[శ్రీ రమేష్ కార్తీక్ నాయక్ రచించిన ‘సీతాకోకచిలుకలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
శపించబడ్డ మంత్రగత్తెలు
సీతాకోకచిలుకలుగా జన్మిస్తాయి
అనేక పూల వనాలు
తమ మాయ ధూళితో
సీతాకోకచిలుకల రెక్కలను
రంగులతో నింపుతాయి
కొన్ని గాలిలోని అక్షరాలను
ఒడిసిపట్టెందుకు ఎగురుతుంటే
ఇంకొన్ని తాము నేర్చుకున్న భాషను
పూలకు ధారాదత్తం చేస్తూ
తేనెకు ఆశ్రయం కల్పిస్తాయి
వాటి కళ్ళ నిండా
తొణికిసలాడే ఖాళీతనంలో
కాగితాల మీద
ఇనికిపోయిన వసంతాల కదలికలు
పూల రెమ్మలపై
మంచు బిందువుల్లా జారుతాయి
వాటి రెక్కల కింద
ప్రవహించే చీకటి చిక్కదనం
రెక్కల పై రంగులను
ఆశగా చూస్తుంది
స్థిరత్వం లేని చూపులు,
పాలిపోయిన పూలరెమ్మల
చితుల పై వాటిని బంధిస్తాయి
వాటి గత జన్మల మంత్రాలు
ఎడారి భూముల పైన కూడా
పూలు పూచేలా చేస్తాయి
ఋతువులు
ప్రపంచాన్ని బూడిదగా
మార్చడానికి సన్నాహాలు
ఆ చిట్టి చిట్టి జీవులను
ఆగాధ ప్రపంచంలోకి నెట్టివేస్తాయి
*
ణుణావత్ కార్తీక్, రమేశ్ కార్తీక్ నాయక్ అనే కలం పేరుతో తెలుగులోనూ ఆంగ్లంలోనూ సాహిత్య సృజన చేస్తున్నారు. ఇప్పటిదాకా 6 పుస్తకాలు ప్రచురించారు. ఢావ్లో- గోర్ బంజారా కతలు పుస్తకానికి గాను రావి శాస్త్రి కథా పురస్కారం -2023, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం – 2024 అందుకున్నారు. రమేశ్ కవితలు, కథలు, హింది, కన్నడ, మలయాళం, బంగ్లా, అస్సామీ లాంటి భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రస్తుతం తన రెండో కవిత్వ సంపుటి “టాండో” కవిత్వ సంపుటి మీద పనిచేస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ కోసం “అక్షరం” అనే సాహిత్య కార్యక్రమాన్ని 2023 జూలై నుంచి నిర్వహిస్తున్నారు.
