన్ చేశాడు.
“మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలనుకొంటున్నానురా! ముందుగా నీతో చెబుదామని..” ఆగాడు.
“నాతోనా! ఏమిటో పూర్తిగా చెప్పు!”
“అదే! మన రాకేష్ గురించి. నా కూతురు నీ కోడలిగా అయితే.. ఇష్టం లేకపోతే చెప్పు! వేరే సంబంధం ఉంది. బంధువువు కదా అని..” చెప్పాడు శేషు.
“మావాడి గురించి నీకొక విషయం చెప్పాలిరా! అప్పుట్లో ఒక అమ్మాయిని ప్రేమించి.. వాడు ఆత్మహత్య దాకా..” అంటూ కొడుకు గురించి చెప్పాడు కేశవ.
“సరే రా! నేను మా ఆవిడతో మాట్లాడి చెప్తాను!” అంటూ కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు శేషు.
విషయం తెలుసుకొని బాధపడింది భువన.
“మీరలా వాడి ప్రేమకథ గురించి అందరికీ చెప్తూ ఉంటే వాడికి పెళ్ళావుతుందా? వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు. మీరేమో వాడి గురించి ఊరు వాడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడసలే మగ పిల్లలకు పెళ్లిళ్లు కావటం లేదు. మన కాలనీలో చూడండి! ఎంత మంది పెళ్లి కాని పిల్లలు వున్నారో!”
“కాకపోయినా ఫర్వాలేదు. అబద్ధాలు చెప్పి నా కొడుకుకు పెళ్లి చెయ్యాలనుకోవటం లేదు.” స్థిరంగా అన్నాడు కేశవ.
శేషు నుండి మళ్ళీ ఫోన్ రాలేదు. నిరాశ పడింది భువన.
ఇంకో ఆర్నెలలు గడిచాయి. కొడుకు పెళ్లి విషయంలో కేశవ ప్రయత్నాలేవీ ఫలించటం లేదు.
“పిల్లవాడిలో ఏదన్నా సైకలాజికల్ లోపం ఉందేమో! ఆ తర్వాత బాధపడటం ఎందుకు? మా అమ్మాయికి వేరే సంబంధం చూస్తామండి!” అంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు అమ్మాయిల వైపు వాళ్ళు.
భువనకు భర్త మీద రోజు రోజుకు కోపం ఎక్కువవుతోంది.
“మీరూ, మీ సత్యవ్రతం! ఎందుకన్నా పనికి వస్తోందా? నా మాట విని ఆ దిక్కుమాలిన కథ చెప్పకండి! మీ సత్యవ్రతం వలన నా కొడుకుకు పెళ్ళవుతుందా? వాడి జీవితానికి మీ తిక్క సిద్ధాంతం వల్లే ప్రమాదం..” అంటూ భర్తను సాధిస్తోంది భువన.
మాట్లాడటం లేదు కేశవ.
కాలం గడుస్తోంది. సంవత్సరం అయిందప్పటికి.
ఆ రాత్రి యశ్వంత్ ఫోన్ చేశాడు. మళ్ళీ భయం వేసింది కేశవకు.
“వాడు.. వాడు బాగానే ఉన్నాడు కదా!”
“అదేమీ లేదంకుల్! వాడు బాగానే ఉన్నాడు. మీరు కాస్త కూల్ గా ఉంటే నేనొక విషయం చెబుదామని!..”
“చెప్పు! యశ్వంత్! “
“మా బాబాయి కూతురు ఉంది. పేరు స్నిగ్ధ. పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. మన రాకేష్ గురించి అడుగుదామని..” నసుగుతూ చెప్పాడు యశ్వంత్.
“మీ వాళ్లకు వీడి గురించి చెప్పావా?”
“చెప్పానంకుల్! అదేమీ అభ్యంతరం లేదు. కానీ మా చెల్లెలు విషయం కూడా మీకు చెప్పాలి. మా సొంత ఊరు కాకినాడ ప్రక్కన క్రొవ్వూరు. మూడేళ్ల క్రితం దానికి వైభవంగా పెళ్లి చేశాము. ఆరునెలలు కాపురం చెయ్యకుండా దాన్ని బాధలు పెట్టాడు. చివరకు అతడు ‘గే’ అని తెలిసింది. విడాకులు తీసికొన్నాము. అప్పటినుండి పిల్ల చాలా దెబ్బ తిన్నది. పెళ్లంటే భయం. ఆ భయం పోగొట్టడానికి అందరం కలిసి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడిప్పుడే కాస్త మనుషుల్లోకి పడి ఉద్యోగం చేసుకొంటోంది. మన రాకేష్ అయితే నెమ్మదైన వాడనిపించింది. మీకు ఇష్టమైతే మా బాబాయికి చెప్తాను!”
“వాడితో మాట్లాడతాను! నువ్వు మీ చెల్లెలి గురించి వాడితో చెప్పావా?”
“ఇంకా లేదంకుల్! ముందు మీరేమంటారో అని..”
“మీ ఆంటీతో చెప్తాను.. తర్వాత రాకేషుతో మాట్లాడుతాను!”
“సరే అంకుల్!”
ఆలోచిస్తున్నాడు కేశవ. భువనను పిల్చి విషయం చెప్పాడు కేశవ.
“ఒకసారి పెళ్లయిన పిల్లనా?” వికారంగా మొహం పెట్టింది భువన.
“పెళ్లయింది నిజమే! దాన్ని పెళ్లంటారా? ఆలోచించు! వాడికి ఇష్టమయితే చూద్దాము! యశ్వంత్ మంచివాడు. మనవాడు మనుషుల్లో పడటానికి అతడు కూడా ఆరాటపడ్డవాడే! జీవితంలో మంచి స్నేహితులు దొరకటం కూడా ఒక అదృష్టమే. ఆ పిల్ల కూడా మనవాడిలాగా ఒక దెబ్బతిని లేచింది. ఇద్దరికీ సరిపోతుందనుకుంటున్నాను..”
మౌనంగా ఉంది భువన. ఆ రాత్రి రాకేషుకు విషయం చెప్పాడు కేశవ.
“నేను యశ్వంతుతో మాట్లాడతాను నాన్నా! ఇప్పుడేమీ చెప్పలేను! అయినా నాకు కాస్త టైమ్ కావాలి! కొంచెం బెరుకుగా ఉంది. నేను ఒక అమ్మాయిని హోల్డ్ చెయ్యగలనా? మళ్ళీ జీవితంలోకి అమ్మాయి.. పెళ్లి అంటే భయంగా ఉంది నాన్నా!”
“గతం గతః! వాళ్లకు ఇష్టమయ్యే వస్తున్నారు. యశ్వంత్ నీ గురించి చెప్తూ ఉంటాడు కదా! దానిని బట్టి నీ గురించి ఒక అంచనాకు వచ్చి ఉంటారు. కొత్త జీవితం మొదలు పెట్టు నాన్నా! మంచి జరుగుతుంది! చెట్టును పూర్తిగా నరికేసినా కొత్తగా చిగురు వేస్తుంది. ప్రకృతిని చూడు! పాఠాలు నేర్చుకో! పాజిటివ్‌గా ఆలోచించు!” కొడుకుకు ధైర్యం చెప్పాడు కేశవ.
దాదాపు నెలరోజులు ఇలాగే కొడుకుకు కౌన్సిలింగ్ ఇచ్చాడు కేశవ.
“మీ ఇష్టం నాన్నా! నేను స్నిగ్ధతో మాట్లాడుతాను!” చివరకు ఒకరోజు అన్నాడు రాకేష్.
ఫోన్‌లో కనిపిస్తోంది స్నిగ్ధ.
పరిచయం లేదు.. క్రొత్తగా ఉంది. ఎలా మాట్లాడాలో తెలియటం లేదు ఇద్దరికీ. ఉద్యోగం గురించి, ఢిల్లీలోని వాతావరణం గురించి ఏదో నాలుగు మాటలు మాట్లాడుకున్నారిద్దరు. ఇదమిత్థంగా ఏదీ తేల్చుకోలేక పోతున్నాడు రాకేష్. నాలుగు రోజులు మాట్లాడాక స్నిగ్ధ గురించి అర్థం అయ్యింది రాకేషుకు. సాంప్రదాయాన్ని పాటించే మంచి పిల్ల! కట్టు బొట్టు అంతా చక్కగా.. తెలుగింటి బాపు బొమ్మలాగా.. స్నిగ్ధ. రాకేషుతో మెల్లగా మాట్లాడుతోంది. బహుశా మొదటిసారి తిన్న దెబ్బ వలన కావచ్చు.
“అమ్మాయి నచ్చిందా! వాళ్లకు చెబుదామా!” కొడుకును అడిగాడు కేశవ.
స్నిగ్ధను కాదనటానికి కారణం కనిపించలేదు రాకేషుకు.
హైదరాబాద్ వచ్చారు అందరూ. ఈ సారి యశ్వంత్ కూడా వెంట వచ్చాడు.
అప్పటికి నాలుగైదు సార్లు స్నిగ్ధతో మాట్లాడాడు రాకేష్. కానీ ఇప్పుడు కాస్త కొత్తగా.. పెళ్లి చూపులు.
అంతా సెటిల్ అయ్యింది.
ఇప్పుడు రాకేష్ మనసుని మెల్లమెల్లగా స్నిగ్ధ ఆక్రమించేస్తోంది. ఆమె నవ్వులో ప్రణయ సంగీతం వినిపిస్తోంది.
‘స్నిగ్ధ లాంటి భార్య తోడుగా ఉంటే ఎన్ని అపజయాలు ఎదురైనా తను లెక్కపెట్టడు’ అనుకున్నాడు రాకేష్.
మరో రెండు నెలల తర్వాత రాకేష్ పెళ్లి స్నిగ్ధతో జరిగింది. క్రొత్త జంట హనీమూన్‌కని కేరళ వెళ్లి వచ్చారు.
స్నిగ్ధను వదలి పెట్టకుండా వెంటా వెనుక తిరుగుతూ కబుర్లు చెబుతున్న రాకేషును చూస్తుంటే సంతృప్తిగా ఉంది కేశవకు. వారం తర్వాత నోయిడాకు బయలు దేరుతున్నారు నవదంపతులు.
వాళ్ళను విమానం ఎక్కించారు భువన కేశవలు.
కారు స్టార్ట్ చేస్తూ “ఇప్పుడు చెప్పు! నా సత్యవ్రతం వల్ల నీ పుత్రుడి జీవితానికేమన్నా నష్టం వాటిల్లిందా?” నవ్వుతూ భార్యని అడిగాడు కేశవ.
బదులుగా భర్త చేతిని పట్టుకొంది భువన. ఆ స్పర్శలో సమాధానం దొరికింది కేశవకు.
కారు కదిలింది.
(సమాప్తం)
